బయలు ఆరాధన—ఇశ్రాయేలీయుల హృదయాలను గెల్చుకోవడానికి జరిగిన పోరాటం
దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు, ఇశ్రాయేలు జనాంగాల హృదయాలను గెల్చుకోవడానికి ఒక పోరాటం చెలరేగింది. అది ఒకవైపు మూఢనమ్మకపు భయం, లైంగిక ఆచారాలు, మరోవైపు విశ్వాసం, యథార్థతలకు మధ్య జరిగిన సంఘర్షణ. ఈ జీవన్మరణ పోరాటంలో యెహోవా ఆరాధనకు విరుద్ధంగా బయలు ఆరాధన చెలరేగింది.
ఆ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తునుండి తమను బయటికి తీసుకొని వచ్చిన సత్యదేవుని విశ్వసనీయంగా హత్తుకొని ఉంటుందా? (నిర్గమకాండము 20:2, 3) భూమిని సారవంతమైనదిగా చేస్తానని వాగ్దానం చేసిన కనాను దేశస్థుల ఇష్ట దేవుడైన బయలు పక్షాన చేరతారా?
వేలాది సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఆధ్యాత్మిక పోరాటం మనకు ప్రాముఖ్యమైంది. ఎందుకు? ఎందుకంటే “ఈ సంగతులు” అని అపొస్తలుడైన పౌలు వ్రాస్తూ “దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను” అని చెప్పాడు. (1 కొరింథీయులు 10:11) బయలు ఎవరో, బయలు ఆరాధనలో ఇమిడివున్నదేమిటో అర్థంచేసుకొంటే చారిత్రాత్మకమైన ఈ సంఘర్షణ వెనుక వున్న హెచ్చరిక మనపై మరింత ప్రభావాన్ని చూపుతుంది.
బయలు ఎవరు?
ఇశ్రాయేలీయులు కనానుకు వచ్చిన సంవత్సరం అంటే దాదాపు సా.శ.పూ. 1473లో వారికి బయలు పరిచయమయ్యాడు. కనానీయులు చాలా మంది దేవుళ్ళను ఆరాధిస్తున్నట్లు, వారికి అర్థమయ్యింది. పేర్లు వేరైనా, లక్షణాలు భిన్నంగా ఉన్నా కనానీయుల దేవుళ్ళు ఐగుప్తీయుల దేవుళ్ళ కన్నా వేరుగా ఏమీ లేరని ఇశ్రాయేలీయులు కనుగొన్నారు. బయలు కనానీయులకు ముఖ్యమైన దేవుడని బైబిలు తెలియజేస్తుంది, పురావస్తుశాస్త్రం అతడి ప్రాముఖ్యతను నిర్ధారిస్తుంది. (న్యాయాధిపతులు 2:11) బయలు కనానీయుల దేవుళ్ళందరిలో అతి శక్తివంతుడైన దేవుడేమీ కాకపోయినా, వారికి చాలా ప్రాముఖ్యమైన దేవుడు. వర్షం, గాలి, మేఘాలపై ఆయనకే అధికారముందనీ ప్రజలను, జంతువులను, గొడ్రాలితనం నుండి మరణాన్నుండి విడిపిస్తాడనీ పంటలు బాగా పండేందుకు లేక నాశనమైపోయేందుకు ఆయనే కారణమనీ కూడా అని వాళ్ళు నమ్మారు. బయలు కాపుదలే లేకపోతే, తప్పకుండా ప్రతీకారం తీర్చుకొనే కనాను దేవుడైన మోట్ ద్వారా వారి మీదకు విపత్తులు సంభవిస్తాయి మరి.
బయలు ఆరాధనలో తరచూ లైంగిక ఆచారాలు ఉండేవి. బయలుకు సంబంధించిన మత సంబంధ చిహ్నాలైన, ప్రతిమలూ దేవతాస్తంభాలకు లైంగికపరమైన అర్థాలు వున్నాయి. ఈ ప్రతిమలు లింగం ఆకారంలో చెక్కబడిన రాళ్ళు లేదా బండలు. ఇవి లైంగిక సంయోగంలోని పురుషాంగాన్ని లేదా బయలును సూచిస్తున్నాయన్నది స్పష్టం. మరోవైపు దేవతాస్తంభాలు చెక్కవస్తువులు లేదా చెట్లమ్రానులతో చేయబడినవి. ఇవి బయలు ప్రక్కన ఉండే దేవతయైన అషేరాను సూచిస్తున్నాయి.—1 రాజులు 18:19.
దేవదాసీతనం, పిల్లలను బలి ఇవ్వడం అనేవి బయలు ఆరాధనలోని మరికొన్ని పద్ధతులు. (1 రాజులు 14:23, 24; 2 దినవృత్తాంతములు 28:2, 3) ద బైబిల్ అండ్ ఆర్కియాలజీ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “కనానీయుల దేవాలయాల్లో ఆడ మగ వేశ్యలు, (‘పవిత్ర’ స్త్రీలు, పురుషులు) ఉండేవారు, అన్ని రకాలైన లైంగిక విచ్ఛలవిడితనం చాలా ఎక్కువగా అభ్యసించబడేది. [కనానీయులు] ఈ ఆచారాలను ఆచరించడం మూలంగానే తమ పంటలు, పశువులు ఏదో ఒక రకంగా వృద్ధి అవుతున్నాయనే నమ్మకాన్ని వారు కలిగివున్నారు.” అది కేవలం మతపర సమర్థింపు మాత్రమే అయినప్పటికీ, మరి నిస్సందేహంగా అలాంటి అనైతికత ఆ ఆరాధకుల శరీర కోరికలను తృప్తిపర్చేదిగా ఉండేది. బయలు ఇశ్రాయేలీయుల హృదయాలను ఎలా చెరిపివేశాడు?
ఎందుకంతటి ఆకర్షణ?
బహుశా తమ నుంచి చాలా తక్కువ కోరే మతాన్ని అభ్యసించాలని చాలామంది ఇశ్రాయేలీయులు కోరుకొని ఉండవచ్చు. బయలు ఆరాధనలో అనేక నైతిక నియమాలు, సబ్బాతు వంటి వాటితో కూడిన ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు. (లేవీయకాండము 18:2-30; ద్వితీయోపదేశకాండము 5:1-3) బహుశా బయలును ప్రసన్నపర్చాల్సిన అవసరత ఉందని కనానీయుల వస్తుసంపత్తి ఇతరులను ఒప్పించి ఉండవచ్చు.
కొండచరియల్లోని చెట్లతోపుల్లో ఉన్న ఉన్నతస్థలాలని పిలువబడే కనానీయుల పుణ్యతీర్థాలు అక్కడ అభ్యసించబడే సంతాన సాఫల్యాన్ని పొందడానికి చేసే ఆచారకర్మలకు బహుశా చక్కని వాతావరణాన్ని ఇచ్చి ఉండవచ్చు. కనానీయుల పవిత్రస్థలాలకు వెళ్ళివస్తుండడాన్ని బట్టి వారు సంతృప్తి చెందలేదు; త్వరలోనే కొన్నింటిని వారే స్వయంగా నిర్మించుకున్నారు. “ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి.”—1 రాజులు 14:23; హొషేయ 4:13.
కానీ ప్రప్రథమంగా బయలు ఆరాధన శరీరానికి ఆకర్షణీయమైన కోరికలను తీర్చింది. (గలతీయులు 5:19-21) సమృద్ధికరమైన పంటలు, పశువులు కావాలన్న కోరికలకన్నా శారీరక కోరికలు తీర్చుకోవాలన్న తపన ఎక్కువైపోయింది. అక్కడ లైంగికతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది లైంగిక సంబంధ అవయవాలు విపరీతంగా చూపిస్తున్న, లైంగికకోరికలు రేకెత్తించబడడాన్ని చూపిస్తున్న శిల్పాలు వెలికితీయబడడం ద్వారా ఋజువౌతుంది. లైంగిక విచ్చలవిడితనానికి తగిన వాతావరణాన్ని విందు, నాట్యం మరియు సంగీతాలు సిద్ధం చేసేవి.
ఆకురాలు కాలంలో సాధారణంగా కనపడే ఒక దృశ్యాన్ని ఊహించుకోవచ్చు. అందమైన ప్రకృతి తమ చుట్టూ ఉండగా, బాగా తిని, ద్రాక్షారసం బాగా త్రాగిన ఉద్రేకంలో ఆ ఆరాధకులు నాట్యం చేస్తారు. బయలును వేసవికాల నిష్క్రియా స్థితి నుండి మేల్కొల్పడం ద్వారా ఆయన వర్షం రప్పించి భూమిని ఆశీర్వదిస్తాడని వారి లైంగిక నాట్యం యొక్క ఉద్దేశం. వారు లింగస్థంభాల చుట్టూ, ప్రతిమల చుట్టూ నాట్యం చేస్తారు. ప్రాముఖ్యంగా దేవదాసీల కదలికలు శృంగారంతోనూ లైంగికతతోనూ కూడినవై ఉంటాయి. అక్కడి సంగీతం, ప్రేక్షకులు వారలా చేయడానికి వారిని ప్రోత్సహిస్తాయి. బహుశా ఆ నాట్యానంతరం అనైతిక క్రియల కోసం, వారు బయలు గృహంలోని గదుల్లోకి వెళ్తారు.—సంఖ్యాకాండము 25:1, 2; పోల్చండి నిర్గమకాండము 32:6, 17-19; ఆమోసు 2:8.
వారు విశ్వాసము వలన కాక వెలిచూపువలన నడిచారు
అలాంటి శారీరక కోరికలతో నిండిన ఆ ఆరాధన అనేకమందిని ఆకర్షించింది, కానీ భయం కూడా బయలు ఆరాధన వైపుకి ఇశ్రాయేలీయులను నడిపించింది. ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల విశ్వాసాన్ని కోల్పోతూ ఉండగా వారికి మృతుల పట్ల భయం, భవిష్యత్తు పట్ల భయం మరియు అతీంద్రియ శక్తుల పట్ల ఆకర్షణ వారు అభిచారాన్ని అభ్యసించేలా చేశాయి. ఇందులో అతినీచమైన ఆచారాలు కూడా ఇమిడివున్నాయి. ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా పూర్వికుల ఆరాధనలో భాగమైన, శరీరాల్ని విడచిన ఆత్మలను కనానీయులు ఎలా గౌరవిస్తారో వర్ణిస్తుంది: “చనిపోయినవారు అందులో భాగం వహిస్తారని భావించి, కుటుంబసమాధిలో లేక సమాధుల గుట్టల్లో విందులు . . . ఆచారబద్ధంగా ఉండే త్రాగుడు, లైంగికత (బహుశా వావివరుసలు తప్పి వ్యభిచరించడం) అక్కడ ఆచరించబడుతుంది.” అలాంటి అతినీచమైన అభిచార సంబంధ అభ్యాసాల్లో భాగం వహించడం ఇశ్రాయేలీయులు వారి దేవుడైన యెహోవాకు మరింత దూరమయ్యేలా చేసింది.—ద్వితీయోపదేశకాండము 18:9-12.
విగ్రహాలు—వాటితో జత చేయబడిన ఆచారాలు—కూడా విశ్వాసం వలన కాక వెలిచూపు వలన నడుచుకొనేందుకు ఎంపిక చేసుకున్న ఇశ్రాయేలీయులను ఆకర్షించాయి. (2 కొరింథీయులు 5:6) ఐగుప్తును విడిచి వచ్చిన అనేకమంది యెహోవా అదృశ్యహస్తం క్రింద మహాశ్చర్యకర అద్భుతాలు చూసినప్పటికీ, దృశ్యమైన ఒక జ్ఞాపిక వారికి అవసరమయ్యింది. (నిర్గమకాండము 32:1-4) వారివలెనే వారి వంశస్థుల్లో కొందరు బయలు వలే దృశ్యంగా కనిపించే విగ్రహాలను ఆరాధించేందుకు ఇష్టపడ్డారు.—1 రాజులు 12:25-30.
ఎవరు గెలిచారు?
వారు వాగ్దానదేశానికి ప్రవేశించడానికి కాస్త ముందు అంటే వారు మోయాబు మైదానానికి వచ్చినప్పటినుండి బబులోనుకు చెరగా వెళ్ళేంతవరకూ శతాబ్దాలపాటు ఇశ్రాయేలీయుల హృదయాలను గెల్చుకోవడానికి పోరాటం కొనసాగింది. గెలుపు ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్తున్నట్లుగా కన్పించింది. కొన్నిసార్లు, ఇశ్రాయేలీయుల్లో ఎక్కువమంది యెహోవాకు యథార్థంగానే ఉండేవారు, కానీ తరచుగా వారు బయలువైపు తిరిగేవారు. దీనికి ఒక ప్రధాన కారణమేమిటంటే వారు తమచుట్టూ వున్న అన్యప్రజలతో సహవాసం చేయడమే.
సైనికపరంగా కనానీయులు ఓడిపోయిన తర్వాత వారు చాలా కుయుక్తినుపయోగించి పోరాడారు. వారు ఇశ్రాయేలీయుల ప్రక్కనే నివసించేవారు. వారు తమ దేవుళ్ళను స్వంతం చేసుకోమని తమను జయించిన ఇశ్రాయేలీయులను ప్రోత్సహించారు. గిద్యోను, సమూయేలు లాంటి ధైర్యముగలవారే ఈ ధోరణిని నిరోధించారు. సమూయేలు ప్రజలను ఇలా గద్దించాడు: “అన్యదేవతలను . . . తీసివేసి పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి.” కొంతకాలంపాటు, ఇశ్రాయేలీయులు సమూయేలు గద్దింపును లక్ష్యపెట్టి, వారు “బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.”—1 సమూయేలు 7:3, 4; న్యాయాధిపతులు 6:25-27.
సౌలు, దావీదుల పరిపాలనానంతరం, సొలొమోను తన చివరిదినాల్లో అన్య దేవతలకు బలులను అర్పించడం మొదలుపెట్టాడు. (1 రాజులు 11:4-8) ఇశ్రాయేలు, యూదాల ఇతర రాజులు కూడా అలానే చేసి, బయలుకు లొంగిపోయారు. అయినప్పటికీ, ఏలీయా, ఎలీషా, మరియు యోషీయా వంటి విశ్వసనీయులైన ప్రవక్తలు, రాజులు బయలు ఆరాధనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాయకత్వం వహించారు. (2 దినవృత్తాంతములు 34:1-5) ఇంకా చూస్తే, ఇశ్రాయేలీయుల ఈ చరిత్ర కాలమంతటిలో, యెహోవాకు విశ్వాసంగా నిలిచిన అనేకమంది వ్యక్తులు ఉన్నారు. అహాబు, యెజెబెలు కాలాల్లో, బయలు ఆరాధన అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ‘బయలుకు వారి మోకాళ్ళూనడానికి’ ఏడువేలమంది తిరస్కరించారు.—1 రాజులు 19:18.
చివరికి, యూదులు బబులోను చెరనుండి తిరిగి వచ్చిన తర్వాత బయలు ఆరాధన గురించి తిరిగి ప్రస్తావించబడలేదు. వారు ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొన్నారు.’—ఎజ్రా 6:21.
బయలు ఆరాధన నుండి మనం కనుగొనగల హెచ్చరికలు
చాలాకాలం క్రితమే బయలు ఆరాధన అదృశ్యమైనప్పటికీ, ఆ కనానీయుల మతానికి, ఈనాటి సమాజానికి సమాంతరంగా వున్న విషయం—లైంగికతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడడం. అనైతికతకు పాల్పడేలా చేసే ప్రలోభాలు మనం పీల్చే గాలిలోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. (ఎఫెసీయులు 2:2) “చీకటి లోకాన్నే అదుపులో పెట్టుకున్న అదృశ్యశక్తికి విరోధంగా, దుష్టత్వపు ముఖ్య స్థావరం నుండి వచ్చిన ఆత్మలకు విరోధంగా మనం పోరాడుతున్నాము.”—ఎఫెసీయులు 6:12, ఫిలిప్స్.
సాతాను యొక్క ఈ “అదృశ్యశక్తి” ప్రజలను ఆధ్యాత్మిక భావంలో బానిసలనుగా చేయడానికి లైంగిక అవినీతిని ప్రోత్సహిస్తుంది. (యోహాను 8:34) దేన్నైనా అనుమతించే ఈ సమాజంలో, లైంగికంగా కలిగే కోరికలకు లొంగిపోవడం ఒక ఆచారంగా కాదుగానీ ఆత్మ సంతృప్తి కొరకు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకొనేందుకు చేసేదై ఉంది. జరుగుతున్న ప్రచారం కూడా చాలా ప్రలోభపెట్టేదిగా ఉంది. ప్రజల మనస్సుల్లో వినోదం, సంగీతం, మరియు ప్రకటనల ద్వారా ఈ లైంగిక సందేశాలు ఇంకిపోతున్నాయి. ఈ దాడి దేవుని సేవకులపై ప్రభావాన్ని చూపకపోదు. నిజానికి, క్రైస్తవ సంఘాల్లో నుండి అనేకమంది అలాంటి ఆచారాలకు తలవొగ్గడం మూలానే బహిష్కరించబడ్డారు. క్రైస్తవులు అలాంటి అనైతిక ప్రేరేపణలను నిరాకరిస్తూ ఉంటేనే పవిత్రంగా నిలిచి ఉండగలరు.—రోమీయులు 12:9.
ప్రత్యేకించి యౌవన సాక్షులు ఈ ప్రమాదానికి లోనవుతుంటారు, ఎందుకంటే, బహుశా వారికి ఆకర్షణీయమని అనిపించినవన్నీ కూడా లైంగికతతో నిండినవే. పరిస్థితిని ఇంకా ఘోరంగా తయారుచేసేదేమిటంటే, ఇతర యౌవనులు తమను ప్రేరేపిస్తున్నప్పుడు వారిని నిరోధించాల్సి ఉంటుంది కూడా. (పోల్చండి సామెతలు 1:10-15.) అనేకమంది ఇటువంటి సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఉదాహరణకు పెద్ద సంఖ్యలోని పార్టీల్లో సమకూడేచోట్ల. ప్రాచీన కాలంలోని బయలు ఆరాధనలో వలెనే సంగీతం, నాట్యం, లైంగికత అనేవి మరులు గొల్పే మిశ్రమాలుగా ఉన్నాయి.—2 తిమోతి 2:22.
“యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు?” అని కీర్తన గ్రంథకర్త అడిగి, “[యెహోవా] వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా,” అని సమాధానమిచ్చాడు. (కీర్తనలు 119:9) దేవుని ధర్మశాస్త్రం కనానీయులతో దగ్గరి సంబంధాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞ ఇచ్చినట్లుగానే, బైబిలు మనలను అజ్ఞానంతో కూడిన సహవాసాల వలన వచ్చే అపాయాలను గూర్చి అప్రమత్తులను చేస్తుంది. (1 కొరింథీయులు 15:32, 33) ఒక యౌవన క్రైస్తవుడు నైతికంగా ప్రమాదకరమని తనకు తెలిసిన లైంగిక ఆకర్షణను తిరస్కరించడం ద్వారా తన పరిపక్వతను చూపించగలడు. విశ్వాసనీయుడైన ఏలీయా వలే ప్రజల్లో ప్రబలివున్న అభిప్రాయాలు మన కోసం నిర్ణయాలు తీసుకొనేలా మనం అనుమతించకూడదు.—1 రాజులు 18:21; పోల్చండి మత్తయి 7:13, 14.
మరొక హెచ్చరిక “మనలను సుళువుగా చిక్కులబెట్టు పాపము” అయిన విశ్వాసలేమికి సంబంధించినది. (హెబ్రీయులు 12:1) చాలామంది ఇశ్రాయేలీయులు యెహోవా నందు విశ్వాసముంచినట్లుగా కనిపించినా, తమ పంటలను కాపాడేందుకు, వారి అనుదిన అవసరతలను తీర్చే దేవునిగా వారు బయలువైపు చూశారు. బహుశా యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయం చాలా దూరంలో ఉన్నట్లు వారు తలంచి ఉండవచ్చు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం అంత ఆచరణయోగ్యమైనది కాదని వారు తలంచి ఉండవచ్చు. బయలు ఆరాధన అయితే సులభంగానూ, సౌకర్యవంతంగానూ ఉంది, వారి స్వంత ఇండ్ల మిద్దెలమీదే వారు బయలుకు ధూపం వేయవచ్చు. (యిర్మీయా 32:29) కేవలం కొన్ని ఆచారాల్లో పాల్గొనడం ద్వారాగానీ, యెహోవా పేరిట బయలుకు బలులను అర్పించడం ద్వారాగానీ వాళ్లు, బయలు ఆరాధనలో పడి కొట్టుకొనిపోయి ఉండివుండవచ్చు.
మన విశ్వాసాన్ని కోల్పోయి జీవముగల దేవుని నుండి నెమ్మదిగా ఎలా కొట్టుకొనిపోగలం? (హెబ్రీయులు 3:12) మనకు కూటాల పట్ల, సమావేశాల పట్ల ముందున్న మెప్పును క్రమంగా కోల్పోవచ్చు. అలాంటి దృక్పథం ఆధ్యాత్మికంగా “తగినవేళ అన్నము” అందించే యెహోవా ఏర్పాటు పట్ల విశ్వాసలేమిని చూపిస్తుంది. (మత్తయి 24:45-47) ఆ విధంగా బలహీనులమై “జీవవాక్యమును చేత పట్టుకొని” ఉన్న మనం బహుశా ఆ పట్టును కోల్పోయి, విభాగింపబడిన హృదయాన్ని కలిగి వస్తుసంపదల వెనుక పడడం లేక అనైతికతకు లోనవ్వడం జరుగవచ్చు.—ఫిలిప్పీయులు 2:16; పోల్చండి కీర్తనలు 119:113.
మన యథార్థతను గట్టిగా చేపట్టుకుందాం
ఈ రోజు కూడా అలా హృదయాలను గెల్చుకోవడం కోసం యుద్ధం చెలరేగుతోంది. ఇందులో సందేహంలేదు. మనం యెహోవా పట్ల యథార్థంగా ఉంటామా లేక ఈ ప్రపంచ అనైతిక పరిస్థితులవల్ల ప్రక్కదోవ పడతామా? విచారకరంగా, కనానీయుల ఆచారాలకు ఇశ్రాయేలీయులు ఆకర్షితులైనట్లుగానే, ఈ రోజు క్రైస్తవ స్త్రీ, పురుషులు సిగ్గుకరమైన పనులు చేసేలా ఆకర్షింపబడుతున్నారు.—పోల్చండి సామెతలు 7:7, 21-23.
మోషేవలే మనం ‘అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు’ నడుచుకొన్నట్లయితే, అటువంటి ఆధ్యాత్మిక ఓటమిని నివారించగలం. (హెబ్రీయులు 11:27) నిజంగానే, మనం ‘బోధ నిమిత్తం పోరాడాలి.’ (యూదా 3) మనం మన దేవునికి, ఆయన సూత్రాలకు యథార్థంగా ఉండడం ద్వారా అబద్ధ ఆరాధన పూర్తిగా తీసివేయబడే సమయాన్ని మనం చూడగలం. బయలు ఆరాధనకు వ్యతిరేకంగా యెహోవా ఆరాధన నిలిచి ఉన్నట్లే, త్వరలో, “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును” అనే నిశ్చయతను మనం కలిగివుండగలం.—యెషయా 11:9.
[31వ పేజీలోని చిత్రం]
గెజెరు నందు బయలు ఆరాధనలో ఉపయోగించబడిన దేవతాస్తంభాల శిథిలాలు
[28వ పేజీలోని చిత్రసౌజన్యం]
Musée du Louvre, Paris