పిల్లల పెంపకంలోని సవాళ్ళను ఎదుర్కోవడం
నేడు పిల్లల్ని పెంచడం, ముఖ్యంగా కౌమార ప్రాయంలో ఉన్న పిల్లలను పెంచడం అన్నది తల్లిదండ్రులకు భయంకరమైన సవాలుగా ఉంది. మద్యంతో, మత్తుమందులతో ప్రయోగాలు చేయడమనేది “యౌవనస్థుల మధ్య సర్వసాధారణ విషయంగా” మారింది అని కెనడాలోని మోన్ట్రియల్లోని ద గజెట్ నివేదిస్తోంది. “కౌమార ప్రాయంలో ఉన్న తమ పిల్లల్లో వచ్చే మార్పుల విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత” తల్లిదండ్రులకు ఉందని ఆ పత్రిక నొక్కిచెబుతుంది.
యౌవనస్థులకు సంబంధించిన అలాంటి సమస్యలను సూచించే వేటి కోసం తల్లిదండ్రులు చూడాలి? అమెరికన్ అకాడెమీ ఆఫ్ చైల్డ్ ఆండ్ అడోలసెంట్ సైకియాట్రీ తెలియజేసిన కొన్ని శారీరక, భావోద్వేగ, సామాజిక హెచ్చరికా సూచనల్లో, చాలా సమయం వరకూ అలసటగా ఉండడం, వ్యక్తిత్వంలోను స్వభావంలోను మార్పు, ఎక్కువ సేపు గదిలో గడియపెట్టుకుని ఉండడం, ఘర్షణకు తలపడడం, చట్టవిరుద్ధమైన పనులు చేసి పట్టుబడడం వంటివి ఇమిడి ఉన్నాయి.
తల్లిదండ్రులు, తమ పిల్లలను అలాంటి హానికరమైన ప్రయోగాల నుండి వాటి వల్ల కలిగే దుష్ఫలితాల నుండి ఎలా కాపాడుకోవచ్చు? పిల్లవాడికి వ్యక్తిత్వం రూపొందే సంవత్సరాల్లో వాడితో అరమరికలు లేకుండా మనసులో మాటను చర్చించుకోవడం ద్వారా, పరస్పరం గౌరవభావాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా తర్వాత సమస్యలు కలిగే అవకాశాన్ని తగ్గించవచ్చని మాక్గిల్ యూనివర్సిటీకి చెందిన డా. జఫ్రీ ఎల్. డెరవెన్స్కై నమ్ముతున్నారు. కౌమార ప్రాయంలో ఉన్న పిల్లలు ఎదుగుతున్న కొలది, స్వతంత్రంగా ఉండాలన్న కోరిక వాళ్ళలో తలెత్తినా కూడా, “తల్లిదండ్రులు చేసే ఏర్పాట్లూ, వాళ్ళు ఇచ్చే మార్గదర్శనమూ, ఆలంబనా, ప్రేమా” ఇప్పటికీ వాళ్ళకు అవసరమే అని కూడా గజెట్ అంటోంది. ఈ అభిప్రాయాలు, “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అన్న బైబిలు సామెతను ప్రతిధ్వనింపజేస్తున్నాయి. (సామెతలు 22:6) తల్లిదండ్రులు మాదిరులుగా, సహచరులుగా, మనసులో మాటను తెలియజెప్పుకునేవారిగా, బోధకులుగా ఉండాలని దేవుడు ఉపదేశిస్తున్నాడు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.