నేను బంగారం కంటే శ్రేష్ఠమైనదాన్ని కనుగొన్నాను
చార్లెస్ మిల్టన్ చెప్పినది
ఒక రోజు నాన్నిలా అన్నారు: “మనం చార్లీని అమెరికాకు పంపిద్దాం, అక్కడైతే డబ్బు చెట్లకు కాస్తుంది. వాడు కొంత సంపాదించి మనకు పంపగల్గుతాడు!”
ఎందుకంటే అమెరికా పురవీధుల్లో బంగారం పరిచి ఉంటుందని ప్రజలు నమ్మేవారు. ఆ రోజుల్లో తూర్పు యూరపులో జీవితం ఎంతో దుర్భరంగా ఉండేది. నా తల్లిదండ్రులకు చిన్న పొలం ఉండేది, కొన్ని ఆవులను కోళ్లను పెంచుకునేవాళ్లం. మాకు ఇంట్లో విద్యుచ్ఛక్తిగాని నీటి పంపు సౌకర్యం గాని ఉండేవి కావు. అయితే, మా చుట్టుప్రక్కల ఉన్నవాళ్లెవరికీ కూడా లేవనుకోండి.
నేను 1893 జనవరి 1న అంటే దాదాపు 106 సంవత్సరాల క్రితం, హోసోచెక్‌లో జన్మించాను. మా గ్రామం గలీస్యలో ఉండేది, అది అప్పట్లో ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యంలో ఒక భాగమై ఉండేది. ఇప్పుడు హోసోచెక్ తూర్పు పోలాండ్‌లో అంటే స్లోవేకియా, యుక్రెయిన్‌లకు దగ్గరలో ఉంది. అక్కడ చలికాలాల్లో చలి విపరీతంగా ఉండి, మంచు బాగా కురిసేది. నాకు ఏడేళ్లున్నప్పుడు, నేను దాదాపు అరకిలోమీటరు దూరంలో ఉన్న చిన్ననది దగ్గరికి నడిచి వెళ్లి నీళ్ల కోసం, గడ్డకట్టిన మంచు మీద గొడ్డలితో రంధ్రం చేసేవాడిని. అలా నేను తెచ్చే నీళ్లను అమ్మ వంట చేయడానికి శుభ్రం చేయడానికి ఉపయోగించేది. ఆ చిన్ననది దగ్గరే అమ్మ బట్టలుతికేది, పెద్ద పెద్ద ఐసు బండల మీదే బట్టలను ఉతికేది.
హోసోచెక్‌లో స్కూళ్లు ఉండేవి కావు, అయినా నేను పోలిష్, యుక్రేనియన్, రష్యన్, స్లోవేకియన్ భాషలు మాట్లాడడం నేర్చుకున్నాను. మేము గ్రీకు ఆర్థడాక్సులుగా పెరిగాము, నేను ఆల్టర్ బాయ్‌గా సేవ చేసేవాడిని. కాని ఆ చిన్న వయస్సులోనే, శుక్రవారం రోజున మాంసం తినకూడదని చెబుతూ తామే అలా తినే ప్రీస్టులను చూసి నేను చాలా కలవరపడేవాడిని.
మా స్నేహితులు కొంతమంది అమెరికాలో ఉద్యోగాలు చేసి, ఇళ్లను తిరిగి చక్కగా కట్టుకోవడానికీ, పొలం పనులకు అవసరమైన సామాగ్రిని కొనుక్కోవడానికీ కావలసినంత డబ్బుతో తిరిగి వచ్చారు. మరోసారి అక్కడికి వెళ్ళడానికి పథకాలు వేసుకుంటున్న పొరుగువారితో పాటు నన్ను అమెరికాకు పంపడం గురించి మాట్లాడేలా నాన్నగారిని ప్రేరేపించిందదే. అది నాకు 14 ఏళ్లున్నప్పుడు అంటే 1907లో జరిగింది.
అమెరికాలో తప్పిపోవడం
త్వరలోనే ఒక ఓడలో బయల్దేరిన మేము రెండు వారాల తర్వాత అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాము. ఆ సమయంలో, మీ దగ్గర 20 డాలర్లు ఉండాలి, లేకపోతే వాళ్లు మిమ్మల్ని తిరిగి మీ స్వదేశానికి పంపేస్తారు. నాదగ్గర 20 డాలర్ల వెండి నాణెం ఉంది, కాబట్టి అమెరికాకు ముఖ ద్వారమైన న్యూయార్క్‌లోని ఇల్లిస్ ద్వీపాన్ని దాటి రాగలిగిన లక్షలాది మందిలో నేను ఒకడినయ్యాను. నిజానికి అక్కడ డబ్బు చెట్లకేమి కాయడం లేదు, పురవీధుల్లో బంగారం రాసులుగా పోసిలేదు. వాస్తవానికి చాలా పురవీధులు ఎంతో అధ్వాన్నంగా ఉండేవి !
పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌కు వెళ్లడానికి మేము ఒక ట్రెయిన్ ఎక్కాము. నాతో వచ్చిన వారు మునుపు అక్కడికి వచ్చినవారు కాబట్టి నేను ఉండడానికి ఒక బోర్డింగ్ హౌస్‌ను చూశారు. పెన్సిల్వేనియాలోని జెరోమ్‌లో ఉన్న మా అక్కను వెతికిపట్టుకోవాలన్నది నా ఉద్దేశం, అది అక్కడికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉందని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. కాని నేను జెరోమ్ అనడానికి బదులు యెరోమ్ అనేవాడిని ఎందుకంటే మా స్వభాషలో జె అనే అక్షరం యె అన్నట్లుగా ఉచ్చరించబడుతుంది. యెరోమ్ గురించి ఎవరికీ తెలియదు, కాబట్టి చేతిలో ఎక్కువ డబ్బు లేకుండా అంతగా ఇంగ్లీషు రాని నేను ఆ పరాయి దేశంలో అలా ఒంటరిగా మిగిలిపోయాను.
ప్రతి ఉదయం నేను పనికోసం వెదికేవాడిని. ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ దగ్గర బారులు తీరి నిలబడిన అసంఖ్యాకుల్లో కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే పని దొరికేది. అందుకని స్వయం-సహాయక పుస్తకాల సహాయంతో ఇంగ్లీషు నేర్చుకోవడానికి నేను ప్రతి రోజు ఇంటికి తిరిగి వచ్చేసేవాడిని. అప్పుడప్పుడు ఏదైనా పని దొరికేది, కాని నెలలు దొర్లిపోతున్నాయి, నా దగ్గరున్న డబ్బంతా అయిపోవచ్చింది.
తోబుట్టువులను తిరిగి కలవడం
ఒకరోజు నేను రైల్వే స్టేషన్ దగ్గరున్న బార్ హోటల్ ముందు నుండి నడిచి వెళ్తున్నాను. అక్కడ తిను బండారాల వాసన ఘుమఘుమ లాడుతోంది ! ఆ బార్‌లో ఎవరైనా బీరు కొంటే సాండ్‌విచ్‌లు, హాట్‌డాగ్‌లు ఇతర తిను బండారాలు ఉచితంగా ఇస్తారు, ఒక పెద్ద గ్లాసుడు బీరు ధర ఐదు సెంట్లు ఉంటుంది. నాకు బీరు కొనుక్కోగల వయస్సు లేకపోయినప్పటికీ ఆ బార్‌లో పని చేస్తున్న వ్యక్తి నా మీద జాలిపడి నాకు బీరు అమ్మాడు.
నేను తింటుండగా, కొంతమంది లోపలికి వచ్చి, “త్వరగా త్రాగేయ్యి! జెరోమ్‌కు వెళ్లే ట్రెయిన్ వస్తోంది” అన్నారు.
“యెరోమ్‌కా?” అని అడిగాను నేను.
“కాదు. జెరోమ్‌కు,” అని వాళ్లు సమాధానమిచ్చారు. మా అక్కయ్య ఎక్కడ నివసిస్తుందో నాకు అప్పుడే తెలిసింది. నిజానికి, ఆమె ఉండే ఇంటి నుండి మూడు ఇళ్ల అవతల నివసించే వ్యక్తిని నేను ఆ బార్‌లోనే కలిశాను! కాబట్టి నేను ట్రెయిన్ టికట్టు కొనుక్కుని, చివరికి మా అక్కయ్యను కలుసుకున్నాను.
మా అక్కయ్యా బావగారూ బొగ్గు గనుల్లో పని చేసేవారి కోసం బోర్డింగ్ హౌస్ నడిపేవారు, నేను వారి దగ్గరే ఉండిపోయాను. వాళ్లు నాకొక ఉద్యోగం సంపాదించి పెట్టారు అదేమిటంటే, బొగ్గు గనిలో నుండి నీళ్లను తోడే బోరింగ్ పంపును నేను చూసుకుంటూ ఉండాలి. బోరింగ్ పంపు పని చేయడం ఆగిపోతే నేను వెళ్లి మెకానిక్కును తీసుకురావాలి. దానికి నాకు రోజుకు 15 సెంట్లు ఇచ్చేవారు. తర్వాత నేను రైల్వే కంపెనీలోనూ, ఇటుకల బట్టీలోనూ పని చేశాను, చివరికి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూడా పనిచేశాను. తర్వాత నేను పిట్స్‌బర్గ్‌కు వెళ్లాను, అక్కడ మా అన్నయ్య స్టీవ్ నివసించేవాడు. అక్కడ మేము స్టీల్ మిల్లుల్లో పని చేశాము. నేనెప్పుడూ ఇంటికి పంపించగలిగేంత డబ్బు సంపాదించనేలేదు.
కుటుంబం, అంత్యక్రియలు
ఒక రోజు పనికి వెళుతూ, ఒక ఇంటి గుమ్మం ముందు నిలుచున్న ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి ఆ ఇంట్లో పనిచేస్తుంది. ‘భలే అందంగా ఉందే’ అనుకున్నాను నాలో నేను. మూడు వారాల తర్వాత 1917లో నేను హెలెన్ వివాహం చేసుకున్నాము. తర్వాతి పది సంవత్సరాల్లో మాకు ఆరుగురు పిల్లలు కలిగారు, వారిలో ఒక అబ్బాయి పసివాడిగా ఉన్నప్పుడే చనిపోయాడు.
1918లో నేను పిట్స్‌బర్గ్ రైల్వే కంపెనీలో స్ట్రీట్‌కార్ డ్రైవర్‌గా పనికి కుదిరాను. స్ట్రీట్‌కార్ బార్న్ దగ్గర ఒక కేఫ్ ఉండేది అందులో కాఫీ దొరికేది. దాని ఇద్దరు యజమానులైన గ్రీకు వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఆర్డరిస్తే ముందు వాళ్లకు బైబిలు గురించి చెప్పిగాని ఆర్డరిచ్చినది తెచ్చివ్వరు. “మొత్తం ప్రపంచం చెప్పేదంతా తప్పు, కేవలం మీరు ఇద్దరు చెప్పేదే సరియైనదని మీ ఉద్దేశమా?” అని నేను అనేవాడిని.
“బైబిల్లో చూసుకో!” అనేవారు వాళ్లు. కాని ఆ సమయంలో వాళ్లు నన్ను ఒప్పించలేకపోయారు.
దుఃఖకరంగా, 1928లో నా ప్రియమైన హెలెన్ రోగగ్రస్థురాలయ్యింది. పిల్లల గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను వాళ్లను జెరోమ్‌లో మా అక్కయ్య బావగార్ల దగ్గర ఉంచాను. ఆ సమయానికల్లా వాళ్లొక పొలం కొన్నారు. నేను తరచూ పిల్లల దగ్గరికెళ్ళి చూసి వచ్చేవాడిని, ప్రతి నెలా వాళ్ల తిండిఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నేను వాళ్లకు బట్టలు కూడా పంపేవాడిని. విచారకరంగా, హెలెన్ పరిస్థితి క్షీణించిపోవడంతో ఆమె 1930 ఆగస్టు 27న చనిపోయింది.
నేను ఒంటరి వాడినైపోయి, కృంగిపోయాను. అంత్యక్రియల ఏర్పాట్లు చేయడానికి నేను ప్రీస్టు దగ్గరికి వెళ్లినప్పుడు, ఆయనిలా అన్నాడు: “నీవిక ఎంత మాత్రం ఈ చర్చికి చెందవు. సంవత్సరంపైగా నీవు చందాలు కట్టనేలేదు.”
నా భార్య చాలా కాలంగా రోగగ్రస్థురాలై ఉందనీ, అదనంగా ఉన్న డబ్బును నా పిల్లలు జెరోమ్‌లోని చర్చిలో చందా వేసేలా వారికిచ్చాననీ నేను వివరించాను. అయినా, ప్రీస్టు అంత్యక్రియలు చేయడానికి అంగీకరించే ముందు, నేను నా పాతబాకీ చందాలు కట్టడానికి 50 డాలర్లు అప్పు తీసుకోవలసి వచ్చింది. హెలెన్‌కు నివాళులర్పించడానికి ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు ఆమె అక్కగారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మాస్ చెప్పడానికి కూడా ప్రీస్టు మరో 15 డాలర్లు కావాలన్నాడు. నేను ఆ 15 డాలర్లు ఇవ్వలేకపోయాను, కాని నాకు జీతం వచ్చాక ఇస్తానని చెప్పడంతో ఆ ప్రీస్టు మాస్ చెప్పడానికి ఒప్పుకున్నాడు.
జీతం వచ్చినప్పుడు ఆ డబ్బును పిల్లల స్కూల్ షూ, బట్టలూ కొనడానికి ఖర్చు చేయవలసి వచ్చింది. రెండు వారాల తర్వాత, ప్రీస్టు నా స్ట్రీట్ కార్ ఎక్కాడు. “నువ్వు నాకిప్పటికీ 15 డాలర్లు అప్పు ఉన్నావు” అన్నాడాయన. తన స్టాప్ దగ్గర ఆయన దిగిపోయేటప్పుడు, ఆయనిలా బెదిరించాడు: “నేను నీ బాస్ దగ్గరికెళ్లి నీ జీతంలో నుండి ఆ డబ్బు తీసేసుకుంటాను.”
పని అయిపోయాక నేను నా సూపర్‌వైజర్ దగ్గరికెళ్లి ఏమి జరిగిందో అంతా చెప్పాను. ఆయన క్యాథలిక్ అయినప్పటికీ, ఇలా అన్నాడు: “ప్రీస్టు ఇక్కడికి గనుక వస్తే నేను ఆయనకు సరిగ్గా జవాబిస్తానులే !” దానితో నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ‘ప్రీస్టులకు కేవలం మన డబ్బు కావాలి, కాని వాళ్లు ఎన్నడూ మనకు బైబిలు బోధించరు.’
సత్యం నేర్చుకోవడం
ఆ ఇద్దరు గ్రీకు వ్యక్తులు నడిపించే కేఫ్‌కు నేను మరోసారి వెళ్లినప్పుడు, నాకు ప్రీస్టుతో జరిగిన దాని గురించి మేము చర్చించుకున్నాము. ఫలితంగా, నేను బైబిలు విద్యార్థులతోపాటు పఠించడం మొదలు పెట్టాను, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు. నేను మొత్తం రాత్రంతా బైబిలు, బైబిలు ఆధారిత ప్రచురణలూ చదువుతూ గడిపేవాడిని. ప్రీస్టు చెప్పినట్లుగా హెలెన్ పర్గేటరీలో బాధపడడం లేదు గానీ మరణమందు నిద్రపోతోందని నేను తెలుసుకున్నాను. (యోబు 14:13, 14; యోహాను 11:11-14) వాస్తవానికి, నేను బంగారంకంటే శ్రేష్ఠమైనదాన్ని కనుగొన్నాను—అదే సత్యం!
కొన్ని వారాల తర్వాత, పిట్స్‌బర్గ్‌లోని గార్డెన్ థియేటర్ వద్ద నేను మొట్టమొదటిసారి కూటాలకు హాజరైనప్పుడు నేను చెయ్యెత్తి ఇలా చెప్పాను, “నేను క్యాథలిక్‌గా ఉన్న సంత్సరాలన్నిటిలో నేర్చుకున్నదానికంటే ఈ ఒక్కరోజులో బైబిల్ని గురించి ఎంతో ఎక్కువ తెలుసుకున్నాను.” తర్వాత, మరుసటి రోజు ప్రకటనపనిలో ఎవరు భాగం వహించాలనుకుంటున్నారు అని వాళ్లు అడిగినప్పుడు నేను చెయ్యెత్తాను.
తర్వాత, 1931 అక్టోబరు 4న నేను యెహోవాకు చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను. ఈ మధ్య కాలంలో నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, నా పిల్లలను తెచ్చుకుని నాతో ఉంచుకున్నాను, వాళ్ల గురించి శ్రద్ధ తీసుకోవడంలో సహాయం చేయడానికి నేను ఒక హౌస్‌కీపర్‌ను పెట్టాను. నాకు కుటుంబ బాధ్యతలున్నప్పటికీ, 1932 జనవరి నుండి 1933 జూన్ వరకు నేను ఆక్సిలరీ అని పిలువబడే ఒక విధమైన ప్రత్యేక సేవలో భాగం వహించాను, దానిలో నేను ఇతరులకు బైబిలు గురించి చెప్పడంలో ప్రతి నెల 50 నుండి 60 గంటల వరకు గడిపాను.
ఈ సమయంలో, పనికి వెళ్లేటప్పుడూ వచ్చేటప్పుడూ నా స్ట్రీట్ కారులో ఎప్పుడూ ఎక్కుతూ ఉండే ఒక అందమైన యువతిని నేను గమనించడం మొదలు పెట్టాను. నా రియర్‌వ్యూ అద్దంలో నుండి ఇద్దరం ఒకరివైపు ఒకరం చూసుకుంటూ ఉండేవాళ్లం. ఆ విధంగా నేనూ మేరీ కలుసుకున్నాము. మేము ప్రేమించుకుని 1936 ఆగస్టులో పెళ్లి చేసుకున్నాము.
1949కల్లా నాకు నా పనిలో ఉన్న సీనియారిటీని బట్టి నాకు షిఫ్టు పనిచేసే అవకాశం లభించింది, దానితో నేను పయినీర్ సేవ చేయడానికి వీలైంది, పూర్తికాలం పరిచర్య చేసేవారిని పయినీర్‌లని అంటారు. నా చిన్న కుమార్తె జీన్ 1945లో పయినీరు సేవ ప్రారంభించింది, మేమిద్దరం కలిసి పయినీరు సేవ చేశాము. తర్వాత, జీన్ సామ్ ఫ్రెండ్ అనే వ్యక్తిని కలిసింది, ఆయన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయమైన బేతేలులో సేవచేస్తున్నాడు.a వాళ్లు 1952లో వివాహం చేసుకున్నారు. నేను పిట్స్‌బర్గ్‌లో పయినీరు సేవ చేయడం కొనసాగిస్తూ ఎన్నో బైబిలు పఠనాలు నిర్వహించేవాడిని, ఒక సమయంలో 14 కుటుంబాలతో ప్రతి వారం వేరు వేరుగా బైబిలు పఠనాలు నిర్వహించేవాడిని. 1958లో నేను నా స్ట్రీట్ కార్ ఉద్యోగం నుండి విరమణ పొందాను. ఆ తర్వాత పయినీరు సేవ చేయడం సులభమయ్యింది, ఎందుకంటే ఇక నేను రోజు ఎనిమిది గంటలు పనిచేయవలసిన అవసరం లేదు.
1983లో మేరీ అస్వస్థురాలయ్యింది. ఆమె నాగురించి దాదాపు 50 సంవత్సరాలు శ్రద్ధ తీసుకున్నట్లుగా నేను ఆమె గురించి శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నించాను. చివరికి, 1986 సెప్టెంబరు 14న ఆమె మరణించింది.
నా జన్మస్థలాన్ని కనుగొనడం
1989లో జీన్ మరియు సామ్ నన్ను వాళ్లతోపాటు పోలాండ్‌లో సమావేశాలకు తీసుకువెళ్లారు. నేను పెరిగిన స్థలాన్ని కూడా మేము సందర్శించాము. ప్రపంచంలోని ఆ భాగాన్ని రష్యన్లు ఆక్రమించుకున్నప్పుడు, వాళ్లు పట్టణాల పేర్లను మార్చి, ప్రజలను వేరే స్థలాలకు తీసుకువెళ్లారు. మా అన్నయ్యల్లో ఒకరిని ఇస్తాన్‌బుల్‌కు, ఒక అక్కయ్యను రష్యాకు తీసుకు వెళ్లారు. మా గ్రామం పేరు అక్కడున్న ప్రజల్లో మేమడిగిన వారికెవరికీ తెలియదు.
తర్వాత, దూరాన ఉన్న కొండలు నాకు చిరపరిచితమైనవిగా కనిపించాయి. మేము దగ్గరికి వెళ్లినప్పుడు, ఒక కొండ, రోడ్డులోని చీలిక, చర్చి, నది మీదున్న వంతెన వంటివి నేను గుర్తుపట్టగలిగాను. ఆశ్చర్యకరంగా, హఠాత్తుగా మేము “హోసోచెక్” అని ఉన్న బోర్డును చూశాము! ఇటీవలి కాలంలోనే, కమ్యూనిస్టులు అక్కడ పట్టు కోల్పోవడంతో, ఆయా గ్రామాలకు వాటి పూర్వపు పేర్లనే మళ్లీ పెట్టడం జరిగింది.
మా ఇల్లు ఇప్పుడక్కడ లేదు గాని బయట వంట చేసుకోవడానికి ఉపయోగించే ఒవేన్ మాత్రం భూమిలో కూరుకుపోయి కనిపించింది. ఒక పెద్ద చెట్టువైపు చూపించి నేనిలా అన్నాను: “ఆ చెట్టును చూడండి. అమెరికాకు వెళ్లేముందు నేను దాన్ని నాటాను. అది ఎంత పెద్దగా పెరిగిందో చూడండి !” తర్వాత, మేము సమాధుల స్థలానికి వెళ్లి, మా కుటుంబ సభ్యుల పేర్ల కోసం వెదికాము, కాని ఏవీ కనిపించలేదు.
సత్యానికి మొదటిస్థానం ఇవ్వడం
1993లో జీన్ భర్త మరణించినప్పుడు, బేతేలు వదిలి వచ్చి నీ గురించి శ్రద్ధ తీసుకోనా ఆమె నన్నడిగింది. అలా ఎన్నటికీ చేయవద్దని నేను ఆమెకు చెప్పాను, నేను ఇప్పటికీ అలాగే భావిస్తున్నాను. నాకు 102 సంవత్సరాలు వచ్చేవరకూ నేను ఒంటరిగానే నివసించాను, కాని ఆ తర్వాత నన్ను నర్సింగ్‌హోమ్‌కు తరలించవలసి వచ్చింది. పిట్స్‌బర్గ్‌లోని బెలెవ్యూ సంఘంలో నేను ఇప్పటికీ పెద్దగా ఉన్నాను, ఆదివారాల్లో సహోదరులు వచ్చి నన్ను కూటాల కోసం రాజ్యమందిరానికి తీసుకువెళతారు. ఇప్పుడు నా ప్రకటనా పని ఎంతో పరిమితమైనదే అయినప్పటికీ, ఇన్‌ఫర్మ్ పయినీర్ లిస్ట్‌లో నా పేరు ఇప్పటికీ ఉంది.
గడిచిన సంవత్సరాల్లో, వాచ్‌టవర్ సంస్థ పైవిచారణకర్తలకు తర్ఫీదు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలకు హాజరై ఆనందించాను. సంఘ పెద్దల కోసం ఏర్పాటు చేయబడిన రాజ్య పరిచర్య పాఠశాల తరగతిలోని కొన్ని కార్యక్రమాలకు నేను గత డిసెంబరులో హాజరయ్యాను. ఈ గడిచిన ఏప్రిల్ 11న క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు జీన్ నన్ను తీసుకువెళ్లింది, 1931 నుండి ఆ ఆచరణకు ప్రతి సంవత్సరం వెళుతూ నేను దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నాను.
నేను ఎవరితో బైబిలు పఠనం చేశానో వారిలో కొందరు ఇప్పుడు పెద్దలుగా, ఇతరులు దక్షిణ అమెరికాలో మిషనరీలుగా సేవచేస్తున్నారు, కొందరు తాతామామ్మలై తమ పిల్లలతోపాటు దేవుని సేవ చేస్తున్నారు. నా పిల్లల్లో ముగ్గురు అంటే మేరి జేన్, జాన్, జీన్ అలాగే వారి పిల్లలూ, వారి మనుమలూ మనుమరాళ్ళూ అనేకమంది నమ్మకంగా యెహోవా దేవుని సేవ చేస్తున్నారు. ఒక రోజున నా మరో కుమార్తె, ఇంకా మిగిలిన నా మనుమలూ మునిమనుమలూ అలాగే చేయాలన్నదే నా ప్రార్థన.
ఇప్పుడు 105 ఏళ్ల వయస్సులో నేను ఇప్పటికీ, బైబిలు పఠించమనీ తాము నేర్చుకున్నవాటిని ఇతరులతో పంచుకోమనీ ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంటాను. అవును, మీరు యెహోవాకు సన్నిహితంగా ఉంటే మీరు ఎన్నటికీ నిరాశ చెందరని నేను గట్టిగా నమ్ముతున్నాను. అప్పుడు మీరు కూడా, నశించిపోయే బంగారం కంటే శ్రేష్ఠమైనదైన సత్యం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు, ఆ సత్యం మన జీవదాతయైన యెహోవా దేవునితో మనం అమూల్యమైన సంబంధాన్ని కల్గివుండడాన్ని సాధ్యం చేస్తుంది.
[అధస్సూచీలు]
a సామ్ ఫ్రెండ్ అనుభవం 1986 ఆగస్టు 1, కావలికోట (ఆంగ్లం) సంచికలోని 22-6 పేజీల్లో ఉంది.
[25వ పేజీలోని చిత్రం]
నేను స్ట్రీట్‌కారు నడుపుతున్నప్పుడు
[26వ పేజీలోని చిత్రం]
నేను ఇప్పుడు నివసిస్తున్న నర్సింగ్‌హోమ్ దగ్గర
[27వ పేజీలోని చిత్రం]
1989లో మేము కనుగొన్న రోడ్డు సైన్‌బోర్డు