కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/15 పేజీలు 29-31
  • తీతు—‘మీ విషయంలో జతపనివాడు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తీతు—‘మీ విషయంలో జతపనివాడు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సున్నతిని గూర్చిన వివాదం
  • కొరింథుకు పంపించడం
  • క్రేతు ద్వీపంపై
  • 1 | పక్షపాతం చూపించకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • “ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ఆరోగ్యకరమైన విశ్వాసమును కలిగియుండుము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/15 పేజీలు 29-31

తీతు—‘మీ విషయంలో జతపనివాడు’

తొలి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తేవి. వాటిని పరిష్కరించాల్సి వచ్చేది, దానికి ధైర్యం, విధేయత కావాలి. అలాంటి సవాళ్ళను అనేకసార్లు విజయవంతంగా ఎదుర్కొన్న ఒక వ్యక్తి తీతు. అపొస్తలుడైన పౌలుతోపాటుగా ఆ పనిలో భాగం వహించిన ఒక వ్యక్తిగా ఆయన, యెహోవా మార్గంలో పనిచేసేలా ఇతరులకు సహాయపడేందుకు తీవ్రంగా కృషి చేశాడు. అందుకే తీతు ‘వాళ్ళ విషయములో జతపనివాడు’ అని కొరింథులో ఉన్న క్రైస్తవులకు పౌలు తెలియజేశాడు.—2 కొరింథీయులు 8:23.

ఎవరీ తీతు? సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎలాంటి పాత్రను నిర్వహించాడు? ఆయన నడవడిని పరిశీలించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

సున్నతిని గూర్చిన వివాదం

తీతు సున్నతి పొందని గ్రీకు దేశస్థుడు. (గలతీయులు 2:3)a “అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతు” అని పౌలు ఆయన్ని పిలిచాడు గనుక, తీతు అపొస్తలుని ఆధ్యాత్మిక పిల్లల్లో ఒకరై ఉండవచ్చు. (తీతు 1:4; పోల్చండి 1 తిమోతి 1:2.) సున్నతిని గూర్చిన వివాదం విషయమై చర్చించేందుకు దాదాపు సా.శ. 49లో పౌలు, బర్నబా, సిరియాలోని అంతియొకయ పట్టణం నుండి ఇతరులూ కలిసి యెరూషలేముకు వెళ్లినప్పుడు తీతు కూడా వారితోపాటు ఉన్నాడు.—అపొస్తలుల కార్యములు 15:1, 2; గలతీయులు 2:1.

సున్నతి పొందని అన్యుల మత మార్పిడిని గురించి యెరూషలేములో చర్చ జరుగుతోంది గనుక యూదులూ, యూదేతరులూ సున్నతి పొందినా పొందకపోయినా వాళ్లు దేవుని అనుగ్రహాన్ని పొందగలరని చూపించేందుకు తమతోపాటు తీతును తీసుకువెళ్లినట్టు కనబడుతుంది. క్రైస్తవత్వాన్ని అంగీకరించక ముందు పరిసయ్యులుగావున్న యెరూషలేము సంఘంలోని కొంతమంది సభ్యులు, మతమార్పిడి చేసుకున్న అన్యులు సున్నతి చేయించుకోవాలనీ, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనీ వాదించారుగానీ, ఆ వాదన నిరోధించబడింది. తీతునూ, మరితర అన్యుల్నీ సున్నతి చేయించుకోమని బలవంతం చేయడం, రక్షణ ధర్మశాస్త్రమందలి క్రియల్ని చేయడం మూలంగాకాక యెహోవా దేవుని ఉచిత కృపపైనా, యేసుక్రీస్తునందలి విశ్వాసంపైనా మాత్రమే ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించనట్టు అవుతుంది. అంతేగాక అన్యులు లేదా అన్యజనాంగాలు దేవుని పరిశుద్ధాత్మను పొందారనే రుజువును తిరస్కరించినట్టు అవుతుంది.—అపొస్తలుల కార్యములు 15:5-12.

కొరింథుకు పంపించడం

సున్నతిని గూర్చిన వివాదాంశం పరిష్కరించబడినప్పుడు, అన్య జనాంగాలకు ప్రకటించేందుకు పూర్తి అధికారం పౌలు బర్నబాలకు ఇవ్వబడింది. అదే సమయంలో, బీదలను జ్ఞాపకం చేసుకునేందుకు కూడా వాళ్లు కృషి చేశారు. (గలతీయులు 2:8-10) నిజానికి, దాదాపు ఆరేళ్లు గడిచిపోయిన తర్వాత తీతును గురించి ప్రేరేపిత లేఖనాలు మరలా ప్రస్తావించినప్పుడు, ఆయన పరిశుద్ధుల కోసం చందాను సేకరించడంలో పౌలు ప్రతినిధిగా కొరింథులో ఉన్నాడు. అయితే, తీతు తనకు అప్పగించబడిన ఆ పనిని చేయడానికి వెళ్ళినప్పుడు, తాను ఉద్రిక్తతతో నిండిపోయిన మరో పరిస్థితిలో చిక్కుకున్నాడు.

“జారులతో సాంగత్యము చేయవద్దని” పౌలు కొరింథీయులకు మొదట వ్రాసినట్టు ఆయన వారితో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు చూపిస్తున్నాయి. పశ్చాత్తాపాన్ని చూపించని జారుడ్ని వారి మధ్యనుండి వెలివేయమని వారికి చెప్పాల్సి వచ్చింది. అవును, పౌలు ఒక శక్తివంతమైన ఉత్తరాన్ని ‘ఎంతో కన్నీరు విడుస్తూ’ వ్రాశాడు. (1 కొరింథీయులు 5:9-13; 2 కొరింథీయులు 2:4) ఇదిలా ఉండగా, యూదయలో అవసరమందున్న క్రైస్తవుల కోసం పోగుచేయబడిన చందాల్ని తీసుకురావడానికి సహాయపడేందుకు తీతును కొరింథుకు పంపించారు. పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికకు వాళ్లెలా ప్రతిస్పందించి ఉంటారనే విషయాన్ని కూడా గమనించేందుకు బహుశా ఆయన్ని పంపించి ఉంటారు.—2 కొరింథీయులు 8:1-6.

పౌలు ఇచ్చిన సలహాకు కొరింథీయులు ఎలా ప్రతిస్పందించి ఉంటారు? వారి ప్రతిస్పందనను గురించి తెలుసుకోవాలనే ఆతురతగలవాడై పౌలు వీలైనంత త్వరలో తనకు రిపోర్టు ఇవ్వమని ఆదేశిస్తూ తీతుని, ఎఫెసు నుండి ఏజియన్‌ సముద్రము మీదుగా కొరింథునకు పంపించి ఉండవచ్చు. శీతాకాలంలో (ఇంచుమించుగా నవంబరు మధ్యలో) సముద్రయానాన్ని నిలిపివేయకమునుపే తనకు అప్పగించబడిన ఆ పని పూర్తిచేసినట్లైతే, తీతు ఓడలో త్రోయకు ప్రయాణించి వెళ్లివుండవచ్చు, లేకపోతే హెల్లెస్పాంటు ద్వారా భూమార్గాన చుట్టూ తిరిగైనా వెళ్లి ఉండొచ్చు. వెండి కంసాలులు సృష్టించిన అల్లరి తాను ఉండాలనుకున్న కాలంకన్నా ముందే ఎఫెసు పట్టణాన్ని విడిచిపెట్టేలా చేసింది గనుక పౌలు తాను తీతును కలుసుకోవాలనుకున్న సంకేత స్థలానికి బహుశా ముందుగానే చేరుకొని ఉంటాడు. త్రోయలో ఎంతో ఆతురతతో వేచివున్న పౌలు తీతు సముద్రమార్గం మీదుగా రావటంలేదని గ్రహించాడు. అందుకే, మార్గమధ్యలో అతన్ని కలుసుకోవచ్చనే ఆశతో పౌలు భూమార్గాన ఎదురెళ్లాడు. యూరోపియన్‌ గడ్డపై కాలుమోపగానే, పౌలు వీయా ఎగ్నాటియా రహదారిన వెళ్ళివుంటాడు, ఆయన చివరకు తీతును మాసిదోనియాలో కలుసుకున్నాడు. పౌలుకు ఎంతో ఉపశమనాన్నీ, ఆనందాన్నీ కల్గించేలా, కొరింథునుండి వచ్చిన సమాచారం మంచి సమాచారమే. అపొస్తలుడు ఇచ్చిన సలహాకు సంఘం అనుకూలంగా ప్రతిస్పందించింది.—2 కొరింథీయులు 2:12, 13; 7:5-7.

తన ప్రతినిధి ఎలాంటి ఆహ్వానాన్ని పొందుతాడో అని పౌలు చింతించినప్పటికీ, తనకు అప్పగించిన పనిని నెరవేర్చేలా దేవుడు తీతుకు సహాయంచేశాడు. వాళ్లు “భయముతోను వణకుతోను” తీతును చేర్చుకున్నారు. (2 కొరింథీయులు 7:8-15) డబ్ల్యు. డి. థామస్‌ అనే వ్యాఖ్యానకర్త మాటల్లో ఇలా చెప్పవచ్చు: “పౌలు చేసిన అభిశంసనకున్న తీవ్రతను నీరుగార్చకుండా, కొరింథీయులను నైపుణ్యవంతంగానూ, యుక్తిగానూ [తీతు] వేడుకున్నాడని మనం ఊహించగలం; పౌలు మాట్లాడుతున్నట్టుగానే వారితో మాట్లాడుతూ వారి ఆధ్యాత్మిక సంక్షేమాన్ని మాత్రమే మనస్సులో ఉంచుకున్నాడన్న భరోసాను వారికి ఇచ్చాడు.” ఈ ప్రక్రియలో తీతు కొరింథీయులు చూపించిన విధేయతాపూర్వక స్ఫూర్తినిబట్టీ, వాళ్లు చేసుకున్న అనుకూలమైన మార్పుల్నిబట్టీ వాళ్లను ప్రేమించేలా కదిలించబడ్డాడు. వారి మెచ్చుకోదగిన దృక్పథం అతనికొక ప్రోత్సాహ పూర్వకమైన మూలాన్ని ఇచ్చింది.

కొరింథుకు సంబంధించి తీతుకు అప్పగించబడిన పనికివున్న మరో పార్శ్వం అంటే యూదయలో ఉన్న పరిశుద్ధులకు చందాల్ని సేకరించే పనిని సంస్థీకరించే విషయమేమిటి? తీతు దాన్ని కూడా నెరవేర్చే దిశలోనే పనిచేశాడు, ఆ విషయాన్ని రెండవ కొరింథీయులు పత్రికలో ఉన్న సమాచారాన్నుండి రూఢిపర్చుకోగలం. సా.శ. 55 శరదృతువులో అంటే పౌలు తీతులు కలుసుకున్న తర్వాత వెంటనే, మాసిదోనియా నుండి బహుశా ఆ పత్రికను పౌలు వ్రాసి ఉంటాడు. చందాల్ని పోగుచేయడంలో చొరవ తీసుకున్న తీతు, ఇప్పుడు ఆ పనిని సంపూర్తిచేసేందుకు ఇద్దరు సహాయకులు తోడురాగా మరలా పంపించబడ్డాడని పౌలు వ్రాశాడు. కొరింథీయులపట్ల విశేష ఆసక్తి ఉన్న వ్యక్తిగా తీతు, వారి దగ్గరకు తిరిగి వెళ్లడానికి ఎంతో సుముఖతను చూపించాడు. కొరింథుకు మరలా వెళ్తున్నప్పుడు తీతు, బహుశా పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికను తీసుకొని వెళ్లివుండవచ్చు.—2 కొరింథీయులు 8:6, 17, 18, 22.

తీతు చక్కగా సంస్థీకరించగలిగే వ్యక్తి మాత్రమేగాక, క్లిష్టమైన పరిస్థితుల్లో సున్నితమైన నియామకాల్ని అప్పగించదగిన వ్యక్తి కూడా. ఆయన ధైర్యవంతుడు, పరిణతి గలవాడు, అచంచలమైన వ్యక్తి. కొరింథులోని “మిక్కిలి శ్రేష్ఠులైన . . . అపొస్తలు”లు తీసుకొచ్చే సవాళ్లను వ్యవహరించే సామర్థ్యమున్న వ్యక్తిగా తీతును పౌలు పరిగణించాడు. (2 కొరింథీయులు 11:5) తీతు అవసరమెంతో ఉన్న మరొక నియామకానికి సంబంధించిన సందర్భంలో లేఖనాలయందు మరోసారి ఆయన్ని గూర్చి ప్రస్తావించినప్పుడు ఆ అభిప్రాయం ధృవపర్చబడింది.

క్రేతు ద్వీపంపై

సా.శ. 61 నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యధరా సముద్రంలో ఉన్న ద్వీపమైన క్రేతులో సేవ చేస్తున్న తీతుకు పౌలు దాదాపు అదే కాలంలో పత్రికను వ్రాసివుంటాడు. ‘లోపంగా ఉన్నవాటిని సరిదిద్దేందుకూ,’ ‘ప్రతి పట్టణంలోను పెద్దల్ని నియమించేందుకూ’ పౌలు ఆయన్ని క్రేతులో విడిచిపెట్టాడు. సామాన్యంగా క్రేతీయులకు ‘అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులగు తిండిపోతులు’ అనే పేరుంది. కాబట్టి, తీతు క్రేతులో ధైర్యంగానూ, స్థిరంగానూ పనిచేయాల్సిన అవసరం మరలా ఏర్పడింది. (తీతు 1:5, 10-12) అది ఎంతో బాధ్యతాయుతమైన పని, ఎందుకంటే ఆ ద్వీపంలో క్రైస్తవత్వానికి ఉన్న భవిష్యత్తుని బహుశా అది నిర్ధారించవచ్చు. దైవ ప్రేరణ క్రింద పౌలు భావి పైవిచారణకర్తల్లో ఏ యే లక్షణాల్ని చూడాలో స్పష్టపర్చడం ద్వారా తీతుకు సహాయంచేశాడు. క్రైస్తవ పెద్దల నియామకానికి సంబంధించి ఆ అర్హతల్ని ఇప్పటికీ పరిగణలోనికి తీసుకోవడం జరుగుతోంది.

తీతు క్రేతును ఎప్పుడు విడిచిపెట్టాడనే విషయాన్ని గురించి లేఖనాలు ఏమీ సూచించడంలేదు. జేనాను అపొల్లోనులు తమ ప్రయాణంలో క్రేతునందు కొంతకాలంపాటు ఉన్నారు, అయితే వారెంత కాలంపాటు అక్కడ ఉన్నారనే దాన్ని గురించి వివరాలు తెలియవు. పౌలు వారి అవసరాల్ని తీర్చమని తీతును అడిగాడు గనుక తీతు అక్కడ ఎక్కువకాలమే ఉండి ఉండవచ్చు. కానీ తీతు ఆ ద్వీపంపై మరీ ఎక్కువకాలం లేడు. పౌలు ఆ ద్వీపానికి అర్తెమానైననూ లేదా తుకికునైననూ పంపించాలనీ, ఆపై తీతు తనను నికొపొలిలో అంటే బహుశా వాయవ్య గ్రీసులో ఉన్న నికొపొలి అనే ప్రముఖ పట్టణంలో కలుసుకోవాలనీ అనుకున్నాడు.—తీతు 3:12, 13.

తీతుకు సంబంధించి సంక్షిప్తంగా ఉన్న చివరి బైబిలు లేఖనం నుండి, మనం దాదాపు సా.శ. 65లో పౌలు ఆయనను మరొక నియామకంపై పంపించి ఉంటాడని నేర్చుకుంటాం. ఆయన నేటి క్రోయేషియాలో ఉన్న ఎడ్రియాటిక్‌ సముద్ర తూర్పుప్రాంతమైన దల్మతియకు వెళ్లాడు. (2 తిమోతి 4:10) అక్కడ ఏం చేయడానికి తీతు వెళ్లాడనే విషయం మనకు తెలియదుగానీ అతడు అక్కడి సంఘ వ్యవహారాల్నీ క్రమబద్ధీకరించేందుకూ, మిషనరీ పనిలో భాగంవహించేందుకూ పంపించబడ్డాడని అర్థమౌతుంది. అదే గనుక నిజమైతే, క్రేతు ద్వీపంలో తాను చేసిన సేవలాంటి సేవనే తీతు అక్కడ కూడా చేసివుంటాడు.

తీతులాంటి పరిణతిచెందిన క్రైస్తవ పైవిచారణకర్తలను కల్గివున్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలో గదా! లేఖన సూత్రాల విషయంలో వారికున్న స్పష్టమైన అవగాహనా, వాళ్లు వాటిని ధైర్యంగా అన్వయించడమూ సంఘ ఆధ్యాత్మికతను కాపాడేలా సహాయపడతాయి. మనం వారి మాదిరిని అనుకరించి, మన తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక ఆసక్తుల్ని పెంపొందింపచేయడం ద్వారా మనం తీతు వంటివారమని రుజువుచేసుకుందాము.—హెబ్రీయులు 13:7.

[అధస్సూచీలు]

a తీతు గ్రీసు దేశస్థుడని (హెల్లెన్‌) గలతీయులు 2:3 వచనం వివరిస్తోంది. ఆయన గ్రీకు వంశస్థుడని దాని అర్థమై ఉండవచ్చు. అయినప్పటికీ, భాషాపరంగానూ, సాంస్కృతికపరంగానూ గ్రీకులైన గ్రీకేతరులను సూచించడంలో కొంతమంది గ్రీకు రచయితలు (హెల్లెన్స్‌) అనే బహువచన రూపాన్ని ఉపయోగించారని చెప్పబడుతుంది. ఆ భావంలో తీతు గ్రీసు దేశస్థుడై ఉండే అవకాశముంది.

[31వ పేజీలోని చిత్రం]

కొరింథులోనూ, మరితరచోట్లా ఉన్న క్రైస్తవుల ఆసక్తుల విషయంలో తీతు ధైర్యవంతుడైన జత పనివాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి