కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 10/15 పేజీలు 17-22
  • ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమ కాని విషయాలు
  • ప్రేమకాని మరితర విషయాలు
  • ప్రేమ గల విషయాలు
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • “వీటన్నిటిలో గొప్పది ప్రేమ”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ప్రేమ యొక్క ఉత్కృష్టమైన విధానం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 10/15 పేజీలు 17-22

ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది

“సహోదర అనురాగమందు ప్రేమను అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5, 7, NW.

1. (ఎ) ఏ లక్షణానికి బైబిలు ప్రాధాన్యత నిస్తున్నది? (బి) అనేక సార్లు ఏ నాలుగు గ్రీకు పదాలు “ప్రేమ” అని అనువదింపబడ్డాయి, 1 యోహాను 4:8 నందు చెప్పబడినది ఏది?

దేవుని వాక్యమైన బైబిలు ఏదైనా లక్షణానికి లేక గుణానికి ప్రాధాన్యత నిస్తుందంటే, అది ప్రేమయే. క్రైస్తవ లేఖనాల మూల భాషయైన గ్రీకులో, తరచు “ప్రేమ” అని అనువదించబడిన దానికి నాలుగు పదాలు కలవు. ఇప్పుడు మనం పరిశీలించేది లైంగికాకర్షణపై ఆధారపడివుండే ఎరోస్‌ (క్రైస్తవ గ్రీకు లేఖనాలలో కనబడని పదం) అను పదం గురించి కాదు; రక్తసంబంధంపై ఆధారపడివుండే భావమైన స్టోర్‌గె గురించి కాదు; లేక మునుపటి శీర్షికలో వచ్చిన పరస్పర గౌరవంపై ఆధారపడిన మిక్కుటమైన స్నేహపూరిత ప్రేమ అయిన ఫిలియా గురించి కాదు. కాని, “దేవుడు ప్రేమా స్వరూపి” అని అపొస్తలుడైన యోహాను చెప్పినప్పుడు ఆయన సూచించిన ప్రేమ స్వార్థంలేని, సూత్రంపై ఆధారపడిన ప్రేమయైన అగాపె.—1 యోహాను 4:8.

2. ప్రేమ (అగాపె) గురించి ఏమి చెప్పబడింది?

2 ఈ ప్రేమను (అగాపె) గురించి న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ అనే తన పుస్తకంలో అధ్యాపకుడైన విలియమ్‌ బార్‌క్లె ఇలా చెప్పాడు: “అగాపె మనస్సుకు సంబంధించినది; అది కేవలం మన హృదయంలో అనాహుతంగా ఉత్పన్నమయ్యే భావంకాదు [బహుశా ఫిలియ విషయంలోలా]; అది మనం ఉద్దేశపూర్వకంగా జీవించే ఒక సూత్రము. అగాపె ముఖ్యంగా చిత్తముకు సంబంధించినది. అది ఒక విజయం, గెలుపు, సాఫల్యత. సహజంగా ఎవ్వరూ ఎప్పుడూ తన శత్రువులను ప్రేమించలేదు. మన శత్రువులను ప్రేమించడమంటే మన సహజ ఇష్టాలను, భావాలను జయించడమై యున్నది. వాస్తవానికి ఈ అగాపె . . . ప్రేమించజాలని వారిని ప్రేమించడం, మనకిష్టంలేని వ్యక్తులను ప్రేమించగలశక్తే.”

3. యేసుక్రీస్తు మరియు పౌలు ప్రేమను గూర్చి ఏమి నొక్కిచెప్పారు?

3 అవును, ఇతర రకాలైన ఆరాధనల నుండి యెహోవా దేవుని సత్యారాధనను వేరుచేసే అనేక విషయాలలో ఒకటేమనగా ఈ రకమైన ప్రేమను నొక్కిచెప్పడమే. యేసుక్రీస్తు సరిగానే రెండు మహా గొప్ప ఆజ్ఞలను గూర్చి చెప్పాడు: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు.” (మార్కు 12:29-31) అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమకు అదే ప్రాధాన్యత నిస్తున్నాడు. ప్రేమ ఉత్తమ, ఆవశ్యక లక్షణమని నొక్కిచెప్పిన తరువాత, ఆయనిలా ముగించాడు: “కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.” (1 కొరింథీయులు 13:13) ప్రేమ తన అనుచరులను గుర్తించే చిహ్నమైవుంటుందని యేసు సరిగానే చెప్పాడు.—యోహాను 13:35.

ప్రేమ కాని విషయాలు

4. మొదటి కొరింథీయులు 13:4-8 నందు ప్రేమ యొక్క ఎన్ని ప్రతికూల, అనుకూల దృక్పథాలను గూర్చి పౌలు తెలియజేశాడు?

4 ప్రేమ అంటే ఏమిటో చెప్పడంకంటే, ఏది ప్రేమకాదో చెప్పడం సుళువని చెప్పబడింది. అందులో కొంత సత్యమున్నది ఎందుకనగా అపొస్తలుడైన పౌలు ప్రేమను గూర్చిన తన అధ్యాయము 1 కొరింథీయులు 13:4-8 వచనాలలో ఏది ప్రేమ కాదో అనేదానికి తొమ్మిది విషయాలను, ప్రేమ ఏమైయున్నదో అనేదానికి ఏడు విషయాలను వివరిస్తున్నాడు.

5. “మత్సరం” ఏవిధంగా నిర్వచింపబడింది, అది లేఖనాలలో, అనుకూల భావంలో ఎలా ఉపయోగింపబడింది?

5 ప్రేమ ఏమికాదో పౌలు తెలియజేసిన మొదటి విషయమేమనగా “ప్రేమ మత్సరపడదు.” దీనిని పెద్దగా వివరించనవసరం లేదు ఎందుకనగా మత్సరానికి అనుకూల, ప్రతికూల దృక్పథాలున్నాయి. ఒక నిఘంటువు “మత్సరం” అంటే “విరోధాన్ని సహించలేదు” మరియు “అనితరభక్తిని కోరుట” అని నిర్వచిస్తున్నది. అందుకే నిర్గమకాండము 34:14లో మోషే ఇలా చెప్పాడు: “ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.” నిర్గమకాండము 20:5 (NW) నందు యెహోవా ఇలా తెలియజేశాడు: “ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను అనితరభక్తిని కోరు దేవుడను.” అదే ధోరణిలో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను.”—2 కొరింథీయులు 11:2.

6. ప్రేమ మత్సరము కలది కాదని ఏ లేఖనాధార మాదిరులు చూపిస్తున్నవి?

6 సామాన్యంగా, “మత్సరం” చెడ్డ గుణాన్ని సూచిస్తుంది, అందుకే అది గలతీయులు 5:20 నందు శరీరకార్యాలలో లెక్కించబడింది. అవును అలాంటి మత్సరం స్వార్థపూరితమైనది, అది ద్వేషాన్ని రగిలిస్తుంది. ద్వేషం ప్రేమకు వ్యతిరేకమైనది. మత్సరం కయీను హేబేలును చంపేంతగా అతన్ని ద్వేషించేలా చేసింది. యోసేపును అతని పదిమంది సహోదరులు చంపాలనుకునేలా చేసింది. రాజైన ఆహాబు నాబోతుకు చెందిన ద్రాక్షతోటను మత్సరముతో సంపాదించుకున్నట్లు, ప్రేమ ఇతరుల సంపదను లేక లాభాలను అసూయతో పొందదు.—1 రాజులు 21:1-19.

7. (ఎ) డంబముగా మాట్లాడుట యెహోవాకు యిష్టంలేదని ఏ సంఘటన చూపిస్తుంది? (బి) అనాలోచితంగా కూడా ప్రేమ ఎందుకు డంబముగా ప్రవర్తింపదు?

7 తరువాత పౌలు మనకు ప్రేమ “డంబముగా ప్రవర్తింపదు,” అని చెప్తున్నాడు. డంబముగా ప్రవర్తించడం ప్రేమలేనితనాన్ని చూపిస్తుంది, ఎందుకంటే అది తమను ఇతరులకంటే పైగా వుంచుకునేలా చేస్తుంది. రాజైన నెబుకద్నెజరు డంబాలు పలికినప్పుడు యెహోవా అతన్ని అణచినదాన్నిబట్టి ఆయనకు డంబాలు పలుకువారు ఇష్టంలేదని తెలుస్తుంది. (దానియేలు 4:30-35) ఒకరి స్వంత జయాలు లేక సంపత్తివల్ల ఎక్కువగా సంతోషించడంచేత డంబంగా మాట్లాడుతారు. కొందరు క్రైస్తవ పరిచర్యలో తాము సాధించిన సఫలతను గూర్చి డంబంగా మాట్లాడుటకు ఇష్టపడవచ్చు. మరికొంతమంది దాదాపు 50,000 డాలర్లు ఖరీదుచేసే వాహనాన్ని తాను ఇప్పుడే కొన్నానన్న విషయాన్ని తన స్నేహితులకు వెంటనే తెలియజేయటానికి ఫోను చేసిన ఒక పెద్దలా వుండవచ్చు. అదంతా ప్రేమలేని తనం ఎందుకంటే, డంబముగా పలికేవారిని అది తనమాటలను వినువారికంటె ఉన్నతంగా చేస్తుంది.

8. (ఎ) గర్విష్టుల యెడల యెహోవా దృక్పథమేమైయున్నది? (బి) ప్రేమ ఎందుకు అలా ప్రవర్తించదు?

8 తరువాత, ప్రేమ “ఉప్పొంగదు” అని మనకు చెప్పబడింది. ఉప్పొంగే, లేక గర్వించే వక్తి ప్రేమలేకుండా ఇతరులపై తననుతాను ఉన్నతపర్చుకుంటాడు. అలాంటి మానసిక స్వభావము ఎంతో అజ్ఞానయుక్తమైనది. ఎందుచేతనంటే, “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (యాకోబు 4:6) ప్రేమ దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది; అది ఇతరులను ఉన్నతంగా భావిస్తుంది. పౌలు ఫిలిప్పీయులు 2:2, 3 నందు ఇలా వ్రాసాడు: “మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుడి.” అలాంటి మానసిక దృక్పథం ఇతరులు ఓదార్పుగా భావించేలా చేస్తుంది కాని గర్వముగల వ్యక్తి తన కలహప్రియత్వముతో ఇతరులు అసౌకర్యంగా భావించేలా చేస్తాడు.

9. ప్రేమ ఎందుకు అమర్యాదగా ప్రవర్తించదు?

9 ఆ తరువాత పౌలు ప్రేమ “అమర్యాదగా నడువదు” అని చెప్తున్నాడు. నిఘంటువు “అమర్యాదగా” అనే దాన్ని “మర్యాదకు లేక నైతికసూత్రాలకు భంగము కలిగించేలా లేక అసభ్యంగా, తగని విధంగా” అని నిర్వచిస్తున్నది. అమర్యాదగా (ప్రేమలేని విధంగా) ప్రవర్తించే వ్యక్తి ఇతరుల భావాలను నిర్లక్ష్యం చేస్తాడు. చాలా బైబిలు అనువాదాలు గ్రీకుపదాన్ని “అనాగరికమైన” అని అనువదిస్తున్నాయి. అలాంటివాడు సరియైనదానిని, మంచి అభిరుచిగల దానిని పరిహసిస్తాడు. ఇతరుల యెడల ప్రేమపూర్వకమైన ఆసక్తి అసభ్యకరమైన లేక అమర్యాదకరమైన అన్ని సంగతులను, ఇతరులను అభ్యంతరపరిచే లేదా దిగ్భ్రాంతిపరచే సంగతులను నిరోధిస్తుందని భావము.

ప్రేమకాని మరితర విషయాలు

10. ఏ విధంగా ప్రేమ తన స్వంత ఆసక్తుల కొరకు చూడదు?

10 తరువాత మన వ్యక్తిగత ఆసక్తులు, ఇతరుల వ్యక్తిగత ఆసక్తులను గూర్చిన ప్రశ్న వచ్చినప్పుడు ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు” అని మనతో చెప్పబడింది. మరోచోట అపొస్తలుడు ఇలా చెప్పాడు: “తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడుగాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.” (ఎఫెసీయులు 5:29) అయినా మన ఆసక్తులు ఇతరుల ఆసక్తులతో పోటీపడి, మరే బైబిలు సూత్రాలు ఇమిడిలేనప్పుడు, ప్రేమపూర్వకంగా అవతలి వ్యక్తిని ఎంపిక చేసుకోనిస్తూ, అబ్రాహాము లోతుతో వ్యవహరించినట్లు మనం వ్యవహరించాలి.—ఆదికాండము 13:8-11.

11. ప్రేమ కోపపడదు అంటే భావమేమిటి?

11 ప్రేమ త్వరగా చలించదు. అందుకే పౌలు ప్రేమ “త్వరగా కోపపడదు” అని మనకు చెప్తున్నాడు. అది త్వరపడి నొచ్చుకోదు. ఆశానిగ్రహాన్ని కనపరుస్తుంది. ప్రాముఖ్యంగా వివాహిత దంపతులు ఒకరిపైఒకరు గట్టిగా, అసహనంగా, కోపంగా అరుచుకోకుండా జాగ్రత్తపడడం ద్వారా ఈ సలహాను గంభీరంగా తీసుకోవచ్చు. సుళువుగా ఉద్రేకపడే కొన్ని సందర్భాలు ఉంటాయి, అందుకే పౌలు తిమోతికి ఇలా ఉపదేశించాల్సిన అవసరం వుందని భావించాడు: “ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.” అవును, కోపపడకుము.—2 తిమోతి 2:24, 25.

12. (ఎ) ఏ విధంగా ప్రేమ అపకారమును మనస్సులో వుంచుకోదు? (బి) అపకారమును మనస్సులో వుంచుకొనుట ఎందుకు సరికాదు?

12 ప్రేమ అంటే ఏమికాదో తెలియజేస్తూ పౌలు ఇలా ఉపదేశించాడు: “ప్రేమ . . . అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” ప్రేమ అపకారాన్ని గ్రహించదని దాని భావం కాదు. మనం గంభీరంగా గాయపర్చబడినప్పుడు మనమెలా వ్యవహరించాలో యేసు చూపించాడు. (మత్తయి 18:15-17) కాని ప్రేమ మనం కోపం పెట్టుకుని, చేదుభావాలు కలిగి వుండుటకు అంగీకరించదు. అపకారమును మనస్సులో వుంచుకొనదు అంటే క్షమించడం, ఒకసారి సమస్య లేఖనానుసారంగా పరిష్కరింపబడితే దాన్ని గురించి మర్చిపోవటం అని భావం. అవును అపకారాన్ని మనస్సులో వుంచుకోవడం ద్వారా నిన్ను నీవు హింసించుకోవద్దు లేక మళ్లీ మళ్లీ ఆ తప్పును తలచుకుని నిన్ను నీవు గాయపరచుకోవద్దు!

13. అవినీతిని బట్టి ఆనందించకపోవటమంటే భావమేంటి, ప్రేమ ఎందుకు అలా చేయదు?

13 అంతేకాక, ప్రేమ “దుర్నీతివిషయమై సంతోషపడ”దు అని మనకు చెప్పబడుతుంది. లోకం దుర్నీతి విషయమై సంతోషిస్తుందని హింసాత్మక, అశ్లీలసాహిత్యం, సినిమాలు, టీవి కార్యక్రమాల జనాదరణను బట్టి తెలుసుకోవచ్చు. అలాంటి సంతోషమంతా స్వార్థపూరితమైనది, దేవుని నైతిక సూత్రాలయెడల లేక ఇతరుల క్షేమం యెడల శ్రద్ధలేనిది. ఆ స్వార్థపూరిత సంతోషమంతా శరీరేచ్ఛలనుబట్టి విత్తడమే, అది తగిన కాలంలో క్షయమను పంటను కోస్తుంది.—గలతీయులు 6:8.

14. ప్రేమ ఎన్నటికీ విఫలంకాదు అని ఎందుకు కచ్చితంగా చెప్పవచ్చు?

14 ప్రేమ చేయజాలని ఆఖరు విషయం: “ప్రేమ ఎన్నటికీ విఫలం కాదు.” (NW) ప్రేమ శాశ్వతకాలముంటుంది లేక ఎప్పుడు అంతము కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన “సకల యుగములలో రాజు.” (1 తిమోతి 1:17) రోమీయులు 8:38, 39 నందు మన యెడల యెహోవా ప్రేమ ఎన్నటికీ తప్పిపోదు అని వాగ్దానం చేయబడింది: “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” ప్రేమ ఎన్నటికీ కొరవడదు గనుక ప్రేమ ఎన్నటికీ విఫలం కాదు. ప్రేమ ఏ సందర్భంలోనైనా, ఏ సవాలునైనా ఎదుర్కొనగలదు.

ప్రేమ గల విషయాలు

15. ప్రేమయొక్క అనుకూల దృక్పథాలలో మొదటిదానిగా పౌలు దీర్ఘశాంతము నెందుకు వుంచాడు?

15 ప్రేమ ఏమైయున్నదనే విషయంలో అనుకూలమైన వాటిని వివరిస్తూ పౌలు “ప్రేమ దీర్ఘకాలము సహించును” అని ప్రారంభించాడు. దీర్ఘశాంతము లేకుండా అంటే, ఒకరినొకరు ఓర్పుతో సహించుకోకుండా క్రైస్తవ సహవాసము ఉండబోదని చెప్పబడింది. ఎందువలనంటే, మనమందరం అపరిపూర్ణులం గనుక, మన అపరిపూర్ణతలు, లోపాలు ఇతరులకు పరీక్షలు కావచ్చు. ప్రేమ ఏమైయున్నదనే విషయంలో అపొస్తలుడైన పౌలు ఈ దృక్పథాన్ని మొదట ఉంచడంలో ఆశ్చర్యంలేదు!

16. కుటుంబములోని సభ్యులందరు ఒకరికొకరు ఏ విధాలుగా దయ చూపించుకొనగలరు?

16 ప్రేమ “దయ” గలది అని కూడా పౌలు తెలియజేస్తున్నాడు. అంటే ప్రేమ సహాయకరమైనది, ఆలోచనగలది, ఇతరుల యెడల శ్రద్ధగలది. చిన్న, పెద్ద విషయాలలో దయ వ్యక్తమౌతుంది. దొంగలచే దోచుకొనబడిన వ్యక్తికి పొరుగువాడైన సమరయుడు నిజంగా దయను చూపించాడు. (లూకా 10:30-37) “దయచేసి” అని చెప్పడంలో ప్రేమ ఉల్లసిస్తుంది. చెప్పుకోవాలంటే “బ్రెడ్‌ ఇలా అందివ్వండి” అనడం ఆజ్ఞాపించడమౌతుంది. దానికి ముందు “దయచేసి” అనే పదాన్ని చేరిస్తే అది అభ్యర్థన అవుతుంది. మొదటి పేతురు 3:7 నందలి ఈ ఉపదేశాన్ని లక్ష్యపెడితే భర్తలు వారి భార్యల యెడల దయ కలిగివుంటారు: “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.” భార్యలు తమ భర్తల యెడల “భయము, మిక్కుటమైన గౌరవము” కనపరిస్తే, వారి యందు దయ కలిగివున్నట్లే. (ఎఫెసీయులు 5:33, NW) ఎఫెసీయులు 6:4 నందలి ఉపదేశాన్ని తండ్రులు పాటిస్తే పిల్లల యెడల దయ కలిగివుంటారు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”

17. ప్రేమ సత్యంతోపాటు ఆనందించే రెండు మార్గాలు ఏవి?

17 అవినీతిని చూసి ప్రేమ సంతోషించదు గాని, “సత్యమునందు సంతోషించును.” ప్రేమ, సత్యము ఒకదానితో మరొకటి సమాంతరముగా వెళ్లును. దేవుడు ప్రేమాస్వరూపి, అదే సమయంలో ఆయన “సత్యదేవుడు.” (కీర్తన 31:5) సత్యం జయించి, అసత్యాన్ని బహిర్గతం చేసినప్పుడు ప్రేమ సంతోషిస్తుంది; ఈనాడు యెహోవా ఆరాధికుల సంఖ్యలో జరుగుతున్న గొప్ప అభివృద్ధికి ఇది కొంతవరకు కారణం. అయినా, సత్యం అవినీతికి వ్యతిరేకం గనుక ప్రేమ నీతితో ఆనందిస్తుందని కూడా అనుకోవచ్చు. మహాబబులోను కూలిపోయినప్పుడు యెహోవా ఆరాధికులు సంతోషించమని ఆజ్ఞాపింపబడినట్లు, నీతి విజయాన్ని సాధించినప్పుడు ప్రేమ సంతోషిస్తుంది.—ప్రకటన 18:20.

18. ఏ భావంలో ప్రేమ అన్నిటిని సహిస్తుంది?

18 ప్రేమ “అన్నిటికి తాళుకొనును” అని కూడా పౌలు మనకు చెప్తున్నాడు. కింగ్‌డమ్‌ ఇంటర్లీనియర్‌ చూపునట్లు, ప్రేమ అన్నిటినీ కప్పును. దుష్టులు చేయునట్లు, అది ఒక సహోదరునిపై “కొండెములు” చెప్పదు. (కీర్తన 50:20; సామెతలు 10:12; 17:9) అవును, ఇక్కడి ఆలోచన 1 పేతురు 4:8 నందలి వంటిదే: “ప్రేమ అనేక పాపములను కప్పును.” అయినా యెహోవాకు, క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా చేసిన పెద్ద తప్పులను కప్పిపుచ్చకుండ యథార్థత కాపాడుతుంది.

19. ఏ విధంగా ప్రేమ అన్నిటిని నమ్ముతుంది?

19 ప్రేమ “అన్నిటిని నమ్మును.” ప్రేమ అనుకూలమైనది, ప్రతికూలమైనది కాదు. అనగా దాని భావం ప్రేమ మోసకరమైనదని కాదు. సంచలనాత్మక వ్యాఖ్యలను అది త్వరగా నమ్మదు. కాని ఒకరు దేవునియందు విశ్వాసముంచాలంటే, నమ్మాలన్న కోరిక వుండాలి. కాబట్టి ప్రేమ సందేహాస్పదమైనది కాదు, అనుచిత విమర్శనాత్మకమైనది కాదు. దేవుడు లేడని పిడివాద వ్యాఖ్యలు చేసే నాస్తికునిలా, మనమెక్కడి నుండి వచ్చాము, మనమెందుకిక్కడ వున్నాము, మన భవిష్యత్తు ఎలా వుంటుంది అనేవి తెలుసుకోవడం కేవలం అసాధ్యం అని చెప్పే భౌతికవాదిలా నమ్మటాన్ని అది నిరోధించదు. ఈ విషయాలన్నిటి గురించి దేవుని వాక్యం మనకు అభయమిస్తుంది. ప్రేమ విశ్వసించదగినది, అనుచితంగా అనుమానించేదికాదు గనుక ప్రేమ నమ్మటానికి కూడా సిద్ధంగా వుంటుంది.

20. ప్రేమ నిరీక్షణతో ఎలా ముడిపెట్టబడింది?

20 ప్రేమ “అన్నిటిని నిరీక్షించును” అని అపొస్తలుడైన పౌలు అభయమిస్తున్నాడు. ప్రేమ ప్రతికూలమైంది కాక, అనుకూలమైంది గనుక దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన వాటన్నిటియందు దానికి గట్టి నిరీక్షణ వున్నది. మనకిలా చెప్పబడింది: “దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కించవలెను.” (1 కొరింథీయులు 9:10) ప్రేమ ఎలాగైతే నమ్మదగినదో అలాగే అది నిరీక్షణగలది, ఎప్పుడూ శ్రేష్ఠమైన వాటి కొరకు నిరీక్షిస్తుంది.

21. ప్రేమ సహిస్తుందని ఏ లేఖనాధార అభయం ఉంది?

21 చివరగా, ప్రేమ “అన్నిటిని ఓర్చును” అని మనకు అభయమీయబడింది. 1 కొరింథీయులు 10:13 నందు పౌలు చెబుతున్నదాన్నిబట్టి అది అలా చేయగలుగుతున్నది: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.” సహించిన దేవుని సేవకుల అనేక ఉదాహరణలను లేఖనాలయందు చూచునట్లు ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. హెబ్రీయులు 12:2, 3 నందు గుర్తుచేయబడినట్లు వారిలో యేసుక్రీస్తు ప్రముఖుడు.

22. దేవుని పిల్లలుగా, మనమెప్పుడూ ఏ ప్రాముఖ్యమైన లక్షణాన్ని వ్యక్తపర్చుటకు శ్రద్ధ కలిగివుండాలి?

22 నిజంగా, అది ఏమి కాదు, ఏమైయుంది అనే రెండు విధాల క్రైస్తవులుగా, యెహోవాసాక్షులుగా మనం పెంపొందించుకోవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ప్రేమ (అగాపె). దేవుని పిల్లలుగా, మనమెల్లప్పుడూ దేవుని ఈ ఆత్మ ఫలాన్ని వ్యక్తపరచుటకు శ్రద్ధ కలిగివుండాలి. అలా చేయడమంటే దేవునిలా వుండడం, ఎందుకనగా “దేవుడు ప్రేమాస్వరూపి.”

మీకు జ్ఞాపకమున్నదా?

◻ యేసుక్రీస్తు మరియు పౌలు ప్రేమ యొక్క ప్రాధాన్యతను ఎలా చూపించారు?

◻ ఏ భావంలో ప్రేమ మత్సరము లేనిది?

◻ ప్రేమ ఎలా ‘అన్నిటిని సహిస్తుంది’?

◻ ప్రేమ ఎన్నటికీ విఫలం కాదని ఎందుకు చెప్పవచ్చు?

◻ ఏ రెండు విధాలుగా ప్రేమ సత్యంతోపాటు సంతోషిస్తుంది?

[21వ పేజీలోని బాక్సు]

ప్రేమ (అగాపె)

ఏమి కాదు — ఏమైయుంది

1. అది మత్సరపడదు — 1. దీర్ఘశాంతము

2. డంబముగా ప్రవర్తింపదు — 2. దయ

3. అది ఉప్పొంగదు — 3. సత్యంతోపాటు సంతోషిస్తుంది

4. అమర్యాదగా నడువదు — 4. అన్నిటిని తాళుకొంటుంది

5. స్వప్రయోజనాన్ని విచారించుకొనదు — 5. అన్నిటిని నమ్ముతుంది

6. త్వరగా కోపపడదు — 6. అన్నిటిని నిరీక్షిస్తుంది

7. అపకారమును మనస్సులో ఉంచుకొనదు — 7. అన్నిటిని సహిస్తుంది

8. దుర్నీతి విషయమై సంతోషించదు

9. ఎన్నటికీ అపజయమెరుగదు

[18వ పేజీలోని చిత్రాలు]

డంబముగా ప్రవర్తించినందుకు యెహోవా నెబుకద్నెజరును అణచాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి