బైబిలు మనకు చేరిన విధానం—భాగం ఒకటి
2, 3 భాగాలు సెప్టెంబరు 15, అక్టోబరు 15 సంచికల్లో వస్తాయి.
ఒక చిన్న షాపులో ఒక ముద్రాపకుడూ ఆయనతోపాటు యౌవనస్థులైన ఆయన అప్రెంటీస్లూ కలిసి ఖాళీ కాగితాల్ని జాగ్రత్తగా టైప్ఫేస్పైన పెడుతూ తమ చెక్క-ఫ్రేము ప్రెస్సుమీద లయబద్ధంగా పనిచేస్తున్నారు. వారు ఆ కాగితాల్ని బయటికి తీసిన ప్రతీసారి ముద్రితమైన అక్షరాల్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ గోడనుండి ఆ గోడకు కట్టబడిన త్రాళ్లపైన మడిచిన ఆ కాగితాలను ఆరవేస్తూ ఉన్నారు.
అకస్మాత్తుగా, తలుపు విరిగిపోయేంత గట్టిగా బాదిన శబ్దమయ్యింది. భీతావహుడైన ముద్రాపకుడు తలుపుకున్న గొళ్లెం తీసినప్పుడు సాయుధులైన సైనికులు లోపలికి దూసుకువచ్చారు. వారు చట్టవిరుద్ధమైన సాహిత్యాలన్నింట్లోకెల్లా అత్యంత ఎక్కువగా నిందించబడే సాహిత్యం కొరకు వెదకడం మొదలుబెట్టారు—అదే సామాన్య ప్రజానీకం మాట్లాడే భాషలోని బైబిలు!
వారు రావడం చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమాదాన్ని గూర్చి హెచ్చరించబడిన అనువాదకుడూ ఆయనతోపాటు ఒక సహాయకుడూ కలిసి షాపుకి పరుగెత్తి, చేతులకందినన్ని పేజీలను అందిపుచ్చుకుని ఇప్పుడు రైన్ నదిమీదుగా పారిపోతున్నారు. వారు కనీసం తమ పనిలో కొంత భాగాన్నైనా కాపాడుకోగల్గారు.
ఇక్కడ ప్రస్తావించబడిన అనువాదకుడు విలియం టిండేల్, ఆయన 1525లో, జర్మనీలోని కొలోన్‌లో ఇంగ్లీషు భాషలోని నిషేధిత “క్రొత్త నిబంధన”ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన అనుభవం ఏమాత్రం అసాధారణమైనది కాదు. బైబిలు వ్రాత ముగిసిన తర్వాత గతించిన దాదాపు 1,900 సంవత్సరాలన్నింట్లో చాలామంది స్త్రీపురుషులు, దేవుని వాక్యాన్ని అనువదించి దాన్ని పంపిణీ చేయడానికి ఎటువంటి ప్రమాదాల్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. మనం వారి పనినుండి నేడు కూడా ప్రయోజనం పొందుతున్నాము. వారేమి చేశారు? ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిళ్లు మనకు ఎలా చేరాయి?
తొలి కాలాల్లో బైబిలు నకలు చేయడమూ, అనువాదమూ
దేవుని నిజ సేవకులు ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడు అత్యున్నత గౌరవంతో దృష్టించారు. న్యూ కాథోలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా గుర్తిస్తుంది: “తమ పూర్వికులైన యూదులలాగానే తొలి క్రైస్తవులు పవిత్ర పుస్తకాల్ని చదవడాన్ని చాలా అమూల్యంగా ఎంచారు. యేసు ఉదాహరణను అనుకరిస్తూ (మత్త 4.4; 5.18; లూకా 24.44; యోహా 5.39) అపొస్తలులు పా[త] ని[బంధన]తో చక్కని పరిచయాన్ని కలిగివున్నారు, అంటే దానర్థం వారు ఎంతో సమయాన్ని వెచ్చించి దాన్ని జాగ్రత్తగా చదవడం, పఠించడం జరిగిందన్నమాట. వారు తిరిగి తమ శిష్యులకు అదే ఉద్బోధ చేశారు (రోమా 15.4; 2 తిమో 3.15-17).”
దీన్ని సాధించడానికి బైబిలు నకళ్లను వ్రాయాల్సివచ్చింది. క్రైస్తవపూర్వ కాలాల్లో ఈ పనిలో చాలా మొత్తాన్ని వృత్తిపరంగా ‘ప్రవీణులైన శాస్త్రులు’ చేసేవారు, వీరు తప్పులు జరుగుతాయేమోనని మహా భయం కల్గివుండేవారు. (ఎజ్రా 7:6, 11, 12) వారు పరిపూర్ణత కొరకు పాటుపడుతూ, తర్వాతి కాలంలోని బైబిలు నకళ్లను వ్రాసేవారందరికీ ఒక ఉన్నతమైన ప్రమాణాన్ని ఉంచారు.
అయితే, సా.శ.పూ. నాలుగవ శతాబ్దంలో ఒక సవాలు ఎదురైంది. అలెగ్జాండర్ ద గ్రేట్ లోక నివాసులందరూ గ్రీకు సంస్కృతిలో విద్యావంతులవ్వాలని అనుకున్నాడు. ఆయన విజయాల మూలాన మధ్య ప్రాచ్యమంతట్లో సామాన్య గ్రీకు, అంటే కొయినీ గ్రీకు వ్యావహారిక భాషగా అయ్యింది. తత్ఫలితంగా, చాలామంది యూదులు హెబ్రీ భాషను చదవడం నేర్చుకునే అవకాశం అసలు లేకుండానే పెరిగిపెద్దయ్యారు, ఆ విధంగా వారు లేఖనాలను చదవలేకపోయారు. అందుకని, జనసామాన్యం అర్థంచేసుకోవడానికి సుళువుగావున్న కొయినీలోనికి హెబ్రీ బైబిలును అనువదించేందుకు హెబ్రీ భాషా విద్వాంసుల గుంపు ఒకటి ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియాలో దాదాపు సా.శ.పూ. 280లో సమకూడింది. వారి అనువాదం, “డెబ్భై” అనే పదానికి లాటిన్ పదమైన సెప్టాజింట్ అన్న పేరుతో పిలువబడింది, ఇది అందులో ఇమిడివున్నారని చెప్పబడే అనువాదకుల సంఖ్యను సూచిస్తుంది. అది దాదాపు సా.శ.పూ. 150కల్లా పూర్తయ్యింది.
యేసు కాలంలో హెబ్రీ భాష పాలస్తీనాలో ఇంకా ఉపయోగంలో ఉంది. అయితే అక్కడా, ఇంకా రోమా సామ్రాజ్యంలోని మారుమూలనున్న మండలాల్లోనూ కొయినీ ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది. అందుకని, జనాంగాల్లోని సాధ్యమైనంతమందిని చేరడానికిగాను క్రైస్తవ బైబిలు రచయితలు ఈ సామాన్య గ్రీకు భాషను ఉపయోగించారు. అంతేగాక, వారు సెప్టాజింట్ నుండి స్వేచ్ఛగా ఎత్తివ్రాస్తూ దానిలోని అనేక మాటలను ఉపయోగించారు.
తొలి క్రైస్తవులు ఉత్సాహభరిత మిషనరీలుగా ఉన్నారు గనుకనే, ఎంతో కాలంగా వేచిచూసిన మెస్సీయా యేసే అని రుజువు చేయడానికి సెప్టాజింట్‌ను ఉపయోగించడంలో వారు త్వరలోనే సిద్ధహస్తులయ్యారు. ఇది యూదులను కలవరపర్చి, క్రైస్తవులు తమ బోధలను సమర్థించుకోవడానికి ఉపయోగించే కొన్ని పాఠ్యభాగాల్ని మార్చివేయడం ద్వారా వారిని నిరుత్సాహపర్చేందుకు గ్రీకులో కొన్ని క్రొత్త అనువాదాలను ఉత్పత్తి చేసేలా వారిని పురికొల్పింది. ఉదాహరణకు, యెషయా 7:14లో ప్రవచనార్థకంగా మెస్సీయా తల్లిని సూచిస్తూ, “కన్యక” అని అర్థంవచ్చే ఒక గ్రీకు పదాన్ని సెప్టాజింట్ ఉపయోగించింది. క్రొత్త అనువాదాలు “యౌవన స్త్రీ” అని అర్థంవచ్చే వేరొక గ్రీకు పదాన్ని ఉపయోగించాయి. క్రైస్తవులు సెప్టాజింట్‌ను ఉపయోగించడాన్ని కొనసాగించడంతో చివరికి, యూదులు తమ పూర్వపు యుక్తిని పూర్తిగా విడనాడి హెబ్రీకి తిరిగి వెళ్లారు. చివరకు, ఈ చర్య హెబ్రీ భాషను సజీవంగా ఉంచేందుకు తోడ్పడింది కాబట్టి, తరువాతి కాలంలోని బైబిలు అనువాదానికి అదొక వరంగా పరిణమించింది.
మొట్టమొదటి క్రైస్తవ పుస్తక ప్రచురణకర్తలు
ఉత్సాహభరితులైన తొలి క్రైస్తవులు తమకు సాధ్యమైనన్ని బైబిలు ప్రతులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు, ఇవన్నీ చేతితో నకలు వ్రాయబడినవే. వారు గ్రంథపు చుట్టల్ని ఉపయోగించడం కొనసాగించడానికి బదులుగా ఒక ఆధునిక పుస్తకంలోలా పేజీలున్న కోడెక్స్ ఉపయోగాన్ని మొదలుబెట్టారు కూడాను. లేఖనాలను త్వరగా కనుక్కోవడానికి మరింత వీలుగా ఉండడంతోపాటు, ఒక్క గ్రంథపు చుట్టలో నమోదుచేయగల్గేదానికన్నా ఈ కోడెక్స్ యొక్క ఒక్క సంపుటిలో ఎంతో ఎక్కువ సమాచారం నిక్షిప్తం చేసేందుకు అనువుగా అది ఉండేది—ఉదాహరణకు, ఒక్క సంపుటిలోనే గ్రీకు లేఖనాలన్నీ ఉండేవి లేకపోతే పూర్తి బైబిలే ఉండేది.
అప్పటికి జీవించివున్న చివరి అపొస్తలుడైన యోహాను వ్రాసిన పుస్తకాలతో దాదాపు సా.శ. 98కల్లా క్రైస్తవ గ్రీకు లేఖనాల ప్రామాణిక జాబితా ముగిసింది. యోహాను సువార్త ప్రతి యొక్క ఒక చిన్న ముక్క ఇప్పుడు ఉనికిలో ఉంది, ఇది రైలాండ్స్ పపైరస్ 457 (P52) అని పిలువబడుతుంది. ఇది సా.శ. 125కి ముందటిదని తేదీ నిర్ధారణ చేయబడింది. సా.శ. 150 నుండి 170కల్లా జస్టిన్ మార్టిర్ విద్యార్థి అయిన టేషన్ డయాటెస్సారోన్ను ఉత్పత్తి చేశాడు, ఇది ప్రస్తుతం మన బైబిళ్లలో ఉన్న ఆ నాలుగు సువార్తలనుండే సమకూర్చబడిన యేసు జీవితం యొక్క సంయుక్త వృత్తాంతం.a ఆ సువార్తలు మాత్రమే ప్రామాణికమైనవన్నట్లు ఆయన పరిగణించాడనీ, అంతేగాక అవి అప్పటికే ప్రచారంలో ఉన్నాయనీ ఇది సూచించింది. దాదాపు సా.శ. 170లో మురాటోరియన్ ఫ్రాగ్మెంట్ అని పిలువబడిన “క్రొత్త నిబంధన” పుస్తకాల తొలి జాబితా ఉత్పత్తి చేయబడింది, ఇది ఇప్పటివరకు తెలిసినంతమట్టుకు మొట్టమొదటిది. ఈ పట్టికలో క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని చాలామట్టుకు పుస్తకాలు ఉన్నాయి.
క్రైస్తవ నమ్మకాలు విస్తరించడం, త్వరలోనే క్రైస్తవ గ్రీకు లేఖనాల, ఆలాగే హెబ్రీ లేఖనాల అనువాదాల కొరకైన డిమాండును సృష్టించింది. చివరికి ఆర్మీనియన్, కాప్టిక్, జార్జియన్, సిరియక్ వంటి భాషల్లో అసంఖ్యాకమైన అనువాదాలు తయారు చేయబడ్డాయి. కేవలం ఈ సంకల్పం నిమిత్తమే కొన్నిసార్లు వర్ణమాలలను రూపొందించాల్సి వచ్చేది. ఉదాహరణకు, రోమన్ చర్చికి చెందిన ఉల్ఫిలాస్ అనే ఒక నాలుగవ శతాబ్దపు బిషప్పు, బైబిలును అనువదించడానికిగాను గోతిక్ లిపిని రూపొందించాడని చెప్పబడుతుంది. కానీ ఆయన రాజులు పుస్తకాల్ని విడిచిపెట్టేశాడు ఎందుకంటే అవి గోత్ తెగలలో యుద్ధ ప్రవృత్తిని ప్రోత్సహించగలవని ఆయన అనుకున్నాడు. అయితే, ఈ చర్య “క్రైస్తవీకరించబడిన” గోత్ తెగలవారు సా.శ. 410లో రోమ్ను కొల్లగొట్టడంనుండి వారిని ఆపలేదు!
లాటిన్, స్లవానిక్ బైబిళ్లు
ఈలోగా లాటిన్ భాష ప్రాముఖ్యతను సంతరించుకుంది, దాంతో అనేక పాత లాటిన్ అనువాదాలు ప్రత్యక్షమయ్యాయి. కానీ అవి శైలిలోనూ కచ్చితత్వంలోనూ వైవిధ్యంగలవిగా ఉన్నాయి. అందుకనే సా.శ. 382లో పోప్ డామ్సస్ తన కార్యదర్శి అయిన జెరోమ్‌ను ఒక ప్రామాణిక లాటిన్ బైబిలును తయారు చేయమని ఆదేశించాడు.
జెరోమ్ క్రైస్తవ గ్రీకు లేఖనాల లాటిన్ అనువాదాలను సంస్కరించడంతో మొదలుపెట్టాడు. అయితే, హెబ్రీ లేఖనాల విషయంలో మాత్రం ఆయన ఆదిమ హెబ్రీ నుండే అనువదిస్తానని పట్టుబట్టాడు. ఆ విధంగా సా.శ. 386లో ఆయన హెబ్రీని అధ్యయనం చేయడానికీ, ఒక రబ్బీ సహాయాన్ని పొందడానికీ బేత్లెహేముకు తరలివెళ్లాడు. ఈ చర్యతో ఆయన చర్చీలో చాలా వివాదాన్నే రేపాడు. సెప్టాజింట్ దైవ ప్రేరేపితమని ఆయన సమకాలీనుడైన ఆగస్టీన్తోపాటు కొంతమంది ఇతరులూ నమ్మారు, అందుకని జెరోమ్ “యూదుల పంచన చేరాడని” వారు నిందించారు. ముందుకు సాగిపోతూ, జెరోమ్ తన కృతిని దాదాపు సా.శ. 400లో పూర్తి చేశాడు. అసలు భాషా మూలాలకూ, వ్రాతప్రతులకూ చేరువగా వెళ్లడం ద్వారా, వాటిని ఆ దినాల్లో సజీవంగా ఉన్న భాషలోకి అనువదించడం ద్వారా జెరోమ్ ఆధునిక అనువాద పద్ధతులకు ఒక వెయ్యి సంవత్సరాలు ముందే ఉన్నాడు. ఆయన కృతి వల్గేట్ అనీ, లేక సామాన్య అనువాదం అనీ పిలువబడింది, మరి అది శతాబ్దాలుగా ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చింది.
తూర్పు క్రైస్తవమత సామ్రాజ్యంలో అప్పటికీ ఇంకా చాలామంది సెప్టాజింట్నూ, క్రైస్తవ గ్రీకు లేఖనాలనూ చదవగల్గుతున్నారు. అయితే అటుతర్వాత, నేటి స్లావిక్ భాషలన్నింటికీ మూలమైన పాత స్లవానిక్ భాష ఈశాన్య యూరప్‌లో ప్రధాన భాషగా అయ్యింది. సిరిల్, మెథోడియస్ అనే ఇద్దరు గ్రీకు సోదరులు సా.శ. 863లో మోరేవియాకు వెళ్లారు, నేడు అది చెక్ రిపబ్లిక్లో ఉంది. వారు బైబిలును పాత స్లవానిక్లోకి అనువదించడం ప్రారంభించారు. అలా చేయడంకోసం వారు గ్లాగలిడిక్ వర్ణమాలను రూపొందించారు, దీని స్థానాన్ని అటుతర్వాత సిరిల్ పేరుమీదుగా వచ్చిన సిరిల్లిక్ వర్ణమాల ఆక్రమించింది. నేటి రష్యన్, ఉక్రేనియన్, సెర్బియన్, బల్గేరియన్ లిపిలకు మూలం ఇదే. స్లవానిక్ బైబిలును ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్నో తరాలపాటు ఉపయోగించారు. అయితే కాలం గడిచే కొలదీ భాషలు మారుతున్నకొద్దీ ఆ బైబిలు సగటు వ్యక్తి అవగాహనకు అందకుండాపోయింది.
హెబ్రీ బైబిలు మనుగడసాగించింది
ఈ కాలంలో, దాదాపు సా.శ. ఆరునుండి పదవ శతాబ్దం వరకూ, హెబ్రీ లేఖన పాఠాన్ని సంరక్షించడానికిగాను, మసరెట్లు అని పిలువబడే యూదుల గుంపు ఒకటి ఒక పద్ధతి ప్రకారంగా నకలును వ్రాసే విధానాన్ని అభివృద్ధిచేసింది. వారు వ్రాతప్రతుల్లోని విభిన్నతలను గమనిస్తూ, వరుసలతోపాటు చివరికి ఒక్కొక్క అక్షరాన్ని కూడా లెక్కబెట్టేంతవరకూ వెళ్లారు, ఇదంతా ఒక ప్రామాణిక పాఠాన్ని సంరక్షించడానికైన ప్రయత్నంలో భాగంగానే వారు చేశారు. వారి వ్యయప్రయాసలు వృథాగా పోలేదు. ఒక ఉదాహరణను చెప్పాలంటే, సా.శ.పూ. 250కి సా.శ. 50కి మధ్యలో వ్రాయబడిన మృత సముద్రపు చుట్టలను ఆధునిక మసరెటిక్ పాఠాలతో పోలిస్తే 1,000 కంటే ఎక్కువ సంవత్సరాల్లో సిద్ధాంతపరమైన ఏ మార్పూ కనబడలేదు.b
యూరప్‌లో మధ్య యుగాలకు విస్తార రూపంలో అంధకార యుగాలు అని అర్థం ఉంది. చదవడం, నేర్చుకోవడం విషయాల్లో ప్రజానీకం చాలా అధమస్థాయిలో ఉంది. చివరికి, పాదిరీలు కూడా చాలామట్టుకు చర్చి లాటిన్ని చదవలేకపోయేవారు, వారికి తమ స్వంత భాష కూడా చదవడం రాకుండా పోయింది. ఈ కాలంలోనే యూరప్‌లో యూదుల్ని ఘెట్టోలలో సమకూర్చడం ప్రారంభమైంది. పాక్షికంగా ఈ ఏకాంతీకరణ మూలానే బైబిలు సంబంధిత హెబ్రీ భాషా పరిజ్ఞానం