“సిగ్గుపడనక్కరలేని పనివానిగా” ఉండేందుకు శ్రమించడం
ఆండ్రే సాపా చెప్పినది
రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగింది. అది చెప్పలేనంత భయంకరమైన మారణహోమానికి దారి తీసింది. తదనంతరం మిగిలింది నిరాశ నిస్పృహలే. నార్వేలో, నార్విక్ సమీపాన ఉన్న జర్మన్ నేవీలో సిగ్నల్మ్యాన్గా పనిచేస్తున్న నేను, మానవుడు మానవుడితో మానవత్వం లేకుండా ప్రవర్తించడాన్ని ప్రత్యక్షంగా చూశాను. నదీ ముఖద్వారంలో ఉన్న షెల్టర్‌లో నుండి చూస్తే ఆకాశంలో కనిపించే నార్తేన్ లైట్ల (ఉత్తరార్ధ గోళంలో రాత్రుల్లో ఆకాశంలో పచ్చరంగులో కనిపించే కాంతి) అందం, నేను జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించేలా చేసింది. ఇలాంటి అద్భుతమైన వాటిని సృష్టించిన దేవుడు ఈ యుద్ధోన్మాదానికి బాధ్యుడు కాడని నాకు నమ్మకమే.
చెక్ సరిహద్దులకు సమీపాన లాసాట్ (ఇప్పుడు పోలండ్‌లో ఉంది) అనే చిన్న గ్రామంలో పుట్టి, పేద రైతు కుటుంబంలో పెరిగాను. మా తల్లిదండ్రులు క్యాథలిక్ మతాన్ని అవలంభించేవారు. మా జీవితంలో మతం చాలా పెద్ద పాత్రే వహించేది. అయినప్పటికీ, మొదటి నుండీ నాకు మా మతం విషయంలో సందేహాలు ఉండేవి. మా గ్రామంలో, మూడు ప్రొటెస్టెంట్ కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్ని క్యాథలిక్ సమాజం వెలివేసింది. ఎందుకలా చెయ్యవలసి వచ్చిందో అర్థం చేసుకోలేకపోయాను. మాకు స్కూల్లో మత సంబంధ ప్రశ్నోత్తర బోధ (క్యాటెకిజమ్) జరిగేది. త్రిత్వాన్ని వివరించి చెప్పమని నేను ఒక రోజు ప్రీస్ట్‌ను అడిగినప్పుడు, దానికి సమాధానంగా బెత్తంతో పది దెబ్బలు తిన్నాను. అయినప్పటికీ, నాకు 17 ఏండ్లున్నప్పుడు, చర్చి నేర్పించేదంతా భ్రమేనన్న నా అభిప్రాయాన్ని మరింత దృఢపరిచే ఒక సంఘటన జరిగింది. మా అమ్మ వాళ్ళ తల్లిదండ్రులిరువురూ ఒక్క నెల తేడాలో మరణించారు. చర్చి చేసే రెండు అంత్య క్రియలకు చెల్లించేందుకు కావలసినంత డబ్బు అమ్మ దగ్గర లేదు. కనుక డబ్బు తర్వాత ఇస్తామండీ అని అమ్మ ప్రీస్ట్‌కు ప్రాథేయపడుతూ చెప్పింది. “మీ తల్లిదండ్రుల దగ్గర ఏవైన వస్తువులు ఉండి ఉంటాయి కదా? వాటిని అమ్మి, వచ్చే డబ్బును అంత్యక్రియల కోసం ఉపయోగించు” అని ఆయన బదులిచ్చారు.
ఈ సంఘటనకు కొన్ని సంవత్సరాల ముందు, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చాక, మేము పోలండ్ భాష మాట్లాడకూడదని ఆజ్ఞాపించబడింది; మేము జర్మన్ భాషనే మాట్లాడాల్సి వచ్చింది. అలా చేయడానికి నిరాకరించినవాళ్ళూ, జర్మన్ భాష నేర్చుకోలేకపోయినవాళ్ళూ నెమ్మదిగా అప్రత్యక్షమయ్యారు. వాళ్ళను కాన్సెంట్రేషన్ క్యాంపులో వేశారని మాకు తర్వాత తెలిసింది. మా గ్రామం పేరు కూడా గ్ర్యూన్ఫ్లీస్ అని జర్మన్ పేరుకు మార్చబడింది. నేను 14 ఏండ్లప్పుడు స్కూల్ వదిలిపెట్టాను. నేను హిట్లర్ యూత్ సంస్థలో చేరనందువల్ల, నాకు పని దొరకడం కష్టమైంది. చివరికి, ఎలాగైతేనేమి, బ్లాక్‌స్మిత్ అప్రెంటిస్‌గా నన్ను పనిలో పెట్టుకున్నారు. యుద్ధం మొదలైన తర్వాత, హిట్లర్ కోసమూ, జర్మన్ సైన్యాల కోసమూ చర్చిలో ప్రార్థనలు జరిగాయి. అవతలి పక్షంవాళ్ళ విజయం కోసం కూడా అలాంటి ప్రార్థనలే జరిగి ఉంటాయా అని అనుకున్నాను.
జర్మన్ నేవీలో సేవ
1941 డిసెంబర్లో, నేను జర్మన్ నేవీలో సేవచేస్తానని సంతకం చేశాను. 1942 ఆరంభంలో, సమాచారాన్ని సేకరించే నౌకలో సేవ చేసేందుకు నన్ను నార్వే సముద్రతీరానికి పంపించారు. సైన్యాలను, యుద్ధాయుధాలను, సరుకులను తీసుకువెళ్ళే ఓడలకు రక్షణగా ఉండేందుకు ట్రోన్డీమ్, ఓస్లోలకు మధ్య ఎస్కోర్ట్ డ్యూటీ చేసేందుకు మమ్మల్ని నియమించారు. అలా సముద్రం మీద ఉన్నప్పుడు, ఇద్దరు నావికులు బైబిలులో చెప్పబడిన లోకాంతాన్ని గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. బహిరంగంగా మాట్లాడడానికి వాళ్ళు భయపడినప్పటికీ, తమ తల్లిదండ్రులు యెహోవాసాక్షులతో సహవసించేవాళ్ళనీ, కానీ తాము వాళ్ళ మాదిరిని అనుకరించలేదనీ వాళ్ళు చెప్పారు. నేను యెహోవాసాక్షుల గురించి మొదటిసారి విన్నది అప్పుడే.
యుద్ధం ముగిసినప్పుడు, మమ్మల్ని తిరిగి జర్మనీకి పంపించేందుకు బ్రిటీష్‌వాళ్ళు మమ్మల్ని ఖైదీలుగా చేసి అమెరికన్లకు అప్పగించారు. అప్పట్లో మాలో ఎవరి ఇండ్లైతే సోవియట్ ప్రాంతంలో ఉన్నాయో వాళ్ళను బొగ్గు గనుల్లో పనిచేసేందుకు ఉత్తర ఫ్రాన్స్‌లోని లీయేవన్లోని ఖైదీక్యాంపుకు పంపారు. ఇది 1945 ఆగస్ట్‌లో జరిగింది. తనదే మతమని నేను ఒక ఫ్రెంచ్ గార్డ్‌ను అడగడం నాకు గుర్తుంది. “క్యాథలిక్కును” అని ఆయన జవాబిచ్చాడు. నేను కూడా క్యాథలిక్కునే గనుక, మనం శత్రువులుగా భావించడానికి కారణం ఏమిటని అడిగాను? “అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో అర్థం లేదు. ఏదో మనమలా చేస్తున్నాం. అంతే” అని ఆయన సమాధానమిచ్చాడు. ఒకే మతంలోని ప్రజలు ఒకరితోనొకరు పోరాడి, ఒకరినొకరు చంపుకోవడం మూర్ఖత్వంగా నాకనిపించింది.
బొగ్గు గనిలో కాంతికిరణం
స్థానిక గని కార్మికులతో పాటు నేను గనిలో పనిచేసిన మొదటి రోజు, ఒక కార్మికుడైన ఇవాన్జ్ ఎమ్‌యోట్ తాను తెచ్చుకున్న సాండ్విచ్లను నాకు కూడా ఇచ్చాడు. ఆయన అమెరికాలోని ఒహాయో నుండి వచ్చి, ఫ్రాన్స్‌లో స్థిరపడి అనేక సంవత్సరాలయ్యింది. ఇకెన్నటికీ యుద్ధాలుండని లోకాన్ని గురించి ఆయన నాతో మాట్లాడాడు. దయతో కూడిన ఆయన ప్రవర్తన నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేసింది. నేను జర్మన్నూ, ఆయన అమెరికనూ అయినప్పటికీ, ఆయన నాతో వ్యవహరించిన విధానంలో శత్రుభావం కనిపించనేలేదు. అయితే మేము మళ్ళీ కలిసింది 1948 ఆరంభంలోనే. ఈసారి ఆయన నాకు “ప్రిన్స్ ఆఫ్ పీస్” అనే బుక్‌లెట్‌ను ఇచ్చాడు. చివరికి నేను యుద్ధాన్ని అసహ్యించుకునే మంచితనంగల దేవుడ్ని గురించి తెలుసుకున్నాను. నేను నార్తేన్ లైట్లను చూస్తున్నప్పుడు నేను ఊహించుకున్నది ఇలాంటి దేవుడ్నే. దీన్ని బోధిస్తున్న మతమేదో తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఇవాన్జ్ పని చేసేది గనిలోని మరో ప్రాంతంలో కనుక, ఆయనను సంప్రదించలేకపోయాను. ఈ బుక్లెట్ గురించి ఏమైనా తెలుసా అని ఖైదీక్యాంపులో ఉన్న అన్ని మత గుంపులను అడుగుతూ వెళ్ళాను. కానీ లాభం లేకపోయింది.
చివరికి, 1948 ఏప్రిల్‌లో నేను ఖైదీక్యాంపు నుండి విడుదలై స్వతంత్ర కార్మికుడనయ్యాను. ఆ తర్వాతి ఆదివారమే, వీధిలో చిన్నగంట మ్రోగడం విని ఆశ్చర్యపోయాను. నేను ఇవాన్జ్ను చూసినప్పుడు ఎంత సంతోషించానో! బహిరంగ ప్రసంగపు అంశాన్ని ప్రకటిస్తున్న సాండ్విచ్ బోర్డులను ఒకటి ముందూ, ఒకటి వెనకా భుజాలమీదుగా తగిలించుకున్న యెహోవాసాక్షుల గుంపులో ఉన్నాడాయన. గంటను మ్రోగించిన సాక్షి మార్సో లర్వా. ఆయన ఇప్పుడు ఫ్రాన్స్‌లో బ్రాంచ్ కమిటీ సభ్యుడు. జర్మన్ భాష మాట్లాడే పోలండ్ దేశస్థుడైన యోసఫ్ కూల్చాక్ను నాకు పరిచయం చేశారు. ఆయన తన విశ్వాసం కారణంగా కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో అనేక శ్రమలను అనుభవించిన వ్యక్తి. ఆ సాయంకాలం నన్ను మీటింగ్‌కు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించాడు. అక్కడ వాళ్ళు ఏమి చెప్పారో చాలామట్టుకు నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ హాజరైన వాళ్ళందరూ, చెయ్యెత్తినప్పుడు, ఎందుకు చెయ్యెత్తుతున్నారని నా ప్రక్కనున్న వ్యక్తిని అడిగాను. “తర్వాతి వారం ప్రకటనాపనికి డన్కర్క్కు వెళ్ళగలవాళ్ళు చెయ్యెత్తారు” అని ఆయన చెప్పాడు. “నేను రావచ్చా?” అని అడిగాను. “తప్పకుండా, రావచ్చు!” అని ఆయన జవాబిచ్చారు. అలా నేను, తర్వాతి ఆదివారం ఇంటింటి ప్రకటనా పనికి వెళ్ళాను. మేము కలిసిన ప్రతి ఒక్కరూ ఏకీభవించేవాళ్ళు కానప్పటికీ, నాకు మాత్రం ఆ పని బాగా నచ్చింది. త్వరలోనే క్రమంగా ప్రకటించడం మొదలుపెట్టాను.
నా ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడాన్ని నేర్చుకోవడం
తర్వాత, అతి త్వరలోనే, సాక్షులు స్వతంత్రులైన జర్మన్ ఖైదీలు నివసిస్తున్న బారకాసుల్లో ప్రకటించడం మొదలుపెట్టారు. నేను కోపిష్టిగా పేరు పొందాను గను అది నాకు కష్టమైంది. ఎవరైనా నా ప్రకటనా పనిని గంభీరంగా తీసుకోకపోతే, “మీరు జాగ్రత్తగా ఉండకపోతే, దాని పర్యవసానాలను అనుభవిస్తారు” అని బెదిరించేవాడ్ని. ఒకసారి గనిలో పనిచేస్తున్నప్పుడు, ఒకరు యెహోవాను పరిహసించినప్పుడు నేను అతడ్ని పిడికిలితో గుద్దడం కూడా చేశాను.
అయితే, యెహోవా సహాయంతో, నేను నా వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోగలిగాను. ఒకరోజు, మేము ఈ ఖైదీల బారకాసుల్లో పని చేస్తున్నప్పుడు, బాగా త్రాగిన ఒక గుంపు సాక్షులను ఇబ్బంది పెడుతుంది. నాకు త్వరగా కోపం వస్తుందని తెలుసు గనుక, నాతో ఉన్న బ్రదర్ నేను జోక్యం చేసుకోకుండా నన్ను ఆపడానికి ప్రయత్నించాడు. కాని ఆ మనుష్యుల్లో ఒకరు నన్ను భయపెట్టే ఉద్దేశంతో నా వైపుగా ముందుకు అడుగువేస్తూ, తన జాకెట్‌ను విప్పడం మొదలెట్టాడు. నేను నా సైకిలు దిగి, పట్టుకోమని అతనికి ఇచ్చి, నా చేతులను జేబులో పెట్టుకున్నాను. నా ప్రవర్తనకు ఆయన ఆశ్చర్యపోయి, నేను చెబుతున్నదానిని శ్రద్ధగా విన్నాడు. ఇంటికి వెళ్ళి, చక్కగా నిద్రపోయి, తర్వాత బహిరంగ ప్రసంగానికి రమ్మన్నాను. ఆయన సరిగ్గా అలాగే చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వచ్చేశాడు! చివరికి, దాదాపు 20 మంది ఖైదీలు సందేశాన్ని అంగీకరించారు. నేనైతే, 1948 సెప్టెంబర్‌లో బాప్తిస్మం తీసుకున్నాను.
బొత్తిగా ఖాళీలేని, ప్రతిఫలదాయకమైన షెడ్యూల్
మేము ప్రకటించవలసిన టెరిటరీలను చూసుకోవలసిన బాధ్యతా, మేము బహిరంగ ప్రసంగాలను ఇవ్వగల స్థలాలను కనుగొనవలసిన బాధ్యతా నాకు అప్పజెప్పబడింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు, నేను కొన్నిసార్లు, గనుల్లో నేను రెండవ షిఫ్ట్ చేయక ముందు, నా చిన్న మోటర్‌సైకిల్ మీద దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉండేది. వారాంతాల్లో, మేము మా టెరిటరీకి బస్సులో వెళ్ళేవాళ్ళం. ఇద్దరో నలుగురో ప్రచారకులనూ ప్రసంగీకుడ్నీ దిగవలసినచోట దించేవాళ్ళం. పెద్ద పట్టణాల్లో, సరైన చోటును కనుగొన్న తర్వాత, మా సూట్‌కేసులను పేర్చి స్పీకర్ స్టాండ్‌గా ఉపయోగించేవాళ్ళం. తరచూ, మేము ప్రజలను ఆహ్వానిస్తున్న బహిరంగ ప్రసంగ అంశాన్ని ప్రకటించే సాండ్విచ్ బోర్డులను తగిలించుకుని తిరిగేవాళ్ళం.
1951లో, నేను జానెట్ షోఫూర్ను కలిశాను. ఆమె రెయిమ్స్లో ఉంటున్న సాక్షి. మేము మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాం. ఒక సంవత్సరం తర్వాత, 1952, మే 17న పెళ్ళి చేసుకున్నాం. మేము డాయేకు సమీపాన ఉన్న గని పట్టణమైన పెకాన్కూర్కు తరలివెళ్ళాం. అయితే, త్వరలోనే, నాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. నేను గనుల్లో పనిచేయడం వల్ల, శ్వాసనాళ సంబంధమైన జబ్బైన సిలికోసస్ వచ్చింది. కానీ మరో పని దొరకలేదు. కనుక, మేము 1955లో, జర్మనీలో న్యూరమ్బర్గ్లో అంతర్జాతీయ సమావేశానికి వెళ్ళినప్పుడు, రైన్ నది ప్రక్కన ఉన్న చిన్న పారిశ్రామిక పట్టణమైన కేల్లోని చిన్న సంఘంలో సహాయం చేయమని కోరారు. అప్పుడు అక్కడికి తరలివెళ్ళడానికీ ఏ అవరోధాలూ లేవు. ఆ సమయంలో, ఆ సంఘంలో కేవలం 45 మంది ప్రచారకులు ఉండేవారు. మేము ఆ సంఘంతో, కలిసి పనిచేసిన తర్వాతి ఏడు సంవత్సరాల్లో, ప్రచారకుల సంఖ్య 95కి పెరిగింది.
తర్వాతి సేవాధికత్యలు
ఆ సంఘం గట్టిగా స్థాపితమవ్వడం చూసి, మమ్మల్ని ఫ్రాన్స్‌కి స్పెష్యల్ పయినీర్లుగా పంపమని సొసైటీని కోరాం. పారిస్‌కు వెళ్ళమని మాకు నియామకం వచ్చినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం. మేము అక్కడ ఉన్న ఎనిమిది నెలలు ఎంతో ఆనందభరితంగా గడిచిపోయాయి. నేనూ జానెట్టూ ఇద్దరమూ కలిసి, మొత్తం 42 స్టడీస్ చేసే ఆధిక్యత లభించింది. మా విద్యార్థుల్లో ఐదుగురు మేమక్కడ ఉన్నప్పుడే బాప్తిస్మం పొందారు. మరో 11 మంది కొంత కాలం తర్వాత సత్యాన్ని స్వీకరించారు.
మేము లాటిన్ క్వార్టర్లో నివసించినది మొదలుకొని, మేము సార్బోన్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లను తరచూ కలిసేవాళ్ళం. పదవీ విరమణ చేసిన ఫిలోసఫీ ప్రొఫెసర్ విశ్వాస స్వస్థతలు చేసేవారు. ఆయన బైబిలు స్టడీ చేసి, చివరికి యెహోవాసాక్షుల్లో ఒకరయ్యారు. ఒకరోజు, నేను ఒక సివిల్ ఎంజినీర్తో బైబిలు చర్చ మొదలుపెట్టాను. ఆయనకు జెస్యూట్ టీచర్లతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన మా అపార్ట్‌మెంట్‌కు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి, రాత్రి పది గంటలకు తిరిగి వెళ్ళారు. ఆయన మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తూ, ఒక గంటన్నర తర్వాత, మళ్ళీ మా ఇంటి గుమ్మం దగ్గర కనిపించారు. ఆయన ఒక జెస్యూట్తో మాట్లాడారు, కాని ఆయన ఈయనకు బైబిలు ప్రవచనాలను గురించిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వలేకపోయాడు. ఈయన రాత్రి ఒంటిగంటకు తన ఇంటికి వెళ్ళి, మళ్ళీ ఉదయం ఏడు గంటలకు మా ఇంటికి వచ్చారు. కొంత కాలానికి ఆయన కూడా యెహోవాసాక్షి అయ్యారు. సత్యం కొరకైన అలాంటి దాహం నాకూ, నా శ్రీమతికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.
పారిస్‌లో సేవ చేసిన తర్వాత, తూర్పు ఫ్రాన్స్‌లో ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేయమనే పిలుపు నాకు అందింది. ఫ్రెంచ్ భాషనూ, జర్మన్ భాషనూ మాట్లాడే సంఘాలను సందర్శించి, సహోదరులను బలపరచడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉండేది. లారెయిన్లో రామ్బాస్ సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు, నేను స్టానీస్వాస్ ఆమ్బ్రోస్వాక్ను కలిశాను. ఆయన పోలండ్ దేశస్థుడు. ఆయన యుద్ధకాలంలో, నార్వే తీరాన మిత్రదేశాల సబ్‌మరైన్‌లో చేసేవాడు. మేము ఒకే సముద్రంపై ఉన్నప్పుడు వ్యతిరేక పక్షాలవారంగా ఉండేవాళ్ళం. కాని ఇప్పుడు మేము మన యెహోవా దేవుడికి కలిసి సేవచేస్తున్న సహోదరులుగా ఉన్నాం. పారిస్‌లో సమావేశం జరుగుతున్న మరొక సందర్భంలో, నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు గుర్తుపట్టాను. నేను ఉత్తర ఫ్రాన్స్‌లో ఖైదీగా ఉన్న క్యాంపులో ఆయన కమాండర్‌గా ఉండేవారు. ఆ సమావేశంలో మేము కలిసి పనిచేయగలిగినందుకు మేము ఎంత సంతోషించామో! దేవుడి వాక్యపు శక్తి అలాంటిది, అది మునుపటి శత్రువులను సహోదరులుగా, సన్నిహిత స్నేహితులుగా మార్చుతుంది!
ప్రయాణ పనిలో 14 సంవత్సరాలు గడిచిన తర్వాత, నా ఆరోగ్యం క్షీణిస్తుండడం వల్ల నేను ఈ పనిని ఆపేయవలసి రావడం విచారకరం. అయితే, నేనూ, నా శ్రీమతీ మాకు సాధ్యమైనంత మేరకు యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నాం. కనుక మేము తూర్పు ఫ్రాన్స్‌లోని ముల్హౌస్ పట్టణంలో నివాసస్థలాన్నీ, ఉద్యోగాన్ని సంపాదించుకుని, పయినీర్లం (పూర్తికాల పరిచారకులు) అయ్యాం.
అనేక సంవత్సరాలుగా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నది, రాజ్య మందిరాలలో నిర్మాణపనిలో పాల్గొనడంలో. 1985లో, తూర్పు ఫ్రాన్స్‌లో నిర్మాణ జట్టును సంస్థీకరించమని నన్ను కోరడం జరిగింది. నిపుణులైన వృత్తిపనివాళ్ళను ఉపయోగించి, ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా వచ్చినవారికి తర్ఫీదునిచ్చి, మేము ఒక జట్టును రూపొందించాం. అది, యెహోవా ఆరాధన జరుపుకునేందుకు 80 కన్నా ఎక్కువ మందిరాలను నిర్మించడంలోనో, పునర్నవీకరించడంలోనో పాల్గొంది. 1993లో, దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానాలో, ఒక అసెంబ్లీ హాల్‌నూ, ఐదు రాజ్యమందిరాలనూ నిర్మించే పనిలో పాల్గొనగలిగినందుకు నేను ఎంత సంతోషించానో!
పరీక్షలు ఎదురైనప్పటికీ సాగిపోవడం
గత 50 సంవత్సరాల దైవపరిపాలనా క్రియాశీలతలో, నా జీవితం ఎంతో ఆనందకరమైన విషయాలతోనూ, సేవాధిక్యతలతోనూ నిండి ఉందని నేను నిశ్చయంగా చెప్పగలను. విచారకరంగా, 1995 డిసెంబర్లో, నాతో 43 సంవత్సరాలు సహజీవనం చేసిన నా భార్య మృతిచెందింది. అది ఎంతో గొప్ప దుఃఖకరమైన సమయం కాగా—నేను ఇప్పటికీ దుఃఖిస్తున్నప్పటికీ—యెహోవా నాకు శక్తినిచ్చాడు, నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు నాపై ప్రేమను చూపి, నాకు ఆలంబనగా ఉన్నారు. ఇవన్నీ కాలం గడుస్తున్న కొలదీ, నా బాధను కొంతమేరకు తగ్గించాయి.
1963లో, జర్మనీలోని, మూనిక్లో జరిగిన సమావేశంలో, ఒక అభిషిక్త సహోదరుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తున్నాయి. “ఆండ్రే ఎడమకు గానీ, కుడికి గానీ చూడకు. కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో ఉన్న సహోదరులు పరీక్షలకు గురయ్యారు. ఇప్పుడు మన వంతు. మనమెన్నడూ మన గురించి మనం బాధపడకూడదు. కనుక ముందుకు సాగిపో!” నేను ఎల్లప్పుడూ ఈ మాటలను మనస్సులో పెట్టుకుంటాను. ఇప్పుడు నా అనారోగ్యాన్ని బట్టీ, అలాగే వయస్సు మీద పడుతున్న కొలదీ, నేను అంత ఎక్కువగా చేయలేను. “తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని హెబ్రీయులు 6:10లో కనిపిస్తున్న మాటలు నాకు ఎల్లప్పుడూ సాంత్వననిస్తున్నాయి. అవును, యెహోవా సేవలో పనిచేయడం ఎవరైనా కలిగి ఉండగల అతి గొప్ప ఆధిక్యత. గత 50 సంవత్సరాలుగా, నా లక్ష్యం ఒకటే, “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” ఉండాలన్నదే, ఇప్పుడూ అదే.—2 తిమోతి 2:15.
[22వ పేజీలోని చిత్రం]
నార్వే నదీ ముఖద్వారంలో నేను సేవ చేసింది ఇలాంటి బోట్లోనే
[23వ పేజీలోని చిత్రం]
ఉత్తర ఫ్రాన్స్‌లో సైకిలు మీద ప్రకటనాపనికి వెళ్ళడం
[23వ పేజీలోని చిత్రం]
బహిరంగ ప్రసంగం కోసం సూట్‌కేసులను పేర్చి స్పీకర్ స్టాండ్‌గా ఉపయోగించారు
[24వ పేజీలోని చిత్రాలు]
1952లో మా పెళ్ళిరోజున, నా భార్య జానెట్‌తో