కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 10/1 పేజీలు 28-31
  • ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తూ ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తూ ఉండండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వ్యక్తిగత పఠనం ద్వారా అభివృద్ధి సాధించడం
  • దేవునికి సన్నిహితం కావలసిన అవసరత
  • యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం
  • మీ పరిచర్యలో ఆధ్యాత్మిక అభివృద్ధి
  • పిల్లలారా, యౌవనులారా బాప్తిస్మం తర్వాత ప్రగతి సాధిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • దేవున్ని నిరంతరం సేవించడమే మీ లక్ష్యంగా చేసుకోండి
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ఇంకను అభివృద్ధి చెందుటకు అనుకూలమైన చర్య
    మన రాజ్య పరిచర్య—1992
  • క్రమమైన పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ నడవండి
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 10/1 పేజీలు 28-31

ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తూ ఉండండి!

మనం బాప్తిస్మం తీసుకున్న దినం ఎల్లప్పుడూ విలువైనదిగా ఎంచి గుర్తుంచుకోవలసిన దినం. దేవుని సేవ చేయడానికి మనం సమర్పించుకున్నామన్న విషయాన్ని అందరికీ తెలిసేలాచేసిన దినం అదే.

ఈస్థాయికి చేరుకోవడానికి అంటే దీర్ఘకాలంగా ఉన్న చెడు అలవాట్లను విడిచిపెట్టడానికీ, చెడు సహవాసాలను వదులుకోవడానికీ, ఆలోచనా విధానంలోనూ ప్రవర్తనలోనూ లోతుగా పాతుకుపోయిన విధానాలను మార్చుకోవడానికీ చాలామందికి ఎంతో కృషి అవసరమౌతుంది.

అంతేగాక, ఒక క్రైస్తవుని జీవితంలో బాప్తిస్మమన్నది ఆనందకరమైన, విశేషమైన సంఘటనే అయినప్పటికీ, అది కేవలం ప్రారంభం మాత్రమే. యూదయలోవున్న బాప్తిస్మం పొందిన క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.” (హెబ్రీయులు 6:2) అవును, క్రైస్తవులమైన మనమందరమూ “విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు” ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. (ఎఫెసీయులు 4:13) మనం సంపూర్ణతకు ఎదిగేంతగా అభివృద్ధి సాధించడం ద్వారా మాత్రమే నిజంగా ‘విశ్వాసమందు స్థిరపరచబడతాము.’—కొలొస్సయులు 2:6.

గత కొద్ది సంవత్సరాల్లో, వందల వేలమంది క్రొత్తగా సమర్పించుకున్న ఆరాధకులు క్రైస్తవ సంఘంలోకి వచ్చారు. బహుశ మీరు వారిలో ఒకరై ఉండవచ్చు. మీ మొదటి శతాబ్దపు సహోదరుల్లాగే, మీరు ఆధ్యాత్మికంగా శైశవదశలోనే ఉండిపోవాలని కోరుకోరు. మీరు ఎదగాలనీ, అభివృద్ధి సాధించాలనీ కోరుకుంటారు! కాని ఎలా? మీరు అలాంటి అభివృద్ధి సాధించగల కొన్ని మార్గాలు ఏవి?

వ్యక్తిగత పఠనం ద్వారా అభివృద్ధి సాధించడం

పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీయులు 1:9) “అనుభవజ్ఞానము”లో ఎదగడం మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆవశ్యకం. ‘యెహోవా దేవుని గురించిన యేసుక్రీస్తును గురించిన జ్ఞానాన్ని పొందడమన్నది’ కొనసాగే ప్రక్రియ, అది బాప్తిస్మం తర్వాత ఆగిపోయే చర్యకాదు.—యోహాను 17:3.

ఒక క్రైస్తవ సహోదరి—మనం ఆమెను అలెక్సాండ్ర అని పిలుద్దాం, ఆమె 16 ఏళ్ల వయస్సులో బాప్తిస్మం తీసుకుంది, అయితే పైన చెప్పబడిన విషయాన్ని ఆమె తాను బాప్తిస్మం తీసుకున్న పదేళ్ల తర్వాత గుర్తించింది. ఆమె సత్యంలోనే పెరిగింది, ఆమె క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరై, ప్రకటన పనిలో భాగం వహించేది. ఆమె ఇలా వ్రాస్తోంది: “గత కొద్ది నెలల్లో, ఏదో సరిగ్గా లేదని నేను గుర్తించాను. సత్యం పట్ల నా ఉద్దేశం ఏమైవున్నదీ, నేను ఇప్పటికీ సత్యంలోనే ఎందుకున్నాను అనే విషయాల గురించి నన్ను నేను కఠినంగా, యథార్థంగా పరిశీలించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను.” ఆమె ఏమి కనుగొన్నది? ఆమె ఇలా కొనసాగిస్తోంది: “నేను సత్యంలోనే ఉండడానికి గల కారణాలు నాకు కలవరాన్ని కలిగిస్తున్నట్లు నేను కనుగొన్నాను. నేను ఎదుగుతుండగా కూటాల గురించి, ప్రాంతీయ సేవ గురించి నొక్కి చెప్పబడిందని నేను గుర్తు తెచ్చుకున్నాను. వ్యక్తిగత పఠనం, ప్రార్థన వాటంతటవే ఎలాగోలా వాటి స్థానంలో ఉంటాయనిపించేది. కాని నేను నా పరిస్థితిని విశ్లేషించుకున్నప్పుడు, అలా జరగలేదని నేను గుర్తించాను.”

అపొస్తలుడైన పౌలు ఇలా పురికొల్పుతున్నాడు: “ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే [“మనం సాధించిన అభివృద్ధిని అనుసరించి,” NW] క్రమముగా నడుచుకొందము.” (ఫిలిప్పీయులు 3:16) అలా క్రమముగా నడుచుకోవడం అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. మీరు బాప్తిస్మం తీసుకోక ముందు యోగ్యుడైన బోధకుడు నిస్సందేహంగా వారం వారం మీతో క్రమంగా బైబిలు పఠనం చేసేవాడు. మీకు మెప్పుదల పెరుగుతుండగా, మీరు ప్రతి వారం పాఠం కోసం, అందులో ఇవ్వబడిన లేఖనాలను బైబిల్లో చూస్తూ అలా క్రమంగా సిద్ధపడేవారు. ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకున్నారు గనుక, అలాగే “క్రమముగా నడుచు” కోవడంలో కొనసాగుతున్నారా?

అలా కానట్లయితే, మీరు ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచిస్తూ,’ మీ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవలసిన అవసరత ఉండవచ్చు. (ఫిలిప్పీయులు 1:10) తీరికలేని మన జీవితాల్లో, వ్యక్తిగతంగా బైబిలు చదవడానికీ, పఠించడానికీ సమయాన్ని వెచ్చించేందుకు స్వయం-నియంత్రణ అవసరం. కాని దాని వల్ల వచ్చే ప్రయోజనాలు కృషికి తగినవే. మళ్లీ అలెక్సాండ్రా అనుభవాన్ని పరిశీలించండి. “నేను గత 20 లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాలుగా కేవలం కూటాలకు వెళ్తూ, ప్రాంతీయ సేవలో భాగం వహిస్తూ మాత్రమే సత్యములో ఉన్నానని నేను చెప్పవలసిందే” అని ఆమె అంగీకరిస్తోంది. అయితే, ఆమె ఇంకా ఇలా కొనసాగిస్తోంది: “ఈ విషయాలు ప్రాముఖ్యమైనవే అయినప్పటికీ, పరిస్థితులు కష్టసాధ్యమైనవిగా తయారౌతున్నప్పుడు అవి మాత్రమే నన్ను బలపర్చలేవనే ముగింపుకు నేను వచ్చాను. వ్యక్తిగతంగా పఠించే అలవాటు నాకు అసలు లేనందుకే, నా ప్రార్థనలు క్రమరహితంగా పైపైకి చేసేవిగా ఉన్నందుకే పరిస్థితి ఇలా పరిణమించింది. నేను నా ఆలోచనా విధానాన్ని సరిచేసుకుని, యెహోవాను నేను నిజంగా తెలుసుకుని ఆయనను ప్రేమించగలిగేలా, ఆయన కుమారుడు మనకు ఇచ్చినదాని పట్ల మెప్పు చూపించగలిగేలా నేను అర్థవంతమైన పఠన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిన అవసరత ఉందని నేను ఇప్పుడు గుర్తించాను.”

వ్యక్తిగత పఠనానికి సంబంధించి ప్రయోజనకరమైన క్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీకు సహాయం అవసరమైతే, మీ సంఘంలోని పెద్దలు, పరిణతి చెందిన ఇతర క్రైస్తవులు మీకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. అదనంగా, కావలికోట మే 1, 1995; ఆగస్టు 15, 1993; మే 15, 1986 (ఆంగ్లం) సంచికల్లో కనిపించే శీర్షికల్లో సహాయకరమైన అనేక సూచనలున్నాయి.

దేవునికి సన్నిహితం కావలసిన అవసరత

మీరు అభివృద్ధి సాధించడానికి కృషి చేయవలసిన మరో అంశం ఏమిటంటే, దేవునితో మీకుగల సంబంధం. కొందరి విషయంలో దీనికి సంబంధించి తీవ్రమైన అవసరత కూడా ఉండవచ్చు. చిన్నవయస్సులోనే బాప్తిస్మం తీసుకున్న ఆంథోనీని పరిశీలించండి. ఆయనిలా చెబుతున్నాడు, “మా కుటుంబంలో బాప్తిస్మం తీసుకున్న పిల్లల్లో నేనే మొదటివాడిని. నేను బాప్తిస్మం తీసుకున్న వెంటనే మా అమ్మ నన్ను ప్రేమగా హత్తుకుంది. ఆమె అంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎంతో ఆనందం కలిగింది, నాకు చాలా బలం వచ్చినట్లు అనిపించింది.” అయితే దీనికి మరో కోణం ఉంది. ఆంథోని ఇలా కొనసాగిస్తున్నాడు, “కొంతకాలంపాటు మా సంఘంలో యౌవనస్థులెవరూ బాప్తిస్మం తీసుకోలేదు. కాబట్టి నా గురించి నేనెంతో గర్వపడ్డాను. నేను సంఘాల్లో చేసే వ్యాఖ్యానాలను బట్టి, నేను ఇచ్చే ప్రసంగాలను బట్టి నేనెంతో గర్వించేవాడిని. యెహోవాకు ఘనత తేవడం కంటే ప్రజల మెప్పును అంగీకారాన్ని పొందడం నాకు ఎక్కువ ప్రాముఖ్యమైనదై పోయింది. నాకు యెహోవాతో నిజంగా సన్నిహితమైన సంబంధం లేదు.”

ఆంథోనిలా, కొంతమంది యెహోవాను ప్రీతిపర్చడం కంటే ఎక్కువగా ఇతరులను ప్రీతిపర్చాలనే కోరికతో సమర్పించుకుని ఉండవచ్చు. అయినప్పటికీ, దేవుని సేవ చేస్తామని తాము చేసిన వాగ్దానానికి వారు కట్టుబడి ఉండాలని దేవుడు నిరీక్షిస్తాడు. (ప్రసంగి 5:4 పోల్చండి.) అయితే దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోవడంతో తరచూ వారికి అలా చేయడం కష్టమౌతుంది. ఆంథోని ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నా బాప్తిస్మం సమయంలో నాకు కలిగిన అత్యధికమైన ఆనందం చాలా తక్కువ కాలంపాటు మాత్రమే నిలిచింది. నేను బాప్తిస్మం తీసుకుని సంవత్సరం కూడా గడవక ముందే నేను గంభీరమైన తప్పిదంలో చిక్కుకోవడంతో సంఘ పెద్దలు నన్ను గద్దించవలసి వచ్చింది. నేను పదే పదే తప్పు చేయడంతో నన్ను సంఘం నుండి బహిష్కరించవలసి వచ్చింది. నేను యెహోవాకు సమర్పించుకున్న ఆరు సంవత్సరాల తర్వాత, నేను హత్య చేసినందుకు అరెస్టయి జెయిల్లో వేయబడ్డాను.”

యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం

మీ స్వంత పరిస్థితి ఏదైనప్పటికీ, క్రైస్తవులందరూ బైబిలు ఇస్తున్న ఈ ఆహ్వానానికి ప్రతిస్పందించవచ్చు: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:8) మీరు మొదట బైబిలు పఠించినప్పుడు దేవునితో కొంతమేరకు సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నారనడంలో సందేహం లేదు. దేవుడు క్రైస్తవమత సామ్రాజ్యంలో ఆరాధించబడే నిగూఢమైన దైవం కాదు గాని యెహోవా అనే నామం గల వ్యక్తి అని మీరు తెలుసుకున్నారు. ఆయనకు ఆకర్షణీయమైన లక్షణాలు ఉన్నాయనీ, ఆయన “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవు[డనీ]” కూడా మీరు తెలుసుకున్నారు.—నిర్గమకాండము 34:6.

అయితే దేవుని సేవ చేయాలనే మీ సమర్పణకు తగినట్లు మీరు జీవించాలంటే, మీరు ఆయనకు మరింత సన్నిహితమవ్వాలి ! ఎలా? కీర్తనల గ్రంథకర్త ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము; నీత్రోవలను నాకు తేటపరచుము.” (కీర్తన 25:4) బైబిలును, సంస్థ ప్రచురణలను వ్యక్తిగతంగా పఠించడం యెహోవాను మరింతగా తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. క్రమంగా హృదయపూర్వకంగా ప్రార్థించడం కూడా ప్రాముఖ్యం. “ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి” అని కీర్తనల గ్రంథకర్త కోరుతున్నాడు. (కీర్తన 62:8) మీ ప్రార్థనలకు సమాధానం లభిస్తున్నట్లు మీరు కనుగొంటే, దేవునికి మీ పట్లగల వ్యక్తిగత ఆసక్తిని మీరు గ్రహించగల్గుతారు. ఆయనకు మీరు సన్నిహితంగా ఉన్నారని మీరు భావించడానికి మీకు సహాయం చేస్తుంది.

శ్రమలు, సమస్యలు దేవునికి సన్నిహితమవ్వడానికి మరో అవకాశాన్నిస్తాయి. మీరు అనారోగ్యం, పాఠశాలలోను పనిస్థలంలోను ఉండే ఒత్తిళ్లు, లేదా ఆర్థిక సమస్యలు వంటి సవాళ్లను, విశ్వాస పరీక్షలను మీరు ఎదుర్కోవచ్చు. పరిచర్యలో పాల్గొనడం, కూటాలకు హాజరు కావడం, లేక మీ పిల్లలతో బైబిలు పఠించడం వంటి సాధారణ దైవపరిపాలనా కార్యకలాపాలు కూడా మీకు కష్టం కావచ్చు. అలాంటి సమస్యలను ఒంటరిగా ఎదుర్కోకండి ! దేవుని నడిపింపు నిర్దేశనాల కోసం అడుగుతూ ఆయన సహాయాన్ని అర్థించండి. (సామెతలు 3:5, 6) ఆయన పరిశుద్ధాత్మ కోసం ఆయనను వేడుకోండి ! (లూకా 11:13) మీరు దేవుని ప్రేమపూర్వక సహాయాన్ని అనుభవిస్తుండగా, మీరు ఆయనకు మరింత సన్నిహితమౌతారు. కీర్తనల గ్రంథకర్త చెబుతున్నట్లుగా, “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయంచు నరుడు ధన్యుడు.”—కీర్తన 34:8.

ఆంథోని సంగతేమిటి? ఆయనిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, “యెహోవా చిత్తాన్ని చేయడంపై కేంద్రీకరించబడిన అనేక ఆధ్యాత్మిక లక్ష్యాలను నేను కలిగివున్నప్పటి సమయం గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇది ఎంతో బాధాకరంగా ఉంది. కాని బాధ నిరాశ అంతటిలో నేను యెహోవా ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను. నేను యెహోవాకు ప్రార్థన చేయగల్గడానికి కొంతసమయం పట్టింది, కాని నేను చివరికి ప్రార్థించాను, నన్ను క్షమించమని అడుగుతూ ఆయన ఎదుట నా హృదయాన్ని కుమ్మరించాను, నేను బైబిలు చదవడం కూడా మొదలుపెట్టి, నేను ఎంత మరిచిపోయానో, నిజంగా నాకు యెహోవా గురించి ఎంత తక్కువ మాత్రమే తెలుసో గ్రహించి ఆశ్చర్యపోయాను.” ఆంథోని తాను చేసిన నేరానికి శిక్ష అనుభవించవలసి వచ్చినప్పటికీ, ఆయన స్థానిక సాక్షుల నుండి సహాయాన్ని పొందుతూ, ఆధ్యాత్మికంగా కోలుకుంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా, ఆంథోని ఇలా చెబుతున్నాడు: “యెహోవా మూలంగా, ఆయన సంస్థ మూలంగా నేను పాత వ్యక్తిత్వాన్ని విసర్జించగలిగాను, నూతన వ్యక్తిత్వాన్ని ధరించడానికి ప్రతిరోజు నేను కృషి చేస్తున్నాను. నాకిప్పుడు అత్యంత ప్రాముఖ్యమైనది యెహోవాతో నాకున్న సంబంధమే.”

మీ పరిచర్యలో ఆధ్యాత్మిక అభివృద్ధి

“రాజ్య సువార్త” ప్రచారకులై ఉండాలని యేసుక్రీస్తు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 24:14) మీరు సువార్త ప్రకటించడం ఈ మధ్యనే ప్రారంభించిన వ్యక్తిగా, పరిచర్యలో మీ అనుభవం పరిమితమైనదై ఉండవచ్చు. అయితే మరి, ‘సువార్తికుని పని చేయడంలో’ మీరు ఎలా అభివృద్ధి సాధించవచ్చు?—2 తిమోతి 4:5.

ఒక మార్గం ఏమిటంటే అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం. ప్రకటన పనిని ఒక “ఐశ్వర్యము”గా, ఒక ఆధిక్యతగా దృష్టించడం నేర్చుకోండి. (2 కొరింథీయులు 4:7) యెహోవా అంటే మనకుగల ప్రేమ, యథార్థత, విశ్వాస్యతలను ప్రదర్శించడానికి అది ఒక అవకాశం. మన పొరుగువారి పట్ల శ్రద్ధను ప్రదర్శించడానికి కూడా అది అనుమతిస్తుంది. ఈ విషయంలో నిస్వార్థంగా మనల్ని మనం ఇచ్చివేసుకోవడం నిజమైన సంతోషానికి మూలం కాగలదు.—అపొస్తలుల కార్యములు 20:35.

ప్రకటించడం గురించి యేసు కూడా అనుకూలమైన దృక్పథాన్ని కల్గివుండేవాడు. ఇతరులతో బైబిలు సత్యాలను పంచుకోవడం ఆయనకు “ఆహారమై” ఉండేది. (యోహాను 4:34) ఇతరులకు సహాయం చేయడానికి ఆయనకు కల్గిన ప్రేరేపణను ఆయన మాటల్లోనే చక్కగా ఇలా ఒక్కమాటలో చెప్పవచ్చు, “నాకిష్టమే.” (మత్తయి 8:3) యేసుకు ప్రజలంటే కనికరం ఉంది, ప్రాముఖ్యంగా సాతాను లోకం మూలంగా “విసికి చెదరియున్న” వారంటే కనికరం ఉంది. (మత్తయి 9:35, 36) ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉండి దేవుని వాక్య జ్ఞానం అవసరమైన వారికి సహాయం చేయడం మీకూ ‘ఇష్టమేనా’? అయితే, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు ప్రతిస్పందించడానికి మీరు పురికొల్పబడతారు. (మత్తయి 28:19) వాస్తవానికి, మీ ఆరోగ్యం మరియు పరిస్థితులు అనుమతించినంత మేరకు మీరు మీకు సాధ్యమైనంత పూర్తిగా ఈ పనిలో భాగం వహించడానికి మీరు పురికొల్పబడతారు.

అభివృద్ధి సాధించడానికి మరో కీలకం ఏమిటంటే, సాధ్యమైతే ప్రతివారం పరిచర్యలో క్రమంగా భాగం వహించడం. అలా చేయడం, కేవలం అప్పుడప్పుడూ మాత్రమే ప్రకటించే వారికి కలిగే భయాన్ని భీతిని తగ్గించుకోవడానికి సహాయం చేయగలదు. ప్రాంతీయ పరిచర్యలో క్రమంగా పాల్గొనడం ఇతర విధాల్లో కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అది సత్యం పట్ల మీకుగల మెప్పును అధికం చేసి, యెహోవా పట్ల పొరుగువారి పట్ల మీకుగల ప్రేమను వృద్ధి చేసి, రాజ్య నిరీక్షణపైనే దృష్టిని కేంద్రీకరించడానికి మీకు సహాయం చేస్తుంది.

అయితే మీ ప్రస్తుత పరిస్థితి మీరు ప్రకటనాపనిలో పాల్గొనడాన్ని ఎంతగానో పరిమితం చేస్తుంటే అప్పుడేమిటి? మార్పులు చేసుకోవడం ఎంతమాత్రం వీలు కానట్లయితే, మీరు ఎంత చేయగల్గినప్పటికీ అది మీరు పూర్ణాత్మతో చేసే సేవ అయినప్పుడు దేవుడు దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తాడని తెలుసుకుని ఓదార్పు పొందండి. (మత్తయి 13:23) మీరు మీ ప్రకటనా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి చేయడం ద్వారా బహుశ మీరు ఇతర విషయాల్లో అభివృద్ధి సాధించవచ్చు. సంఘంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటం ఈ విషయంలో ఎంతో చక్కని తర్ఫీదును అందజేస్తాయి. సహజంగానే, పరిచర్యలో మనం ఎంత సమర్థవంతంగా ఉంటే, అంత ఎక్కువగా మనం అందులో ఆనందిస్తాము, ఫలితాలను చూడగల్గుతాము.

ఆధ్యాత్మిక అభివృద్ధి మనం బాప్తిస్మం తీసుకున్న దినంతోనే ఆగిపోకూడదన్నది స్పష్టమౌతుంది. పరలోకంలో అమర్త్యమైన జీవితాన్ని పొందడమనే తన నిరీక్షణను గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయతే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలుపరచును.”—ఫిలిప్పీయులు 3:13-15.

అవును, మన నిరీక్షణ పరలోకంలో అమర్త్యజీవితమైనా లేక పరదైసు భూమి మీద నిత్యజీవమైనా క్రైస్తవులందరూ ఆ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ‘వేగిరపడుచు . . . గురియొద్దకే పరుగెత్తాలి’ అంటే సూచనార్థకంగా చెప్పాలంటే ఎంతో కృషి చేయాలి ! మీ బాప్తిస్మం చక్కని ప్రారంభమే, కాని అది కేవలం ప్రారంభం మాత్రమే. ఆధ్యాత్మిక ఆభివృద్ధి సాధించడానికి కృషి చేయడం కొనసాగించండి. కూటాల ద్వారా, వ్యక్తిగత పఠనం ద్వారా “బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.” (1 కొరింథీయులు 14:20) సత్యము యొక్క “వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించ” గలిగేలా ఉండండి. (ఎఫెసీయులు 3:18) మీరు సాధించే అభివృద్ధి మీరు ఇప్పుడు మీ ఆనందాన్ని సంతోషాన్ని కాపాడుకోవడానికే కాకుండా, దేవుని నూతన లోకంలో సురక్షితమైన స్థానాన్ని పొందడానికి కూడా మీకు సహాయం చేస్తుంది, దేవుని నూతన లోకంలో ఆయన పరలోక రాజ్య పరిపాలన క్రింద మీరు నిరంతరం అభివృద్ధి సాధించగల్గుతారు!

[29వ పేజీలోని చిత్రం]

వ్యక్తిగత పఠనం కోసం సమయాన్ని సంపాదించుకోవడానికి క్రమశిక్షణ అవసరమౌతుంది

[31వ పేజీలోని చిత్రం]

అనుకూలమైన దృక్పథం కల్గివుండడం పరిచర్యలో ఆనందాన్ని పొందడానికి మీకు సహాయం చేయగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి