కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 12/1 పేజీలు 19-22
  • చట్టబద్ధంగా సువార్తను కాపాడటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చట్టబద్ధంగా సువార్తను కాపాడటం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చట్టబద్ధమైన భద్రతా గోడను నిర్మించుకోవడం
  • గోడను బలపర్చడం
  • గోడను కాపాడడం
  • ఆరాధనా హక్కు కోసం పోరాడడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • యెహోవాసాక్షులు—గ్రీసులో సమర్ధించబడ్డారు
    తేజరిల్లు!—1997
  • యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో పొందిన విజయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 12/1 పేజీలు 19-22

చట్టబద్ధంగా సువార్తను కాపాడటం

మానవుడు నగరాలను నిర్మిస్తున్నప్పటి నుండీ గోడలను కడుతూనే ఉన్నాడు. ప్రాముఖ్యంగా గతించిన కాలాల్లో, ఈ గోడలు ఒక భద్రతగా ఉండేవి. దాడి చేసేవారు ఈ గోడలను పడగొట్టకుండ లేక వాటి క్రింది నుండి త్రవ్వకుండా ఉండేలా రక్షకభటులు ఈ గోడల పైనుండి పోరాడేవారు. నగరవాసులు భద్రతను పొందడమే గాక, తరచూ ఆ గోడల చుట్టుప్రక్కల ఉండే పట్టణాల్లో నివసించే వారు సహితం గోడలమధ్యన శరణు జొచ్చేవారు.—2 సమూయేలు 11:20-24; యెషయా 25:12.

అలాగే, యెహోవాసాక్షులు ఒక గోడను అంటే చట్టబద్ధమైన కాపుదలనిచ్చే గోడను నిర్మించారు. ఈ గోడ, సాక్షులను మిగతా సమాజం నుండి వేరు చేయడానికి కట్టబడలేదు ఎందుకంటే యెహోవాసాక్షులు ఇతరులతో సహవసించడానికి ఇష్టపడతారనీ, కలుపుగోలుగా ఉండేవారనీ పేరుపొందారు. బదులుగా, ప్రజలందరికీ ఉన్న ప్రాథమిక స్వేచ్ఛల చట్టబద్ధమైన హామీలను అది బలపరుస్తుంది. అదే సమయంలో, సాక్షులు తమ ఆరాధనను స్వేచ్ఛగా కొనసాగించగలిగేలా అది వారి చట్టబద్ధమైన హక్కులను పరిరక్షిస్తుంది. (మత్తయి 5:14-16 పోల్చండి.) ఈ గోడ వారి ఆరాధనా విధానాన్ని, దేవుని రాజ్య సువార్తను ప్రకటించేందుకు వారికున్న హక్కును కాపాడుతుంది. ఇదేమి గోడ, ఇదెలా నిర్మించబడుతుంది?

చట్టబద్ధమైన భద్రతా గోడను నిర్మించుకోవడం

యెహోవాసాక్షులు ఎన్నో దేశాల్లో మత స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పటికీ, కొన్ని దేశాల్లో వారు అకారణంగా దాడికి గురయ్యారు. అందరూ కలిసి సమకూడుతూ లేక ఇంటింటా ప్రకటిస్తూ ఆరాధన చేసుకునే వారి స్వేచ్ఛ సవాలు చేయబడినప్పుడు, వారు విషయాలను చట్టబద్ధంగా నెగ్గుకోవడానికి కృషి చేశారు. సాక్షులు ఇమిడివున్న చట్టబద్ధమైన కేసులు భూవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి.a అన్నిటినీ గెలవడం కుదరలేదు. కాని క్రింది కోర్టులు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు, తరచూ వారు పై కోర్టులకు అప్పీలు చేసుకున్నారు. దాని ఫలితం?

20వ శతాబ్దంలోని దశకాల్లో, అనేక దేశాల్లో లభించిన చట్టబద్ధమైన విజయాలు యెహోవాసాక్షులు ఆ తర్వాత అప్పీలు చేసుకున్న కేసులకు ఒక నమ్మదగిన ప్రమాణాలను స్థాపించాయి. ఇటుకలు లేక రాళ్లు ఎలాగైతే గోడ కట్టడానికి ఉపయోగపడతాయో అలాగే అనుకూలంగా ఇవ్వబడిన ఈ తీర్పులు చట్టబద్ధమైన భద్రతా గోడగా రూపొందాయి. మునుపు సాధించబడిన విజయాల ఈ గోడ మీది నుండి, యెహోవాసాక్షులు తమ ఆరాధనను జరుపుకోవడానికి మతస్వేచ్ఛ కొరకైన పోరాటాన్ని కొనసాగించారు.

ఉదాహరణగా, మర్డక్‌ వెర్సెస్‌ కామన్‌వెల్త్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియ కేసును పరిశీలించండి. 1943 మే 3న అమెరికా సుప్రీమ్‌ కోర్టు దానికి తీర్పు విధించింది. ఆ కేసులో లేవదీయబడిన ప్రశ్నేమిటంటే: యెహోవాసాక్షులు తమ మతసంబంధమైన సాహిత్యాన్ని పంచిపెట్టడానికి వాణిజ్య అమ్మకపు లైసెన్సును పొందవలసిన అవసరం ఉందా? తాము అలా చేయవలసిన అవసరం లేదని యెహోవాసాక్షులు వాదించారు. వారి ప్రకటనా పని ఇప్పుడే కాదు మునుపెన్నడూ కూడా వాణిజ్య సంబంధమైనది కాదు. వారి లక్ష్యం డబ్బు సంపాదించుకోవాలన్నది కాదు గాని సువార్త ప్రకటించాలన్నదే. (మత్తయి 10:8; 2 కొరింథీయులు 2:17) మర్డక్‌ తీర్మానంలో, మతసంబంధమైన సాహిత్యాన్ని పంచిపెట్టడానికి లైసెన్సు పన్ను చెల్లించవలసిన అవసరముందనడం రాజ్యాంగ విరుద్ధమైనదని చెబుతూ కోర్టు సాక్షులతో ఏకీభవించింది.b ఈ తీర్పు ప్రాముఖ్యమైన ప్రమాణాన్ని స్థాపించింది, అప్పటి నుండి సాక్షులు అనేకానేక కేసుల విషయంలో దాన్ని ఒక అధికారికంగా ఉపయోగిస్తూ విజయవంతంగా అప్పీలు చేసుకున్నారు. చట్టబద్ధమైన రక్షణగోడకు మర్డక్‌ తీర్మానం ఒక పటిష్టమైన ఇటుక అని నిరూపించబడింది.

ప్రజలందరి మత స్వేచ్ఛను కాపాడడానికి అలాంటి కేసులు ఎంతో దోహదపడ్డాయి. అమెరికాలోని పౌర హక్కుల పరిరక్షణ కోసం సాక్షులు చేసిన కృషి గురించి యూనివర్సిటి ఆఫ్‌ సిన్‌సినాటి లా రివ్యు ఇలా తెలియజేసింది: “రాజ్యాంగ న్యాయశాస్త్రాన్ని వృద్ధి చేయడంలో యెహోవాసాక్షులు ఎంతో ప్రేరణనిచ్చారు, ప్రాముఖ్యంగా వాక్‌ స్వాతంత్ర్య మరియు మత స్వాతంత్ర్య పరిధులను విస్తరింపజేయడం ద్వారా వారు ఎంతో ప్రేరణనిచ్చారు.”

గోడను బలపర్చడం

చట్టబద్ధమైన ప్రతి విజయంతోనూ గోడ మరింత పటిష్టమయ్యింది. యెహోవాసాక్షులకు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర స్వేచ్ఛా ప్రియులందరికీ ప్రయోజనం చేకూర్చిన 1990లలోని కొన్ని నిర్ణయాలను పరిశీలించండి.

గ్రీస్‌. 1993 మే 25న, తన మత నమ్మకాలను ఇతరులకు బోధించేందుకు ఒక గ్రీకు పౌరుడికున్న హక్కును యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సమర్థించింది. ఆ కేసులో మినోస్‌ కోకీనాకీస్‌ ఇమిడివున్నారు, అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. యెహోవాసాక్షుల్లో ఒకరిగా కోకీనాకీస్‌ 1938 నుండి 60 కంటే ఎక్కువసార్లు అరెస్ట్‌ చేయబడ్డారు. 18 సార్లు గ్రీకు కోర్టుల ముందు హాజరుపర్చబడ్డారు, ఆరు కంటే ఎక్కువ సంవత్సరాలు చెరసాలలో గడిపారు. మతమార్పిడిని నిషేధించే 1930లలోని గ్రీకు చట్టం క్రింద ఆయన అపరాధిగా నిర్ణయించబడ్డారు, ఆ చట్టం మూలంగా 1938 నుండి 1992 మధ్య కాలంలో దాదాపు 20,000 మంది యెహోవాసాక్షులు అరెస్ట్‌ చేయబడ్డారు. గ్రీకు ప్రభుత్వం కోకీనాకీస్‌ మత స్వేచ్ఛకు ఆటంకం కలిగించిందని యూరోపియన్‌ కోర్టు నిర్ణయించి, ఆయనకు నష్ట పరిహారంగా 14,400 డాలర్లను చెల్లించింది. కోర్టు తన నిర్ణయంలో, యెహోవాసాక్షులది నిజంగా “అందరికి తెలిసిన మతం” అని నిర్ణయించింది.—సెప్టెంబరు 1, 1993 కావలికోట, 27-31 పేజీలు చూడండి.

మెక్సికో. 1992 జూలై 16న, మెక్సికోలో మత స్వేచ్ఛను పరిరక్షించే ఒక పెద్ద చర్యగైకొనడం జరిగింది. ఆ రోజున లా ఆఫ్‌ రెలీజియస్‌ అసోసియేషన్స్‌ అండ్‌ పబ్లిక్‌ వర్షిప్‌ అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా, ఒక మత గుంపు అవసరమైన రిజిస్ట్రేషన్‌ను పొందడం ద్వారా మతసంబంధమైన సంస్థగా చట్టబద్ధమైన స్థానాన్ని పొందగల్గుతుంది. మునుపు, దేశంలోని ఇతర మతాలలాగే యెహోవాసాక్షులు వాస్తవంగా ఉనికిలో ఉన్నప్పటికీ వారికి చట్టపరంగా గుర్తింపు లభించలేదు. 1993 ఏప్రిల్‌ 13న, సాక్షులు రిజిస్ట్రేషన్‌ కోసం అప్పీలు చేసుకున్నారు. సంతోషకరంగా, 1993 మే 7న, ల టార్రీ డెల్‌ వీకీయ, ఏ. ఆర్‌. మరియు లోస్‌ టెస్టీగోస్‌ డె హేఓవా ఎన్‌ మెహీకో, ఏ. ఆర్‌ చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేయబడ్డాయి. ఇవి రెండూ కూడా మత సంస్థలే.—జూలై 22, 1994 తేజరిల్లు! (ఆంగ్లం) 12-14 పేజీలను చూడండి.

బ్రెజిల్‌. బేతేలులో (యెహోవాసాక్షుల బ్రాంచి సౌకర్యాల పేరు) పని చేస్తున్న స్వచ్ఛంద సేవకులు ఇక నుండి మత సంబంధమైన పరిచారకులుగా పరిగణించబడరని, బ్రెజిల్‌ యొక్క కార్మిక చట్టాల క్రిందికి వస్తారని 1990 నవంబరులో బ్రెజిల్స్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటి (ఐ.ఎన్‌.ఎస్‌.ఎస్‌.) వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయానికి తెలియజేసింది. న్యాయం కోసం సాక్షులు అప్పీలు చేసుకున్నారు. 1996 జూన్‌ 7న, బ్రెసీల్య నందలి జ్యుడీషియల్‌ అడ్వైజరీ ఆఫ్‌ ది ఆఫీస్‌ ఆఫ్‌ ది అటోర్నీ జనరల్‌, బేతేలులోని సేవకులు చట్టబద్ధమైన మత సంస్థ సభ్యులేగాని లౌకిక ఉద్యోగులు కారని చెబుతూ వారిని సమర్థిస్తూ తీర్పును జారీచేసింది.

జపాన్‌. 1996 మార్చి 8న, జపాన్‌ సుప్రీమ్‌ కోర్టు జపాన్‌లోని ప్రతి ఒక్కరి ప్రయోజనార్థం విద్య మరియు మత స్వేచ్ఛ అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని వెలువరించింది. మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడానికి కునీహీటో కోబాయాషీ నిరాకరించినందుకు కోబ్‌ మునిసిపల్‌ ఇండస్ట్రియల్‌ టెక్నికల్‌ కాలెజ్‌ ఆయనను బహిష్కరించడం ద్వారా చట్టాన్ని అధిగమించిందని కోర్టు ఏకగ్రీవంగా తీర్మానించింది. జపాన్‌ రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛ ఆధారంగా జపాన్‌ సుప్రీమ్‌ కోర్టు తీర్పు విధించడం ఇదే మొట్టమొదటిసారి. బైబిలు తర్ఫీదు పొందిన తన మనస్సాక్షిని అనుసరిస్తూ యౌవనుడైన ఈ సాక్షి ఆ డ్రిల్లులు, “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యూటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానియును” అని చెబుతున్న యెషయా 2:4 వంటి లేఖనాలలో కనుగొనబడే బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా లేవని భావించాడు. కోర్టు తీర్చిన ఈ తీర్పు భవిష్యత్‌ కేసులకు ఒక ప్రమాణాన్ని స్థాపించింది.—నవంబరు 1, 1996 కావలికోట, 19-21 పేజీలు చూడండి.

‘రక్తాన్ని విసర్జించమని’ చెబుతున్న బైబిలు ఆజ్ఞకు అనుగుణ్యంగా లేని వైద్య చికిత్సను నిరాకరించడానికి సాక్షియైన మీసీ టాకెడాకున్న హక్కును సమర్థిస్తూ, 1998 ఫిబ్రవరి 9న, టోక్యో హైకోర్టు తీర్చిన తీర్పు మరో మైలురాయి అయ్యింది. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఈ కేసును సుప్రీమ్‌ కోర్ట్‌కు అప్పీలు చేసుకోవడం జరిగింది, హైకోర్ట్‌ నిర్ణయాన్ని సుప్రీమ్‌ కోర్ట్‌ సమర్థిస్తుందా లేదా అన్నది వేచి చూడవలసిందే.

ఫిలిప్పైన్స్‌. జెండా వందనం చేయడానికి సాక్షులైన యౌవనస్థులు గౌరవపూర్వకంగా నిరాకరించినందుకు వాళ్ళను స్కూల్లో నుండి తొలగించిన ఒక కేసు విషయంలో ఫిలిప్పైన్స్‌ సుప్రీమ్‌ కోర్టు 1993 మార్చి 1న ఏకగ్రీవంగా యెహోవాసాక్షుల పక్షంగా తీర్పునిచ్చింది.

యెహోవాసాక్షుల హక్కులనే గాక ప్రజలందరి హక్కులను పరిరక్షించే చట్టబద్ధమైన గోడను పటిష్టపర్చడంలో అనుకూలమైన ప్రతి కోర్టు తీర్పూ ఒక రాయిగా లేక ఇటుకగా పనిచేస్తుంది.

గోడను కాపాడడం

153 దేశాల్లో యెహోవాసాక్షులు చట్టబద్ధంగా రిజిస్టరు చేయబడ్డారు, వారు గుర్తింపు పొందిన ఇతర మతాలలానే ఎన్నో స్వేచ్ఛలను తమ హక్కుగా అనుభవిస్తున్నారు. తూర్పు యూరపులోనూ మునుపటి సోవియట్‌ యూనియన్‌లోనూ యెహోవాసాక్షులు దశాబ్దాల పాటు హింసను నిషేధాన్ని అనుభవించిన తర్వాత, ఇప్పుడు అల్బేనియా, బెలారస్‌, చెక్‌ రిపబ్లిక్‌, జార్జియా, హంగేరి, కజకిస్తాన్‌, కిర్ఘిస్తాన్‌, రుమేనియా, స్లొవేకియా వంటి దేశాల్లో చట్టబద్ధమైన గుర్తింపును పొందారు. అయితే, ఎప్పుడో స్థాపించబడిన న్యాయపరిపాలనా విధానంవున్న పశ్చిమ యూరపులోని కొన్ని దేశాలతో సహా కొన్ని నిర్దిష్ట దేశాల్లో నేడు యెహోవాసాక్షుల హక్కులు గంభీరంగా సవాలు చేయబడుతున్నాయి లేక నిషేధించబడుతున్నాయి. సాక్షులకు వ్యతిరేకంగా ‘కట్టడ వలన కీడు కల్పించాలని’ వ్యతిరేకులు చురుగ్గా ప్రయత్నిస్తున్నారు. (కీర్తన 94:20) వీరెలా ప్రతిస్పందిస్తారు?c

యెహోవాసాక్షులు ప్రభుత్వాలన్నిటితోనూ సహకరించాలని కోరుకుంటారు, కానీ తమ ఆరాధనను కొనసాగించుకోవడానికి తమకు చట్టబద్ధమైన స్వేచ్ఛ కావాలని కూడా వారు కోరుకుంటారు. సువార్తను ప్రకటించమన్న ఆజ్ఞతో సహా దేవుని ఆజ్ఞలను శిరసావహించడాన్ని నిషేధించే ఏ చట్టాలైనా లేక కోర్టు నిర్ణయాలైనా విలువలేనివేనని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. (మార్కు 13:10) స్నేహభావంతో ఒప్పందానికి రావడం కుదరకపోతే, యెహోవాసాక్షులు చట్ట పరిధిలో తమను తాము సమర్థించుకోవడానికి పోరాడుతారు, తమ ఆరాధనను కొనసాగించుకోవడానికి దేవుడు తమకిచ్చిన హక్కును కాపాడుకోవడానికి చట్టబద్ధమైన రక్షణను పొందేందుకు అప్పీలు చేసుకోగల అన్ని మార్గాల్లోనూ అప్పీలు చేసుకుంటారు. “నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్థిల్లదు” అన్న దేవుని వాగ్దానమందు యెహోవాసాక్షులకు పూర్తి నమ్మకం ఉంది.—యెషయా 54:17.

[అధస్సూచీలు]

a యెహోవాసాక్షుల చట్టబద్ధమైన రికార్డును గూర్చిన వివరమైన చర్చ కోసం వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించిన యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 30వ అధ్యాయాన్ని దయచేసి చూడండి.

b మర్డక్‌ తీర్మానంలో/నిర్ణయంలో సుప్రీమ్‌ కోర్టు, జోన్స్‌ వెర్సెస్‌ సిటి ఆఫ్‌ ఒపెలికా కేసు విషయంలో తన స్వంత అభిప్రాయాన్ని మార్చుకుంది. 1942లో, జోన్స్‌ కేసులో, యెహోవాసాక్షుల్లో ఒకరైన రాస్కో జోన్స్‌ అలబామాలోని ఒపెలికాలో లైసెన్స్‌ టాక్స్‌ కట్టకుండా సాహిత్యాన్ని పంచిపెడుతున్నందుకు ఆయనను అపరాధిగా తీర్పు తీర్చిన క్రింది కోర్టు నిర్ణయాన్ని సుప్రీమ్‌ కోర్టు సమర్థించింది.

c 8-18 పేజీల్లో ఉన్న “తమ విశ్వాసాన్ని బట్టి ద్వేషించబడ్డారు,” “మన విశ్వాసాన్ని సమర్థించుకోవడం” అనే శీర్షికలను చూడండి.

[21వ పేజీలోని బాక్సు]

యెహోవాసాక్షుల హక్కులను సమర్థించడం

యెహోవాసాక్షులపైకి తీసుకురాబడిన హింస వారు భూవ్యాప్తంగా జడ్జీల ఎదుట, ప్రభుత్వ అధికారుల ఎదుట కొనియాడబడడానికి కారణమయ్యింది. (లూకా 21:12, 13) యెహోవాసాక్షులు తమ హక్కులను చట్టబద్ధంగా సమర్థించుకోవడానికి ఎంతో తీవ్రంగా కృషి చేశారు. అనేక దేశాల్లో లభించిన కోర్టు విజయాలు యెహోవాసాక్షుల ఈ క్రింది హక్కులతోపాటు వారి చట్టబద్ధమైన స్వేచ్ఛను కాపాడడానికి దోహదపడ్డాయి:

◻ వాణిజ్య సంబంధ అమ్మకందారులపై విధించబడిన నియంత్రణలకు లోబడనవసరం లేకుండా ఇంటింటికి ప్రకటించడం—మర్డక్‌ వెర్సెస్‌ కామన్‌వెల్త్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియ, అమెరికా సుప్రీమ్‌ కోర్టు (1943); కోకీనాకీస్‌ వెర్సెస్‌ గ్రీస్‌, యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ఇ.సి.హెచ్‌.ఆర్‌.) (1993).

◻ ఆరాధన కోసం స్వేచ్ఛగా సమకూడడం—మానూసాకీస్‌, మరితరులు వెర్సెస్‌ గ్రీస్‌, ఇ.సి.హెచ్‌.ఆర్‌. (1996).

◻ మనస్సాక్షిపూర్వకంగా వాళ్ళు జాతీయ పతాకానికి లేక చిహ్నానికి గౌరవాన్ని ఎలా చూపించవచ్చన్న విషయంలో తీర్పు—వెస్ట్‌ వర్జీన్య స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వెర్సెస్‌ బెర్నెట్‌, అమెరికా సుప్రీమ్‌ కోర్టు (1943); సుప్రీమ్‌ కోర్ట్‌ ఆఫ్‌ ది ఫిలిప్పైన్స్‌ (1993); సుప్రీమ్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా (1986).

◻ తమ క్రైస్తవ మనస్సాక్షిని ఉల్లంఘించే సైనిక సేవను నిరాకరించడం—యేఓర్యాతీస్‌ వెర్సెస్‌ గ్రీస్‌, ఇ.సి.హెచ్‌.ఆర్‌. (1997).

◻ తమ మనస్సాక్షిని ఉల్లంఘించని చికిత్సలను, మందులను ఎంపికచేసుకోవడం—మాలెట్‌ వెర్సెస్‌ షుల్‌మాన్‌, ఓంటారియో, కెనడా, అప్పీల్‌ కోర్ట్‌ (1990); వాచ్‌టవర్‌ వెర్సెస్‌ ఇ.ఎల్‌.ఏ., సుపీరియర్‌ కోర్ట్‌, సాన్‌ జువాన్‌, ప్యూర్టోరికో (1995); ఫోస్మైర్‌ వెర్సెస్‌ నికోలియో, న్యూయార్క్‌, అమెరికా, కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ (1990).

◻ తమ బైబిలు ఆధార నమ్మకాలు చైల్డ్‌ కస్టడీ వివాదాల్లో సవాలు చేయబడినప్పుడు కూడా తమ పిల్లలను బైబిలు ఆధారిత నమ్మకాలకు అనుగుణంగా పెంచుకోవడం—సాన్‌ లోరాన్‌ వెర్సెస్‌ సూసీ, సుప్రీమ్‌ కోర్ట్‌ ఆఫ్‌ కెనడా (1997); హాఫ్‌మాన్‌ వెర్సెస్‌ ఆస్ట్రియా, ఇ.సి.హెచ్‌.ఆర్‌. (1993).

◻ గుర్తింపు పొందిన ఇతర మతాలు ఉపయోగిస్తున్న సంస్థలు పొందుతున్న అవే పన్ను మినహాయింపులను పొందే చట్టబద్ధమైన సంస్థలను కలిగివుండడం, వాటిని నిర్వహించడం—ప్యూపుల్‌ వెర్సెస్‌ హేరింగ్‌, న్యూయార్క్‌, అమెరికా, కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ (1960).

◻ ఇతర మతాలకు చెందిన మతసంబంధమైన పూర్తి కాల సేవకులకు పన్ను విషయంలో ఎలాంటి రాయితీ లభిస్తుందో, అదే రాయితీలను ఏదో విధమైన ప్రత్యేక పూర్తికాల సేవకు నియమించబడిన వారు పొందడం—బ్రెజిల్స్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ, బ్రెసీల్య, (1996).

[20వ పేజీలోని చిత్రం]

మినోస్‌ కోకినాకీస్‌ తన భార్యతో

[20వ పేజీలోని చిత్రం]

కునీహీటో కోబాయాషి

[19వ పేజీలోని చిత్రసౌజన్యం]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి