జెరోమ్—బైబిలు అనువాదంలో ఒక వివాదాస్పద మార్గదర్శకుడు
లాటిన్ వల్గేట్‌ను “[క్యాథలిక్] చర్చి ఆమోదించింది . . . ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తిరస్కరించే ధైర్యంగాని ప్రయత్నం గాని చేయకూడదు” అని 1546, ఏప్రిల్ 8న కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ ఆదేశించింది. వల్గేట్ అప్పటికి వెయ్యి సంవత్సరాల క్రితమే పూర్తి చేయబడినప్పటికీ తన అనువాదంతోపాటు జెరోమ్కూడా ఎంతోకాలంగా వివాదాలకు నిలయంగా ఉన్నాడు. ఈ జెరోమ్ ఎవరు? ఆయనా ఆయన బైబిలు అనువాదమూ ఎందుకు వివాదాస్పదంగా తయారయ్యాయి? ఆయన కృతి నేటి బైబిలు అనువాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఒక విద్వాంసుడు ఆవిర్భవించటం
జెరోమ్ లాటిన్ పేరు యూసేబియస్ హైరానమస్. ఆయన ప్రస్తుత ఇటలీ స్లొవేనియాల సరిహద్దువద్దనున్న డాల్మేషియాలోని రోమన్ల రాష్ట్రమైన స్ట్రీడన్లో దాదాపు సా.శ. 346లో జన్మించాడు.a కాస్త కలిగిన కుటుంబంలోనే పుట్టిన జెరోమ్, రోమ్‌లో ప్రఖ్యాత వ్యాకరణ పండితుడైన డనేటస్వద్ద విద్యను గరిపి బాల్యదశనుండే కలిమియొక్క ప్రయోజనాలను చవిచూశాడు. వ్యాకరణంలోను, భాషాపరంగాను, తత్వజ్ఞానంలోను స్థితప్రజ్ఞుడైన విద్యార్థి. ఈ కాలంలోనే ఆయన గ్రీకు కూడా అభ్యసించడం ప్రారంభించాడు.
సా.శ. 366లో రోమ్ను విడిచిన తర్వాత జెరోమ్ తిరిగి తిరిగి చివరికి ఇటలీలోని ఆక్వలేయాకి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు సన్యాసివాదం పరిచయమైంది. అందులో ఉండే అతి తీవ్రమైన సర్వసంగపరిత్యాగ భావనలపట్ల ఆకర్షితుడై ఆయనా ఆయన స్నేహితుల గుంపు ఒకటీ కలిసి సన్యాసి జీవనవిధానాన్ని అనుసరిస్తూ కొన్నేళ్లు గడిపారు.
సా.శ. 373లో ఏదో తెలియని అలజడికి లోనై ఈ గుంపు చెదిరిపోయింది. జెరోమ్ గలిబిలికి గురై బితూనియ, గలతీయ, సెలూకయల మీదుగా తూర్పుకు ప్రయాణించి చివరికి సిరియాలోని అంతియొకయకు చేరుకున్నాడు.
ఆ సుదీర్ఘప్రయాణం ఆయనమీద చాలా దుష్ప్రభావాన్ని చూపించింది. పూర్తిగా డస్సిపోయి ఆరోగ్యం కుంటుపడిన జెరోమ్‌ను జ్వరం దాదాపు కబళించేదే. “ఓహ్, యేసుక్రీస్తు ప్రభువు నన్ను నీ దగ్గరకు లిప్తకాలంలో చేరవేస్తే ఎంతబాగుండు” అని తన స్నేహితునికి వ్రాస్తూ అన్నాడు. “నా శరీరం బాగున్నప్పుడు కూడా బలహీనత ఉంటున్న నా శరీరం ఛిద్రమైపోయింది.”
అనారోగ్యమూ, ఒంటరితనమూ, అంతర్గత మథనం చాలదన్నట్లు, జెరోమ్ త్వరలోనే మరొక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు—అది ఆధ్యాత్మికమైనది. ఒక కలలో తనను దేవుని “తీర్పు సింహాసనానికి లాక్కెళ్లినట్లు” ఆయన చూశాడు. తానెవరో చెప్పమన్నప్పుడు జెరోమ్ ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: “నేను క్రైస్తవుడిని.” కానీ అక్కడ ఆసీనుడై ఉన్న వ్యక్తి తిరిగి ఇలా అన్నాడు: “నీవు అబద్ధాలాడుతున్నావు, నీవు క్రీస్తు అనుచరుడవు కావు, నీవు సిసిరో అనుచరుడవు.”
అప్పటివరకు జెరోమ్ తపన అంతా ప్రాథమికంగా అన్యమతాల్లోని కృతులను అధ్యయనం చేయడంలోనే ఉంది కానీ దేవుని వాక్యాన్ని పఠించడంలో లేదు. “మండుతున్నట్లున్న మనస్సాక్షి నన్ను పీడించింది” అని ఆయన అన్నాడు. విషయాల్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో జెరోమ్ తన కలలో ఇలా ప్రతినబూనాడు: “ప్రభూ, ఇక మీదట నేను లౌకిక పుస్తకాలను ముడితే, లేక వాటిని ఎన్నడైనా చదివితే నేను నిన్ను విడనాడినట్టే.”
తర్వాత, జెరోమ్ తాను కలలో చేసిన ప్రతిజ్ఞ ఇలలో నెరవేర్చడం కుదరదని వాదించాడు. అయినా, తన ప్రతిజ్ఞను నెరవేర్చాలని—కనీసం సూత్రబద్ధంగానైనా నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు. అందుకని జెరోమ్ అంతియొకయ విడిచి సిరియా ఎడారిలోని కల్కిస్లో ఏకాంతవాసాన్ని గడిపాడు. ఆయన ఒక సన్యాసిగా జీవిస్తూ బైబిలునూ వేదాంతపరమైన సాహిత్యాన్నీ పఠించడంలో నిమగ్నమైపోయాడు. జెరోమ్ ఇలా అన్నాడు: “ఇంతకు మునుపు మనుషులు వ్రాసిన పుస్తకాలు చదవడానికే అంకితమైన నేను అంతకన్నా ఎక్కువ దీక్షతో దేవుని పుస్తకాలు చదువుతున్నాను.” ఆయన స్థానిక సిరియా భాషను నేర్చుకున్నాడు కూడా, తర్వాత క్రైస్తవత్వానికి మారిన ఒక యూదుని దగ్గర హెబ్రీ నేర్చుకోవడం ప్రారంభించాడు.
పోప్ ఇచ్చిన నియామకం
దాదాపు ఐదు సంవత్సరాలు సన్యాసిగా జీవించిన తర్వాత జెరోమ్ తన చదువులను కొనసాగించడానికి అంతియొకయకు తిరిగి వచ్చాడు. తీరా చేరుకున్నాక చూస్తే అక్కడి చర్చి పూర్తిగా విభాజితమైవుంది. నిజానికి ఆయన ఇంకా ఎడారిప్రాంతంలో ఉండగానే జెరోమ్ పోప్ డామసస్కి సలహాకోసం విజ్ఞప్తిచేస్తూ ఇలా అడిగాడు: “చర్చి మూడు ముక్కలుగా విడిపోయివుంది, ప్రతి ఒక్కటీ నన్ను తనలో కలుపుకోవడానికి ఉత్సుకతతో ఉంది.”
బిషప్ ఆఫ్ ఆంటియోక్ (అంతియొకయ బిషప్పు) అనే బిరుదు తనకు చెందాలంటే తనకు చెందాలని పోటీపడుతున్న ముగ్గురిలో ఒకరైన పోలైనస్ పక్షానికి చేరాలని జెరోమ్ కొంతకాలానికి నిర్ణయించుకున్నాడు. రెండు షరతులమీద పోలైనస్ తనను మతాధికారిగా నియమించడానికి ఒప్పుకుంటానని జెరోమ్ అన్నాడు. ఒకటి, తాను తన సన్యాసి కార్యకలాపాల్ని కొనసాగించడానికి స్వతంత్రం ఉండాలి. రెండు, ఏదో ఒక్క చర్చిలో మాత్రమే ప్రీస్టుగా సేవచేసే బాధ్యతలనుండి తాను మినహాయించబడాలి.
సా.శ. 381లో పోలైనస్తోపాటు జెరోమ్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్కు హాజరయ్యాడు, అక్కడినుండి ఆయనతోపాటే రోమ్కు పయనమయ్యాడు. జెరోమ్లో ఉన్న పాండిత్యాన్నీ, భాషాపరిజ్ఞానాన్ని పోప్ డామసస్ చాలా త్వరగా గుర్తించాడు. ఒక్క సంవత్సరం లోపలే డామసస్కు వ్యక్తిగత కార్యదర్శి అనే ప్రతిష్ఠాకరమైన స్థానానికి జెరోమ్ ఎదిగాడు.
కార్యదర్శిగా జెరోమ్ వివాదాలకు దూరంగా ఉండలేదు. ఎక్కడేమి జరిగినా సరే ఈయనే కలుగజేసుకుంటున్నట్లుగా కన్పిస్తుంది. ఉదాహరణకు, ఆయన అంతటి భోగభాగ్యాలతో విలసిల్లుతున్న పోప్ గృహంలో కూడా సన్యాసిగా జీవించడం కొనసాగించాడు. ఇది సరిపోదన్నట్టుగా, ఒక ప్రక్క తన కఠిన జీవితవిధానాన్ని సమర్థించుకుంటూనే, మరోప్రక్క పాదిరీలు గడుపుతున్న అమిత లౌకిక జీవిత విధానాలకు విరుద్ధంగా విరుచుకుపడుతూ జెరోమ్ చాలా పెద్ద సంఖ్యలోనే శత్రువులను సంపాదించుకున్నాడు.
అయితే జెరోమ్‌కి విరుద్ధంగా విమర్శకులు ఉన్నప్పటికీ ఆయన పోప్ డామసస్ నుండి పూర్తి మద్దతును పొందాడు. జెరోమ్ తన బైబిలు పరిశోధనను కొనసాగించేలా ప్రోత్సహించడానికి పోప్‌కు మంచి కారణముంది. అప్పట్లో అనేక లాటిన్ బైబిలు అనువాదాలు ఉపయోగంలో ఉండేవి. వీటిలో చాలామట్టుకు నిర్లక్ష్యంగా చేసిన అనువాదాలే, అవి ఘోరమైన తప్పులతో నిండివుండేవి. డామసస్కి ఉన్న మరో చింత ఏమిటంటే తూర్పు పశ్చిమ చర్చిలను భాష విభజిస్తూ ఉంది. తూర్పువైపున ఉన్నవారిలో చాలా తక్కువమందికి లాటిన్ వచ్చేది; పశ్చిమాన అంతకన్నా తక్కువమందికి గ్రీకు వచ్చేది.
అందుకని అప్పటికే లాటిన్లో ఉన్న సువార్తలకు సంస్కరణలు చేసి మళ్లీ లాటిన్లోనికి అనువదించాలని పోప్ డామసస్ ఆత్రుతతో ఉన్నాడు. అసలు గ్రీకును కచ్చితంగా ప్రతిబింబించే ఒక అనువాదం కావాలని—అయితే అది లాటిన్లో కూడా అదే ధాటితోను అంతే స్పష్టతతోను ఉండాలని డామసస్ కోరిక. అటువంటి అనువాదాన్ని అందించగల ఉన్న కొద్దిమంది విద్వాంసుల్లో జెరోమ్ ఒకరు. గ్రీకు, లాటిన్, సిరియక్ భాషల్లో భాషాప్రావీణ్యంతోను, హెబ్రీలో నెట్టుకురాగల పాండిత్యంతోను జెరోమ్ ఆ పనికి పూర్తిగా అర్హుడయ్యాడు. అలా డామసస్ ఇచ్చిన నియామకంతో జెరోమ్ ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి తన జీవితంలో 20 సంవత్సరాలకు పైగా వెచ్చించాడు.
వివాదం ఉద్ధృతమైంది
జెరోమ్ సువార్తలను అతి వేగంతో అనువదిస్తున్నప్పటికీ ఆయన తన పనిలో స్పష్టతనూ, పాండిత్య నైపుణ్యాలనూ కనబర్చాడు. అప్పట్లో అందుబాటులో ఉన్న అన్ని గ్రీకు చేతివ్రాతప్రతులను పోల్చిచూస్తూ, గ్రీకు పాఠానికి అతి సమీపంగా తేవడానికిగాను ఆయన అటు శైలిలోను ఇటు సారంలోను లాటిన్ పాఠానికి మార్పులు చేశాడు.
జెరోమ్ గ్రీకులోవున్న సెప్టాజింట్ పాఠం ఆధారంగా లాటిన్లోకి చేసిన కీర్తనల సంస్కరణా అనువాదాన్ని ఆదరించినట్లుగానే ఆయన చేసిన నాలుగు సువార్తల అనువాదాన్ని కూడా బాగానే ఆదరించారు. అయినప్పటికీ ఆయనకు విమర్శకులు ఉండనే ఉన్నారు. “పూర్వికుల అధికారానికి విరుద్ధంగా, పూర్తి ప్రపంచ అభిప్రాయానికి విరుద్ధంగా నేను సువార్తల్లోని వృత్తాంతాలను సరిదిద్దడానికి ప్రయత్నించానన్న నిందతో కొందరు హేయమైన ప్రజలు ఉద్దేశపూర్వకంగా నాపైన దాడిచేస్తున్నారు” అని జెరోమ్ వ్రాశాడు. అటువంటి ఆక్షేపణలు సా.శ. 384లో పోప్ డామసస్ మరణంతో మరింత ఉద్ధృతమయ్యాయి. క్రొత్త పోప్‌తో జెరోమ్ సంబంధాలు మునుపటి పోప్‌తో ఉన్నంత బాగా ఉండకపోవడంతో ఆయన రోమ్ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి జెరోమ్ తూర్పు దిక్కుకి పయనమయ్యాడు.
ఒక హెబ్రీ విద్వాంసుడు ఆవిర్భవించడం
సా.శ. 386లో జెరోమ్ బేత్లెహేములో స్థిరపడ్డాడు, ఆయన తన శేషజీవితం అక్కడే గడిపాడు. ఆయనతోపాటు ఆయన్ను విశ్వాసంగా అంటిపెట్టుకుని ఉన్న చిన్న శిష్యబృందం ఉండేది, వారిలో రోమ్‌లోని కులీన కుటుంబానికి చెందిన ఒక ధనవంతురాలైన పావులా ఒకరు. జెరోమ్ బోధల ఫలితంగా పావులా సన్యాసిని జీవితాన్ని చేపట్టింది. ఆమె ఆర్థిక తోడ్పాటుతో జెరోమ్ నిర్దేశానుసారం ఒక సన్యాసిమఠం స్థాపించబడింది. అక్కడ ఆయన తన పనిలో కొనసాగి తన జీవితంలో అత్యంత శ్రమతోకూడిన కృతిని పూర్తిచేశాడు.
జెరోమ్ పాలస్తీనాలో జీవించడం మూలంగా తన హెబ్రీ భాషపై పట్టును అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశాన్నిచ్చింది. ఆయన యూదులైన అనేకమంది బోధకులకు డబ్బిచ్చి ఆ భాషలోని ఎక్కువ కష్టతరమైన అంశాలను అర్థంచేసుకోవడానికి సహాయాన్ని పొందాడు. అయితే భాషాబోధకుడు ఉన్నా అది సులభతరమైన పనికాకపోయేది. తిబెరియకు చెందిన బారానినాస్ అనే ఒక బోధకుని గురించి జెరోమ్ ఇలా అన్నాడు: “చీకటి ముసుగులో బారానీనాస్ వచ్చి నాకు నేర్పించేలా చేయడానికి నేను ఎన్ని తంటాలు పడ్డాను, ఎంత డబ్బు ఖర్చైంది.” వారు చీకట్లో ఎందుకు అధ్యయనం చేసేవారు? ఎందుకంటే తాను “క్రైస్తవుని”తో సహవాసం చేస్తున్నానని తన యూదా సమాజం దృష్టిస్తుందని బారానీనాస్ భయపడ్డాడు!
జెరోమ్ రోజుల్లో హెబ్రీ మాట్లాడే అన్యులను యూదులు తరచుగా హేళన చేసేవారు, ఎందుకంటే అన్యులకు గొంతులోపలినుండి పలికే కంఠ్యములను (ఖ,ఘ లాంటివి) సరిగ్గా ఉచ్చరించడం వచ్చేది కాదు. అయినా, ఎంతో కృషి సల్పిన తర్వాత జెరోమ్ ఈ శబ్దాలను వంటపట్టించుకున్నాడు. అనేక హెబ్రీ పదాలను లాటిన్లోనికి లిప్యంతరీకరణ కూడా జెరోమ్ చేశాడు. ఈ చర్య ఆ పదాల్ని గుర్తుంచుకోవడానికి సహాయం చేయడమే కాక ఆ కాలంలోని హెబ్రీ ఉచ్చారణని కాపాడడంలో కూడా సహాయపడింది.
జెరోమ్ ఇమిడివున్న అతి గొప్ప వివాదాంశం
బైబిలులోని ఎంత భాగాన్ని జెరోమ్ అనువాదం చేయాలని పోప్ డామసస్ ఉద్దేశించాడో ఇదమిత్థంగా తెలియదు. కానీ జెరోమ్ ఈ పనిని ఎలా దృష్టించాడన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. జెరోమ్ పూర్తి ఏకాగ్రతతో కృత నిశ్చయంతో ముందుకు సాగాడు. “చర్చికి ఉపయోగపడేది, తరతరాలుగా ఉపయోగించగల్గేది” ఉత్పత్తి చేయాలన్న ఆయన తపన ఆయన్ను దహించేది. ఆ విధంగా ఆయన పూర్తి బైబిలును లాటిన్లోనికి ఒక సంస్కరణా అనువాదాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు.
జెరోమ్ హెబ్రీ లేఖనాల తన అనువాదానికి సెప్టాజింట్‌ను ఆధారంగా చేసుకోవాలనుకున్నాడు. తొలుత సా.శ.పూ. మూడవ శతాబ్దంలో అనువదించబడిన హెబ్రీ లేఖనాల ఈ గ్రీకు అనువాదాన్ని చాలామంది దేవుడు ప్రత్యక్షంగా ప్రేరేపించినదేనని దృష్టించేవారు. ఆ విధంగా, సెప్టాజింట్ ఆ కాలంలోని గ్రీకు మాట్లాడే క్రైస్తవుల్లో విస్తృతంగా పంపిణీ జరిగింది.
అయితే, జెరోమ్ తన పనిలో కొనసాగే కొద్దీ ఆయన వేర్వేరు గ్రీకు చేతివ్రాతప్రతుల్లో తాను లాటిన్ అనువాదాల్లో కనుగొన్నటువంటి వ్యత్యాసాల్నే గమనించాడు. జెరోమ్ని నిరాశా నిస్పృహలు ఆవహించాయి. చివరికి, ఒక నమ్మకమైన అనువాదాన్ని రూపొందించాలంటే తాను గ్రీకు చేతివ్రాతప్రతులను కూడా ప్రక్కనబెట్టి—చివరికి ఎంతో పవిత్రంగా ఎంచే సెప్టాజింట్‌ను కూడా ప్రక్కనబెట్టి—సూటిగా మూల హెబ్రీ పాఠానికే వెళ్లాలన్న నిశ్చయానికి వచ్చాడు.
ఈ నిశ్చయం గొప్ప కల్లోలాన్ని సృష్టించింది. కొంతమంది ఆయన్ను మూలపాఠాన్నే తారుమారు చేసేవాడని, దేవుడ్ని దూషించేవాడని, యూదుల పక్షంగా ఉంటూ చర్చి సాంప్రదాయాలను ధిక్కరిస్తున్నవాడన్న ముద్రను వేశారు. చివరికి ఆ కాలంలోని చర్చి యొక్క ప్రధాన వేదాంతవేత్త అయిన ఆగస్టీన్ కూడా సెప్టాజింట్కు మరలిరమ్మని జెరోమ్‌కు విజ్ఞప్తిచేశాడు. ఆయనిలా అన్నాడు: “నీ అనువాదాన్ని అనేక చర్చీల్లో గనుక ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తే, అటుతర్వాత లేఖనాలను చదివే విషయంలో లాటిన్ చర్చీలకూ గ్రీకు చర్చీలకూ మధ్య విభేదాలు తలెత్తడమనేది చాలా దుఃఖకరమైనదిగా ఉంటుంది.”
అవును, అప్పటికే తూర్పున ఉన్న గ్రీకు చర్చీలు సెప్టాజింట్ అనువాదాన్ని ఉపయోగిస్తూ ఉండగా, ఒకవేళ పశ్చిమాన ఉన్న చర్చీలు హెబ్రీపాఠం ఆధారంగా జెరోమ్ అనువదించిన లాటిన్ బైబిలును ఉపయోగిస్తే చర్చి విభాగించబడుతుందన్నది ఆగస్టీన్ భయం.b దానికి తోడు, సెప్టాజింట్ని ప్రక్కనబెట్టి దానికి బదులుగా కేవలం జెరోమ్ మాత్రమే సమర్థించగల ఒక అనువాదాన్ని అనుసరించడం విషయంలో ఆగస్టీన్ సందేహాల్ని వ్యక్తం చేశాడు.
తన వ్యతిరేకులందరిపట్లా జెరోమ్ ఎలా ప్రతిస్పందించాడు? ఆయన స్వభావానికి తగ్గట్టే జెరోమ్ తన విమర్శకులను పట్టించుకోలేదు. ఆయన తన పనిలో కొనసాగుతూనే సూటిగా హెబ్రీ నుండే అనువదిస్తూ చివరికి సా.శ. 405లో తన లాటిన్ బైబిలును పూర్తిచేశాడు. సంవత్సరాల తర్వాత ఆయన అనువాదాన్ని వల్గేట్ అని పిలువనారంభించారు, దానికి అందరూ సామాన్యంగా స్వీకరించిన అనువాదం అని అర్థం (లాటిన్లో వల్గేటస్ అంటే—“సామాన్యమైనది, ప్రజాదరణలో ఉన్నది” అని అర్థం).
దీర్ఘకాలం నిలిచిన కృతి
జెరోమ్ హెబ్రీ లేఖనాలను అనువదించడం అప్పటికే ఉన్న అనువాదాన్ని సంస్కరించడం మాత్రమే కాదు. అటు తర్వాత వచ్చిన తరాల్లో బైబిలు పఠనమూ బైబిలు అనువాదమూ సంబంధంగా అది గొప్ప మార్పును తీసుకువచ్చింది. “నాలుగవ శతాబ్దంలోని అతిగొప్ప, అతి ప్రభావవంతమైన సాహిత్య కృతిగా వల్గేట్ నిలిచిపోతుంది” అని చరిత్రకారుడైన విల్ డ్యూరంట్ అన్నాడు.
జెరోమ్‌కు చాలా పదునైన నాలుక ఉన్నప్పటికీ, చాలా జగడాలమారి అయినప్పటికీ ఆయన ఒంటరిగానే బైబిలు పరిశోధనను తిరిగి ప్రేరేపిత హెబ్రీ మూలపాఠానికి నిర్దేశించాడు. ఆయన సూక్ష్మదృష్టితో మనకు ఈనాడు అందుబాటులో లేని ప్రాచీన హెబ్రీ గ్రీకు వ్రాతప్రతులను అధ్యయనం చేసి వాటిని పోల్చిచూశాడు. ఆయన కృతి యూదా మెసొరెట్లకన్నా ముందే పూర్తి అయింది. కాబట్టి, వల్గేట్ బైబిలు పాఠం యొక్క వేర్వేరు అనువాదాలను పోల్చడానికి ఒక విలువైన రిఫరెన్సుగా పనికివస్తుంది.
అతిగా ఉన్న ఆయన ప్రవర్తనను మన్నించకుండానే లేదా ఆయన మత దృక్పథాలను ఒప్పుకోకుండానే దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, బైబిలు అనువాదంలో ఈ వివాదాస్పద మార్గదర్శకుని ఓర్పుతో కూడిన కృషిని మెచ్చుకోవచ్చు. మరో విషయం, జెరోమ్ తన లక్ష్యాన్ని సాధించాడు—ఆయన “తరతరాలుగా ఉపయోగించగల్గే” అనువాదాన్ని ఉత్పత్తి చేయగల్గాడు.
[అధస్సూచీలు]
a జెరోమ్ జీవితంలోని సంఘటనలు, తేదీల వరుసక్రమం విషయంలో చరిత్రకారులకు భేదాభిప్రాయాలు ఉన్నాయి.
b చివరికి పరిణమించినది ఏమంటే—పశ్చిమాన ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యంలో జెరోమ్ చేసిన అనువాదం ప్రధాన బైబిలుగా తయారుకాగా, తూర్పున ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యంలో సెప్టాజింట్ నేటికీ ఉపయోగించబడుతుంది.
[28వపేజీలోనిచిత్రం]
బేత్లెహేములోని జెరోమ్ విగ్రహం
[క్రెడిట్ లైను]
Garo Nalbandian
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Top left, Hebrew manuscript: Courtesy of the Shrine of the Book, Israel Museum, Jerusalem; Bottom left, Syriac manuscript: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin; Top center, Greek manuscript: Courtesy of Israel Antiquities Authority