సిమనీ విషయమై జాగ్రత్త వహించండి!
సమరయుడైన సీమోను తన సమాజంలో ఎంతగానో కొనియాడబడ్డాడు. అతడు మొదటి శతాబ్దంలో జీవించాడు. అతడు చేసిన గారడీ పనుల్ని చూసి ప్రజలు ఎంతగానో ముగ్ధులై, అతడ్ని గురించి ఇలా చెప్పుకునేవారు: “దేవుని మహాశక్తియనబడిన వాడు ఇతడే.”—అపొస్తలుల కార్యములు 8:9-11.
అయితే, సీమోను బాప్తిస్మం తీసుకున్న ఒక క్రైస్తవుడైన తర్వాత, తాను మునుపు ప్రదర్శించిన దానికన్నా ఎంతో గొప్పదైన ఒక శక్తిని గుర్తించాడు. యేసు అపొస్తలులకు అనుగ్రహించబడి, పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన కృపావరాల్ని ఇతరులకు అనుగ్రహించేలా వారిని శక్తిమంతుల్ని చేసిన శక్తే అది. సీమోను దాన్ని చూసి ఎంతో ప్రభావితుడై, అపొస్తలుల ఎదుట ధనాన్ని పెట్టి, ఇలా అడిగాడు: “నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.”—అపొస్తలుల కార్యములు 8:13-19.
అపొస్తలుడైన పేతురు “నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక. నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యూ కార్యమందు నీకు పాలుపంపులు లేవు” అని చెబుతూ సీమోనును గద్దించాడు.—అపొస్తలుల కార్యములు 8:20, 21.
ఈ బైబిలు వృత్తాంతం నుండి “సీమోను క్రియ” అని అర్థం వచ్చే ఇంగ్లీషు పదం అయిన “సిమనీ” అనే పదం వచ్చింది, అది “చర్చిలోని అధికారాల్నిగానీ, ప్రమోషన్లుగానీ కొనే లేక అమ్మే పాపము” అని నిర్వచించబడింది. ముఖ్యంగా 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకూ “క్రైస్తవ మత మఠాల్లో, మత గురువుల్లో, బిషప్ వర్గాల్లో, అలాగే పోప్ వ్యవస్థల్లోనూ సీమోను క్రియ వ్యాపించిందని” న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా గుర్తిస్తోంది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యొక్క తొమ్మిదవ ఎడిషన్ (1878) ఇలా పేర్కొంటోంది: “పాపల్ రహస్య సమావేశాల చరిత్రను గూర్చిన ఒక అధ్యయనం, రహస్య సమావేశమందు అభ్యసించబడిన సీమోను క్రియ, ఎంతో తీవ్రమైనదిగానూ, అత్యంత సిగ్గుకరమైనదిగానూ, దాచలేనిదిగానూ అనేక సందర్భాల్లో ఉన్నప్పటికీ, సీమోను క్రియ జోక్యంలేకుండా ఏ చర్చి ఎలక్షనూ ఇంతవరకు జరగలేదనే అభిప్రాయాన్ని విద్యార్థికి కలుగజేస్తుంది.”
నిజ క్రైస్తవులు సీమోను క్రియ విషయంలో నేడు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, కొంతమంది తమకు మరిన్ని ఆధిక్యతల్ని కట్టబెట్టగల్గే వారిని ఎక్కువగా పొగడ్తలతోనో లేక బహుమతులతోనో ముంచెత్తవచ్చు. దానికి భిన్నంగా, అలాంటి ఆధిక్యతల్ని ఇవ్వగల్గే స్థానంలో ఉన్నవారు తమకు బహుమతుల్ని ఇవ్వగల్గే, తరచుగా అలా ఇవ్వజూపే వారిపట్ల పక్షపాతాన్ని చూపించవచ్చు. ఆ రెండు పరిస్థితుల్లోనూ సీమోను క్రియ చేరివుంది, అలాంటి క్రియను లేఖనాలు స్పష్టంగా ఖండిస్తున్నాయి. “కాబట్టి యూ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన [“నీ ఈ పన్నాగం,” న్యూ జెరూసలేమ్ బైబిల్] క్షమింపబడవచ్చును; నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని” పేతురు సీమోనుకు ఉద్బోధ చేశాడు.—అపొస్తలుల కార్యములు 8:22, 23.
సంతోషకరంగా, సీమోను తన చెడు కోరికలో చేరివున్న తీవ్రతను చూశాడు. ఆయన అపొస్తలుల్ని ఇలా అర్థించాడు: “మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొను[డి].” (అపొస్తలుల కార్యములు 8:24) ఈ వృత్తాంతంలో ఉన్న ప్రాముఖ్యమైన గుణపాఠాన్ని లక్ష్యపెట్టి, సీమోను క్రియకు సంబంధించిన ఏ కళంకమైన అంటకుండా జాగ్రత్తపడేందుకు యథార్థమైన క్రైస్తవులు కృషిచేస్తారు.