కోపం మిమ్మల్ని ఏలనివ్వకండి
“గాఢంగా శ్వాసించండి!” “ఒకటి నుండి పది అంకెల వరకు లెక్కించండి!” “విషయాన్ని అక్కడితో ఆపేయండి!” ఈ మాటలు మీకు సుపరిచితమైనవేనా? బహుశ అంతర్గత ఆందోళనను తగ్గించుకోవడానికి మీకు మీరు ఆ మాటల్ని గుర్తు చేసుకుంటుండవచ్చు. కొంతమంది పెల్లుబుకే ఆగ్రహాన్ని నిగ్రహించుకోవటానికి అలా వాహ్యాళికి వెళతారు. కోపాన్ని నిగ్రహించుకుని ఇతరులతో సంబంధాలను కాపాడుకోవటానికి ఇవి సరళమైన మార్గాలు.
అయితే, ఇటీవలి సంవత్సరాల్లో, కోపాన్ని నియంత్రించుకోవడం నిగ్రహించుకోవడం గురించి నిపుణులిస్తున్న పరస్పర విరుద్ధమైన సలహాలు అనేకులను అయోమయంలో పడవేస్తున్నాయి. ఉదాహరణకు, కోపాన్ని “వెళ్లగ్రక్కడం మీకు ఉపశమనాన్నిస్తే,” అలాగే చేయండి అన్న సిద్ధాంతాన్ని కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు పెంపొందింపజేశారు. “ప్రమాదకర కారకాలైన పొగత్రాగటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటితో కంటే” తరచూ కోపాన్ని వెళ్లగ్రక్కటం మూలంగా “అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని” ఇతరులు హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా ఇలా చెప్తుంది: “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్తన 37:8) బైబిలు ఎందుకంత నిర్దిష్టమైన సలహాను ఇస్తోంది?
అదుపులేని భావోద్రేకాలు అదుపులేని చర్యలకు దారితీస్తాయి. ఇది మానవ చరిత్రలోని చాలా తొలి కాలంలోనే స్పష్టమైంది. మనమిలా చదువుతాము: “కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొ[న్నాడు].” ఇది ఆయనను ఎక్కడికి నడిపించింది? ఆయన కోపం ఆయనను వశపర్చుకుని ఆయనను ఎంతగా అదుపులోకి తీసుకుందంటే, మంచి చేయడం వైపుకు తిరగమని యెహోవా ఇస్తున్న ఉపదేశాన్ని వినకుండా అది అతని హృదయాన్ని కఠినపర్చింది. కయీనుకు వచ్చిన అదుపులేని కోపం అతడు ఘోరమైన పాపం చేయడానికి అంటే తన సహోదరుడ్ని హత్య చేయడానికి నడిపించింది.—ఆదికాండము 4:3-8.
ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు, దావీదుకు ఎక్కువ స్తుతి లభించిందని తెలుసుకున్నప్పుడు అలా కోపానికి లోనయ్యాడు. “ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయంచుచు—సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొ[నెను].” కోపం సౌలు ఆలోచనా విధానాన్ని ఎంతగా అదుపు చేసిందంటే, అది అతడు అనేకసార్లు దావీదును చంపడానికి ప్రయత్నించేలా చేసింది. స్నేహం కోసం దావీదు చొరవ తీసుకున్నప్పటికీ, సౌలు సమాధానాన్ని వెంబడించడానికి, రాజీకి రావడానికి ఇష్టపడలేదు. చివరికి అతడు యెహోవా అనుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయాడు.—1 సమూయేలు 18:6-11; 19:9, 10; 24:1-21; సామెతలు 6:34, 35.
ఎవరైనా అదుపులేని కోపానికి లోనైతే, ఆమెగాని అతడుగాని తత్సంబంధితులనెవరినైనా గాయపరిచే మాటలు అనడం, అలాంటి క్రియలు చేయడం తప్పనిసరి. (సామెతలు 29:22) కయీను, సౌలు ఇద్దరూ కోపం తెచ్చుకున్నారు, ఇద్దరూ తమ తమ విధాల్లో అసూయతో ఉన్నారు, ఈర్ష్యపడ్డారు. అయితే, కోపంతో కూడిన ప్రతిస్పందనలు అనేక కారణాలను బట్టి ఉత్పన్నం కావచ్చు. అన్యాయమైన విమర్శ, అవమానం, అపార్థం, లేక అనుచితమైన వ్యవహారం వంటివి ఆగ్రహజ్వాల రగులుకోవడానికి దోహదపడే నిప్పురవ్వ లాంటివి.
కయీను సౌలుల ఉదాహరణలు వారిద్దరికీ ఉన్న ఒక గంభీరమైన కొరతను సూచిస్తున్నాయి. కయీను తెచ్చిన అర్పణలో విశ్వాస పురికొల్పు కొరవడిందని స్పష్టమౌతుంది. (హెబ్రీయులు 11:4) యెహోవా స్పష్టంగా ఇచ్చిన ఆజ్ఞలకు సౌలు విధేయత చూపించలేకపోవడమూ, అతడు తనను తాను సమర్థించుకోవడానికి ఆ తర్వాత చేపట్టిన చర్యలూ అతడు దేవుని అనుగ్రహాన్ని, దేవుని ఆత్మను కోల్పోయేలా చేశాయి. స్పష్టంగా, ఆ ఇద్దరు వ్యక్తులూ యెహోవాతో తమకున్న సంబంధాన్ని తెంచివేసుకున్నారు.
అలాంటి గుణాలను, సౌలు తనతో వ్యవహరిస్తున్న విధానాన్ని బట్టి కోపం తెచ్చుకోవడానికి కారణంవున్న దావీదు గుణాలతో పోల్చి తేడాను చూడండి. దావీదు తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఎందుకు? ఆయనిలా చెప్పాడు: “యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను.” యెహోవాతో తనకున్న సంబంధం గురించి దావీదు స్పష్టంగా తెలుసు, అది సౌలుతో ఆయన వ్యవహారాలను ప్రభావితం చేసింది. ఆయన వినయంతో విషయాలను యెహోవా చేతుల్లో పెట్టాడు.—1 సమూయేలు 24:6, 15.
వాస్తవానికి, అదుపులేని కోపం వల్ల వచ్చే పర్యవసానాలు గంభీరంగా ఉంటాయి. అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి.” (ఎఫెసీయులు 4:26) నీతియుక్తమైన ఆగ్రహానికి దాని స్థానం దానికి ఉన్నప్పటికీ, కోపం మనకు అభ్యంతర కారణం కాగల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం మన కోపాన్ని అదుపుచేసుకునే విషయంలో సవాలు నెదుర్కోవలసి వస్తుందంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. మనం ఎలా అదుపుచేసుకోగలం?
ఒక ప్రాథమికమైన మార్గం ఏమిటంటే, యెహోవాతో బలమైన సంబంధాన్ని వృద్ధిచేసుకోవడమే. మీ హృదయాన్ని, మనస్సును ఆయన ఎదుట కుమ్మరించమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఆయనకు మీ చింతల గురించి, మీరు వ్యాకులపడే విషయాల గురించి చెప్పండి, కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రశాంతమైన హృదయాన్నివ్వమని ఆయనను అడగండి. (సామెతలు 14:30) యెహోవా “కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి” అని నిశ్చయత కల్గివుండండి.—1 పేతురు 3:12.
ప్రార్థన మిమ్మల్ని మలిచి, మీకు నడిపింపు నివ్వగలదు. ఏ విధంగా? ఇతరులతో మీ వ్యవహారాలపై అది ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించగలదు. యెహోవా మీతో ఎలా వ్యవహరించాడో గుర్తుంచుకోండి. లేఖనాలు చెప్తున్నట్లుగా, యెహోవా “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు.” (కీర్తన 103:10) “సాతాను మనలను మోసపరచకుండునట్లు,” మనం క్షమించే స్ఫూర్తిని కల్గివుండటం ప్రాముఖ్యం. (2 కొరింథీయులు 2:10, 11) అంతేగాక, ప్రార్థన మీ హృదయం పరిశుద్ధాత్మ నడిపింపును స్వీకరించేలా మీ హృదయాన్ని తెరవడానికి సహాయం చేస్తుంది, పరిశుద్ధాత్మ బలంగా పాతుకుపోయిన జీవన విధానాలను మార్చగలదు. కోపం యొక్క పిడికిలి నుండి మిమ్మల్ని విముక్తులను చేసే ‘సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును’ యెహోవా మనకు ఆనందంగా ఇస్తాడు.—ఫిలిప్పీయులు 4:7.
అయితే, ప్రార్థనతోపాటు, యెహోవా “చిత్తమేమిటో గ్రహించు”కొనేందుకు లేఖనాలను క్రమంగా పరిశోధించడం కూడా అవసరం. (ఎఫెసీయులు 5:17; యాకోబు 3:17) మీకు మీ కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టంగా ఉంటే, ఆ విషయంపై యెహోవా అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా కోపాన్ని అదుపు చేసుకోవడానికి సంబంధించిన లేఖనాలను పునఃపరిశీలించండి.
అపొస్తలుడైన పౌలు ఈ ప్రాముఖ్యమైన జ్ఞాపికను ఇస్తున్నాడు: “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10) ఇతరులకు మేలు చేయడంపైనే మీ తలంపులను, కార్యములను కేంద్రీకరించండి. అలాంటి ఆరోగ్యదాయకమైన, అనుకూలమైన కార్యకలాపాలు తదనుభూతిని, నమ్మకాన్ని ప్రోత్సహించి, సులభంగా కోపానికి దారితీయగల అపార్థాలను తగ్గిస్తాయి.
కీర్తన గ్రంథకర్త ఇలా చెప్పాడు: “నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు.” (కీర్తన 119:133, 165) అది మీ విషయంలో కూడా నిజం కాలదు.
[9వ పేజీలోని బాక్సు]
కోపాన్ని నిగ్రహించుకోవటానికి మార్గాలు
◻ యెహోవాకు ప్రార్థించండి.—కీర్తన 145:18.
◻ ప్రతిరోజు లేఖనాలను పరిశీలించండి.—కీర్తన 119:133, 165.
◻ ఉపయోగకరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండండి.—గలతీయులు 6:9, 10.