రక్త దుర్వినియోగమునుండి మీపిల్లలను సంరక్షించండి
1 “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.” (కీర్త. 127:3) యెహోవా నుండి మీకు అటువంటి ప్రశస్తమైన స్వాస్థ్యము లభిస్తే, తల్లిదండ్రులుగా మీరు పిల్లలను కాపాడుతూ, వారిని గూర్చి శ్రద్ధతీసుకొని, వారికి తర్ఫీదు నివ్వవలసిన గంభీరమైన బాధ్యతున్నప్పటికిని అది సంతోషకరమైనది. ఉదాహరణకు మీ చిన్నపిల్లలను రక్తమార్పిడి నుండి కాపాడుటకు సహేతుకమైన చర్యను గైకొనియున్నారా? మార్పిడి అవసరమయ్యే పరిస్థితులను ఎదుర్కొనినట్లయిన మీ పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తారు? మార్పిడి కచ్చితంగా జరగాలని బెదిరించే అత్యవసర పరిస్థితిలో సమర్థవంతంగా ఎలా వ్యవహరించాలో మీరు ఒక కుటుంబముగా చర్చించియున్నారా?
2 మీ కుటుంబమును అటువంటి పరిస్థితులకు సిద్ధంచేయుట అనునది చింతించుటకు లేక అనవసర వత్తిడికి గురగుటకు కారణం కానవసరం లేదు. జీవితంలో సంభవించే అనుకోని ప్రతి సంఘటనను ఎదురుచూచి, మీరు దాని కొరకు సిద్ధపడియుండ లేరు. అయినా, తల్లిదండ్రులుగా మీ పిల్లలను రక్తమార్పిడి నుండి కాపాడుటకు ముందుగా మీరు చేయగలిగిన సంగతులెన్నో కలవు. ఈ బాధ్యతలను నిర్లక్ష్యంచేస్తే, వైద్య చికిత్స సమయంలో మీ బిడ్డ రక్తమార్పిడికి గురగునట్లు నడపగలదు. మరి ఏమి చేయవచ్చును?
3 స్థిరమైన నిశ్చయత ప్రాముఖ్యం: రక్తమును గూర్చిన దేవుని శాసనం విషయంలో మీ నిశ్చయత ఎంత స్థిరంగా ఉన్నదనే దాన్నిగూర్చి మీరు గంభీరంగా తలంచవలెను. నిజాయితీ, నైతికత, తటస్థత, మరియు ఇతర జీవితాంశాలలో ఆయన శాసనానికి లోబడియుండాలని బోధించునట్లే, ఈ విషయంలోను యెహోవాకు లోబడి యుండాలని మీరు మీ పిల్లలకు బోధిస్తున్నారా? దేవుని శాసనము ద్వితీయోపదేశకాండము 12:23లో: “రక్తమును తిననే తినకూడదు?” అని ఆజ్ఞాపించు రీతిగానే మనం భావిస్తున్నామా? 25 వ వచనం ఇంకా యిట్లంటుంది: “నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు.” వ్యాధిగ్రస్తుడైన నీ బిడ్డ రక్తం వలన ‘బాగు పడునని’ ఒక డాక్టరు చెప్పవచ్చును. అయితే దైవిక శాసనమును ఉల్లంఘించే, పరిస్థితితో జీవితం పొడిగించబడుతుందనే దానికంటే, యెహోవాతో నీ సంబంధం ఉన్నతమైనదని ఎంచుతూ, అత్యవసర పరిస్థితి రాకముందే నీకుగాని నీ పిల్లలకుగాని రక్తమును తిరస్కరించేందుకు స్థిరముగా తీర్మానించుకొని యుండవలెను. ప్రస్తుతమందు దేవుని అనుగ్రహము, భవిష్యత్తులో నిత్యజీవము అందు యిమిడియున్నవి!
4 అవును, యెహోవాసాక్షులు జీవించాలని ఆశిస్తారు. వారికి చనిపోవాలని లేదు. యెహోవాను స్తుతించి, ఆయన చిత్తం చేయులాగున వారు బ్రతకాలని కోరుకుంటారు. అందుకే వారు ఆసుపత్రికి వెళ్లటం, వారి పిల్లలను చికిత్సకొరకు అక్కడికి తీసుకెళ్లటం. వైద్యులను చికిత్సచేయమని వారు కోరుతారు. అయితే చికిత్సకొరకు రక్తమే ప్రామాణికమైన లేక వైద్యపరమైన సరైన చికిత్సా విధానమని చెప్పబడినప్పుడు, రక్తంలేని ప్రత్యామ్నాయ వైద్య చికిత్స కావాలని వారు అడుగుతారు. రక్తమునకు బదులుగా ఎన్నో ప్రత్యామ్నాయా లున్నవి. అనుభవజ్ఞులైన డాక్టర్లు వాటిని ఉపయోగిస్తున్నారు. అలాంటి ప్రత్యామ్నాయం శాస్త్రయుక్తంకాని బూటకపు చికిత్సగాక, ప్రఖ్యాతిగాంచిన వైద్య పత్రికలలో లిఖించబడినట్టి వైద్యపరమైన మంచి చికిత్స మరియు విధానములతో కూడినది. కొన్నిసార్లు సాక్షుల పిల్లలకు రక్తం ఉపయోగించకుండా చికిత్సచేయు డాక్టర్లు దొరకటం ఇంకా ఒక సమస్యగా ఉన్ననూ, ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది డాక్టర్లు రక్తము ఉపయోగించకుండానే మంచి వైద్య చికిత్సనందించుటలో మనతో సహకరిస్తున్నారు.
5 సహకరించే డాక్టరును కనుగొనుట: రోగులకు చికిత్సచేసేటప్పుడు, డాక్టర్లు అనేక విషయాలలో శ్రద్ధవహిస్తుంటారు. అందుచేత మీరు మీ పిల్లలకు రక్తం ఉపయోగించకుండా చికిత్స చేయమన్నప్పుడు ఇది వారి సవాలును అధికం చేస్తుంది. కొంతమంది డాక్టర్లు తమ్మును బాధ్యతా రహితులను చేసే హామీ పత్రమును పూరిస్తే రక్తము విషయంలో పెద్దవారి కోరికను మన్నించి వారికి చికిత్సచేయడానికి అంగీకరిస్తారు. అలాగే కొంతమంది డాక్టర్లు, పరిణతిచెందిన మైనరు పిల్లలని రుజువుచేసుకున్న వారికిని చికిత్సచేయటానికి అంగీకరించవచ్చును. ఎందుకంటే కొన్ని న్యాయస్థానాలు పరిణతిగల మైనరు పిల్లలు తమ కిష్టమైన వైద్య చికిత్సను ఎన్నుకునేందుకు హక్కు కలిగియున్నారని గుర్తించాయి. (పరిణతి చెందిన మైనరు పిల్లవానిగా ఎంచుటలో ఏమి ఇమిడివుందనే చర్చకు ది వాచ్‌టవర్ జూన్ 15, 1991 పేజీలు 16-17 చూడండి.) అయినప్పటికి చిన్న పిల్లలకు, ప్రత్యేకంగా శిశువులకు రక్తమెక్కించటానికి అనుమతిస్తేనే తప్ప చికిత్సచేయుటకు డాక్టర్లు తిరస్కరించవచ్చును. వాస్తవానికి, చిన్న బిడ్డలకు చికిత్స చేసేటప్పుడు, చాలా కొద్దిమంది డాక్టర్లు మాత్రమే రక్తమును ఉపయోగించమని 100-శాతం అభయమిస్తారు. వైద్య సంబంధమైన లేక చట్టపరమైన కారణాలనుబట్టి తామలాంటి అభయాన్నివ్వలేమని ఎక్కువమంది డాక్టర్లు భావిస్తారు. అయినప్పటికి, చాలా మంది డాక్టర్లు రక్తముయెడల మనం కోరే దానిని గౌరవించడంలో తాము చేయగలిగినంత మట్టుకు చేస్తామంటూ, యెహోవాసాక్షుల పిల్లలకు చికిత్సనందించటానికి ఇష్టపడుతున్నారు.
6 దీని దృష్ట్యా, నీ బిడ్డకు అనువైన డాక్టరును వెదకుటలో, గతంలో ఇతర సాక్షులకు ఇదే రీతిగా రక్తం ఉపయోగించని విధానాలను అనుసరించి, యెహోవాసాక్షులతో బాగా సహకరించిన డాక్టరును కనుగొన్న తరువాత, రక్తము ఉపయోగించబడదని మీకు కచ్చితమైన హామీ ఇవ్వడానికి చట్టం తనను అనుమతించదని అతడు భావిస్తే, అప్పుడు పరిస్థితి ఏమిటి? ఏమైనను, ఇప్పుడు కూడ ఏ సమస్య ఉత్పన్నం కాదని తాను భావిస్తున్నట్లు ఆయన అభయమిస్తాడు. మీకు అందుబాటులోగల అత్యంత శ్రేష్టమైన మార్గంగా దానినే నిర్ణయించుకొనవచ్చును. ఇటువంటి పరిస్థితులలో చికిత్సచేయుటకు అనుమతించవచ్చుననే ముగింపుకు మీరు రావచ్చును. అయితే మీ బిడ్డకు వైద్య చికిత్సను ప్రారంభించమని అనుమతించేటప్పుడు, మీరు రక్తమార్పిడికి అనుమతించటంలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియపరచండి. ఇలాంటి విధానాన్ని గైకొనేటప్పుడు, నీ తీర్మానము నీవు రాజీపడుతున్నావని దృష్టించబడేలా చేయకుండునట్లు చూడవలసిన బాధ్యత నీపై ఉన్నది.
7 అయినను, మీరు ఎంపికచేసుకోటానికి, అంతకంటె ఇంకా ఎక్కువగా లేక సాధ్యమైనంతమట్టుకు రక్తమును ఉపయోగించే అవకాశాన్ని నిరోధించగలిగే కారణసహితమైన ప్రత్యామ్నాయ చికిత్సను మీరు కనుగొనగలిగితే, యిబ్బందిలేని ఆ పద్ధతినే మీరు చేపడతారు. రక్తమును ఉపయోగించమని అంగీకరించే వైద్యులందరిలోకెల్లా, ఎవరు మరి ఎక్కువ జాగ్రత్తను తీసుకుంటామని అంగీకరిస్తారో అటువంటి డాక్టరును లేక శస్త్ర చికిత్స నిపుణుని కనుగొనటానికి మీరు శ్రద్ధతో ప్రయత్నిస్తారని ఆశించబడుతుంది. అతి శ్రేష్టమైన రక్షణ ఏమంటే ముందుగానే సమస్యలొస్తాయని ఎదురుచూడటం. సహకరించే డాక్టరును కనుగొనటానికి ముందుగానే చేయవలసిన ప్రతి ప్రయత్నము చేయండి. సాధ్యమైనంతవరకు సహకరించని డాక్టర్లు మరియు ఆసుపత్రులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
8 కొన్ని దేశాలలో రక్తమార్పిడి చేస్తారా లేదా అనే విషయంలో భేదాన్ని కలుగజేసే మరొక విషయమేమంటే ఆసుపత్రికయ్యే ఖర్చులు ఎలా భరిస్తారనేది. తల్లిదండ్రులకు వారికిష్టమొచ్చిన డాక్టరును ఎంపిక చేసుకోటానికి అనుమతించే ఆరోగ్య భీమా లేక ఇతర భద్రత ఉన్నప్పుడు, సహకరించని డాక్టరు లేక ఆసుపత్రినుండి పిల్లవాన్ని సులభంగా తప్పించవచ్చును. ఆర్థికంగా ఎంతమేరకు భరించగలరనే దాన్నిబట్టి కూడా తరచు ఒక కుటుంబము డాక్టర్లు లేదా ఆసుపత్రినుండి ఎటువంటి సేవలు మరియు సహకారాన్ని పొందుతాయి అనేది ఆధారపడివుంటుంది. పిల్లవాన్ని వేరేచోటికి మార్చడానికి ఆసుపత్రి లేక డాక్టర్లు అంగీకరిస్తారా యనేదికూడా తల్లిదండ్రుల స్తోమతపై ఆధారపడి ఉంటుంది. తల్లులు కాబోయేవారు, మీ ఆరోగ్యాన్నిగూర్చి గర్భిణీగా ఉన్న సమయంలోనే శ్రద్ధ తీసుకోవటం ప్రాముఖ్యం. అలాచేస్తే, నెలలు నిండకముందే జరిగే ప్రసవాలను, తత్సంబంధమైన ఇతర చిక్కులను నిరోధించటానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఎందుకంటే నెల తక్కువ పిల్లలకు చేసే చికిత్స వారి సమస్యలలో అనేకసార్లు, రక్తం ఇమిడి ఉంటుంది.
9 యెహోవాసాక్షులు రక్తమునుగూర్చిన తమ అభ్యంతరాన్ని చివరి నిముషమువరకు చర్చించరని వైద్యులు కొన్నిసార్లు ఫిర్యాదుచేస్తుంటారు. అలా ఎన్నటికి జరుగకూడదు. ఆసుపత్రికి వెళ్లేటప్పుడేగాని, వైద్యుని సేవలకు వెళ్లేటప్పుడేగాని సాక్షుల తల్లిదండ్రులు చేయవలసిన మొట్టమొదటి పనులలో ఒకటేమిటంటే రక్తముయెడల వారి స్థానమునుగూర్చి వైద్యునితో చర్చించటం. శస్త్రచికిత్స అవసరమైతే ముందుగానే మత్తు ఇచ్చే డాక్టరుతో సంప్రదించాలని కోరండి. ఈ విషయంలో శస్త్రవైద్యుడు మీకు సహాయపడవచ్చును. చేరేటప్పుడు నింపే ఫారములను జాగ్రత్తగా పరిశీలించాలి. వాటిలో నీకు అభ్యంతరకరమైనవాటిని కొట్టివేయవచ్చును. ఏ సందేహము లేకుండ చేయుటకు ప్రవేశ పత్రంపై మతసంబంధమైన మరియు వైద్యపరమైన కారణాలనుబట్టి రక్తమును ఏ పరిస్థితులలోను కోరటమేగాని అనుమతించటమేగాని జరగదు అని స్పష్టంగా వ్రాయుము.
10 యెహోవా సంస్థనుండి సహాయము: మీ పిల్లలను రక్తమునుండి రక్షించునట్లు మీకు సహాయపడేందుకు యెహోవా సంస్థ ఎట్టి ఏర్పాటులను చేసియున్నది? రక్తము మరియు రక్తములేని ప్రత్యామ్నాయ నిర్వాహణను గూర్చి మనకు బోధించేందుకు సొసైటి ఎంతో ప్రచురించింది. రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రోషూరును, ఈ అంశముపై ఇంకా ఇతర ప్రచురణలను పఠించియున్నారు. మీ స్థానిక సంఘాలలో మీకు ఎంతో సహాయాన్ని మద్దతునివ్వగల సహోదర సహోదరీలున్నారు. క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆసుపత్రియొద్ద 24-గంటలు కనిపెట్టుకొని యుండునట్లు పెద్దలు ఏర్పాటుచేయుట మంచిది. ముఖ్యంగా రోగి తల్లిదండ్రులలో ఒకరితో లేక ఇతర సన్నిహిత కుటుంబ సభ్యునితోపాటు ఒక పెద్ద ఉండుట మంచిది. తరచు బంధువులందరు, స్నేహితులందరు రాత్రులు ఇంటికి వెళ్లిన తరువాత రక్త మార్పిడి చేయడం జరిగింది.
11 ఇండియాలో మనము త్వరలో ఆసుపత్రి అనుసంధాన కమిటీలను ప్రధాన పట్టణములలో ఏర్పాటు చేయబోతున్నాము. సహాయము చేయటానికి అందుబాటులో ఉండి, తర్ఫీదుపొందిన సహోదరులతో కూడిన ఒక కమిటీకి దేశములోని ప్రతి సంఘము అప్పగించబడబోతున్నది. వారి అవసరత ఉన్నప్పుడు పెద్దలద్వారా మీరు వారిని కలవవచ్చును. చిన్నచిన్న సమస్యలకు వారిని పిలువ కూడదు గాని, ఏదైనా గంభీరమైన సమస్యగా పరిణమించుట మీరు గమనిస్తే, అది బాగా పెద్దదయ్యేంతవరకు వారిని కలుసుకొనుటకు వేచియుండవద్దు. వారు తరచు మనకు సహకరించు డాక్టర్ల పేర్లను అందించి ప్రత్యామ్నాయముల విషయంలో సూచన నివ్వగలరు. సాధ్యమైతే అవసరమైన చోట ఈ సహోదరులు అక్కడే ఉండి సమస్యను అధికమించుటకు ఏర్పాటుచేస్తారు.
12 కోర్టు జోక్యమును ఎదురుచూచుట, దానితో వ్యవహరించుట: ఒక డాక్టరు లేక ఆసుపత్రి మీ బిడ్డకు రక్తమార్పిడి చేయునట్లు కోర్టు ఉత్తర్వులను తీసుకోవాలనుకున్నట్లయితే అప్పుడు సంగతేమి? ఇక మనము ఏమి చేయలేమని భావిస్తూ, వదలివేయవలసిన సమయమా? ఎంత మాత్రము కాదు! అప్పుడుకూడ రక్తమార్పిడిని నిరోధించుట సాధ్యమే. అటువంటి సాధ్యతలకు ముందుగానే సిద్ధపడాలి. ఏమి చేయవచ్చును?
13 ఈ విషయాలలో ఆసుపత్రులను, న్యాయాధిపతులను నడిపించి ప్రభావితముచేసే కొన్ని చట్టపరమైన సూత్రాలను అర్థం చేసుకొంటే, వాటిని ఎదుర్కొనుటకు అవి బహుగా మీకు సహాయపడతాయి. వాటిలో అతిప్రాముఖ్యమైనదిగా గుర్తించవలసిన ఒక సూత్రమేమనగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు వైద్య చికిత్సను అంగీకరించటం లేక తిరస్కరించటం విషయంలో చట్టము వారికి అపరిమితమైన అధికారాన్నిచ్చుట లేదు. ప్రౌఢులు సామాన్యముగా వారు కోరుకొనిన వైద్య చికిత్సను అంగీకరించుటకేగాని లేక ధిక్కరించుటకేగాని హక్కుకలిగివున్నను, తల్లిదండ్రులు మాత్రము, వారి ధిక్కారము యథార్థముగా మత నమ్మకములపై ఆధారపడి ఉన్ననూ, పిల్లవాని క్షేమము నిమిత్తమై అవసరమని ఎంచబడిన చికిత్సను తిరస్కరించేందుకు వారు స్వతంత్రులు కారు.
14 ఈ మూల సూత్రము 1944 యు.యస్. సుప్రీమ్ కోర్టు తీర్మానం చెప్పిన దానిలో కనిపిస్తుంది: “తల్లిదండ్రులు తమ్మును తాము తమ మతమునకై ప్రాణత్యాగము చేయుటకు స్వతంత్రులు కావచ్చు. అయితే అదే పరిస్థితులలో తమ పిల్లలు పూర్తిగా పెద్దవారై, తమకైతాము ఎంపికచేసుకొనే చట్టపరమైన వివేకము పొందేంత వయస్సుకు వచ్చేంత వరకు, అదేకారణమును బట్టి తమ పిల్లల ప్రాణమును త్యాగముచేయుటకు స్వతంత్రులు కారు.” పిల్లల భౌతిక ఆరోగ్యము, క్షేమము విషయంలో అదే ప్రాధమిక శ్రద్ధ ఈనాడు శిశు-సంక్షేమ చట్టాలలో పొందుపరచబడినది. పిల్లలు దుశ్చర్యకు గురికాకుండునట్టి ఉద్దేశముతో ఏర్పరచబడిన ఈ చట్టాలు, పిల్లలు వైద్యపరంగా నిర్లక్ష్యానికి గురికాకుండేందుకు కూడ రూపించబడ్డాయి.
15 తల్లిదండ్రుల దుశ్చర్య నుండి, నిర్లక్ష్యము నుండి పిల్లలను కాపాడుట నిశ్చయంగా క్రైస్తవ తల్లిదండ్రులకు అభ్యంతకరము కాదు. అయితే పైన పేర్కొనబడిన శిశు-నిర్లక్ష్య చట్టాలు, సుప్రిం కోర్టు వ్యాఖ్యానం అయుక్తంగా యెహోవాసాక్షుల పిల్లలకు సంబంధించిన కేసులకు అన్వయించబడ్డాయి. ఎందుకు? ఒక విషయమేమనగా సాక్షులైన తల్లిదండ్రులకు వారి “మతము కొరకు తమ పిల్లల ప్రాణాన్ని త్యాగం చేసే” ఉద్దేశము లేదు. అలాంటిదే ఉంటే తమ పిల్లలను అసలు వారెందుకు మొదట ఆసుపత్రికి తీసుకెళ్తారు? అందుకు భిన్నంగా సాక్షులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టపూర్వకంగా వైద్యచికిత్సను కోరుతున్నారు. వారు తమ పిల్లలను ప్రేమిస్తూ వారికి మంచి ఆరోగ్యము కావాలని కోరుకుంటారు. తమ పిల్లల కొరకు బాధ్యతాయుతంగా అతి శ్రేష్టమైన వైద్య చికిత్సను ఎన్నుకొనే దేవుడిచ్చిన కర్తవ్యము వారిపై ఉందని వారు నమ్ముతారు. వారు తమ పిల్లల ఆరోగ్య సమస్యలను రక్తములేకుండా నిర్వహించాలని కోరుకుంటారు. రక్తములేని అటువంటి ప్రత్యామ్నాయ చికిత్స రక్తము కంటె శ్రేష్టమైంది మరియు సురక్షితమైనదేకాక, అతి ప్రాముఖ్యముగా వారి పిల్లలను అది గొప్ప జీవదాతయైన యెహోవా దేవుని అనుగ్రహములో ఉంచుతుంది.
16 రక్తములేని వైద్య చికిత్స వలన ప్రయోజనములున్నను, అనేకమంది డాక్టర్లు మరియు శిశు సంక్షేమ అధికారులు రక్తమార్పిడితో కూడిన చికిత్స అవసరమగు ప్రామాణికమైన వైద్య పద్ధతిని, కొన్ని పరిస్థితులలో అది ప్రాణాన్ని కూడ రక్షిస్తుందని దృష్టిస్తారు. ఫలితంగా, సాక్షులైన తల్లిదండ్రులు సిఫారసు చేయబడిన రక్తమార్పిడులను తిరస్కరించినప్పుడు సమస్యలు ఉత్పన్నం కాగలవు. సామాన్యంగా తల్లిదండ్రుల అంగీకారం లేకుండా డాక్టర్లు చట్టబద్ధంగా పిల్లలకు చికిత్స చేయలేరు. రక్తం ఉపయోగించడానికి తల్లిదండ్రులు తెలిపే అనంగీకారాన్ని అధికమించేందుకు, డాక్టర్లు లేక ఆసుపత్రి సిబ్బంది కోర్టు ఉత్తర్వు మూలంగా వారు ఒక న్యాయాధిపతి అంగీకారాని కోరవచ్చును. కోర్టు అధీకృతం చేసే అట్టి అంగీకారాన్ని వైద్యపరమైన నిర్లక్ష్యమని ఆరోపించబడిన పరిస్థితులనుండి పిల్లలను రక్షించటానికి పనిచేసే శిశు-సంక్షేమ అధికారుల ద్వారా, లేక డాక్టర్లు మరియు ఆసుపత్రి అధికారుల ద్వారా పొందవచ్చును.a
17 అనేకసార్లు రక్త ఉపయోగాన్ని అధీకృతంచేసే ఈ కోర్టు ఉత్తర్వులను తీసుకోవటం చాలా తొందరగా, అసలు తల్లిదండ్రులకు ఏమాత్రము తెలియజేయకుండానే జరుగుతుంది. డాక్టర్లు, ఆసుపత్రి నిర్వాహణాధికారులు లేక శిశు-సంక్షేమాధికారులు వైద్యపరమైన అత్యవసర స్థితి ఏర్పడిందని, తల్లిదండ్రులకు దాన్ని పూర్తిగా తెలియపరచేంత సమయము లేనందున అలాంటి అకస్మిక ఉత్తర్వుల అవసరత ఏర్పడిందని అంటూ దానిని సమర్థించుకోటానికి ప్రయత్నిస్తారు. అయితే తీరా నిలదీసి అడిగినప్పుడు, నిజంగా అంతటి అత్యవసర పరిస్థితేమి లేదుగాని, వాళ్ల అభిప్రాయంలో భవిష్యత్తులో “ఒకవేళ” అటువంటి రక్తమార్పిడి అవసరతవస్తే కోర్టు ఆర్డరు ఉండాలన్నారు. అయితే మీ పిల్లలకు సహజమైన సంరక్షకులుగా మీ పిల్లవానిగూర్చి డాక్టర్లు, ఆసుపత్రి నిర్వాహణాధికారులు లేక శిశు-సంక్షేమాధికారులు ఏమి చేస్తున్నారని వారిని ఎల్లవేళల అడిగి తెలిసికొను ప్రాథమిక హక్కును మీరు కలిగియున్నారు. సాధ్యమైనంతవరకు కోర్టు ఆర్డరు తెచ్చుకొనే ప్రయత్నాన్నిగూర్చి మీకు తెలపాలని, కోర్టు ముందు మీ పక్షంగా కూడ మీరు చెప్పుకోటానికి వీలు కల్పించాలని చట్టం కోరుతుంది.
18 ఈ చట్టపరమైన వాస్తవాలు సహకరించే ఒక వైద్యుని కనుగొనుటలోని విలువను నొక్కితెల్పుచున్నవి. ఆయనతో చర్చించి, మీ ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యుల సహాయముతో, ఆయన మీ పిల్లవాని వైద్య సమస్యను రక్తము ఉపయోగించకుండ నిర్వహించేలా పట్టుదలతో కొనసాగటానికి సహాయపడండి లేక మీ బిడ్డను అలాంటి చికిత్సను నిర్వహించగల మరో వైద్యునియొద్దకు లేదా ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడండి. అయితే డాక్టరేగాని, ఆసుపత్రి నిర్వాహణాధికారియేగాని, లేక శిశు-సంక్షేమ కార్యకర్తేగాని కోర్టు ఆర్డరు కొరకు కృషిచేస్తున్న సూచనలేమైన కనిపిస్తే, మీరు మెలకువగా ఉండి, అలా ఏమైనా తలస్తున్నారా అని అడగండి. కొన్నిసార్లు దీన్ని రహస్యంగా టెలిఫోను ద్వారా చేయటం జరుగుతుంది. కోర్టుకెళ్లే ఆలోచన ఏమైన ఉన్నట్లయితే, న్యాయాధిపతికి మీ పక్షాన మీరు అభ్యర్థించేటట్లు ఆ విషయాన్ని మీరు తెలుసుకోగోరుచున్నారని గట్టిగా నొక్కితెల్పండి. (సామె. 18:17) సమయమున్నట్లయితే తరచు, న్యాయవాది సహాయాన్ని తీసుకోవటం మంచిది. కొన్ని సందర్భాలలో న్యాయవాది కోర్టుద్వారానే నియమించబడును. నీకు నీ స్వంత లేక కోర్టు నియమిత న్యాయవాది ఉంటే, ఆయన ఆ పరిస్థితులలో సాధ్యమైనంత రీతిగా సమర్థించునట్లు సహాయపడేందుకు, సొసైటి లీగల్ డిపార్టుమెంటు ఆయనతో సమాచారాన్ని పంచుకొనగలదు.
19 మీరు రక్తాన్ని తిరస్కరించే పరిస్థితి కోర్టువరకు వెళ్తే, మీ పిల్లవాని ప్రాణానికి లేక ఆరోగ్యానికి రక్తము అవసరం అనే డాక్టరు అభిప్రాయము ఎంతో ఒప్పింపజేసేలాగున ఉంటుంది. వైద్యపరంగా పామరుడైన ఆ న్యాయాధిపతి వైద్య నిపుణుతగల డాక్టరునే సహజంగా లక్ష్యపెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమపక్షంగా చెప్పుకోటానికి ఎక్కువగా అవకాశమివ్వబడనప్పుడు, ఏ విధమైన ఎదురు సవాలు లేకుండా రక్తముయొక్క “అత్యవసరతను” మాటలను వ్యక్తపరస్తున్నప్పుడు ఇది వాస్తము. అలాంటి ఏక పక్ష వివరణలు సత్యాన్ని నిర్ణయించుటకు ఉపకరించవు. వాస్తవమేమంటే, ఎప్పుడు మరియు ఎందుకు డాక్టర్లు రక్తమవసరమని భావిస్తారో, ముఖ్యంగా పరిస్థితుల ప్రభావంపై ఆధారపడి, అనిశ్చయంగా ఉంటుంది. తరచు ఒక డాక్టరు పిల్లవాని ప్రాణాన్ని రక్షించటానికి రక్తము తప్పక అవసరమంటే, అదే వైద్య సమస్యను రక్తములేకుండా నిర్వహించగల మరొక అనుభవముగల డాక్టరు రోగికి చికిత్సచేయుటకు రక్తము అవసరం లేదంటాడు.
20 “ప్రాణాన్ని కాపాడే” రక్తమార్పిడిని ఎందుకు మీ బిడ్డకు వద్దంటున్నారు అని ఒక న్యాయవాదేగాని, న్యాయాధిపతియేగాని మిమ్ములనడిగితే మీరేమి చేస్తారు? బహుశా మొదట మీరు, పునరుత్థాన నిరీక్షణయందు మీకుగల నమ్మకాన్ని వివరించటం, ఒకవేళ మీ బిడ్డ చనిపోయినను దేవుడతనిని తిరిగి లేపునని మీకున్న దృఢమైన విశ్వాసమును వ్యక్తపరచాలనుకున్నను, పిల్లవాని భౌతిక క్షేమమే ప్రధాన శ్రద్ధగా తలంచే న్యాయాధిపతికి, కేవలం అది నిన్ను మతోన్మాదిగాచేసి పిల్లవాన్ని రక్షించటానికి తాను చర్యతీసుకోవాలన్నట్లే చేస్తుంది తప్ప, అంతకంటె ఎక్కువేమి నెరవేర్చదు.
21 కోర్టు తెలిసికొనగోరేదేమంటే, మీరు లోతుగా పాతుకుపోయిన మతసంబంధ ఆధారంపై రక్తాన్ని తిరస్కరిస్తున్నను, మీరు వైద్య చికిత్సను కాదనటం లేదనేదే. మీరు నిర్లక్ష్యంగల లేక దుశ్చర్యకు పాల్పడే తల్లిదండ్రులు కాక, తమ పిల్లలకు చికిత్స అవసరమనే ప్రేమగల తల్లిదండ్రులని న్యాయాధిపతి మిమ్ములను గమనించాలి. ప్రత్యేకంగా ప్రమాదాలకు గురిచేయని రక్తరహిత వైద్య ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పుడు, మీరు కేవలం, రక్తము వల్ల కలుగుతాయని చెప్పుకొనబడే ప్రయోజనాలు దానివలన కలిగే మరణకరమైన ప్రమాదాలు, చిక్కులకంటే ఏమాత్రం ఎక్కువకాదనే దాన్ని మాత్రమే మీరు అంగీకరించరు.
22 పరిస్థితిపై ఆధారపడి, న్యాయాధిపతితో మీరు కేవలం అది ఒక్క డాక్టరు అభిప్రాయం మాత్రమేనని, వేరే డాక్టర్లు వారి విధానములో భిన్నంగా ఉన్నారని, విరివిగా అందుబాటులోవున్న రక్తరహిత చికిత్సద్వారా మీ బిడ్డకు చికిత్సచేసే మరొక డాక్టరుయొద్దకు వెళ్లే అవకాశాన్నివ్వమని అడుగుతున్నట్లు తెలియజేయవచ్చును. ఆసుపత్రి అనుసంధాన కమిటీ సహాయంతో మీరు ఇప్పటికే మీ పిల్లవానికి రక్తం లేకుండా చికిత్సచేసే డాక్టరును కనుగొని యుండవచ్చును. బహుశా ఆయన తన వాఙ్మూలమును టెలిఫోను ద్వారా ఇవ్వవచ్చును. డాక్టరు కోర్టు ఆర్డరు కోరుతున్నప్పటికిని—బహుశా ఆసుపత్రి అనుసంధాన కమిటీ మీ పిల్లవాని వైద్య సమస్యను రక్తం ఉపయోగించకుండానే సమర్థవంతంగా ఎట్లు నిర్వహించవచ్చో చూపే వైద్య శీర్షికలను జడ్జిగారికి అందించగలుగుదురు.
23 న్యాయాధిపతులు తొందరపాటుతో కోర్టు ఆర్డరు ఇచ్చునప్పుడు తరచు వారు, రక్తముయొక్క ఎయిడ్స్, కాలేయవ్యాధి, లేక ఇతర విపత్తులను పరిశీలించుట లేదు లేక, వాటినిగూర్చి వారికి జ్ఞాపకం చేయబడటమేగాని జరుగుటలేదు. ఈ విషయాలను మీరు న్యాయాధిపతికి సూచిస్తూ, ఒక క్రైస్తవ తండ్రిగా లేక తల్లిగా ప్రాణాన్ని దక్కించుటకు మరొకరి రక్తాన్ని ఉపయోగించటం దేవుని శాసనాన్ని గంభీరంగా ఉల్లంఘించటంగాను, ఇతరుల రక్తాన్ని నీ పిల్లవానికి బలవంతంగా ఎక్కించటం ఘోరమైన అత్యాచారంగాను దృష్టిస్తున్నామని ఆయనకు తెలియజెప్పవచ్చును. మీరు మీ బిడ్డ (ఒకవేళ తన నమ్మకాన్ని చెప్పుకొనగల వయస్సుంటే) అలా శరీరముపై ముట్టడివేయడాన్ని ఎంతగా అసహ్యించుకొంటున్నారో వివరిస్తూ, కోర్టు ఆర్డరు ఇవ్వవద్దని, వేరే ప్రత్యామ్నాయ వైద్య చికిత్సను చూచుకొనునట్లు అనుమతించమనియు అభ్యర్థించవచ్చును.
24 మనపక్షంగా ఉన్న కారణాన్ని సరియైన రీతిగా చూపుకొన్నప్పుడు, న్యాయాధిపతులు మరింత స్పష్టంగా మరొక పక్షమున అనగా తల్లిదండ్రులుగా—మీ పక్షమున—చూడగలరు. అప్పుడు రక్తమార్పిడిని అధీకృతం చేయుటకు అంతగా తొందరపడరు. కొన్ని సందర్భాలలో న్యాయాధిపతులు రక్తాన్ని ఉపయోగించే డాక్టర్ల స్వతంత్రాన్ని చాలా కఠినంగా నిర్భంధిస్తూ, మొదట ప్రత్యామ్నాయాలను ఆలోచించమని కోరి, లేక తల్లిదండ్రులు రక్తములేకుండా చికిత్సచేసే మరో డాక్టరును వెదికే అవకాశాన్నిచ్చారు.
25 రక్తమార్పిడిని బలవంతపెట్ట జూచే వారితో వ్యవహరించేటప్పుడు, నీ నిశ్చయతలో ఎప్పటికి, ఎంత మాత్రము చలనముండదనేందుకు తగిన నిదర్శనాన్ని చూపుట ప్రాముఖ్యము. తల్లిదండ్రులు తమ మనస్సాక్షిని తేలిక చేసుకొనేందుకు వీలుగా ఉంటుందనే భావంతో రక్తమార్పిడి నిర్ణయ బాధ్యతను వేరేవారికి “మార్చేందుకు” మీకేమైనా కష్టమా అని న్యాయాధిపతులు లేక డాక్టర్లు అడుగుతారు. అయితే మీరు తల్లిదండ్రులుగా రక్తమార్పిడిని నిరోధించేందుకు చేయగలిగిన దానినంతటిని చేయుటలో కొనసాగే మీ కర్తవ్యాన్ని భావిస్తున్నామని దానికి సంబంధించినవారందరికి స్పష్టంగా తెలియజేయవలెను. ఇది దేవుడు మీకిచ్చిన బాధ్యత. ఇది వేరేవారికి మార్చదగినది కాదు.
26 కాబట్టి డాక్టర్లతో లేక న్యాయాధిపతులతో మాట్లాడేటప్పుడు, మీ స్థానాన్ని గట్టి నిశ్చయతతో, స్పష్టంగా చెప్పటానికి మీరు సిద్ధపడియుండాలి. మీరు మీశక్తికొలది చేసిన ప్రయత్నములన్ని విఫలమై కోర్టు ఆర్డరు ఇస్తే, రక్తమార్పిడి చేయవద్దని, ప్రత్యామ్నాయ చికిత్సనుచేయమని ఇంకను డాక్టరును ప్రాథేయపడడం మానుకొనవద్దు. ఇతర వైద్యశీర్షికలను పరిశీలించమని, ఈ వైద్య సమస్యనే రక్తం లేకుండా నిర్వహించటానికి సుముఖంగావున్న ఇతర డాక్టర్ల సలహాను పరిశీలించమని కోరుతూనే ఉండండి. అనేకమార్లు ఎంతకు లొంగని డాక్టరు ఆపరేషన్ గదినుండి బయటికి వచ్చి గర్వంగా నేను రక్తాన్ని ఉపయోగించలేదని ప్రకటించిన సందర్భాలున్నవి. కాబట్టి కోర్టు ఆర్డరు ఇవ్వబడినప్పటికిని, ఏమైనను, వదలిపెట్టవద్దు.—జూన్ 15, 1991 ది వాచ్‌టవర్ సంచిక, “కొశ్చన్స్ ఫ్రంరీడర్స్” చూడండి.
27 యేసు చెప్పినదానిని జ్ఞాపకముంచుకొనండి: “మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్ములను మహా సభలకు అప్పగింతురు . . . వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు.” అటువంటి సమయాలలో మన ఆదరణ నిమిత్తమై యేసు ఇంకను చెప్పినదేమనగా, పరిశుద్ధాత్మ మీ రేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీ కనుగ్రహింపబడును.—మత్త. 10:16-20.
28 “ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.” (సామె. 16:20) తల్లిదండ్రులారా, ఆత్మీయంగా కలుషితపరచే రక్తమార్పిడినుండి మీ బిడ్డను రక్షించుటకు ముందుగానే అవసరమైన ఏర్పాట్లుచేయండి. (సామె. 22:3) పిల్లలారా, ఈ ఏర్పాట్లుచేయుటలో మీ తల్లిదండ్రులు ఇచ్చే తర్ఫీదుకు ప్రత్యుత్తరమిచ్చి, దానిని మీ హృదయానికి అన్వయించండి. ఒక కుటుంబముగా, “రక్తమును తిననే తిన కూడదు . . . మేలుకలుగునట్లు దాని తినకూడదు,” అనే తీర్మానమును దృఢంగా చేసికొనండి. అది యెహోవా ఆశీర్వాదమును, అనుగ్రహమును దయచేస్తుంది.—ద్వితీ. 12:23-25.
[అధస్సూచి]
a డాక్టరు అభిప్రాయంలో పిల్లవాని జీవాన్ని లేక ఆరోగ్యాన్ని కాపాడుటకు అప్పుడే ఉత్పన్నమైన, అత్యవసర పరిస్థితిలో తక్షణమే చికిత్సచేయవలసిన విషయాలలో (రక్తమార్పిడులతో సహా) డాక్టరు తలిదండ్రుల లేక కోర్టువారి అంగీకారము లేకుండానే చట్టబద్ధంగా చేయవచ్చును. అయినను అత్యవసరస్థితిలో తనకు చట్టమిచ్చిన అధికారాన్నిబట్టి, చికిత్స చేసినదానికి తాను బాధ్యుడైయున్నాడు.