కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/15 పేజీలు 28-31
  • లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేరేపిత అనువాదమా?
  • యాపెతు షేము గుడారములలోనా?
  • యూదామత ప్రవిష్టులు, దైవభయం గలవారు
  • సెప్టాజింట్‌ మార్గాన్ని సిద్ధపర్చడంలో సహాయపడింది
  • సెప్టాజింట్‌ “ప్రేరేపణ”ను కోల్పోతుంది
  • “సెప్టాజింట్‌” నాడూ నేడూ ఉపయోగకరమైనదే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఇన్ని రకాల బైబిళ్లు ఎందుకు ఉన్నాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • బైబిలు మనకు చేరిన విధానం—భాగం ఒకటి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/15 పేజీలు 28-31

లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం

దేవుని ప్రవక్త అయిన మోషే 3,500 సంవత్సరాల క్రితం బైబిలును వ్రాయడం ప్రారంభించినప్పుడు, కేవలం ఒక్క చిన్న జనాంగం మాత్రమే దాన్ని చదవగల్గేది. (ద్వితీయోపదేశకాండము 7:7) ఎందుకంటే లేఖనాలు ఆ జనాంగం మాట్లాడే భాష అయిన హెబ్రీలో మాత్రమే ఉండేవి. కానీ కాలగమనంలో ఇది మారనైయుంది.

బైబిలు సందేశం వ్యాప్తి చెందడమూ, శతాబ్దాలుగా అది చూపించిన అనుకూల ప్రభావమూ చాలామట్టుకు దాని మొట్టమొదటి అనువాదం అయిన సెప్టాజింట్‌ ఫలితమే. ఆ అనువాదం ఎందుకు జరిగింది? లోకాన్నే మార్చిన ఒక బైబిలు అని దీని గురించి చెప్పడం యుక్తమేనా?

ప్రేరేపిత అనువాదమా?

సా.శ.పూ. ఏడవ, ఆరవ శతాబ్దాల్లో బబులోనుకు కొనిపోబడిన తర్వాత చాలామంది యూదులు ప్రాచీన ఇశ్రాయేలు యూదా దేశాలకు బయట జీవించారు. చెరలో ఉండగా జన్మించిన యూదులకైతే హెబ్రీ రెండవ భాషగా అయిపోయింది. సా.శ.పూ. మూడవ శతాబ్దానికల్లా, ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో కొంతమంది యూదులు నివాసాలు ఏర్పర్చుకున్నారు—ఆ పట్టణం గ్రీసు సామ్రాజ్యంలో ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రం. ఆ యూదులు పరిశుద్ధ లేఖనాలను గ్రీకులోనికి అనువదించడం అవసరం అని గమనించారు, అప్పుడు అదే వారికి మాతృభాషగా ఉంది.

ఆ కాలం వరకూ బైబిలు యొక్క ప్రేరేపిత సందేశం హెబ్రీలో నమోదైవుంది, కొంత భాగం మాత్రం దానికి దగ్గరగా ఉండే అరామిక్‌ భాషలో ఉంది. దేవుని వాక్యాన్ని వేరే భాషలోనికి అభివ్యక్తం చేయడం దైవిక ప్రేరేపణలో ఉండే శక్తివంతమైన ప్రభావాల్ని తగ్గిస్తుందా, చివరికి బహుశ తప్పుడు వ్యాఖ్యానాలకు దారితీస్తుందా? ప్రేరేపిత వాక్యం ఎవరి పరమైతే చేయబడిందో ఆ యూదులు, అనువాదం చేయడం ద్వారా ఆ సందేశం తప్పుగా వక్రీకరించబడే అపాయం ఉన్నందున వారు ఆ సాహసానికి పూనుకొనగలరా?—కీర్తన 147:19, 20; రోమీయులు 3:1, 2.

ఈ సున్నితమైన వివాదాంశాలు భయాందోళనలను కలిగించాయి. అయినా, యూదులకు దేవుని వాక్యం అర్థం కాకుండా పోతుందన్న చింత, చివరికి మిగతా అన్ని విషయాల్నీ అదిమిపెట్టేసింది. బైబిలులోని మోషే వ్రాసిన మొదటి ఐదు పుస్తకాలకు—తోరహ్‌కు—గ్రీకు అనువాదాన్ని సిద్ధం చేయాలని నిర్ణయమైంది. అసలు అనువాద ప్రక్రియ చరిత్ర గాథలో అస్పష్టంగా తయారైంది. లెటర్‌ ఆఫ్‌ అరీస్టస్‌ ప్రకారం ఈజిప్టు పరిపాలకుడైన టాలమీ II (సా.శ.పూ. 285-246) తన రాజభవనపు గ్రంథాలయం కోసం గ్రీకులోనికి అనువదించబడిన ఒక పెంటటెక్‌ (లేక, తోరహ్‌) కాపీ కావాలనుకున్నాడు. ఆయన 72 మంది యూదా విద్వాంసుల్ని నియమించాడు, వారు ఇశ్రాయేలు నుండి ఈజిప్టుకు వచ్చి అనువాదాన్ని 72 రోజుల్లో ముగించారు. తర్వాత ఈ అనువాదం యూదా సమాజానికి చదివి వినిపించబడింది, వారు అది చక్కని అనువాదమని, కచ్చితంగా ఉందని ప్రకటించారు. ఈ వృత్తాంతానికి తర్వాత రంగులు పులమడం మూలంగా, ఒక్కొక్క అనువాదకుడ్ని వేర్వేరు గదుల్లో ఉంచినప్పటికీ వారి అనువాదాలు భేదం లేకుండా ఉన్నాయనీ అక్షరం అక్షరం అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయన్న కథ ప్రచారంలోనికి వచ్చింది. 72 మంది అనువాదకుల గురించిన ఈ సాంప్రదాయిక అభిప్రాయం మూలంగా, ఈ గ్రీకు బైబిలు అనువాదం సెప్టాజింట్‌ అని పిలువబడింది, ఆ పదం “డెబ్భై” అని అర్థం గల లాటిన్‌ పదంపై ఆధారపడింది.

నేటి విద్వాంసులు అనేకమంది లెటర్‌ ఆఫ్‌ అరీస్టస్‌ అప్రమాణిక కృతి అని అంగీకరిస్తారు. అనువాదానికి చొరవ తీసుకున్నది టాలమీ II కాదు గానీ అలెగ్జాండ్రియాలోని యూదా సమాజం నాయకులని కూడా వారు నమ్ముతారు. అయితే, అలెగ్జాండ్రియాలోని యూదా తత్వవేత్త అయిన ఫైలో వ్రాతలు, యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ వ్రాతలు, అలాగే టాల్ముడ్‌లో ఉన్న సమాచారం ప్రకారం, అసలు లేఖనాలు ఎంత దైవప్రేరేపితమో సెప్టాజింట్‌ కూడా అంతే దైవప్రేరేపితమని మొదటి శతాబ్దంలోని యూదులు సామాన్యంగా నమ్ముతున్నట్లు తెలియవస్తుంది. అటువంటి సాంప్రదాయిక నమ్మకాలు, నిస్సందేహంగా ప్రపంచవ్యాప్త యూదా సమాజానికి సెప్టాజింట్‌ ఆమోదయోగ్యంగా ఉండేలా చేయడానికి చేయబడిన ప్రయత్నాల ఫలితంగానే వ్యాప్తిలోనికి వచ్చాయి.

తొలి అనువాదం మోషే వ్రాసిన ఐదు పుస్తకాలకే పరిమితమైనా, అటుతర్వాత గ్రీకులోనికి అనువదించబడిన పూర్తి హెబ్రీ లేఖనాలకు సెప్టాజింట్‌ అన్న పేరు వచ్చింది. తర్వాతి వంద సంవత్సరాల కాలంలో బైబిలులోని మిగతా పుస్తకాలు అనువదించబడ్డాయి. ఒక సంయుక్త కృషి ఫలితంగా కాక, మొత్తం సెప్టాజింట్‌ ముక్కలు ముక్కలుగా అనువదించడంతో సాధించబడింది. అనువాదకులు వేర్వేరు సామర్థ్యాలను కలిగివున్నారు, వారి హెబ్రీ భాషాపరిజ్ఞానం వేర్వేరుగా ఉంది. బైబిలులోని చాలా పుస్తకాలు మక్కీకి మక్కీగా అనువదించబడ్డాయి, కొన్ని సందర్భాల్లో అనువాదం మరీ విపరీతంగా కూడా ఉంది, కానీ ఇతర అనువాదాలు కాస్త స్వేచ్ఛగానే ఉన్నాయి. అనువదించిన కొన్ని పుస్తకాలలో సమాచారం క్లుప్తంగా ఉంటే కొన్నింట్లో విస్తృతంగా ఉంది. సా.శ.పూ. రెండవ శతాబ్దం చివరికల్లా హెబ్రీ లేఖనాల్లోని పుస్తకాలన్నీ గ్రీకు భాషలో చదవడానికి వీలైంది. ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ, హెబ్రీ లేఖనాలను గ్రీకులోనికి అనువదించడం యొక్క ప్రభావం ఆ అనువాదకులు ఊహించగల్గిన దాన్ని ఎంతగానో మించిపోయింది.

యాపెతు షేము గుడారములలోనా?

సెప్టాజింట్‌ను గురించి చర్చిస్తూ, టాల్ముడ్‌ ఆదికాండము 9:27ను ఉటంకిస్తుంది: “యాపెతు . . . షేము గుడారములలో నివసించును.” (మెగిల్లాహ్‌ 9బి, బాబిలోనియన్‌ టాల్ముడ్‌) సెప్టాజింట్‌లోని గ్రీకు భాషా సౌందర్యం ద్వారా, యాపెతు (యావాను తండ్రి, ఈయన నుండి గ్రీకులు ఉత్పన్నమయ్యారు) షేము (ఇశ్రాయేలు జనాంగానికి పితరుడు) గుడారములలో నివసించాడని టాల్ముడ్‌ సూచనార్థకంగా చెబుతుంది. అయితే, సెప్టాజింట్‌ అనువాదం ద్వారా షేము యాపెతు గుడారములలో నివసించాడని కూడా చెప్పవచ్చు. అదెలా?

అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ విజయాల తర్వాత సా.శ.పూ. నాలుగవ శతాబ్దం రెండవ భాగంలో, జయించిన రాజ్యాలన్నింట్లో గ్రీకు భాషను, గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. ఈ విధానం హెల్లెనైజేషన్‌ అని పిలువబడింది. యూదులు తాము ఎడతెగని సాంస్కృతిక దాడిని ఎదుర్కొంటున్నట్లు భావించారు. గ్రీకు సంస్కృతీ, గ్రీకు తత్వజ్ఞానం గనుక కొనసాగితే యూదుల మతమే క్షీణిస్తుంది. ఈ దాడిని ఏది త్రిప్పికొట్టగలదు?

యూదులు సెప్టాజింట్‌ను అనువదించడం వెనుక ఉండగల ఒక ఉద్దేశం గురించి యూదా బైబిలు అనువాదకుడు మాక్స్‌ మార్గోలస్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “అనువాదాన్ని చేపట్టాలన్న తలంపు యూదా సమాజానికే పుట్టిందని మనం అనుకుంటే, వేరొక ఉద్దేశం కూడా అందులో ఇమిడి ఉండవచ్చు—యూదా ధర్మశాస్త్రాన్ని అన్యజనాంగాలకు కనబరచి, హెల్లెనీయుల [గ్రీకుల] జ్ఞానసంపదలకు సాటిరాగల ఒక సంస్కృతి యూదులకు ఉందని లోకానికి చాటడమే ఆ ఉద్దేశం.” ఆ విధంగా, హెబ్రీ లేఖనాలను గ్రీకు మాట్లాడే లోకానికి అందుబాటులో ఉంచడం ఇటు ఒక రకమైన ఆత్మరక్షణా చర్యగానూ అటు ఒక ఎదురుదాడిగానూ ఉంది.

అలెగ్జాండరు అనుసరించిన హెల్లెనైజేషన్‌ విధానం గ్రీకును అంతర్జాతీయ భాషగా చేసింది. ఆయన సామ్రాజ్యం రోమనుల వశం అయినప్పుడు కూడా సామాన్య (లేక కొయినె) గ్రీకు వివిధ రాజ్యాల్లో వ్యాపార భాషగానూ వ్యావహారిక భాషగానూ ఉండిపోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాల మూలంగా జరిగిందో లేక సహజ పరిణామమో గాని, హెబ్రీ లేఖనాల సెప్టాజింట్‌ అనువాదం త్వరితగతిన దేవునితోనూ యూదుల ధర్మశాస్త్రంతోను మునుపు పరిచయం లేని అనేక మంది యూదులు-కాని ప్రజల ఇండ్లలోనికీ వారి హృదయాల్లోనికీ చొచ్చుకుపోయింది. ఫలితాలు విస్మయాన్ని కలిగించాయి.

యూదామత ప్రవిష్టులు, దైవభయం గలవారు

సా.శ. మొదటి శతాబ్దానికల్లా, “మోషే శాసనాలలోని సౌందర్యమూ ఔన్నత్యమూ యూదుల్లో మాత్రమే గాక ఇతర జనాంగాల్లో కూడా గౌరవాన్ని సంపాదించాయి” అని ఫైలో వ్రాయగల్గాడు. మొదటి శతాబ్దంలో పాలస్తీనాకు వెలుపల నివసిస్తున్న యూదుల గురించి యూదా చరిత్రకారుడైన యోసఫ్‌ క్లావుస్నెర్‌ ఇలా అంటున్నాడు: “ఈ లక్షలాది మంది యూదులు చిన్ని ప్రాంతమైన పాలస్తీనా నుండి వలసరావడం మూలంగా మాత్రమే ఏర్పడ్డారన్నది నమ్మడం కష్టం. సంఖ్యాపరంగా ఇంత గొప్ప అభివృద్ధి అనేకమంది స్త్రీపురుషులు యూదామత ప్రవిష్టులు కావడంవల్ల కూడా జరిగింది.”

అయితే, ఈ ఆకర్షణీయమైన విషయాలు మొత్తం పరిస్థితిని వర్ణించవు. యూదా చరిత్రలో ప్రొఫెసర్‌ అయిన షే జె. డి. కోహెన్‌ అనే రచయిత ఇలా అంటున్నాడు: “సా.శ.పూ. చివరి శతాబ్దాల్లోనూ, సా.శ. మొదటి రెండు శతాబ్దాల్లోనూ చాలామంది అన్యజనులు—స్త్రీలూ పురుషులూ—యూదా మతానికి మతమార్పిడి చేసుకున్నారు. అయితే యూదామతంలోని కొన్ని అంశాల్ని స్వీకరించినప్పటికీ ఆ మతానికి మతమార్పిడి చేసుకోని అన్యజనులు వారికన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.” క్లావుస్నెర్‌ అలాగే కోహెన్‌ ఇద్దరూ కూడా, ఇలా మతమార్పిడి చేసుకోనివారిని సూచిస్తూ వారిని దైవభయం గలవారు అని పిలుస్తున్నారు, ఈ మాట ఆ కాలానికి చెందిన గ్రీకు సాహిత్యంలో చాలా తరచుగా కనిపిస్తుంది.

యూదామత ప్రవిష్టునికీ దైవభయం గలవానికీ తేడా ఏమిటి? యూదామత ప్రవిష్టులు పూర్తిగా మతమార్పిడి చేసుకున్నవారు, అన్ని విధాలుగానూ యూదులుగా పరిగణించబడతారు, ఎందుకంటే వారు (ఇతర అన్ని దేవతలనూ విసర్జించి) ఇశ్రాయేలు దేవుడ్ని స్వీకరించారు, సున్నతి పొందారు, ఇశ్రాయేలు జనాంగంలో కలిసిపోయారు. అందుకు భిన్నంగా, దైవభయం గలవారిని గురించి కోహెన్‌ ఇలా చెబుతున్నాడు: “ఈ అన్యజనులు యూదా ఆచారాల్ని ఎన్నింటినో పాటించినప్పటికీ, ఏదో ఒక రీతిలో యూదుల దేవుడ్ని పూజించినప్పటికీ వారు తమను తాము యూదులుగా పరిగణించుకోలేదు, ఇతరులూ వారిని యూదులుగా దృష్టించలేదు.” క్లావుస్నెర్‌ వారిని “మధ్యేవాదులు” అని వర్ణించాడు, ఎందుకంటే వారు యూదామతాన్ని అంగీకరించారు, “దాని ఆచారవ్యవహారాల్లో కొంతభాగాన్ని పాటించారు, కానీ . . . పూర్తి యూదులు కాలేదు.”

మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొనే యూదులతో చేసిన చర్చల మూలంగానో, లేక యూదులు తమ నడవడిలో, ఆచారాల్లో, ప్రవర్తనలో వేరుగా ఉండడాన్ని గమనించడం మూలంగానో బహుశ కొంతమంది దేవునిలో ఆసక్తి కనపర్చి ఉంటారు. అయితే, ఈ దైవభయం గలవారు యెహోవా దేవుడ్ని గురించి నేర్చుకోవడంలో సెప్టాజింట్‌ ప్రధాన ఉపకరణంగా సహాయపడింది. మొదటి శతాబ్దపు దైవభయం గలవారి సంఖ్య కచ్చితంగా తెలుసుకునే మార్గమేదీ లేనప్పటికీ, సెప్టాజింట్‌ నిస్సందేహంగా దేవుడ్ని గురించిన కొంత జ్ఞానాన్ని రోమా సామ్రాజ్యం అంతటా వెదజల్లింది. సెప్టాజింట్‌ ద్వారా చాలా ప్రాముఖ్యమైన ఒక పునాది కార్యం కూడా జరుగుతూ వచ్చింది.

సెప్టాజింట్‌ మార్గాన్ని సిద్ధపర్చడంలో సహాయపడింది

క్రైస్తవ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సెప్టాజింట్‌ ప్రత్యేకమైన ఒక పాత్రను నిర్వహించింది. సా.శ. 33, పెంతెకొస్తు దినాన క్రైస్తవ సంఘం స్థాపించబడినప్పుడు అక్కడ ఉన్నవారిలో గ్రీకు మాట్లాడే యూదులు చాలామంది ఉన్నారు. ఆ తొలిదశలో క్రీస్తు శిష్యులైన వారిలో యూదామత ప్రవిష్టులు కూడా ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 2:5-11; 6:1-6; 8:26-38) యేసు అపొస్తలుల, ఇతర తొలి శిష్యుల ప్రేరేపిత వ్రాతలు సాధ్యమైనంత విస్తారమైన పరిధిలోని పాఠకులకు ఉద్దేశించబడ్డాయి గనుక అవి గ్రీకులో నమోదయ్యాయి.a అందుకని, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కనబడే అనేక హెబ్రీ లేఖనాల ఉదాహృత భాగాలు సెప్టాజింట్‌పై ఆధారపడి ఉన్నాయి.

సహజ యూదులూ, యూదామత ప్రవిష్టులు కాని ఇతరులూ రాజ్య సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్యజనుడైన కొర్నేలీ, “తన యింటివారందరితో కూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.” సా.శ. 36లో క్రీస్తు శిష్యులుగా బాప్తిస్మం పొందిన అన్యజనుల్లో కొర్నేలీ, ఆయన కుటుంబమూ, ఆయన ఇంటివద్ద సమకూడిన ఇతరులూ ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 10:1, 2, 24, 44-48; లూకా 7:2-10 పోల్చండి.) అపొస్తలుడైన పౌలు ఆసియా మైనరు, గ్రీసు అంతటా ప్రయాణించినప్పుడు ఆయన అప్పటికే దైవభయం ప్రదర్శించిన అనేకమంది అన్యజనులకూ, అలాగే ‘దేవుడ్ని ఒప్పుకున్న గ్రీసుదేశస్థుల’కూ ప్రకటించాడు. (అపొస్తలుల కార్యములు 13:16, 26; 17:4) కొర్నేలీ మరితర అన్యజనులూ సువార్తను స్వీకరించడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారు? మార్గాన్ని సిద్ధం చేయడానికి సెప్టాజింట్‌ సహాయం చేసింది. సెప్టాజింట్‌ “ఎంత కీలకమైన పుస్తకం అంటే, అది లేకుండా అటు క్రైస్తవమత సామ్రాజ్యమూ ఇటు పాశ్చాత్య సంస్కృతీ రెండూ కూడా వృద్ధిచెంది ఉండేవికావు” అని ఒక విద్వాంసుడు క్లుప్తీకరిస్తున్నాడు.

సెప్టాజింట్‌ “ప్రేరేపణ”ను కోల్పోతుంది

సెప్టాజింట్‌ను విస్తృతంగా ఉపయోగించడం చివరికి యూదుల్లో విపరీతమైన ప్రతికూల ప్రతిస్పందనను రేకెత్తించింది. ఉదాహరణకు, క్రైస్తవులతో చర్చించేటప్పుడు సెప్టాజింట్‌ తప్పుడు అనువాదమని యూదులు చెప్పేవారు. సా.శ. రెండవ శతాబ్దంకల్లా యూదా సమాజం తానొకనాడు ప్రేరేపితమైనదని పొగిడిన అనువాదాన్ని పూర్తిగా విసర్జించింది. రబ్బీలు ఇలా చెబుతూ 72 మంది అనువాదకుల కథను తిరస్కరించారు: “ఒకానొక సమయంలో టాలమీ రాజు కోసం ఐదుగురు పెద్దలు తోరహ్‌ను గ్రీకులోనికి వ్రాశారు, ఆ దినం ఇశ్రాయేలుకు బంగారు దూడ చేసినప్పటి దినమంత అమంగళకరమైన దినం, ఎందుకంటే వారు తోరహ్‌ను సరిగా అనువదించలేకపోయారు.” రబ్బీల దృక్కోణాలతో కచ్చితంగా పొందిక కల్గివుండేందుకుగాను, గ్రీకులోనికి ఒక క్రొత్త అనువాదాన్ని తయారు చేసేందుకు రబ్బీలు అనుమతినిచ్చారు. రబ్బీ అయిన అకీవా శిష్యుడైన యూదామత ప్రవిష్టుడగు అక్విలా దాన్ని సా.శ. రెండవ శతాబ్దంలో అనువదించాడు.

యూదులు సెప్టాజింట్‌ను ఉపయోగించడం మానేశారు, కానీ అది అప్పుడప్పుడే ఉద్భవిస్తున్న రోమన్‌ కాథలిక్కుల ప్రామాణిక “పాత నిబంధన”గా అయ్యింది. చివరికి జెరోమ్‌ యొక్క లాటిన్‌ వల్గేట్‌ దాని స్థానాన్ని ఆక్రమించింది. అసలుకు ఉన్న స్థానాన్ని ఒక అనువాదం ఎన్నటికీ తీసుకోలేకపోయినప్పటికీ, యెహోవా దేవుడ్ని గురించి, యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్యాన్ని గురించిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించింది. నిజంగానే, సెప్టాజింట్‌ లోకాన్నే మార్చిన ఒక బైబిలు అనువాదం.

[అధస్సూచీలు]

a మత్తయి సువార్త మొదట హెబ్రీలో వ్రాయబడి ఉండవచ్చు, అటు తర్వాత గ్రీకులో ఉత్పత్తి అయివుండవచ్చు.

[31వ పేజీలోని చిత్రం]

పౌలు ప్రకటించిన చాలామంది ప్రజలు “సెప్టాజింట్‌”ను అర్థంచేసుకున్నారు

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Israel Antiquities Authority

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి