కొండ గుట్టల్లోని దొమ్మరి
మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఏన్గెదీ అని పిలువబడే ప్రాచీన నగరమూ దాని పరిసర అరణ్యమూ ఉండేవి. ఆ ప్రాంతంలోని కొండ సందులూ మిట్టప్రాంతాలూ ఇక్కడ కనిపిస్తున్న వాటి వలెనే ఉండే, వాగ్దాన దేశానికి చెందిన కొండ మేకలకు అనువైన నివాస స్థలాలు.
మంచి పటుత్వమున్న కాళ్లుగల ఈ జీవి జంతు సామ్రాజ్యంలోని అద్భుతాల్లో ఒకటి. మనం బైబిలు తెరిచి, ఆశ్చర్యాన్ని కలిగించే ఈ జంతువును మరింత దగ్గర్నుండి చూద్దాము.
“గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు”
కీర్తనల గ్రంథకర్త అలా పాడాడు. (కీర్తన 104:18) కొండ మేకలు ఎత్తైన స్థలాల్లో జీవించేందుకు అనువుగా రూపొందించబడ్డాయి! మెరకపల్లాలుగల ప్రాంతాల్లో ఎంతో ధైర్యంగానూ వేగంగానూ వెళ్లగలిగేలా అవి చాలా చురుకుగా ఉంటాయి. కొంతమేరకు వాటి గిట్టల నిర్మాణం దీనికి కారణం. మేక నిలబడి వున్నప్పుడు దాని బరువుకు గిట్టలు వ్యాప్తి చెందగలవు, కొండలలో నిటారుగా ఉండి ముందుకు పొడుచుకొచ్చినట్లుండే భాగాలపై నిలబడి ఉన్నప్పుడూ లేక నడుస్తున్నప్పుడు అలా అవి ఆ జంతువుకు గట్టి పట్టునిస్తాయి.
కొండ మేకలకు విశిష్టమైన సమతౌల్యం కూడా ఉంది. అవి చాలా దూరం వరకూ గెంతి తమ నాలుగు పాదాలూ నిలిపేందుకు అంతంత మాత్రంగా సరిపోయే చట్టుపై వచ్చి నిలబడగలవు. జీవ శాస్త్రజ్ఞుడైన డగ్లాస్ చాడ్విక్, మరొక విధమైన కొండ మేక తను వెనక్కు తిరిగేందుకు కూడా సరిపోనంత ఇరుకైన చట్టుపై నిలబడిపోయేలా ఉండకుండా అది తన సమతౌల్యాన్ని ఉపయోగించిన విధానాన్ని గమనించాడు. ఆయనిలా చెబుతున్నాడు: “దాదాపు 120 మీటర్ల క్రింద ఉన్న మరో చట్టును ఒకసారి తేరి చూసిన తర్వాత, అది తన ముందు కాళ్లను గట్టిగా అదిమి ఉంచి, మొగ్గ వేస్తున్నట్లు మెల్లిగా తన వెనక కాళ్లను తన తలకు పైగా కొండ ప్రక్కనుండి తీసుకెళ్లింది. నేను ఊపిరి బిగబట్టి చూస్తుంటే, అది తాను వచ్చిన వైపుకే తిరిగేలా తన వెనుక కాళ్లు క్రింద ఆనేంత వరకూ అలా చేసింది.” (నేషనల్ జియోగ్రాఫిక్) కొండ మేకలు “కొండ గుట్టల్లోని దొమ్మరులు” అని పిలువబడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
“కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా?”
కొండ మేకలు ఎంతో సిగ్గుపడే జంతువులు. అవి మానవునికి దూరంగా జీవించేందుకు ఇష్టపడతాయి. వాస్తవానికి, అవి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు వాటిని గమనించేంత దగ్గరకు వెళ్లడం ప్రజలకు కష్టమే. అందుకని, “వేయికొండలమీది పశువుల” యజమాని “అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా?” అని యోబు అనే వ్యక్తిని యుక్తంగానే అడగగలిగాడు.—కీర్తన 50:10; యోబు 39:1.
దేవుడిచ్చిన సహజ జ్ఞానం, ఒక ఆడ కొండ మేకకు అది ఈనవలసిన సమయాన్ని తెలియజేస్తుంది. అది సురక్షితమైన స్థానాన్ని వెదుక్కుని సాధారణంగా మే నెల చివర్లో లేక జూన్ నెలలో ఒకటి లేక రెండు పిల్లల్ని కంటుంది. ఆ పిల్లల పాదాలు కేవలం కొన్ని దినాల్లోనే పట్టుత్వాన్ని సంపాదిస్తాయి.
“అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి”
జ్ఞానియైన సొలొమోను రాజు భర్తలను ఇలా పురికొల్పాడు: “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి [“కొండ మేక,” NW].” (సామెతలు 5:18, 19) అది స్త్రీలను అవమానించేందుకు చెప్పబడినది కాదు. సొలొమోను ఈ జంతువు యొక్క అందం, సొగసు, మరితర విశేషమైన లక్షణాలను ఉద్దేశిస్తున్నాడని స్పష్టమౌతుంది.
సృష్టికర్త యొక్క జ్ఞానానికి తిరుగులేని సాక్ష్యమిచ్చే అసంఖ్యాకమైన “జీవముగల వాటి”లో కొండ మేక కూడా ఉంది. (ఆదికాండము 1:24, 25) దేవుడు ఇన్ని అద్భుతమైన జీవులను మన చుట్టూ ఉంచినందుకు మనం సంతోషంగా లేమా?
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
Athens University సౌజన్యంతో