“వాస్తవమైన జీవము”ను అనుభవించండి
యెహోవా దేవుడు మానవునికి నిత్యత్వాన్ని గురించిన గ్రహణశక్తినిచ్చాడు. (ప్రసంగి 3:11) ఇది మరణసమయంలో మానవులు తాము అశక్తులమని భావించేలా చేస్తుంది, అయితే అదే సమయంలో అది వారిలో జీవించాలనే తీవ్రమైన వాంఛను రేకెత్తిస్తుంది.
దేవుని ప్రేరేపిత వాక్యమైన పరిశుద్ధ బైబిలు మనకు గొప్ప నిరీక్షణనిస్తుంది. (2 తిమోతి 3:16) ప్రేమామయుడైన యెహోవా, మానవునికి నిత్యత్వాన్ని గ్రహించే శక్తినిచ్చి ఆ తర్వాత అతడు కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రం జీవించేలా చేయడు. మన పరిస్థితిని బట్టి వ్యధ చెందేలా మనల్ని సృష్టించటం దేవుని వ్యక్తిత్వానికే విరుద్ధం. “పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె” మనం సృష్టించబడలేదు.—2 పేతురు 2:12.
నిత్యత్వాన్ని గురించిన సహజసిద్ధమైన భావనతో ఆదాము హవ్వలను సృష్టించడంలో, యెహోవా దేవుడు “చాల మంచిది” ఒకటి చేశాడు; ఆయన వారిని నిరంతరం జీవించగల సామర్థ్యంతో సృష్టించాడు. (ఆదికాండము 1:31) కాని విచారకరంగా, మొదటి జంట సృష్టికర్త ఇచ్చిన ఒక సుస్పష్టమైన నిషేధాజ్ఞకు అవిధేయత చూపించి, తమ ఆది పరిపూర్ణతను కోల్పోవడం ద్వారా తమ స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగం చేశారు. ఫలితంగా వాళ్లు అపరిపూర్ణతను, మరణాన్ని తమ సంతానానికి సంక్రమింపజేసి మరణించారు.—ఆదికాండము 2:17; 3:1-24; రోమీయులు 5:12.
జీవిత సంకల్పాన్ని గురించి, మరణమంటే ఏమిటనే దాని గురించి బైబిల్లో ఏవిధమైన మర్మమూ లేదు. మరణించినప్పుడు, “పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను” ఉండదని, మృతులు “ఏమియు ఎరుగరు” అని అది చెప్తుంది. (ప్రసంగి 9:5, 10) మరో మాటలో చెప్పాలంటే, మృతులు మృతులే. అమర్త్యమైన ఆత్మ అనే బోధ బైబిలు ఆధారితమైనది కాదు, కాబట్టి మృతుల స్థితిని గురించి పరిష్కరించవలసిన నిగూఢమైన మర్మమేమీ లేదు.—ఆదికాండము 3:19; కీర్తన 146:4; ప్రసంగి 3:19, 20; యెహెజ్కేలు 18:4.a
దేవునికి ఒక సంకల్పం ఉంది; ఆయన భూమిని “కేవలం ఊరికే” సృష్టించలేదు. పరదైసు పరిస్థితుల్లో పరిపూర్ణ మానవులకు “నివాసస్థలమ”య్యేలా ఆయన దాన్ని రూపించాడు, తర్వాత దేవుడు తన సంకల్పాన్ని మార్చుకోలేదు. (యెషయా 45:18, NW; మలాకీ 3:6) దాన్ని నెరవేర్చడానికి ఆయన తన కుమారుడ్ని భూమి మీదికి పంపించాడు. మరణం వరకు నమ్మకంగా ఉండటం ద్వారా, యేసుక్రీస్తు మానవజాతిని పాపమరణాల నుండి విమోచించడానికి కావల్సిన క్రయధనాన్ని అందించాడు. వాస్తవానికి, యేసు ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16.
తాను “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” సృష్టిస్తానని దేవుడు చాలాకాలం క్రితం వాగ్దానం చేశాడు. (యెషయా 65:17; 2 పేతురు 3:13) పరలోకంలో జీవించడానికి కొంతమంది నమ్మకమైన క్రైస్తవుల గుంపును ఎంచుకోవడం దానిలో ఇమిడివుంది. యేసుక్రీస్తుతో కలిసి వారు ప్రభుత్వ కేంద్రభాగం అవుతారు. బైబిలు దీన్ని “భూమి మీద” వ్యవహారాలను నిర్వహించే “పరలోక రాజ్యము” అని లేక “దేవుని రాజ్యము” అని సూచిస్తుంది. (మత్తయి 4:17; 12:28; ఎఫెసీయులు 1:10; ప్రకటన 5:9, 10; 14:1, 3) మన భూగోళంపై నుండి తనకు అప్రీతికరమైన దాన్నంతటినీ నిర్మూలించి, దాన్ని శుభ్రపర్చిన తర్వాత, దేవుడు నీతియుక్తమైన మానవ సమాజాన్ని లేక “క్రొత్త భూమి”ని తీసుకువస్తాడు. త్వరలో జరుగనైయున్న ఈ దుష్ట విధాన నాశనంలో నుండి దేవుడు రక్షించే ప్రజలు అందులో చేరివుంటారు. (మత్తయి 24:3, 7-14, 21; ప్రకటన 7:9, 13, 14) వాగ్దానం చేయబడిన పునరుత్థానం ద్వారా తిరిగి సజీవులుగా చేయబడిన వారు కూడా వారితో కలుస్తారు.—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.
అప్పుడు “వాస్తవమైన జీవము”
భవిష్యత్ పరదైసు భూమిపై జీవితాన్ని గురించిన ఉత్తేజకరమైన వివరణను ధృవీకరిస్తూ దేవుడు, “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని” చెప్తున్నాడు. (ప్రకటన 21:5) మానవజాతి కోసం దేవుడు చేయబోయే అద్భుతమైన కార్యాలను పూర్తిగా గ్రహించడం మానవ మేధకు అసాధ్యం. ఏదెనును పోలిన ప్రపంచవ్యాప్త పరదైసును దేవుడు సృష్టిస్తాడు. (లూకా 23:43) ఏదెనులో ఉన్నట్లుగానే, అందమైన ఆహ్లాదకరమైన వర్ణాలు, శ్రవణానందకరమైన శబ్దాలు, చవులూరించే రుచులు పుష్కలంగా ఉంటాయి. పేదరికం, ఆహార కొరత ఇక ఉండవు, ఎందుకంటే ఆ సమయాన్ని గురించి, “మొదటి సంగతులు గతించిపోయెనని” బైబిలు చెప్తుంది. (ప్రకటన 21:4; కీర్తన 72:16) రోగం మరెన్నడూ ఉండకుండా నిర్మూలించబడుతుంది గనుక “నాకు దేహములో బాగులేదని” ఇక ఎవ్వరూ చెప్పరు. (యెషయా 33:24) అవును, మానవజాతి చిరకాల “శత్రువు” అయిన మరణంతో సహా వేదన కలిగించే విషయాలన్ని గతించిపోతాయి. (1 కొరింథీయులు 15:26) క్రీస్తు పరిపాలన క్రింద ఉండే క్రొత్త మానవ సమాజమైన “క్రొత్త భూమి”ని గురించిన అద్భుతమైన దర్శనంలో, అపొస్తలుడైన యోహాను ఒక స్వరం ఇలా చెప్పడాన్ని విన్నాడు: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” ఈ దైవిక వాగ్దాన నెరవేర్పుకంటే మరింకేది గొప్ప ఓదార్పును ఆనందాన్ని తీసుకురాగలదు?
భవిష్యత్ జీవితాన్ని వివరించడంలో, బైబిలు ప్రాముఖ్యంగా మానవుని నైతిక, ఆధ్యాత్మిక అభిలాషలను తృప్తిపరిచే పరిస్థితులను నొక్కిచెప్తుంది. మానవజాతి ఇప్పటి వరకు ఏ సముచితమైన వాటికోసమైతే వ్యర్థంగా పోరాడిందో అవన్నీ పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. (మత్తయి 6:9, 10) వాటిలో న్యాయం కావాలన్న కోరిక ఉంది, బలహీనులపై ఆధిపత్యం చేసిన క్రూరమైన నిరంకుశుల చేతుల్లో మానవుడు తరచూ బాధలననుభవించాడు గనుక ఆ కోరిక ఇంత వరకూ నెరవేరకుండానే మిగిలిపోయింది. (ప్రసంగి 8:9) క్రీస్తు పరిపాలన క్రింద ఉండే పరిస్థితుల గురించి కీర్తన గ్రంథకర్త ప్రవచనాత్మకంగా ఇలా వ్రాశాడు: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. . . . [వారికి] క్షేమాభివృద్ధి కలుగును.”—కీర్తన 72:7.
సమానత్వం అన్నది మరో అభిలాష, దానికోసం అనేకులు త్యాగాలు చేశారు. “పునర్జననమందు” దేవుడు వివక్షతను నిర్మూలిస్తాడు. (మత్తయి 19:28) అందరూ ఒకే గౌరవాన్ని అనుభవిస్తారు. ఇదేదో కఠినమైన ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ విధించే సమానత్వం కాదు. బదులుగా, ఇతరులపై ఆధిపత్యం చేయడానికి లేక పెద్ద మొత్తంలో వస్తువులను సమకూర్చుకోవడానికి కారణమైన అత్యాశ, గర్వం వంటి వాటితో సహా వివక్షతా కారకాలు నిర్మూలించబడతాయి. యెషయా ఇలా ప్రవచించాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారుకట్టుకొన్న యండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.”—యెషయా 65: 21, 22.
వ్యక్తిగత, సామూహిక యుద్ధాల్లో రక్తపాతం మూలంగా మానవుడు ఎంత వేదనకు గురయ్యాడో కదా! ఇది హేబెలు హత్య నుండి ప్రస్తుతకాల యుద్ధాల వరకూ కొనసాగింది. శాంతి నెలకొల్పబడాలని, బహుశా వ్యర్థంగా, మానవులు ఎంత కాలంగా నిరీక్షించి, ఎదురు చూశారో! పునఃస్థాపించబడిన పరదైసులో, మనుష్యులందరూ శాంతి కాముకులుగా, దీనులుగా ఉంటారు; వాళ్లు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
యెషయా 11:9 ఇలా చెప్తుంది: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత మూలంగా, మరితర కారణాల మూలంగా, ఆ మాటల పూర్తి పరిధిని అర్థం చేసుకోవడం నేడు మనకు సాధ్యం కాదు. దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం మనల్ని ఆయనతో ఎలా సమైక్యపరుస్తుందో, అది పూర్తి ఆనందానికి ఎలా నడిపిస్తుందో, మనం ఇంకా తెలుసుకోవలసి ఉంది. అయితే యెహోవా అద్భుతమైన శక్తి, జ్ఞానము, న్యాయము, ప్రేమ గల దేవుడని లేఖనాలు మనకు చెప్తున్నాయి గనుక, “క్రొత్త భూమి”కి చెందిన నివాసులు చేసే ప్రార్థనలన్నింటినీ ఆయన వింటాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.
“వాస్తవమైన జీవము” కచ్చితము—దాన్ని చేపట్టండి!
చాలామందికి, శ్రేష్ఠమైన ప్రపంచంలో నిత్య జీవమన్నది కేవలం ఒక కల లేక భ్రమ మాత్రమే. అయితే, బైబిలు వాగ్దానమందు నిజంగా విశ్వాసం గలవారికి, ఈ నిరీక్షణ ఒక వాస్తవం. అది వారి జీవితాలకు ఒక లంగరువంటిది. (హెబ్రీయులు 6:19) లంగరు ఎలాగైతే ఓడను స్థిరంగా ఉంచి, అటు ఇటు కదలిపోకుండా కాపాడుతుందో అలాగే, నిత్యజీవ నిరీక్షణ ప్రజలను సుస్థిరులనుగా, నమ్మకస్థులనుగా చేసి, జీవితంలోని గంభీరమైన కష్టాలను ఎదుర్కోవడానికి, చివరికి వాటిని అధిగమించడానికి వారికి సహాయం చేస్తుంది.
దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. ఆయన ఒక ప్రమాణాన్ని, తిరుగులేని ఒప్పందాన్ని చేయటం ద్వారా దానికి హామీని కూడా ఇచ్చాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు . . . మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను.” (హెబ్రీయులు 6:17, 18) దేవుడు ఎన్నడూ కొట్టివేయలేని ‘నిశ్చలమైన రెండు సంగతులు’ ఏమిటంటే, ఆయన వాగ్దానం, ఆయన ప్రమాణం, వాటిపైనే మనం మన నిరీక్షణను ఆధారం చేసుకుంటాము.
దేవుని వాగ్దానాలందు విశ్వాసం గొప్ప ఓదార్పును, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. ఇశ్రాయేలు ప్రజల నాయకుడైన యెహోషువకు అలాంటి విశ్వాసం ఉండేది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వీడ్కోలు ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు, ఆయన వృద్ధుడు, తాను మరణించబోతున్నానని ఆయనకు తెలుసు. అయినప్పటికీ, దేవుని వాగ్దానాలందున్న పూర్తి నమ్మకం నుండి ఉత్పన్నమైన బలాన్ని, చెక్కుచెదరని యథార్థతను ఆయన వ్యక్తపర్చాడు. మానవజాతినంతటినీ మరణానికి నడిపే “సర్వలోకుల మార్గమున” తాను వెళ్తున్నానని చెప్పిన తర్వాత, యెహోషువ ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” అవును, దేవుడు ఎల్లప్పుడూ తను చేసిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తాడని యెహోషువ మూడు సార్లు పునరుచ్చరించాడు.—యెహోషువ 23:14.
త్వరలో స్థాపించబడనైయున్న నూతన లోకాన్ని గురించిన దేవుని వాగ్దానమందు మీరు కూడా అదే విధమైన విశ్వాసాన్ని కలిగివుండవచ్చు. బైబిలును ఎడతెగక చదవడం ద్వారా మీరు యెహోవా ఎవరో, ఆయన మీ పూర్తి నమ్మకాన్ని పొందడానికి ఎందుకు అర్హుడో అర్థం చేసుకోగల్గుతారు. (ప్రకటన 4:10) అబ్రాహాముకు, శారాకు, ఇస్సాకుకు, యాకోబుకు, ప్రాచీనకాలానికి చెందిన ఇతర నమ్మకమైనవారికి సత్య దేవుడైన యెహోవా గురించి తమకున్న సన్నిహితమైన జ్ఞానంపై ఆధారపడిన గట్టి విశ్వాసం ఉండేది. వారు తాము జీవించివున్నప్పుడు “వాగ్దానముల ఫలము అనుభవింపక పోయి”నప్పటికీ, వారు తమ నిరీక్షణ విషయంలో దృఢంగా ఉన్నారు. అయినప్పటికీ, వారు “దూరమునుండి చూచి వందనము” చేశారు.—హెబ్రీయులు 11:13.
బైబిలు ప్రవచనాలను అర్థం చేసుకుని మనం ఇప్పుడు “సర్వాధికారియైన దేవుని మహాదినము” సమీపించడాన్ని చూస్తున్నాము, ఆ దినములో భూమి మీది నుండి దుష్టత్వమంతా నిర్మూలించబడుతుంది. (ప్రకటన 16:14, 16) ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన వ్యక్తులవలే, దేవునిపట్లా, “వాస్తవమైన జీవము” పట్లా విశ్వాసంతోనూ, ప్రేమతోనూ పురికొల్పబడి, భవిష్యత్ సంఘటనల కోసం మనం నమ్మకంగా ఎదురు చూస్తూ ఉండాలి. నూతన లోకం సమీపంలో ఉండటం, యెహోవాయందు విశ్వాసం కలిగివుండి ఆయనను ప్రేమించేవారికి బలమైన పురికొల్పునిస్తుంది. త్వరలో రానైయున్న దేవుని దినములో ఆయన అనుగ్రహాన్ని, కాపుదలను పొందడానికి అలాంటి విశ్వాసాన్ని, ప్రేమను పెంపొందింపజేసుకోవలసిన అవసరం ఉంది.—జెఫన్యా 2:3; 2 థెస్సలొనీకయులు 1:3; హెబ్రీయులు 10:37-39.
కాబట్టి, మీరు జీవాన్ని ప్రేమిస్తారా? అంతకంటే ఎక్కువగా మీరు “వాస్తవమైన జీవమును” కోరుకుంటున్నారా—సంతోషకరమైన భవిష్యద్ ఉత్తరాపేక్షతో అంటే నిత్యజీవ ఉత్తరాపేక్షతో దేవుని అంగీకారం పొందిన సేవకులుగా జీవించాలని కోరుకుంటున్నారా? మీరు అదే పొందాలనుకుంటుంటే, ‘మన నమ్మకాన్ని అస్థిరమైన ధనమందు గాక దేవుని యందు’ ఉంచాలని వ్రాసిన అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఉద్బోధను వినండి. పౌలు ఇంకా ఇలా కొనసాగించాడు: “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము,” దేవుడ్ని ఘనపరిచే “సత్‌క్రియలు అను ధనముగల . . . వారునై యుండవలె[ను].”—1 తిమోతి 6:17-19.
యెహోవా సాక్షులతో బైబిలు పఠనానికి అంగీకరించడం ద్వారా, మీరు “నిత్యజీవము” అయ్యున్న జ్ఞానాన్ని పొందవచ్చు. (యోహాను 17:3) ప్రేమపూర్వకంగా, దేవుడు ఒక తండ్రిలా ఈ ఆహ్వానాన్ని అందరికీ ఇస్తున్నాడు: “నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.”—సామెతలు 3:1, 2.
[అధస్సూచీలు]
a ఈ అంశాన్ని గురించిన సవివరమైన పరిశీలన కోసం, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) అనే బ్రోషూరును చూడండి.