మన విశ్వాసాన్ని సమర్థించుకోవడం
“మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని . . . సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.”—1 పేతురు 3:15.
1, 2. వ్యతిరేకతను బట్టి యెహోవాసాక్షులు ఎందుకు ఆశ్చర్యపోరు, కాని వారు ఏమి కోరుకుంటారు?
అనేక దేశాల్లో, యెహోవాసాక్షులు సాధారణంగా నిజాయితీగలవారిగా నైతిక పరిశుభ్రతగల ప్రజలుగా గుర్తింపు పొందారు. అనేకులు వారిని ఏ ఇబ్బందులు కలిగించని మంచి పొరుగువారిగా దృష్టిస్తారు. అయినప్పటికీ, హాస్యాస్పదంగా, శాంతి కాముకులైన ఈ క్రైస్తవులు యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అన్యాయంగా హింసను అనుభవించారు. అలాంటి వ్యతిరేకత కలుగుతున్నందుకు వారు ఆశ్చర్యపోవడం లేదు. నిజానికి అలాంటి వ్యతిరేకత వస్తుందని వారికి తెలుసు. సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన నమ్మకమైన క్రైస్తవులు ‘ద్వేషించబడ్డారని’ వారికి తెలుసు, కాబట్టి నేడు క్రీస్తు నిజ అనుచరులుగా ఉండడానికి కృషి చేస్తున్నవారు తాము మరో విధంగా వ్యవహరించబడాలని ఎందుకు ఎదురు చూడాలి? (మత్తయి 10:22) అంతేగాక, బైబిలు ఇలా చెబుతుంది: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.”—2 తిమోతి 3:12.
2 యెహోవాసాక్షులు హింసించబడాలని కోరుకోరు, లేదా అది తీసుకురాగల కష్టాలు అంటే జరిమానాలు, జైలులో ఉండడం లేక కఠినంగా వ్యవహరించబడడం వంటివి వారికి ఇష్టమేమి కాదు. వారు ఆటంకాలేవీ లేకుండా దేవుని రాజ్య సువార్తను ప్రకటించగలిగేలా ‘నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలని’ కోరుకుంటారు. (1 తిమోతి 2:1, 2) తమ ఆరాధన విషయంలో అనేక దేశాల్లో తమకున్న మతసంబంధమైన స్వేచ్ఛను వారు మెచ్చుకుంటారు, మానవ ప్రభుత్వ పరిపాలకులతో సహా ‘సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండడానికి’ వారు తమకు సాధ్యమైనదంతా మనస్సాక్షిపూర్వకంగా చేస్తారు. (రోమీయులు 12:18; 13:1-7) మరి వారు ఎందుకు ‘ద్వేషించబడుతున్నారు’?
3. యెహోవాసాక్షులు అన్యాయంగా ద్వేషించబడడానికి ఒక కారణం ఏమిటి?
3 ప్రాథమికంగా, తొలి క్రైస్తవులు హింసింపబడిన అవే కారణాలను బట్టే యెహోవాసాక్షులు అన్యాయంగా ద్వేషించబడుతున్నారు. మొదటిగా, యెహోవాసాక్షులు తమ మతసంబంధమైన నమ్మకాలకు అనుగుణ్యంగా చర్యలు గైకొంటారు, వాళ్ళు అలా చేయడం వల్ల కొంతమందికి వారిపట్ల ప్రతికూల దృక్పథం ఏర్పడుతుంది. ఉదాహరణకు, వారు దేవుని రాజ్య సువార్తను ఆసక్తితో ప్రకటిస్తారు, కాని ప్రజలు తరచుగా వారి ఆసక్తిని అపార్థం చేసుకుని, వారి ప్రకటనా పనిని “బలవంతంగా మతమార్పిడి చేస్తున్నట్లు” దృష్టిస్తారు. (అపొస్తలుల కార్యములు 4:19, 20 పోల్చండి.) వారు రాజకీయ విషయాల్లో, దేశాల మధ్య జరిగే యుద్ధాల విషయంలో తటస్థంగా ఉంటారు, అందువల్ల ఇది, సాక్షులు యథార్థత లేని పౌరులని కొన్నిసార్లు అపార్థం చేసుకోవడం జరిగింది.—మీకా 4:3, 4.
4, 5. (ఎ) యెహోవాసాక్షులు అబద్ధ ఆరోపణలకు ఎలా గురౌతున్నారు? (బి) యెహోవా సేవకులపైకి తరచూ ప్రాథమికంగా హింసను రేకెత్తించిన వారు ఎవరు?
4 రెండవదిగా, యెహోవాసాక్షులు అబద్ధ ఆరోపణలకు గురౌతున్నారు, వారి గురించి పచ్చి అబద్ధాలు చెప్పబడ్డాయి, వారి నమ్మకాలు వక్రీకరించి చెప్పబడ్డాయి. ఫలితంగా, కొన్ని దేశాల్లో వారు ప్రమాదకరమైన తెగకు చెందిన వారిగా ముద్రవేయబడ్డారు. అంతేగాక, ‘రక్తమును విసర్జించమని’ చెప్పే బైబిలు ఆజ్ఞకు విధేయులవ్వాలనే తమ కోరికకు అనుగుణ్యంగా వారు రక్తరహిత వైద్య విధానాన్ని అవలంభిస్తారు గనుక, వారికి ‘పిల్లల హంతకులుగా’ మరియు ‘ఆత్మహత్య గుంపుగా’ తప్పు పేరు పడింది. (అపొస్తలుల కార్యములు 15:28) అయితే వాస్తవమేమిటంటే యెహోవాసాక్షులు జీవాన్ని చాలా ఉన్నతమైనదిగా పరిగణిస్తారు, వారు తమకు అలాగే తమ పిల్లలకు అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన వైద్య సహాయాన్ని తీసుకోవడానికి కృషి చేస్తారు. రక్త మార్పిడిని నిరాకరించడం మూలంగా ప్రతి సంవత్సరం అనేకమంది యెహోవాసాక్షుల పిల్లలు చనిపోతున్నారన్న నింద పూర్తిగా నిరాధారమైనది. దీనికి సంబంధించి ఏ గణాంకాలను ఇవ్వడం సాధ్యంకాదు. బైబిలు సత్యం కుటుంబ సభ్యులందరిపై ఒకే ప్రభావాన్ని చూపించదు గనుక, సాక్షులు కుటుంబాలను విచ్ఛిన్నం చేసేవారని కూడా నిందించబడ్డారు. అయినప్పటికీ, వారు కుటుంబ జీవితాన్ని చాలా ఉన్నతమైనదిగా ఎంచుతారని, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని గౌరవించుకోవాలని ఇంకా తమ తలిదండ్రులు విశ్వాసులైనా కాకపోయినా పిల్లలు వారికి విధేయులై ఉండాలని చెబుతున్న బైబిలు ఆజ్ఞలను అనుసరించడానికి వారు ప్రయత్నిస్తారని యెహోవాసాక్షులతో పరిచయమున్న వారికి తెలుసు.—ఎఫెసీయులు 5:21–6:3.
5 అనేక సందర్భాల్లో, యెహోవా సేవకులపైకి ప్రాథమికంగా హింసను పురికొల్పేది, మత వ్యతిరేకులేనని తేలింది. వారు రాజకీయ అధికారులను సమాచార మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా సాక్షుల కార్యకలాపాలను అణచివేయడానికి తమ పలుకుబడిని ఉపయోగించారు. యెహోవాసాక్షులమైన మనం అలాంటి వ్యతిరేకతకు, అది మన నమ్మకాలు ఆచరణల ఫలితంగా వచ్చినప్పటికీ లేక అబద్ధ ఆరోపణల మూలంగా వచ్చినప్పటికీ దానికి ఎలా ప్రతిస్పందించాలి?
“మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి”
6. క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నవారి ఎడల సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండటం ఎందుకు ప్రాముఖ్యం?
6 మొదటగా, మన మత నమ్మకాలను పంచుకోని వారి గురించి మనకు సరైన దృక్పథం ఉండాలి అంటే యెహోవాకున్నటువంటి దృక్పథమే ఉండాలి. లేకపోతే, మనం అనవసరంగా శత్రుత్వాన్ని లేక ఇతరుల నుండి అపనిందను ఆహ్వానించిన వారమౌతాము. “మీ సహనమును [“సహేతుకతను,” NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:5) గనుక, క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్న వారిపట్ల సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది.
7. ‘లోకమాలిన్యం మనకంటకుండ’ కాపాడుకోవడంలో ఏమి ఇమిడివుంది?
7 ఒక వైపున, ‘ఇహలోకమాలిన్యము అంటకుండ’ కాపాడుకోమని లేఖనాలు మనకు స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నాయి. (యాకోబు 1:27; 4:4) బైబిల్లోని ఇతర సందర్భాల్లోలానే ఇక్కడ కూడా ‘లోకం’ అనే పదం నిజ క్రైస్తవులు కాక మిగిలిన మానవ సమాజాన్నంతటిని సూచిస్తుంది. మనం ఈ మానవ సమాజం మధ్యనే జీవిస్తున్నాము; మనం పని స్థలంలోను, స్కూళ్లలోను, ఇరుగుపొరుగున వారిని కలుస్తూనే ఉంటాము. (యోహాను 17:11, 15; 1 కొరింథీయులు 5:9, 10) అయినప్పటికీ, దేవుని నీతియుక్తమైన మార్గాలతో విభేదించే దృక్పథాలను, మాటలను, ప్రవర్తనను విడిచిపెట్టడం ద్వారా మనం ఈ లోక మాలిన్యం మనకంటకుండ కాపాడుకుంటాము. ఈ లోకంతో, ప్రాముఖ్యంగా యెహోవా ప్రమాణాల పట్ల స్పష్టమైన అలక్ష్యాన్ని చూపే వారితో సన్నిహిత సంబంధం కల్గివుండడంలోని ప్రమాదాన్ని మనం గుర్తించడం కూడా ప్రాముఖ్యం.—సామెతలు 13:20.
8. లోకమాలిన్యం మనకంటకుండ కాపాడుకోమన్న ఉపదేశం, ఇతరులను తక్కువగా చూడడానికి మనకు ఏ ఆధారాన్ని ఎందుకివ్వదు?
8 అయితే, లోకమాలిన్యం మనకంటకుండ కాపాడుకోమని ఇవ్వబడిన ఉపదేశం, యెహోవాసాక్షులు కాని వారిని తక్కువ చేయడానికి ఏ ఆధారాన్ని ఇవ్వదు. (సామెతలు 8:13) గత శీర్షికలో చర్చించబడిన యూదా మతనాయకుల ఉదాహరణను గుర్తు తెచ్చుకోండి. వారు రూపొందించిన విధమైన మత విధానం యెహోవా అనుగ్రహాన్ని పొందలేకపోయింది; అది యూదేతరులతో మంచి సంబంధాలు కల్గివుండడానికి కూడా దోహదపడలేదు. (మత్తయి 21:43, 45) తమ గురించి తాము అధికులమని భావించుకుంటూ ఈ మతఛాందసులు అన్యులను చిన్నచూపు చూశారు. సాక్షులు కాని వారిని ఏవగించుకునేటువంటి సంకుచిత దృక్పథాన్ని మనం కల్గివుండము. సత్యాన్ని గురించిన బైబిలు సందేశాన్ని వినే వారంతా దేవుని అనుగ్రహాన్ని పొందాలని అపొస్తలుడైన పౌలు కోరుకున్నట్లుగానే మనమూ కోరుకుంటాము.—అపొస్తలుల కార్యములు 26:29; 1 తిమోతి 2:3, 4.
9. మన నమ్మకాలను పంచుకోని వారి గురించి మనం మాట్లాడేటప్పుడు సమతూకమైన, లేఖనాధారమైన దృక్కోణం మనపై ఏ ప్రభావాన్ని చూపించాలి?
9 సాక్షులుకాని వారి గురించి మనం మాట్లాడేటప్పుడు సమతూకమైన లేఖనాధారమైన దృక్కోణం మనపై ప్రభావం చూపాలి. “ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెనని” క్రేతు ద్వీపం మీదున్న క్రైస్తవులకు జ్ఞాపకం చేయమని పౌలు తీతుకు ఉపదేశించాడు. (తీతు 3:1) క్రైస్తవులు ‘ఎవరి’ గురించీ అంటే క్రేతు ద్వీపం మీదున్న క్రైస్తవేతరులతో సహా ఎవరి గురించీ కూడా దూషణకరంగా మాట్లాడకూడదని గమనించండి, ఆ క్రైస్తవేతరులలో కొందరు అబద్ధాలాడేవారు తిండిపోతులు సోమరులు అని పేరు పొందినవారు. (తీతు 1:12) కాబట్టి మన నమ్మకాలను పంచుకోని వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అవమానకరమైన పదాలను ఉపయోగించడం లేఖనవిరుద్ధమైనదౌతుంది. తమ గురించి తాము అధికులమన్న భావన కలిగివుండడం యెహోవా ఆరాధనవైపుకు ఇతరులను ఆకర్షించదు. బదులుగా, యెహోవా వాక్యంలోని సహేతుకమైన సూత్రాలకు అనుగుణ్యంగా మనం ఇతరులను దృష్టించినప్పుడు, అలా ఇతరులతో వ్యవహరించినప్పుడు మనం దేవుని ‘ఉపదేశమును అలంకరిస్తాము.’—తీతు 2:10.
మౌనంగా ఉండవలసిన సమయం, మాట్లాడవలసిన సమయం
10, 11. (ఎ) ‘మౌనంగా ఉండవలసిన సమయం’ ఏదో, (బి) ‘మాటలాడవలసిన సమయం’ ఏదో తనకు తెలుసని యేసు ఎలా చూపించాడు?
10 ‘మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయము కలదు’ అని ప్రసంగి 3:7 చెబుతుంది. అయితే మరి, వ్యతిరేకులను ఎప్పుడు అలక్ష్యం చేయాలి లేక మన విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి ఎప్పుడు మాట్లాడాలి అనేది నిర్ణయించుకోవడం ఒక సవాలే. వివేచన విషయంలో ఎల్లప్పుడూ పరిపూర్ణుడుగావున్న యేసు ఉదాహరణ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. (1 పేతురు 2:21) ‘మౌనముగా ఉండవలసిన సమయం’ ఏదో ఆయనకు తెలుసు. ఉదాహరణకు, పిలాతు ఎదుట ప్రధాన యాజకులు ఇతర పెద్దలు యేసును అబద్ధంగా నిందించినప్పుడు, ఆయన “ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.” (మత్తయి 27:11-14) తనపట్ల దేవుని చిత్తం ఏమైవుందో అది చేయనీయకుండా ఆటంకాన్ని తీసుకు వచ్చేదేది మాట్లాడడం ఆయనకు ఇష్టం లేకపోయింది. బదులుగా, తన బహిరంగ క్రియలే తన గురించి మాట్లాడేందుకు అనుమతించాడు. చివరికి సత్యం కూడా అహంభావంతో కూడిన వారి మనస్సులను, హృదయాలను మార్చలేదని ఆయనకు తెలుసు. కాబట్టి వారి ఆరోపణలను ఆయన అలక్ష్యం చేసి, తను ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉంటూ మాట్లాడడానికి నిరాకరించాడు.—యెషయా 53:7.
11 అయితే, ‘మాటలాడవలసిన సమయం’ ఏదో కూడా యేసుకు తెలుసు. ఒక సందర్భంలో, ఆయన తనను విమర్శించేవారి అబద్ధ ఆరోపణలను ఖండిస్తూ నిర్మొహమాటంగా బహిరంగంగా వారిని ఎదుర్కున్నాడు. ఉదాహరణకు, యేసు బెయెల్జెబూబు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడని నిందించడం ద్వారా శాస్త్రులూ పరిసయ్యులూ ఆయనను సమూహము ఎదుట అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, అబద్ధ ఆరోపణలను నిలువనియ్యకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ అబద్ధ ఆరోపణలను తుత్తునియలు చేసే తర్కంతోనూ శక్తివంతమైన ఉదాహరణతోనూ ఆయన అబద్ధాన్ని త్రిప్పికొట్టాడు. (మార్కు 3:20-30; అలాగే మత్తయి 15:1-11; 22:17-21 మరియు యోహాను 18:37 కూడా చూడండి.) అలాగే యేసు తాను అప్పగించబడి నిర్భంధించబడిన తర్వాత సమాజమందిరము ఎదుటకు తీసుకుపోబడినప్పుడు, ప్రధాన యాజకుడైన కయప వంచనగా ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నా[ను.]” ఇది కూడా మాటలాడవలసిన సమయమే, ఎందుకంటే, ఆ సమయంలో ఆయన మౌనంగా ఉంటే తాను క్రీస్తునన్న విషయాన్ని నిరాకరించినట్లై ఉండేది. అందుకే యేసు “నీవన్నట్టే” అని సమాధానమిచ్చాడు.—మత్తయి 26:63, 64; మార్కు 14:61, 62.
12. ఈకొనియలో పౌలు బర్నబాలు ధైర్యంగా మాట్లాడడానికి వారిని పురికొల్పిన పరిస్థితులు ఏవి?
12 పౌలు బర్నబాల ఉదాహరణను కూడా పరిశీలించండి. అపొస్తలుల కార్యములు 14:1, 2 ఇలా చెబుతుంది: “ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి. అయతే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.” ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ ఇలా చెబుతుంది: “వాళ్ల సందేశాన్ని నమ్మి మారని యూదులు, అన్యులను రెచ్చగొట్టి క్రైస్తవులకు వ్యతిరేకంగా వాళ్ల మనసులను విషపూరితం చేశారు.” యూదా వ్యతిరేకులు తాము ఆ సందేశాన్ని కేవలం నిరాకరించడంతో మాత్రం సంతృప్తిపడక క్రైస్తవులకు వ్యతిరేకంగా అన్యజనుల మనస్సుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తూ, క్రైస్తవుల పేరుకు కళంకం కలిగించే ప్రచారాన్ని మొదలెట్టారు.a క్రైస్తవత్వంపట్ల వారికెంత విపరీతమైన ద్వేషం ఉండి ఉంటుందోకదా! (అపొస్తలుల కార్యములు 10:28 పోల్చండి.) అది ‘మాటలాడవలసిన సమయం’ అని పౌలు బర్నబాలు భావించారు, లేకపోతే ప్రజా నిందను చూసి క్రొత్త శిష్యులు నిరుత్సాహం చెందే అవకాశం ఉంది. “కాబట్టి వారు [పౌలు మరియు బర్నబా],” అద్భుతాలు చేయడానికి తమకు శక్తినిచ్చి, తమపట్ల తన అంగీకారాన్ని చూపించిన “ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి.” ఫలితంగా కొందరు “యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.”—అపొస్తలుల కార్యములు 14:3, 4.
13. అపనిందను ఎదుర్కునేటప్పుడు, సాధారణంగా ‘మౌనంగా ఉండవలసిన సమయం’ ఏది?
13 కాబట్టి మనం నిందించబడినప్పుడు మనమెలా ప్రతిస్పందించాలి? అదంతా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలు, ‘మౌనముగా ఉండుటకు సమయము కలదు’ అనే సూత్రాన్ని మనం అన్వయించుకోవలసినవై ఉంటాయి. ముఖ్యంగా, వ్యతిరేకించాలని నిశ్చయించుకున్నవారు మనల్ని నిర్హేతుకమైన వాదనలలోకి దింపాలని ప్రయత్నిస్తున్నప్పుడు అలా చేయాలి. కొంతమంది ప్రజలు కేవలం సత్యం తెలుసుకోవాలని కోరుకోరని మనం మర్చిపోకూడదు. (2 థెస్సలొనీకయులు 2:9-12) అహంభావంగా అవిశ్వాసంతో తమ హృదయాలను స్థిరపరచుకున్నవారితో తర్కించడానికి ప్రయత్నించడం వ్యర్థం. అంతకంటే ఎక్కువగా, మనపై దాడి చేసే ప్రతి అబద్ధ ఆరోపకుడితోను మనం వాదించడంలో నిమగ్నమైపోతే, అంతకంటే ఎంతో ప్రాముఖ్యమైనదీ ప్రతిఫలదాయకమైనదీ అయిన కార్యం నుండి అంటే బైబిలు సత్యాన్ని నేర్చుకోవాలని నిజంగా కోరుకునే యథార్థ హృదయులకు సహాయం చేయడం నుండి మనం ప్రక్కదారి పట్టిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన గురించి అబద్ధాలు వ్యాప్తిచేయాలనే సంకల్పం కలిగివున్న వారు ఎదురైనప్పుడు, “వారిలోనుండి తొలగిపోవుడి” అన్నదే మనకివ్వబడుతున్న ప్రేరేపిత ఉపదేశం.—రోమీయులు 16:17, 18; మత్తయి 7:6.
14. మనం మన విశ్వాసాన్ని ఇతరుల ఎదుట ఏ విధంగా సమర్థించుకోవచ్చు?
14 అంటే దీని భావం మనం మన విశ్వాసాన్ని సమర్థించుకోవద్దని కాదు. ‘మాట్లాడడానికి కూడా సమయం ఉంది.’ మన గురించి అపఖ్యాతికరమైన విమర్శను విన్న యథార్థవంతులైన వారి గురించి మనం సరిగ్గానే చింత కల్గివుంటాము. మనం మన హృదయపూర్వక నమ్మకాల గురించి ఇతరులకు స్పష్టమైన వివరణను ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాము; వాస్తవానికి మనం అలాంటి అవకాశాన్ని ఆహ్వానిస్తాము. పేతురు ఇలా వ్రాశాడు: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతురు 3:15) నిజంగా ఆసక్తిగల వారెవరైనా మనకు ఎంతో ప్రియమైన నమ్మకాల రుజువును అడిగితే, వ్యతిరేకులు లేవదీసిన అబద్ధ ఆరోపణల గురించి వారు వాకబు చేస్తే, సరైన బైబిలు ఆధార సమాధానాలను ఇస్తూ మన విశ్వాసాన్ని సమర్థించుకోవడం మన బాధ్యత. అంతేగాక, మన మంచి ప్రవర్తన ఎంతో సాక్ష్యమివ్వగలదు. మనం దేవుని నీతియుక్తమైన ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడానికి నిజంగానే ప్రయత్నిస్తున్నామని విశాల హృదయంగల చూపరులు గమనించినప్పుడు, మనపై వేయబడిన నిందలు అబద్ధమని వెంటనే వారు చూడగలుగుతారు.—1 పేతురు 2:12-15.
అపవాదులను ప్రచారం చేస్తే అప్పుడేమిటి?
15. యెహోవాసాక్షుల గురించి సమాచార మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఎలా అందజేయబడుతోందనేది చెప్పడానికి ఒక ఉదాహరణ ఏది?
15 కొన్నిసార్లు, యెహోవాసాక్షుల గురించి సమాచార మాధ్యమాల్లో వక్రీకరించి చెప్పబడింది. ఉదాహరణకు, తమ సభ్యులైనవారు తమ ‘విశ్వాసాన్ని అర్థం చేసుకోకపోతే, పంచుకోకపోతే తమ భార్యలను భర్తలను తలిదండ్రులను నిరాకరించాలని’ సాక్షులు కోరతారని చెబుతూ 1997 ఆగస్టు 1న, ఒక రష్యన్ వార్తాపత్రిక ఇతర విషయాలతో పాటు నిందాపూర్వకమైన ఒక శీర్షికను ప్రచురించింది. యెహోవాసాక్షులతో నిజంగా పరిచయమున్న ఎవరికైనా అది అబద్ధ ఆరోపణ అని తెలిసిపోతుంది. క్రైస్తవులు అవిశ్వాసులైన కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించాలని బైబిలు సూచిస్తుంది, సాక్షులు ఆ నిర్దేశాన్ని అనుసరించడానికి కృషి చేస్తారు. (1 కొరింథీయులు 7:12-16; 1 పేతురు 3:1-4) అయితే, ఆ శీర్షిక ముద్రించబడింది, ఎంతోమంది పాఠకులకు అలా తప్పుడు సమాచారం అందజేయబడింది. మనం అబద్ధారోపణ జరిగినప్పుడు మనం మన విశ్వాసాన్ని ఎలా సమర్థించుకోగలం?
16, 17, మరియు 16వ పేజీలోని బాక్సు. (ఎ) సమాచార మాధ్యం ప్రచారం చేస్తున్న అబద్ధ సమాచారానికి ప్రతిస్పందించడం గురించి ఒకసారి కావలికోట ఏమి చెప్పింది? (బి) సమాచార మాధ్యం యొక్క ప్రతికూల నివేదికలకు యెహోవాసాక్షులు ఏ పరిస్థితుల క్రింద ప్రతిస్పందించవచ్చు?
16 ఇక్కడ కూడా, ‘మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు సమయము కలదు.’ కావలికోట ఒకసారి దాన్నిలా వ్యక్తపర్చింది: “మనం ప్రచార మాధ్యమాల తప్పుడు సమాచారాన్ని నిర్లక్ష్యం చేయడం లేక సరైన మార్గాల ద్వారా సత్యాన్ని పరిరక్షించడం పరిస్థితులపైన, విమర్శ చేసిన వ్యక్తి మరియు అతని ఉద్దేశం వంటివాటిపైన ఆధారపడి ఉంటుంది.” కొన్ని సందర్భాల్లో మనం ప్రతికూల నివేదికలను నిర్లక్ష్యం చేయడం మంచిది, అలా చేయడం ద్వారా మనం అబద్ధాలకు మరింత ప్రచారం కలిగేలా చేయము.
17 ఇతర సందర్భాల్లో అది ‘మాటలాడవలసిన సమయం’ అయ్యుండవచ్చు. బాధ్యతాయుతంగా ఉండే జర్నలిస్టుకు లేక రిపోర్టరుకు యెహోవాసాక్షుల గురించి తప్పుడు సమాచారమే అందివుండవచ్చు, మన గురించిన నిజమైన సమాచారాన్ని అతడు ఆహ్వానిస్తుండవచ్చు. (“ఒక తప్పుడు సమాచారాన్ని సరిచేయడం” అనే బాక్సును చూడండి.) సమాచార మాధ్యమాల్లోని ప్రతికూల నివేదికలు మన ప్రకటనా పనికి అవరోధం కలిగించే ప్రతికూల అభిప్రాయాలను కలిగిస్తే, వాచ్ టవర్ సంస్థ బ్రాంచి కార్యాలయ ప్రతినిధులు తగిన మాధ్యమాల ద్వారా సత్యాన్ని సమర్థించడానికి చొరవ తీసుకోవచ్చు.b ఉదాహరణకు, ఒక టీవీ కార్యక్రమం ద్వారా, అలాంటి వాస్తవాలను తెలియజేయడానికి అర్హులైన పెద్దలు నియమించబడవచ్చు, అలా చేయకపోతే యెహోవాసాక్షుల వద్ద జవాబు లేదన్నట్లు అనిపించవచ్చు. అలాంటి విషయాల్లో వాచ్ టవర్ సంస్థ మరియు దాని ప్రతినిధులు ఇచ్చే నిర్దేశంతో సాక్షులు జ్ఞానయుక్తంగా సహకరిస్తారు.—హెబ్రీయులు 13:17.
చట్టబద్ధంగా సువార్తను సమర్థించడం
18. (ఎ) ప్రకటించడానికి మనకు మానవ ప్రభుత్వాల అనుమతి ఎందుకు అవసరం లేదు? (బి) ప్రకటించడానికి మనకు అనుమతి ఇవ్వబడనప్పుడు మనం ఏ విధానాన్ని అవలంభిస్తాము?
18 దేవుని రాజ్యసువార్తను ప్రకటించడానికి మనకు అధికారం పరలోకం నుండి లభించింది. ఈ పని చేయమని మనకు ఆజ్ఞాపించిన యేసుకు ‘పరలోకమందును భూమిమీదను సర్వాధికారము ఇవ్వబడింది.’ (మత్తయి 28:18-20; ఫిలిప్పీయులు 2:9-11) కాబట్టి, ప్రకటించడానికి మనకు మానవ ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు. అయినా కూడా, రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మత స్వేచ్ఛ దోహదపడుతుందని మనం గుర్తిస్తాము. మన ఆరాధనను కొనసాగించే స్వేచ్ఛ మనకున్న దేశాల్లో, దాన్ని కాపాడుకోవడానికి మనం చట్ట విధానాన్ని ఉపయోగించుకుంటాము. మనకు అలాంటి స్వేచ్ఛ ఇవ్వబడని చోట, మనం రాజ్యాంగ పరిధిలోనే దాన్ని పొందడానికి కృషి చేస్తాము. మన లక్ష్యం సమాజ సంస్కరణ కాదు గాని ‘సువార్త పక్షమున వాదించుట, దాన్ని స్థిరపర్చుట.’c—ఫిలిప్పీయులు 1:7.
19. (ఎ) మనం ‘దేవునివి దేవునికి చెల్లించడం’ వల్ల కలిగే ఫలితం ఏమైవుండవచ్చు? (బి) ఏమి చేయాలన్నది మన కృతనిశ్చయమైయుంది?
19 యెహోవాసాక్షులముగా మనం యెహోవాను విశ్వ సర్వోన్నతాధిపతిగా గుర్తిస్తాము. ఆయన చట్టం/ఆజ్ఞ సర్వోన్నతమైనది. మనం మనస్సాక్షిపూర్వకంగా మానవ ప్రభుత్వాలకు విధేయత చూపించి, తద్వారా ‘కైసరువి కైసరుకు చెల్లిస్తాము.’ కాని మరెంతో ప్రాముఖ్యమైన బాధ్యత అయిన ‘దేవునివి దేవునికి చెల్లించే’ బాధ్యతను నెరవేర్చడంలో ఏదీ మనకు ఆటంకం కలిగించడానికి మనం అనుమతించము. (మత్తయి 22:21) అలా చేయడం మనం అన్య జనాంగాలచే ‘ద్వేషింపబడేలా’ చేస్తుందని మనం పూర్తిగా అర్థం చేసుకుని కూడా, అదంతా శిష్యరికపు తగులుబడిలోని భాగంగా మనం అంగీకరిస్తాము. 20వ శతాబ్దంలో యెహోవాసాక్షుల చట్ట సంబంధమైన రికార్డు, మనం మన విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి కృత నిశ్చయత కలిగివున్నామనడానికి ఒక సాక్ష్యాధారమైయుంది. యెహోవా సహాయంతోను మద్దతుతోను మనం సువార్తను ‘మానక బోధిస్తూ, ప్రకటిస్తూ’ ఉందాము.—అపొస్తలుల కార్యములు 5:42.
[అధస్సూచీలు]
a యూదా వ్యతిరేకులు “తమ మనస్సుకు తోచింది లేక తమకున్న తీవ్రమైన పగను బట్టి తాము కల్పించగల్గినదంతా కల్పించి చెప్పి క్రైస్తవత్వాన్ని గురించి నీచమైన అభిప్రాయాన్నే గాక చెడు అభిప్రాయాన్ని కూడా వారిలో కలిగించడానికి, తమకు పరిచయమున్న అలాంటి [అన్యుల] దగ్గరికి ఉద్దేశపూర్వకంగా వెళ్లడమే ఒక పనిగా పెట్టుకున్నారు” అని మాథ్యూ హెన్రీస్ కామెంటరీ ఆన్ ది హోల్ బైబిల్ వివరిస్తుంది.
b రష్యన్ వార్తాపత్రికలో అపవాదులతో కూడిన (15 పేరాలో ప్రస్తావించబడిన) శీర్షిక ప్రచురించబడిన తర్వాత, ఆ శీర్షికలో చేయబడిన అబద్ధ ఆరోపణలను పునఃపరిశీలించమని యెహోవాసాక్షులు ప్రెసిడెన్షియల్ జ్యుడీషియల్ ఛాంబర్ ఫర్ ఇన్ఫర్మేషనల్ డిస్ప్యూట్స్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్‌కు విజ్ఞప్తి చేశారు. అపనిందలతో కూడిన శీర్షికను ముద్రించినందుకు ఆ వార్తా పత్రికకు శిక్ష విధించాలనే నిర్ణయాన్ని కోర్టు ఇటీవల వెలువరించింది.—డిసెంబరు 8, 1998 తేజరిల్లు!లోని 19-20 పేజీలను చూడండి.
c 19-22 పేజీల్లోవున్న “చట్టబద్ధంగా సువార్తను కాపాడటం” అనే శీర్షికను చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ యెహోవాసాక్షులు ఎందుకు ‘ద్వేషించబడుతున్నారు’?
◻ మన మత నమ్మకాలను పంచుకోని వారిని మనం ఎలా దృష్టించాలి?
◻ వ్యతిరేకులతో వ్యవహరించే విషయంలో, యేసు సమతూకంగల ఏ మాదిరిని ఉంచాడు?
◻ మనం నిందించబడినప్పుడు, ‘మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయం’ కలదనే సూత్రాన్ని ఎలా అన్వయించుకోవచ్చు?
[16వ పేజీలోని బాక్సు]
ఒక తప్పుడు సమాచారాన్ని సరి చేయడం
“బొలీవియాలోని యాక్వీబలో, మతభ్రష్టులు రూపొందించినట్లు స్పష్టమౌతున్న ఒక చిత్రాన్ని టీవీలో చూపించేందుకు స్థానిక సువార్తికుల గుంపు ఒకటి ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమం యొక్క దుష్ప్రభావాల దృష్ట్యా, పెద్దలు రెండు టీవీ స్టేషన్లను సందర్శించి యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ మరియు బైబిలు—వాస్తవాల, ప్రవచనాల పుస్తకం అనే వీడియోలను ప్రజలకు చూపిస్తే తాము డబ్బు చెల్లిస్తామని చెప్పడానికి నిశ్చయించుకున్నారు. సంస్థ యొక్క ఈ వీడియోలను చూసిన తర్వాత, మతభ్రష్టుల కార్యక్రమంలోని తప్పుడు సమాచారాన్ని బట్టి ఆగ్రహం చెందిన ఒక రేడియో స్టేషన్ యజమాని త్వరలో జరుగనైయున్న యెహోవాసాక్షుల జిల్లా సమావేశం గురించి ఉచితంగా ప్రకటనలు చేస్తానని తెలియజేశాడు. చాలామంది హాజరయ్యారు, పరిచర్యలో సాక్షులు తమను సందర్శించినప్పుడు ఎంతోమంది యథార్థ హృదయులు యథార్థమైన ప్రశ్నలు అడగడం మొదలెట్టారు.—1997 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం, 61-2 పేజీలు.
[17వ పేజీలోని చిత్రం]
ఒక సందర్భంలో, యేసు తన విమర్శకుల అబద్ధ ఆరోపణలను బహిరంగంగా ఖండించాడు