స్థానిక సంస్కృతి, క్రైస్తవ సూత్రాలు ఈ రెండూ పొసుగుతాయా?
ఉత్తర యూరప్‌లోని ఒక యెహోవాసాక్షి అయిన స్టీవెన్ ఆఫ్రికాలోని ఒక దేశంలో మిషనరీగా నియమించబడ్డాడు. ఒకసారి స్థానికంగా ఉన్న ఒక సహోదరునితో పట్టణంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సహోదరుడు తన చేతిని పట్టుకునే సరికి అదిరిపోయాడు.
రద్దీగా ఉన్న ఒక వీధిలో ఇంకొక పురుషుని చేతిలో చేయివేసుకుని నడవడం అన్న తలంపే స్టీవెన్‌కు విభ్రాంతిని కల్గిస్తుంది. తన దేశ సంస్కృతిలో అటువంటి ఆచారం స్వలింగసంపర్కాన్ని సూచిస్తుంది. (రోమీయులు 1:27) అయితే, ఆ ఆఫ్రికా సహోదరునికి మాత్రం అలా చేతులు పట్టుకోవడం కేవలం స్నేహాన్ని వ్యక్తం చేయడానికైన ఒక మార్గం. చేతిని విదిలించుకోవడం అంటే స్నేహాన్ని తిరస్కరించడమనే అర్థం.
సంస్కృతులు ఇలా ఒకదాన్ని ఒకటి విభేదించడం గురించి మనం ఎందుకు అంత పట్టింపు కల్గి ఉండాలి? అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, యెహోవా ప్రజలు “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అన్న దైవిక నియామకాన్ని నెరవేర్చాలని ఆతురతతో ఉన్నారు. (మత్తయి 28:19) ఈ కార్యాన్ని సాధించడానికి కొంతమంది పరిచారకుల అవసరత ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ సేవ చేయడానికి కదిలివెళ్లారు. ఆ క్రొత్త వాతావరణంలో కొనసాగుతూ విజయాన్ని సాధించాలంటే వారు తమకు తారసపడే విభిన్న సంస్కృతులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారు తమ తోటి సహోదర సహోదరీలతో సామరస్యంగా ఉంటూ పనిచేయగలరు, అదే సమయంలో బహిరంగ పరిచర్యలో మరింత ప్రభావవంతంగా కూడా ఉండగల్గుతారు.
అంతేగాక, ఈ కల్లోలిత లోకంలో చాలామంది ప్రజలు రాజకీయ లేక ఆర్థిక కారణాలవల్ల సమస్యలతో నిండివున్న తమ స్వదేశాల నుండి పారిపోయి ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఆ కారణంగా మనం ప్రకటనా పని చేస్తుండగా క్రొత్తగా వచ్చిన ఈ పొరుగువారిని కలిసినప్పుడు వారి క్రొత్త ఆచారవ్యవహారాలు మనకు ఎదురుకావచ్చు. (మత్తయి 22:39) మన పద్ధతులకు భిన్నంగా ఉన్న పద్ధతులను మనం మొదటిసారిగా గమనించినప్పుడు మనం ఆ క్రొత్త ఆచారాల గురించి గలిబిలికి గురికావచ్చు.
స్పష్టంగా నిర్వచించబడిన విషయాలు
సంస్కృతి అనేది మానవ సమాజంతో బాగా అల్లుకుపోయి ఉంది. అందుకని, ‘అధికముగా నీతిమంతులమై’ ప్రతీ చిన్న ఆచారాన్నీ పట్టుకుని అది బైబిలు సూత్రాలతో పొసుగుతుందో లేదో నిర్ధారించడానికి పరిశోధించడం ఎంత అర్థవిహీనమైన పని!—ప్రసంగి 7:16.
మరోవైపు, దైవిక సూత్రాలను స్పష్టంగా అతిక్రమించే స్థానిక ఆచారాలను గుర్తించవలసిన అవసరం ఉంది. అయితే సాధారణంగా ఇది అంత కష్టం కాదు, ఎందుకంటే దేవుని వాక్యం “తప్పు దిద్దుటకు” మన చేతికందుబాటులో ఉంది. (2 తిమోతి 3:16) ఉదాహరణకు, కొన్ని దేశాల్లో చాలా మంది భార్యలను కలిగివుండడం ఆచారం, కానీ నిజ క్రైస్తవులు పాటించాల్సిన లేఖనాధారమైన ప్రమాణం ఏమిటంటే ఒక పురుషుడికి సజీవంగావున్న ఒకే భార్య ఉండాలి.—ఆదికాండము 2:24; 1 తిమోతి 3:2.
అదేవిధంగా, కొన్ని ప్రాంతాల్లో దుష్టాత్మలను దూరంగా ఉంచే ఉద్దేశంతోను, లేక అమర్త్యమైన ఆత్మ ఉందన్న నమ్మకం ఆధారంగాను అంత్యక్రియల సంబంధమైన కొన్ని ఆచారాలను పాటిస్తారు, అవి నిజ క్రైస్తవులకు అంగీకారమైనవి కావు. కొంతమంది ప్రజలు దుష్టాత్మలను వెళ్లగొట్టడం కోసం మరణించినవారికి ధూపం వేయడమో వారికి ప్రార్థనలు చేయడమో చేస్తుంటారు. మరితరులు ‘అనంతర లోకంలో’ జీవితం సంపాదించడానికి మృతునికి సహాయం చేసే ఉద్దేశంతో చనిపోయినవారికోసం జాగారాలు చేయడమో లేక చివరికి రెండవసారి ఖననం చేయడమో చేస్తుంటారు. అయితే బైబిలు బోధించేదాని ప్రకారం మనుష్యులు చనిపోయినప్పుడు వారు “ఏమియు ఎరుగరు,” అందుకని వారు ఎవరికీ మేలుగానీ హానిగానీ చేయలేరు.—ప్రసంగి 9:5; కీర్తన 146:4.
ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, దేవుని వాక్యంతో పొసిగే ఆచారాలు చాలా ఉన్నాయి. అతిథులను ఆదరంగా ఆహ్వానించే స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉన్న సంస్కృతులను గమనించినప్పుడు మన మనస్సులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని సంస్కృతుల్లో అపరిచితునికి కూడా హృదయపూర్వకంగా అభివాదం చేయడం, అవసరమైతే తమ ఇంటి ద్వారాలను తెరిచి ఆయన్ను అతిథిగా స్వీకరించడం కూడా ఒక నియమంగా ఉంటుంది ! అటువంటి ఆతిథ్యాన్ని మీరు ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు మీరు కూడా అలాగే చేయాలని మీకన్పించదూ? అలా చేసినట్లైతే అది మీ క్రైస్తవ వ్యక్తిత్వాన్ని తప్పకుండా మెరుగుపరుస్తుంది.—హెబ్రీయులు 13:1.
ఇతరులకోసం వేచివుండే పరిస్థితిలో ఉండడం మనలో ఎవరికి మాత్రం ఇష్టం? కొన్ని దేశాల్లో ఇలా ఇతరుల కోసం వేచివుండడం సాధారణంగా జరగదు, ఎందుకంటే పంక్చువాలిటీ చాలా ప్రాముఖ్యమని అక్కడ ఎంచుతారు. యెహోవా దేవుడు సమాధానమునకు కర్త అని బైబిలు మనకు చెబుతుంది. (1 కొరింథీయులు 14:33) ఆ కారణంగా, ఆయన దుష్టత్వాన్ని అంతం చేయడానికి ఒక ‘దినాన్ని గడియను’ ముందే నిర్ణయించాడు, అంతేగాక ఈ సంఘటన “జాగుచేయక వచ్చును” అని ఆయన హామీ ఇస్తున్నాడు. (మత్తయి 24:36; హబక్కూకు 2:3) సహేతుకమైన రీతిలో వేళను పాటించడాన్ని సమర్థించే సంస్కృతులు, మనం క్రమంకల్గి ఉండడానికి, ఇతరులపట్లా వారి సమయం పట్లా సరైన గౌరవాన్ని చూపించడానికి సహాయం చేస్తుంది. అది నిశ్చయంగా లేఖనాధార సూత్రాలకు అనుగుణ్యంగా ఉంటుంది.—1 కొరింథీయులు 14:39, 40; ఫిలిప్పీయులు 2:4.
హానిరహితమైన ఆచారాల సంగతేమిటి?
కొన్ని ఆచారవ్యవహారాలు క్రైస్తవ జీవిత విధానంతో స్పష్టంగా పొసుగుతున్నవే అయినప్పటికీ కొన్ని పొసగవు. కానీ అటు తప్పు అనీ ఇటు ఒప్పు అనీ నిర్వచించలేని ఆచారాల విషయం ఏమిటి? చాలామట్టుకు ఆచారాలు హానిరహితమైనవే అంటే నిరపాయకరమైనవే, మరి వాటిపట్ల మనకు ఉన్న దృక్పథం మన ఆధ్యాత్మిక సమతుల్యాన్ని చూపించగలదు.
ఉదాహరణకు, అభివాదం అనేక విధాలుగా ఉంటుంది—కరచాలనం చేయడం, ముందుకు వంగడం, ముద్దు పెట్టుకోవడం, లేక ఆలింగనం చేసుకోవడం కూడా కొన్ని చోట్ల అభివాదం చేయడమే. అదే విధంగా, భోజనపు బల్లవద్ద పాటించాల్సిన మర్యాదల సంబంధంగా ఎంతో వైవిధ్యమైన ఆచారాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లోని ప్రజలు సమిష్టి పాత్రలో అంటే ఒకే పాత్రలో భోంచేస్తారు. కొన్ని దేశాల్లో భోజనం తర్వాత త్రేన్పు తేన్చడం అంగీకారయోగ్యమే—కొన్ని చోట్ల కోరదగినది కూడా—ఆ విధంగా వారు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని దృష్టిస్తారు. కానీ వేరే దేశాల్లో ఆ విధంగా చేయడం అమర్యాదకు పరాకాష్టగా దృష్టించబడుతుంది.
ఈ హానిరహితమైన ఆచారాల్లో దేన్ని మీరు వ్యక్తిగతంగా ఇష్టపడతారు దేన్ని ఇష్టపడరు అనేది నిర్ణయించడానికి బదులుగా, అవంటే కల్గివుండాల్సిన సరైన దృక్పథాన్ని అలవర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించండి. బైబిలులోని కాలాతీతమైన సలహా, మనం “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుచు” ఉండాలని మనకు చెబుతుంది. (ఫిలిప్పీయులు 2:3) అదే విధంగా, దిస్ వే ప్లీజ్—ఎ బుక్ ఆఫ్ మేనర్స్ అనే తన పుస్తకంలో ఎలనర్ బాయ్కిన్ ఇలా అంటుంది: “మొట్టమొదటిగా కావాల్సింది దయగల హృదయమే.”
ఈ విధంగా నమ్రతతో ఉండడం ఇతరుల ఆచారాల్ని హీనంగా ఎంచడం నుండి మనల్ని కాపాడుతుంది. మనం చొరవ తీసుకుని ఇతర ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసుకునేందుకు ప్రేరేపణ పొందుతాము. కాస్త వేరుగా కన్పించిన ప్రతీదాని నుండీ దూరంగా జరగడానికి, అనుమానంతో దృష్టించడానికి బదులు మనం వారి ఆచారాల్లో భాగం వహిస్తూ, వారి ఆహారాన్ని భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తాము. మన మనస్సును విశాలపర్చుకుని వినూత్నమైన పద్ధతుల్ని ప్రయోగించి చూడడానికి సుముఖత చూపుతూ ఉంటే, మనం మన అతిథేయిపట్లా విదేశీయులైన పొరుగువారి పట్లా ప్రశంసను వ్యక్తం చేస్తాము. మనం మన హృదయాల్నీ మన పరిధుల్నీ “విశాలపరచు”కొంటుండగా మనకు మనమే ప్రయోజనాన్ని చేకూర్చుకుంటాము.—2 కొరింథీయులు 6:13.
ఏవైనా ఆచారాలు ఆధ్యాత్మిక అభివృద్ధిని కుంటుపరుస్తుంటే
కొన్ని ఆచారాలు వాటంతట అవే లేఖనవిరుద్ధమైనవి కాకపోయినా, ఆధ్యాత్మిక అభివృద్ధికి అనుకూలంగా లేకపోతే అప్పుడేమిటి? ఉదాహరణకు, కొన్ని దేశాల్లో పనుల్ని వాయిదా వేసే అలవాటు ప్రజలకు ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని ఇలా తేలికగా తీసుకోవడం ఒత్తిడిని తగ్గించగలదేమో, కానీ అది మన పరిచర్యని “సంపూర్ణముగా” నెరవేర్చడాన్ని మరింత కష్టతరం చేసే సాధ్యత ఉంది.—2 తిమోతి 4:5.
ముఖ్యమైన పనుల్ని “రేపటికి” వాయిదా వేయడాన్ని నివారించమని మనం ఇతరులను ఎలా ప్రోత్సహించవచ్చు? గుర్తుంచుకోండి “మొట్టమొదటిగా కావాల్సింది దయగల హృదయమే.” ప్రేమచే పురికొల్పబడి, మనం మంచి మాదిరిని ఉంచి, అటుతర్వాత నేడే చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయకుండా ఉంటే వచ్చే ప్రయోజనాల్ని దయాగుణంతో వివరించవచ్చు. (ప్రసంగి 11:4) అదే సమయంలో మనం కేవలం ఒక పని పూర్తి చేయడం కోసమని, ఒకరిమీద మరొకరికి ఉండే పరస్పర నమ్మకాన్నీ విశ్వాసాన్నీ త్యాగం చేయకూడదు. మనం చేసిన సూచనల్ని ఇతరులు వెంటనే అంగీకరించకపోతే, మనం వారిని గదమాయించడమో లేక మన చిరాకుని వారిపైన వెళ్లగ్రక్కడమో చేయకూడదు. ప్రతిభకన్నా ప్రేమకు ప్రాముఖ్యతనివ్వాలి.—1 పేతురు 4:8; 5:3.
స్థానిక అభిరుచులను పరిగణలోనికి తీసుకోవడం
మనం చేసే ఏ సూచనయైనా యుక్తమైనదై ఉండాలి, కేవలం మన స్వంత అభిరుచుల్ని ఇతరులపై రుద్దడానికైన ప్రయత్నంగా ఉండకూడదు. ఉదాహరణకు వస్త్రధారణకు సంబంధించిన స్టైళ్లు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించే వ్యక్తి టై కట్టుకోవడం మర్యాద, కానీ కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో అలా టై కట్టుకుంటే దాన్ని అతిగా దృష్టించవచ్చు. స్థానిక అభిరుచుల్ని పరిగణలోనికి తీసుకుంటూ, ప్రజలతో వ్యవహరించే ఒక వ్యాపారవేత్తకు ఎటువంటి వస్త్రాలు యుక్తమైనవని పరిగణించబడుతుందో చూడడం సహాయకరంగా ఉంటుంది. వస్త్రధారణ అనే ఈ సున్నితమైన విషయంతో వ్యవహరించేటప్పుడు “స్వస్థబుద్ధి” కలిగివుండడం ఆవశ్యకం.—1 తిమోతి 2:9, 10.
ఏదైనా ఆచారం మనకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు? మనం దాన్ని ఆటోమేటిగ్గా తిరస్కరించేయాలా? అలా కానవసరం లేదు. మునుపు పేర్కొన్నట్లుగా పురుషులు ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం ఆ ప్రత్యేక ఆఫ్రికా సమాజంలో పూర్తిగా ఆమోదయోగ్యమైనది. తమ చుట్టూ ఉన్న ఇతర పురుషులు కూడా అలాగే చేతులు పట్టుకుని నడుస్తుండడం చూసినప్పుడు ఆ మిషనరీ కాస్త కుదుటపడ్డాడు.
తన విస్తృతమైన మిషనరీ యాత్రల్లో అపొస్తలుడైన పౌలు అనేక రకాల నేపథ్యాలనుండి వచ్చిన సభ్యులున్న సంఘాల్ని దర్శించాడు. నిస్సందేహంగా సంస్కృతి సంబంధంగా విభేదాలు తరచుగానే తలెత్తివుంటాయి. అందుకనే పౌలు బైబిలు సూత్రాలకు దృఢంగా అంటిపెట్టుకుని ఉంటూనే తనకు చేతనైనంత మేరకు సంస్కృతులకు అనుగుణంగా తనను తాను మలచుకున్నాడు. “బలహీనులను సంపాదించికొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను” అని ఆయన చెప్పాడు.—1 కొరింథీయులు 9:22, 23; అపొస్తలుల కార్యములు 16:3.
క్రొత్త సంప్రదాయాలకు మనం ఎలా ప్రతిస్పందించాలన్నది నిర్ణయించుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు సహాయం చేయవచ్చు. ఫలాని ఆచారాన్ని మనం పాటించడం ద్వారా—లేకపోతే దాన్ని పాటించకపోవడం ద్వారా—మనల్ని గమనిస్తున్న వారికి మనం ఎటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాము? మనం వారి సంస్కృతిలో మిళితం కావడానికి ప్రయత్నిస్తుండడం చూసి వారు రాజ్య సందేశంపట్ల ఆకర్షితులౌతారా? మరోవైపు, మనం ఏదైనా స్థానిక ఆచారాన్ని పాటిస్తుంటే, ‘మన పరిచర్య నిందింపబడుతుందా’?—2 కొరింథీయులు 6:3.
మనం ‘అందరికి అన్నివిధముల వారమై’ ఉండాలని కోరుకుంటే, ఏది యుక్తమో ఏది అయుక్తమో అన్నవాటిని గురించి మనం కల్గియుండే బలమైన దృక్పథాలను మార్చుకోవల్సి రావచ్చు. తరచూ ఫలాని పనిని చేయడానికి ఇది “సరైన” పద్ధతి, ఆ పద్ధతి “సరికాదు” అన్నది కేవలం మనం ఎక్కడ జీవిస్తున్నామన్న దానిపైన ఆధారపడివుంటుంది. అందుకనే, చేతులు పట్టుకోవడం ఒక దేశంలో స్నేహాన్ని ప్రదర్శించడం అయితే, మరితర అనేక దేశాల్లో అది తప్పకుండా ప్రజల్ని రాజ్య సందేశాన్నుండి దూరం చేస్తుంది.
అయితే వివిధ ప్రాంతాల్లో ఆమోదయోగ్యమైనవీ క్రైస్తవులకు కూడా యుక్తమైనవీ అని చెప్పగల ఇతర సంప్రదాయాలు ఉన్నాయి; అయితే మనం జాగ్రత్త వహించాలి.
హద్దుమీరే విషయమై జాగ్రత్త!
తన శిష్యులు ఈ లోకం నుండి తీసుకుని పోబడలేకపోయినా, వారు ‘లోకసంబంధులు కాకుండా’ ఉండాలని యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 17:15, 16) అయితే, కొన్నిసార్లు సాతాను లోకంతో మిళితమైయున్నదేదో, లేక ఫలాని సంస్కృతిలో భాగం మాత్రమే అయ్యున్నదేదో గ్రహించడం సులభమైన పని కాదు. ఉదాహరణకు సంగీతనృత్యాలు దాదాపు ప్రతి సంస్కృతిలోను విడదీయలేని భాగంగా కలిసిపోయి ఉన్నాయి. కొన్ని దేశాల్లో మాత్రం వాటికి మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.
గట్టి లేఖనాధార కారణాల్ని బట్టికాక మన నేపథ్యంపై ఆధారపడి మనం చాలా సులభంగా ఒక నిర్ణయానికి వచ్చేస్తుండవచ్చు. ఒక జర్మన్ సహోదరుడైన అలెక్స్‌కు స్పెయిన్‌లో నియామకం లభించింది. తన మునుపటి వాతావరణంలో నృత్యం అంతగా జనామోదం పొందింది కాదు, కానీ స్పెయిన్‌లో మాత్రం నృత్యం సంస్కృతిలో భాగమైయుంది. ఒక సహోదరుడూ ఒక సహోదరి కలిసి స్థానిక నృత్యాన్ని ఉత్తేజితంగా ప్రదర్శిస్తుండగా మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయన కలవరపడ్డాడు. ఇలా నృత్యం చేయడం తప్పా లేకపోతే లోకసంబంధమైనదా? ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తే తాను తన ప్రమాణాల్ని క్రిందికి దిగజారుస్తున్నట్లా? అక్కడి సంగీతమూ నృత్యమూ జర్మనీకన్నా కాస్త వేరుగా ఉన్నప్పటికీ స్పెయిన్‌లోని తన సహోదర సహోదరీలు క్రైస్తవ ప్రమాణాల్ని క్రిందికి దిగజారుస్తున్నారని అనుకోవడానికి ఏ ఆధారము లేదు. కేవలం సంస్కృతుల్లోని తేడా మూలంగానే ఆయనకు కలవరపాటు కల్గింది.
అయితే, సాంప్రదాయిక స్పానిష్ నృత్యం చేస్తూ ఆనందించే ఏమేల్యో అనే ఒక సహోదరుడు ఒక ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించాడు. “అనేక రకాల నృత్యాల్లో ఆడామగా శారీరకంగా దగ్గరగా ఉండాల్సి వస్తుందని నేను గమనించాను” అని ఆయన వివరిస్తున్నాడు. “ఇది ఆ ఇద్దర్లో కనీసం ఎవరో ఒక్కరి భావోద్వేగాలపైనన్నా ప్రభావం చూపిస్తుందని ఒక అవివాహితునిగా నాకు తెలుసు. మనం ఎవరిపట్ల ఆకర్షితులం అవుతామో వారిపట్ల మనకున్న అనురాగాన్ని ప్రదర్శించడానికి నృత్యాన్ని కొన్నిసార్లు ఒక అవకాశంగా ఉపయోగిస్తాము. వినబడుతున్న సంగీతం ఆరోగ్యదాయకమైనదై ఉండేలా చూసుకుని శారీరక స్పర్శ అతి తక్కువగా ఉండేలా చూసుకోవడం మనల్ని కాపాడగలదు. అయినా, యౌవనులైన అవివాహిత సహోదరీ సహోదరులు కల్సి నృత్యం చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ఒక దైవిక వాతావరణం ఉండేలా చూడడం కష్టమేనని నేను ఒప్పుకోవల్సిందే.”
నిశ్చయంగా మనం, మన సంస్కృతిని ఈ లోకంలో ఉండే ప్రవర్తనను అనుకరించడానికి ఒక సాకుగా ఉపయోగించకూడదు. ఇశ్రాయేలు సంస్కృతిలో గాన నృత్యాలకు ఒక స్థానం ఉంది. ఇశ్రాయేలీయులు ఎఱ్ఱసముద్రంవద్ద ఐగుప్తునుండి విడుదల పొందినప్పుడు వారు జరుపుకున్న ఆనందోత్సాహాల్లో గానమూ నృత్యమూ రెండూ ఉన్నాయి. (నిర్గమకాండము 15:1, 20) అయితే, ఆ సంగీతమూ నృత్యమూ వారి చుట్టూ ఉన్న అన్యుల ప్రపంచంలో ఉన్నవాటికి భిన్నంగా ఉన్నాయి.
విషాదకరంగా, సీనాయి పర్వతం మీదనున్న మోషే తిరిగి రావడం కోసం క్రింద వేచివున్న ఇశ్రాయేలీయులు, సహనం కోల్పోయి ఒక బంగారు దూడను చేసుకున్నారు. చివరికి ఆ ప్రజలు తిని త్రాగిన తర్వాత “ఆడుటకు లేచిరి.” (నిర్గమకాండము 32:1-6) మోషే యెహోషువాలకు వారి సంగీత ధ్వని వినిపించినప్పుడు వారు వెంటనే తీవ్రమైన కలతకు గురయ్యారు. (నిర్గమకాండము 32:17, 18) ఇశ్రాయేలీయులు ఆ “హద్దు” మీరారు, ఈసారి వారి గానము నృత్యము వారి చుట్టూ ఉన్న అన్యుల ప్రపంచాన్ని పోలివున్నాయి.
అదే విధంగా నేడు, సంగీతము నృత్యము మన స్థానిక ప్రాంతంలో ఆమోదయోగ్యంగానే ఉండవచ్చు, అవి ఇతరుల మనస్సాక్షికి అభ్యంతరాన్ని కలిగిస్తుండక పోవచ్చు. కానీ ఒకవేళ లైట్లు డిమ్ చేసి, డిస్కో లైట్లు ఆన్ చేసి, వేరే రిథమ్ ఉన్న మ్యూజిక్ పెడితే మునుపు ఆమోదయోగ్యంగా ఉన్నది ఇప్పుడు ఈ లోకాత్మను ప్రతిబింబిస్తుండవచ్చు. “అది మా సంస్కృతి, అంతే” అని మనం వాదించవచ్చు. అన్యుల వినోదాన్నీ వారి ఆరాధనను పోలిన వినోదానికీ ఆరాధనకూ తాను లొంగిపోయినప్పుడు అహరోను అటువంటి సాకునే చెప్పాడు. ఆయన దాన్ని “యెహోవాకు పండుగ” అని తప్పుగా అభివర్ణించాడు. ఇది ఒక కుంటి సాకు. అంతెందుకు, చివరికి వారి ప్రవర్తన “వారి విరోధులలో” కూడా “ఎగతాళి”గా దృష్టించబడింది.—నిర్గమకాండము 32:5, 25.
సంస్కృతిని దాని స్థానంలో ఉంచండి
విపరీత ఆచారాలు మొదట్లో మనం నిర్ఘాంతపోయేలా చేయవచ్చు, కానీ అన్ని ఆచారాలు తిరస్కరించదగినవి కానవసరం లేదు. మనం “సాధకముచేయబడిన జ్ఞానేంద్రియముల”తో ఏ ఆచారాలు క్రైస్తవ సూత్రాలతో పొసుగుతాయి ఏవి పొసగవు అన్నది నిర్ధారించగలము. (హెబ్రీయులు 5:14) మనం మన పొరుగువారి పట్ల ప్రేమతో నిండిన దయగల హృదయాన్ని కలిగివుంటే మనం హానిరహితమైన ఆచారాలను గమనించినప్పుడు యుక్తమైన రీతిలో ప్రతిస్పందించ గలుగుతాము.
మనం రాజ్య సువార్తను మన ప్రాంతంలోనైనా లేక మరే చోటైనా ప్రకటిస్తున్నప్పుడు వైవిధ్యభరితమైన సంస్కృతులు మనకు తారసపడినప్పుడు సమతుల్యమైన విధంగా ప్రవర్తించడం ‘అందరికి అన్నివిధముల వారమై’ ఉండడానికి సహాయపడుతుంది. ఈ విభిన్నమైన సంస్కృతులకు మనం స్వాగతం పలికినట్లైతే జీవితం అర్థవంతంగాను వర్ణభరితంగాను అద్భుతంగాను అనిపిస్తుందనడంలో సందేహం లేదు.
[20వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు తగిన రీతిలో అనేక విధాలుగా అభివాదం చేసుకోవచ్చు
[23వ పేజీలోని చిత్రం]
వైవిధ్యభరితమైన సంస్కృతులపట్ల సమతుల్యతగల దృక్పథం జీవితాన్ని అర్థవంతంగాను వర్ణభరితంగాను చేయగలదు