కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 2/15 పేజీలు 18-23
  • ప్రేమ మార్గం ఎన్నడూ విఫలం కాదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమ మార్గం ఎన్నడూ విఫలం కాదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గర్వాన్ని జయించేలా ప్రేమ సహాయపడుతుంది
  • ప్రేమ శాంతియుతమైన సంబంధాల్ని నెలకొల్పుతుంది
  • ప్రేమ సహించడానికి సహాయం చేస్తుంది
  • ప్రేమ—“సర్వోత్తమమైన మార్గము”
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • శాశ్వతకాలం ఉండే ప్రేమను పెంపొందించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 2/15 పేజీలు 18-23

ప్రేమ మార్గం ఎన్నడూ విఫలం కాదు

“కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.”—1 కొరింథీయులు 12:31.

1-3. (ఎ) ప్రేమను వ్యక్తపర్చడాన్ని నేర్చుకోవడం, ఏ విధంగా ఒక క్రొత్త భాషను నేర్చుకోవడంలాంటిదై ఉంది? (బి) ప్రేమను వ్యక్తపర్చడాన్నీ, నేర్చుకోవడాన్నీ ఏ కారకాలు ఒక సవాలుగా చేయగలవు?

మీరొక క్రొత్త భాషను నేర్చుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎంతలేదన్నా అది ఒక సవాలే! నిజమే, ఒక క్రొత్త భాషను తరచూ వింటూండడం ద్వారా చిన్న పిల్లవాడు ఆ భాషను నేర్చుకోగలడు. వాని మెదడు శబ్దాల్నీ, పదాల భావాల్నీ పూర్తిగా గ్రహిస్తుంది, అందువల్ల ఆ పిల్లవాడు అతి తక్కువ కాలంలో చక్కగా మాట్లాడతాడు, బహుశా ఆపకుండా మాట్లాడతాడు. పెద్దల విషయం అలా కాదు. పరాయి భాషలోని కొన్ని వాడుక పదాలపై పట్టు సాధించడానికి మనం పదే పదే ఆ భాషా నిఘంటువులను పరిశోధిస్తాం. అయితే క్రమేణా, తగినంత అనుభవాన్ని సంపాదించి ఆ క్రొత్త భాషలో ఆలోచించడం ప్రారంభిస్తాం, ఫలితంగా దాన్ని సులభంగా మాట్లాడగల్గుతాం.

2 ప్రేమను వ్యక్తపర్చడాన్ని నేర్చుకోవడం కూడా ఇంచుమించుగా క్రొత్త భాషను నేర్చుకోవడం వంటిదే. నిజమే, కొంత మోతాదులో ఈ దైవిక లక్షణం మానవుల్లో స్వతఃసిద్ధంగా ఉంటుంది. (ఆదికాండము 1:27; పోల్చండి 1 యోహాను 4:8.) అయితే, ప్రేమను ఎలా వ్యక్తపర్చాలో నేర్చుకునేందుకు ఎంతో కృషి అవసరం—మరి ముఖ్యంగా మమకారం కొరవడుతున్న ఈ దినాల్లో. (2 తిమోతి 3:1-5) కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అవును, అనేకమంది ప్రేమగల మాటలకు అంతగా నోచుకోని కఠినమైన వాతావరణంలో పెరుగుతారు. (ఎఫెసీయులు 4:29-31; 6:4) అయితే, మనం ప్రేమను అరుదుగా పొందినప్పటికీ కూడా దాన్ని వ్యక్తపర్చడాన్ని మనం నేర్చుకోగలం. ఎలా?

3 బైబిలు సహాయపడగలదు. పౌలు 1 కొరింథీయులు 13:4-8లలో ప్రేమకు ఒక యాంత్రికమైన నిర్వచనాన్ని ఇవ్వడంలేదుగానీ అత్యున్నతమైన ఈ ప్రేమ ఎలా పనిచేస్తుందనేదాని స్పష్టమైన వివరణను ఇస్తున్నాడు. ఈ వచనాల్ని పరిశీలించడం, ఆ దైవిక లక్షణ స్వభావాన్ని గ్రహించేలా మనకు సహాయపడి, దాన్ని వ్యక్తపర్చేందుకు మనల్ని సంసిద్ధుల్ని చేస్తుంది. పౌలు వర్ణించినట్టుగా ప్రేమకున్న కొన్ని ముఖవైఖరుల్ని పరిశీలిద్దాం. వాటిని మనం స్థూలంగా మూడు వర్గాలుగా విభజిద్దాం: మన సామాన్య ప్రవర్తన; తర్వాత, మరింత స్పష్టంగా, ఇతరులతో మన సంబంధాలు; చివరగా, మన సహనం.

గర్వాన్ని జయించేలా ప్రేమ సహాయపడుతుంది

4. బైబిలు అసూయ విషయంలో ఎలాంటి అంతర్దృష్టిని ఇస్తోంది?

4 ప్రేమను గురించిన తన ప్రారంభ వ్యాఖ్యానాల తర్వాత, పౌలు కొరింథీయులకు ఇలా రాశాడు: “ప్రేమ అసూయపడదు.” (1 కొరింథీయులు 13:4, పరిశుద్ధ బైబల్‌) అసూయ ఇతరులు అభివృద్ధిలోకి రావడాన్నో లేక సాధించినవాటినో చూసి ఈర్ష్యతో అసంతృప్తిని వ్యక్తపర్చగలదు. అలాంటి అసూయ భౌతికంగా, భావోద్రేకంగా, ఆధ్యాత్మికంగా వినాశనకరమైనది.—సామెతలు 14:30; రోమీయులు 13:13; యాకోబు 3:14-16.

5. ఏదైనా దైవపరిపాలనా ఆధిక్యత విషయంలో మనం అలక్ష్యంచేయబడినట్టు అన్పించినప్పుడు, అసూయను జయించడానికి ప్రేమ మనకెలా సహాయపడగలదు?

5 దాని దృష్ట్యా, ‘కొన్ని దైవపరిపాలనా ఆధిక్యతల విషయంలో నన్ను అలక్ష్యంచేస్తున్నట్టు అన్పించినప్పుడు నేను ఈర్ష్యపడుతున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జవాబు అవునైతే, నిరాశచెందకండి. బైబిలు రచయిత అయిన యాకోబు, ‘ఈర్ష్యపడడానికి మ్రొగ్గుచూపడం’ అపరిపూర్ణ మానవులందరిలో ఉందని మనకు గుర్తుచేస్తున్నాడు. (యాకోబు 4:5, NW) మీ సహోదరునిపట్ల గల ప్రేమ, మీ సమతూకమైన దృక్పథాన్ని పునరుద్ధరించుకోవడానికి మీకు సహాయపడగలదు. ఎవరైనా ఒక ఆశీర్వాదాన్ని లేక మెప్పును పొందినప్పుడు దాన్నొక వ్యక్తిగత అవమానంగా దృష్టించక, సంతోషించే వాళ్లతో సంతోషించేలా అది మీకు సహాయం చేస్తుంది.—1 సమూయేలు 18:7-9 పోల్చండి.

6. మొదటి శతాబ్దంలోని కొరింథు సంఘంలో ఎలాంటి తీవ్రమైన పరిస్థితి వృద్ధిచెందింది?

6 ప్రేమ “డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు” అని పౌలు జతచేస్తున్నాడు. (1 కొరింథీయులు 13:4) మనకు ఏదైనా నిపుణతో, సామర్థ్యమో ఉంటే, దాని గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరమేమీలేదు. ప్రాచీన కొరింథు సంఘంలోనికి జొరబడిన కొంతమంది అత్యాశపరులతో ఉన్న సమస్యల్లో ఇది ఒకటని స్పష్టమౌతుంది. బహుశా అభిప్రాయాల్ని వ్యక్తపర్చడంలో లేక పనుల్ని మరింత సమర్థవంతమైన రీతిలో చేయడంలో వాళ్లు శ్రేష్ఠమైన సామర్థ్యాల్ని కల్గివుండి ఉండవచ్చు. వాళ్లు తమపై తామే అవధానాన్ని నిలుపుకోవడం, సంఘం ముక్కచెక్కలుగా విడిపోయేందుకు దోహదపడి ఉండవచ్చు. (1 కొరింథీయులు 3:3, 4; 2 కొరింథీయులు 12:20) పరిస్థితి ఎంత తీవ్రతరమయ్యిందంటే పౌలు “మిక్కిలి శ్రేష్ఠులైన . . . అపొస్తలుల”ని ఎవరినైతే విమర్శనాత్మకంగా వర్ణించాడో ఆ ‘అవివేకులను సహిస్తున్నందుకు’ కొరింథు సంఘస్థులను అటు తర్వాత ఆయన గద్దించాల్సి వచ్చింది.—2 కొరింథీయులు 11:5, 19, 20.

7, 8. మనకున్న సహజసిద్ధమైన ప్రజ్ఞాపాటవాల్ని ఐక్యతను పెంపొందించేందుకు మనమెలా ఉపయోగించగలమో బైబిల్లో నుండి చూపించండి.

7 నేడు కూడా అలాంటి పరిస్థితే వృద్ధిచెందవచ్చు. ఉదాహరణకు, పరిచర్యలో తాము సాధించినవాటిని గురించో లేక దేవుని సంస్థలో తమకున్న ఆధిక్యతల్ని గురించో గొప్పలు చెప్పుకునే ప్రవృత్తి కొంతమందికి ఉండవచ్చు. సంఘంలో ఇతరులకులేని ఒకానొక నైపుణ్యమో లేక సామర్థ్యమో మనకుంటే, అతిశయించడానికి అది మనకు లైసెన్సును ఇస్తుందా? మనకున్న సహజసిద్ధమైన ప్రజ్ఞాపాటవాల్లో దేన్నైనా మనల్ని గొప్ప చేసుకోవడానికిగాక ఐక్యతను పెంపొందించడానికే ఉపయోగించాలి.—మత్తయి 23:12; 1 పేతురు 5:6.

8 సంఘంలో అనేకమంది సభ్యులు ఉన్నప్పటికీ, “దేవుడు . . . శరీరమును అమర్చియున్నాడు” అని పౌలు రాశాడు. (1 కొరింథీయులు 12:19-26) ‘అమర్చడం’ అని అనువదించబడిన గ్రీకు పదం, రంగులను మిక్సింగ్‌ చేయడంలోలానే కలిసిపోయేలా సమ్మిళితమవ్వడాన్ని సూచిస్తుంది. సంఘంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తీ, తన సామర్థ్యాల విషయంలో అతిశయించకూడదు, ఇతరులపై పెత్తనంచెలాయించడానికి ప్రయత్నించకూడదు. దేవుని సంస్థలో గర్వం, అత్యాశలకు తావులేదు.—సామెతలు 16:19; 1 కొరింథీయులు 14:12; 1 పేతురు 5:2, 3.

9. తమ స్వప్రయోజనాల కోసం విచారించుకునే వ్యక్తులను గూర్చిన ఏ హెచ్చరికా మాదిరులను బైబిలు తెలియజేస్తోంది?

9 ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరింథీయులు 13:5) ప్రేమగల వ్యక్తి, తన స్వార్థంకోసం ఇతరులను నేర్పుతో వశపరుచుకోడు. ఆ విషయంలో హెచ్చరికా మాదిరులను బైబిలు కల్గివుంది. ఉదాహరణకు: తమ స్వార్థం కోసం ఇతరులను నేర్పుగా వశపరుచుకున్న స్త్రీలైన దెలీలా, యెజెబెలు, అతల్యాలను గురించి మనం చదువుతాం. (న్యాయాధిపతులు 16:16; 1 రాజులు 21:25; 2 దినవృత్తాంతములు 22:10-12) రాజైన దావీదు కుమారుడు అబ్షాలోము కూడా అలాంటివాడే. న్యాయం కోసం యెరూషలేముకు వచ్చేవాళ్ల దగ్గరకు వెళ్లి, వాళ్ల సమస్యలపట్ల రాజ న్యాయస్థానానికి యథార్థమైన ఆసక్తిలేదని చాలా టక్కరితనంతో సూచించేవాడు. ఆ తర్వాత అతడు, నిజానికి న్యాయస్థానానికి కావాల్సింది తనలాంటి స్నేహశీలియైన వ్యక్తేనని సూటిగా చెప్పేవాడు! (2 సమూయేలు 15:2-4) నిజమే, అబ్షాలోముకు పీడిత ప్రజలపైగాక తనపై మాత్రమే ఆసక్తి ఉంది. అతడు స్వయం నియమిత రాజుగా నటిస్తూ, అనేకమంది హృదయాలను దోచుకున్నాడు. కానీ కొంతకాలానికి, అబ్షాలోము వినాశనకరమైన ఓటమిని పొందాడు. అతడు మరణించినప్పుడు, గౌరవపూర్వకమైన శవ సంస్కారానికి కూడా నోచుకోలేదు.—2 సమూయేలు 18:6-17.

10. ఇతరుల ఆసక్తులపై మనం శ్రద్ధను చూపిస్తున్నామని మనమెలా ప్రదర్శించగలం?

10 అది నేడు క్రైస్తవులకు ఒక హెచ్చరికగా ఉంది. పురుషులమైనా, లేక స్త్రీలమైనా, వశపర్చుకునే శక్తులు సహజంగానే మనకు ఉండవచ్చు. చెప్పాలంటే, సంభాషణలో పైచేయి మనదే అయ్యేట్టుగా చూసుకోవడం ద్వారా లేక మనకు భిన్నమైన దృక్పథాన్ని కల్గివున్న వారిని బలహీనపర్చడం ద్వారా మనం అనుకున్నది జరిగేటట్టు చూడడం మనకు సులభంగా ఉండవచ్చు. అయితే, మనం నిజంగా ప్రేమగల వ్యక్తులమైతే, ఇతరుల ఆసక్తులపై శ్రద్ధను చూపిస్తాం. (ఫిలిప్పీయులు 2:2-4) దేవుని సంస్థలో మనకున్న అనుభవాన్నిబట్టో లేక మన ఆధిక్యతల్నిబట్టో మన అభిప్రాయాలు మాత్రమే పరిశీలనకు ఆమోదయోగ్యమైనవన్నట్టుగా ఇతరులనుండి ప్రయోజనం పొందాలని చూడం లేక సంశయించదగిన అభిప్రాయాల్ని పెంపొందించం. బదులుగా, మనమీ బైబిలు సామెతను గుర్తుంచుకుంటాం: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”—సామెతలు 16:18.

ప్రేమ శాంతియుతమైన సంబంధాల్ని నెలకొల్పుతుంది

11. (ఎ) దయగలదీ, మర్యాదగలదీ అయిన ప్రేమను మనమే మార్గాల్లో చూపించగలం? (బి) మనం దుర్నీతినిబట్టి సంతోషించమని మనమెలా చూపించగలం?

11 ప్రేమ “దయ”గలది, అది “అమర్యాదగా నడువదు” అని కూడా పౌలు రాశాడు. (1 కొరింథీయులు 13:4, 5) అవును, ప్రేమ మనల్ని మొరటుగా, అసభ్యంగా, లేక అమర్యాదకరమైన రీతిలో ప్రవర్తించనివ్వదు. బదులుగా, మనం ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకుంటాం. ఉదాహరణకు, ప్రేమగల వ్యక్తి ఇతరుల మనస్సాక్షిని కలతపర్చే పనులు చేయకుండా జాగ్రత్తవహిస్తాడు. (పోల్చండి 1 కొరింథీయులు 8:13.) ప్రేమ “దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషి”స్తుంది. (1 కొరింథీయులు 13:6) మనం యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే, దుర్నీతిని చూసీచూడనట్టు ఉండం లేక దేవుడు అసహ్యించుకుంటున్న వాటిని చూసి వినోదాన్ని పొందం. (కీర్తన 119:97) ప్రేమ, నాశనకరమైన విషయాల్లోగాక క్షేమాభివృద్ధికరమైన విషయాల్లో ఆనందించేలా మనకు సహాయపడుతుంది.—రోమీయులు 15:2; 1 కొరింథీయులు 10:23, 24; 14:26.

12, 13. (ఎ) ఎవరైనా మనకు చిరాకును కలిగిస్తే, మనమెలా ప్రతిస్పందించాలి? (బి) సరియైన కోపం కూడా అజ్ఞానంగా ప్రవర్తించడానికి కారణంకాగలదని చూపించడానికి బైబిలు ఉదాహరణలను పేర్కొనండి.

12 ప్రేమ “త్వరగా కోపపడదు [“శీఘ్రంగా చిరాకు పడదు,” పరిశుద్ధ బైబల్‌]” (1 కొరింథీయులు 13:5) నిజమే, ఎవరైనా మనకు కోపం తెప్పించినప్పుడు, కలతచెందడమో లేక కొంతమేరకు ఉద్రేకపడడమో అపరిపూర్ణ మానవులమైన మనకు సహజమే. అయితే, ఆగ్రహాన్ని దీర్ఘకాలంపాటు ఉంచుకోవడం లేక కోపాన్నలాగే ఉంచుకోవడం తప్పు అవుతుంది. (కీర్తన 4:4; ఎఫెసీయులు 4:26) అదుపులో పెట్టుకోకపోతే, అది సరియైన కోపమైనా సరే, మనం అజ్ఞానంగా ప్రవర్తించడానికి కారణమవ్వవచ్చు, మరి ఆ విషయంలో యెహోవా మనల్ని బాధ్యుల్ని చేయవచ్చు.—ఆదికాండము 34:1-31; 49:5-7; సంఖ్యాకాండము 12:3; 20:10-12; కీర్తన 106:32, 33.

13 క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం లేక క్షేత్ర పరిచర్యలో భాగంవహించడం వంటి వాటి గురించి తాము తీసుకునే నిర్ణయాలను ఇతరుల అపరిపూర్ణతలు ప్రభావితం చేసేందుకు కొంతమంది అనుమతించారు. గతంలో, వారిలో అనేకమంది బహుశా కుటుంబం నుండి వచ్చిన వ్యతిరేకతల్నీ, తోటి ఉద్యోగస్థులు చేసే అవహేళనల్నీ, మరి అలాంటి వాటిని సహిస్తూ విశ్వాసం కోసం గట్టి పోరాటాన్ని పోరాడారు. అలాంటి ఆటంకాల్ని వాళ్లు తమ యథార్థతకు పరీక్షలుగా దృష్టించినందున వాటిని సహించారు, మరి అవి అలాంటివే. కానీ తోటి క్రైస్తవుడు ప్రేమలేని రీతిలో ఏదైనా అన్నప్పుడు, లేక ఏదైనా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అది కూడా యథార్థతకు ఒక పరీక్ష కాదా? నిజానికి అది ఒక పరీక్షే, ఎందుకంటే మనం కోపాన్ని మనస్సులో అలాగే ఉంచుకుంటూనే ఉంటే, మనం ‘అపవాదికి చోటు ఇచ్చిన’ వాళ్లం కాగలము.—ఎఫెసీయులు 4:27.

14, 15. (ఎ) ‘అపకారాన్ని ఖాతాలో ఉంచుకోవడం’ అంటే అర్థమేమైవుంది? (బి) క్షమించేవారిగా ఉండడంలో మనం యెహోవాను ఎలా అనుకరించగలం?

14 సకారణంతోనే, ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు [“అపకారాన్ని ఖాతాలో ఉంచుకోదు,” NW]” అని పౌలు జతపరుస్తున్నాడు. (1 కొరింథీయులు 13:5) బహుశా కోపం రప్పించిన సందర్భాన్ని మర్చిపోకుండా ఉండేలా ఖాతాలో దాన్ని రాసే పనిని సూచించడానికి ఆయన అక్కౌంటింగ్‌ పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మనల్ని గాయపర్చిన మాటనుగానీ లేక చర్యనుగానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ఎత్తిచూపించాల్సి ఉంటుందన్నట్టు వాటిని మనస్సులో శాశ్వతంగా రికార్డుచేసుకోవడం ప్రేమపూర్వకమైన విషయమంటారా? అలా దయలేని రీతిలో యెహోవా మనల్ని శల్యపరీక్ష చేయడని మనం ఎంత సంతోషించవచ్చోగదా! (కీర్తన 130:3) అవును, మనం పశ్చాత్తాపాన్ని చూపించినప్పుడు, మన తప్పిదాల్ని ఆయన తుడిచివేస్తాడు.—అపొస్తలుల కార్యములు 3:20.

15 ఆ విషయంలో మనం యెహోవాను అనుకరించవచ్చు. ఎవరైనా మనల్ని అగౌరవపరుస్తున్నట్టు అన్పించినప్పుడు, మనం మరీ సున్నితమనస్కులమై ఉండకూడదు. మనం త్వరగా నొచ్చుకుంటే, మనల్ని నొప్పించిన వ్యక్తికన్నా మరింత ఎక్కువగా మనల్ని మనమే గాయపర్చుకొన్నవారమవ్వవచ్చు. (ప్రసంగి 7:9, 22) బదులుగా, ప్రేమ “అన్నిటిని నమ్ము”తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవడం అవసరం. (1 కొరింథీయులు 13:7) మనలో ఎవ్వరమూ సులభంగా మోసగించబడేవారిగా ఉండాలని అనుకోం, అయితే మన సహోదరుల అభిప్రాయాల్ని అనవసరంగా అనుమానించేవారిగా కూడా ఉండకూడదు. సాధ్యమైనంతమేరకు, అవతల వ్యక్తికి దురుద్దేశాలేవీలేవనే అనుకుందాం.—కొలొస్సయులు 3:13.

ప్రేమ సహించడానికి సహాయం చేస్తుంది

16. ఏ పరిస్థితుల్లో మనం దీర్ఘకాలం సహించుకునేవారిగా ఉండడానికి ప్రేమ సహాయపడగలదు?

16 ఆ తర్వాత, పౌలు “ప్రేమ దీర్ఘకాలము సహించును” అని మనకు చెబుతున్నాడు. (1 కొరింథీయులు 13:4) ప్రేమ మనం శ్రమలను సహించుకునేలా, బహుశా దీర్ఘకాలంపాటు సహించుకునేలా చేస్తుంది. ఉదాహరణకు, అనేకమంది క్రైస్తవులు మతపరంగా విభజించబడిన ఇంట్లో సంవత్సరాల తరబడి జీవించారు. ఇతరులు తాము ఒంటరిగా ఉండాలని ఎంపికచేసుకున్నందువల్ల కాదుగానీ “ప్రభువునందు” తమకు తగిన జత దొరకనందుననే ఒంటరిగా ఉన్నారు. (1 కొరింథీయులు 7:39; 2 కొరింథీయులు 6:14) ఆపై దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు. (గలతీయులు 4:13, 14; ఫిలిప్పీయులు 2:25-30) నిజంగా, ఈ అపరిపూర్ణ విధానంలో, జీవితంలో ఏదొక రకమైన సహనాన్ని చూపించాల్సిన పరిస్థితంటూలేని వ్యక్తి ఒక్కరు కూడా లేరు.—మత్తయి 10:22; యాకోబు 1:12.

17. అన్నిటిని తాళుకునేలా మనకు ఏది సహాయపడుతుంది?

17 ప్రేమ “అన్నిటికి తాళుకొనును . . . అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును” అని పౌలు మనకు అభయమిస్తున్నాడు. (1 కొరింథీయులు 13:7) యెహోవాపట్ల గల ప్రేమ, మనం నీతి నిమిత్తం ఎలాంటి పరిస్థితినైనా భరించగల్గేలా చేస్తుంది. (మత్తయి 16:24; 1 కొరింథీయులు 10:13) మనం హతసాక్షులం అవ్వాలని ప్రయత్నించం. దానికి బదులుగా, శాంతియుతంగా, నెమ్మదిగా జీవించాలనేదే మన లక్ష్యం. (రోమీయులు 12:18; 1 థెస్సలొనీకయులు 4:11, 12, NW) అయినా, విశ్వాసాన్ని గూర్చిన శోధనలు వచ్చినప్పుడు, క్రైస్తవ శిష్యరికానికి చెల్లించాల్సిన మూల్యంలో భాగంగా మనం వాటిని సంతోషంగా సహిస్తాం. (లూకా 14:28-33) మనం సహించుకుంటుండగా, శోధనకరమైన పరిస్థితుల్లో నుంచి మంచి ప్రతిఫలం వస్తుందని నిరీక్షిస్తూ, మనం ఒక అనుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాం.

18. అనుకూలమైన పరిస్థితుల్లో సహితం సహనం ఎలా అవసరమౌతుంది?

18 సహనం చూపించాల్సింది శ్రమలు వచ్చినప్పుడు మాత్రమేకాదు. కొన్నిసార్లు, సహించడమంటే శోధనకరమైన పరిస్థితులు ఉన్నా లేకపోయినా ఓర్చుకుంటూ ఉండడమేనని అర్థం. సహనంలో మంచి ఆధ్యాత్మిక దైనందిన కార్యక్రమాన్ని పెంపొందించుకోవడం చేరివుంది. ఉదాహరణకు, మీరు మీ పరిస్థితులకు అనుగుణంగా పరిచర్యలో ఒక అర్థవంతమైన భాగాన్ని కల్గివున్నారా? దేవుని వాక్యాన్ని పఠిస్తూ, ధ్యానిస్తున్నారా, ప్రార్థనలో మీ పరలోకపు తండ్రితో సంభాషిస్తున్నారా? సంఘ కూటాలకు క్రమంగా హాజరౌతున్నారా, మీ తోటి విశ్వాసుల పరస్పర ప్రోత్సాహం నుండి ప్రయోజనాన్ని పొందుతున్నారా? అయితే, ప్రస్తుతం మీరు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా లేక శ్రమ కాలంలో ఉన్నా సరే, మీరు సహిస్తున్నారన్నమాట. ‘మనము అలయకపోతే తగినకాలమందు పంటకోస్తాం’ గనుక సహనాన్ని విడిచిపెట్టకండి.—గలతీయులు 6:9.

ప్రేమ—“సర్వోత్తమమైన మార్గము”

19. ప్రేమ ఎలా ఒక ‘సర్వోత్తమమైన మార్గము’?

19 ఆ దైవిక లక్షణాన్ని “సర్వోత్తమమైన మార్గము” అని పిలువడం ద్వారా పౌలు ప్రేమను వ్యక్తపర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. (1 కొరింథీయులు 12:31) ఏ భావంలో ‘సర్వోత్తమమైనది’? పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో సర్వసామాన్యమైన ఆత్మ సంబంధ కృపావరాల పట్టికను ఇచ్చాడు. కొందరు ప్రవచించగలిగారు. ఇతరులు రోగాల్ని స్వస్థపర్చే శక్తిని పొందారు. అనేకులు భాషలతో మాట్లాడే సామర్థ్యాన్ని పొందారు. నిజంగా, అద్భుతమైన కృపావరాలే ! అయినప్పటికీ, పౌలు కొరింథీయులకు ఇలా చెప్పాడు: “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.” (1 కొరింథీయులు 13:1, 2) అవును, విలువైనవై ఉండగల క్రియల వెనుక ఉన్న ఉద్దేశం దేవునిపట్లా, పొరుగువారిపట్లా ఉన్న ప్రేమకాకపోతే అవి ‘నిర్జీవ క్రియలు’ అవుతాయి.—హెబ్రీయులు 6:1.

20. మనం ప్రేమను పెంపొందించుకోవాలంటే ఎడతెగని కృషి ఎందుకు అవసరం?

20 దైవిక లక్షణమైన ప్రేమను మనమెందుకు పెంపొందించుకోవాలనే దానికి గల మరొక కారణాన్ని యేసు మనకు ఇస్తున్నాడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు]” అని ఆయన చెప్పాడు. (యోహాను 13:35) ‘యెడల’ అన్న పదం, ప్రతీ క్రైస్తవుడూ ప్రేమను వ్యక్తపర్చడం నేర్చుకుంటాడా లేదా అన్న విషయాన్ని ఆ యా వ్యక్తులకే విడిచిపెడుతోంది. ఏదోక పరాయి దేశంలో నివసిస్తుండడమే ఆ దేశ భాషను మాట్లాడడాన్ని నేర్చుకునేలా మనల్ని బలవంతం చేయదు. రాజ్యమందిరంలో జరిగే కూటాలకు హాజరవ్వడమే లేక తోటి క్రైస్తవులతో సహవసిస్తుండడమే ప్రేమను వ్యక్తపర్చడాన్ని మనకు బోధించదు. ఈ ‘భాషను’ నేర్చుకోవడానికి నిరంతర కృషి అవసరం.

21, 22. (ఎ) పౌలు చర్చించిన ప్రేమలోని కొన్ని ముఖవైఖరుల్ని మనం చేరుకోలేనట్లైతే, మనమెలా ప్రతిస్పందించాలి? (బి) ఏ రీతిలో ‘ప్రేమ ఎన్నడూ విఫలంకాదని’ చెప్పవచ్చు?

21 కొన్నిసార్లు, పౌలు వర్ణించిన ప్రేమలోని కొన్ని ముఖవైఖరులను మీరు చేరుకోలేకపోవచ్చు. కానీ నిరుత్సాహపడకండి. సహనంతో కృషిచేయండి. బైబిల్ని పరిశీలించడంలో కొనసాగండి, ఇతరులతో మీరు వ్యవహరించుతీరునందు దాని సూత్రాల్ని అన్వయించుకోండి. మన విషయంలో యెహోవా తానుగా ఉంచిన మాదిరిని ఎన్నటికీ మర్చిపోకండి. పౌలు ఎఫెసీయులకు ఇలా ఉద్బోధించాడు: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:32.

22 క్రొత్త భాషలో భావాల్ని వ్యక్తపర్చడాన్ని నేర్చుకోగా నేర్చుకోగా చివరికది సులభతరమైనట్టు, బహుశా మీరు ప్రేమను వ్యక్తపర్చడం సులభతరమౌతుందని కొంతకాలానికి కనుగొంటారు. “ప్రేమ శాశ్వతకాలముండును [“ప్రేమ ఎన్నడూ విఫలంకాదు,” NW] అని పౌలు మనకు అభయమిస్తున్నాడు. (1 కొరింథీయులు 13:8) ఆత్మ సంబంధిత అద్భుతమైన కృపావరాలవలేగాక, ప్రేమ ఎన్నటికీ గతించిపోదు. కాబట్టి, ఆ దైవిక లక్షణాన్ని వ్యక్తపర్చడాన్ని నేర్చుకుంటూనే ఉండండి. పౌలు పిలిచినట్టుగా అది “సర్వోత్తమమైన మార్గము.”

మీరు వివరించగలరా?

◻ గర్వాన్ని జయించేందుకు ప్రేమ మనకెలా సహాయపడగలదు?

◻ సంఘంలో శాంతిని పెంపొందించేలా ప్రేమ మనకు ఏ యే రీతుల్లో సహాయపడగలదు?

◻ సహించుకునేలా ప్రేమ మనకెలా సహాయపడగలదు?

◻ ఏ విధంగా ప్రేమ ఒక “సర్వోత్తమమైన మార్గము”?

[19వ పేజీలోని చిత్రం]

మన తోటి విశ్వాసుల లోపాలను పట్టించుకోకుండా ఉండడానికి ప్రేమ మనకు సహాయపడుతుంది

[23వ పేజీలోని చిత్రాలు]

సహించుకోవడం అంటే మన దైవపరిపాలనా దైనందిన కార్యక్రమాన్ని అనుసరించడమే

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి