పరదైసు కోసమైన అన్వేషణలో
పాస్కాల్ స్టీజీ చెప్పినది
చాలా రాత్రి అయ్యింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని బ్యేజ్యేర్స్ పట్టణంలోని వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. క్రొత్తగా పెయింట్ వేసిన మత సంబంధమైన పుస్తకాలను అమ్మే పుస్తకాల దుకాణపు గోడ మీద ‘దేవుళ్ళు చచ్చారు. సూపర్‌మ్యాన్ అనంత కాలం జీవించును గాక!’ అని జర్మన్ తత్త్వవేత్త అయిన నీట్సీ చెప్పిన మాటలను నేనూ, నా స్నేహితుడూ పెద్ద పెద్దగా ఇష్టం వచ్చినట్లు వ్రాశాం. అయితే, ఇదంతా చేయడానికి నన్ను ఏది నడిపించింది?
నేను 1951లో ఫ్రాన్స్‌లో ఇటలీ వారైన క్యాథలిక్ కుటుంబంలో జన్మించాను. నా చిన్నప్పుడు మేము సెలవులకు దక్షిణ ఇటలీ వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రతి గ్రామంలోనూ కన్య మరియ విగ్రహాలు ఉండేవి. పర్వతాల గుండా జరిగే ఎత్తైన మరియ విగ్రహాల ఊరేగింపు వెంట మా తాతయ్యగారితో పాటు వెళ్ళేవాడ్ని—వాటిపై ఎటువంటి విశ్వాసం లేకుండానే. తర్వాత జెసూట్లు నడిపిస్తున్న మతసంబంధమైన పాఠశాలలో నా ప్రాథమిక విద్యను పూర్తి చేశాను. అయితే, నేను దేవుని మీద విశ్వాసం ఉంచేలా ఆ పాఠశాలలో ఏమైనా విన్నట్లు నాకు ఏ మాత్రం గుర్తులేదు.
నేను మెడిసన్ చదవడం కోసం మోన్‌పెల్యేలోని విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు, జీవిత ఉద్దేశాన్ని గూర్చి ఆలోచించడం ప్రారంభించాను. యుద్ధంలో మా నాన్నగారు గాయపడ్డారు, ఆయన ప్రక్కన డాక్టర్లు ఎప్పుడూ ఉంటూండేవారు. యుద్ధం వల్ల ప్రజలకు కలిగే గాయాలను స్వస్థపరిచేందుకు ఎంతో సమయాన్ని, ప్రయత్నాన్ని వెచ్చించే బదులు, అసలు యుద్ధం లేకుండా చేయడమే మేలు కదా? అనుకున్నాను. అప్పటికింకా వియత్నాం యుద్ధం ముమ్మరంగా సాగుతుంది. ఉదాహరణకు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించేందుకు దానికి కారణమయ్యే పొగాకును వాడక పోవడమే ఏకైక తార్కిక మార్గమని అనుకునేవాడ్ని. బాగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కుపోషణ ఫలితంగానూ, ధనిక దేశాల్లో బాగా తినడం ఫలితంగానూ వచ్చే జబ్బుల సంగతేమిటి? ఇలాంటి దారుణమైన పర్యవసానాలను తగ్గించడానికి ప్రయత్నించే బదులు, వాటి కారణాలను నిర్మూలించడమే మేలు కదా? ఈ భూమి మీద ఎందుకిన్ని కష్టాలు? అని అనుకునేవాడ్ని. ఆత్మహత్య చేసుకునే వైఖరి గల ఈ సమాజంలో ఏదో ఘోరమైన లోపం ఉందనీ, దీనంతటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని అనుకునేవాడ్ని.
ఒక అరాచకవాది వ్రాసిన పుస్తకం నా అభిమాన పుస్తకం. దానిలో నుండి కొన్ని వాక్యాలను గోడల మీద వ్రాసేవాడ్ని. కాలక్రమేణా నేను కూడా విశ్వాసం గానీ, నైతికవిలువలు గానీ లేని, గురువు, దైవం అక్కరలేదనే ఒక అరాచకవాదిగా తయారయ్యాను. నా దృష్టిలో దేవుడు, మతం అనేవి ధనవంతులు, పలుకుబడి గలవారు మిగతా వాళ్ళపై అధికారం చెలాయించడం కోసం, మిగతావాళ్ళను దోచుకోవడం కోసం చేసిన కల్పితాలే. మా కోసం భూమిపై కష్టపడి పనిచేయండి, దాని ఫలితం పరలోకంలోని పరదైసులో మీకు గొప్పగా ఉంటుంది అని వారు చెబుతున్నట్లుగా అన్పించేది. కానీ, దేవుళ్ళ కాలం చెల్లిపోయింది. ప్రజలకు ఆ విషయాన్ని తెలపవలసి ఉంది. వారికి చెప్పేందుకు ఒక మార్గం గోడల మీద వ్రాయడమే.
దీని ఫలితంగా, నా చదువుకు రెండవ స్థానమే ఇచ్చాను. అదేసమయంలో నేను భౌగోళిక, ఆవరణ శాస్త్రాలను అధ్యయనం చేసేందుకు మోన్‌పెల్యేలోని మరొక విశ్వవిద్యాలయంలో చేరాను, అక్కడ సాయుధ తిరుగుబాటు ప్రబలమై ఉండేది. నేను ఆవరణశాస్త్రాన్ని చదివేకొద్దీ, మన అందమైన గ్రహం కలుషితం కావడాన్ని చూసి నాకు మరింతగా ఏవగింపు కలిగేది.
ప్రతి సంవత్సరం వేసవికాలంలో యూరప్ అంతటా వేలాది కిలోమీటర్లు రోడ్డు మీద ఎదురైన వాహనాలను ఎక్కి ప్రయాణించేవాడ్ని. ప్రయాణిస్తూ, వందల మంది డ్రైవర్లతో మాట్లాడుతూన్నప్పుడు, ఈ మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కీడునూ, విధ్వంసాన్నీ నా కళ్ళతో చూశాను. ఒకసారి, నేను పరదైసు కోసం అన్వేషిస్తూ, సుందరమైన క్రేతు ద్వీపంలోని అద్భుతంగా కన్పించే కొన్ని సముద్రతీరాలను చూశాను, అవి చమురుతో కలుషితమై ఉన్నాయి. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఈ భూమిపై ఏ మూలనన్నా పరదైసు మిగిలి ఉందా? అనుకున్నాను.
పల్లె వాతావరణానికి తిరిగి వెళ్ళడం
ఫ్రాన్స్‌లోని ఆవరణ శాస్త్రవేత్తలు పల్లె వాతావరణాన్ని పునఃస్థాపించడమే సమాజ దుస్థితికి పరిష్కారమన్నట్లు వాదించారు. నేను కష్టపడి పని చేయాలనుకున్నాను. కాబట్టి, నేను దక్షిణ ఫ్రాన్స్‌లోని సావెన్ పర్వతం దిగువ భాగంలోని చిన్న గ్రామంలో ఒక పాత రాతి ఇంటిని కొన్నాను. నేను నా తలుపు మీద అమెరికా హిప్పీస్ నినాదమైన “పరదైసు ఇప్పుడే” అని వ్రాశాను. మా గ్రామం గుండా వెళుతున్న ఒక జర్మనీ అమ్మాయి నా సహచరి అయ్యింది. వివాహం విషయానికి వస్తే, వివాహ వ్యవస్థకు ప్రతినిధియైన మేయర్ ఎదుట చేసుకునే ప్రసక్తే లేదు. అయితే, చర్చిలో చేసుకోవాలా? కనీసం ఆ తలంపు కూడా లేదు!
మేము చాలామట్టుకు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళం, నాకు పొడవైన జుత్తూ, చింపిరి గడ్డమూ ఉండేవి. పళ్ళను, కాయగూరలను పెంచడం నన్ను పరవశుడ్ని చేసింది. వేసవిలో, ఆకాశం నీలంగా ఉండేది, సికాడా కీటకాలు పాటలు పాడేవి. పొదల్లోని పువ్వులు ఎంతో పరిమళాన్ని వెదజల్లేవి. మేము మధ్యధరా సముద్రపు పండ్లను—ద్రాక్ష, అత్తి—పెంచేవాళ్ళం, వాటిలో రసం బాగా ఉండేది. మేము పరదైసులో తగిన స్థలాన్ని కనుగొన్నట్లుగా అన్పించింది.
దేవుని మీద నమ్మకం మేల్కొంది
నేను విశ్వవిద్యాలయంలో కణజీవ శాస్త్రాన్నీ, పిండోత్పత్తి శాస్త్రాన్నీ, శరీరధర్మ శాస్త్రాన్నీ అధ్యయనం చేశాను. ఈ శాస్త్రాలన్నిటిలోని సంక్లిష్టత, పొందికలకు బాగా ప్రభావితుడినయ్యాను. నేను ప్రతిరోజు సృష్టిని గూర్చి ఆలోచిస్తూ, ప్రత్యక్షంగా పరిశీలించగల్గుతున్నాను. దాని సౌందర్యం, శక్తీ నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేశాయి. సృష్టి అనే పుస్తకంలోని ప్రతీ పేజీ నాతో ప్రతీరోజూ మట్లాడుతూండేది. ఒకరోజు కొండల గుండా చాలాసేపు అలా నడుస్తుండగా జీవితాన్ని గురించి చాలా లోతుగా ఆలోచించాను, సృష్టికర్త ఉండే ఉంటాడన్న నిశ్చయానికి వచ్చాను. నేను దేవుడ్ని విశ్వసించాలని నా హృదయంలో నిర్ణయించుకున్నాను. అంతకుముందు నా హృదయంలో శూన్యతా భావమూ, భయంకరమైన ఒంటరితనపు భావమూ ఉండేవి. నేను దేవుడ్ని విశ్వసించడం ప్రారంభించిన రోజున ‘పాస్కాల్ నీవు ఇక ఎప్పటికీ ఒంటరివాడవు కావు’ అని నాలో నేను అనుకున్నాను. అప్పుడు ఒక అసాధారణ పులకరింత కలిగింది.
అటు తర్వాత, నా సహచరికి, నాకు ఒక పాప—అమాడీన్—పుట్టింది. మా పాపంటే నాకు ప్రాణం. ఇప్పుడు దేవుడ్ని విశ్వసించడం ప్రారంభించాను. నాకు తెలిసిన ఏవో కొన్ని నైతిక ధర్మాలకు గౌరవం చూపడం ప్రారంభించాను. నేను దొంగతనం చేయడం, అబద్ధాలాడడం మానేశాను. ఇది నా చుట్టు ప్రక్కల ఉన్న వాళ్ళతో కలిగే అనేక సమస్యలను నివారించేందుకు సహాయం చేస్తోందని నేను వెంటనే గ్రహించాను. అవును, మాకు అనేక సమస్యలుండేవి. నా పరదైసు నేను నిరీక్షించినంత పరిపూర్ణంగా లేదు. ఆ ప్రాంతంలోని ద్రాక్ష చెట్లను పెంచేవాళ్ళు వాడిన క్రిమి సంహారక మందులు, గుల్మ నాశకాల కారణంగా నా పంటంతా నాశనమైపోయింది. దుష్టత్వానికి గల కారణం ఏమిటన్న నా ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఇంకా, నేను కుటుంబ జీవితాన్ని గురించి చాలా చదివినప్పటికీ, నా సహచరితో కోపోద్రేకపు వాదనలను మాత్రం అదుపుచేసుకోలేకపోయాను. మాకు చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవ్వరూ లేరు. ఉన్నవాళ్ళంతా మోసం చేసేవాళ్ళే. వాళ్ళు నా భాగస్వామి నన్ను మోసగించేలా ప్రయత్నించారు. అయినా, మెరుగైన ఒక పరదైసు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది అనుకున్నాను.
నా ప్రార్థనలకు సమాధానం
నా జీవితానికొక మార్గం చూపమని నా సొంత పద్ధతిలో, దేవుడికి తరచుగా ప్రార్థించేవాడ్ని. ఒక ఆదివారం నాడు ఉదయం ఈరెన్ లోపేస్ అనే పేరు గల స్నేహశీలియైన ఒక స్త్రీ తన చిన్ని బాబుతో మా ఇంటికి వచ్చింది. ఆమె ఒక యెహోవాసాక్షి. నేను ఆమె చెప్పింది విన్నాను, మళ్ళీ వస్తానని ఆమె చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. నన్ను కలవడానికి ఇద్దరు మగవాళ్ళు వచ్చారు. మా సంభాషణలోని రెండు విషయాలను నేను మనస్సులో ఉంచుకున్నాను—అవి పరదైసు, దేవుని రాజ్యం. నేను ఆ విషయాలను నా హృదయంలో పదిలంగా ఉంచుకున్నాను, మంచి మనస్సాక్షిని కల్గి ఉండాలంటే, నిజమైన సంతోషాన్ని కనుగొనాలంటే, దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా నేను నా జీవితాన్ని మార్చుకోవాలన్నది నెలలు గడుస్తున్న కొద్దీ అర్థమైంది.
మేము దేవుని వాక్యానికి అనుగుణ్యంగా మా జీవితాలను మార్చుకుంటుండగా, నా సహచరి నన్ను పెళ్ళి చేసుకోవడానికి మొదటిసారిగా సుముఖత చూపింది. కానీ, తర్వాత దేవుడ్ని, ఆయన కట్టడలను పరిహసించే చెడ్డ ప్రజలతో ఆమె సహవాసం చేసింది. వసంతకాలపు ఒక సంధ్యవేళ ఇంటికి వచ్చినప్పుడు హతాశుడినయ్యాను. మా ఇల్లు ఖాళీగా ఉంది. నా సహచరి మా మూడేళ్ళ పాపను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు తిరిగి వస్తారని ఎన్నో రోజులు ఎదురుచూశాను—కానీ ఫలితం శూన్యం. నేను దేవుడ్ని నిందించక, ఆయన సహాయం కోసం ప్రార్థించాను.
ఇది జరిగిన కొంత కాలానికి, నేను బైబిలు తీసుకుని, మా అత్తి చెట్టు క్రింద కూర్చుని, చదవడం ప్రారంభించాను. నిజంగా, నేను దానిలోని మాటలను చాలా ఆత్రంగా చదివాను. నేను మానసిక విశ్లేషణవేత్తల, మానసిక శాస్త్రవేత్తల పుస్తకాలను ఎన్నింటినో చదివాను, కానీ నేనింత సూక్ష్మబుద్ధిని వాటిలో ఎన్నడూ చూడలేదు. ఈ పుస్తకం తప్పకుండా దైవికంగా ప్రేరేపించబడిందే అయ్యుంటుంది. యేసు బోధలూ, మానవ నైజాన్ని గురించి ఆయనకున్న అవగాహనా నన్ను అమితంగా ఆశ్చర్యపరిచాయి. కీర్తనల గ్రంథం ద్వారా ఓదార్పు పొందాను, సామెతల ఆచరణాత్మక సూక్ష్మబుద్ధికి ఆశ్చర్యచకితుడినయ్యాను. సృష్టి అధ్యయనం ఒకరు దేవునికి చేరువకావడానికి ఒక అమోఘమైన మార్గమే అయినా, అది కేవలం “ఆయన కార్యములలో స్వల్పము”లను మాత్రమే వెల్లడి చేస్తుందని త్వరలోనే గ్రహించాను.—యోబు 26:14.
సాక్షులు నిత్యజీవమునకు నడిపించు సత్యము, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుముa అనే పుస్తకాలను కూడా నాకు ఇచ్చి వెళ్ళారు. వాటిని చదివినప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ప్రపంచవ్యాప్త కాలుష్యం, యుద్ధాలు, హింస పెరగడం, న్యూక్లియర్ నాశనాన్ని గూర్చిన భయాలను మానవుడు ఎందుకు ఎదుర్కొనవలసి వస్తుందో నేను అర్థం చేసుకోవడానికి సత్యము పుస్తకం నాకు సహాయం చేసింది. నేను నా తోటలోనుండి చూసినప్పుడు ఎర్రగా కనిపించిన ఆకాశం మరుసటి రోజు మంచి వాతావరణం ఉంటుందని ఘోషించి చెప్పినట్లే, ఈ సంఘటనలన్నీ దేవుని రాజ్యం అతి సమీపంలో ఉంది అని రుజువు చేస్తున్నాయి. కుటుంబ జీవితము పుస్తకం విషయానికొస్తే నేను దాన్ని నా సహచరికి చూపించి, బైబిలు సలహాలను కనుక, ఆచరణలో పెట్టినట్లయితే, మనం సంతోషంగా ఉండగలమని చెప్పాలని ఆశించాను. కానీ, అదిక సాధ్యం కాదు.
ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడం
నేను మరింత ఎక్కువగా తెల్సుకోవాలనుకున్నాను. మా ఇంటికి రమ్మని రోబర్ అనే ఒక యెహోవాసాక్షిని అడిగాను. నేను బాప్తిస్మం తీసుకోవాలని కోరడం ఆయనను ఆశ్చర్యచకితుడ్ని చేసింది, నాతో ఒక బైబిలు పఠనం ప్రారంభించబడింది. వెంటనే, నేను నేర్చుకుంటున్నదాన్ని ఇతరులతో మాట్లాడడం, రాజ్యమందిరంలో తీసుకున్న ప్రచురణలను పంపకం చేయడం ప్రారంభించాను.
బ్రతుకుతెరువు కోసం తాపీపని నేర్చుకోవడానికి చేరాను. దేవుని వాక్యం ఒక వ్యక్తికి చేయగల మంచిని గూర్చి ఎరిగినవాడనై, నా తోటి విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ అనియతంగా ప్రకటించే ప్రతీ అవకాశాన్ని వినియోగించుకునేవాడ్ని. ఒక సాయంత్రం సెర్జ్ అనే వ్యక్తిని కారిడార్‌లో కలిశాను. ఆయన చేతిలో కొన్ని పత్రికలు ఉన్నాయి. “మీకు చదవడం ఇష్టమనుకుంటాను” అని ఆయనతో అన్నాను. “అవును, కానీ ఈ పత్రికలతో బాగా బోర్ కొట్టేసింది” అన్నాడు. “మీరు చదవడానికి నిజంగా మంచి పుస్తకాలను కావాలనుకుంటున్నారా?” అని అడిగాను. మా మధ్య దేవుని రాజ్యాన్ని గురించి ఒక చక్కని చర్చ జరిగింది, తర్వాత ఆయన కొంత బైబిలు సాహిత్యాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాతి వారం ఆయన నాతో పాటు రాజ్యమందిరానికి వచ్చారు, ఆయనతో ఒక బైబిలు పఠనం ప్రారంభించబడింది.
ఒకరోజు నేను రోబర్‌ను ఇంటింటి పరిచర్యకు రావచ్చా అని అడిగాను. ఆయన తను బట్టలు పెట్టుకునే గదిలోకి వెళ్ళి, ఒక సూట్‌ను నాకోసం తీసుకువచ్చాడు. తర్వాతి ఆదివారం, నేను ఆయనతో కలిసి పరిచర్యలో మొట్టమొదటి అడుగు వేశాను. చివరకు, మార్చి 7, 1981న యెహోవాకు నా సమర్పణను బాప్తిస్మం ద్వారా బహిరంగంగా తెలియపరిచాను.
విపత్తులో ఉన్నప్పుడు సహాయం
అదేసమయంలో, అమాడీన్, ఆమె తల్లి వేరే దేశంలో ఉన్నారని తెల్సింది. నా కూతురి తల్లి తాను నివసించే దేశపు నియమాల ప్రకారం, చట్టబద్ధంగా నేను నా కూతుర్ని చూడడాన్ని నిషేధించింది. నేను బాగా కృంగిపోయాను. అమాడీన్ తల్లి పెళ్ళి చేసుకుంది, నా అనుమతి లేకుండానే నా కూతురును ఆమె భర్త దత్తత తీసుకున్నాడని గవర్నమెంటు నోటీసు అందినప్పుడు ఇంకా కృంగిపోయాను. ఇక నా బిడ్డపై నాకు ఎటువంటి హక్కూ లేదు. చట్టబద్ధంగా చర్య తీసుకున్నప్పటికీ, కనీసం నా కూతుర్ని కలుసుకునే హక్కును కూడా పొందలేకపోయాను. ఒక యాభై కిలోల బరువును నా వీపుపై మోస్తున్నట్లు అనిపించింది. నాకు అంత బాధ కలిగింది.
కానీ, యెహోవా వాక్యం నన్ను అనేక విధాలుగా ఆదుకుంది. ఒకరోజు నేను బాగా కృంగిపోయినప్పుడు సామెతలు 24:10ని నా మనస్సులో మళ్ళీ మళ్ళీ అనుకున్నాను. అదిలా చెబుతుంది: “శ్రమదినమున నీవు క్రుంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు.” ఈ లేఖనం నేను అధైర్యపడకుండా సహాయం చేసింది. మరొక సందర్భంలో నేను నా కూతురును చూడ్డానికి ప్రయత్నించినప్పుడు కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత నేను పరిచర్యకు వెళ్ళాను. నా పుస్తకాల సంచిని నేను చాలా గట్టిగా పట్టుకున్నాను. అటువంటి దుర్భరమైన క్షణాల్లో కీర్తనలు 126:6లోని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, అదిలా చెబుతుంది: “పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.” శ్రమలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి చేయగలిగినంతా చేసి, వదిలి పెట్టి, యెహోవా సేవలో కొనసాగాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగాలన్నది నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠం. మీరు సంతోషంగా ఉండే మార్గం ఇదే.
మరింత శ్రేష్ఠమైన దాని కోసం గట్టిగా ప్రయత్నించడం
నేను చేసుకున్న మార్పులను చూసిన, నా ప్రియమైన అమ్మా నాన్నలు నేను విశ్వవిద్యాలయంలో నా చదువుని కొనసాగించేందుకు సహాయం చేస్తామన్నారు. అందుకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పాను. కానీ ఇప్పుడు నాకు మరొక లక్ష్యం ఉంది. సత్యం నన్ను మానవతత్త్వశాస్త్రం, రహస్యవాదం, జ్యోతిశ్శాస్త్రాల నుండి విముక్తుడ్ని చేసింది. యుద్ధంలో ఒకరినొకరు చంపుకోని నిజమైన స్నేహితులు నాకిప్పుడు ఉన్నారు. ఈ భూమిపై ఎందుకింత బాధ ఉందన్న ప్రశ్నకు సమాధానాన్ని చివరికి కనుగొన్నాను. నాకున్న కృతజ్ఞతా భావాన్ని బట్టి నేను నా పూర్తి శక్తితో దేవుడ్ని సేవించాలనుకున్నాను. పరిచర్యకై యేసు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు, నేను ఆయన మాదిరిని అనుసరించాలనుకున్నాను.
1983లో నేను పూర్తికాల పరిచారకుడినయ్యేందుకు నా తాపీపనిని వదిలిపెట్టాను. నా ప్రార్థనలకు సమాధానంగా, నా జీవనోపాధికి పార్క్‌లో ఒక పార్ట్ టైమ్ ఉద్యోగం దొరికింది. తాపీపని పాఠశాలలో నేను సాక్ష్యాన్నందించిన యువకుడైన సెర్జ్‌తో పాటు పయినీరు పాఠశాలకు హాజరు కాగల్గడం ఎంత సంతోషకరమైన విషయం! క్రమ పయినీరుగా మూడు సంవత్సరాలు చేసిన తర్వాత, యెహోవా సేవను మరింత ఎక్కువగా చేయాలనుకున్నాను. 1986లో పారిస్‌కు ఎంతో దూరంలేని ప్రోవాలోని ఒక ఆకర్షణీయమైన పట్టణంలో ప్రత్యేక పయినీరుగా నియమించబడ్డాను. తరచుగా, సాయంత్రం ఇంటికి వచ్చాక, తనను గురించి ఇతరులతో మాట్లాడేందుకు చక్కని రోజును ఇచ్చినందుకు, మోకరించి ప్రార్థిస్తూ యెహోవాకు కృతజ్ఞతలు తెలిపేవాడ్ని. నిజానికి, జీవితంలో నాకు గొప్ప ఆహ్లాదాన్నిచ్చే రెండు సంగతులేమిటంటే, ఒకటి దేవునితో మాట్లాడడం, రెండవది దేవుని గురించి మాట్లాడడం.
మరొక గొప్ప సంతోషకరమైన విషయం ఏమిటంటే, దక్షిణ ఫ్రాన్సులోని చిన్న గ్రామమైన సేబసాన్‌లో ఉంటున్న 68 సంవత్సరాల మా అమ్మ బాప్తిస్మం తీసుకోవడం. మా అమ్మ బైబిలు చదవడం ప్రారంభించినప్పుడు, నేను మా అమ్మ కోసం కావలికోట, తేజరిల్లు!లకు చందా కట్టాను. ఆమె ఆలోచించే వ్యక్తి. తాను చదివే దానిలో సత్యం మారుమ్రోగడాన్ని అతి త్వరలోనే ఆమె గ్రహించింది.
బేతేలు—గమనార్హమైన ఆధ్యాత్మిక పరదైసు
వాచ్‌టవర్ సంస్థ ప్రత్యేక పయినీర్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించినప్పుడు నేను మినిస్టీరియల్ ట్రైనింగ్ పాఠశాల కోసమూ, ఫ్రాన్సులోని యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీసైన బేతేలులో సేవించడం కోసమూ దరఖాస్తు పెట్టుకున్నాను. నేను ఆయనను ఎంత శ్రేష్ఠంగా సేవించగలనన్నది, యెహోవా నిర్ణయానికే వదిలేయాలనుకున్నాను. కొన్ని నెలల తర్వాత, 1989 డిసెంబర్‌లో వాయవ్య ఫ్రాన్సులోని లావీర్స్‌లో ఉన్న బేతేలుకు నన్ను ఆహ్వానించారు. నా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళను చూసుకోవడంలో మా తమ్ముడికి, మరదలికి సహాయం చేయగలిగాను. నేను వేలాది కిలోమీటర్ల దూరంలో మిషనరీ సేవలో ఉన్నట్లయితే, వారికిలా సహాయం చేయలేక పోయేవాడ్ని.
అమ్మ నన్ను చూడడానికి బేతేలుకు అనేకసార్లు వచ్చేది. ఆమె నా నుండి దూరంగా జీవించడం ఒక త్యాగమే అయినప్పటికీ, “బేతేలులోనే ఉండు బాబూ. యెహోవాను నువ్వు ఇలా సేవిస్తున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను” అని ఆమె తరచుగా చెప్పేది. దుఃఖకరమైన విషయమేమిటంటే, ఇప్పుడు నా తల్లిదండ్రులిద్దరూ లేరు. ఈ భూమి అక్షరార్థంగానే పరదైసుగా మారినప్పుడు వారిని చూడడం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో!
“పరదైసు ఇప్పుడే” అని ఏ ఇల్లైనా వర్ణించబడగల యోగ్యతను కల్గి ఉంటే అది బేతేలే, ‘దేవుని గృహమే’ అని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే, అన్నిటికీ మించి, నిజమైన పరదైసు ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికత రాజ్యమేలేది బేతేలులోనే. ఆత్మఫలాలను అలవర్చుకునే అవకాశం మాకుంది. (గలతీయులు 5:22, 23) బైబిలు దిన వచన చర్చ ద్వారా, కుటుంబ కావలికోట పఠనం ద్వారా మేము తీసుకునే ఆధ్యాత్మిక పోషకాహారం నేను బేతేలు సేవలో బలపడడానికి సహాయం చేస్తుంది. ఇంకా, దశాబ్దాలుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న ఆధ్యాత్మిక మనస్సు గల సహోదర సహోదరీల సహవాసం బేతేలును ఆధ్యాత్మికంగా ఎదగగల సాటిలేని స్థలంగా చేసింది. అయినప్పటికీ, నేను ఇప్పటికి 17 సంవత్సరాలుగా నా కూతురుకి వేరుగా ఉన్నాను. బేతేలులో ఆసక్తి గల అనేకమంది యౌవనులను నేను కనుగొన్నాను. వారిని నా పిల్లలుగా ఎంచుతాను. వారి ఆధ్యాత్మిక అభివృద్ధిని బట్టి నేనెంతో ఆనందిస్తాను. గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో నేను ఏడు వేర్వేరు అసైన్‌మెంట్‌లలోకి మారాను. ఈ మార్పులు అన్నివేళలా అంత సులభం కాకపోయినప్పటికీ, ఇటువంటి శిక్షణ భవిష్యత్తులో ప్రయోజనకరం.
నూరంతలుగా ఉత్పత్తి చేసే చిక్కుడు మొక్కలను నేను పెంచేవాడ్ని. ఇందుకు సాదృశ్యంగా, మీరు చెడును విత్తితే—కేవలం ఒక్కసారే కాదు—వందసార్లు చెడును కోస్తారు అన్న విషయంలో నాకు అనుభవం ఉంది. అనుభవమనే పాఠశాలలోని పాఠాలకు ఎంతో మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అయితే, నేను ఆ పాఠశాలను ఇష్టపడను, బదులుగా యెహోవా మార్గాల్లో పెరగడాన్నే ఇష్టపడతాను. క్రైస్తవ తల్లిదండ్రుల పెంపకంలో పెరిగే యౌవనులు ఎంత గొప్ప ఆధిక్యత గలవారు! నిస్సందేహంగా, యెహోవాసేవలో మంచిని విత్తి శాంతిని, సంతృప్తిని నూరు రెట్లు ఎక్కువ కోయడం మేలు.—గలతీయులు 6:7, 8.
నేను పయినీరుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు మేము గోడ మీద అరాచకవాది నినాదాన్ని వ్రాసిన మతపరమైన దుకాణం వైపు వెళ్ళేవాడ్ని. నేను ఆ దుకాణం లోపల దాని యజమానితో జీవం గల దేవుడ్ని గూర్చి, ఆయన సంకల్పాన్ని గూర్చి మాట్లాడేవాడ్ని కూడా. అవును, దేవుడు జీవం గలవాడు! యెహోవాయే సత్యదేవుడు, ఆయన తన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టని నమ్మకమైన తండ్రి, ఇంకేం కావాలి. (ప్రకటన 15:4) సకల జనముల నుండి మరింత ఎక్కువమంది ప్రజలు జీవము గల దేవుడైన యెహోవాను సేవించడం ద్వారా, కీర్తించడం ద్వారా నేడు ఆధ్యాత్మిక పరదైసును అలాగే, రాబోయే పునఃస్థాపిత పరదైసును కనుగొందురు గాక!
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించింది.
[26వ పేజీలోని చిత్రాలు]
సృష్టిలోని అద్భుతాలను బట్టి కదిలించబడినవాడనై, దేవుడ్ని విశ్వసించాలని నా హృదయంలో నిర్ణయించుకున్నాను. (కుడివైపు) బేతేలు సేవలో నేడు