‘మనుష్యులలో ఈవులను’ మెప్పుదలతో చూడటం
‘మీలో ప్రయాసపడుచు మీకు పైవారైయున్నవారిని మన్ననచేసి, వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను.’—1 థెస్సలొనీకయులు 5:12, 13.
1. అపొస్తలుల కార్యములు 20:35 ప్రకారం ఇవ్వడం అనే లక్షణానికి ఏ శక్తి ఉంది? సోదాహరణగా వివరించండి.
“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) యేసు చెప్పిన ఆ మాటల్లోని సత్యత్వాన్ని మీరు చివరిసారి ఎప్పుడు అనుభవించారో గుర్తుతెచ్చుకోగలరా? బహుశ మీరు మీకిష్టమైన వ్యక్తికి ఏదైనా కానుకను ఇచ్చివుండవచ్చు. మీరు దాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసివుంటారు, ఎందుకంటే అది మీ ప్రియమైన వ్యక్తి అపురూపంగా ఎంచేదిగా ఉండాలనుకున్నారు. మీ ప్రియమైన వ్యక్తి ముఖంలో వెలుగును మీరు చూసినప్పుడు, మీ హృదయం ఎంత సంతోషంతో నిండి ఉంటుంది! సరియైన ఉద్దేశాలు ఉన్నప్పుడు, ఇవ్వడం అనేది ప్రేమకు ఒక వ్యక్తీకరణ, మరి ప్రేమ యొక్క వ్యక్తీకరణకు మనలో సంతోషాన్ని ఉత్పత్తిచేసే శక్తి ఉంది.
2, 3. (ఎ) యెహోవా కన్నా ఎక్కువ సంతోషం గలవారు ఎవరూ లేరని ఎందుకు చెప్పగలం, ‘మనుష్యులలో ఈవులు’ అనే ఏర్పాటు ఆయన హృదయాన్ని ఎలా ఆనందపర్చగలదు? (బి) దేవుడిచ్చిన ఈవి సంబంధంగా మనం ఏమి చేయాలనుకోము?
2 అలాంటప్పుడు, “శ్రేష్ఠమైన ప్రతి యీవి”నీ ఇచ్చే యెహోవాకన్నా ఎక్కువ సంతోషం ఇంకెవరికి ఉంటుంది? (యాకోబు 1:17; 1 తిమోతి 1:8, NW) ఆయన ఇచ్చే ప్రతి ఈవి వెనుక ప్రేమ ఉంటుంది. (1 యోహాను 4:8) ఇది, దేవుడు క్రీస్తు ద్వారా సంఘానికి ఇచ్చిన ఈవియైన ‘మనుష్యులలో ఈవుల’ విషయంలో కూడా వాస్తవం. (ఎఫెసీయులు 4:8, NW) మందను చూసుకోవడానికి చేయబడిన పెద్దలు అనే ఏర్పాటు, తన ప్రజలంటే దేవునికి ఉన్న ప్రగాఢమైన ప్రేమకు ఒక వ్యక్తీకరణ. ఈ పురుషులు జాగ్రత్తగా ఎంపిక చేయబడినవారు—వారు లేఖనాధార అర్హతలను చేరుకోవల్సివుంది. (1 తిమోతి 3:1-7; తీతుకు 1:5-9) తాము ‘మందను కనికరంతో’ చూడాలని వారికి తెలుసు, ఎందుకంటే అప్పుడు మాత్రమే అటువంటి ప్రేమగల కాపరులున్నందుకు గొఱ్ఱెలు కృతజ్ఞతగా భావించేందుకు కారణాలుంటాయి. (అపొస్తలుల కార్యములు 20:29; కీర్తన 100:3) తన గొఱ్ఱెల్లో అటువంటి కృతజ్ఞతతో నిండిన హృదయాలు ఉన్నాయని యెహోవా చూసినప్పుడు ఆయన హృదయం కూడా తప్పకుండా ఆనందంతో ఉప్పొంగుతుండాలి!—సామెతలు 27:11.
3 దేవుడు ఇచ్చిన ఈవి యొక్క విలువను తక్కువ చేసే తలంపు మనలో ఎన్నడూ రాకూడదు; ఆయనిచ్చే ఈవులపట్ల మెప్పుదల లేకపోవడమన్నది కూడా మనలో ఏర్పడనేకూడదు. ఇప్పుడు రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి: ఒకటి, పెద్దలు సంఘంలో తమ పాత్రను ఎలా దృష్టించాలి? రెండు, మిగతా మంద, తాము ‘మనుష్యులలో ఈవులను’ మెప్పుదలతో చూస్తున్నామని ఎలా చూపించగలరు?
‘మేము మీ సహకారులము’
4, 5. (ఎ) పౌలు సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు, ఇది ఎందుకు యుక్తమైన దృష్టాంతము? (బి) మనం ఒకరినొకరం దృష్టించుకునే విధానం విషయంలోను, ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే విధానం విషయంలోను పౌలు ఇచ్చిన దృష్టాంతము ఏమి చూపిస్తుంది?
4 యెహోవా ‘మనుష్యులలో ఈవులకు’ సంఘంలో కొంత అధికారాన్ని అప్పజెప్పాడు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేయాలని మాత్రం పెద్దలు అనుకోరు, కానీ అపరిపూర్ణ మానవులుగా అలా చేయడం చాలా సులభమని వారికి తెలుసు. అయితే, వారు మిగతా మంద సంబంధంగా తమను తాము ఎలా దృష్టించుకోవాలి? అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన దృష్టాంతాన్ని పరిశీలించండి. ‘మనుష్యులలో ఈవులు’ ఎందుకు అందజేయబడ్డారో చర్చించిన తర్వాత పౌలు ఇలా వ్రాశాడు: “ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.” (ఎఫెసీయులు 4:15, 16) కాబట్టి పెద్దలతో, మరితర సభ్యులతో కూడిన సంఘాన్ని పౌలు ఒక మానవ శరీరంతో పోలుస్తున్నాడు. ఇది ఎందుకు యుక్తమైన దృష్టాంతమని చెప్పవచ్చు?
5 మానవ శరీరం అనేక అవయవాలతో కూడినది, కానీ శిరస్సు ఒక్కటే. అయితే, శరీరంలో ఒక కండరం గానీ, ఒక నాడి గానీ, ఒక రక్తనాళంగానీ ఏదీ కూడా అనవసరమైనది కాదు. ప్రతి అవయవము విలువైనదే, సర్వశరీరానికి ఆరోగ్యాన్ని సౌందర్యాన్నీ తీసుకురావడానికి ఎంతోకొంత దోహదపడుతుంది. అదే విధంగా, సంఘము అనేకమైన వేర్వేరు సభ్యులతో తయారైంది, కానీ ప్రతి సభ్యుడు—యౌవనుడైనా లేక వృద్ధుడైనా, బలవంతుడైనా లేక బలహీనుడైనా—సంఘం యొక్క పూర్తి ఆధ్యాత్మిక ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక సౌందర్యానికీ ఎంతోకొంత దోహదపడగలడు. (1 కొరింథీయులు 12:14-26) ఏ ఒక్కరు కూడా తాను పట్టించుకోదగినంత వ్యక్తి కాదని భావించనవసరం లేదు. మరోవైపు చూస్తే, ఏ ఒక్కరు కూడా తాను అత్యధికుడని భావించనూ కూడదు, ఎందుకంటే మనందరమూ—కాపరులూ, గొఱ్ఱెలూ—శరీరంలోని భాగమై ఉన్నాము, ఉన్నదొక్కటే శిరస్సు, అది క్రీస్తు. ఈ విధంగా పౌలు, ఒకరిపట్ల ఒకరికి ఉండాల్సిన ప్రేమ, శ్రద్ధ, గౌరవాలనే ఒక సుందరమైన చిత్రాన్ని చిత్రిస్తున్నాడు. దీన్ని గుర్తించడం, సంఘంలో తమ పాత్ర విషయమై నమ్రతగల, సమతుల్యమైన దృష్టిని అలవర్చుకునేందుకు పెద్దలకు సహాయపడుతుంది.
6. అపొస్తలత్వ అధికారం ఉన్నప్పటికీ, పౌలు ఒక నమ్రతగల స్ఫూర్తిని ఎలా కనపర్చాడు?
6 ఈ ‘మనుష్యులలో ఈవులు’ తోటి ఆరాధకుల జీవితాల్ని గానీ లేదా వారి విశ్వాసాల్ని గానీ అదుపుచేయడానికి ప్రయత్నించరు. పౌలుకు అపొస్తలత్వ అధికారం ఉన్నప్పటికీ తోటి కొరింథీయులతో ఇలా చెప్పాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” (2 కొరింథీయుల 1:24) పౌలు తన సహోదరుల విశ్వాసాన్నీ వారి జీవన విధానాన్నీ నియంత్రించాలని అనుకోలేదు. నిజంగానే, ఆయన ఆ అవసరం ఉందని అనుకోలేదు, ఎందుకంటే వారు అప్పటికే విశ్వసనీయులైన స్త్రీపురుషులనీ, సరియైనదేదో అది చేయాలన్న కోరిక ఉంది కాబట్టే వారు యెహోవా సంస్థలో ఉన్నారనీ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అందుకని, ఆయన తన గురించీ, తన ప్రయాణ సహచరుడైన తిమోతిని గురించీ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెబుతున్నదాని అర్థం ఇదే: ‘దేవునికి ఆనందంగా సేవచేసేలా మీతో కలిసి పనిచేయడం మా బాధ్యత.’ ఎంతటి నమ్రతతో కూడిన స్ఫూర్తోకదా!
7. నమ్రతగల పెద్దలు సంఘంలో తమ పాత్ర విషయమై ఏమి గ్రహిస్తారు, తమ జతపనివారిలో వారు ఎటువంటి నమ్మకం కలిగివుంటారు?
7 నేడు ‘మనుష్యులలో ఈవులకు’ అదే బాధ్యత ఉంది. వారు ‘మన ఆనందానికి సహకారులు.’ దేవుని సేవలో ఇతరులు ఎంత చేయగలరో నిర్ణయించాల్సిన పని తమది కాదని నమ్రతగల పెద్దలు గుర్తిస్తారు. పరిచర్యను విస్తృతిపర్చుకోమని వారు ఇతరులను ప్రోత్సహించవచ్చని వారికి తెలిసినప్పటికీ దేవునికి చేసే సేవ అనేది స్వేచ్ఛాపూర్వకమైన హృదయం నుండి రావాలి. (పోల్చండి 2 కొరింథీయులు 9:7.) తమ జతపనివారు ఆనందంగా ఉన్నారంటే వారికి చేతనైనంతా వారు చేస్తారన్న నమ్మకం పెద్దలకు ఉంది. కాబట్టి ‘సంతోషముతో యెహోవాను సేవించేలా’ తమ సహోదరులకు సహాయం చేయాలన్నది వారి హృదయపూర్వకమైన వాంఛ.—కీర్తన 100:2.
అందరూ సంతోషముతో సేవించేలా సహాయపడటం
8. తమ సహోదరులు యెహోవాకు ఆనందంతో సేవచేసేలా పెద్దలు సహాయం చేయగల కొన్ని విధానాలు ఏమిటి?
8 పెద్దలారా, మీ సహోదరులు సంతోషముతో సేవచేసేలా మీరు వారికి ఎలా సహాయపడగలరు? మీరు మీ మాదిరిద్వారా వారిని ప్రోత్సహించవచ్చు. (1 పేతురు 5:3) పరిచర్యలో మీ ఉత్సాహమూ మీ సంతోషమూ కనబడనివ్వండి, అప్పుడు ఇతరులు మీ మాదిరిని అనుకరించడానికి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇతరులు పూర్ణమనస్సుతో చేసే ప్రయత్నాలను మెచ్చుకోండి. (ఎఫెసీయులు 4:29) హృదయపూర్వకమైన, నిజాయితీతో కూడిన మెచ్చుకోలు తాము పాత్రులమైన వారమనీ, ప్రాముఖ్యమైన వారమనీ ఇతరులు భావించేలా చేస్తుంది. తాము చేయగలిగిన యావత్తు చేయాలని కోరుకునేలా అది గొఱ్ఱెలను ప్రోత్సహిస్తుంది. ప్రతికూలమైన రీతిలో పోల్చకుండా జాగ్రత్తవహించండి. (గలతీయులు 6:4) ఆ విధంగా పోల్చడం వారిని మెరుగుపర్చుకునేలా పురికొల్పడానికి బదులుగా నిరుత్సాహానికి గురిచేస్తుంటాయి. అంతేగాక, యెహోవా గొఱ్ఱెలు వేర్వేరు పరిస్థితులు, వేర్వేరు సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు. పౌలువలే, మీ సహోదరులపై నమ్మకాన్ని వ్యక్తం చేయండి. ప్రేమ “అన్నిటిని నమ్మును,” కాబట్టి మన సహోదరులు దేవుణ్ని ప్రేమిస్తారనీ, దేవుణ్ని ప్రీతిపర్చాలని కోరుకుంటారనీ నమ్మడం మనకు ఉత్తమం. (1 కొరింథీయులు 13:7) మీరు ‘ఘనత విషయములో ఇతరులను గొప్పగా ఎంచుతున్నారంటే,’ మీరు వారిలోని శ్రేష్ఠమైన వ్యక్తిత్వ లక్షణాల్ని వెలికి తీస్తున్నారని అర్థం. (రోమీయులు 12:10) గొఱ్ఱెలు ప్రోత్సాహాన్ని, సేదదీర్పును పొందినప్పుడు, అధిక శాతంమంది దేవుణ్ని సేవించడానికి తమకు చేతనైనంతా చేస్తారనీ, అంతేకాదు అలా సేవించడంలో ఆనందాన్ని అనుభవిస్తారనీ పూర్తి నమ్మకంతో ఉండండి.—మత్తయి 11:28-30.
9. తోటి పెద్దలపట్ల ఎటువంటి దృక్పథం ప్రతి పెద్ద కూడా ఆనందంతో సేవచేయడానికి సహాయపడుతుంది?
9 నమ్రతతో మిమ్మల్ని మీరు ‘సహకారులని’ దృష్టించుకోవడం మీరు ఆనందంతో సేవచేయడానికీ, మీ తోటి పెద్దల్లోవున్న విశిష్టమైన ఈవులను మెప్పుదలతో చూడడానికీ మీకు సహాయపడుతుంది. ప్రతి పెద్దకీ తనదైన కౌశలం, తనవైన ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయి. పెద్దలందరూ వాటిని సంఘ ప్రయోజనం నిమిత్తం ఉపయోగించగలరు. (1 పేతురు 4:10) ఒకరికి బోధించే వరం ఉండవచ్చు. మరొకరు సంస్థీకరించడంలో ప్రతిభావంతుడైవుండవచ్చు. మరింకొకరికి, తనలో ఉన్న అనురాగం, తను ప్రదర్శించే వాత్సల్యం మూలంగా చాలా సమీపించదగ్గ వ్యక్తియని విశేషమైన ఖ్యాతి ఉండవచ్చు. వాస్తవం ఏమిటంటే, ఏ పెద్దకూ సమానమైన మోతాదులో ప్రతి వరమూ లేదు. ఎవరికైనా ఒక వరం ఉండడం—ఉదాహరణకు బోధించే వరం ఉండడం—ఆ పెద్దను వేరే పెద్దకన్నా ఉన్నతుడ్ని చేస్తుందా? ఎంతమాత్రం లేదు! (1 కొరింథీయులు 4:7) మరోవైపు, మరో పెద్దకున్న సామర్థ్యం మూలంగా ఆయన్ను ఇతరులు మెచ్చుకున్నప్పుడు ఆ పెద్దకున్న వరాన్ని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు, లేదా తనకు అటువంటి యోగ్యతలు లేవే అని భావించనవసరం లేదు. గుర్తుంచుకోండి, మీలోను కూడా యెహోవా గుర్తించే వరాలు ఉన్నాయి. ఆ వరాల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికీ, మీ సహోదరుల ప్రయోజనార్థం మీరు వాటిని ఉపయోగించడానికీ ఆయన సహాయం చేయగలడు.—ఫిలిప్పీయులు 4:13.
‘మాటవిని, లోబడి ఉండండి’
10. మనం ‘మనుష్యులలో ఈవుల’ పట్ల మెప్పుదలను వ్యక్తం చేయడం ఎందుకు యుక్తం?
10 మనకు ఏదైనా కానుక ఇవ్వబడినప్పుడు, మెప్పుదలను వ్యక్తం చేయడం కేవలం యుక్తం. “కృతజ్ఞులై యుండుడి” అని కొలొస్సయులు 3:15 చెబుతుంది. మరి, యెహోవా మనకు ఇచ్చిన అమూల్యమైన ఈవియైన ‘మనుష్యులలో ఈవుల’ విషయమేమిటి? మనం ప్రాథమికంగా ఉదారపూర్వకంగా ఈవులను ఇచ్చే యెహోవాకు అయితే కృతజ్ఞులమై ఉన్నాము. కానీ ‘మనుష్యులలో ఈవుల’ విషయమేమిటి? మనం వారిని మెప్పుదలతో చూస్తున్నామని ఎలా చూపించగలం?
11. (ఎ) మనము ‘మనుష్యులలో ఈవుల’పట్ల మన మెప్పుదలను ఎలా ప్రదర్శించగలము? (బి) ‘మాట వినడం,’ ‘లోబడి ఉండడం’ అన్న వ్యక్తీకరణల ప్రాముఖ్యత ఏమిటి?
11 మనం ‘మనుష్యులలో ఈవుల’ పట్ల మన మెప్పుదలను, వారిచ్చే బైబిలు ఆధారిత సలహాలనూ, నిర్ణయాలనూ వేగిరంగా అనుసరించడం ద్వారా ప్రదర్శించగలము. బైబిలు ఇలా తెలియజేస్తోంది: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) మనం కేవలం నాయకత్వం వహిస్తున్నవారి ‘మాట వినడం’ మాత్రమే కాదు, వారికి ‘లోబడి ఉండాలి’ కూడా అని గమనించండి. “లోబడియుండుడి” అన్న పదానికి గ్రీకులో అక్షరార్థంగా “ఒకరి క్రింద లోబడివుండడం” అని భావం. ‘మాట వినడం’ ‘లోబడి ఉండటం’ అన్న వ్యక్తీకరణలపై వ్యాఖ్యానిస్తూ, బైబిలు విద్వాంసుడైన ఆర్. సి. హెచ్. లెన్‌స్కీ ఇలా అంటున్నాడు: “మాట వినడం అన్న వ్యక్తీకరణను, ఫలాని పనిచెయ్యమని తనకు చెప్పినప్పుడు దానికి తను సమ్మతించినప్పుడూ, అది సరియైన పని అనీ, లాభదాయకమైనదనీ ఒప్పించబడినప్పుడూ ఉపయోగిస్తారు; లోబడి ఉండడం అన్న వ్యక్తీకరణను, తనకు విరుద్ధమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సమ్మతించినప్పుడు ఉపయోగిస్తారు.” నాయకత్వం వహిస్తున్న వారి నిర్దేశాన్ని అర్థంచేసుకుని, దానికి మనం సమ్మతించినప్పుడు లోబడడం అనేది సులభంగానే జరిగిపోతుంది. కానీ ఒకానొక నిర్ణయం వెనుక ఉన్న కారణం మనకు అర్థంకానప్పటి సంగతేమిటి?
12. ఫలాని నిర్ణయం వెనుకనున్న కారణం మనం పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు కూడా మనం లోబడి ఉండాల్సిన, లేదా తలొగ్గవలసిన అవసరం ఎందుకు ఉంది?
12 ఇక్కడే మనం లోబడి ఉండాల్సిన, లేదా తలొగ్గవలసిన అవసరం ఉండవచ్చు. ఎందుకు? ఒక కారణం ఏమిటంటే, ఆధ్యాత్మిక అర్హతలు ఉన్న ఈ పురుషులు మన పూర్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న వారని మనం వారిపై నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంది. ఎంతైనా, తమ సంరక్షణలో ఉంచబడిన గొఱ్ఱెల విషయమై యెహోవాకు లెక్క ఒప్పచెప్పాలన్న విషయం వారికి బాగా తెలుసు. (యాకోబు 3:1) దానికి తోడు, వివరాలన్నింటినీ పరిశీలించిన పిమ్మట అటువంటి నిర్ణయం తీసుకోవడానికి వారిని నడిపించిన ఆంతరంగిక వాస్తవాలన్నీ మనకు తెలియకపోవచ్చన్న విషయం గుర్తుంచుకోవడం మనకు మంచిది.—సామెతలు 18:13.
13. పెద్దలు చేసిన న్యాయ నిర్ణయం సంబంధంగా మనం లోబడివుండడానికి ఏది సహాయపడుతుంది?
13 న్యాయ నిర్ణయాల సంబంధంగా లోబడి ఉండే సంగతి ఏమిటి? ఇది సులభం కాదని, ప్రాముఖ్యంగా మన దగ్గరి బంధువు లేదా మన సన్నిహిత స్నేహితుడు వంటి మనం ప్రేమించే ఎవరినైనా సంఘం నుండి బహిష్కరించాలన్న నిర్ణయం చేసినప్పుడు ఇది సులభం కాదని ఒప్పుకోవలసిందే. ఇక్కడ కూడా మరోసారి ‘మనుష్యులలో ఈవులు’ చేసిన తీర్పుకు లోబడడం ఉత్తమం. వారు మనకన్నా ఎక్కువ నిష్పక్షపాతంగా ఉండగలిగే స్థానంలో ఉన్నారు, వారికి మనకన్నా ఎక్కువ వాస్తవాలు తెలిసివుండవచ్చు. ఈ సహోదరులు అటువంటి నిర్ణయాలపట్ల చాలా వ్యధచెందుతారు; ‘యెహోవా నిమిత్తం తీర్పు తీర్చడం’ అన్న బాధ్యత చాలా గంభీరమైనది. (2 దినవృత్తాంతములు 19:6, NW) వారు దయను కనపర్చడానికి ప్రతి ప్రయత్నమూ చేస్తారు, ఎందుకంటే దేవుడు ‘క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’ అని వారు మనస్సులో ఉంచుకుంటారు. (కీర్తన 86:5) కానీ వారు సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచాలి కూడా, ఆ కారణం నిమిత్తమే పశ్చాత్తాపం చూపని తప్పిదస్తులను సంఘం నుండి బహిష్కరించాలని బైబిలు నిర్దేశిస్తుంది. (1 కొరింథీయులు 5:11-13) అత్యధిక సందర్భాల్లో తప్పిదస్థుడు తానే ఆ నిర్ణయానికి సమ్మతిస్తాడు. ఈ క్రమశిక్షణా చర్య తను తిరిగి స్వస్థబుద్ధిని తెచ్చుకోవడానికి సరిపోతుండవచ్చు. ఒకవేళ ఆయనను ప్రేమించేవారమైన మనము నిర్ణయం విషయానికి వచ్చినప్పుడు లోబడితే, తద్వారా ఆ క్రమశిక్షణా చర్యనుండి ఆయన ప్రయోజనం పొందడానికి సహాయం చేసినవారమౌతాము.—హెబ్రీయులు 12:11.
‘వారిని మిక్కిలి ఘనముగా ఎంచవలెను’
14, 15. (ఎ) 1 థెస్సలొనీకయులు 5:12, 13 ప్రకారం పెద్దలు ఎందుకు ఘనతకు పాత్రులు? (బి) పెద్దలు ‘మనలో ప్రయాసపడుతున్నారు’ అని ఎందుకు చెప్పగలము?
14 ‘మనుష్యులలో ఈవులను’ ఘనముగా ఎంచడం ద్వారా కూడా మనం వారిపట్ల మెప్పుదలను ప్రదర్శించగలము. థెస్సలొనీకలోని సంఘానికి వ్రాస్తూ పౌలు అందులోని సభ్యులను ఇలా ప్రోత్సహించాడు: “మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలె[ను].” (1 థెస్సలొనీకయులు 5:12, 13) “ప్రయాసపడుచు”—అనే ఈ మాట మన కోసం నిస్వార్థంగా పాటుపడే అంకిత భావంగల పెద్దలకు సరిగ్గా సరిపోదూ? మన ప్రియమైన ఈ సహోదరులు ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఒక్క క్షణం ఆలోచించండి.
15 అధికశాతం ఈ పెద్దలు కుటుంబాలు గలవారు, తమ కుటుంబాలను పోషించుకోవడానికి లౌకిక ఉద్యోగాలు చేయాల్సినవారు. (1 తిమోతి 5:8) ఒకవేళ పెద్దకు పిల్లలుంటే, ఈ పిల్లలకు తమ తండ్రి సమయమూ, అవధానమూ అవసరం. ఆయన వారి స్కూలు పనిలో వారికి సహాయం చేయాలి, ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాల్లో వారు తమ యౌవనకాల శక్తిని ఖర్చుచేయడానికి కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రణాళిక వెయ్యాలి. (ప్రసంగి 3:1, 4) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ఆయన తన కుటుంబపు ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపిస్తాడు, క్రమమైన కుటుంబ బైబిలు పఠనాన్ని నిర్వహిస్తాడు, క్షేత్ర పరిచర్యలో వారితో పనిచేస్తాడు, వారిని క్రైస్తవ కూటాలకు తీసుకువెళ్తాడు. (ద్వితీయోపదేశకాండము 6:4-7; ఎఫెసీయులు 6:4) మనలో చాలామందికి కూడా ఉండే ఈ బాధ్యతలకు తోడు పెద్దలకు అదనపు విద్యుక్త ధర్మాలు కూడా ఉంటాయని మనం మర్చిపోవద్దు: కూటాల్లోని భాగాలకు సిద్ధపడడం, కాపరి సందర్శనాలు చేయడం, సంఘపు ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల శ్రద్ధవహించడం, అవసరమైనప్పుడు న్యాయతీర్మాన కేసులను పరిష్కరించడం. కొందరికి ప్రాంతీయ సమావేశాలు, జిల్లా సమావేశాలు, రాజ్యమందిర నిర్మాణం, ఆసుపత్రి అనుసంధాన కమిటీలు సంబంధంగా అదనపు బాధ్యతలు ఉంటాయి. నిజంగా, ఈ సహోదరులు ఎంతో ‘ప్రయాసపడుతున్నారు’!
16. పెద్దలకు మనం ఘనతను ఇవ్వగల విధానాలను వివరించండి.
16 మనం వారిని ఘనముగా ఎలా ఎంచగలం? ఒక బైబిలు సామెత ఇలా అంటుంది: “సమయోచితమైన మాట యెంత మనోహరము!” (సామెతలు 15:23; 25:11) కాబట్టి నిజాయితీతో వారిని మెచ్చుకుంటూ, వారిని ప్రోత్సహిస్తూ చేసే వ్యాఖ్యానాలు మనం వారి ప్రయాసను వృధా ప్రయాసగా ఎంచడం లేదని చూపగలవు. అంతేగాక, మనం వారినుండి అపేక్షించే వాటి విషయంలో కూడా మనం సహేతుకంగా ఉండాలి. ఒకవైపు, మనం వారి సహాయం కోసం స్వేచ్ఛగా వారి దగ్గరకు వెళ్లగల్గాలి. కొన్నిసార్లు ‘మన గుండెలు వేదనపడే’ సందర్భాలు ఉంటాయి, అప్పుడు మనకు దేవుని వాక్యాన్ని ‘బోధింపతగినవారి’ నుండి లేఖనాధారమైన ప్రోత్సాహం, నడిపింపు, లేదా సలహా అవసరం అవుతుంది. (కీర్తన 55:4; 1 తిమోతి 3:2, 3) అదే సమయంలో, ఒక పెద్ద దగ్గర మన కోసం వెచ్చించగల్గే సమయం కొంతమాత్రమే ఉంటుందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన తన సొంత కుటుంబ అవసరాలనూ సంఘంలోని ఇతరుల అవసరాలనూ ఉపేక్షించలేడు. కష్టపడి పనిచేసే ఈ సహోదరుల పట్ల తదనుభూతితో మనం వారినుండి సహేతుకంకాని డిమాండ్లను చేయలేము. (1 పేతురు 3:8) బదులుగా, వారు మన కోసం సహేతుకంగా వెచ్చించగల సమయమూ అవధానమూ విషయమై మనం మెప్పుదలను కనపరుద్దాము.—ఫిలిప్పీయులు 4:5.
17, 18. పెద్దలుగా ఉన్నవారి అనేకమంది భార్యలు ఎటువంటి త్యాగాలు చేస్తారు, విశ్వసనీయులైన ఈ సహోదరీలను మనం అల్పంగా ఎంచడం లేదని మనం ఎలా చూపించగలము?
17 పెద్దల భార్యల సంగతేమిటి? వారు కూడా మన ఘనతకు పాత్రులు కారా? ఎంతైనా, వారు తమ భర్తలను సంఘంతో పంచుకుంటున్నారు మరి. ఇలా చేయడానికి వారి పక్షంగా త్యాగాలు అవసరమౌతాయి. అప్పుడప్పుడు, పెద్దలు సాయంత్రం పూటల్లో సంఘ విషయాలను చూసుకోవడానికి సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది, ఆ సమయాన్ని వారు తమ కుటుంబాలతో వెచ్చించివుండేవారే. చాలా సంఘాల్లో విశ్వసనీయులైన స్త్రీలు, తమ భర్తలు యెహోవా గొఱ్ఱెలపట్ల శ్రద్ధ వహించేలా ఇష్టపూర్వకంగా అటువంటి త్యాగాలు చేస్తున్నారు.—పోల్చండి 2 కొరింథీయులు 12:15.
18 విశ్వసనీయులుగా ఉన్న ఈ క్రైస్తవ సహోదరీల విలువను తక్కువ చేయడంలేదని మనం ఎలా చూపించగలం? వారి భర్తలనుండి అసహేతుకంగా డిమాండు చేయకుండటం ద్వారా అలా నిశ్చయంగా చూపించవచ్చు. కానీ మెప్పుదలతో కూడిన చిన్న మాటల్లో ఉన్న బలాన్ని కూడా మర్చిపోకుందాము. సామెతలు 16:24 ఇలా చెబుతుంది: “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.” ఒక అనుభవాన్ని పరిశీలించండి. ఒక క్రైస్తవ కూటం తర్వాత, వివాహితులైన ఇద్దరు భార్యాభర్తలు ఒక పెద్ద దగ్గరికి వచ్చి, యౌవనస్థుడైన తమ కుమారుడ్ని గురించి ఆయనతో మాట్లాడాలని అడిగారు. ఆ పెద్ద ఈ దంపతులతో మాట్లాడినంతసేపు ఆయన భార్య ఓపిగ్గా వేచివుంది. అటుతర్వాత, ఆ తల్లి ఈమె దగ్గరకు వచ్చి ఇలా అంది: “మీ భర్త నా కుటుంబానికి సహాయం చేయడానికి వెచ్చించిన సమయం కోసం మీకు నిజంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.” మెప్పుదల నిండిన ఆ కొద్ది మాటలు, ఆమె హృదయాన్ని నిజంగా తాకాయి.
19. (ఎ) ఒక సమూహముగా పెద్దలు ఏ లక్ష్యాలను విశ్వసనీయంగా నెరవేరుస్తున్నారు? (బి) మనమందరం ఏమి చేయాలని నిశ్చయించుకోవాలి?
19 గొఱ్ఱెలను చూసుకోవడానికి పెద్దల ఏర్పాటు అనేది యెహోవా ఇచ్చే ‘శ్రేష్ఠమైన ఈవుల్లో’ ఒకటి. (యాకోబు 1:17) లేదు, ఈ పురుషులు పరిపూర్ణులేమీ కారు; మనందరిలానే వారు కూడా తప్పులు చేస్తారు. (1 రాజులు 8:46) అయినా, వారు ఒక సమూహముగా, యెహోవా వారి విషయంలో ఏ లక్ష్యాలను కలిగివున్నాడో వాటినే—అంటే సరిదిద్దడం, క్షేమాభివృద్ధిని కలుగజేయడం, ఐక్యపర్చడం, మందను కాపాడటం అనే లక్ష్యాలనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దలు విశ్వసనీయంగా నెరవేరుస్తున్నారు. ప్రతి పెద్ద యెహోవా గొఱ్ఱెలపట్లా వాత్సల్యంతో శ్రద్ధచూపాలని తీర్మానించుకుంటూ, తద్వారా తాను తన సహోదరులకు ఒక ఈవి అనీ, లేదా ఒక ఆశీర్వాదం అనీ రుజువుచేసుకుంటూ ముందుకు సాగుదురు గాక. ఈ ‘మనుష్యులలో ఈవుల’కు విధేయతను కనపర్చడం ద్వారా, వారి ప్రయాసలకు వారిని ఘనంగా ఎంచడం ద్వారా వారిపట్ల మెప్పుదలను చూపిద్దామని మనమందరం నిశ్చయించుకుందాము. యెహోవా ప్రేమ పూర్వకంగా మనకు అందజేసిన పురుషుల విషయమై ఎంత కృతజ్ఞులమై ఉండగలము, వారందరూ ఆయన గొఱ్ఱెలతో ఇదిగో ఇలా చెబుతున్నారు: ‘దేవునికి ఆనందంగా సేవచేసేలా మీకు సహాయం చేయడమే మా బాధ్యత’!
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ సంఘాన్ని ఒక శరీరంతో పోల్చడం ఎందుకు యుక్తము?
◻ తమ సహోదరులు యెహోవాకు ఆనందంగా సేవచేసేలా పెద్దలు ఎలా సహాయం చేయగలరు?
◻ నాయకత్వం వహిస్తున్నవారి మాట వినడం మాత్రమే కాక, వారికి లోబడివుండడం కూడా ఎందుకు ప్రాముఖ్యం?
◻ మనం పెద్దలకు ఏయే మార్గాల్లో ఘనతను ఇవ్వగలము?
[16వ పేజీలోని చిత్రం]
పెద్దలారా, ఇతరులు పూర్ణమనస్సుతో చేసే ప్రయత్నాలకై వారిని మెచ్చుకోండి
[17వ పేజీలోని చిత్రం]
పరిచర్యలో ఉత్సాహపూరితమైన తమ మాదిరిద్వారా పెద్దలు తమ కుటుంబ సభ్యులకూ, ఇతరులకూ ఆనందంగా సేవచేయడానికి సహాయపడగలరు
[18వ పేజీలోని చిత్రాలు]
మేము ప్రయాసపడుతున్న మా పెద్దలను మెప్పుదలతో చూస్తాము!