యెహోవా విశ్వాసులకు చేసిన తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు
“వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు.”—హెబ్రీయులు 10:23.
1, 2. యెహోవా వాగ్దానాలయందు మనమెందుకు పూర్ణ నమ్మకాన్ని ఉంచగలం?
తన యందు తన వాగ్దానాలయందు గట్టి విశ్వాసాన్ని పెంపొందించుకొని, దాన్ని కాపాడుకోవాలని తన సేవకుల్ని యెహోవా అడుగుతున్నాడు. ఒకడు అలాంటి విశ్వాసంతో, యెహోవా తాను వాగ్దానం చేసిన వాటిని నెరవేరుస్తాడని సంపూర్ణంగా నమ్మిక ఉంచాలి. ఆయన ప్రేరేపిత వాక్యం ఇలా ప్రకటిస్తోంది: “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును; నేను యోచించినట్లు స్థిరపడును.”—యెషయా 14:24.
2 “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అనే వ్యాఖ్యానం ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చూపిస్తోంది. అందునుబట్టే ఆయన వాక్యమిలా చెప్పగల్గుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:5, 6) మనం యెహోవాయందు నమ్మకం ఉంచినప్పుడూ, ఆయన జ్ఞానం ప్రకారంగా నడిపించబడడానికి మనల్ని మనం అనుమతించుకున్నప్పుడూ, మన మార్గాలు నిశ్చయంగా నిత్యజీవానికి నడిపిస్తాయి, ఎందుకంటే దేవుని జ్ఞానం “దాని నవలంబించువారికి . . . జీవవృక్షము.”—సామెతలు 3:18; యోహాను 17:3.
ప్రాచీన కాలాల్లో నిజమైన విశ్వాసం
3. నోవహు యెహోవాయందు విశ్వాసాన్ని ఎలా చూపించాడు?
3 నిజమైన విశ్వాసాన్ని కల్గివున్న వారి పక్షాన యెహోవా చేసిన కార్యాల్ని గూర్చిన నివేదిక ఆయన నమ్మదగ్గవాడని ధృవపరుస్తోంది. ఉదాహరణకు, 4,400 సంవత్సరాలకన్నా ఎక్కువ సంవత్సరాల క్రిందట, దేవుడు నోవహుతో అతని కాలంలోని లోకం భూవ్యాప్త జలప్రళయం ద్వారా నాశనమౌతుందని చెప్పాడు. మానవుల ప్రాణాల్నీ, జంతువుల ప్రాణాల్నీ కాపాడడానికి ఒక పెద్ద ఓడను నిర్మించమని ఆయన నోవహుకు ఉపదేశించాడు. నోవహు ఎలా ప్రతిస్పందించాడు? హెబ్రీయులు 11:7 మనకిలా చెబుతోంది: “విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను.” నోవహు “అదివరకు” ఎన్నడూ సంభవించని దాని యందు, ఎన్నడూ “చూడని సంగతుల”యందు విశ్వాసాన్ని ఎందుకుంచాడు? ఎందుకంటే దేవుడు చెప్పిందంతా నిజమౌతుందని గుణగ్రహించడానికి సరిపడినన్ని దేవుని గత వ్యవహారాల్ని గురించి అంటే దేవుడు గతంలో మానవ కుటుంబంతో వ్యవహరించిన విధానాల్ని గురించి ఆయనకు తెలుసు. కాబట్టి జలప్రళయం కూడా తప్పక వస్తుందని ఆయన నిశ్చయత కలిగి ఉన్నాడు.—ఆదికాండము 6:9-22.
4, 5. అబ్రాహాము యెహోవాయందు పూర్తి నమ్మకాన్ని ఎందుకు ఉంచాడు?
4 నిజమైన విశ్వాసాన్ని గూర్చిన మరొక ఉదాహరణ అబ్రాహాము. దాదాపు 3,900 సంవత్సరాల క్రిందట అతని భార్యయైన శారాకు పుట్టిన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు చెప్పాడు. (ఆదికాండము 22:1-10) దానికి అబ్రాహాము ఎలా ప్రతిస్పందించాడు? హెబ్రీయులు 11:17 ఇలా చెబుతోంది: “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.” అయితే, చివరి క్షణంలో యెహోవా దూత ఆయనను అడ్డుకున్నాడు. (ఆదికాండము 22:11, 12) అయినా, అబ్రాహాము అలా చేయాలని ఎందుకు భావించాడు? ఎందుకో హెబ్రీయులు 11:19 ఇలా చెబుతోంది: “మృతులను [ఇస్సాకును] సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచెను.” అయితే, ఒక్కళ్లు కూడా పునరుత్థానమవ్వడాన్ని ఆయన ఎన్నడూ చూడకపోయినా, పునరుత్థానమయిన వాళ్లను గూర్చిన గత చరిత్ర ఏదీ లేకపోయినా, పునరుత్థానమందు అబ్రాహాము ఎలా విశ్వాసాన్ని ఉంచగలిగాడు?
5 దేవుడు వాళ్లకు కుమారుణ్ణి గూర్చి వాగ్దానం చేసినప్పుడు శారా వయస్సు 89 సంవత్సరాలని గుర్తుంచుకోండి. శారా గర్భం ఉడిగిపోయి పిల్లల్ని కనలేని స్థితిలో, ఇంకా చెప్పాలంటే మృతతుల్యమైన స్థితిలో ఉంది. (ఆదికాండము 18:9-14) దేవుడు శారా గర్భాన్ని పునర్జీవింపచేశాడు, ఆమె ఇస్సాకును కన్నది. (ఆదికాండము 21:1-3) దేవుడు శారా యొక్క మృతతుల్యమైన గర్భాన్ని పునర్జీవింపచేశాడు గనుక, అవసరమైతే ఆయన ఇస్సాకును కూడా పునర్జీవింపజేయగలడని అబ్రాహాముకు తెలుసు. రోమీయులు 4:20, 21 వచనాలు అబ్రాహామును గూర్చి ఇలా చెబుతున్నాయి: “అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను.”
6. యెహోషువ యెహోవానందు నమ్మకాన్ని ఎలా వ్యక్తపర్చాడు?
6 మూడువేల నాలుగు వందలకన్నా ఎక్కువ సంవత్సరాల క్రిందట, యెహోషువ తనకు నూరేళ్ళు పైబడ్డాక, దేవుడు ఎంత నమ్మదగినవాడనే విషయాన్ని ఓ జీవితకాలంపాటు అనుభవపూర్వకంగా తెలుసుకొనిన తర్వాత, తన నమ్మకానికి గల కారణాన్ని ఆయనిలా తెలియజేశాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహోషువ 23:14.
7, 8. మొదటి శతాబ్దంలోని విశ్వాసులైన క్రైస్తవులు ప్రాణాల్ని రక్షించుకునే ఏ చర్యను చేపట్టారు, ఎందుకు?
7 దాదాపు 1,900 సంవత్సరాల క్రిందట వినయస్థులైన అనేకమంది ప్రజలు నిజమైన విశ్వాసాన్ని చూపించారు. బైబిలు ప్రవచనాల నెరవేర్పునుండి వాళ్లు యేసే మెస్సీయ అని గ్రహించి, ఆయన బోధల్ని అంగీకరించారు. వాస్తవాలపైనా, హెబ్రీ లేఖనాలపైనా పటిష్ఠమైన ఆధారాన్ని కల్గివుండి, యేసు బోధించినవాటిపై విశ్వాసాన్ని ఉంచారు. ఆ విధంగా, విశ్వాసఘాతుకాన్నిబట్టి యూదయ, యెరూషలేములపై దేవుని తీర్పు వస్తుందని యేసు చెప్పినప్పుడు, వాళ్లు ఆయన్ని విశ్వసించారు. తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి వాళ్లే చర్యల్ని చేపట్టాలో ఆయన వారికి చెప్పినప్పుడు, వారలాగే చేశారు.
8 యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టినప్పుడు పారిపోవాలని యేసు విశ్వాసులకు చెప్పాడు. సా. శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేము మీదికి వచ్చాయి. అయితే రోమా సైన్యాలు ఏదో చెప్పనలవిగాని కారణాన్నిబట్టి వెనుదిరిగి వెళ్లిపోయాయి. పట్టణాన్ని విడిచి పారిపోవడానికి అదొక సంకేతమైవుంది. ఎందుకంటే యేసు వారికిలా చెప్పాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండు వారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:20, 21) నిజమైన విశ్వాసం గలవారు యెరూషలేమునూ దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్నీ విడిచి సురక్షిత ప్రాంతానికి పారిపోయారు.
విశ్వాసం లేకపోవడం మూలాన కలిగిన పరిణామాలు
9, 10. (ఎ) మత నాయకులు యేసునందు తమ అవిశ్వాసాన్ని ఎలా చూపించారు? (బి) ఆ విశ్వాసరాహిత్యం మూలంగా కల్గిన పర్యవసానాలు ఏవి?
9 నిజమైన విశ్వాసం లేనివారు ఏమిచేశారు? వాళ్లకు పారిపోయే అవకాశమున్నా పారిపోలేదు. వాళ్లు తమ నాయకులు తమను కాపాడగలరని అనుకొన్నారు. కానీ, ఆ నాయకులూ, వారి అనుచరులూ యేసే మెస్సీయ అనడానికి గల రుజువును చూశారు. మరి ఆయన చెప్పినదాన్ని వాళ్లెందుకు అంగీకరించలేదు? వాళ్ల దుష్ట హృదయ స్థితిని బట్టే. ఇది, మునుపు యేసు లాజరును పునరుత్థానం చేసిన తర్వాత సామాన్య ప్రజల్లో అనేకులు యేసు దగ్గరకు వెళ్లడాన్ని వాళ్లు చూసినప్పుడే బయల్పర్చబడింది. యోహాను 11:47, 48 ఇలా వివరిస్తోంది: “ప్రధాన యాజకులును పరిసయ్యులును మహాసభను [యూదుల ఉన్నత న్యాయస్థానం] సమకూర్చి—మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు [యేసు] అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన యెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.” 53వ వచనం ఇలా చెబుతోంది: “కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి.”
10 లాజరును మృతులలో నుండి పునరుత్థానం చేస్తూ యేసు ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చేశాడోకదా! అయితే, అలా చేసినందుకు ఆ మత నాయకులు యేసును చంపాలనుకున్నారు. “అతనినిబట్టి [లాజరునుబట్టి] యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచన” చేసినప్పుడు వారి ఘోర దుష్టత్వం మరింతగా వెల్లడయ్యింది. (యోహాను 12:10, 11) లాజరు అప్పుడే మృతులలోనుండి లేపబడ్డాడు, ఆ మత నాయకులు అతడు మరలా చావాలని కోరుకున్నారు! దేవుని చిత్తాన్ని గూర్చి గానీ లేక ప్రజల క్షేమాన్ని గూర్చి గానీ వాళ్లకు శ్రద్ధలేదు. వాళ్లు స్వార్థపరులు. వాళ్లకు తమ పదవులపై, తమ ప్రయోజనాలపై మాత్రమే శ్రద్ధ. “వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.” (యోహాను 12:43) అయితే వాళ్లు తమ విశ్వాసరాహిత్యానికి తగిన మూల్యాన్ని చెల్లించారు. సా.శ. 70లో రోమా సైన్యాలు తిరిగివచ్చి వాళ్ల స్థలాన్నీ, వాళ్ల జనాంగాన్నీ నాశనం చేశారు, అలాగే వారిలో అనేకుల ప్రాణాల్ని తీశారు.
మన కాలంలో ప్రదర్శించబడిన విశ్వాసం
11. ఈ శతాబ్దపు తొలి భాగంలో, నిజమైన విశ్వాసం ఎలా ప్రదర్శించబడింది?
11 ఈ శతాబ్దంలో కూడా, నిజమైన విశ్వాసాన్ని కల్గివున్న స్త్రీ పురుషులు అనేకమంది ఉన్నారు. ఉదాహరణకు, వెనుకటికి 1900ల తొలి భాగంలో సామాన్య జనావళి ఒక శాంతియుతమైన, వర్థిల్లే భవిష్యత్తు కొరకు ఎదురు చూసేవారు. అదే సమయంలో యెహోవాయందు విశ్వాసాన్నుంచిన వాళ్లు, చరిత్రలో అత్యంత కష్టభరితమైన కాలంలోకి మానవజాతి ప్రవేశించబోతుందని ప్రకటించారు. మత్తయి 24వ అధ్యాయంలోనూ, 2 తిమోతి 3వ అధ్యాయంలోనూ, ఇంక వేరేచోట్లా దేవుని వాక్యం ప్రవచించినదదే. విశ్వాసులైన ఈ ప్రజలు చెప్పింది, 1914లో మొదటి ప్రపంచ సంగ్రామంతో ఆరంభమై నిజంగానే జరిగింది. ప్రపంచం, ప్రవచించబడిన “అంత్యదినములలో”నికి అంటే “అపాయకరమైన కాలముల”తో కూడిన అంత్యదినాల్లోకి నిశ్చయంగా ప్రవేశించింది. (2 తిమోతి 3:1) అప్పట్లో ప్రపంచ స్థితిగతుల్ని గురించి ఇతరులు తెలుసుకోలేని సత్యాన్ని యెహోవా సేవకులు దేన్నిబట్టి తెలుసుకోగల్గారు? యెహోషువ లాగే, యెహోవా సెలవిచ్చిన వాటిలో ఏ ఒక్క మాటకూడా విఫలంకాదనే విశ్వాసాన్ని కలిగి ఉండడాన్నిబట్టే వాళ్లు తెలుసుకోగల్గారు.
12. యెహోవా చేసిన ఏ వాగ్దానమందు ఆయన సేవకులు నేడు పూర్ణ నమ్మకాన్ని ఉంచుతున్నారు?
12 యెహోవాయందు నమ్మకముంచే ఆయన సేవకులు నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. దేవుని ప్రవచనాత్మక వాక్య నెరవేర్పులో ఉన్న రుజువును బట్టి, ఆయన త్వరలోనే ఈ హింసాయుత, అనైతిక విధానానికి అంతం తెస్తాడని వాళ్లెరిగి ఉన్నారు. కాబట్టి, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును” అని చెబుతున్న 1 యోహాను 2:17 నెరవేర్పు దగ్గరయ్యిందని వారు నమ్ముతున్నారు. యెహోవా ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఆయన సేవకులు పూర్ణ నమ్మకాన్ని ఉంచారు.
13. మీరు యెహోవాను ఎంతమేరకు నమ్మగలరు?
13 మీరు ఎంత మేరకు యెహోవాను నమ్మగలరు? సంపూర్ణంగా ఆయనయందు నమ్మకముంచవచ్చు! ఆయన సేవ చేస్తున్నందున మీరు మీ ప్రాణాన్నిప్పుడు కోల్పోయినా సరే, పునరుత్థానమందు ఆయన మీకు మరి శ్రేష్ఠమైన జీవాన్ని మరలా ఇస్తాడు! యేసు మనకిలా అభయమిస్తున్నాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలోనున్న [అంటే, దేవుడు జ్ఞాపకముంచుకున్న] వారందరు ఆయన శబ్దము విని . . . బయటకు వచ్చెదరు.” (యోహాను 5:28, 29) అలా చేయగల ఏ వైద్యుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ విజ్ఞాన శాస్త్రవేత్తైనా, ఏ వాణిజ్యవేత్తైనా, లేదా మరే ఇతర మానవులైనా మీకు తెలుసా? వాళ్లలా చేయలేరని, వాళ్ల గత చరిత్ర చూపిస్తోంది. యెహోవా చేయగలడు, మరి ఆయన దాన్ని చేస్తాడు!
విశ్వాసులకు ఓ అద్భుతమైన భవిష్యత్తు
14. విశ్వాసులకు ఏ అద్భుతకరమైన భవిష్యత్తును దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది?
14 “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” అని చెబుతూ, దేవుని రాజ్యాధికారం క్రింద ఉండే నూతన లోకం తప్పకుండా వస్తుందని యేసు సూచించాడు. (మత్తయి 5:5) కీర్తన 37:29లోని ఈ వాగ్దానాన్ని ఆ మాటలు మళ్ళీ దృఢపర్చాయి: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” యేసు మరణించడానికి కొంచెం ముందు నేరస్థుడొకరు ఆయనయందు తన విశ్వాసాన్ని వ్యక్తపర్చినప్పుడు, “నీవు నాతో కూడ పరదైసులో ఉందువు” అని యేసు ఆ వ్యక్తితో చెప్పాడు. (లూకా 23:43) అవును, ఆ వ్యక్తి పరదైసులో నిరంతరమూ జీవించే అవకాశంతో భూమిపై జీవించడానికి పునరుత్థానం అయ్యేలా దేవుని రాజ్యానికి రాజుగా యేసు చూస్తాడు. నేడు, యెహోవా రాజ్యమందు విశ్వాసాన్నుంచే వాళ్లందరూ “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివే[సే], మరణము ఇక ఉండ[ని], దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండ[ని]” పరదైసులో జీవించడానికి ఎదురు చూడవచ్చు.—ప్రకటన 21:4.
15, 16. నూతన లోకంలో జీవితం ఎందుకంత శాంతియుతంగా ఉంటుంది?
15 మన మనస్సుల్ని ఆ నూతన లోకంలోకి తీసుకెళ్లి దానిపై కేంద్రీకరిద్దాం. మనం ఇప్పటికే ఆ లోకంలో జీవిస్తున్నామని ఊహించండి. అన్నిచోట్ల ఉన్న ప్రజలు సంపూర్ణమైన సమాధానంతో సంతోషంగా కలిసిమెలసి జీవిస్తున్నట్టు మనకు ఎవ్వరూ చెప్పకుండానే మనం వెంటనే గమనిస్తాం. వాళ్లు యెషయా 14:7వ వచనంలో (పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) వర్ణించబడిన పరిస్థితుల్ని పోలిన పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు: “ఇప్పుడు లోకమంతా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. జనాలు ఆనంద గీతాలు ఆలపిస్తారు.” వాళ్లెందుకలా ప్రవర్తిస్తున్నారు? ఒక కారణమేమంటే, ఇళ్ల తలుపులకు తాళాలు లేవు. నేరంగానీ బలాత్కారంగానీ లేదు గనుక వాటి అవసరతే లేకుండా పోయింది. అంతా దేవుని వాక్యం చెప్పినట్లుగానే ఉంది: “ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును.”—మీకా 4:4.
16 యుద్ధం కూడా లేదు, ఎందుకంటే ఈ నూతన లోకంలో యుద్ధం నిషేధించబడింది. యుద్ధాయుధాలన్నీ శాంతి పరికరాలుగా మార్చబడ్డాయి. పూర్తి భావంలో యెషయా 2:4 నెరవేరింది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” మనం ఎదురు చూసిందదే! ఏ కారణాన్నిబట్టి? నూతనలోక నివాసుల్లో అనేకులు, పాతలోకంలో దేవుని సేవ చేస్తుండగానే అలా చేయడాన్ని నేర్చుకున్నదాన్నిబట్టే.
17. దేవుని రాజ్యం క్రింద ఏ జీవన పరిస్థితులు ఉంటాయి?
17 పేదరికం లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించారు. ఎవరూ పూరి గుడిసెల్లో జీవించడంలేదు. పాత గుడ్డలు ధరించడంలేదు లేదా నిరాశ్రయులుగా లేరు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన గృహం ఉంది, రమ్యమైన చెట్లతోనూ, పూలమొక్కలతోనూ చక్కగా తీర్చిదిద్దివున్న స్థలంవుంది. (యెషయా 35:1, 2; 65:21, 22; యెహెజ్కేలు 34:27) అందరికీ సమృద్ధికరమైన ఆహారం ఉంటుందని తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు గనుక అక్కడ ఆకలి ఉండదు: “దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) వెనుకటికి ఏదెను వనంలో దేవుడు సంకల్పించినట్లుగానే దేవుని రాజ్య నడిపింపు క్రింద మహిమకరమైన పరదైసు నిశ్చయంగా భూమియందంతటా విస్తరించబడుతుంది.—ఆదికాండము 2:8.
18. నూతన లోకంలో, ప్రజల్ని ఇక ఏ యే విషయాలు భయపెట్టవు?
18 ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానూ, బలంగానూ ఉండటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్లిప్పుడు పరిపూర్ణమైన శరీరాల్నీ, మనస్సుల్నీ కలిగి ఉన్నందుననే ఇది సాధ్యమైంది. రోగమూ, వేదనా లేదా మరణమూ ఇక లేవు. చక్రాల కుర్చీల్లో లేదా ఆసుపత్రి మంచాలపైనా ఇక ఎవ్వరూ లేరు. అవన్నీ శాశ్వతంగా గతించిపోయాయి. (యెషయా 33:24; 35:5, 6) అంతెందుకు, జంతువులన్నీ దేవుని శక్తిచే సాధుపర్చబడ్డాయి గనుక ఇక ఏ జంతువూ ప్రాణ హానిని కల్గించదు!—యెషయా 11:6-8; 65:25; యెహెజ్కేలు 34:25.
19. నూతన లోకంలోని ప్రతీరోజూ ‘ఆనందభరితంగా’ ఉండే రోజు ఎందుకౌతుంది?
19 ఈ నూతన లోకపు విశ్వాసులైన నివాసులచే ఎంత అద్భుతమైన నాగరికత రూపొందించబడిందో గదా! వాళ్ల శక్తి సామర్థ్యాలూ, భూమ్మీదనున్న సంపదా, హానికరమైన లక్ష్యాలనుగాక ప్రయోజనకరమైన వాటిని వెంబడించడానికీ; ఇతరులతో పోటీపడడానికిగాక వారితో సహకరించడానికీ ఉపయోగించబడుతున్నాయి. మీరు కలుసుకునే ప్రతి వ్యక్తీ నమ్మదగిన వ్యక్తే, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినట్లుగానే, ప్రజలందరూ “యెహోవా చేత ఉపదేశము” పొందిన వ్యక్తులే. (యెషయా 54:13) ప్రతీ వ్యక్తీ దేవుని నియమాల ద్వారా నడిపించబడుతున్నాడు గనుక, “సముద్రము జలముతో నిండియున్నట్టు, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో” నిండివుంది. (యెషయా 11:9) “ఆనందభరితులవు”తారని కీర్తన 37:11 (పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) చెప్పినట్లే ఈ నూతన లోకంలో గడిచే ప్రతీరోజూ నిజంగానే ఆనందభరితమైన రోజుగా ఉంటుంది.
సంతోషకరమైన భవిష్యత్తు నిశ్చయం
20. శాంతియుతమైన భవిష్యత్తును ఆనందించడానికి మనమేం చెయ్యాలి?
20 అలాంటి సంతోషకరమైన భవిష్యత్తులో భాగస్థులుగా ఉండడానికి మనమేం చెయ్యాలి? యెషయా 55:6 మనకిలా చెబుతోంది: “యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.” మనం వెదకుతుండగా, మన దృక్పథం కీర్తన 143:10లో వర్ణించబడినట్లుగా ఉండాలి: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.” ఇలా చేసేవాళ్లు ఈ అంత్యదినాల్లో యెహోవా ఎదుట నిందారహితులుగా నడుచుకోగలరు, ఒక శ్రేష్ఠమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూడగలరు. “నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.”—కీర్తన 37:37, 38.
21, 22. నేడు దేవుడు దేన్ని రూపొందిస్తున్నాడు, తర్ఫీదు ఎలా సాధించబడుతుంది?
21 యెహోవా తన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడే వారిని ప్రతి జనాంగంలో నుండీ ఇప్పుడే పిలుస్తున్నాడు. బైబిలు ప్రవచనం ప్రవచించినట్లుగానే, ఆయన వారిని తన నూతన భూ సమాజపు పునాదిగా రూపొందిస్తున్నాడు: “అంత్యదినములలో [మనమిప్పుడు జీవిస్తున్న కాలంలో] . . . జనులు గుంపులు గుంపులుగా వచ్చి—. . . యెహోవా పర్వతమునకు [ఆయన యొక్క ఉన్నతపర్చబడిన సత్యారాధనకు] మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2, 3.
22 వీళ్లను ప్రకటన 7:9వ వచనం, “ప్రతి జనములో నుండియు, ప్రతివంశములో నుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి[న] . . . యొక గొప్ప సమూహము” అని వర్ణిస్తోంది. 14వ వచనం ఇలా చెబుతోంది: “వీరు” ప్రస్తుత విధానాంతం నుండి తప్పించుకొని “మహాశ్రమలనుండి వచ్చినవారు.” నూతన లోకపు ఈ పునాది ఇప్పుడు దాదాపు 60 లక్షలమందితో బలంగా ఉంది. ప్రతీ సంవత్సరం అనేకమంది క్రొత్తవారు దీనిలో భాగస్థులౌతున్నారు. యెహోవా దేవుని విశ్వసనీయ సేవకులైన వీరంతా ఆయన నూతన లోకంలోని జీవితం కొరకు తర్ఫీదు పొందుతున్నారు. ఈ భూమిని పరదైసుగా మార్చడానికి కావల్సిన ఆధ్యాత్మిక నైపుణ్యాల్నీ, మరితర నైపుణ్యాల్నీ వాళ్లు నేర్చుకుంటున్నారు. “వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు” గనుక వాళ్లు ఆ పరదైసు ఒక వాస్తవమౌతుందని పూర్తిగా నమ్ముతారు.—హెబ్రీయులు 10:23.
పునఃసమీక్ష కొరకైన అంశాలు
◻ మొదటి శతాబ్దంలోని విశ్వాసరాహిత్యం వల్ల కలిగిన పర్యవసానాలేమిటి?
◻ దేవుని సేవకులు ఆయన్ని ఎంతమేరకు నమ్మవచ్చు?
◻ విశ్వాసుల కొరకు ఎలాంటి భవిష్యత్తు భద్రపర్చబడివుంది?
◻ దేవుని నూతన లోకంలో మన కొరకు సంతోషకరమైన భవిష్యత్తును నిశ్చయపర్చుకోవడానికి మనమేం చెయ్యాలి?
[18వ పేజీలోని చిత్రం]
యెహోవా నూతన భూ సమాజపు పునాదిని ఇప్పుడే రూపొందిస్తున్నాడు