ఆఫ్రికా సంస్కృతిలో కన్యాశుల్కం
బైబిలు కాలాల్లో లాగానే నేడు కొన్ని సంస్కృతుల్లో ఒక పురుషుడు స్త్రీని పెండ్లి చేసుకోవాలంటే కొంత కన్యాశుల్కం చెల్లించాలన్న నియమం ఉంది. యాకోబు తన కాబోయే మామగారైన లాబానుతో, “నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.” (ఆదికాండము 29:18) యాకోబు రాహేలును ఎంతగానో ప్రేమించబట్టే ఆయన అంత పెద్దమొత్తం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు—అది ఏడు సంవత్సరాల జీతంతో సమానం! లాబాను ఈ ప్రతిపాదనకు అంగీకరించాడు, కానీ యాకోబుకు తన పెద్ద కుమార్తెయైన లేయానిచ్చి వివాహం చేసి మోసం చేశాడు. అటుతర్వాత లాబాను యాకోబుతో వ్యవహరించిన విధానాలు మోసపూరితంగానే ఉన్నాయి. (ఆదికాండము 31:41) లాబాను వస్తుపరమైన లాభాలపై దృష్టిని కేంద్రీకరించడం ఆయన తనపై తన కుమార్తెలకున్న గౌరవాన్ని పోగొట్టుకునేలా చేసింది. వారు ఇలా అడిగారు: “అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును [బొత్తిగా] తినివేసెను.”—ఆదికాండము 31:15.
విచారకరంగా, వస్తుదాయిక సంపత్తిపైన దృష్టి కేంద్రీకరించే నేటి లోకంలో చాలామంది తల్లిదండ్రులు లాబాను లాగానే ఉన్నారు. కొంతమందైతే ఇంకా ఘోరంగా కూడా ఉన్నారు. ఆఫ్రికాలోని ఒక వార్తాపత్రిక ప్రకారం, కొన్ని వివాహాల్లో “కేవలం దురాశాపరులైన తండ్రులు లాభం పొందడం కోసమే” సంప్రదింపులు జరుగుతాయి. తమ కుమార్తెలను ఏదైనా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి ఒక మాధ్యమంగా దృష్టించేలా శోధించే ఆర్థికపరమైన ఒత్తిళ్లు మరొక కారకం.a
కన్యాశుల్కం ఎవరెక్కువిస్తే వారికిచ్చి పెళ్లి చేయడానికని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు తమ కుమార్తెకు పెళ్లి చేయకుండా ఆపుతారు. ఇది గంభీరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఉత్తర ఆఫ్రికాలోని ఒక వార్తాపత్రిక విలేఖరి ఇలా వ్రాశాడు: “అత్తింటివారు మూర్ఖపు పట్టుదలతో కోరే పెద్దమొత్తంలోని వరకట్నాన్ని తప్పించుకోవడానికి అబ్బాయి అమ్మాయి పెండ్లి చేసుకోవడానికి కలిసి పారిపోతారు.” పెద్ద పెద్ద మొత్తాల్లో కన్యాశుల్కాన్ని డిమాండు చేయటం మూలంగా తలెత్తిన సమస్యల్లో లైంగిక అనైతికత కూడా ఒక సమస్యగా ఉంటోంది. అంతేగాక, కొంతమంది యువకులు ఎలాగోలా తంటాలుపడి కొనుక్కున్నా చివరకు భారీ అప్పుల్లో కూరుకుపోయారు. “తల్లిదండ్రులు కాస్త సహేతుకంగా ఉండాలి” అని దక్షిణాఫ్రికాలోని ఒక సమాజ సేవకుడు అంటున్నాడు. “వారు పెద్ద మొత్తాలు డిమాండు చేయకూడదు. నూతన వధూవరులు జీవనోపాధిని వెదుక్కోవాలి. . . . మరి ఆ యౌవనస్థుడ్ని ఎందుకు దివాలా తీయించాలి?”
కన్యాశుల్కాన్ని ఇవ్వడంలోనూ దాన్ని పొందడంలోనూ సంప్రదింపులు జరిపేటప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు సహేతుకంగా ఉండటంలో ఎలా ఒక మంచి మాదిరిని ఉంచగలరు? ఇది గంభీరమైన విషయం, ఎందుకంటే బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తుంది: “మీ సహనమును [“సహేతుకతను,” NW] సకల జనులకు తెలియబడనియ్యుడి.”—ఫిలిప్పీయులు 4:5.
