ప్రతివిధమైన ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడా?
దేవుడు మానవుణ్ణి ఆత్మీయ అవసరతతో అనగా ఆరాధించే అవసరతతో సృష్టించాడు. ఇది పరిణామం ద్వారా కలిగినది కాదు. ప్రారంభం నుండే అది మానవునిలో ఓ అంతర్భాగంగా ఉంది.
అయితే, దుఃఖకరమైన విషయమేమిటంటే, మానవులు ఆరాధన యొక్క వివిధ మార్గాలను వృద్ధిచేసుకున్నారు, ఇవి సాధారణంగా సంతోషభరితమగు ఐక్యమానవ కుటుంబాన్ని ఉత్పన్నం చేయలేదు. బదులుగా, ఇప్పటికీ మతం పేరిట రక్తపిపాస యుద్ధాలు ఇంకనూ జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి దేవున్ని ఎలా ఆరాధిస్తాడనేది అంత ప్రాముఖ్యమా? అనే ముఖ్యమైన ప్రశ్నను ఇది లేవదీస్తుంది.
ప్రాచీన కాలాల్లోని సందేహాస్పద ఆరాధన
ఆ ప్రశ్నకు జవాబిచ్చేలా సహాయపడేందుకు మధ్యప్రాచ్యమందు నివసించిన ప్రాచీనకాల జనాంగముల చరిత్ర మనకొక ఉదాహరణగా ఉంటుంది. అనేకమంది బయలు దేవతను ఆరాధించారు. బయలు దేవత యొక్క స్త్రీ సహవాసులను అనగా అషేరా వంటి వారిని సహితం వారు ఆరాధించారు. అషేరా ఆరాధనలో లైంగిక ప్రతీకగా నమ్మబడే స్తంభం ఉపయోగించడం చేరి ఉండేది. ఆ ప్రాంతంలో త్రవ్వకాలు సాగించిన పురావస్తు శాస్త్రవేత్తలు అనేకానేక స్త్రీల నగ్నప్రతిమలను వెలికి తీశారు. ఈ ప్రతిమల్లో తన “ఎదపై చేతులు పెట్టుకుని అంగాంగ ప్రదర్శనలో పూర్తిగా నగ్నంగావున్న ఓ దేవతా విగ్రహం ఉంది,” “అది బహుశ అషేరాను . . . సూచిస్తుంది” అని ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ పేర్కొంటోంది. ఒక విషయం మాత్రం కచ్చితం, బయలు ఆరాధన తరచూ లైంగిక దుర్నీతితో కూడినదే.
కాబట్టి, బయలు ఆరాధనలో కామవిలాస చేష్టలు చేరియున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. (సంఖ్యాకాండము 25:1-3) యౌవనురాలైన దీనాను కనానీయుడైన షేకెము బలాత్కరించాడు. అలా జరిగిన తర్వాత కూడా అతడు తన కుటుంబములో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిగానే దృష్టించబడ్డాడు. (ఆదికాండము 34:1, 2, 19) రక్తసంబంధుల మధ్య లైంగికదుర్నీతి, సలింగ సంయోగం, మృగసంయోగం సర్వసాధారణమై ఉండెను. (లేవీయకాండము 18:6, 22-24, 27) సలింగ సంయోగాన్ని సూచించే ‘సోడమీ’ అనే పదం లోకంలో ఒకప్పుడున్న ఒక పట్టణపు పేరునుండే వచ్చింది. (ఆదికాండము 19:4, 5, 28) బయలు ఆరాధనలో రక్తపాతము కూడా ఇమిడి ఉంది. అంతెందుకు, బయలు దేవతారాధికులు తమ దేవతలకు బలిగా తమ పిల్లలను అగ్నిలో వేసేవారు! (యిర్మీయా 19:5) ఈ ఆచారాలన్నీ మతబోధలకు సంబంధం కల్గియున్నవే. ఎలా?
ఆర్కియాలజీ అండ్ ఓల్డ్ టెస్టమెంట్ అనే తన పుస్తకంలో “కనానీయుల పురాణాల్లో కనిపించే క్రూరత్వం, మోహోద్రేకం, విచ్చలవిడితనం ఆ కాలంలోని సమీప తూర్పు ప్రాంతాల్లో ఎక్కడా అంత నీచంగా కనిపించవు. వారి దేవతల ఏ విపరీత లక్షణాలైనా వారి భక్తుల్లో మరి నీచమైన లక్షణాలనే ఉత్పన్నం చేశాయి. ఆ కాలంలో దేవదాసీతనం, శిశుబలివంటి అత్యంత అనైతిక ఆచారాల్ని వారు ఆచరించారు” అని డా. మెరిల్ అంగర్ వివరిస్తున్నాడు.
కనానీయుల ఆరాధనను దేవుడు అంగీకరించాడా? ఎంతమాత్రమూ అంగీకరించలేదు. తనను స్వచ్ఛమైన రీతిలో ఎలా ఆరాధించాలో ఆయన ఇశ్రాయేలీయులకు నేర్పించాడు. పైన పేర్కొనబడిన ఆచారాలను గూర్చి ఆయన ఇలా హెచ్చరించాడు: “వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుట నుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.”—లేవీయకాండము 18:24, 25.
స్వచ్ఛారాధన కలుషితం కావడం
అనేకమంది ఇశ్రాయేలీయులు సత్యారాధనను గూర్చిన దేవుని ఉద్దేశాన్ని అంగీకరించలేదు. బదులుగా, వారు తమ దేశంలో బయలు దేవతారాధన కొనసాగడాన్ని అనుమతించారు. ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనను బయలు ఆరాధనతో మిశ్రమం చేసేటట్లు ప్రయత్నించేలా తొందరగానే వంచింపబడ్డారు. ఈ మిశ్రిత ఆరాధనను దేవుడు అంగీకరించాడా? మనష్షే రాజు కాలంలో ఏమి జరిగిందో ఆలోచించండి. అతడు బయలుకు బలిపీఠాలు కట్టించాడు, తన కుమారుణ్ణీ బలిగా దహించాడు. మంత్రతంత్ర విద్యలు అభ్యసించాడు. “యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను.”—2 రాజులు 21:3-7.
మనష్షే ప్రజలు వారి రాజు మాదిరినే అనుకరించారు. వాస్తవానికి, “ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.” (2 రాజులు 21:9) దేవుని ప్రవక్తలు పదేపదే ఇచ్చిన హెచ్చరికలను లక్ష్యపెట్టడానికి బదులు, నిరపరాధుల రక్తముతో యెరూషలేము నిండునంత వరకు మనష్షే నరహత్యలు గావించాడు. మనష్షే కడకు మారిననూ, అతని తరువాత వచ్చిన అతని కుమారుడగు ఆమోను బయలు ఆరాధనను పునరుజ్జీవింపజేశాడు.—2 రాజులు 21:16, 19, 20.
ఆ తర్వాతి కాలంలో, ఆలయంలో పురుషగాముల ప్రవేశం జరిగింది. ఈ విధమైన బయలు ఆరాధనను దేవుడెలా దృష్టించాడు? మోషే ద్వారా ఆయనిలా హెచ్చరించాడు: ‘పడుపుసొమ్మునేగాని కుక్క [బహుశ పురుషగామి] విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.’—ద్వితీయోపదేశకాండము 23:17, 18, అధఃసూచి NW.
మనష్షే మనుమడగు యోషీయా దుర్నీతిమయమైన బయలు ఆరాధనా దేవాలయాన్ని శుభ్రం చేశాడు. (2 రాజులు 23:6, 7) అయితే మార్పు అసాధ్యమైనదిగా ఉండెను. రాజైన యోషీయా మరణించిన అనతికాలంలోనే, మరలా యెహోవా ఆలయంలో విగ్రహారాధన మొదలైంది. (యెహెజ్కేలు 8:3, 5-17) అందువల్ల యెరూషలేమును, దానిలోని ఆలయాన్ని బబులోను రాజు నాశనం చేసేలా యెహోవా ఏర్పాటు చేశాడు. ఈ విషాదకర చరిత్ర దేవునికి కొన్ని ఆరాధనా విధానాలు అంగీకారం కావనే రుజువునిస్తుంది. మనకాలం విషయమేమిటి?