ఏథోస్ పర్వతం—‘పరిశుద్ధ పర్వతమా’?
ఉత్తర గ్రీస్‌లో సముద్రంపైకి చొచ్చుకుని ఉన్న కొండప్రాంతమైన ఏథోస్‌ని “ఆర్థడాక్స్ క్రైస్తవ ప్రపంచమంతటిలో అత్యంత పరిశుద్ధమైన పర్వతం”గా ఆర్థడాక్స్ చర్చి యొక్క 22 కోట్ల కన్నా ఎక్కువ మంది సభ్యులు భావిస్తారు. వాళ్ళలో అనేకులు, ఆ “పరిశుద్ధ పర్వతం” మీదికి వెళ్ళాలని ఎంతో ఇష్టంగా కలలు కంటుంటారు. ఈ “పరిశుద్ధ పర్వతం” ఏమిటి? ఇది అంత ప్రాముఖ్యతను ఎలా సంతరించుకుంది? దేవుడికి భయపడే ప్రజలు ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం, సత్యారాధన కోసం తప్పనిసరిగా చూడవలసిన “పర్వతము” ఇదేనా?
“పరిశుద్ధ పర్వతము” అనే మాట బైబిలులో ఉంది. అది సత్య దేవుడైన యెహోవాను పవిత్రంగా, పరిశుద్ధంగా, ఉన్నతమైన విధంగా ఆరాధించడంతో ముడిపడివుంది. యెరూషలేములోని సీయోను పర్వతం, రాజైన దావీదు నిబంధన మందసాన్ని అక్కడికి తీసుకువచ్చినప్పుడు “పరిశుద్ధ పర్వతము” అయ్యింది. (కీర్తన 15:1; 43:3; 2 సమూయేలు 6:12, 17) సొలొమోను, మోరీయా పర్వతం మీద ఆలయాన్ని కట్టిన తర్వాతి నుండి “సీయోను” అన్నప్పుడల్లా, ఆ ఆలయం ఉన్న ప్రాంతం కూడా సూచించబడుతుంది; అలా, సీయోను “పరిశుద్ధ పర్వతము”గా నిలిచిపోయింది. (కీర్తన 2:6; యోవేలు 3:17) దేవుని ఆలయం యెరూషలేములో ఉండేది కాబట్టి, ఆ నగరాన్ని కూడా దేవుని “పరిశుద్ధ పర్వతము” అని అప్పుడప్పుడు పిలిచేవారు.—యెషయా 66:20; దానియేలు 9:16, 20.
నేటి విషయమేమిటి? దేవుడు అంగీకరించే విధంగా ఆయనను ఆరాధించేందుకు ప్రజలు ప్రవాహంలా వెళ్ళవలసిన “పరిశుద్ధ పర్వతము” ఏథోస్ పర్వతమేనా లేక వేరే ఇతర పర్వత శిఖరమేదన్నా ఉందా?
సన్యాసుల మఠంతో సంబంధం గల ఒక “పరిశుద్ధ పర్వతము”
ఆధునిక-దిన థెస్సలనీకీకు తూర్పున, ఏజీయన్ సముద్రంలో ముందుకు తోసుకుని వచ్చినట్లుగా ఉన్న సన్నని భూభాగపు అంచున కల్‌సిడసీ ద్వీపకల్పం ఉంది. దాని తూర్పు వైపు అంచున ఏథోస్ పర్వతం ఉంది. అది ఎంతో ఆకర్షణీయంగా ఉండే చలువరాయి పర్వతం. దాని శిఖరం, సముద్ర ఉపరిభాగం నుండి 2,032 మీటర్ల ఎత్తులో నిటారుగా ఉంటుంది.
ఎంతో కాలంగా ఏథోస్‌ను పవిత్ర స్థలంగా ఎంచుతున్నారు. గ్రీక్ పురాణాల ప్రకారం, ఒలింపస్ పర్వతం దేవుళ్ళ నివాసస్థలంగా మారకముందు, ఈ పర్వతమే వారి నివాస స్థానంగా ఉండేది. కాన్‌స్టంటైన్ ద గ్రేట్ జీవించిన (సా.శ. నాలుగవ శతాబ్దం) తర్వాతి కొద్దికాలానికి, ఏథోస్ పర్వతం క్రైస్తవ చర్చీలకు పరిశుద్ధ స్థలంగా మారింది. “కన్య” మేరి సువార్తికుడైన యోహానుతో కలిసి లాజరును సందర్శించేందుకు కుప్రకు వెళ్తుండగా అకస్మాత్తుగా భయంకరమైన తుపాను రావడంతో, ఏథోస్‌పై దిగారు అనీ, ఆ పర్వతపు సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైన ఆమె తనకు అది కావాలని యేసును కోరుకుందనీ, అలా ఏథోస్, “పరిశుద్ధ కన్య యొక్క తోట”గా పిలువబడుతోంది అనీ ఒక పురాణ కథ చెబుతుంది. బైజాన్‌టైన్ యుగపు మధ్య భాగం నాటికి, ఆ కొండప్రాంతమంతా కూడా పరిశుద్ధ పర్వతంగా వ్యవహరించబడుతోంది. చక్రవర్తి కాన్‌స్టంటైన్ IX మోనామాకస్ శాసనంతో 11వ శతాబ్దపు మధ్యకాలంలో ఈ పర్వతానికి ఈ హోదా ఆధికారికంగా ఇవ్వబడి, స్థిరపరచబడింది.
ఏథోస్ రాతిమయంగా ఉండి, మిగతావాటన్నింటికీ దూరంగా ఉన్నందువల్ల, సన్యాస జీవితాన్ని అవలంబించేందుకు అది వీలు కల్పిస్తుంది. శతాబ్దాలుగా, ఆర్థడాక్స్ ప్రపంచపు నలుమూలల నుండి మతాసక్తిగల అనేకులను—గ్రీకులను, సెర్బియన్‌లను, రొమేనియన్లను, బల్గేరియన్‌లను, రష్యన్‌లను, మరితరులను అది ఆకర్షించింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి, అనేక చర్చీలూ, సమాజాలతో పాటు సన్యాసుల మఠాలను అనేకములను నిర్మించారు. వీటిలో దాదాపు 20 మఠాలు ఇప్పటికీ ఉన్నాయి.
నేడు ఏథోస్ పర్వతం
నేడు ఏథోస్ స్వయంపాలక ప్రాంతంగా ఉంది, దాన్ని ఆమోదించే అధికారపత్రం 1926లో ఇవ్వబడింది. అక్కడ నివసించే సన్యాసుల సంఖ్య అనేక సంవత్సరాలుగా తగ్గింది, కానీ తర్వాత 2,000 కన్నా ఎక్కువగా పెరిగింది.
ఒక్కో సన్యాసి మఠానికి సొంతంగా పొలాలు, ప్రార్థనా మందిరాలు, నివాస స్థలాలు ఉన్నాయి. ఏథోస్ పర్వత అంచున ఉన్న ఎత్తైన శిఖరాల్లో ఉన్న స్థలమైన కారూల్యలో సన్యాసుల అత్యంత పవిత్ర స్థలం కనిపిస్తుంది. అక్కడ కొన్ని కుటీరాలు ఉన్నాయి. గందరగోళంగా కనిపించే కాలిబాటలు, రాతి మెట్లూ, గొలుసులూ దాటితేనే అక్కడికి చేరుకోగలం. ఏథోస్‌పైన, సన్యాసులు ఇప్పటికీ ప్రాచీన సాంప్రదాయానుసారంగా, (సూర్యాస్తమయంతో రోజు ప్రారంభమయ్యే) బైజాన్‌టైన్ కాలమానాన్ని, (గ్రెగేరియన్ క్యాలెండరు కన్నా 13 రోజులు వెనుక ఉండే) జూలియన్ క్యాలెండరునూ ఉపయోగిస్తూ, ప్రతిరోజూ సామూహికంగా ప్రార్థిస్తారు.
మతసంబంధమైన ఈ స్థలం యొక్క పవిత్రతకు ఒక స్త్రీకి ఋణపడి ఉన్నామని చెప్తున్నప్పటికీ, నపుంసకులు, గడ్డం లేని మగవాళ్ళతో సహా స్త్రీజాతిని—మానవులైనా జంతువులైనా సరే—ఈ ద్వీపకల్పంలో ప్రవేశించడాన్ని వెయ్యి సంవత్సరాలుగా, అక్కడ ఉండే సన్యాసులు, సాధువులు నిషేధిస్తున్నారు. గడ్డం లేని మగవాళ్ళకూ, కొన్ని ఆడ జంతువులకూ ఇటీవలే కాస్త మినహాయింపు దొరికింది. అయితే స్త్రీలు, ఏథోస్ తీరప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉండాలన్న గట్టి శాసనం ఇప్పటికీ ఉంది.
అందరి కోసమైన “పరిశుద్ధ పర్వతము”
దేవునికి భయపడే క్రైస్తవులు ఆరాధన కోసం వెళ్ళవలసిన “పరిశుద్ధ పర్వతము” ఏథోస్ పర్వతమేనా? దేవుడ్ని గెరిజీము పర్వతంపైనే ఆరాధించాలని నమ్మిన సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుడ్ని ఆరాధించే స్థలంగా అక్షరార్థమైన ఏ పర్వతమూ ఇక నిర్దేశించబడదని యేసు స్పష్టం చేశాడు. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము [గెరిజీము] మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు” అని యేసు అన్నాడు. ఎందుకని? “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలె[ను].” (ఇటాలిక్కులు మావి.)—యోహాను 4:21, 24.
ప్రవక్తయైన యెషయా, మన సమయాన్ని సూచిస్తూ, సూచనార్థక “యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచ”బడుతుందని, “కొండల కంటె ఎత్తుగా ఎత్తబడు”తుందని, సకల జనాంగములు అలంకారికంగా అందులోకి ప్రవాహంలా వెళ్తారని ప్రవచించాడు.—యెషయా 2:2, 3.
యెహోవాతో అంగీకృతమైన సంబంధాన్ని కలిగివుండాలని కోరుకునే స్త్రీలూ పురుషులూ యెహోవాను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేందుకు ఆహ్వానించబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ‘యెహోవా పర్వతము’నకు వెళ్ళే మార్గాన్ని కనుగొన్నారు. “ఆధ్యాత్మికత అనేది గోడల మధ్యన గానీ సన్యాసుల మఠాల మధ్యన గానీ బంధించబడి ఉందా అని సందేహిస్తున్నాను” అని అంటూ ఏథోస్ పర్వతాన్ని గురించి గ్రీక్ న్యాయవాది తన భావాలను వ్యక్తం చేశాడు. అవే భావాలను వ్యక్తం చేస్తున్న ఇతరుల్లో, యెహోవా మార్గాన్ని కనుగొన్నవాళ్ళు కూడా ఉన్నారు.—అపొస్తలుల కార్యములు 17:24.
[31వ పేజీలోని బాక్సు]
ఎంతోకాలంగా మరుగై ఉండిన నిక్షేపాలు
అనేక శతాబ్దాలుగా, ఏథోస్ సన్యాసులు సేకరించిన అనేక విలువైన నిక్షేపాల్లో, 15,000 వ్రాతప్రతులు ఉన్నాయని అంచనా. ఆ సేకరణలో నాలుగవ శతాబ్దం నుండి వ్రాయబడిన వ్రాతప్రతులు ఉన్నాయి, అలా అవి ప్రపంచంలోని అత్యంత విలువైన సేకరణల కోవకు చెందుతాయని కొందరు చెబుతారు. ఎంతో పురాతనమైన పెయింటింగ్‌లు, విగ్రహాలు, శిల్పాలు, లోహపు వస్తువులు మాత్రమే కాక గ్రంథపు చుట్టలు, సంపూర్ణమైన సంపుటాలు, సువార్తల పత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. గ్రీకు వ్రాతప్రతుల్లోని నాలుగింట ఒక వంతు వ్రాతప్రతులు ఏథోస్ పర్వతం మీద ఉన్నాయని అంచనా. అయితే వాటిలో అనేకాలను సరిగా వర్గీకరించవలసి ఉంది. 1997లో, అక్కడి సన్యాసులు తమ దగ్గరున్న ఆ నిక్షేపాల్లో కొన్నింటిని థెస్సలనీకీలో ప్రదర్శించేందుకు మొదటిసారిగా అనుమతించారు.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Telis/Greek National Tourist Organization