సహేతుకమైన బైబిలు సిద్ధాంతాలు
క్రైస్తవ తల్లిదండ్రులు కన్యాశుల్కం కోసం సంప్రదింపులు చేయాలా వద్దా అన్నది వారి వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. వారు అలా చేయాలనుకుంటే అటువంటి సంప్రదింపులు బైబిలు సిద్ధాంతాలకు అనుగుణ్యంగా జరగాలి. “ధనాపేక్షలేనివారై . . . యుండుడి” అని దేవుని వాక్యం చెబుతుంది. (హెబ్రీయులు 13:5) ఒకవేళ ఈ సిద్ధాంతం వివాహ సంప్రదింపులలో స్పష్టంగా కనిపించకపోయినట్లైతే ఒక క్రైస్తవ తండ్రి తాను ఒక మంచి మాదిరిని ఉంచడంలేదన్న విషయాన్ని ప్రదర్శిస్తున్నాడన్న మాట. క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న పురుషులు “సహేతుకమైనవారిగా” ఉండాలి, ‘ధనాపేక్షులు’గానో, ‘దుర్లాభాన్ని అపేక్షించు’వారిగానో గాక “సహేతుకమైన”వారిగా ఉండాలి. (1 తిమోతి 3:3, 8, NW) పశ్చాత్తాపం ఏమాత్రం ప్రదర్శించక దురాశతో పెద్ద పెద్ద మొత్తాల్లో కన్యాశుల్కాన్ని గుంజే ఒక క్రైస్తవుడు సంఘం నుండి బహుశా బహిష్కృతుడు కావచ్చు.—1 కొరింథీయులు 5:11, 13; 6:9, 10.
దురాశ వలన ఏర్పడే సమస్యల మూలాన, ఇటువంటి దోపిడీకి గురికావడం నుండి తమ పౌరులను రక్షించడానికి కొన్ని దేశాల ప్రభుత్వాలు కొన్ని చట్టాల్ని చేశాయి. ఉదాహరణకు ఇండియాలో వరకట్నాన్ని ఇవ్వడానికిగానీ, తీసుకోవడానికిగానీ చేసే ఏ విధమైన సంప్రదింపులైనా సరే చట్టరహితమైనవిగానూ, శిక్షార్హమైనవిగానూ పరిగణించబడతాయి. ఇండియాలోని క్రైస్తవులు ఆ చట్టానికి లోబడతారు. పశ్చిమ ఆఫ్రికాలోని ఒక దేశమైన టోగోలోని ఒక చట్టం, కన్యాశుల్కం “వస్తురూపేణా గాని డబ్బు రూపేణా గాని లేక రెండు విధాల్లో గానీ చెల్లించవచ్చు” అని పేర్కొంటుంది. ఆ చట్టం ఇలా జతచేస్తుంది: “ఏ కేసులో కూడా చెల్లించే మొత్తం 10,000 CFA ఫ్రాంక్‌లు (800 రూపాయలు) మించకూడదు.” చట్టానికి విధేయులుగా ఉండమని బైబిలు పదే పదే క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తుంది. (తీతుకు 3:1) ఒకవేళ అటువంటి చట్టాన్ని ప్రభుత్వం అమల్లో పెట్టకపోయినప్పటికీ కూడా నిజ క్రైస్తవుడు దానికి విధేయత కనపర్చాలని నిశ్చయించుకోవాలి. ఆ విధంగా ఆయన దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని కాపాడుకోగల్గుతాడు, ఇతరులు అభ్యంతరపడడానికీ కారణం కాడు.—రోమీయులు 13:1, 5; 1 కొరింథీయులు 10:32, 33.
కొన్ని సంస్కృతులలో కన్యాశుల్కం విషయంలో చేసే సంప్రదింపులు మరొక ప్రాముఖ్యమైన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటాయి. బైబిలు ప్రకారం, తన ఇంట్లోని వ్యవహారాలకు తండ్రి బాధ్యత వహిస్తాడు. (1 కొరింథీయులు 11:3; కొలొస్సయులు 3:18, 20) అందుకని, సంఘంలోని బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు, ‘తమ పిల్లలనూ, తమ యింటివారినీ బాగుగా ఏలువారునై యుండే’ పురుషులై ఉండాలి.—1 తిమోతి 3:12.
అయితే, కొన్ని సమాజాల్లో వివాహ సంప్రదింపులను కుటుంబ శిరస్సు యొక్క బంధువులకు విడిచిపెట్టడం సామాన్య విషయంగా ఉండవచ్చు. ఈ బంధువులు కన్యాశుల్కంలో కొంత వాటాను డిమాండు చేస్తారు కూడా. ఇది క్రైస్తవ కుటుంబాలకు ఒక పరీక్షగా తయారుకావచ్చు. కొంతమంది కుటుంబ శిరస్సులు ఆచారం పేరిట అవిశ్వాసులైన బంధువులు పెద్ద పెద్ద మొత్తాల్లో కన్యాశుల్కం గుంజేలా అనుమతిస్తారు. ఇది కొన్నిసార్లు క్రైస్తవ అమ్మాయిని ఒక అవిశ్వాసికిచ్చి పెండ్లి చేసేందుకు నడిపించింది. అది క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే” పెండ్లి చేసుకోవాలన్న ఉద్బోధకు విరుద్ధంగా ఉంటుంది. (1 కొరింథీయులు 7:39) ఒక కుటుంబ శిరస్సు తన పిల్లల ఆధ్యాత్మిక సంక్షేమానికి ప్రమాదకరంగా ఉండే నిర్ణయాలు చేయడానికి అవిశ్వాసులైన బంధువులను అనుమతిస్తే, ఆయనను ‘తన యింటివారిని బాగుగా ఏలువానిగా’ దృష్టించలేము.—1 తిమోతి 3:4.
దైవభక్తిగల పితరుడైన అబ్రాహాము విషయంలోలా, ఒక క్రైస్తవ తండ్రి తన పిల్లల్లో ఒకరి వివాహ సంప్రదింపుల్లో సూటిగా భాగం వహించకపోతే అప్పుడు? (ఆదికాండము 24:2-4) ఒకవేళ అటువంటి సంప్రదింపులు జరపడానికి మరొకరు నియమించబడితే, క్రైస్తవ తండ్రి ఆ సంప్రదింపులు చేసే వ్యక్తి బైబిలులోని సిద్ధాంతాలకు అనుగుణ్యంగా ఉన్న నిర్దేశకాలను అనుసరిస్తున్నాడని రూఢిపర్చుకోవాలి. అంతేగాక, కన్యాశుల్కం విషయమై సంప్రదింపులు చేయడానికి ఎటువంటి చర్యలైనా తీసుకునే ముందు, క్రైస్తవ తల్లిదండ్రులు విషయాలను జాగ్రత్తగా ఆలోచించి, అసమంజసమైన ఆచారాలు లేక డిమాండ్లలో కొట్టుకుపోకుండా చూసుకోవాలి.—సామెతలు 22:3.
క్రైస్తవత్వం కాని వైఖరులను నివారించడం
బైబిలు గర్వాన్నీ, “జీవపు డంబము”నూ ప్రదర్శించడాన్ని ఖండిస్తుంది. (1 యోహాను 2:16; సామెతలు 21:4) అయినా, క్రైస్తవ సంఘంతో సహవసించే కొంతమంది వ్యక్తులు తమ వివాహ సంప్రదింపులలో ఈ వైఖరులను ప్రదర్శించారు. కొంతమంది పెద్ద మొత్తంలో కన్యాశుల్కాన్ని ఇచ్చుకోవడం ద్వారా లేక పుచ్చుకోవడం ద్వారా తమ గొప్పను ప్రదర్శిస్తూ ఈ లోకాన్ని అనుకరిస్తారు. మరోవైపు, ఆఫ్రికాలోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయం ఒకటి ఇలా నివేదిస్తుంది: “తమ అత్తమామల కుటుంబం తమ డిమాండ్లలో సహేతుకంగానే ఉన్నప్పటికీ కొంతమంది భర్తలు వారిపట్ల గౌరవాన్ని చూపించలేదు, తమ భార్యలను ‘మేక’ ధరకు కొన్నామని దృష్టించారు.”
హెచ్చైన కన్యాశుల్కం సంపాదించాలన్న దురాశ కొంతమంది క్రైస్తవులను కబళించింది, విషాదకరమైన పరిణామాలకు దారితీసింది. ఉదాహరణకు, మరొక వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ఈ నివేదికను పరిశీలించండి: “అవివాహిత సహోదరులు వివాహం చేసుకోవడము లేక అవివాహిత సహోదరీలకు భాగస్వామిని వెదుక్కోవడము సామాన్యంగా కష్టంగా ఉంటుంది. దాని పర్యవసానంగా లైంగిక అనైతికత మూలంగా సంఘ బహిష్కరణల సంఖ్య పెరుగుతుంది. కొంతమంది సహోదరులు బంగారమో లేక వజ్రాలో అమ్మి పెండ్లి చేసుకునేందుకు సరిపడా డబ్బును సంపాదిద్దామని గనులకు వెళ్తారు. ఇందుకు వారికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టవచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా పట్టవచ్చు. వారు సంఘంలోని సహోదరుల సహవాసం నుండి దూరంగా వెళ్లిపోతారు గనుక ఆధ్యాత్మికంగా బలహీనం అయిపోతారు.”
అటువంటి విచారకరమైన పరిణామాలను నివారించడానికి, క్రైస్తవ తల్లిదండ్రులు సంఘంలోని పరిణతి చెందినవారి మాదిరిని అనుసరించాలి. తాను ఒక తండ్రి కాకపోయినప్పటికీ అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులతో తన వ్యవహారాల్లో సహేతుకంగా ఉన్నాడు. ఆయన ఎవరిపైనా ఆర్థిక భారాన్ని వేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 20:33) నిశ్చయంగా క్రైస్తవ తల్లిదండ్రులు కన్యాశుల్కం విషయమైన సంప్రదింపులు చేసేటప్పుడు ఆయన చూపిన నిస్వార్థ మాదిరిని పరిగణలోనికి తీసుకోవాలి. నిజానికి, పౌలు ఇలా వ్రాయడానికి దైవికంగా ప్రేరేపించబడ్డాడు: “సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.”—ఫిలిప్పీయులు 3:17.
సహేతుకతను ప్రదర్శించిన మాదిరులు
వివాహ సంప్రదింపుల విషయానికొస్తే, సహేతుకతను ప్రదర్శిస్తూ చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు చక్కని మాదిరిని ఉంచారు. జోసెఫ్, ఆయన భార్య అయిన మాయ్ విషయాన్ని పరిశీలించండి, వారు పూర్తికాల సువార్తికులుగా సేవచేస్తున్నారు.b వారు కొన్నిసార్లు కన్యాశుల్కం విషయమై చేసే సంప్రదింపులు ఒక సమస్యగా ఉండే సాలమన్ దీవుల్లో నివసిస్తున్నారు. అటువంటి సమస్యల్ని నివారించడానికి జోసెఫ్, మాయ్‌లు తమ కుమార్తె అయిన హెలెన్‌కు పొరుగున ఉన్న ఒక ద్వీపంలో వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. వారు తమ మరో కుమార్తె అయిన ఎస్తెర్ వివాహం విషయంలో కూడా అలాగే చేశారు. సామాన్యంగా స్వీకరించే కన్యాశుల్కం కన్నా చాలా తక్కువ మొత్తం తన అల్లుడినుండి స్వీకరించేందుకు కూడా జోసెఫ్ ఒప్పుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడో అడిగితే జోసెఫ్ ఇలా వివరించాడు: “నేను నా అల్లుడి మీద భారాన్ని వేయదల్చుకోలేదు, ఆయన పయినీరు.”
ఆఫ్రికాలోని చాలామంది యెహోవాసాక్షులు కూడా సహేతుకతను ప్రదర్శిస్తూ చక్కని మాదిరిని చూపించారు. కొన్ని ప్రాంతాల్లో, అసలు కన్యాశుల్కం గురించిన సంప్రదింపులు జరపడానికి ముందే విస్తృత కుటుంబంలోని సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని సాధారణంగా కోరబడుతుంది. అంతేగాక, పెండ్లికూతుర్ని తన స్వంతం చేసుకోవడానికి, పెండ్లికుమారుడు తన కాబోయే బావమరిదికి అవసరమయ్యే కన్యాశుల్కాన్ని భవిష్యత్తులో తాను భరిస్తానని వాగ్దానం చేయాల్సిరావచ్చు.
అందుకు భిన్నంగా, కోసీ ఆయన భార్య అయిన మారల ఉదాహరణను పరిశీలించండి. వారి కుమార్తె బెబోకో ఇటీవల యెహోవాసాక్షుల ఒక ప్రయాణ పైవిచారణకర్తను పెండ్లి చేసుకుంది. వివాహానికి ముందు, బంధువులు పెద్ద మొత్తంలోని కన్యాశుల్కంలో తమ వాటా ఇమ్మని తల్లిదండ్రులపైన చాలా ఒత్తిడిని తెచ్చారు. అయితే, ఆ తల్లిదండ్రులు స్థిరంగా నిలబడి, అటువంటి డిమాండ్లకు లొంగిపోలేదు. బదులుగా, వారు తమ కూతురి కోసం స్వల్పమైన మొత్తంలో కన్యాశుల్కాన్ని కోరుతూ కాబోయే అల్లుడితో సూటిగా సంప్రదింపులు జరిపారు, అందులో సగం డబ్బు నూతన వధూవరులు తమ పెండ్లిరోజు కోసం సిద్ధపడేందుకు తిరిగి ఇచ్చివేశారు.
అదే దేశంలోని మరొక ఉదాహరణ: ఒక యౌవన సాక్షి పేరు ఈటోంగో. మొదట్లో ఆమె కుటుంబంలోనివారు కోరిన కన్యాశుల్కం సమంజసంగానే ఉంది. కానీ బంధువులు ఆ మొత్తాన్ని పెంచమని డిమాండు చేశారు. వాతావరణం చాలా వేడెక్కింది, ఆ బంధువులు తమ పంతం నెగ్గించుకుంటారనే అనిపించింది. ఈటోంగో స్వతహాగా కాస్త బిడియస్తురాలైనప్పటికీ ఆమె లేచి నిలబడి తాను ఉత్సాహవంతుడైన క్రైస్తవుడైన సాంజెను మునుపు చేసిన ఏర్పాట్ల ప్రకారమే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు మర్యాదపూర్వకంగానే చెప్పింది. తర్వాత ఆమె ధైర్యంగా “అమ్బీ కె” (దాని అర్థం, “విషయం ఇక్కడితో సమాప్తం”), అని చెప్పి కూర్చుంది. ఆమె క్రైస్తవ తల్లి అయిన సాంబీకో ఆమెకు మద్దతు ఇచ్చింది. చర్చ ఇక ముందుకు సాగలేదు, ఆ జంట మునుపు అనుకున్నట్లుగానే పెండ్లి చేసుకున్నారు.
ప్రేమపూర్వకమైన క్రైస్తవ తల్లిదండ్రులు కన్యాశుల్కం నుండి తాము పొందే వ్యక్తిగత ప్రయోజనం కన్నా వారు పరిగణలోనికి తీసుకునే విషయాలు ఇంకా ఉన్నాయి. కామెరూన్‌లోని ఒక భర్త ఇలా వివరిస్తున్నాడు: “మా అత్తగారు, నేను తనకు కన్యాశుల్కంగా ఏమి ఇవ్వాలని అనుకున్నా ఆ డబ్బును తన కుమార్తె అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలని ప్రతీసారి నాకు చెబుతుంది.” ప్రేమపూర్వకమైన తల్లిదండ్రులు తమ పిల్లల ఆధ్యాత్మిక సంక్షేమం విషయమై కూడా చింతిస్తారు. ఉదాహరణకు జింబాబ్వేలో నివసించే ఫారై, రూడోలను పరిశీలించండి, వారు దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించే పనిలో చాలా సమయాన్ని గడుపుతారు. జీతం సంపాదించక పోయినప్పటికీ, వారు సాధారణంగా అడిగే డబ్బుకన్నా చాలా తక్కువ స్వీకరించి తమ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. వారిచ్చే వివరణ? తమ కుమార్తెలు, యెహోవాను నిజంగా ప్రేమించే యువకులను పెండ్లి చేసుకుని సుఖపడాలని వారు కోరుకున్నారు. “మేము ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా ఎంచినది మా కుమార్తెల, మా అల్లుళ్ళ ఆధ్యాత్మికతే” అని వారు వివరిస్తున్నారు. ఎంతటి సేదదీర్పుకరమైన మాటలు! పెండ్లి చేసుకున్న తమ పిల్లల ఆధ్యాత్మిక, భౌతిక సంక్షేమాల కోసం ప్రేమపూర్వకమైన చింతను కనపర్చే అత్తామామలు నిజంగా గొప్ప ప్రశంసకు అర్హులు.
సహేతుకతను ప్రదర్శించడంలోని ప్రయోజనాలు
సాలమన్ దీవుల్లోని జోసెఫ్, మాయ్‌లు ఉదారత్వంతోను జాగ్రత్తగాను తమ కుమార్తెల వివాహాలను జరిపించినందుకు వారు ఆశీర్వదించబడ్డారు. ఆ విధంగా వారి అల్లుళ్లు అప్పుల్లో కూరుకుపోలేదు. బదులుగా, ఆ రెండు జంటలూ రాజ్య సందేశాన్ని వ్యాప్తిచేసే పూర్తికాల సేవలో అనేక సంవత్సరాలు వెచ్చించగల్గుతున్నారు. అంతా నెమరువేసుకుంటూ జోసెఫ్ ఇలా చెబుతున్నాడు: “నేనూ, నా కుటుంబమూ తీసుకున్న నిర్ణయాలు మాకు గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి. నిజమే, కొన్నిసార్లు మేము చేసింది అర్థంచేసుకోని కొందరినుండి చాలా గొప్ప ఒత్తిడి వచ్చింది, కానీ నా పిల్లలు యెహోవా సేవలో బిజీగాను స్థిరంగాను ఉండడం చూసి నేను మంచి మనస్సాక్షినీ సంతృప్తినీ అనుభవిస్తున్నాను. వారు కూడా సంతోషంగా ఉన్నారు, నేనూ నా భార్యా ఎంతో సంతోషిస్తున్నాము.”
మరొక మంచి ప్రయోజనం ఏమిటంటే, అత్తామామలతో మంచి సంబంధాలు. ఉదాహరణకు, స్వంత అక్కాచెల్లెళ్లైన తమ భార్యలతోపాటు జోండై, సిబూసీసోలు వాచ్ టవర్ సొసైటీ యొక్క జింబాబ్వే బ్రాంచిలో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. వారి మామగారైన డాకరాయ్ పూర్తికాల సువార్తికుడు, ఆయన జీతం సంపాదించే వ్యక్తి కాదు. కన్యాశుల్కం గురించిన సంప్రదింపుల సమయంలో ఆయన వారు ఇవ్వగల్గింది ఏమైనా పుచ్చుకుంటానని చెప్పాడు. “మేము మా మామగారిని ఎంతో ప్రేమిస్తాము” అని జోండై, సిబూసీసోలు చెబుతున్నారు, “ఒకవేళ ఆయనకు ఏమైనా అవసరమొస్తే మా యథాశక్తి సహాయం చేయడానికి మేము వెనుకాడము.”
అవును, కన్యాశుల్కం గురించిన సంప్రదింపుల్లో సహేతుకతను ప్రదర్శించడం కుటుంబ సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఉదాహరణకు, క్రొత్తగా దంపతులైనవారు అప్పుల్లో కూరుకుపోరు, తద్వారా వారు వైవాహిక జీవితానికి అలవాటుపడటానికి వారికి సులభంగా ఉంటుంది. ప్రకటించడమూ, శిష్యుల్ని చేయడమూ వంటి అత్యవసరమైన కార్యంలో పూర్తికాలం సేవచేయడం వంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను వెంబడించడానికి అనేకమంది యౌవన దంపతులకు సహాయం చేసింది. తత్ఫలితంగా ఇది, వివాహానికి ఆరంభకుడైన ప్రేమపూర్ణుడైన యెహోవా దేవునికి మహిమను తెస్తుంది.—మత్తయి 24:14; 28:19, 20.
[అధస్సూచీలు]
a కొన్ని సంస్కృతుల్లో పరిస్థితి తారుమారుగా ఉంది. పెండ్లి కుమారుని తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె తల్లిదండ్రుల నుండి వరకట్నం కోరతారు.
b ఈ శీర్షికలో మారుపేర్లు ఉపయోగించబడ్డాయి.
[27వ పేజీలోని బాక్సు]
వారు కన్యాశుల్కాన్ని తిరిగి ఇచ్చేశారు
కొన్ని సమాజాల్లో, కన్యాశుల్కం గనుక తక్కువగా ఉంటే పెండ్లికుమార్తెనూ, ఆమె తల్లిదండ్రులనూ నీచంగా దృష్టిస్తారు. ఆ విధంగా, గర్వమూ కుటుంబ హోదాను ఆడంబరపూర్వకంగా చూపించుకోవాలన్న కోరికా కొన్నిసార్లు హెచ్చైన మొత్తం కోసం సంప్రదింపులు చేసేందుకు పురికొల్పుతాయి. నైజీరియాలోని లాగోస్‌లో ఒక కుటుంబం, మన మనస్సుకు సేదదీర్పునిచ్చే మార్పును ప్రదర్శించింది. ఆ కుటుంబంలోని అల్లుడు డేలె ఇలా వివరిస్తున్నాడు:
“సాంప్రదాయిక కన్యాశుల్కం విషయంలో అయ్యే అనేక ఖర్చులను, ఖరీదైన బట్టలను కొనాల్సివచ్చే అనేక ఖర్చులను నేను చేయకుండా నా భార్య తరఫు కుటుంబం నన్ను విముక్తుడ్ని చేసింది. నా కుటుంబం వారికి కన్యాశుల్కాన్ని ఇచ్చినప్పటికీ, వారి ప్రతినిధి, ‘ఈ అమ్మాయిని మీరు ఒక భార్యగా స్వీకరిస్తున్నారా లేక ఒక కుమార్తెగానా?’ అని అడిగాడు. నా కుటుంబ సభ్యులు ముక్త కంఠంతో, ‘మేము ఆమెను ఒక కుమార్తెగా స్వీకరిస్తున్నాము’ అని అన్నారు. అటుతర్వాత అదే కవరులో మాకు కన్యాశుల్కం తిరిగి ఇచ్చివేయబడింది.
“నేటి వరకు కూడా మా వివాహాన్ని జరిపించిన విధానానికి నేను నా అత్తామామలకు కృతజ్ఞుడనై ఉన్నాను. అది వారిపట్ల నేను గొప్ప గౌరవభావాన్ని కలిగివుండేలా చేసింది. వారి ఉన్నతమైన ఆధ్యాత్మిక దృష్టి, వారు నాకు ఎంతో సన్నిహితమైన బంధువులుగా వారిని దృష్టించేలా చేసింది. నేను నా భార్యను ఎలా దృష్టిస్తానన్న దానిపైన కూడా అది గొప్ప ప్రభావాన్ని చూపించింది. నేను తనపట్ల ప్రగాఢమైన మెప్పుదలను పెంపొందించుకున్నాను, నాపట్ల తన కుటుంబంవారు వ్యవహరించిన విధానమే దానిక్కారణం. ఏదైనా విషయంలో మాకిద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోతే, అది ఒక సమస్యగా తయారవ్వడానికి నేను అనుమతించను. ఒక్కసారి నేను ఆమె ఎటువంటి కుటుంబం నుండి వచ్చిందో జ్ఞాపకం చేసుకుంటే చాలు, ఆ అభిప్రాయభేదం మాయమవుతుంది.
“నా తరఫు కుటుంబమూ, ఆమె తరఫు కుటుంబమూ స్నేహమనే బంధంలో దృఢమయ్యాయి. ఇప్పటికీ, మా వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయినప్పటికీ, మా నాన్నగారు నా భార్య తరఫు కుటుంబానికి కానుకలనూ, తినుబండారాలను పంపిస్తుంటారు.”