కాపాడబడింది. అయినప్పటికీ, పక్షపాతమూ అపనమ్మకమూ వలన తరచూ యూదుల జ్ఞానము ఘెట్టోల వెలుపలవున్న వారికి అందకుండాపోయేది. పశ్చిమ యూరప్‌లో గ్రీకు భాషా పరిజ్ఞానం కూడా తరిగిపోనారంభించింది. పశ్చిమ చర్చి జెరోమ్ యొక్క వల్గేట్ పట్ల ప్రగాఢ గౌరవాన్ని చూపడంతో పరిస్థితి మరింత క్షీణించింది. మసోరెట్ల కాలం చివరికల్లా లాటిన్ మృత భాషగా అయిపోయినప్పటికీ సాధారణంగా వల్గేట్‌ను ఏకైక అధికారిక అనువాదంగా పరిగణించేవారు. అందుకని బైబిలును తెలుసుకోవాలన్న కోరిక నెమ్మదిగా జనించనారంభించడంతో, గొప్ప సంఘర్షణకు రంగం సిద్ధమైంది.
బైబిలు అనువాదం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది
1079లో, అన్య భాషల్లో అనువాదాల్ని ఉత్పత్తి చేయడాన్నీ, కొన్నిసార్లైతే ఒక అనువాదాన్ని కలిగివుండటాన్ని కూడా నిషేధిస్తూ, పోప్ గ్రెగరీ VII మధ్య యుగాల్లోని చర్చీ చేసిన అటువంటి అనేక శాసనాల్లో మొట్టమొదటిదాన్ని జారీచేశాడు. పరిశుద్ధ లేఖనాల్లోని కొన్ని భాగాలను అనువదించాల్సివస్తుందన్న కారణంచేత స్లవానిక్ భాషలో మాస్‌ను నిర్వహించడానికి అప్పట్లోవున్న అనుమతిని ఆయన రద్దు చేశాడు. తొలి క్రైస్తవుల మానసిక దృక్పథానికి పూర్తి విరుద్ధంగా ఆయన ఇలా వ్రాశాడు: “పరిశుద్ధ లేఖనాల్లోని కొన్ని భాగాలు గోప్యంగా ఉండాలన్నది సర్వశక్తిగల దేవుని చిత్తమైవుంది.” చర్చి అధికారిక స్థానం ఇదే అయి ఉండగా, బైబిల్ని చదవడాన్ని ప్రోత్సహించే వారు చాలా ప్రమాదకరమైనవారిగా పరిగణించబడేవారు.
వాతావరణం ఇంత అననుకూలంగా ఉన్నప్పటికీ, సామాన్య ప్రజానీకం మాట్లాడే భాషల్లోనికి బైబిలును నకలు చేయడమూ, అనువదించడమూ కొనసాగింది. యూరప్‌లో అనేక భాషల్లో అనువాదాలు రహస్యంగా పంపిణీ చేయబడేవి. ఇవన్నీ చేతితో వ్రాయబడినవే, ఎందుకంటే మూవబుల్-టైప్ ముద్రణ యూరప్‌లో 14వ శతాబ్దం మధ్యభాగానికి గానీ కనుగొనబడలేదు. కానీ నకళ్లు చాలా ఖరీదైనవిగానూ, పరిమిత సంఖ్యల్లోనూ ఉండేవి గనుక ఒక సాధారణ పౌరుడు బైబిలులోని ఒక్క పుస్తకంలోని కొంత భాగాన్నో లేకపోతే కేవలం కొన్ని పేజీల్నో కలిగివుండడంతోనే బహుశ మహదానందపడివుండేవాడు. కొంతమంది బైబిలులోని పెద్ద పెద్ద భాగాల్ని కంఠతా పట్టేసేవారు, చివరికి పూర్తి గ్రీకు లేఖనాల్ని కూడా కంఠతా పట్టేసేవారు!
అయితే సమయం గడుస్తున్న కొలది చర్చిని సంస్కరించడానికి విస్తృతమైన ఉద్యమాలు లేచాయి. ఇవి పాక్షికంగా, దైనందిన జీవితంలో దేవుని వాక్యపు ప్రాముఖ్యతను తిరిగి గుణగ్రహించడంతో ప్రేరేపించబడ్డాయి. మరి ఈ ఉద్యమాలూ, వీటితోపాటు ముద్రణను అభివృద్ధిచేయడమూ బైబిలును ఎలా ప్రభావితం చేయనైయున్నాయి? ప్రస్తావనలో పేర్కొనబడిన విలియం టిండేల్కూ ఆయన అనువాదానికీ ఏమి సంభవించనైయుంది? మన కాలం వరకూ కొనసాగే ఈ అద్భుతమైన గాధను మనం రాబోయే సంచికల్లో తెలుసుకుందాము.
[అధస్సూచీలు]
a నాలుగు సువార్తల పొందిక విషయంలో, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన జీవించినవారిలోకెల్లా మహా గొప్ప మనిషి పుస్తకం ఒక ఆధునిక ఉదాహరణ.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 2, పేజీ 315 చూడండి.
[8, 9వ పేజీలోని చిత్రం]
బైబిలు మన చేతికి వచ్చిన విధానంలోని కీలక తేదీలు
(For fully formatted text, see publication)
సామాన్య శకము పూర్వము (సా.శ.పూ.)
హెబ్రీ లేఖనాలు ముగిసాయి దాదాపు సా.శ.పూ. 443
సా.శ.పూ. 400
అలెగ్జాండర్ ద గ్రేట్ (మరణం సా.శ.పూ. 323)
సా.శ.పూ. 300
సెప్టాజింట్ ప్రారంభం దాదాపు సా.శ.పూ. 280
సా.శ.పూ. 200
మృత సముద్రపు చుట్టల్లో చాలాభాగం దాదాపు సా.శ.పూ. 100 నుండి సా.శ. 68
సా.శ.పూ. 100
యెరూషలేము వినాశనం సా.శ. 70
గ్రీకు లేఖనాలు ముగిసాయి సా.శ. 98
సామాన్య శకము (సా.శ.)
సా.శ. 100
యోహాను సువార్త యొక్క రైలాండ్స్ పపైరస్ (సా.శ. 125కి ముందు)
సా.శ. 200
సా.శ. 300
జెరోమ్ యొక్క లాటిన్ వల్గేట్ దాదాపు సా.శ. 400
సా.శ. 400
సా.శ. 500
మసోరెటిక్ పాఠం తయారుచేయబడింది
సా.శ. 600
సా.శ. 700
సా.శ. 800
మోరేవియాలో సిరిల్ సా.శ. 863
సా.శ. 900
సా.శ. 1000
అన్య భాషా బైబిళ్లకు విరుద్ధంగా శాసనం సా.శ. 1079
సా.శ. 1100
సా.శ. 1200
సా.శ. 1300
[9వ పేజీలోని చిత్రం]
తొలి క్రైస్తవులు కోడెక్స్ ఉపయోగాన్ని మొదలుపెట్టారు
[10వ పేజీలోని చిత్రం]
హెబ్రీ భాషను అధ్యయనం చేయడానికి జెరోమ్ బేత్లెహేముకు వెళ్లాడు