సువార్తను ప్రకటించడంలో నిలుపుదల లేదు
1 తొలి క్రైస్తవులు తమ పరిచర్యను ఎంతో గంభీరంగా తీసుకున్నారు. లూకా ఇలా నివేదించాడు: “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొ. 5:42) ఏదీ కూడా, చివరికి హింస కూడా వారిని ఆపలేకపోయింది! (అపొ. 8:4) వారు ఇతరులతో సత్యం గురించి ప్రతిదినం మాట్లాడారు.
2 మన సంగతి ఏమిటి? మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘కాలముల అత్యవసరతను నేను గ్రహిస్తున్నానా? నిలుపుదల లేకుండా సువార్తను ప్రకటించడాన్ని కొనసాగించడానికి నేను సుముఖుడినై ఉన్నానా?’
3 నిలుపుదల లేకుండా ప్రకటించడంలో ఆధునిక దిన ఉదాహరణలు: పోలియోకు గురైన ఒక సహోదరి, ఐరన్ లంగ్కు పరిమితం చేయబడింది. ఆమె రాజ్యమందిరానికి వెళ్లలేకపోయింది లేదా ఒక సమావేశానికీ హజరవ్వలేకపోయింది. కానీ ఆమె సువార్తను ప్రకటించడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేది. తన 37 సంవత్సరాల నిర్బంధంలో, 17 మంది సత్యాన్ని నేర్చుకోవడానికి ఆమె సహాయం చేయగలిగింది! ఆమె దాన్నెలా చేసింది? ఆమె ఇంటింటికి వెళ్లలేకపోయినా, తనను కలిసే వారందరికీ అనియతంగా సాక్ష్యం ఇచ్చే మార్గాన్ని ఆమె ప్రతిదినం కనుగొంది.
4 బోస్నియాలోని మన సహోదరులు యుద్ధాన్ని, లేమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ, వారు క్రమంగా ఇతరులకు ప్రకటించడంలో కొనసాగుతున్నారు. సారజివోలో ప్రచారకులు ఇతరులతో సువార్తను గురించి మాట్లాడడంలో ప్రతి నెల సగటున 20 గంటలు గడుపుతున్నారు, వారిలో ఒక్కొక్కరు సగటున రెండు బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. వారికి తీవ్రతరమైన పరిస్థితులున్నప్పటికీ, వారు నిలుపుదల లేకుండా ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు.
5 యౌవనులు కూడా పరిచర్య కొరకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. రువాండాలోని ఒక సాక్షుల కుటుంబం ఒక గదిలో బంధింపబడింది, సైనికులు వారిని చంపడానికి సిద్ధమయ్యారు. మొదట ప్రార్థించడానికి అనుమతి ఇవ్వమని ఆ కుటుంబం కోరింది. అనుమతి ఇవ్వబడింది, అప్పుడు యౌవనురాలైన కుమార్తె, డెబోరా బిగ్గరగా ఇలా ప్రార్థించింది: “యెహోవా, ఈ వారం నేను, నాన్న ఐదు పత్రికలు అందజేశాము. వారికి జీవం కలిగేలా సహాయం చేయడానికి, వారికి సత్యం నేర్పించడానికి మేము మళ్లీ వాళ్ల దగ్గరికి ఎలా వెళ్లగలం?” ఆమెకున్న బలమైన విశ్వాసం, పరిచర్య కొరకైన ఆమె ప్రేమల వలన ఆ కుటుంబమంతా తప్పించుకుంది.
6 నేడు, ఇతరులకు సాక్ష్యమివ్వడానికి అవకాశాల కొరకు కనిపెడుతూ, “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారిని అన్వేషించవలసిన అవసరం ఉంది. (అపొ. 13:48) సంఘ పెద్దలు స్థానిక పరిస్థితులకు అనుగుణ్యంగా, అనుకూల సమయాల్లో ఉదయమైనా, మధ్యాహ్నమైనా, లేక సాయంత్రమైనా గుంపు సాక్ష్యం కొరకు ఏర్పాట్లు చేయాలి. మన రాజ్య పరిచర్యలోని శీర్షికలు, సేవా కూటాలు, ప్రాంతీయ, జిల్లా సమావేశాలలోని భాగాలు రాజ్య సాక్ష్యాన్నిచ్చే వివిధ మార్గాలలో పాల్గొనడానికి సమయానుకూలమైన సూచనలను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. దీనికి తోడు, ప్రాంతీయ మరియు జిల్లా కాపరులు వీధి సాక్ష్యంలో ప్రచారకులకు శిక్షణనిస్తారు, వ్యాపార ప్రాంతంలో ఎలా పని చేయాలో చూపిస్తారు, ప్రజలెక్కడ కనిపించినా సాక్ష్యమివ్వడానికిగల ఇతర మార్గాలను ఎత్తి చూపిస్తారు. ఇదంతా నొక్కి చెప్పేదేమంటే, సువార్తను ప్రకటించడంలో నిలుపుదల లేదు!
7 యేసు అపొస్తలులు ధైర్యంగా ఇలా ప్రకటించారు: ‘మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేము.’ అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ వారు ఎలా పట్టుదల కల్గివున్నారు? తమకు సహాయం చేయమని వారు యెహోవాను అడిగారు, ఆయన సహాయం చేశాడు, మరి “వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.” (అపొ. 4:20, 29, 31) ప్రతి ఒక్కరు పరిచర్యలో విశిష్టమైన అనుభవాలతో ఆశీర్వదించబడకపోవచ్చు, కానీ మనం సువార్తను నిలుపుదల లేకుండా ప్రకటించడాన్ని నిజంగా కాంక్షిస్తే, ప్రతిదినమూ అలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తే, యెహోవా మనకు సహాయం చేస్తాడు.