మీరు జీవాన్ని ప్రేమిస్తారా?
“నన్ను వెలుగు చూడనివ్వండి.” ఈ మాటలు ఇటలీ కవి అయిన జకోమో లిపార్డీ తన మరణానికి ముందు, తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నవారితో అన్న మాటలని నివేదించబడుతుంది. వెలుగుచే ప్రాతినిధ్యం వహించబడుతున్న జీవంతో మానవునికున్న విడదీయలేని అనుబంధాన్ని ఆ మాటలు సూచిస్తున్నాయి.
జీవంతో మానవునికున్న అనుబంధం ఒక అమూల్యమైన మానసిక ప్రేరణ, మానవులు ప్రమాదాలను నివారించడానికీ, జీవనం కొనసాగించేందుకు తాము చేయగలిగినదంతా చేయడానికీ అది వారిని పురికొల్పుతుంది. ఈ విషయంలో మానవునికి జంతువులకు పెద్ద తేడా లేదు ఎందుకంటే అవి కూడా జీవించాలనే బలమైన సహజ ప్రవృత్తిని కలిగివున్నాయి.
కాని ఏ విధమైన జీవితం నిజంగా జీవించదగినది, అపేక్షించదగినది? అది కేవలం ఉఛ్వాసనిశ్వాసలతో కూడినదీ, చలించేదీ అయిన శారీరక ఉనికి మాత్రమే కాదు. జీవితాన్ని వీలైనంతగా అనుభవిద్దాం అనేలాంటి దృక్పథం నుండి సాధారణంగా సంతృప్తి లభించదు. “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనే ఎపికూరీయుల తత్వం ప్రజలకు సాధారణంగా సంతృప్తిని తీసుకురాలేకపోయింది. (1 కొరింథీయులు 15:32) మానవునికి ప్రాథమిక వస్తుసంబంధ అవసరాలు ఎన్నో ఉన్నప్పటికీ, అతనికి సాంస్కృతికమైన, సామాజికమైన ఆసక్తులు కూడా ఉన్నాయి, సర్వోన్నతుని యందు నమ్మకంతో ముడిపెట్టబడివున్న ఆధ్యాత్మిక అవసరాల గురించైతే ఇక చెప్పనవసరం లేదు. విచారకరంగా, భూగోళ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోవున్న దుర్భరమైన సామాజిక, పర్యావరణ పరిస్థితులను బట్టి కోట్లాదిమంది ప్రజలు అతికష్టంతో జీవనం కొనసాగించగల్గుతున్నారు, అంతేగాని అంతకంటే ఎక్కువేమీ పొందలేకపోతున్నారు. తినటం, త్రాగటం, ఆస్తిపాస్తులు కలిగివుండటం లేక లైంగిక కోరికలను తృప్తిపర్చుకోవటం వంటి శారీరక అవసరాలను తీర్చుకోవడానికే ప్రాథమికంగా తమను తాము పరిమితం చేసుకునే ఎవరైనా దాదాపు జంతుప్రవృత్తితో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్లే, దాని నుండి వాళ్లు నామమాత్రపు సంతృప్తిని పొందగలరంతే. తత్ఫలితంగా, మానవ మేధనూ, భావోద్రేకాలనూ సంతృప్తిపర్చుకోవడానికి జీవితం అనుగ్రహిస్తున్న మరింత అర్థవంతమైన వనరులను వారు ఎంత మాత్రం ఉపయోగించుకోరు. అంతేగాక, కేవలం తమ స్వార్థపర కోరికలను తీర్చుకోవడానికే ప్రయత్నించేవారెవరైనా జీవితం నుండి శ్రేష్ఠమైన దాన్ని పొందలేకపోవడమే గాక తాము నివసిస్తున్న సమాజానికి సహితం హాని కలుగజేస్తారు, వాళ్లు ఇతరుల ఆసక్తులను పెంపొందింపజేయరు.
బాల నేరస్థులతో వ్యవహరించే ఒక జడ్జి దీన్ని ధృవీకరిస్తూ, “విలువలను గురించిన సంక్షోభాలు, చెడ్డవారిని ఆదర్శప్రాయులుగా ప్రస్తుతించడం, సత్వరంగా ధనికులయ్యే పద్ధతుల ద్వారా విజయం సాధించడం” వంటివి “విపరీతమైన పోటీ తత్వాన్ని పెంపొందింపజేస్తున్నట్లు” కనిపిస్తుందని చెప్తున్నాడు. ఇది, సమాజానికి హానికరంగా ఉండే, యువతకు నాశనకరంగా ఉండే ప్రవర్తనకు దారి తీస్తుంది, ప్రాముఖ్యంగా యువత మాదకద్రవ్యాలవైపుకు తిరిగినప్పుడు అది వారికి మరింత నాశనకరంగా పరిణమిస్తుంది.
సుందరమైన స్థలాల్లో సెలవులు గడపటం, ఆసక్తికరమైన విషయాల గురించి చదవటం లేక పరిశోధన చేయటం, ఆహ్లాదకరమైన సాహచర్యం, వీనులవిందైన సంగీతం వంటి ఎన్నో ఆకర్షణలను జీవితం మనముందుంచుతుందని మీకు తెలుసు. చిన్న, పెద్ద సంతృప్తులను తీసుకువచ్చే ఇతర కార్యకలాపాలూ ఉన్నాయి. దేవునియందు, ప్రాముఖ్యంగా బైబిలు దేవుడైన యెహోవాయందు గట్టి నమ్మకం గలవారికి, జీవాన్ని ప్రేమించేందుకు ఎక్కువ కారణాలుంటాయి. కష్టసమయాలతో వ్యవహరించడానికి ప్రజలకు సహాయం చేయగల బలానికీ, ప్రశాంతతకూ మూలం నిజమైన విశ్వాసమే. సత్య దేవునియందు నమ్మకముంచేవారు దృఢంగా ఇలా చెప్పగలరు: “[యెహోవా] నాకు సహాయుడు, నేను భయపడను.” (హెబ్రీయులు 13:6) దేవుని ప్రేమ గురించి తెలిసిన వారు ఆయనచే ప్రేమించబడినట్లు భావిస్తారు. వాళ్లు ఆయన ప్రేమకు ప్రతిస్పందించి, దాని నుండి ప్రగాఢమైన ఆనందాన్ని పొందుతారు. (1 యోహాను 4:7, 8, 16) వాళ్లు సంతృప్తికి మూలమైన క్రియాశీల, నిస్వార్థపూరిత జీవితాన్ని గడపగల్గుతారు. అది సరిగ్గా యేసుక్రీస్తు చెప్పినదానిలా ఉంటుంది: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
విచారకరంగా, ప్రస్తుత జీవితానికి మరో కోణం ఉంది. విస్తృతమైన వేదన, అన్యాయం, పేదరికం, అనారోగ్యం, మరణం వంటివి జీవితాన్ని తరచూ సహించలేనిదిగా చేసే బాధాకరమైన అంశాల్లో కేవలం కొన్ని మాత్రమే. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి చెందిన శ్రీమంతుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు అయిన రాజైన సొలొమోనుకు, ప్రజలను సంతోషవంతులను చేయగల వనరులేవీ తక్కువ కాలేదు. అయినప్పటికీ, ఆయనను బాధపర్చినదొకటుంది—తాను ‘ప్రయాసపడి చేసిన పనులన్నిటిని’ అంటే “జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను” తాను సంపాదించుకున్న దాన్నంతటిని తన మరణమప్పుడు తన తరువాత వచ్చేవారికి విడిచిపెట్టాలన్న వాస్తవాన్ని గ్రహించటం.—ప్రసంగి 2:17-21.
సొలొమోనులా, చాలామందికి రెప్పపాటులో గతించిపోయే జీవితపు క్షణభంగురత్వం గురించి తెలుసు. దేవుడు ‘మన హృదయాల్లో శాశ్వతకాల జ్ఞానమును ఉంచాడని’ లేఖనాలు చెప్తున్నాయి. (ప్రసంగి 3:11) ఈ శాశ్వతకాల తలంపు మానవుడు జీవితపు క్షణభంగురత్వం గురించి యోచించేలా చేస్తుంది. చివరికి, జీవన్మరణాల అర్థానికి సహేతుకమైన సమాధానాలను కనుగొనలేక ఒకరు నిరాశా భావాలతోనూ, వ్యర్థతతోనూ కృంగిపోవచ్చు. అది జీవితాన్ని దుఃఖమయం చేయవచ్చు.
మానవునికున్న వేదనభరితమైన ప్రశ్నలకు సమాధానాలున్నాయా? జీవితాన్ని మరింత ఆకర్షణీయమైనదిగా, నిరంతరం నిలిచేదిగా చేసే పరిస్థితులు ఎన్నటికైనా వస్తాయా?