కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/1 పేజీలు 13-18
  • దైవపరిపాలనకు పూర్తి అనుగుణ్యంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనకు పూర్తి అనుగుణ్యంగా ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన దైవపరిపాలన అంటే ఏమిటి?
  • దైవపరిపాలనా సంస్థ
  • లౌకిక పరిపాలనను గురించిన దైవపరిపాలనా దృక్కోణం
  • దేవుని మహిమకు మొదటిస్థానం ఇవ్వండి
  • “దేవునిపోలి నడుచుకొనుడి”
  • దైవపరిపాలన ద్వారా—యెహోవా పరిపాలిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దైవపరిపాలనలో కాపరులూ గొర్రెలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • భాగం 10 తుదకు పరిపూర్ణ ప్రభుత్వం!
    తేజరిల్లు!—1992
  • మన మహోన్నత సృష్టికర్తతో కలిసి మందను కాయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/1 పేజీలు 13-18

దైవపరిపాలనకు పూర్తి అనుగుణ్యంగా ఉండండి

“యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును.”—యెషయా 33:22.

1. అనేకమంది ప్రజలకు ప్రభుత్వం ఎందుకు ఒక ఆసక్తికరమైన విషయమైయుంది?

ప్రభుత్వమనే అంశం ప్రతి ఒక్కరికీ ఎంతో ఆసక్తికరమైనదే. మంచి ప్రభుత్వం శాంతి సౌభాగ్యాలను తెస్తుంది. “న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 29:4) మరో వైపున, చెడ్డ ప్రభుత్వం అన్యాయం, భ్రష్టత్వం, అణిచివేతలకు కారణమౌతుంది. “దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.” (సామెతలు 29:2) చరిత్రంతటిలో, మానవులు అనేక రకాలైన ప్రభుత్వాలను ప్రయత్నించి చూశారు, అయితే విచారకరంగా, తమ పరిపాలకుల అణిచివేత మూలంగా వారు తరచూ ‘నిట్టూర్పులు విడిచారు.’ (ప్రసంగి 8:9) తన ప్రజలకు నిత్య సంతృప్తిని తీసుకురావడంలో ఏ విధమైన ప్రభుత్వమైనా విజయం సాధించగలదా?

2. ప్రాచీన ఇశ్రాయేలు ప్రభుత్వాన్ని వర్ణించడానికి “దైవపరిపాలన” ఎందుకు ఒక చక్కని వర్ణన అయ్యుంది?

2 చరిత్రకారుడైన జోసీఫస్‌ ఇలా వ్రాసినప్పుడు ఒక ప్రత్యేక రకమైన ప్రభుత్వం గురించి ప్రస్తావించాడు: “కొంతమంది ప్రజలు సర్వోన్నత రాజకీయ శక్తిని రాజులకూ, ఇతర స్వల్పజన పాలనకూ అప్పగించారు, ఇంకా ఇతరులు ప్రజలకే అప్పగించారు. అయితే మన శాసనకర్త [మోషే] ఈ రాజకీయ విధానాల్లో దేనికీ ఆకర్షితుడు కాలేదుగానీ, ‘దైవపరిపాలన’ అనే పదాన్ని—అదీ తప్పనిసరి అయితేనే—ఉపయోగించగలిగేలాంటి విధమైన రూపాన్ని తన శాసన వ్యవస్థకు ఇచ్చి, సర్వోన్నతాధిపత్యాన్నంతటినీ, అధికారాన్నంతటినీ దేవుని చేతుల్లో పెట్టాడు.” (ఎగైనెస్ట్‌ ఓపియన్‌, II 164-5) కాన్‌సైస్‌ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరి ప్రకారం, దైవపరిపాలన అంటే “దేవుడు చేసే ఒకవిధమైన పరిపాలన.” ఈ పదం బైబిల్లో కనిపించదు, కాని ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రభుత్వాన్ని అది చక్కగా వర్ణిస్తుంది. ఇశ్రాయేలీయులకు ఒక దృశ్య రాజు ఉన్నప్పటికీ, వారి నిజమైన పరిపాలకుడు యెహోవాయే. ఇశ్రాయేలీయుల ప్రవక్తయైన యెషయా ఇలా చెప్పాడు: “యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు.”—యెషయా 33:22.

నిజమైన దైవపరిపాలన అంటే ఏమిటి?

3, 4. (ఎ) నిజమైన దైవపరిపాలన అంటే ఏమిటి? (బి) త్వరలోనే, దైవపరిపాలన మానవజాతికంతటికీ ఏ ఆశీర్వాదాలను తెస్తుంది?

3 జోసీఫస్‌ ఆ పదాన్ని సృష్టించినప్పటి నుండి, అనేక సమాజాలు దైవపరిపాలనలుగా వర్ణించబడ్డాయి. కొన్ని ఓర్పులేనివిగా, ఉన్మాదమైనవిగా, క్రూరంగా అణిచివేసేవిగా కనిపించాయి. అవి నిజమైన దైవపరిపాలనలేనా? జోసీఫస్‌ ఆ పదాన్ని ఉపయోగించిన భావంలో మాత్రం కాదు. సమస్యేమిటంటే, “దైవపరిపాలన” యొక్క భావం విస్తృతం చేయబడింది. వర్‌ల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా దాన్ని, “రాష్ట్రాన్ని యాజకుడు లేక యాజకులు పరిపాలించే ప్రభుత్వం, దానిలో యాజకత్వంలోని సభ్యులకు, పౌర మరియు రాజకీయ అంశాల్లో అధికారం ఉంటుంది” అని నిర్వచిస్తోంది. అయితే, నిజమైన దైవపరిపాలన అంటే యాజకుల ప్రభుత్వం కాదు. అది నిజంగా దేవుని పరిపాలన, విశ్వ సృష్టికర్తయైన యెహోవా దేవుని ప్రభుత్వం.

4 త్వరలోనే, మొత్తం భూమి అంతా దైవపరిపాలన క్రిందకు వస్తుంది, అది ఎంతటి ఆశీర్వాదమై ఉంటుందో కదా! “దేవుడు తానే వారి [మానవజాతి] దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].” (ప్రకటన 21:3, 4) ఏ అపరిపూర్ణ మానవ యాజకుల పరిపాలనా అలాంటి ఆనందాన్ని తీసుకురాలేదు. కేవలం దేవుని పరిపాలన మాత్రమే దాన్ని తీసుకురాగలదు. కాబట్టి, నిజక్రైస్తవులు రాజకీయ చర్య ద్వారా దైవపరిపాలనను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించరు. దేవుడు తన స్వంత సమయంలో, తన స్వంత విధానంలో ప్రపంచవ్యాప్తంగా దైవపరిపాలనను స్థాపించాలని వారు సహనంతో ఎదురు చూస్తారు.—దానియేలు 2:44.

5. నేడు దైవపరిపాలన ఎక్కడ ఉనికిలో ఉంది, దాని గురించి ఏ ప్రశ్నలు లేవదీయబడ్డాయి?

5 అయితే, ఈ మధ్యలో, ఒక నిజమైన దైవపరిపాలన ఉనికిలో ఉంది. ఎక్కడ? దేవుని పరిపాలనకు స్వచ్ఛందంగా విధేయులై, ఆయన చిత్తాన్ని చేయడానికి సహకరించే వారి మధ్యన అది ఉంది. అలాంటి నమ్మకమైనవారు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక “జనము”గా, దాని ఆధ్యాత్మిక “దేశము”లో సమకూర్చబడ్డారు. వారు ఎవరంటే, “దేవుని ఇశ్రాయేలు”లోని శేషింపబడినవారు మరియు 55 లక్షలకన్నా ఎక్కువమందిగా ఉన్న వారి క్రైస్తవ సహవాసులు. (యెషయా 66:8; గలతీయులు 6:16) “సకల యుగములలో రాజై”యున్న యెహోవా దేవుడు నియమించిన పరలోక రాజైన యేసుక్రీస్తుకు వీరు విధేయులైయున్నారు. (1 తిమోతి 1:17; ప్రకటన 11:15) ఈ సంస్థ ఏ విధంగా దైవపరిపాలన సంబంధమైనది? దాని సభ్యులు లౌకిక ప్రభుత్వాల అధికారాన్ని ఎలా దృష్టిస్తారు? వారి ఆధ్యాత్మిక సమాజంలో అధికారంగల మానవులు దైవపరిపాలనా సూత్రాన్ని ఎలా అమలులో పెడతారు?

దైవపరిపాలనా సంస్థ

6. దృశ్య మానవ సంస్థ దేవునిచే ఎలా పరిపాలించబడగలదు?

6 ఒక మానవ సంస్థ, అదృశ్యమైన పరలోకంలో వసించే యెహోవాచే ఎలా పరిపాలించబడగలదు? (కీర్తన 103:19) దానితో సహవసించేవారు, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము” అన్న ప్రేరేపిత ఉపదేశాన్ని అనుసరిస్తారు గనుక అది సాధ్యం. (సామెతలు 2:6; 3:5) వారు తాము “క్రీస్తు నియమమును” అనుసరిస్తూ తమ అనుదిన జీవితాల్లో ప్రేరేపిత బైబిలు సూత్రాలను అన్వయించుకుంటూ దేవుడు తమను పరిపాలించేందుకు అనుమతిస్తారు. (గలతీయులు 6:2; 1 కొరింథీయులు 9:21; 2 తిమోతి 3:16; మత్తయి 5:22, 28, 39; 6:24, 33; 7:12, 21 కూడా చూడండి.) ఇది చేయడానికి, వారు బైబిలు విద్యార్థులై ఉండాలి. (కీర్తన 1:1-3) వారు మానవులను అనుసరించరు గానీ, “ఘనులై”న ప్రాచీన కాలంనాటి బెరయవారి వలె తాము నేర్చుకుంటున్న విషయాలను ఎల్లప్పుడూ బైబిలుతో పరిశీలించి చూస్తారు. (అపొస్తలుల కార్యములు 17:10, 11; కీర్తన 119:33-36) వారు కీర్తనల గ్రంథకర్తవలె ఇలా ప్రార్థిస్తారు: “నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.”—కీర్తన 119:66.

7. దైవపరిపాలనలో ఏ విధమైన పర్యవేక్షణా క్రమం ఉంది?

7 ప్రతి సంస్థలోనూ, అధికారంగలవారు లేక నడిపింపునిచ్చేవారు ఒకరుండాలి. యెహోవాసాక్షులు దానికి మినహాయింపేమీ కాదు, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ అధికార నిర్మాణాన్ని వారు అనుసరిస్తారు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరింథీయులు 11:3) దీనికి అనుగుణ్యంగా, కేవలం యోగ్యులైన పురుషులే సంఘాల్లో పెద్దలుగా సేవచేస్తారు. “ప్రతి పురుషునికి శిరస్సు” అయిన యేసు పరలోకంలో ఉన్నప్పటికీ, ఆయనతోపాటు పరలోకం నుండి పరిపాలించే నిరీక్షణవున్న ఆయన అభిషిక్త సహోదరులలోని “శేషించిన” వారు ఇప్పటికీ భూమిమీద ఉన్నారు. (ప్రకటన 12:17; 20:6) వీళ్లే సంయుక్త ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ రూపొందారు. క్రైస్తవులు ఆ ‘దాసుని’ పర్యవేక్షణను అంగీకరించడం ద్వారా, యేసుకు విధేయులై ఉంటారు, తద్వారా యేసుకు శిరస్సైన యెహోవాకూ విధేయులై ఉంటారు. (మత్తయి 24:45-47; 25:40) ఈ విధంగా దైవపరిపాలన క్రమమైనది. “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.”—1 కొరింథీయులు 14:33.

8. క్రైస్తవ పెద్దలు దైవపరిపాలనా సూత్రానికి ఎలా మద్దతునిస్తారు?

8 క్రైస్తవ పెద్దలు తమకున్న పరిమిత అధికారాన్ని తాము ఎలా ఉపయోగిస్తాము అనే దాని విషయంలో తాము యెహోవాకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని గుర్తిస్తారు గనుక దైవపరిపాలనా సూత్రానికి మద్దతునిస్తారు. (హెబ్రీయులు 13:17) నిర్ణయాలు తీసుకోవడంలో, వారు తమ స్వంత జ్ఞానంపై కాకుండా దేవుని జ్ఞానంపై ఆధారపడతారు. ఈ విషయంలో వారు యేసు మాదిరిని అనుసరిస్తారు. ఆయన జీవించినవారిలోకెల్లా జ్ఞానవంతుడు. (మత్తయి 12:42) అయినప్పటికీ, ఆయన యూదులకిలా చెప్పాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు.” (యోహాను 5:19) పెద్దలు కూడా రాజైన దావీదుకు ఉన్నటువంటి దృక్పథాన్నే కల్గివుంటారు. ఆయనకు దైవపరిపాలనలో ఒక బాధ్యతాయుతమైన అధికారం ఉండేది. అయినప్పటికీ, ఆయన తన స్వంత మార్గాన్ని కాక యెహోవా మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడ్డాడు. ఆయనిలా ప్రార్థించాడు: “యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. . . . సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.”—కీర్తన 27:11.

9. దైవపరిపాలనలోవున్న వివిధ సేవాధిక్యతల గురించీ, నిరీక్షణల గురించీ, సమర్పిత క్రైస్తవులకు ఏ సమతూకంగల దృక్కోణం ఉంది?

9 సంఘంలో అధికారం కేవలం యోగ్యులైన పురుషులకే ఇవ్వడం సబబేనా అని లేక కొంతమందికి మాత్రం పరలోక నిరీక్షణ ఉండగా ఇతరులకైతే భూనిరీక్షణ ఉండడం సబబేనా అని కొందరు ప్రశ్నించారు. (కీర్తన 37:29; ఫిలిప్పీయులు 3:20) అయితే, ఈ ఏర్పాట్లు దేవుని వాక్యంలో పొందుపర్చబడి ఉన్నాయని సమర్పిత క్రైస్తవులు గుణగ్రహిస్తారు. అవి దైవపరిపాలనా సంబంధ ఏర్పాట్లు. సాధారణంగా వాటిని ప్రశ్నించేది బైబిలు సూత్రాలను గుర్తించని వారే. అంతేగాక, రక్షణకు సంబంధించినంత మేరకు యెహోవా దృష్టిలో స్త్రీ పురుషులు సమానమేనని క్రైస్తవులకు తెలుసు. (గలతీయులు 3:28) విశ్వసర్వాధిపతి యొక్క ఆరాధకులుగా ఉండడమే నిజక్రైస్తవులు పొందగల సర్వోన్నతమైన ఆధిక్యత, యెహోవా తమకు ఏ పాత్ర ఇస్తే దాన్ని నిర్వర్తించడంలో వారు అనందాన్ని పొందుతారు. (కీర్తన 31:23; 84:10; 1 కొరింథీయులు 12:12, 13, 18) అంతేగాక, పరలోకంలోనైనా లేక పరదైసు భూమిమీదనైనా నిత్యజీవ నిరీక్షణ నిజంగా ఎంతో అద్భుతమైనది.

10. (ఎ) యోనాతాను ఏ చక్కని దృక్పథాన్ని కనబర్చాడు? (బి) క్రైస్తవులు నేడు యోనాతాను చూపించినలాంటి అదే దృక్పథాన్ని ఎలా చూపిస్తారు?

10 అలా, యెహోవాసాక్షులు రాజగు సౌలు కుమారుడైన, దైవభయంగల యోనాతానును పోలివున్నారు. యోనాతాను చాలా సమర్థుడైన రాజై ఉండేవాడు. అయితే, సౌలు అవిశ్వాస్యత మూలంగా, యెహోవా ఇశ్రాయేలీయుల రెండవ రాజుగా దావీదును ఎంపిక చేసుకున్నాడు. దీన్నిబట్టి యోనాతాను వ్యసనపడ్డాడా? లేదు. ఆయన దావీదుకు మంచి స్నేహితుడై, ఆయనను సౌలు నుండి కాపాడాడు కూడా. (1 సమూయేలు 18:1; 20:1-42) అదే విధంగా, భూనిరీక్షణగల వారు పరలోక నిరీక్షణగలవారిని చూసి ఈర్ష్యపడరు. సంఘంలో దైవపరిపాలనా సంబంధ అధికారం గలవారిని చూసి నిజ క్రైస్తవులు అసూయ చెందరు. బదులుగా, తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీల నిమిత్తం వారు చేస్తున్న తీవ్రమైన కృషిని గుర్తించి, “వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా” ఎంచుతారు.—1 థెస్సలొనీకయులు 5:12, 13.

లౌకిక పరిపాలనను గురించిన దైవపరిపాలనా దృక్కోణం

11. దైవపరిపాలనకు విధేయులయ్యే క్రైస్తవులు లౌకిక అధికారాలను ఎలా దృష్టిస్తారు?

11 యెహోవాసాక్షులు దేవుని పరిపాలన అయిన దైవపరిపాలన క్రింద ఉంటే, వారు దేశ పాలకులను ఎలా దృష్టిస్తారు? తన అనుచరులు “లోకసంబంధులు కారు” అని యేసు చెప్పాడు. (యోహాను 17:16) అయితే, లౌకిక ప్రభుత్వాలైన “కైసరు”కు తాము ఋణపడి ఉన్నామని క్రైస్తవులు గుర్తిస్తారు. వారు “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించ” వలెనని యేసు చెప్పాడు. (మత్తయి 22:21) బైబిలు ప్రకారం, మానవ ప్రభుత్వాలు “దేవునివలననే నియమింపబడి యున్నవి.” అధికారాలన్నిటికీ మూలమైన యెహోవా, ప్రభుత్వాలు ఉనికిలో ఉండేందుకు అనుమతిస్తున్నాడు, తమ పరిధిలో ఉన్నవారికి అవి మంచి చేయాలని ఆయన నిరీక్షిస్తాడు. అవి అలా చేసినప్పుడు, అవి “దేవుని పరిచారకులు” అవుతాయి. క్రైస్తవులు “[తమ] మనస్సాక్షిని బట్టి” తాము నివసిస్తున్న దేశంలోని ప్రభుత్వానికి విధేయులై ఉంటారు. (రోమీయులు 13:1-7) అయితే, ప్రభుత్వం దేవుని చట్టానికి వ్యతిరేకమైనదేదైనా కోరితే, క్రైస్తవులు ‘మనుష్యులకు కాదుగానీ దేవునికే లోబడతారు.’—అపొస్తలుల కార్యములు 5:29.

12. క్రైస్తవులు అధికారాల చేత హింసించబడినప్పుడు వారు ఎవరి మాదిరిని అనుసరిస్తారు?

12 ప్రభుత్వాధికారాలు క్రైస్తవులను హింసిస్తున్నట్లయితే అప్పుడేమిటి? అప్పుడు వారు ఎంతో హింసను ఎదుర్కొన్న తొలి క్రైస్తవుల మాదిరిని అనుసరిస్తారు. (అపొస్తలుల కార్యములు 8:1; 13:50) ఈ విశ్వాస పరీక్షలు వారు ఊహించనివేమీ కాదు, ఎందుకంటే అవి వస్తాయని యేసు వారిని హెచ్చరించాడు. (మత్తయి 5:10-12; మార్కు 4:17) అయినప్పటికీ, ఆ తొలి క్రైస్తవులు తమను హింసించిన వారి మీద పగ తీర్చుకోలేదు; ఒత్తిడి సమయంలో వారి విశ్వాసం సన్నగిల్లనూ లేదు. బదులుగా, వారు యేసు మాదిరిని అనుసరించారు: “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” (1 పేతురు 2:21-23) అవును, సాతాను పన్నుగడలపై క్రైస్తవ సూత్రాలు విజయం సాధించాయి.—రోమీయులు 12:21.

13. యెహోవాసాక్షులు తమకు వ్యతిరేకంగా లేవదీయబడిన హింసకూ, అబద్ధ ఆరోపణలకూ ఎలా ప్రతిస్పందించారు?

13 నేడు కూడా అది నిజమైయుంది. యేసు ప్రవచించినట్లుగానే, ఈ ఇరవయ్యవ శతాబ్దంలో, యెహోవాసాక్షులు నిరంకుశ పరిపాలకుల చేతుల్లో హింసలు అనుభవించారు. (మత్తయి 24:9, 13) కొన్ని దేశాల్లో, అధికారులు ఈ యథార్థమైన క్రైస్తవులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని అధికారులపైకి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించేవారు అబద్ధాలనూ తప్పుడు వార్తలనూ వ్యాప్తి చేశారు. అయితే, అలాంటి ‘దుష్కీర్తి’ ఆపాదించబడినప్పటికీ, సాక్షులు తమ చక్కని ప్రవర్తన ద్వారా తమను తాము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకున్నారు. (2 కొరింథీయులు 6:4, 8) సాధ్యమైనప్పుడు, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వారు తమ కేసును తమ దేశంలోని కోర్టుల ఎదుట విన్నవించుకుంటారు. సువార్తను బహిరంగంగా సమర్థించడానికి తమకు అందుబాటులో ఉన్న మార్గాలన్నిటినీ వారు ఉపయోగించుకుంటారు. (ఫిలిప్పీయులు 1:7) తర్వాత, చట్టపరిధిలో తాము చేయగలిగినదంతా చేసిన తర్వాత, వారు విషయాలను యెహోవా చేతుల్లో విడిచిపెడతారు. (కీర్తన 5:8-12; సామెతలు 20:22) అవసరమైతే, వారు తొలి క్రైస్తవులలా, నీతి కోసం హింసించబడడానికి భయపడరు.—1 పేతురు 3:14-17; 4:12-14, 16.

దేవుని మహిమకు మొదటిస్థానం ఇవ్వండి

14, 15. (ఎ) దైవపరిపాలనకు మద్దతునిచ్చేవారికి ప్రాముఖ్యమైనదేమిటి? (బి) తన పర్యవేక్షణ స్థానంలో సొలొమోను ఏ సందర్భంలో వినయం విషయంలో చక్కని మాదిరినుంచాడు?

14 యేసు తన అనుచరులకు ప్రార్థించడం నేర్పించినప్పుడు, మొదట ఆయన చెప్పిన విషయం యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడమే. (మత్తయి 6:9) దీనికి అనుగుణ్యంగా, దైవపరిపాలన క్రింద జీవిస్తున్న వారు తమ స్వంత మహిమను కాదుగాని దేవుని మహిమను కోరుకుంటారు. (కీర్తన 29:1, 2) మొదటి శతాబ్దంలో, కొంతమంది “దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి,” అంటే వారు మనుష్యుల మెప్పును పొందాలని కోరుకున్నారు గనుక వారు యేసును అనుసరించడానికి నిరాకరించారు, అలాంటి వారికి ఇది ఒక అడ్డంకయ్యిందని బైబిలు నివేదిస్తోంది. (యోహాను 12:42, 43) వాస్తవానికి, తమ స్వంత ప్రాముఖ్యత కంటే యెహోవాకే మొదటి స్థానం ఇవ్వాలంటే వినయం ఉండాలి.

15 ఈ విషయంలో సొలొమోను చక్కని దృక్పథాన్ని కనపర్చాడు. సొలొమోను తాను నిర్మించిన మహిమాయుతమైన ఆలయ ప్రతిష్ఠ సమయంలో చెప్పిన మాటలనూ, నెబుకద్నెజరు తన నిర్మాణ ఘనకార్యాల గురించి చెప్పిన మాటలనూ పోల్చి చూడండి. మితిమీరిన గర్వంతో నెబుకద్నెజరు ఇలా ప్రగల్భాలు పలికాడు: “బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా?” (దానియేలు 4:30) దానికి భిన్నంగా, సొలొమోను వినయంగా ఇలా చెబుతూ తన సాఫల్యాల గురించి తగ్గించి చెప్పుకున్నాడు: “మనుష్యలతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?” (2 దినవృత్తాంతములు 6:14, 15, 18; కీర్తన 127:1) సొలొమోను తనను తాను ఘనపర్చుకోలేదు. తాను కేవలం యెహోవా ప్రతినిధియని ఆయనకు తెలుసు, అందుకే ఆయనిలా వ్రాశాడు: “అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.”—సామెతలు 11:2.

16. పెద్దలు తమను తాము ఘనపర్చుకోకుండా ఉండడం ద్వారా తాము ఒక ఆశీర్వాదంగా ఎలా నిరూపించబడ్డారు?

16 అలాగే క్రైస్తవ పెద్దలు తమను తాము ఘనపర్చుకోరు గానీ యెహోవాను ఘనపరుస్తారు. వారు పేతురిచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరిస్తారు: “ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తుద్వారా మహిమపరచబడును.” (1 పేతురు 4:11) అపొస్తలుడైన పౌలు “అధ్యక్షపదవిని” ఒక ప్రముఖ స్థానంగా వర్ణించలేదు గానీ, “దొడ్డపని” అని వర్ణించాడు. (1 తిమోతి 3:1) పెద్దలు సేవచేయడానికే నియమించబడ్డారు గాని పరిపాలించడానికి కాదు. వారు దేవుని మందకు బోధకులూ, కాపరులూను. (అపొస్తలుల కార్యములు 20:28; యాకోబు 3:1) వినయమనస్కులైన, స్వయంత్యాగపూరితులైన పెద్దలు సంఘానికి నిజంగా ఒక ఆశీర్వాదమే. (1 పేతురు 5:2, 3) ‘అట్టివారిని ఘనపరుస్తూ,’ ఈ “అంత్య దినములలో” దైవపరిపాలనను ఉన్నతపర్చడానికి యెహోవా అంతమంది యోగ్యులైన పెద్దలను అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి.—ఫిలిప్పీయులు 2:29; 2 తిమోతి 3:1.

“దేవునిపోలి నడుచుకొనుడి”

17. దైవపరిపాలన క్రింద ఉన్నవారు ఏ యే విధాల్లో దేవుడ్ని అనుకరిస్తారు?

17 అపొస్తలుడైన పౌలు ఇలా పురికొల్పాడు: “ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:1) దైవపరిపాలనకు విధేయులై ఉండేవారు, అపరిపూర్ణ మానవులుగా తమకు వీలైనంత మేరకు దేవుని వలే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, యెహోవా గురించి బైబిలిలా చెబుతుంది: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:3, 4) ఈ విషయంలో దేవుడ్ని అనుకరించడానికి, క్రైస్తవులు విశ్వాసాన్నీ, నీతినీ, న్యాయం విషయంలో సమతూకమైన భావాన్నీ కల్గివుండడానికి ప్రయత్నిస్తారు. (మీకా 6:8; 1 థెస్సలొనీకయులు 3:6; 1 యోహాను 3:7) లోకంలో ఎంతో అంగీకరించదగినవిగా ఎంచబడుతున్న అనైతికత, అత్యాశ, దురాశ వంటి అనేకమైన వాటికి వారు దూరంగా ఉంటారు. (ఎఫెసీయులు 5:5) యెహోవా సేవకులు మానవుల ప్రమాణాలను కాదుగానీ దేవుని ప్రమాణాలను అనుసరిస్తారు గనుకనే, ఆయన సంస్థ దైవపరిపాలనా సంబంధమైనదీ, పరిశుభ్రమైనదీ, ఆరోగ్యకరమైనదీ.

18. దేవుని సర్వోత్కృష్టమైన లక్షణం ఏది, క్రైస్తవులు ఈ లక్షణాన్ని ఎలా ప్రతిఫలిస్తారు?

18 యెహోవా దేవుని సర్వోత్కృష్టమైన లక్షణం ప్రేమ. “దేవుడు ప్రేమాస్వరూపి” అని అపొస్తలుడైన యోహాను చెబుతున్నాడు. (1 యోహాను 4:8) దైవపరిపాలన అంటే దేవుని పరిపాలన గనుక, అది ప్రేమ పరిపాలనను సూచిస్తుంది. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు”రని యేసు చెప్పాడు. (యోహాను 13:35) ఈ క్లిష్టమైన అంత్యదినాల్లో దైవపరిపాలనా సంస్థ విశేషమైన ప్రేమ చూపింది. ఆఫ్రికానందలి జాతి విద్వేష పోరాటంలో, యెహోవాసాక్షులు అందరి పట్లా, వారు ఏ జాతి వర్గానికి చెందినవారైనప్పటికీ, అందరి పట్లా ప్రేమను కనపర్చారు. మునుపటి యుగోస్లేవియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు, అన్ని ప్రాంతాల్లోని యెహోవాసాక్షులూ ఒకరికొకరు సహాయం చేసుకున్నారు, అయితే ఇతర మత గుంపులు మాత్రం జాతి ప్రక్షాళన అని పిలువబడేదానిలో భాగంవహించాయి. యెహోవాసాక్షులు పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని వ్యక్తిగత స్థాయిలో అనుసరించడానికి కృషి చేస్తారు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:31, 32.

19. దైవపరిపాలనకు లోబడివుండేవారికి ఇప్పుడు ఏ ఆశీర్వాదాలు లభిస్తున్నాయి, భవిష్యత్తులో వారి కోసం ఏ ఆశీర్వాదాలు వేచివున్నాయి?

19 దైవపరిపాలనకు లోబడి ఉండేవారు గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తారు. వారు దేవునితోనూ, తోటి క్రైస్తవులతోనూ సమాధానంగా ఉంటారు. (హెబ్రీయులు 12:14; యాకోబు 3:17) వారికి జీవితంలో ఒక సంకల్పం ఉంది. (ప్రసంగి 12:13) వారికి ఆధ్యాత్మిక భద్రతా, భవిష్యత్తు కోసం ఒక కచ్చితమైన నిరీక్షణా ఉన్నాయి. (కీర్తన 59:9) వాస్తవానికి వారు, మానవజాతి అంతా దైవపరిపాలన క్రింద ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేదాన్ని ఇప్పుడే చవిచూస్తున్నారు. కాబట్టి, సచేతనమైన సృష్టి అంతా ‘నా పరిశుద్ధ పర్వతమందంతటను హాని చేయదు, నాశముచేయదు; సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును’ అని బైబిలు చెబుతోంది. (యెషయా 11:9) అదెంతటి మహిమకరమైన సమయమై ఉంటుందో కదా! ఇప్పుడు దైవపరిపాలనకు సన్నిహితంగా ఉండడం ద్వారా ఆ భవిష్యద్‌ పరదైసులో మన స్థానాన్ని సుస్థిరం చేసుకుందాము.

మీరు వివరించగలరా?

◻ నిజమైన దైవపరిపాలన అంటే ఏమిటి, నేడు అది ఎక్కడ ఉంది?

◻ మానవులు తమ జీవితాల్లో దైవపరిపాలనకు ఎలా లోబడివుంటారు?

◻ దైవపరిపాలన క్రింద ఉన్న వారంతా తమ ఘనతకంటే దేవుని ఘనతకు ఎక్కువ ప్రాధాన్యతను ఏవిధంగా ఇస్తారు?

◻ దైవపరిపాలనకు మద్దతునిచ్చేవారు అనుకరించే దైవిక లక్షణాలు కొన్ని ఏవి?

[17వ పేజీలోని చిత్రం]

సొలొమోను తనకంటే ఎక్కువగా దేవుడ్ని ఘనపర్చాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి