మీ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్‌గా మారడానికి అనుమతించకండి
విలాసవంతమైన టైటానిక్‌లో నీళ్ళు ప్రవేశించలేని 16 కంపార్ట్మెంట్లు ఉన్నాయి గనుక, అది మునిగిపోదని అనుకున్నారు. అది 1912లో తన మొదటి ప్రయాణంలో, అవసరమైన లైఫ్బోట్ల మొత్తం సంఖ్యలో సగమే తీసుకువెళ్ళింది. ఆ ఓడ మంచుకొండను ఢీకొని మునిగిపోవడంతో 1,500 కన్నా ఎక్కువ మంది చనిపోయారు.
దైవభయంగల ఉజ్జియా, ప్రాచీన యెరూషలేముకు రాజు, చాలా ప్రజ్ఞావంతుడైన సేనాధిపతి. యెహోవా సహాయంతో, అతడు తన శత్రువులను ఒకరి తర్వాత ఒకరిని లోబరచుకున్నాడు. “అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. . . . తన దేవుడైన యెహోవామీద ద్రోహము చే[సెను].” గర్వం మూలంగా ఉజ్జియాకు కుష్ఠరోగం వచ్చింది.—2 దినవృత్తాంతములు 26:15-21; సామెతలు 16:18.
మనకున్న ప్లస్ పాయింట్లు లేదా ప్రత్యేకతలు వివేకం, నమ్రత, అణకువలతో సమతూకం చేయబడనప్పుడు అవి చాలా సులభంగా మైనస్ పాయింట్లుగా లేదా బలహీనతలుగా, భారంగా మారగలవు అని ఈ రెండు వృత్తాంతాలు మనకు నేర్పిస్తున్నాయి. ఇది గంభీరంగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే, మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా, కొన్ని ప్లస్ పాయింట్లు లేదా వరాలు ఉన్నాయి, అవి ఆస్తులుగా, మనకూ ఇతరులకూ, ముఖ్యంగా మన సృష్టికర్తకు ఆనందాన్నిచ్చే వనరులుగా ఉండాలని మనం కోరుకుంటాం. నిజానికి, మనకు దేవుడిచ్చిన ఏ వరమైనా సరే, మనం దాన్ని పూర్తిగా ఉపయోగించి తీరాలి, అయితే, ఆ వరం విలువైన ఆస్తిగా కొనసాగేందుకు దాన్ని మన అధీనంలో ఉంచుకోవాలి.
ఉదాహరణకు, తన పని మీద ఎంతో మక్కువ గల వ్యక్తి, ఆ పని వ్యసనంగా మారడం ద్వారా ఆ వరం సులభంగా ఒక మైనస్ పాయింటుగా మారగలదు. చాలా జాగ్రత్తగల వ్యక్తి సులభంగా వంచించబడకపోవచ్చు, లేక మోసపోకపోవచ్చు. కానీ అతడు ఏ నాటికీ ఒక నిర్ణయానికి రాలేనంత అతిగా జాగ్రత్తపడవచ్చు. సామర్థ్యం కూడా చాలా మంచి లక్షణమే. అయితే మానవ బలహీనతలను అనుభూతులను నిర్లక్ష్యం చేసేంతగా దానికి అమిత ప్రాముఖ్యతను ఇస్తే, అసంతోషానికి కారణమయ్యే వాత్సల్యరహితమైన కఠినమైన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మీకున్న ప్లస్ పాయింట్లు లేదా ప్రత్యేకతల గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు వాటిని సరిగా ఉపయోగిస్తారా? అవి ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నాయా? అంతకన్నా ముఖ్యంగా, “శ్రేష్ఠమైన ప్రతి యూవి”కి మూలమైన యెహోవాను ఘనపర్చడానికి వాటిని ఉపయోగిస్తారా? (యాకోబు 1:17) మనకున్న ప్లస్ పాయింట్లను యెహోవాను ఘనపర్చాలన్న లక్ష్యంతో, ప్రత్యేకతలను ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నది గమనించుకోకపోతే ప్రత్యేకతలే బలహీనతలుగా మోయలేనంత భారమైనవిగా మారగల మరితర ఉదాహరణలను మనం దగ్గరగా పరిశీలించుదాం.
మానసిక సామర్థ్యాలను వివేకంతో ఉపయోగించండి
మంచి జ్ఞాపక శక్తి నిశ్చయంగా ఒక గొప్ప ఆస్తే. అయినప్పటికీ, అది అమిత ఆత్మవిశ్వాసానికి దారితీస్తే, లేక మన గురించి మనం గొప్పగా భావించేందుకు కారణమైతే, ముఖ్యంగా ఇతరులు మనలను అతిగా మెచ్చుకుంటే లేదా ముఖస్తుతి చేస్తే అది ఒక బలహీనతగా లేదా మైనస్ పాయింట్‌గా మారగలదు. లేదా దేవుని వాక్యం గురించి, బైబిలు ఆధారమైన పఠన ప్రచురణల గురించి మేధాపరంగా మాత్రమే వీక్షించేందుకు మనం మనకున్న జ్ఞాపకశక్తిని ఉపయోగించే అలవాటును అలవర్చుకోవచ్చు.
అమిత ఆత్మ విశ్వాసం వివిధ విధాల్లో తలెత్తవచ్చు. ఉదాహరణకు, ఒకరు క్రైస్తవ సంఘంలో ప్రసంగించే నియామకాన్ని, బహిరంగ ప్రసంగమే కావచ్చు లేదా దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో ఒక ప్రసంగమే గానీ మంచి మనస్సుతో స్వీకరించి, దాన్ని చివరి నిమిషంలో సిద్ధపడేందుకు ప్రక్కకు పెట్టి ఉండవచ్చు, యెహోవా ఆశీర్వాదం కోసం కూడా ప్రార్థించి ఉండకపోవచ్చు. బదులుగా ఆయన తాను ఇప్పటికే ఆర్జించిన జ్ఞానంపై, అప్పటికప్పుడు ఆలోచించి చెప్పగల తన సామర్థ్యంపై నమ్మకముంచుతాడు. ఆయనకున్న సహజ సామర్థ్యం ఆయన అశ్రద్ధను కొంత కాలంపాటు కప్పిపెట్టవచ్చు, కానీ యెహోవా యొక్క పూర్తి ఆశీర్వాదం లేకపోతే, ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడుతుంది, బహుశా ఆగిపోతుంది కూడా. చక్కని వరాన్ని వృథా చేసుకోవడమే అవుతుంది!—సామెతలు 3:5, 6; యాకోబు 3:1.
సూక్ష్మబుద్ధిగల ఒకరు, బైబిలు గురించీ, బైబిలు పఠన సహాయకాల గురించీ మేధాపరంగా వీక్షిస్తుండవచ్చు. అయితే, అలాంటి జ్ఞానం కేవలం “ఉప్పొంగజే”స్తుంది, లేక బెలూన్ ఉబ్బినట్లు, అహంభావంతో ఉబ్బిపోయేలా చేస్తుంది. అది ప్రేమపూర్వకమైన క్రైస్తవ సంబంధాలను ‘అభివృద్ధి’ చేయదు. (1 కొరింథీయులు 8:1; గలతీయులు 5:26) మరొకవైపు, ఆధ్యాత్మికతగల వ్యక్తి తనకు ఎంతటి మానసిక సామర్థ్యాలున్నా, ఎల్లప్పుడూ దేవుని ఆత్మ కోసం ప్రార్థిస్తాడు, దాని మీద నమ్మకం ఉంచుతాడు. ఆయన ప్రేమలోను, అణకువలోను, జ్ఞానంలోను, వివేకంలోను—యెహోవాను సంతోషపరచేంతటి పాళ్ళలో—ఎదుగుతున్న కొలది ఆయనకున్న ప్రత్యేకత మరెక్కువగా ఒక ఆస్తిగా మారుతుంది.—కొలొస్సయులు 1:9, 10.
మనం మనకున్న సామర్థ్యాన్ని బట్టి మన గురించి చాలా గొప్ప అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, నమ్రతలేమిని వెల్లడి చేసినట్లయితే, సామర్థ్యం కూడా ఒక మైనస్ పాయింట్‌గా మారుతుంది. అసాధారణ వరం గల ఒక వ్యక్తీ, ఆయనంటే అమిత మెప్పుదల గల వ్యక్తులూ, “తాము జ్ఞానులమనుకొనువారిని” వాళ్ళు ఎంతటి వరం గలవారైనా సరే, యెహోవా “ఏమాత్రమును లక్ష్యపెట్టడు” అన్న విషయాన్ని మర్చిపోవచ్చు. (యోబు 37:24) “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది [“వివేకమున్నది,” NW]” అని దేవుని వాక్యం చెబుతుంది. (సామెతలు 11:2) అపొస్తలుడైన పౌలు, ఎంతో మేధావీ, విద్యా సంపన్నుడూ అయినప్పటికీ, “సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని . . . వచ్చినవాడను కాను. . . . బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని” అని కొరింథీయులకు చెప్పాడు.—1 కొరింథీయులు 2:1-5.
నిజంగా వివేకం గల వ్యక్తి, లోకపు మేధాపరమైన దృక్కోణం చేత లేదా సాఫల్యానికి అది ఇచ్చే నిర్వచనం చేత వంచించబడడు. తనకున్న సామర్థ్యాలను మనుష్యుల అంగీకారాన్ని పొందేందుకు గానీ, లేదా లోకపు సిరిసంపదలను ఆర్జించడానికి గానీ కాక, తనకు జీవాన్నీ, సామర్థ్యాలనూ ఇచ్చిన వ్యక్తి కోసమే తన సామర్థ్యాలను తన శాయశక్తులా ఉపయోగిస్తాడు. (1 యోహాను 2:15-17) అందునిమిత్తమే, ఆయన తన జీవితంలో రాజ్యాసక్తులను మొదట ఉంచి, “నీటికాలువల యోరను నాటబడిన” “ఫలమిచ్చు చెట్టువలె” అవుతాడు. తనకున్న సహజ సామర్థ్యాల మూలంగా కాక, యెహోవా ఆశీర్వాదం మూలంగా, ‘ఆయన చేసేదంతా సఫలమౌతుంది.’—కీర్తన 1:1-3; మత్తయి 6:33.
క్రైస్తవత్వం మీకున్న ప్రత్యేకతకు మెరుగులు దిద్దును గాక
క్రైస్తవత్వానికి సహజంగానే ప్రత్యేకతలు సమృద్ధిగా ఉన్నాయి. దాని ముందు లోక తత్త్వశాస్త్రాలన్నీ వెలవెలపోతాయి. ఉదాహరణకు, క్రైస్తవ జీవన శైలి శ్రేష్ఠమైన భర్తలను, భార్యలను, శ్రేష్ఠమైన పొరుగువారిని, శ్రేష్ఠమైన ఉద్యోగస్థులను—సత్యసంధులైన, గౌరవభావంగల, సమాధానంగా ఉండే, కష్టపడి పనిచేసే ప్రజలను—తయారు చేస్తుంది. (కొలొస్సయులు 3:18-23) అంతేకాక, మాట్లాడడంలోనూ బోధించడంలోనూ ఇవ్వబడే క్రైస్తవ శిక్షణ, మనసులో మాటను చక్కగా తెలియజేయగల నైపుణ్యాలను వృద్ధి చేస్తుంది. (1 తిమోతి 4:13-15) కాబట్టి, అదనపు బాధ్యతలను ప్రమోషన్లను తరచూ క్రైస్తవులకు ఇవ్వడానికే ఎంప్లాయర్లు ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు. జాగ్రత్తగా ఉండకపోతే, అలాంటి ప్లస్ పాయింట్లను అనుచితంగా ఉపయోగించుకోవచ్చు. ఒక ప్రమోషన్ లేదా ప్రలోభపెట్టే ఉద్యోగం వల్ల, క్రైస్తవ కూటాలకు క్రమంగా రాకుండా, లేదా తన సొంత కుటుంబంతో వెచ్చించవలసిన సమయాన్ని త్యాగం చేస్తూ కంపెనీకి అంకితమైపోవలసి రావచ్చు.
ఆస్ట్రేలియాలో, క్రైస్తవ పెద్దా, గృహస్థుడూ అయిన ఒక వ్యక్తి, వ్యాపారంలో బాగా రాణిస్తుండేవాడు, “లోకమంతటినీ అమ్మగల్గేంత సామర్థ్యంగలవాడు” అని చెప్పవచ్చు. అయినప్పటికి ప్రస్తుత లోక వ్యవస్థలో అంత మేరకు రాణించాలన్న ప్రలోభాన్ని ఆయన ఎదిరించాడు. “నేను ఎక్కువ సమయాన్ని నా కుటుంబంతో గడపాలని, పరిచర్యలో గడపాలని కోరుకున్నాను” అని ఆయన అన్నాడు. “కనుక, నేనూ నా భార్యా, నేను లౌకిక పనిలో ఉపయోగించే సమయాన్ని జాగ్రత్తగా తగ్గించుకోవాలన్న అభిప్రాయానికి వచ్చాము. నేను వారానికి ఐదు రోజులు పని చేయవలసిన అవసరం లేనప్పుడు ఎందుకు పని చేయాలి?” అని కూడా ఆయన అంటున్నాడు. తన జీవితంలో బాగా ఆలోచించి కొన్ని సవరింపులను చేసుకున్న తర్వాత, ఈ పెద్ద వారానికి మూడు లేదా నాలుగు రోజులే పని చేస్తున్నా కూడా తాను తన కుటుంబానికి కావలసినవాటిని అమర్చగల్గుతున్నాడని తెలుసుకున్నాడు. కొంత కాలానికి, స్థానిక అసెంబ్లీ హాల్ కమిటీలోనూ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ సేవ చేయడం వంటి మరితర సేవాధిక్యతల్లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం వచ్చింది. వివేకంతో నడుచుకోవడం ద్వారా, ఆయనకున్న ప్లస్ పాయింట్లు, ఆయనకూ ఆయన కుటుంబానికీ ఆనందాన్నీ సంతృప్తినీ తెచ్చాయి.
ఆధిక్యతల విషయంలో సమతుల్యమైన దృక్పథం
క్రైస్తవ పురుషులు సంఘంలో సేవాధిక్యతలను చేరుకునేందుకు ప్రయత్నించాలని ప్రోత్సహించబడతారు. “ఎవడైనను అధ్యక్ష్యపదవిని [లేక పరిచర్య సేవకుడు అనే పదవిని] ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.” (1 తిమోతి 3:1) ఇప్పటి వరకూ పేర్కొన్న ప్రత్యేకతల్లాగే, బాధ్యతలను తీసుకోవడానికి చూపించే సుముఖత కూడా విషయాలను బాగా అర్థం చేసుకుని తీసుకున్న నిర్ణయం చేత సమతూకం చేయబడాలి. యెహోవా సేవలో ఆనందాన్ని కోల్పోయేంతగా మరీ ఎక్కువ నియామకాలను ఎవరూ కూడా చేపట్టకూడదు. నిజమే, దేనికీ సుముఖత చూపని దృక్పథాన్ని యెహోవా ఆమోదించడు గనుక, సుముఖతను చూపే స్ఫూర్తి ప్రశంసించదగినదే, అది అవసరం కూడా; అయితే, సుముఖత వినయాన్నీ “స్వస్థబుద్ధి”నీ కూడా తప్పనిసరిగా ప్రతిబింబించేదై ఉండాలి.—తీతుకు 2:13; ప్రకటన 3:15, 16.
యేసుకున్న మృదుత్వమూ, అంతర్దృష్టీ, సున్నితత్వమూ ఎంతో దీనులైనవారు కూడా ఆయన సాన్నిధ్యంలో నెమ్మదిని అనుభవించగల్గేలా చేశాయి. అలాగే నేడూ, సానుభూతిగల, ఇతరులపై శ్రద్ధ చూపించే వ్యక్తిత్వమే తమలోని ప్రత్యేకతగా గలవారితో ఉండడంలో ఇబ్బందిగా అనిపించదు. క్రైస్తవ సంఘంలో, అలా సౌహార్దంగా ఉండే, సమీపించదగ్గవారిగా ఉండే పెద్దలు నిజంగానే, విలువైనవిగా ఎంచవలసిన ఈవులు, “మనుష్యులకు ఈవులు.” వాళ్ళు, ‘గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉందురు, ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉందురు.’—ఎఫెసీయులు 4:8; యెషయా 32:2.
కానీ పెద్దలు ఇతరులకు సహాయం చేసేందుకు వెచ్చించే సమయాన్ని తమ సొంత వ్యక్తిగత పఠనానికీ, ధ్యానానికీ, ప్రార్థనకూ, బహిరంగ పరిచర్యకూ వెచ్చించే సమయాన్ని సమతూకం చేసుకోవాలి. వివాహితులైన క్రైస్తవ పెద్దలు ప్రత్యేకించి తమ కుటుంబంలోని వారికి సమీపించదగ్గవారై ఉండాలి, సహజంగానే, వారి కోసం సమయాన్ని వెచ్చించడం కూడా అవసరం.
సామర్థ్యంగల స్త్రీలు—అద్భుతమైన ఆశీర్వాదమే
సామర్థ్యంగల పెద్దల్లాగే, ఆధ్యాత్మిక మనస్కులైన స్త్రీలు కూడా యెహోవా సంస్థకు ఒక మంచి ఆస్తిగా ఉన్నారు. సాధారణంగా, స్త్రీలకు ఇతరులపై ఆసక్తి చూపించే సామర్థ్యముంటుంది—యెహోవా విలువైనదిగా ఎంచే, ప్రోత్సహించే లక్షణమది. “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యతరుల కార్యములను కూడ చూడవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 2:4) అయినప్పటికీ, ఇలా ‘ఇతరుల కార్యములను చూడడంలో’ కూడా పరిమితులున్నాయి. ఎందుకంటే, ఏ క్రైస్తవుడు కూడా “పరులజోలికి పోవువాడుగా” ఉండాలని కోరుకోడు; ఉబుసుపోక మాట్లాడేవాడిగా కూడా ఉండకూడదు.—1 పేతురు 4:15; 1 తిమోతి 5:13.
స్త్రీలకు మరనేక వరాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక క్రైస్తవ భార్యకు తన భర్త కన్నా మానసిక సామర్థ్యాలు ఎక్కువ ఉండవచ్చు. అయినప్పటికీ, యెహోవాకు భయపడే, “సామర్థ్యం గల భార్య” తన భర్తను గౌరవిస్తుంది, తనకున్న సామర్థ్యాలను ఆయనతో పోటీపడేందుకు కాక, ఆయనకు పూరకంగా ఉండేందుకు ఉపయోగిస్తుంది. ఆమె మీద అసూయపడే బదులు, లేదా కోపాన్ని పెంచుకునే బదులు, వినయస్థుడైన భర్త తన భార్యకున్న ప్లస్ పాయింట్లకు విలువిచ్చి, వాటిని బట్టి ఆనందిస్తాడు. తన సామర్థ్యాలను తమ ఇంటిని కట్టడానికి, తనలాగే తన పిల్లలు “యెహోవాయందు భయభక్తులు కలిగి” ఉండేలా వాళ్ళకు సహాయం చేయడానికి ఉపయోగించమని ఆమెను ఆయన ప్రోత్సహిస్తాడు. (సామెతలు 31:10 NW, 28-30; ఆదికాండము 2:18) అలాంటి వినయస్థులైన అణకువ గల భర్తలూ భార్యలూ వివాహ జీవితంలో వర్ధిల్లుతారు, అలా వాళ్ళు యెహోవాకు నిజంగా ఘనతను తెస్తారు.
బలమైన వ్యక్తిత్వాన్ని లోబరచుకోవడం
నీతి విషయంలో, యెహోవా చిత్తాన్ని పూర్ణాత్మతో చేయాలన్న విషయంలో దృష్టిని కేంద్రీకరించే బలమైన వ్యక్తిత్వానికి తోడు నమ్రతా, అణకువా సరైన పాళ్లలో ఉన్నప్పడు, ఆ బలమైన వ్యక్తిత్వం మంచి ఆస్తిగా ఉండగలదు. అయితే, బలమైన వ్యక్తిత్వం, ఇతరులపై అధికారం చెలాయించేందుకు లేక ఇతరులను అవమానించేందుకు కారణమైనప్పుడు అది మైనస్ పాయింట్‌గా మారగలదు. ఇది ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో చాలా నిజం. క్రైస్తవులు ఒకరి సాహచర్యంలో మరొకరు—సంఘ పెద్దల సాహచర్యంలో సహా నెమ్మదిని అనుభవించాలి.—మత్తయి 20:25-27.
అలాగే, పెద్దలు కూడా ఒకరి సాహచర్యంలో మరొకరు నెమ్మదిని అనుభవించాలి. వాళ్ళు సమావేశమైనప్పుడు, వాళ్ళ నిర్ణయాలపై ప్రభావం చూపాల్సింది పరిశుద్ధాత్మే గానీ వాళ్ళ వ్యక్తిత్వ బలం కాదు. నిజానికి, పరిశుద్ధాత్మ, పెద్దల సభలో ఉన్న ఏ పెద్దపైనైనా—అందరికన్నా చిన్నవాడైన, లేదా తక్కువ మాట్లాడేవాడైన పెద్దతో సహా ఎవరి మీదైనా—ప్రభావం చూపించగలదు. కనుక, బలమైన వ్యక్తిత్వాలు గల వాళ్ళు, తాము చెప్పినదే సరైనది అని అనుకుంటున్నప్పటికీ, తోటి పెద్దలకు “ఘనత చూపిస్తూ,” ఇతరుల అభిప్రాయాలను మన్నించడమనే కళను నేర్చుకోవడం ద్వారా తమ బలమైన వ్యక్తిత్వాన్ని అదుపులో పెట్టుకోవాలి. (రోమీయులు 12:10, NW) “అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు?” అని ప్రసంగి 7:16 దయాపూర్వకంగా హెచ్చరిస్తుంది.
“ప్రతి యూవి”కి మూలమైన యెహోవా, సంభ్రమాశ్చర్యాలను కలిగించేంతటి తన ప్రత్యేకతలను సంపూర్ణమైన పరిపూర్ణతతో సమతూకంగా ఉపయోగిస్తాడు. (యాకోబు 1:17; ద్వితీయోపదేశకాండము 32:4) ఆయన మన బోధకుడు! కనుక, మన సహజ వరాలను లేదా ప్లస్ పాయింట్లను మెరుగుపరచుకోవడంలోను, వాటిని వివేకంతో వినయంతో ప్రేమతో సమతూకం చేసుకుని ఉపయోగించడంలోను మనం ఆయన నుండి నేర్చుకుందాం, అందుకు కృషి చేద్దాం. అలా చేసినప్పుడు మనం ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం!
[27వ పేజీలోని చిత్రాలు]
ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మనం ప్రార్థనాపూర్వకంగా పఠించడంపైనా, యెహోవాను ఆశ్రయించడంపైనా ఆధారపడి ఉంటుంది
[29వ పేజీలోని చిత్రం]
ఇతరులపై ఉండే ఆసక్తికి వినయం తోడైనప్పుడు అది ఒక ఆశీర్వాదంగా ఉంటుంది
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of The Mariners’ Museum, Newport News, VA