ప్రకటించడానికి ఎవరు అర్హులు?
1 పరిచర్య విషయానికి సంబంధించి, మీరెప్పుడైనా మోషే వలె భావించారా? ఆయనిలా అన్నాడు: ‘ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండియైనను, నేను మాట నేర్పరినికాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను.’ (నిర్గ. 4:10) మీరొకవేళ అలా భావిస్తే, మీరు వెనుకంజ వేయవచ్చు. అయినా, యేసు, ‘ప్రజలకు ప్రకటించి, దృఢసాక్ష్యమియ్యాలని మనకు ఆజ్ఞాపించాడు.’ (అపొ. 10:42) అందువలన మనం అర్హతగల సువార్త ప్రచారకులం ఎలా కాగలం?
2 పరిచర్యకు మనల్ని అర్హులను చేసేది మన లౌకిక విద్యా స్థాయి కాదు. పౌలు ‘లోకరీతిని జ్ఞానులు అనేకులు పిలువబడలేదు’ అని, “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే” అని అన్నాడు. (1 కొరిం. 1:26; 3:19) యేసు తన అపొస్తలులను శ్రామిక తరగతి నుండి ఎంపిక చేసుకున్నాడు—వారిలో కనీసం నలుగురు వృత్తిరీత్యా చేపలు పట్టేవారు. గర్విష్టులైన మత నాయకులు వారిని “విద్యలేని పామరులని” తిరస్కారపూర్వకంగా దృష్టించారు. లౌకిక ప్రమాణాలనుబట్టి తీర్పు తీరిస్తే, అపొస్తలులు ప్రకటించడానికి అనర్హులు. అయినప్పటికీ, పేతురు పెంతెకొస్తునాడు నైపుణ్యంతో ఇచ్చిన ప్రసంగం 3,000 మందిని బాప్తిస్మం పొందేందుకు కదిలించింది!—అపొ. 2:14, 37-41; 4:13.
3 యెహోవా మనం ప్రకటించడానికి అర్హులమయ్యేలా చేస్తాడు: “మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది” అని పౌలు ప్రకటించాడు. (2 కొరిం. 3:5) బుద్ధికి మూలమైన యెహోవా, రాజ్య సత్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి లక్షలాదిమందికి నేర్పించాడు. (యెష. 54:13) ఈ పని యొక్క ప్రభావ ప్రతిఫలాలు సజీవ “సిఫారసు పత్రికలు”గా గత సంవత్సరం బాప్తిస్మం పొందిన 3,38,491 మందిలో కనబడుతున్నాయి. (2 కొరిం. 3:1-3) మనం యెహోవా నుండి నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంతో, స్థిర నిశ్చయంతో ప్రకటించడానికి మనకు ప్రతి కారణం ఉంది.
4 దేవుని సంస్థ పరిచారకుల కొరకు అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రకటించడానికి ‘సన్నద్ధమై, పూర్ణముగా సిద్ధపడి’ ఉండడానికి మనం లేఖనాల ద్వారాను, గొప్ప వైవిధ్యం గల బైబిలు పఠన సహాయకాల ద్వారాను అధ్యయనాన్ని, శిక్షణను పొందుతున్నాము. (2 తిమో. 3:16, 17) సొసైటీ ప్రచురణలలో కనుగొనబడే పాండిత్యాన్నిబట్టి ఎంతోమంది ముగ్ధులయ్యారు. ఉదాహరణకు, స్వీడన్‌లోని ఒక నియతకాలిక పత్రిక ఇలా పేర్కొంది: “యెహోవాసాక్షులచే ప్రకటించబడుతున్న విశ్వాసం వెనుక ఒక అద్భుతమైన ఉన్నతస్థాయికి చెందిన మరియు అంతర్జాతీయ పరిధిని కలిగివున్న బైబిలు పాండిత్యం ఉంది.”
5 వారంలో జరిగే మన ఐదు కూటాల ద్వారా ఇవ్వబడే నడిపింపు, బైబిలును చదవడమూ పఠించడం కొరకైన మన కార్యక్రమం, దైవపరిపాలన పరిచర్య పాఠశాలలో సలహా ఇవ్వడం, అనుభవజ్ఞులైన ఇతర పరిచారకుల వ్యక్తిగత సహాయం, మరి అన్నింటికీ మించి, యెహోవా పరిశుద్ధాత్మ తోడ్పాటులతో మనం ప్రకటించడానికి పూర్తిగా అర్హులమైనట్లు యెహోవా మనల్ని దృష్టిస్తున్నాడని మనం నిశ్చింతగా ఉండవచ్చు. “దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము.”—2 కొరిం. 2:17.
6 దేవుడు తన సంస్థ ద్వారా అందిస్తున్న దైవపరిపాలనా శిక్షణ నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని పొందినట్లైతే, మనం వెనుకంజ వేయడానికిగాని, భయపడడడానికి ఉండడానికి గాని మనకే కారణమూ లేదు. యెహోవా మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడన్న నమ్మకంతో, మనం ఆనందంగా ఇతరులకు ప్రకటించవచ్చు.—1 కొరిం. 3:6.