అధికారులు సాక్షులను ప్రశంసించారు
స్పెయిన్ దేశంలో మాడ్రిడ్ నగరానికి నైరృతి దిశగా దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడల రేవు నగరమైన కాడిజ్లో, మేయరు డోనా థియోఫిలా మార్టినెస్ (పైన చిత్రించబడినటువంటి) ఒక ఫలకాన్ని యెహోవాసాక్షులకు బహుకరించారు. దానిపై “కాడిజ్ నగరపాలక సంస్థ నుండి యెహోవాసాక్షులకు—ఈ నగరం విషయంలో వారు చూపించిన సహకారానికీ, చేసిన కృషికీ ప్రశంసగా” అని చదువబడుతోంది. ఈ గౌరవాన్ని పొందడానికి సాక్షులు ఏమి చేశారు?
సిటీ మునిసిపల్ స్టేడియంలోని కొంతభాగాన్ని సాక్షులు పునరుద్ధరించినందుకు గుర్తింపుగా అది ఇవ్వబడింది. అనేక వారాంతాల పాటు వందలాదిమంది సాక్షులు, కరాంజా ఫుట్‌బాల్ స్టేడియం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మరుగుదొడ్లను పునర్నవీకరించేందుకు స్వచ్ఛందంగా సహాయపడ్డారు. ఇప్పుడు ఆ స్టేడియంను ఉపయోగించుకునే వారంతా, బిగించబడిన పైపులనుండీ, అమర్చబడిన కుళాయి గొట్టాలనుండీ, ఫ్లోరింగ్ నుండీ ప్రయోజనం పొందుతున్నారు.
కొంతకాలం నుండి కాడిజ్ నగరంతో యెహోవాసాక్షులకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతిసంవత్సరం యెహోవాసాక్షులు తమ వార్షిక జిల్లా సమావేశాన్ని జరుపుకొనేలా కరాంజా స్టేడియంను వారికి నగరపాలక సంస్థ ఉదారంగా ఇస్తుంది. కాబట్టి, సాక్షులు ఆ స్టేడియం మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడడంలో తాము చేయగలిగినదంతా చేయడానికి సంతోషిస్తారు.
అయితే, అప్పుడప్పుడూ చేసే శ్రామిక సహాయంతోపాటు మరొక రీతిలో ప్రజలకు మద్దతునివ్వడానికి ఆ నగరంలోని ఇరుగు పొరుగును క్రమంగా యెహోవాసాక్షులు సందర్శిస్తారు. వారు దేవుని “రాజ్యసువార్త”ను ప్రకటిస్తారు. నిజమే, మనుష్యుల మెప్పు పొందడానికి వాళ్లు తమ బహిరంగ పరిచర్యలో పాల్గొనరు. “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించి, ‘సమస్త జనులను శిష్యులనుగా చేయమన్న’ యేసు ఆజ్ఞకు విధేయత చూపించడంలో భాగంగానే దాన్ని చేస్తారు. (మత్తయి 24:14; 28:19) ఆ విధంగా యెహోవాసాక్షులు “నీతిమార్గమునందు” ప్రజలను విద్యావంతులుగా చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలని ఆశిస్తారు.—సామెతలు 12:28.