అధ్యాయం 30
“ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
1-3. మనం యెహోవాలా ప్రేమ చూపించినప్పుడు ఏ ప్రయోజనాలు వస్తాయి?
“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొస్తలుల కార్యాలు 20:35) యేసు చెప్పిన ఆ మాటలు, ఈ ముఖ్యమైన సత్యాన్ని నొక్కి చెప్తున్నాయి: నిస్వార్థమైన ప్రేమ చూపిస్తే మనకే మంచిది. ప్రేమ పొందడంలో ఎక్కువ సంతోషం ఉన్నా, ఆ ప్రేమను వేరేవాళ్లకు ఇవ్వడంలో లేదా చూపించడంలో ఇంకా ఎక్కువ సంతోషం ఉంది.
2 ఈ విషయం, వేరే ఎవ్వరి కన్నా మన పరలోక తండ్రికి బాగా తెలుసు. ఈ సెక్షన్‌లోని ముందటి అధ్యాయాల్లో చూసినట్టు, ప్రేమ చూపించడంలో యెహోవాను మించినవాళ్లు లేరు. వేరే ఎవ్వరూ ఆయన కన్నా గొప్ప విధాలుగా, ఆయన కన్నా ఎక్కువకాలం ప్రేమను చూపించలేరు. కాబట్టి యెహోవాను “సంతోషంగల దేవుడు” అని పిలవడంలో ఏదైనా ఆశ్చర్యం ఉందా?—1 తిమోతి 1:11.
3 మనం తనలా ఉండాలని, మరిముఖ్యంగా తనలా ప్రేమ చూపించాలని మన ప్రేమగల దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులు 5:1, 2 ఇలా చెప్తుంది: “దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించండి, ప్రేమతో నడుచుకుంటూ ఉండండి.” మనం యెహోవాలా ప్రేమ చూపించినప్పుడు, ఇవ్వడంలో ఉన్న గొప్ప సంతోషాన్ని రుచిచూస్తాం. అలాగే మనం యెహోవాను సంతోషపెడుతున్నాం అనే సంతృప్తి కూడా మిగులుతుంది. ఎందుకంటే, ‘ఒకరినొకరు ప్రేమించుకోండి’ అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (రోమీయులు 13:8) అయితే, మనం “ప్రేమతో నడుచుకుంటూ” ఉండడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
ప్రేమ ఎందుకు చూపించాలి?
మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని నమ్మేలా ప్రేమ మనల్ని కదిలిస్తుంది
4, 5. మనం తోటి బ్రదర్స్‌సిస్టర్స్ మీద నిస్వార్థమైన ప్రేమ ఎందుకు చూపించాలి?
4 మనం తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎందుకు ప్రేమించాలి? ఒక్క ముక్కలో చెప్పాలంటే, నిజ క్రైస్తవులకు ప్రేమే గుర్తు. ప్రేమ లేకపోతే మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వలేం, అంతకన్నా ముఖ్యంగా యెహోవా దృష్టిలో మన విలువ సున్నా అయిపోతుంది. ఈ సత్యాల్ని బైబిలు ఎలా నొక్కిచెప్తుందో ఇప్పుడు చూద్దాం.
5 యేసు చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన అనుచరులతో ఇలా అన్నాడు: “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహాను 13:34, 35) గమనించారా, “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే” అని యేసు అన్నాడు. అంటే మనం యేసు చూపించినలాంటి ప్రేమను చూపించాలని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. మనం 29వ అధ్యాయంలో చూసినట్టు, యేసు తనకన్నా వేరేవాళ్ల అవసరాల్ని, ఇష్టాల్ని ముందు ఉంచుతూ నిస్వార్థమైన ప్రేమ చూపించాడు. అలా యేసు మనకు గొప్ప ఆదర్శం ఉంచాడు. మనం కూడా నిస్వార్థమైన ప్రేమ చూపించాలి, అంతేకాదు బయటివాళ్లకు కూడా మన మధ్య ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించాలి. నిజానికి, మన బ్రదర్స్‌సిస్టర్స్ మీద చూపించే అలాంటి నిస్వార్థమైన ప్రేమే, మనం నిజ క్రైస్తవులం అనడానికి బండగుర్తు.
6, 7. (ఎ) ప్రేమ చూపించడానికి బైబిలు చాలా విలువ ఇస్తుందని మనకెలా తెలుసు? (బి) 1 కొరింథీయులు 13:4-8 లో పౌలు ఏ ప్రేమ గురించి చెప్తున్నాడు?
6 ఒకవేళ మనలో ప్రేమ లేకపోతే అప్పుడేంటి? “ప్రేమ లేకపోతే నేను గణగణ మోగే గంటతో, టంగ్టంగ్మనే తాళంతో సమానం” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 కొరింథీయులు 13:1) టంగ్టంగ్మనే తాళం, చెవులకు చిల్లులు పడే శబ్దం చేస్తుంది. గణగణ మోగే గంట కూడా అంతే. ఎంత మంచి ఉదాహరణలో కదా! ప్రేమలేని వ్యక్తి భయంకరమైన, కర్ణ కఠోరమైన శబ్దం చేసే సంగీత వాయిద్యం లాంటివాడు. ఆ మోతకు జనాలు పారిపోతారే గానీ దగ్గరికి రారు. అలాంటి వ్యక్తి వేరేవాళ్లతో ఎలా మంచిగా ఉండగలడు? పౌలు ఇంకా ఇలా అన్నాడు: “కొండల్ని జరిపేంత బలమైన విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే.” (1 కొరింథీయులు 13:2) ఒకసారి ఆలోచించండి, ఆ వ్యక్తి ఎన్ని పనులు చేసినా ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి “ఉన్నా లేనట్టే.” (ది ఆంప్లిఫైడ్ బైబిల్) కాబట్టి, ప్రేమ చూపించడానికి బైబిలు ఎంత విలువ ఇస్తుందో అర్థమౌతుంది కదా.
7 మరి, మనం వేరేవాళ్ల మీద ఎలా ప్రేమ చూపించవచ్చు? దానికి జవాబు తెలుసుకోవడానికి, 1 కొరింథీయులు 13:4-8 లో పౌలు ఏం చెప్పాడో చూద్దాం. పౌలు ఈ వచనాల్లో దేవునికి మన మీదున్న ప్రేమ గురించో, మనకు దేవుని మీదున్న ప్రేమ గురించో చెప్పట్లేదు గానీ, మనం ఒకరి మీద ఒకరం చూపించుకోవాల్సిన ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ ఏమేం చేస్తుందో, ఏమేం చేయదో ఆయన వివరించాడు.
ప్రేమ ఏమేం చేస్తుంది?
8. ఓర్పు మనకు ఎలా సహాయం చేస్తుంది?
8 “ప్రేమ ఓర్పు చూపిస్తుంది.” అంటే, ప్రేమ వేరేవాళ్లను ఓపిగ్గా భరిస్తుంది. (కొలొస్సయులు 3:13) మనకు అలాంటి ఓర్పు అవసరం కాదంటారా? మనం అపరిపూర్ణ మనుషులం కాబట్టి, మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో దగ్గరగా పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్లు మనల్ని చిరాకు పెట్టవచ్చు, లేదా మనం వాళ్లను చిరాకు పెట్టవచ్చు. అది మామూలే. కానీ ఓర్పు ఉంటే అలాంటి కోపతాపాల్ని, చిన్నచిన్న మనస్పర్థల్ని సహిస్తాం, సంఘంలో ఉన్న శాంతిని పాడుచేయకుండా ఉంటాం.
9. మనం ఏయే విధాలుగా వేరేవాళ్ల మీద దయ చూపించవచ్చు?
9 “ప్రేమ . . . దయ చూపిస్తుంది.” దయ అంటే మన మాటల్లో, పనుల్లో శ్రద్ధ చూపిస్తూ సహాయం చేయడం. ప్రేమ ఉంటే వేరేవాళ్ల మీద, మరిముఖ్యంగా అవసరంలో ఉన్నవాళ్ల మీద దయ చూపించే అవకాశాల కోసం వెదుకుతాం. ఉదాహరణకు, మనం ఒంటరిగా ఉంటున్న ఒక పెద్ద వయసు బ్రదర్‌ని లేదా సిస్టర్ని కలిసి ప్రోత్సహించవచ్చు. ఒక ఒంటరి తల్లికి లేదా ఇంట్లో ఎవరూ సత్యంలోలేని ఒక సిస్టర్‌కి, మన సహాయం అవసరం కావచ్చు. ఒంట్లో బాలేనివాళ్లకు లేదా ఏదైనా కష్టంలో ఉన్నవాళ్లకు, ఒక నమ్మకమైన స్నేహితుడు చెప్పే దయగల మాటలు అవసరం కావచ్చు. (సామెతలు 12:25; 17:17) ఆ విధాలుగా మనం దయ చూపించడానికి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు, మన ప్రేమ నిజమైనదని చూపిస్తాం.—2 కొరింథీయులు 8:8.
10. కష్టమైనా సరే సత్యాన్ని సమర్థించడానికి, నిజమే మాట్లాడడానికి ప్రేమ ఎలా సహాయం చేస్తుంది?
10 “ప్రేమ . . . సత్యం విషయంలో సంతోషిస్తుంది.” వేరే అనువాదం దాన్ని ఇలా చెప్తుంది: “ప్రేమ . . . సంతోషంగా సత్యం వైపు నిలబడుతుంది.” సత్యాన్ని సమర్థించేలా, ‘ఒకరితో ఒకరు నిజమే మాట్లాడేలా’ ప్రేమ కదిలిస్తుంది. (జెకర్యా 8:16) ఉదాహరణకు, మీ బంధువో, స్నేహితుడో ఘోరమైన పాపం చేశాడనుకోండి. అతని మీద అలాగే యెహోవా మీద ఉన్న ప్రేమ వల్ల మీరు దేవుని ప్రమాణాల్ని సమర్థిస్తారే గానీ, అతని తప్పును కప్పిపుచ్చాలని, దాన్ని సమర్థించాలని, లేదా దాని గురించి అబద్ధం చెప్పాలని అనుకోరు. నిజమే, అతను చేసిన దాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. కానీ మీరు నిజంగా ఆ వ్యక్తి మేలు కోరే వాళ్లయితే, దేవుడు ప్రేమతో ఇచ్చే క్రమశిక్షణను అతను తీసుకోవాలని, మంచిగా స్పందించాలని కోరుకుంటారు. (సామెతలు 3:11, 12) ప్రేమగల క్రైస్తవులుగా, మనం “అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని” కూడా కోరుకుంటాం.—హెబ్రీయులు 13:18.
11. ప్రేమ “అన్నిటినీ భరిస్తుంది” కాబట్టి, బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఉన్న లోపాల్ని మనం ఏం చేయకూడదు?
11 “ప్రేమ . . . అన్నిటినీ భరిస్తుంది.” గ్రీకులో దానికి, “అన్నిటినీ కప్పుతుంది” అనే అర్థం ఉంది. (కింగ్డమ్ ఇంటర్లీనియర్) మొదటి పేతురు 4:8 ఇలా చెప్తుంది: “ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.” అవును, నిజమైన ప్రేమ ఉన్న క్రైస్తవుడు బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఉన్న ప్రతీ అపరిపూర్ణతను, ప్రతీ లోపాన్ని అందరి ముందు బయటపెట్టాలని చూడడు. చాలావరకు మన బ్రదర్స్‌సిస్టర్స్ చేసే తప్పులు, వాళ్లలో ఉండే లోపాలు చిన్నవే. మనం వాటిని ప్రేమ అనే వస్త్రంతో కప్పేయవచ్చు.—సామెతలు 10:12; 17:9.
12. ఫిలేమోను సరైనదే చేస్తాడని నమ్ముతున్నట్టు అపొస్తలుడైన పౌలు ఎలా చూపించాడు? పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
12 “ప్రేమ . . . అన్నిటినీ నమ్ముతుంది.” మొఫత్ అనువాదం దాన్ని ఇలా చెప్తుంది: “వేరేవాళ్లు ఎప్పుడూ మంచే చేస్తారని ప్రేమ నమ్ముతుంది.” మనం తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని అనవసరంగా అనుమానించం, వాళ్ల ప్రతీ ఉద్దేశాన్ని ప్రశ్నించం. వాళ్లు మంచే చేస్తారని నమ్మడానికి, వాళ్ల మీద నమ్మకం ఉంచడానికి ప్రేమ మనకు సహాయం చేస్తుంది.a ఉదాహరణకు, పౌలు ఫిలేమోనుకు రాసిన ఉత్తరం గమనించండి. ఇంట్లో నుండి పారిపోయిన ఒనేసిము అనే దాసుడు, ఇప్పుడు క్రైస్తవుడయ్యాడని, ఆయన తిరిగొచ్చాక దయగా చేర్చుకోమని పౌలు ఫిలేమోనును ప్రోత్సహిస్తూ ఉత్తరం రాశాడు. ఆయన ఫిలేమోనును బలవంతపెట్టలేదు గానీ, ప్రేమతో బుజ్జగిస్తూ మాట్లాడాడు. ఫిలేమోను సరైనదే చేస్తాడని ఎంతగా నమ్ముతున్నాడో చెప్తూ, పౌలు ఇలా అన్నాడు: “నువ్వు నా మాట వింటావనే నమ్మకంతో రాస్తున్నాను, నేను అడిగినదాని కన్నా నువ్వు ఇంకా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు.” (21వ వచనం) ప్రేమతో మన బ్రదర్స్‌సిస్టర్స్ మీద అంతే నమ్మకం ఉంచినప్పుడు, వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని బయటికి తీస్తాం.
13. మన బ్రదర్స్‌సిస్టర్స్ సరైనదే చేస్తారని మనం ఎందుకు ఆశతో ఉంటాం?
13 “ప్రేమ . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది.” ప్రేమ అన్నిటినీ నమ్మినట్లే, అన్నిటినీ నిరీక్షిస్తుంది కూడా. ప్రేమ ఉంటే, మన బ్రదర్స్‌సిస్టర్స్ సరైనదే చేస్తారనే ఆశతో ఉంటాం. ఉదాహరణకు, ఒక బ్రదర్ “తెలియక తప్పటడుగు” వేస్తే, సంఘపెద్దలు ఆయన్ని ప్రేమతో సరిదిద్దినప్పుడు ఆయన చక్కగా స్పందిస్తాడని మనం ఆశతో ఉంటాం. (గలతీయులు 6:1) అంతేకాదు, విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్లు బలపడతారని ఎదురుచూస్తాం. అలాంటివాళ్లు విశ్వాసంలో బలపడడానికి మనం చేయగలిగినదంతా చేస్తూ, ఓపిగ్గా వాళ్లకు సహాయం చేస్తాం. (రోమీయులు 15:1; 1 థెస్సలొనీకయులు 5:14) మన కుటుంబ సభ్యుడో, స్నేహితుడో యెహోవాను వదిలేసి వెళ్లిపోతే, యేసు చెప్పిన ఉదాహరణలోని తప్పిపోయిన కుమారునిలా, ఏదోకరోజు వాళ్లు తమ తప్పు తెలుసుకుని యెహోవా దగ్గరికి తిరిగొస్తారని కొండంత ఆశతో ఉంటాం.—లూకా 15:17, 18.
14. సంఘంలో మనం సహనం చూపించడం ఎప్పుడు కష్టంగా ఉండవచ్చు? అలాంటప్పుడు ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం?
14 “ప్రేమ . . . అన్నిటినీ సహిస్తుంది.” ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు లేదా మనకు కష్టాలు వచ్చినప్పుడు, గట్టిగా నిలబడడానికి సహనం మనకు సహాయం చేస్తుంది. మన సహనానికి పరీక్షలు బయట నుండే కాదు, కొన్నిసార్లు సంఘంలో నుండి కూడా రావచ్చు. అపరిపూర్ణత వల్ల, మన బ్రదర్స్‌సిస్టర్స్ కొన్నిసార్లు మనల్ని బాధపెట్టవచ్చు. వాళ్లు ముందూ వెనకా చూసుకోకుండా అన్న మాట మన మనసుకు గుచ్చుకోవచ్చు. (సామెతలు 12:18) బహుశా, సంఘంలో ఒక సమస్యను మనం అనుకున్నట్టుగా పెద్దలు పరిష్కరించకపోవచ్చు. అందరూ గౌరవించే ఒక బ్రదర్, ‘అసలు ఈయన ఒక క్రైస్తవుడేనా?’ అని అనిపించేలా ప్రవర్తించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం సంఘానికి దూరమై, యెహోవా సేవను ఆపేస్తామా? ప్రేమ ఉంటే అస్సలు అలా చేయం! అవును, ప్రేమ ఉంటే ఆ బ్రదర్‌లో ఉన్న లోపాల్ని బట్టి, ఇక ఆయనలో ఏ మంచీ లేదని, సంఘంలో ఎవరూ మంచివాళ్లు కాదని ఒక ముగింపుకు వచ్చేయం. ప్రేమ ఉంటే మన సాటి అపరిపూర్ణ మనిషి ఏం అన్నా, ఏం చేసినా మనం దేవునికి నమ్మకంగా ఉంటాం, సంఘానికి మద్దతిస్తాం.—కీర్తన 119:165.
ప్రేమ ఏమేం చేయదు?
15. అసూయ అంటే ఏంటి? ఈ హానికరమైన లక్షణాన్ని తీసేసుకోవడానికి ప్రేమ ఎలా సహాయం చేస్తుంది?
15 “ప్రేమ అసూయపడదు.” అసూయ ఉంటే వేరేవాళ్లకు ఉన్న వస్తువులు, ఆశీర్వాదాలు, లేదా సామర్థ్యాల్ని చూసి మనం కుళ్లుకునే అవకాశం ఉంది. అలాంటి అసూయ స్వార్థమైనది, హానికరమైనది. దాన్ని అలాగే వదిలేస్తే, సంఘంలో ఉన్న శాంతిని ముక్కలుముక్కలు చేస్తుంది. మరి అసూయపడకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (యాకోబు 4:5) ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రేమ సహాయం చేస్తుంది. ఈ అమూల్యమైన లక్షణం ఉంటే, మన దగ్గర లేనివి వేరేవాళ్ల దగ్గర ఉన్నట్టు అనిపించినా, మనం వాళ్లతో కలిసి సంతోషిస్తాం. (రోమీయులు 12:15) వేరేవాళ్లకు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉండవచ్చు, లేదా వాళ్లు ఏదైనా గొప్పగా సాధించి ఉండవచ్చు. అలాంటప్పుడు అందరూ వాళ్లను పొగుడుతుంటే, మనం అసూయపడకుండా ఉండడానికి ప్రేమ సహాయం చేస్తుంది.
16. మనం బ్రదర్స్‌సిస్టర్స్‌ని నిజంగా ప్రేమిస్తే, యెహోవా సేవలో మనం చేసేవాటి గురించి ఎందుకు గొప్పలు చెప్పుకోం?
16 “ప్రేమ . . . గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు.” మన సామర్థ్యాల గురించి, మనం సాధించినవాటి గురించి డప్పు కొట్టుకోకుండా ప్రేమ మనల్ని ఆపుతుంది. మనం బ్రదర్స్‌సిస్టర్స్‌ని నిజంగా ప్రేమిస్తే, పరిచర్యలో మనం సాధించినవాటి గురించి, సంఘంలో మనకున్న సేవావకాశాల గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకుంటామా? అలా గొప్పలు చెప్పుకుంటే, అవతలివాళ్లు మనతో పోల్చుకుని మనకన్నా తక్కువ అనుకుంటారు, నిరుత్సాహపడతారు. ప్రేమ ఉంటే దేవుని సేవలో మనం చేసేవాటి గురించి గొప్పలు చెప్పుకోం, ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తేనే కదా మనం అవన్నీ చేయగలుగుతున్నాం. (1 కొరింథీయులు 3:5-9) అలాగే ప్రేమ “ఉబ్బిపోదు,” లేదా ద న్యూ టెస్ట్‌మెంట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ చెప్తున్నట్లు, “ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోదు.” కాబట్టి ప్రేమ ఉంటే, మనం వేరేవాళ్ల కంటే గొప్ప అని అనుకోం.—రోమీయులు 12:3.
17. ప్రేమ ఉంటే మనం వేరేవాళ్లతో ఎలా ప్రవర్తించం, కానీ ఎలా ప్రవర్తిస్తాం?
17 “ప్రేమ . . . అమర్యాదగా ప్రవర్తించదు.” అమర్యాదగా ప్రవర్తించడం అంటే అవమానకరంగా, అగౌరవంగా ప్రవర్తించడం. అలా చేస్తే ప్రేమ లేనట్టే, ఎందుకంటే అది అవతలివాళ్ల ఫీలింగ్స్‌ని, బాగోగుల్ని పట్టించుకోనట్టు అవుతుంది. కానీ ప్రేమ ఉంటే మనం దయగా ఉంటాం, వాళ్ల మీద శ్రద్ధ ఉందని చూపిస్తాం. ప్రేమ మంచి సంస్కారాన్ని, దైవభక్తిని, మన బ్రదర్స్‌సిస్టర్స్ మీద గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రేమ మనల్ని ‘అవమానకరమైన ప్రవర్తనకు,’ అంటే మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని అభ్యంతరపెట్టే లేదా నొప్పించే ఎలాంటి ప్రవర్తనకైనా దూరంగా ఉంచుతుంది.—ఎఫెసీయులు 5:3, 4.
18. ప్రేమ ఉన్న వ్యక్తి, ప్రతీది తనకు నచ్చినట్టే జరగాలని ఎందుకు పట్టుబట్టడు?
18 “ప్రేమ . . . సొంత ప్రయోజనం మాత్రమే చూసుకోదు.” రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ ఇలా చెప్తుంది: “ప్రేమ ఫలానా విధంగానే జరగాలని పట్టుబట్టదు.” ప్రేమ ఉన్న వ్యక్తి తన అభిప్రాయాలే ఎప్పుడూ సరైనవని, ప్రతీది తనకు నచ్చినట్టే జరగాలని పట్టుబట్టడు. వేరే అభిప్రాయం ఉన్నవాళ్లను తన దారికి తెచ్చుకుని, తను చెప్పిందే ఒప్పుకునేలా చేయడు. అలాంటి మొండితనం ఉంటే కొంతమేరకు గర్వం ఉన్నట్టే. కానీ బైబిలు ఇలా చెప్తుంది: “నాశనానికి ముందు గర్వం ఉంటుంది.” (సామెతలు 16:18) మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని నిజంగా ప్రేమిస్తే, వాళ్ల అభిప్రాయాల్ని గౌరవిస్తాం, అవసరమైతే మనల్ని మనం తగ్గించుకుని ఒక మెట్టు దిగడానికి ఇష్టపడతాం. అలా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, పౌలు చెప్పిన ఈ మాటల్ని పాటించినట్టే: “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.”—1 కొరింథీయులు 10:24.
19. ప్రేమ ఉంటే, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు ఏం చేస్తాం?
19 “ప్రేమ . . . త్వరగా కోపం తెచ్చుకోదు, ప్రేమ హానిని మనసులో పెట్టుకోదు.” ప్రేమ ఉంటే వేరేవాళ్లు అన్నవాటిని బట్టి, చేసినవాటిని బట్టి త్వరగా కోపం తెచ్చుకోం. నిజమే, ఎవరైనా మనల్ని బాధపెడితే సహజంగానే కోపం వస్తుంది. కానీ మన కోపంలో న్యాయం ఉన్నా సరే, ఆ కోపాన్ని అలాగే మనసులో ఉంచుకోకుండా ప్రేమ మనకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 4:26, 27) వేరేవాళ్లు అన్నవి, చేసినవి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఏదో పుస్తకంలో రాసిపెట్టుకున్నట్టు రాసిపెట్టుకోం. బదులుగా, మన ప్రేమగల దేవుడైన యెహోవాలా ఉండడానికి ప్రేమ మనల్ని కదిలిస్తుంది. 26వ అధ్యాయంలో మనం చూశాం కదా, యెహోవా సరైన కారణం ఉన్నప్పుడు మనుషుల్ని క్షమిస్తాడు. ఆయన క్షమించినప్పుడు వాటిని మర్చిపోతాడు. అంటే ఒకసారి క్షమించేశాక, ఆ పాపాన్ని మళ్లీమళ్లీ ఎత్తడు. యెహోవా మన పాపాల్ని రాసిపెట్టుకోకుండా ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!
20. మన తోటి బ్రదర్ ఏదైనా పాపం చేసి బాధలు అనుభవిస్తుంటే, మనం ఏం చేయకూడదు?
20 “ప్రేమ . . . చెడు విషయంలో సంతోషించదు.” ద న్యూ ఇంగ్లీష్ బైబిల్లో ఆ లేఖనం ఇలా ఉంది: “ప్రేమ . . . వేరేవాళ్ల పాపాల్ని బట్టి ఆనందించదు.” మొఫత్ అనువాదం ఇలా చెప్తుంది: “వేరేవాళ్లు తప్పు చేసినప్పుడు ప్రేమ సంతోషించదు.” ప్రేమ ఉంటే మనం చెడును బట్టి సంతోషించం, కాబట్టి ఏ విధమైన అనైతికతను మనం చూసీచూడనట్టు వదిలేయం. ఒకవేళ మన తోటి బ్రదర్ ఏదైనా పాపం చేసి దానివల్ల బాధలు అనుభవిస్తుంటే, మనం ఏం చేస్తాం? ‘బాగా అయ్యింది! ఆయనకు అవ్వాల్సిందే!’ అని మనం నవ్వుకోం. (సామెతలు 17:5) బదులుగా, తప్పు చేసిన వ్యక్తి తన పాపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు మనం సంతోషిస్తాం.
“అన్నిటికన్నా గొప్ప మార్గం”
21-23. (ఎ) “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అని పౌలు అన్నప్పుడు, ఆయన ఉద్దేశం ఏంటి? (బి) చివరి అధ్యాయంలో ఏం చూస్తాం?
21 “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.” పౌలు ఆ మాటలు అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఆ లేఖనం సందర్భాన్ని చూస్తే, తొలి క్రైస్తవులకు పవిత్రశక్తి ఇచ్చిన వరాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న క్రైస్తవ సంఘం మీద దేవుని ఆమోదం ఉంది అనడానికి ఆ వరాలు గుర్తుగా పనిచేశాయి. అయితే రోగాల్ని అద్భుతరీతిలో బాగుచేసే వరం, ప్రవచించే వరం, భాషలు మాట్లాడే వరం క్రైస్తవుల్లో అందరికీ ఉండేవి కాదు. అయితే, అసలు విషయం అది కాదు. ఎందుకంటే ఆ అద్భుతమైన వరాలు ఎలాగూ కొంతకాలానికి ఆగిపోతాయి. కానీ, ఎప్పటికీ ఆగిపోనిది ఒకటుంది. దాన్ని ప్రతీ క్రైస్తవుడు పెంచుకోవచ్చు. అది ఏ అద్భుతమైన వరం కన్నా చాలా గొప్పది, పైగా చాలాకాలం పాటు ఉంటుంది. నిజానికి పౌలు దాన్ని “అన్నిటికన్నా గొప్ప మార్గం” అన్నాడు. (1 కొరింథీయులు 12:31) ఇంతకీ ఏంటది? అదే ప్రేమ మార్గం.
22 నిజానికి, “శాశ్వతంగా ఉంటుంది” అని పౌలు చెప్పిన క్రైస్తవ ప్రేమకు ముగింపే లేదు. ఈ రోజుల్లో కూడా యేసు నిజమైన అనుచరుల్ని గుర్తుపట్టడానికి, బ్రదర్స్‌సిస్టర్స్ మీద చూపించే నిస్వార్థమైన ప్రేమే గుర్తు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో, ఆ ప్రేమ కళ్లకు కట్టినట్టు కనిపించట్లేదా? ఆ ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే యెహోవా తన నమ్మకమైన సేవకులకు శాశ్వత జీవితాన్ని ఇస్తానని మాటిచ్చాడు. (కీర్తన 37:9-11, 29) కాబట్టి, ‘ప్రేమతో నడుచుకుంటూ ఉండడానికి’ చేయగలిగినదంతా చేద్దాం. అలా చేస్తే, ఇవ్వడంలో ఉన్న గొప్ప సంతోషాన్ని మనం రుచి చూడవచ్చు. అంతకంటే ముఖ్యంగా, మన ప్రేమగల దేవుడైన యెహోవాలా మనం శాశ్వతకాలం జీవిస్తూ, శాశ్వతకాలం ప్రేమిస్తూ ఉండవచ్చు.
యెహోవా ప్రజల్ని వాళ్ల మధ్య ఉన్న ప్రేమను బట్టే గుర్తుపట్టవచ్చు
23 ప్రేమ గురించి వివరిస్తున్న సెక్షన్లో, ఈ అధ్యాయం చివరిది. ఇందులో మనం ఒకరి మీద ఒకరం ఎలా ప్రేమ చూపించుకోవాలో మాట్లాడుకున్నాం. ఈ పుస్తకం మొత్తంలో మనం యెహోవా శక్తి, న్యాయం, తెలివి నుండి, మరిముఖ్యంగా ఆయన ప్రేమ నుండి ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందుతున్నామో చూశాం. కాబట్టి, ‘నేను నిజంగా యెహోవాను ప్రేమిస్తున్నానని ఎలా చూపించవచ్చు?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది. దాని గురించే చివరి అధ్యాయంలో చూస్తాం.
a ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అంటే, అది గుడ్డిదని కాదు. బైబిలు మనకు ఈ సలహా ఇస్తుంది: “విభజనలు సృష్టించేవాళ్లను, తప్పుదోవ పట్టించేవాళ్లను ఓ కంట కనిపెడుతూ వాళ్లకు దూరంగా ఉండండి.”—రోమీయులు 16:17.