కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 2/15 పేజీలు 13-18
  • క్రీస్తు విమోచన క్రయధనం—దైవిక రక్షణ మార్గము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీస్తు విమోచన క్రయధనం—దైవిక రక్షణ మార్గము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాప మరణాలను పరిహరించడం
  • పాప మూల్యాన్ని చెల్లించడం
  • ‘తత్సమానమైన విమోచన క్రయధనం’
  • పరిపూర్ణ మానవ జీవం విలువ
  • క్రీస్తు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందడం
  • విమోచన క్రయధనం—ప్రేమయొక్క వ్యక్తీకరణ
  • దేవుని గొప్ప బహుమానం—విమోచన క్రయధనం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యెహోవా “ఎంతోమంది కోసం విమోచన క్రయధనం” ఏర్పాటు చేశాడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యేసు బలి, “అనేకుల కోసం విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 2/15 పేజీలు 13-18

క్రీస్తు విమోచన క్రయధనం—దైవిక రక్షణ మార్గము

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16.

1, 2. మానవజాతికి సంబంధించి వృద్ధిచెందిన విషమ పరిస్థితిని వర్ణించండి.

శస్త్రచికిత్స చేయించుకుంటేనే తప్ప ప్రాణాలు దక్కని రోగంతో మీరు బాధపడుతున్నారని ఊహించుకోండి. ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు మీ స్థోమతకు మించినదైతే మీరెలా భావిస్తారు? మీ కుటుంబ సభ్యుల దగ్గరా, స్నేహితుల దగ్గరా ఉన్న డబ్బంతా కలిపినా సరే దానికయ్యే ఖర్చుకు సరిపోకపోతే అప్పుడేమిటి? ప్రాణాలకొక బెదిరింపుగా ఉన్న అలాంటి సందిగ్ధావస్థను ఎదుర్కోవడం ఎంత నిరాశజనకంగా ఉంటుందో గదా!

2 మానవజాతి విషయంలో వృద్ధిచెందిన ఒక విషమ పరిస్థితిని అది ఉదహరిస్తుంది. మన ఆదిమ తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు పరిపూర్ణులుగా సృష్టించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 32:4) నిరంతరం జీవిస్తూ ఉండే, అలాగే “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అన్న దేవుని సంకల్పాన్ని నెరవేర్చే ఉత్తరాపేక్ష వారికి ఉండేది. (ఆదికాండము 1:28) అయితే, ఆదాము హవ్వలు తమ సృష్టికర్తపై తిరుగుబాటు చేశారు. (ఆదికాండము 3:1-6) ఆదాము హవ్వలు చూపించిన అవిధేయత వారిపైకి మాత్రమేగాక వారికి ఇంకనూ జన్మించని సంతానంపైకి కూడా పాపాన్ని తీసుకొచ్చింది. విశ్వాసియైన యోబు అటు తర్వాత ఇలా అన్నాడు: “పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్ట నేరడు.”—యోబు 14:4.

3. మానవులందరికీ మరణమెలా సంక్రమించింది?

3 ఆ విధంగా పాపం అందరికీ అంటుకున్న ఒక రోగంలా అయ్యింది, ఎందుకంటే బైబిలు “అందరును పాపము చే[శారు]” అని చెబుతోంది. (ఇటాలిక్కులు మావి.) జీవాన్ని అపాయంలోపడవేసే పర్యవసానాల్ని ఆ పరిస్థితి కల్గివుంది. నిజమే, “పాపమువలన వచ్చు జీతము మరణము.” (రోమీయులు 3:23; 6:23) మనలో ఎవ్వరమూ దానిబారి నుండి తప్పించుకోలేం. మానవులంతా పాపం చేస్తారు గనుక మానవులందరూ మరణిస్తున్నారు. ఆదాము సంతానంగా, మనమా స్థితిలోనే పుట్టాము. (కీర్తన 51:5) “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని పౌలు రాశాడు. (రోమీయులు 5:12) కానీ దానర్థం రక్షణ కోసం నిరీక్షణలేకుండా మనం విడిచిపెట్టబడ్డామని కాదు.

పాప మరణాలను పరిహరించడం

4. మానవులు తమకు తాముగా రోగాలనూ, మరణాన్నీ ఎందుకు నివారించలేరు?

4 పాపాన్నీ, దాని మూలంగా వచ్చిన మరణాన్నీ తొలగించేందుకు ఏమి అవసరమౌతుంది? అది మానవులలో ఎవరైనా ఇవ్వగలిగే దానికన్నా ఎంతో అధికమైనదని స్పష్టమౌతుంది. కీర్తనల గ్రంథకర్త తన ఆవేదనను ఇలా వ్యక్తపర్చాడు: “మానవ ప్రాణ విముక్తికి చెల్లించే మూల్యం ఎంతో గొప్పది. తాను సమాధిని తప్పించుకుని నిరంతరం జీవించడానికి సరిపడే మూల్యాన్ని అతడు ఎన్నటికీ చెల్లించలేడు.” (కీర్తన 49:8, 9, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌) నిజమే, ఆరోగ్యకరమైన ఆహారం, వైద్య సంరక్షణ తీసుకోవడం మూలంగా మన ఆయుష్కాలాన్ని మరికొన్ని సంవత్సరాలు పొడిగించుకోవచ్చు, కానీ వారసత్వంగా వచ్చిన మన పాపభరితమైన స్థితికి మనలో ఎవ్వరం స్వస్థతను చేకూర్చలేం. వృద్ధాప్యపు ప్రక్రియ తీసుకొచ్చే ప్రభావాలను వెనుకకు త్రిప్పి, దేవుడు ఆదియందు ఉద్దేశించినట్టుగా మన దేహాన్ని పరిపూర్ణమైనదానిగా మనలో ఎవ్వరం పునరుద్ధరించలేం. ఆదాము చేసిన పాపం మూలంగా మానవ సృష్టి ‘నాశనమునకు అప్పగించబడిందని’—లేక ది జెరూసలేమ్‌ బైబిల్‌ అనువదించినట్టుగా ‘దాని సంకల్పాన్ని పొందలేనిదిగా తయారైందని’ పౌలు రాసినప్పుడు, ఆయన ఖచ్చితంగా విషయాన్ని విపరీతంచేసి చెప్పడంలేదు. (రోమీయులు 8:20, పరిశుద్ధ బైబల్‌) అయితే, సంతోషకరంగా సృష్టికర్త మనల్ని విడిచిపెట్టలేదు. పాప మరణాల్ని శాశ్వతంగా తొలగించే ఏర్పాటు ఆయన చేశాడు. ఎలా?

5. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన చట్టాలు, న్యాయం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను ఎలా ప్రతిబింబించాయి?

5 యెహోవా “నీతిని, న్యాయమును ప్రేమించు”వాడు. (కీర్తన 33:5) ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన చట్టాలు, సంయమనం పట్లా, నిష్పక్షపాత న్యాయం పట్లా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు, ఈ చట్టాలలో ఒకటైన ‘ప్రాణానికి ప్రాణం’ అనే చట్టాన్ని మనం చదువుతాం. మరో విధంగా చెప్పాలంటే, ఇశ్రాయేలీయుడు ఒకర్ని హత్యచేస్తే, తాను హత్యచేసినవాని ప్రాణానికి ప్రతిగా తన సొంత ప్రాణం జుల్మానాగా చెల్లించాల్సి ఉంటుంది. (నిర్గమకాండము 21:23; సంఖ్యాకాండము 35:21) ఆ విధంగా, దైవికన్యాయపు త్రాసు సమతూకం చేయబడుతుంది.—నిర్గమకాండము 21:30 పోల్చండి.

6. (ఎ) ఆదాము హంతకుడని ఏ భావంలో అనవచ్చు? (బి) ఆదాము ఎలాంటి జీవాన్ని పోగొట్టుకున్నాడు, న్యాయపు త్రాసును సమతూకపర్చడానికి ఎలాంటి బల్యర్పణ అవసరమౌతుంది?

6 ఆదాము పాపం చేసినప్పుడు, అతడు హంతకుడయ్యాడు. ఏ భావంలో? తన పాపభరితమైన స్థితిని—మరి ఆ విధంగా మరణాన్ని తన సంతానమంతటికీ సంక్రమింపజేశాడనే అర్థంలోనే. ఆదాము చూపించిన అవిధేయత మూలంగానే ఈ క్షణంలో కూడా మన శరీరాలు క్షీణించిపోతూ, మరణం దిశగా ప్రయాణిస్తున్నాయి. (కీర్తన 90:10) ఆదాము పాపం మరింత గంభీరమైన ప్రభావాన్ని కల్గివుంది కూడా. గుర్తుంచుకోండి, తన విషయంలో తన సంతానం విషయంలో ఆదాము కోల్పోయిన జీవం, సగటున 70 లేక 80 ఏళ్ల ఆయుర్దాయంగల సామాన్య జీవితంకాదు. అతడు పరిపూర్ణమైన జీవాన్ని—నిజంగా, నిత్యజీవాన్ని కోల్పోయాడు. కాబట్టి ‘ప్రాణానికి ప్రాణం’ చెల్లించాల్సి వస్తే, ఈ విషయంలో న్యాయాన్ని సంతృప్తిపర్చేందుకు ఎలాంటి ప్రాణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది? సహేతుకంగా, అది పరిపూర్ణ మానవ జీవం అంటే, పరిపూర్ణ మానవ సంతానాన్ని ఉత్పన్నంచేయగల శక్తివున్న ఆదాము జీవం లాంటి జీవమై ఉండాలి. పరిపూర్ణ మానవ జీవాన్ని బలిగా అర్పించినట్లైతే, అది న్యాయపు త్రాసును సమతూకపర్చడం మాత్రమేగాక పాపాన్నీ, దాని మూలంగా వచ్చే మరణాన్ని పూర్తిగా పరిహరించడాన్ని సాధ్యంచేస్తుంది.

పాప మూల్యాన్ని చెల్లించడం

7. “విమోచన క్రయధనము” అన్న పదానికున్న అర్థాన్ని వివరించండి.

7 మనల్ని పాపాన్నుండి విడిపించడానికి అవసరమైన మూల్యం, బైబిల్లో “విమోచన క్రయధనము” అని సూచించబడింది. (కీర్తన 49:7, NW) తాను బలత్కారంగా ఎత్తుకుపోయిన ఒకవ్యక్తిని విడిపించుకోవడానికి చెల్లించమని కిడ్నాపర్‌ అడిగే మూల్యాన్ని ఆ పదం సూచించవచ్చు. నిజమే, యెహోవా ఏర్పాటు చేసిన విమోచన క్రయధనంలో ఏ విధమైన కిడ్నాపింగ్‌ ఇమిడిలేదు. మూల్యం మాత్రం అదే విధంగా చెల్లించాల్సిందే. నిజానికి, “విమోచన క్రయధనము” అని అనువదించబడిన హెబ్రీ మాటకున్న క్రియా రూపానికి అక్షరార్థంగా “భర్తీచేయడం” అని అర్థం. పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, విమోచన క్రయధనం కచ్చితంగా సరిపోయేదై ఉండాలి. అది ఆదాము పరిపూర్ణ మానవ జీవానికి సరిపోయేదై ఉండాలి.

8. (ఎ) తిరిగి కొనడమనే సూత్రాన్ని వర్ణించండి. (బి) తిరిగి కొనడమనే సూత్రం పాపులుగా మనకు ఎలా వర్తిస్తుంది?

8 అది మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఒక సూత్రానికి పొందికగా ఉంది—తిరిగి కొనడమనే సూత్రం. ఒక ఇశ్రాయేలీయుడు బీదవాడై తననుతాను ఒక అన్యునికి దాసునిగా అమ్ముకుంటే, వాని బంధువు దాసుని విలువకు సమానమైన విలువగా పరిగణించబడే మూల్యాన్ని చెల్లించి అతడిని తిరిగి కొనవచ్చు (లేక, విమోచించవచ్చు). (లేవీయకాండము 25:47-49) అపరిపూర్ణ మానవులంగా మనం “పాపమునకు దాసులము” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 6:6; 7:14, 25) మనల్ని తిరిగి కొనడానికి ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది? మనమిప్పటికే చూసినట్లుగా, కోల్పోయిన పరిపూర్ణ మానవ ప్రాణానికి మారుగా మరొక పరిపూర్ణ ప్రాణాన్ని చెల్లించాల్సి ఉంటుంది—దానికన్నా ఎక్కువగానీ, తక్కువగానీ కాదు.

9. పాపాన్ని కప్పివేయడానికి యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడు?

9 నిజమే, మానవులమైన మనం అపరిపూర్ణులముగా జన్మించాం. మనలో ఏ ఒక్కడూ ఆదాముకు సరిసమానుడు కాడు; న్యాయం కోరుతున్న విమోచన క్రయధనాన్ని మనలో ఎవ్వరమూ చెల్లించలేం. ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా, ఇది మన ప్రాణానికి ముప్పునుతెచ్చే రోగంతో బాధపడుతూ, దాన్ని నయంచేయగల్గే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును చెల్లించే స్థోమతలేనట్టుగా ఉంది. అలాంటి పరిస్థితిలో, మన కోసం ఎవరైనా ముందుకు వచ్చి, దానికయ్యే డబ్బును చెల్లిస్తే మనం కృతజ్ఞులమై ఉండమా? కచ్చితంగా యెహోవా చేసినదదే! పాపం నుండి శాశ్వతంగా మనల్ని విడిపించేందుకు ఆయన ఏర్పాటు చేశాడు. అవును, మనకుగా మనమెన్నటికీ చెల్లించలేనిదాన్ని మనకు ఇవ్వడానికి ఆయన సుముఖత చూపిస్తున్నాడు. ఎలా? “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” అని పౌలు రాస్తున్నాడు. (రోమీయులు 6:23) “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని యోహాను యేసును వర్ణించాడు. (యోహాను 1:29) విమోచన క్రయధనాన్ని చెల్లించేందుకు యెహోవా తన ప్రియ కుమారుడ్ని ఎలా ఉపయోగించాడో చూద్దాం.

‘తత్సమానమైన విమోచన క్రయధనం’

10. ‘సంతానాన్ని’ గురించిన ప్రవచనాలు యోసేపు మరియలపై ఎలా కేంద్రీకృతమయ్యాయి?

10 ఏదెను తోటలో తిరుగుబాటు జరిగిన తర్వాత వెంటనే యెహోవా మానవజాతిని పాపం నుండి క్రయధనం చెల్లించి విమోచించే ‘సంతానాన్ని’ ఉత్పన్నంచేసే తన సంకల్పాన్ని ప్రకటించాడు. (ఆదికాండము 3:15) దైవిక ప్రకటనల పరంపరల ద్వారా, ఆ సంతానం వచ్చే కుటుంబ వంశావళిని యెహోవా తెలియజేశాడు. కాలక్రమేణా, ఆ దైవిక ప్రకటనలు పాలస్తీనాలో నివసిస్తున్న యోసేపు మరియలనే ప్రధానం చేయబడిన యువజంటపై కేంద్రీకృతమయ్యాయి. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భాన్ని ధరించిందని యోసేపుకు స్వప్నంలో తెలియజేయడం జరిగింది. దేవదూత ఇలా తెలియజేశాడు: “ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు[వు].”—మత్తయి 1:20, 21.

11. (ఎ) తన కుమారుడు పరిపూర్ణ మానవునిగా జన్మించేలా యెహోవా ఎలా ఏర్పాటు చేశాడు? (బి) యేసు ‘తత్సమానమైన విమోచన క్రయధనాన్ని’ ఏ విధంగా చెల్లించగలిగేడు?

11 అది సాధారణమైన గర్భంకాదు, ఎందుకంటే యేసు పరలోకంలో మానవపూర్వ ఉనికిని కల్గివున్నాడు. (సామెతలు 8:22-31; కొలొస్సయులు 1:15) ఆయన జీవం యెహోవా అద్భుతమైన శక్తి ద్వారా మరియ గర్భానికి మార్చబడింది, అది దేవుని ప్రియమైన కుమారుడు మానవునిగా జన్మించేలా సాధ్యంచేసింది. (యోహాను 1:1-3, 14; ఫిలిప్పీయులు 2:6, 7) ఆదాము పాపం మూలంగా యేసు కళంకితమవ్వకుండా యెహోవా విషయాల్ని నడిపించాడు. కళంకితుడవడానికి బదులు, యేసు పరిపూర్ణునిగా జన్మించాడు. ఆ విధంగా, ఆదాము కోల్పోయినదాన్ని అంటే పరిపూర్ణ మానవజీవాన్ని ఆయన కల్గివున్నాడు. చివరికి, పాప మూల్యాన్ని చెల్లించగలిగే మానవుడయ్యాడు! సా.శ. 33 నీసాను 14న కచ్చితంగా యేసు చేసినదదే. ఆ చరిత్రాత్మక దినాన యేసు, తన వ్యతిరేకులు తనను చంపేందుకు అనుమతించి ‘తత్సమానమైన విమోచన క్రయధనాన్ని’ చెల్లించాడు.—1 తిమోతి 2:6.

పరిపూర్ణ మానవ జీవం విలువ

12. (ఎ) యేసు మరణానికీ, ఆదాము మరణానికీ మధ్యనున్న ప్రాముఖ్యమైన వ్యత్యాసాన్ని వర్ణించండి. (బి) విధేయులైన మానవులకు యేసు ఎలా ‘నిత్యుడగు తండ్రి’ అయ్యాడు?

12 యేసు మరణానికీ, ఆదాము మరణానికీ మధ్య వ్యత్యాసం ఉంది—ఆ వ్యత్యాసం విమోచన క్రయధన విలువను ఉన్నతపరుస్తుంది. ఆదాముకి మరణం తగినదే ఎందుకంటే అతడు తెలిసీ తన సృష్టికర్తపట్ల అవిధేయత చూపించాడు. (ఆదికాండము 2:16, 17) దానికి భిన్నంగా, యేసు మరణానికి ఎంత మాత్రమూ పాత్రుడుకాడు; ఎందుకంటే ఆయన ఏ “పాపము చేయలేదు.” (1 పేతురు 2:22) కాబట్టి యేసు మరణించేటప్పుడు ఆయన అత్యంత విలువైనదాన్నొకదాన్ని కల్గివున్నాడు. పాపియైన ఆదాము మరణించేటప్పుడు అతనికి అదిలేదు. అదే పరిపూర్ణ మానవ జీవితపు హక్కు. అలా యేసు మరణం బలి అర్పణ విలువను కల్గివుంది. ఆత్మ వ్యక్తిగా పరలోకానికి ఆరోహణమై, ఆయన తన బలి విలువను యెహోవాకు అర్పించాడు. (హెబ్రీయులు 9:24) అలా చేయడం ద్వారా, యేసు పాప పంకిలమైన మానవజాతిని కొని, ఆదాముకు బదులుగా వారి క్రొత్త తండ్రి అయ్యాడు. (1 కొరింథీయులు 15:45) సకారణంగానే, యేసు “నిత్యుడగు తండ్రి” అని పిలువబడ్డాడు. (యెషయా 9:6) దాని అర్థమేమిటో ఆలోచించండి! పాపాత్ముడైన తండ్రియగు ఆదాము, తన సంతానమంతటికీ మరణాన్ని సంక్రమింపజేశాడు. పరిపూర్ణుడైన తండ్రియగు యేసు, విధేయులైన మానవులకు నిత్యజీవాన్ని తెచ్చేందుకు తాను అర్పించిన బలి విలువను వినియోగిస్తున్నాడు.

13. (ఎ) ఆదాము ద్వారా సంక్రమించిన అప్పుని యేసు ఎలా తీర్చాడో ఉదహరించండి. (బి) మన ఆదిమ తల్లిదండ్రుల పాపాన్ని యేసు అర్పించిన బలి ఎందుకు కప్పివేయదు?

13 అయితే, ఒక వ్యక్తి మరణం అనేకుల పాపాన్ని ఎలా కప్పివేయగలదు? (మత్తయి 20:28) కొన్నేళ్ల క్రిందట ఒక శీర్షికలో, విమోచన క్రయధనాన్ని మనమిలా ఉదహరించాం: “వందలాదిమంది కార్మికులు పనిచేస్తున్న ఒక పెద్ద ఫ్యాక్టరీని ఊహించండి. అవినీతిపరుడైన ఆ ఫ్యాక్టరీ మేనేజరు దాన్ని దివాలా తీయించాడు; ఫ్యాక్టరీ తలుపులు మూతపడ్డాయి. వందలాదిమంది తమ ఉద్యోగాల్ని కోల్పోయి, తమ అప్పుల్ని తీర్చలేకపోతున్నారు. ఒకని అవినీతి మూలంగా ఆ కార్మికుల భార్యా బిడ్డలూ, అవును వాళ్లకు అప్పిచ్చిన వాళ్లూ అంతా ఇబ్బందులకు గురౌతున్నారు! సంపన్నుడైన ఒక దాత వచ్చి, కంపెనీ అప్పును తీర్చేసి, ఆ ఫ్యాక్టరీ తలుపుల్ని తెరిపిస్తాడు. ఆ ఒక్క అప్పునీ తీర్చడం, అనేకమంది కార్మికులకూ, వారి కుటుంబ సభ్యులకూ, వాళ్లకు అప్పిచ్చిన వాళ్లకూ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఆ మొదటి మేనేజరుకి ఈ క్రొత్త సంపదలో భాగం ఉంటుందా? ఉండదు, అతడు జైలుపాలై తన ఉద్యోగాన్ని శాశ్వతంగా కోల్పోతాడు! అదే విధంగా, ఆదాము అప్పుని తీర్చివేయడం, అతని సంతానంలోని కోట్లాదిమందికి ప్రయోజనాల్ని చేకూరుస్తుంది—కానీ ఆదాముకు కాదు.”

14, 15. ఆదాము హవ్వలు ఉద్దేశపూర్వకంగా పాపం చేశారని ఎందుకు అనవచ్చు, వాళ్ల పరిస్థితినుండి మన పరిస్థితి ఎలా భిన్నమైనది?

14 అది న్యాయమే. గుర్తుంచుకోండి, ఆదాము హవ్వలు ఉద్దేశపూర్వకంగా పాపం చేశారు. దేవునికి అవిధేయత చూపించడానికే వాళ్లు ఎంపిక చేసుకున్నారు. దానికి భిన్నంగా, మనం పాపంలోనే పుట్టాం. మనకు ఎంపిక చేసుకొనే అవకాశంలేదు. మనం ఎంత తీవ్రంగా ప్రయత్నించినా సరే, మనం అస్సలు పాపం చేయకుండా ఉండలేము. (1 యోహాను 1:8) కొన్నిసార్లు మనం పౌలులా భావించవచ్చు, ఆయన ఇలా రాశాడు: “మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను?”—రోమీయులు 7:21-24.

15 అయినప్పటికీ, విమోచన క్రయధనం మూలంగా, మనకు నిరీక్షణ ఉంది! దేవుడు వాగ్దానం చేసినట్లుగా “భూలోకములోని జనములన్నియు [తమనుతాము] ఆశీర్వదిం[పచేసుకొనే]” సంతానం యేసుక్రీస్తే. (ఆదికాండము 22:18; రోమీయులు 8:20) యేసు బలియర్పణ ఆయనయందు విశ్వాసాన్నుంచే వారి కోసం అద్భుతకరమైన అవకాశాలకు ద్వారాన్ని తెరుస్తుంది. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

క్రీస్తు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందడం

16. మనం పాపభరితమైన స్థితిలోనే ఉన్నా, యేసు విమోచన క్రయధనం మూలంగా మనమే ప్రయోజనాల్ని ఇప్పుడు అనుభవించగలం?

16 “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని బైబిలు రచయిత యాకోబు అంగీకరిస్తున్నాడు. (యాకోబు 3:2) అయితే, క్రీస్తు విమోచన క్రయధనాన్నిబట్టి, మన తప్పులు క్షమించబడవచ్చు. యోహాను ఇలా రాస్తున్నాడు: “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:1, 2) అయితే, దీని భావం పాపాన్ని మనం తేలికగా దృష్టించాలనికాదు. (యూదా 4; పోల్చండి 1 కొరింథీయులు 9:27.) అయినా, మనం తప్పుచేస్తే, యెహోవా “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవా[డు]” అనే నమ్మకంతో ఆయన ఎదుట మన హృదయాల్ని కుమ్మరించవచ్చు. (కీర్తన 86:5; 130:3, 4; యెషయా 1:18; 55:7; అపొస్తలుల కార్యములు 3:19) ఆ విధంగా విమోచన క్రయధనం, మనం పరిశుభ్రమైన మనస్సాక్షితో దేవుని సేవచేసేలా చేయగలదు, మనం యేసుక్రీస్తు నామమున ప్రార్థనయందు దేవునిని సమీపించడాన్ని సాధ్యపరుస్తుంది.—యోహాను 14:13, 14; హెబ్రీయులు 9:14.

17. విమోచన క్రయధనం మూలంగా, భవిష్యత్తులో ఏ ఆశీర్వాదాలు సాధ్యమౌతాయి?

17 క్రీస్తు విమోచన క్రయధనం, దేవుని సంకల్ప నెరవేర్పుకు—విధేయులైన మానవులు భూమిపై పరదైసులో నిరంతరం జీవించడానికి మార్గాన్ని తెరుస్తుంది. (కీర్తన 37:29) పౌలు ఇలా రాశాడు: “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి.” (2 కొరింథీయులు 1:20) నిజమే, మృత్యువు “రాజుగా పరిపాలించింది.” (రోమీయులు 5:17, NW) విమోచన క్రయధనం, ఆ ‘కడపటి శత్రువును’ తుడిచివేయడానికి దేవునికి ఒక ఆధారాన్ని ఇచ్చింది. (1 కొరింథీయులు 15:26; ప్రకటన 21:4) యేసు విమోచన క్రయధనం చనిపోయిన మానవులకు కూడా ప్రయోజనాన్ని చేకూర్చగలదు. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని యేసు తెలియజేశాడు.—యోహాను 5:28, 29; 1 కొరింథీయులు 15:20-22.

18. పాపం మానవులపై ఏ విషాదకరమైన ప్రభావాన్ని చూపింది, దేవుని నూతన లోకంలో ఈ పరిస్థితి ఎలా మార్పుచేయబడుతుంది?

18 ఈనాడు మనల్ని క్రుంగదీస్తున్న చింతలు ఇక ఉండని జీవితాన్ని అనుభవించడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆలోచించండి! పాపము మనల్ని దేవునితో మాత్రమేగాక మన సొంత మనస్సుతో, హృదయంతో, దేహంతో పొందికలేకుండా చేసింది. అయితే, దేవుని నూతన లోకంలో “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అని బైబిలు వాగ్దానం చేస్తుంది. అవును, భౌతిక మానసిక రుగ్మతలు మానవాళిని ఇక పట్టి పీడించవు. ఎందుకు? యెషయా ఇలా జవాబిస్తున్నాడు: “దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.”—యెషయా 33:24.

విమోచన క్రయధనం—ప్రేమయొక్క వ్యక్తీకరణ

19. క్రీస్తు విమోచన క్రయధనానికి వ్యక్తిగతంగా మనమెలా ప్రతిస్పందించాలి?

19 యెహోవా తన ప్రియ కుమారుని పంపించేలా ప్రేమ ఆయనను కదిలించింది. (రోమీయులు 5:8; 1 యోహాను 4:9) అదే ప్రేమ యేసుని “ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు” కదిలించింది. (హెబ్రీయులు 2:9; యోహాను 15:13) సకారణంగానే, పౌలు ఇలా రాశాడు: “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; . . . జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయంచు కొనుచున్నాము.” (2 కొరింథీయులు 5:14, 15) మన కోసం యేసు చేసినదాన్ని మనం ప్రశంసించినట్లైతే, మనం ప్రతిస్పందిస్తాం. మరణం నుండి మనల్ని విముక్తుల్ని చేయగలిగేది విమోచన క్రయధనమే గదా! యేసు బలి అర్పణ అంత విలువైనదికాదని మన చర్యల ద్వారా సూచించాలని మనం నిశ్చయంగా అనుకోం.—హెబ్రీయులు 10:29.

20. మనం యేసు ‘మాటను’ లక్ష్యపెట్టగలిగే కొన్ని మార్గాలు ఏవి?

20 విమోచన క్రయధనం విషయంలో మనం హృదయపూర్వకమైన ప్రశంసను ఎలా చూపించగలం? యేసు తాను బంధించబడడానికి కొంచెం ముందు ఇలా తెలియజేశాడు: “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నామాట గైకొనును.” (యోహాను 14:23) “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బాప్తిస్మమి[వ్వుడి]” అనే నియామకాన్ని నెరవేర్చడంలో మనం ఆసక్తిగా భాగంవహించాలన్న యేసు ఆజ్ఞ ఆ ‘మాటలో’ చేరివుంది. (మత్తయి 28:19) యేసుకు విధేయత చూపించడానికి మనం మన ఆధ్యాత్మిక సహోదరులపట్ల ప్రేమ చూపించడం కూడా అవసరం.—యోహాను 13:34, 35.

21. ఏప్రిల్‌ 1న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు మనమెందుకు హాజరవ్వాలి?

21 విమోచన క్రయధనంపట్ల మన మెప్పుదలను చూపించగల్గే అతి శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడమే. అది ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1వ తారీఖున జరుగుతుంది.a అది కూడా యేసు ‘మాటలో’ ఒక భాగమే. ఎందుకంటే ఆ ఆచరణను ప్రారంభించేటప్పుడు, యేసు, “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (లూకా 22:19) అత్యంత ప్రాముఖ్యమైన ఆ సంఘటనకు మనం హాజరవ్వడం ద్వారా, క్రీస్తు ఆజ్ఞాపించిన వాటన్నింటిపై శ్రద్ధగా మన అవధానాన్ని ఉంచడం ద్వారా, యేసు అర్పించిన విమోచన క్రయధనమే దేవుని రక్షణ మార్గమనే మన స్థిరమైన ఒప్పుదలను మనం చూపిస్తాం. “మరి ఏ నామమున రక్షణ పొందలేము” అన్నది వాస్తవం.—అపొస్తలుల కార్యములు 4:12.

[అధస్సూచీలు]

a యేసు మరణించిన సా.శ. 33 నీసాను 14వ తారీఖునకు సమానమైన తారీఖు ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 అయివుంది. జ్ఞాపకార్థ ఆచరణ జరిగే స్థలం, సమయం కోసం స్థానిక యెహోవాసాక్షులను అడగండి.

జ్ఞాపకమునకు తెచ్చుకోగలరా?

◻ మానవులు తమ పాపభరితమైన పరిస్థితికి ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకోలేరు?

◻ ఏ విధంగా యేసు ‘తత్సమానమైన విమోచన క్రయధనము’ అయివున్నాడు?

◻ యేసు తన పరిపూర్ణ మానవ జీవిత హక్కును మన ప్రయోజనం నిమిత్తం ఎలా ఉపయోగించాడు?

◻ క్రీస్తు విమోచన క్రయధనం మూలంగా మానవజాతికి ఏ ఆశీర్వాదాలు వస్తాయి?

[15వ పేజీలోని చిత్రం]

ఆదాముకు సరిసమానుడైన పరిపూర్ణ మానవుడు మాత్రమే న్యాయపు త్రాసును సమతూకపర్చగలడు

[16వ పేజీలోని చిత్రం]

పరిపూర్ణ మానవ జీవితపు హక్కు యేసుకు ఉంది గనుక, ఆయన మరణానికి బల్యర్పణ విలువ ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి