కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 12/1 పేజీలు 8-13
  • తమ విశ్వాసాన్ని బట్టి ద్వేషించబడ్డారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తమ విశ్వాసాన్ని బట్టి ద్వేషించబడ్డారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శిష్యరికపు “తగులుబడి”
  • ద్వేషించారు, ద్వేషించబడ్డారు
  • తొలి క్రైస్తవులు—ఎవరిచేత ద్వేషించబడ్డారు?
  • తొలి క్రైస్తవులు—రోమా ప్రపంచంలో ఎందుకు ద్వేషించబడ్డారు?
  • రాజీపడే తలంపే లేదు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • క్రైస్తవులు నేటి మానవ సమాజము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మన విశ్వాసాన్ని సమర్థించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • తొలి క్రైస్తవులు, లోకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 12/1 పేజీలు 8-13

తమ విశ్వాసాన్ని బట్టి ద్వేషించబడ్డారు

“మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు.”—మత్తయి 10:22.

1, 2. యెహోవాసాక్షులు తమ మతనమ్మకాలకు అనుగుణ్యంగా చర్యలు గైకొన్నందువల్ల ఎదుర్కొన్న కొన్ని నిజజీవిత అనుభవాలను మీరు చెప్పగలరా?

క్రేతు ద్వీపానికి చెందిన యథార్థవంతుడైన ఒక దుకాణదారుడు పలు మార్లు అరెస్టు చేయబడి పదే పదే గ్రీకు కోర్టుల ముందు హాజరుపర్చబడ్డాడు. మొత్తమ్మీద, ఆయన తన భార్యా ఐదుగురు పిల్లలకు దూరంగా ఆరు కంటే ఎక్కువ సంవత్సరాలపాటు చెరసాలలో గడిపాడు. జపానులో ఒక 17 ఏళ్ల విద్యార్థి మంచి ప్రవర్తన గలవాడైనప్పటికీ, 42 మంది విద్యార్థులున్న తన తరగతిలో ఉన్నత శ్రేణి విద్యార్థిగా ఉన్నప్పటికీ, పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడు. ఫ్రాన్సులో, కష్టపడి పనిచేసేవారనీ యథార్థంగా పనిచేసేవారనీ పేరున్నప్పటికీ చాలామంది తమ ఉద్యోగాల్లో నుండి వెంటనే తీసివేయబడ్డారు. ఈ నిజజీవిత అనుభవాల్లో ఉన్న సాధారణాంశం ఏమిటి?

2 పైన చెప్పబడినవి ఎదుర్కున్నవారంతా యెహోవాసాక్షులే. వారు చేసిన “నేరం”? ప్రాథమికంగా, వారు తమ మతనమ్మకాలకు అనుగుణ్యంగా చర్యలు గైకొనడమే. యేసుక్రీస్తు బోధించిన దానికి విధేయత చూపిస్తూ దుకాణదారుడు ఇతరులతో తన విశ్వాసాన్ని పంచుకున్నాడు. (మత్తయి 28:19, 20) మతమార్పిడిని నేరంగా పరిగణించే, ప్రస్తుతం అమలులోలేని గ్రీకు చట్టం ప్రకారం ఆయన అపరాధిగా నిర్ణయింపబడ్డాడు. తప్పనిసరియైన కెండో డ్రిల్లులో (జపానీయుల ఖడ్గప్రదర్శనలో) పాల్గొనేందుకు ఆ విద్యార్థి మనస్సాక్షి అతడిని అనుమతించనందున అతడు బహిష్కరించబడ్డాడు. (యెషయా 2:4) ఫ్రాన్సులో, తమ ఉద్యోగాల నుండి తొలగించబడిన వారు అలా తొలగించబడడానికి ఏకైక కారణం వారు తమను తాము యెహోవాసాక్షులుగా గుర్తించుకోవడమేనని వారికి తెలియజేయబడింది.

3. ఇతరుల చేతుల్లో విపరీతమైన కష్టాలను సహించవలసి రావడం చాలామంది యెహోవాసాక్షులకు ఎందుకు అరుదుగా ఎదురయ్యే అనుభవమైయ్యుంది?

3 కొన్ని దేశాల్లోని యెహోవాసాక్షులకు ఇటీవలి కాలంలో అలాంటి కఠినమైన అనుభవాలే ఎదురయ్యాయి. అయితే, అలా ఇతర మానవుల చేతుల్లో విపరీతమైన కష్టాలను సహించవలసి రావడం చాలామంది యెహోవాసాక్షులకు అరుదుగా ఎదురయ్యే అనుభవం. యెహోవా ప్రజలు తమ మంచి ప్రవర్తననుబట్టి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు పొందారు—ఆ మంచి పేరు వారికి హాని చేయాలని తలంచేందుకు ఎవరికీ ఏ కారణాన్నీ ఇవ్వదు. (1 పేతురు 2:11, 12) వారు కుట్రలు పన్నరు, హానికరమైన విధంగా ప్రవర్తించరు. (1 పేతురు 4:15) బదులుగా, మొదట దేవునికి, ఆ తర్వాత లౌకిక ప్రభుత్వాలకు లోబడి ఉండమని చెప్పే బైబిలు ఉపదేశానికి అనుగుణ్యంగా జీవించడానికి వారు ప్రయత్నిస్తారు. వారు చట్టం కోరే పన్నులు చెల్లిస్తారు, “సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండ”డానికి కృషి చేస్తారు. (రోమీయులు 12:18; 13:6, 7; 1 పేతురు 2:13-17) వారు తమ బైబిలు విద్యా కార్యక్రమంలో చట్టంపట్ల, కుటుంబ విలువలపట్ల, నైతికతపట్ల గౌరవం చూపించాలని ప్రోత్సహిస్తారు. వారు చట్టానికి లోబడే పౌరులని ఎన్నో ప్రభుత్వాలు వారిని మెచ్చుకున్నాయి. (రోమీయులు 13:3) అయినప్పటికీ, మొదటి పేరా సూచిస్తున్నట్లుగా, వారు కొన్నిసార్లు వ్యతిరేకతను ఎదుర్కున్నారు, చివరికి కొన్ని దేశాల్లో ప్రభుత్వ నిషేధాలకు గురయ్యారు. అది మనకు ఆశ్చర్యం కలిగించాలా?

శిష్యరికపు “తగులుబడి”

4. యేసు చెప్పినదాని ప్రకారం, ఆయన శిష్యులవుతే ఏమి జరుగుతుందని ఒకరు ఎదురుచూడవచ్చు?

4 తన శిష్యులై ఉండడంలో ఏమి ఇమిడివుంటుందనేదాని గురించి యేసుక్రీస్తు ఏ సందేహాన్నీ విడిచి పెట్టలేదు. “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కా[డు] . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు” అని ఆయన తన అనుచరులకు చెప్పాడు. యేసు “నిర్హేతుకముగా” ద్వేషించబడ్డాడు. (యోహాను 15:18-20, 25; కీర్తన 69:4; లూకా 23:22) ఆయన శిష్యులు తమకు కూడా అలాగే జరుగుతుందని, అంటే న్యాయబద్ధమైన ఆధారం లేని వ్యతిరేకత ఎదురౌతుందని ఎదురుచూడవచ్చు. “మీరు . . . ద్వేషింపబడుదురు” అని ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో ఆయన వారిని హెచ్చరించాడు.—మత్తయి 10:22; 24:9.

5, 6. (ఎ) ఏ కారణాన్ని బట్టి యేసు తన భావి అనుచరులను ‘తగులుబడి లెక్కచూసుకొమ్మని’ కోరాడు? (బి) కాబట్టి మనం వ్యతిరేకతను ఎదుర్కున్నప్పుడు ఎందుకు కలవర పడకూడదు?

5 అందుకే, శిష్యరికపు ‘తగులుబడి లెక్కచూసుకొమ్మని’ యేసు తన భావి అనుచరులను కోరాడు. (లూకా 14:28) ఎందుకు? ఆయన శిష్యులవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి కాదు గాని, దానిలో ఇమిడివున్న దానిని నెరవేర్చాలని దృఢనిశ్చయం చేసుకునేందుకే. శిష్యులయ్యే ఆ ఆధిక్యతతోపాటు వచ్చే ఏ శ్రమలనైనా లేక కష్టాలనైనా సహించడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. (లూకా 14:27) క్రీస్తు అనుచరులుగా యెహోవా సేవ చేయమని ఎవరూ మనల్ని బలవంతం చేయరు. అది స్వచ్ఛంద నిర్ణయం; అది తెలిసి తీసుకున్న నిర్ణయం కూడా. దేవునితో ఒక సమర్పిత సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా మనం ఆశీర్వాదాలను పొందడమే గాక, మనం ‘ద్వేషించబడతామని’ మనకు ముందే తెలుసు. కాబట్టి మనం వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు కలవర పడిపోము. మనం ‘తగులుబడి లెక్క చూసుకున్నాము,’ దాన్ని చెల్లించడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాము.—1 పేతురు 4:12-14.

6 ప్రభుత్వ అధికారులతో సహా కొందరు ఎందుకు నిజ క్రైస్తవులను వ్యతిరేకించాలని అనుకుంటారు? సమాధానం కోసం, సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన రెండు మత గుంపులను పరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. రెండు గుంపులు ద్వేషించబడ్డాయి—కాని ఎంతో భిన్నమైన కారణాలను బట్టి ద్వేషించబడ్డాయి.

ద్వేషించారు, ద్వేషించబడ్డారు

7, 8. ఏ బోధలు అన్యులపట్ల గల అలక్ష్య భావాన్ని చూపించాయి, ఫలితంగా యూదుల్లో ఎలాంటి దృక్పథం వృద్ధి అయ్యింది?

7 సా.శ. మొదటి శతాబ్దానికల్లా ఇశ్రాయేలు రోమా పరిపాలన క్రింద ఉంది, జూడాయిజమ్‌ అంటే యూదా మత విధానం మొత్తమ్మీద ప్రజలను అణచివేస్తున్న శాస్త్రులు పరిసయ్యులు వంటి నాయకుల గుప్పిట్లో ఉంది. (మత్తయి 23:2-4) అన్యజనాంగాల నుండి వేరుగా ఉండమని చెబుతున్న మోషే ధర్మశాస్త్రంలోని ఆదేశాలను తీసుకుని ఈ మతఛాందస నాయకులు యూదేతరులను ఏవగించుకోవాలని ధర్మశాస్త్రం కోరుతుందని వాటిని వక్రీకరించి చెప్పారు. ఆ విధంగా వారు అన్యులపట్ల ద్వేషాన్ని రేకెత్తించే మతాన్ని ఉత్పన్నం చేశారు, తత్ఫలితంగా అన్యులకు యూదులపట్ల ద్వేషం మొలకెత్తింది.

8 అన్యులపట్ల అలక్ష్య భావాన్ని రేకెత్తించడం యూదా నాయకులకు ఏమంత కష్టం కాలేదు, ఎందుకంటే ఆ కాలంలోని యూదులు అన్యులను నీచమైనవారిగా పరిగణించేవారు. అన్యులు “కామాతురత గలవారని అనుమానించబడేవారు” గనుక యూదా స్త్రీ ఎన్నడూ వారితో ఒంటరిగా ఉండకూడదని మతనాయకులు బోధించేవారు. “వారు రక్తం చిందించేవారిగా అనుమానించబడుతున్నారు గనుక” యూదా పురుషుడు “వారితో ఒంటరిగా” ఉండకూడదు. అన్యుడు పాలు పితికేటప్పుడు ఒక యూదుడు దాన్నంతటినీ ప్రత్యక్షంగా చూస్తేనే తప్ప ఆ పాలను ఉపయోగించకూడదు. తమ నాయకుల ప్రభావం మూలంగా యూదులు దూరంగా ఉండే, ఇతరులను కలవనివ్వని దృక్పథాన్ని అలవర్చుకున్నారు.—యోహాను 4:9 పోల్చండి.

9. యూదేతరులను గురించిన యూదా నాయకుల బోధ ఏ ప్రభావాన్ని చూపించింది?

9 యూదేతరులను గూర్చిన అలాంటి బోధలు యూదులకు అన్యులకు మధ్య మంచి సంబంధాలను పెంపొందింపజేయడానికి ఏ మాత్రం దోహదపడలేదు. అన్యులు యూదులను మానవజాతినంతటినీ ద్వేషించేవారిగా పరిగణించడం మొదలెట్టారు. యూదులు “మిగతా మానవజాతి అంతటిపట్ల ఎంతో ద్వేషాన్ని కల్గివుంటారని” రోమా చరిత్రకారుడైన (దాదాపు సా.శ. 56లో జన్మించిన) టాసిటస్‌ చెప్పాడు. యూదా మతప్రవిష్టులుగా మారిన అన్యులకు తమ దేశాన్ని విడిచిపెట్టమని, తమ కుటుంబాన్ని స్నేహితులనూ లక్ష్యపెట్టవద్దని బోధించబడిందని కూడా టాసిటస్‌ పేర్కొన్నాడు. అసంఖ్యాకంగా ఉన్నందున నిర్మూలించబడలేని యూదులను రోమన్లు సాధారణంగా సహించేవారు. కాని సా.శ. 66లో యూదులు చేసిన తిరుగుబాటు రోమన్లలో భయంకరమైన ప్రతీకార భావాన్ని రేకెత్తించడంతో, సా.శ. 70లో యెరూషలేము నాశనం చేయబడింది.

10, 11. (ఎ) మోషే ధర్మశాస్త్రం పరదేశులతో ఎలా వ్యవహరించమని కోరింది? (బి) యూదా జనాంగానికి సంభవించిన దాని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

10 పరదేశులను గూర్చిన దృక్కోణానికి, మోషే ధర్మశాస్త్రంలో పొందుపర్చబడిన ఆరాధనా విధానానికి ఉన్న పోలికేమిటి? నిజమే, అన్యులనుండి వేరుగా ఉండమని ధర్మశాస్త్రం తెలియజేసింది, అయితే దానికి కారణం ఇశ్రాయేలీయులను, ప్రాముఖ్యంగా వారి పవిత్రారాధనను కాపాడాలన్నదే. (యెహోషువ 23:6-8) అయినా కూడా, పరదేశులు ఇశ్రాయేలీయుల చట్టాలను స్పష్టంగా ధిక్కరించనంత వరకు వారితో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వారికి ఆతిథ్యమివ్వాలని ధర్మశాస్త్రం కోరింది. (లేవీయకాండము 24:22) పరదేశులను గురించి ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడిన దాని సహేతుకమైన అసలు ఉద్దేశాన్ని తప్పిపోవడం ద్వారా, యేసు కాలంనాటి యూదా మతనాయకులు అన్యులపట్ల ద్వేషాన్ని రేకెత్తించిన, అన్యులు ద్వేషించిన ఆరాధనా విధానాన్ని ఉత్పన్నం చేశారు. చివరికి, మొదటి శతాబ్దపు యూదా జనాంగం యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయింది.—మత్తయి 23:38.

11 దీనిలో మనకొరకు ఏదైనా పాఠం ఉందా? అవును, ఉంది. మన మత నమ్మకాలను విశ్వసించని వారిని తక్కువగా చూసే స్వనీతితో కూడిన, అధికులమన్న దృక్పథం యెహోవా స్వచ్ఛారాధనకు సరైనవిధంగా ప్రాతినిధ్యం వహించదు, అది యెహోవాకు ప్రీతికరమైనదీ కాదు. మొదటి శతాబ్దానికి చెందిన నమ్మకమైన క్రైస్తవులను తీసుకోండి. వారు క్రైస్తవేతరులను ద్వేషించలేదు, రోముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయనూ లేదు. అయినప్పటికీ, వారు ‘ద్వేషించబడ్డారు.’ ఎందుకు? ఎవరి చేత?

తొలి క్రైస్తవులు—ఎవరిచేత ద్వేషించబడ్డారు?

12. తన అనుచరులు క్రైస్తవేతరుల గురించి సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండాలన్నది యేసు ఉద్దేశమని లేఖనాల నుండి మనకెలా స్పష్టమౌతుంది?

12 తన శిష్యులు క్రైస్తవేతరుల గురించి సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండాలన్నది యేసు ఉద్దేశమని ఆయన చేసిన బోధలనుండి స్పష్టమౌతుంది. ఒక వైపున, తన అనుచరులు ఈ లోకం నుండి వేరైవుంటారని, అంటే యెహోవా నీతియుక్తమైన మార్గాలకు వ్యతిరేకంగా ఉండే దృక్పథాలకూ ప్రవర్తనకూ దూరంగా ఉంటారని ఆయన చెప్పాడు. యుద్ధ సంబంధమైన రాజకీయ సంబంధమైన విషయాల్లో వారు తటస్థంగా ఉంటారు. (యోహాను 17:14, 16) మరోవైపున, క్రైస్తవేతరుల పట్ల ద్వేషాన్ని పురికొల్పే బదులు, ‘తమ శత్రువులను ప్రేమించమని’ యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 5:44) అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఇలా పురికొల్పాడు: “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము.” (రోమీయులు 12:20) ‘అందరికీ మేలు చేయుదము’ అని కూడా ఆయన క్రైస్తవులకు చెప్పాడు.—గలతీయులు 6:10.

13. యూదా మతనాయకులు క్రీస్తు శిష్యులను ఎందుకంతగా వ్యతిరేకించారు?

13 అయినప్పటికీ, క్రీస్తు శిష్యులు త్వరలోనే మూడు వర్గాలచే ‘ద్వేషించబడ్డారు.’ మొదటివారు యూదా మతనాయకులు. క్రైస్తవులు వారి అవధానాన్ని వెంటనే ఆకర్షించారంటే అందులో ఆశ్చర్యం లేదు! క్రైస్తవులకు నైతికత మరియు యథార్థతల విషయంలో ఉన్నతమైన సూత్రాలుండేవి, నిరీక్షణను రేకెత్తించే సమాచారాన్ని వారు జ్వలిస్తున్న ఆసక్తితో అందజేసేవారు. వేలాదిమంది జూడాయిజాన్ని విడిచిపెట్టి, క్రైస్తవత్వాన్ని హత్తుకున్నారు. (అపొస్తలుల కార్యములు 2:41; 4:4; 6:7) యూదా మతనాయకుల దృష్టిలో యూదులైన యేసు శిష్యులు కేవలం మతభ్రష్టులు తప్ప మరేమీ కారు! (అపొస్తలుల కార్యములు 13:45 పోల్చండి.) కోపోద్రేకులైన ఈ నాయకులు, క్రైస్తవత్వం తమ ఆచారాలను నిరర్థకం చేసిందని భావించారు. అంతెందుకు అది అన్యులను గూర్చిన వారి దృక్కోణాన్ని కూడా నిరసించింది ! సా.శ. 36 నుండి అన్యులు క్రైస్తవులై యూదా క్రైస్తవులలానే అదే విశ్వాసాన్ని పంచుకుని, అవే ఆధిక్యతలను ఆనందించే అవకాశం ఏర్పడింది.—అపొస్తలుల కార్యములు 10:34, 35.

14, 15. (ఎ) క్రైస్తవులు ఎందుకు అన్యదేవుళ్ళ ఆరాధకుల ద్వేషానికి గురయ్యారు? ఒక ఉదాహరణ ఇవ్వండి. (బి) తొలి క్రైస్తవులు ఏ మూడవ గుంపుచే ‘ద్వేషించబడ్డారు’?

14 రెండవదిగా, క్రైస్తవులు అన్యమత ఆరాధకుల ద్వేషానికి గురయ్యారు. ఉదాహరణకు, ప్రాచీన ఎఫెసులో, అర్తెమి దేవికి వెండి గుళ్లను చేయడం లాభసాటి వ్యాపారంగా ఉండేది. కాని పౌలు అక్కడ ప్రకటించినప్పుడు, చెప్పుకోదగినంతమంది ఎఫెసీయులు ప్రతిస్పందించి, అర్తెమి ఆరాధనను విడిచిపెట్టారు. తమ వ్యాపారానికి ముప్పు వాటిల్లడంతో కంసాలులు గందరగోళాన్ని సృష్టించారు. (అపొస్తలుల కార్యములు 19:24-41) క్రైస్తవత్వం బేతనియకు (ఇప్పుడు వాయవ్య టర్కీ) వ్యాపించినప్పుడు అటువంటిదే జరిగింది. క్రైస్తవ గ్రీకు లేఖనాలు వ్రాయడం ముగిసి చాలాకాలం గడవక ముందే, అన్య దేవుళ్ళ ఆలయాలు నిర్జనమైపోయి, బలి ఇవ్వబడే జంతువుల ఆహార అమ్మకాలు విపరీతంగా పడిపోయాయని బేతనియ గవర్నరైన ప్లైనీ ది యంగర్‌ నివేదించాడు. క్రైస్తవుల ఆరాధన జంతు బలులను, విగ్రహాలను అనుమతించదు గనుక క్రైస్తవులు నిందించబడ్డారు, హింసించబడ్డారు. (హెబ్రీయులు 10:1-9; 1 యోహాను 5:21) స్పష్టంగా, క్రైస్తవత్వం వ్యాప్తి చెందడం అన్య దేవుళ్ళ ఆరాధన సంబంధంగా బాగా లాభాలు పొందుతున్న వారిని ప్రభావితం చేసింది, వ్యాపారాన్ని డబ్బును కోల్పోయిన వారు దానిపై ఆగ్రహించారు.

15 మూడవదిగా, జాతీయతా భావంగల రోమన్లచే క్రైస్తవులు ‘ద్వేషించబడ్డారు.’ మొదట్లో, క్రైస్తవులు చిన్న గుంపుగా, బహుశ మతపిచ్చిగల గుంపుగా రోమన్లకు తెలిసి ఉండవచ్చు. అయినప్పటికీ, కొంత కాలానికి, క్రైస్తవుడినని చెప్పుకోవడమే మరణ శిక్ష విధించబడగల అంతటి నేరంగా తయారయ్యింది. క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్న యథార్థవంతులైన పౌరులు హింసించబడడానికీ, మరణానికీ తగిన వారిగా ఎందుకు దృష్టించబడేవారు?

తొలి క్రైస్తవులు—రోమా ప్రపంచంలో ఎందుకు ద్వేషించబడ్డారు?

16. క్రైస్తవులు ఏ యే విధాలుగా లోకం నుండి వేరుగా ఉన్నారు, ఇది వారిపట్ల రోమా ప్రపంచంలో ఎందుకు ప్రతికూల అభిప్రాయం ఏర్పడేలా చేసింది?

16 క్రైస్తవులు రోమా ప్రపంచంలో ద్వేషించబడడానికి ప్రాథమిక కారణం వాళ్ళు తమ మత నమ్మకాలను ఆచరణలో పెట్టడమే. ఉదాహరణకు, వారు ప్రపంచం నుండి వేరుగా ఉండేవారు. (యోహాను 15:19) కాబట్టి వారు రాజకీయ కార్యకలాపాలను చేపట్టేవారు కాదు, వారు సైనిక సేవలో భాగం వహించడానికి నిరాకరించేవారు. ఫలితంగా వారు “ప్రపంచమందు ఆసక్తిలేని వారిగా, జీవన కార్యాల్లో దేనికీ పనికిరానివారిగా పరిగణించబడ్డారని” చరిత్రకారుడైన అగస్టస్‌ నేయాన్డర్‌ చెబుతున్నాడు. లోకంలో భాగమై ఉండకపోవడంలో భ్రష్ట రోమా ప్రపంచపు దుష్ట మార్గాలను అనుసరించకపోవడం కూడా ఇమిడి ఉంది. “భోగలాలసులైన అన్యులను చిన్ని క్రైస్తవ సమాజాలు తమ దైవభక్తితోను, మర్యాదతోను కలవరపర్చాయి,” అని చరిత్రకారుడైన విల్‌ డ్యూరాంట్‌ వివరిస్తున్నాడు. (1 పేతురు 4:3, 4) క్రైస్తవులను హింసించి, శిక్షించడం ద్వారా రోమన్లు వేధిస్తున్న తమ మనస్సాక్షి స్వరాన్ని నొక్కి వేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు.

17. మొదటి శతాబ్దపు క్రైస్తవుల ప్రకటనా పని ప్రభావవంతంగా ఉండేదని ఏది చూపిస్తుంది?

17 మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేవుని రాజ్య సువార్తను అచంచలమైన ఆసక్తితో ప్రకటించారు. (మత్తయి 24:14) ఇంచుమించు సా.శ. 60 నాటికి సువార్త “ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింప” బడిందని పౌలు చెప్పగలిగాడు. (కొలొస్సయులు 1:23) మొదటి శతాబ్దాంతానికల్లా, యేసు అనుచరులు రోమా సామ్రాజ్యమంతటిలోనూ అంటే ఆసియలోనూ యూరపులోనూ ఆఫ్రికాలోనూ శిష్యులను తయారు చేశారు! “కైసరు ఇంటివారి”లోని కొందరు సభ్యులు కూడా క్రైస్తవులయ్యారు.a (ఫిలిప్పీయులు 4:22) ఆసక్తితో కూడిన ఈ ప్రకటనాపని ఆగ్రహాన్ని రేకెత్తించింది. నేయాన్డర్‌ ఇలా చెబుతున్నాడు: “క్రైస్తవత్వం అన్ని స్థాయిల్లోని ప్రజల మధ్యన మెల్లిగా అభివృద్ధి సాధించి, రాష్ట్ర మతంతో పాటు పౌర జీవన విధానాన్ని తలక్రిందులు చేయగలదన్న భయాన్ని కలిగించింది.”

18. యెహోవాకు అనితర భక్తిని చెల్లించడం క్రైస్తవులు రోమా ప్రభుత్వానికి విరోధులయ్యేలా ఎలా చేసింది?

18 యేసు అనుచరులు యెహోవాకు అనితర భక్తిని చెల్లించారు. (మత్తయి 4:8-10) బహుశ వారి ఆరాధనలోని ఈ అంశం, మరే ఇతరమైన దానికంటే ఎక్కువగా వారిని రోమీయులకు భిన్నమైనవారినిగా చేసి ఉండవచ్చు. ఇతర మతాల వారు చక్రవర్తి ఆరాధనలో భాగం వహించినంత వరకు రోమన్లు ఇతర మతాల వారి పట్ల సహనం చూపేవారు. తొలి క్రైస్తవులు అలాంటి ఆరాధనలో ఎంతమాత్రం భాగం వహించగలిగేవారు కాదు. రోమా ప్రభుత్వం కంటే ఉన్నత అధికారియైన యెహోవా దేవునికే తాము జవాబుదారులనుగా వాళ్ళు దృష్టించుకున్నారు. (అపొస్తలుల కార్యములు 5:29) ఫలితంగా, ఒక క్రైస్తవుడు ఇతర అన్ని అంశాల్లోనూ ఎంత మాదిరికరమైన పౌరునిగా ఉన్నప్పటికీ, ఆయన ప్రభుత్వానికి శత్రువుగా పరిగణించబడేవాడు.

19, 20. (ఎ) నమ్మకమైన క్రైస్తవుల గురించి వ్యాప్తి చేయబడిన హానికరమైన అపవాదుకు ఎక్కువగా ఎవరు బాధ్యులు? (బి) క్రైస్తవులకు విరుద్ధంగా ఏ అపనిందలు వేయబడ్డాయి?

19 నమ్మకమైన క్రైస్తవులు రోమా ప్రపంచంలో ఎందుకు ‘ద్వేషించబడ్డారనే దానికి’ మరో కారణం ఉంది: వారిని గూర్చిన హానికరమైన అపనిందలను అందరు సుళువుగా నమ్మారు, వ్యాప్తి చేయబడిన ఆ అపనిందలకు ఎక్కువగా బాధ్యులు యూదా మతనాయకులే. (అపొస్తలుల కార్యములు 17:5-8) సా.శ. 60లో లేక 61లో పౌలు నీరో చక్రవర్తి చేసే విచారణ కోసం రోమ్‌లో వేచివున్నప్పుడు, ప్రముఖులైన యూదులు క్రైస్తవుల గురించి ఇలా అన్నారు: “ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియు[ను].” (అపొస్తలుల కార్యములు 28:22) నీరో వారి గురించిన అపవాదుతో కూడిన కథలను తప్పకుండా వినివుంటాడు. సా.శ. 64లో రోమ్‌ అగ్నిలో కాలిపోవడానికి బాధ్యుడు అతడేనని నిందించబడినప్పుడు, అప్పటికే అపనిందలు వేయబడిన క్రైస్తవులను నీరో బలి పశువులుగా ఎంచుకున్నాడని నివేదించబడుతుంది. దీని మూలంగా, క్రైస్తవులను నిర్మూలించాలనే ఉద్దేశంతో తీవ్రమైన హింసను రేకెత్తించినట్లు కనిపిస్తుంది.

20 క్రైస్తవులపై వేయబడిన అపనిందలు తరచూ పూర్తి అబద్ధాలే, వారి నమ్మకాలను వక్రీకరించి చెప్పినవే. వారు ఏక దేవుడ్ని ఆరాధించేవారే గానీ, చక్రవర్తిని ఆరాధించేవారు కాదు గనుక వారిపై నాస్తికులుగా ముద్రవేయబడింది. కొంతమంది క్రైస్తవేతర కుటుంబ సభ్యులు తమ క్రైస్తవ బంధువులను వ్యతిరేకించారు గనుక, క్రైస్తవులు కుటుంబాలను విచ్ఛినం చేసేవారని నిందించబడ్డారు. (మత్తయి 10:21) వాళ్లు నరమాంస భక్షకులని పిలువబడ్డారు, దానికి కారణం ప్రభురాత్రి భోజన సమయంలో యేసు పలికిన మాటలను వక్రీకరించడమేనని కొన్ని మూలాలు చెబుతున్నాయి.—మత్తయి 26:26-28.

21. ఏ రెండు కారణాలను బట్టి క్రైస్తవులు ‘ద్వేషించబడ్డారు’?

21 కాబట్టి, నమ్మకమైన క్రైస్తవులు రెండు ప్రాథమిక కారణాలను బట్టి రోమన్లచే ‘ద్వేషించబడ్డారు’: (1) వారి బైబిలు ఆధార నమ్మకాలు, ఆచరణలు, (2) వారికి వ్యతిరేకంగా చేయబడిన అబద్ధ ఆరోపణలు. కారణం ఏదైనప్పటికీ, వ్యతిరేకుల లక్ష్యం ఒక్కటే—క్రైస్తవత్వాన్ని అణిచి వేయడం. అయితే క్రైస్తవుల పైకి హింసను పురికొల్పిన అసలు వ్యక్తులు మానవాతీత వ్యతిరేకులు, అదృశ్యమైన దుష్టాత్మ శక్తులు.—ఎఫెసీయులు 6:12.

22. (ఎ) ‘అందరి ఎడల మేలు చేయడానికి’ యెహోవాసాక్షులు కృషి చేస్తారని ఏ ఉదాహరణ చూపిస్తుంది? (11వ పేజీలోని బాక్సును చూడండి.) (బి) తర్వాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?

22 తొలి క్రైస్తవుల వలే, ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షులు అనేక దేశాల్లో ‘ద్వేషించబడ్డారు.’ అయినప్పటికీ, వారు సాక్షులు కాని వారిని ద్వేషించరు; అంతేగాక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటును వారు ఎన్నడూ పురికొల్పలేదు. బదులుగా, అన్ని సామాజిక జాతి వర్గ అవరోధాలను దాటే నిజమైన ప్రేమను ఆచరణలో చూపించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. మరి వారు ఎందుకు హింసించబడుతున్నారు? వ్యతిరేకతకు వారు ఎలా ప్రతిస్పందిస్తారు? తరువాతి శీర్షికలో ఈ ప్రశ్నలు చర్చించబడతాయి.

[అధస్సూచీలు]

a ‘కైసరు ఇంటివారు’ అనే పదబంధం, తప్పనిసరిగా అప్పుడు పరిపాలిస్తున్న నీరో స్వంత కుటుంబ సభ్యులనే సూచిస్తుందని కాదు. రాజకుటుంబంలోని వారి కోసం ఇతర ఉద్యోగుల కొరకు వంటపని ఇతర ఇంటిపనులు చేస్తూ ఇంట్లోనేవుండే పనివారికీ, చిన్న చిన్న రాజోద్యోగులకూ వర్తించవచ్చు.

మీరెలా సమాధానమిస్తారు?

◻ శిష్యరికపు తగులుబడిని లెక్కచూసుకొమ్మని యేసు ఎందుకు తన భావి అనుచరులను కోరాడు?

◻ యూదేతరులలో వ్యాప్తి చెందివున్న దృక్కోణం యూదా జనాంగంపై ఏ ప్రభావాన్ని చూపించింది, దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

◻ నమ్మకమైన తొలి క్రైస్తవులు ఏ మూడు వర్గాల నుండి వ్యతిరేకతను ఎదుర్కున్నారు?

◻ తొలి క్రైస్తవులు ఏ ప్రాథమిక కారణాలను బట్టి రోమన్లచే ‘ద్వేషించబడ్డారు’?

[11వ పేజీలోని బాక్సు]

‘అందరి ఎడల మేలు చేయడం’

‘అందరి ఎడల మేలు చేయమనే’ బైబిలు ఆజ్ఞను అనుసరించడానికి యెహోవాసాక్షులు కృషి చేస్తారు. (గలతీయులు 6:10) తమ మత దృక్కోణాలను పంచుకోని వారికి కూడా వాళ్లు అవసరాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి పొరుగువారి పట్లగల ప్రేమ వారిని పురికొల్పుతుంది. ఉదాహరణకు, 1994లో రువాండలో విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆఫ్రికాకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి యూరప్‌లోని సాక్షులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సహాయాన్ని అందజేయడానికి చక్కగా సంస్థీకరించబడిన శిబిరాలు, తాత్కాలిక ఆసుపత్రులు వెంటనే ఏర్పాటు చేయబడ్డాయి. ఎక్కువ మోతాదులో ఆహారం, వస్త్రాలు, రగ్గులు విమానంలో పంపబడ్డాయి. ఈ సహాయ ప్రయత్నాల నుండి ప్రయోజనం పొందిన శరణార్థుల సంఖ్య ఆ ప్రాంతంలోని సాక్షుల సంఖ్య కంటే మూడింతలు ఎక్కువగా ఉంది.

[9వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దపు క్రైస్తవులు అచంచలమైన ఆసక్తితో సువార్తను ప్రకటించారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి