జీవిత మార్గంపై మైలురాళ్లు
మీరు అపరిచిత రోడ్డు మీద ప్రయాణిస్తుంటే, మైలురాళ్లను మీరు అడ్డంకులుగా దృష్టిస్తారా? దృష్టించకపోవచ్చు! మీ గమ్యానికి నడిపే మార్గం నుండి ప్రక్కకు తొలగిపోకుండా మీకు సహాయం చేసే సహాయకాలుగా మీరు వాటిని తప్పక దృష్టిస్తారు.
అయితే, జీవిత మార్గంపై పయనించడం మాటేమిటి? “మైలురాళ్లు” లేకుండా దాని మీద విజయవంతంగా పయనించడం సాధ్యమేనా? మానవజాతికున్న ఈ పరిమితులను అంగీకరిస్తూ, దేవుని ప్రాచీన ప్రవక్త ఒకరు ఇలా అన్నాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.
మరైతే అవసరమైన నడిపింపును ఎక్కడ కనుగొనవచ్చు? అలాంటి నడిపింపుకు నమ్మదగిన మూలం మానవుని సృష్టికర్త. సూచనార్థక మైలురాళ్లను బైబిల్లో కనుగొనవచ్చు. యెహోవా తన వాక్యం ద్వారా ఇలా చెబుతున్నాడు! “మీరు కుడి తట్టయనను ఎడమ తట్టయనను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”—యెషయా 30:21.
అవును, మన జీవితంలోని ప్రతి అంశంలో దేవుని వాక్యం నమ్మదగిన నడిపింపును ఇస్తుంది. (యెషయా 48:17; 2 తిమోతి 3:16, 17) విచారకరంగా, మానవజాతిలోని అధికశాతం మంది దైవిక నడిపింపు లేకుండా జీవిత మార్గంపై పయనిస్తారు. (మత్తయి 7:13) అయినప్పటికీ, “మైలురాళ్లు” వాటి స్థానంలో స్థిరంగా స్థాపించబడివున్నాయి! మీరు జీవిత మార్గంపై పయనిస్తున్నప్పుడు వాటికి అవధానమిస్తారా?