దేవుని సంస్థలో భాగంగా సురక్షితంగా ఉండండి
“యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.”—సామెతలు 18:10.
1. యేసు చేసిన ప్రార్థన ప్రకారం, క్రైస్తవులు ఏ కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు?
యేసు తాను మరణించడానికి కొంత సమయం ముందు, తన అనుచరుల కోసం పరలోక తండ్రికి ప్రార్థించాడు. ప్రేమపూర్వక శ్రద్ధతో ఆయనిలా చెప్పాడు: “వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.” (యోహాను 17:14, 15) క్రైస్తవులకు ఈ ప్రపంచం ప్రమాదకరమైన స్థలమై ఉండగలదని యేసుకు తెలుసు. అది వారి గురించి అబద్ధాలు చెప్పడం ద్వారా, వారిని హింసించడం ద్వారా వారిపట్ల తనకుగల ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంది. (మత్తయి 5:11, 12; 10:16, 17) అది భ్రష్టత్వానికి కూడా మూలమౌతుంది.—2 తిమోతి 4:10; 1 యోహాను 2:15, 16.
2. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా సురక్షితమైన స్థలాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?
2 దేవుని నుండి వేరైయున్నవారితోనూ, సాతాను ఆధీనంలో ఉన్నవారితోనూ క్రైస్తవులను ద్వేషించే ఈ లోకం రూపొందించబడింది. (1 యోహాను 5:19) ఈ లోకం క్రైస్తవ సంఘంకంటే ఎంతో పెద్దది, సాతాను కూడా ఏ మానవుని కంటేకూడా ఎంతో శక్తిమంతుడు. కాబట్టి, లోకం యొక్క ద్వేషం నిజంగా ఒక విపత్తే. యేసు అనుచరులు ఎక్కడ సురక్షితంగా ఉండవచ్చు? కావలికోట 1922 డిసెంబరు 1 సంచిక సమాధానాన్ని ఇలా సూచించింది: “మనమిప్పుడు దుష్ట దినంలో ఉన్నాము. సాతాను సంస్థకు దేవుని సంస్థకు మధ్య పోరాటం కొనసాగుతోంది. అది ఒక భయంకరమైన పోరాటం.” ఈ పోరాటంలో, దేవుని సంస్థే ఆధ్యాత్మికంగా సురక్షితమైన స్థలం. “సంస్థ” అనే పదం బైబిల్లో లేదు. పూర్వం 1920లలో “దేవుని సంస్థ” అనేది క్రొత్త పదం. అసలు ఈ దేవుని సంస్థ అంటే ఏమిటి? మనం దానిలో ఎలా సురక్షితంగా ఉండవచ్చు?
యెహోవా సంస్థ
3, 4. (ఎ) ఒక నిఘంటువు ప్రకారం, కావలికోట ప్రకారం, సంస్థ అంటే ఏమిటి? (బి) యెహోవాసాక్షుల అంతర్జాతీయ సహవాసాన్ని ఏ భావంలో సంస్థ అని పిలువవచ్చు?
3 కాన్‌సైస్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరి ప్రకారం సంస్థ అంటే “సంస్థీకృత సమూహం” అని భావం. మొదటి శతాబ్దపు క్రైస్తవులను అపొస్తలులు యెరూషలేములోని పరిపాలక సభ పర్యవేక్షణ క్రింద స్థానిక సంఘాలుగా సంస్థీకరించారు. సంస్థ అనే పదానికున్న భావాన్ని మనస్సులో ఉంచుకుని, “సహోదరుల సంఘము”ను ఒక సంస్థ అని పిలవడం సబబే అని మనం అర్థం చేసుకుంటాము. (1 పేతురు 2:17, NW) యెహోవాసాక్షులకు నేడు అటువంటి సంస్థీకృత వ్యవస్థే ఉంది. ‘కాపరులు, ఉపదేశకులు’ వంటి ‘మనుష్యలలో ఈవుల’ మూలంగా మొదటి శతాబ్దపు సంఘ ఐక్యత బలపర్చబడింది. వీరిలో కొంతమంది ఒక సంఘం నుండి మరో సంఘానికి ప్రయాణించేవారు, అయితే ఇతరులు స్థానిక సంఘాల్లో పెద్దలుగా ఉండేవారు. (ఎఫెసీయులు 4:8, 11, 12; అపొస్తలుల కార్యములు 20:28) అలాంటి ‘ఈవులు’ నేడు యెహోవాసాక్షుల ఐక్యతను బలపరుస్తున్నారు.
4 “సంస్థ” అనే పదం గురించి కావలికోట 1922 నవంబరు 1 సంచిక ఇలా చెప్పింది: “రూపకల్పన చేయబడిన ఒక సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంగల వ్యక్తుల సమూహమే సంస్థ.” యెహోవాసాక్షులను ఒక సంస్థ అని పిలవడం వారిని “ఒక తెగగా, అంటే తెగ అనే పదం ఏ భావంలో ఉపయోగించబడుతుందో ఆ భావంలో ఒక తెగగా” చేయదుగానీ, “బైబిలు విద్యార్థులు [యెహోవాసాక్షులు] కేవలం దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారనీ, దాన్ని వారు ప్రభువు అన్నీ చేసినట్లుగా అంటే, క్రమమైన విధంగా చేస్తున్నారనీ దాని భావం” అనీ కావలికోట తెలియజేసింది. (1 కొరింథీయులు 14:33) తన కాలంలోని క్రైస్తవులు అలాగే క్రమమైన విధంగా పనిచేశారని అపొస్తలుడైన పౌలు చూపించాడు. ఆయన అభిషిక్త క్రైస్తవ సహవాసాన్ని, శరీరం సరిగ్గా పని చేయగలిగేలా ప్రతి అవయవమూ తనకు కేటాయింపబడిన పాత్రను సరిగ్గా నిర్వర్తించే అనేక అవయవాలుగల మానవ శరీరంతో పోల్చాడు. (1 కొరింథీయులు 12:12-26) అది సంస్థను గురించిన చక్కని ఉపమానం! క్రైస్తవులు ఎందుకు సంస్థీకరించబడ్డారు? “దేవుని సంకల్పాలను” నెరవేర్చడానికే, అంటే యెహోవా చిత్తాన్ని చేయడానికే.
5. దేవుని దృశ్య సంస్థ అంటే ఏమిటి?
5 నిజ క్రైస్తవులు నేడు ఐక్యంగా ఉంటారనీ, వారు ఒక్క “దేశము”లోకి ఒక్క “జాతి”గా సమకూర్చబడతారనీ, అక్కడ వారు “లోకమందు జ్యోతులవలె” ఉంటారనీ బైబిలు ప్రవచించింది. (యెషయా 66:8, పవిత్ర గ్రంథము; ఫిలిప్పీయులు 2:15) నేడు, ఈ సంస్థీకృత “జాతి”లో 55 లక్షలకంటే ఎక్కువమంది ఉన్నారు. (యెషయా 60:8-10, 22, పవిత్ర గ్రంథము) అయితే, అది మాత్రమే దేవుని సంస్థ యొక్క పూర్తి పరిధికాదు. దేవదూతలు కూడా అందులో చేరివున్నారు.
6. విస్తృత భావంలో, దేవుని సంస్థలో ఎవరు భాగమైవున్నారు?
6 దేవదూతలు, దేవుని మానవ సేవకులతో కలిసి పనిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (ఆదికాండము 28:12; దానియేలు 10:12-14; 12:1; హెబ్రీయులు 1:13, 14; ప్రకటన 14:14-16) కాబట్టి తగిన విధంగానే, కావలికోట 1925 మే 15 సంచిక ఇలా పేర్కొంది: “పరిశుద్ధ దూతలందరూ దేవుని సంస్థలో భాగమే.” అంతేగాక అదింకా ఇలా తెలియజేసింది: “దేవుని సంస్థ యొక్క శిరస్సుగా ప్రభువైన యేసుక్రీస్తు, పూర్తి అధికారాన్నీ శక్తినీ కల్గివున్నాడు.” (మత్తయి 28:18) కాబట్టి, విస్తృత భావంలో చెప్పాలంటే, దేవుని సంస్థ దేవుని చిత్తం చేయడానికి కలిసి పనిచేస్తున్న పరలోకవాసులతోనూ, భూనివాసులతోనూ రూపొందించబడింది. (బాక్సు చూడండి.) దీనిలో భాగమై ఉండడం ఎంతటి ఆధిక్యతో కదా! పరలోకంలోనూ, భూమిమీదా ఉన్న జీవులందరూ ఐక్యంగా యెహోవా దేవుడ్ని స్తుతించడానికి సంస్థీకరించబడే సమయం కొరకు ఎదురు చూడడం ఎంత ఆనందకరమో కదా! (ప్రకటన 5:13, 14) అయితే నేడు దేవుని సంస్థలో ఎలా సురక్షితంగా ఉండవచ్చు?
దేవుని సంస్థలో సురక్షితంగా ఉండడం—ఎలా?
7. దేవుని సంస్థ ఏ విధంగా మనల్ని సురక్షితంగా కాపాడుతుంది?
7 సాతాను నుండీ అతని దుష్టకార్యాల నుండీ మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుని సంస్థ మనకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 6:11) సాతాను ఒకే ఒక్క లక్ష్యంతో యెహోవా ఆరాధకులపైకి ఒత్తిళ్లనూ, హింసలనూ, ప్రలోభాలనూ తెస్తాడు, అదేమిటంటే: ‘వారు నడువవలసిన త్రోవ’ నుండి వారిని ప్రక్కకు తొలగించాలన్నదే. (యెషయా 48:17; పోల్చండి మత్తయి 4:1-11.) మనమీ విధానంలో ఆ దాడులను పూర్తిగా ఎన్నటికీ తప్పించుకోలేము. అయితే, దేవునితోనూ, ఆయన సంస్థతోనూ మనకున్న సన్నిహిత సంబంధం మనల్ని బలపర్చి, కాపాడుతుంది, తద్వారా ‘త్రోవలో’ నిలిచివుండేందుకు మనకు సహాయం చేస్తుంది. దాని ఫలితంగా, మన నిరీక్షణ సఫలమౌతుంది.
8. యెహోవా యొక్క అదృశ్య సంస్థ ఆయన భూసేవకులకు ఎలా మద్దతునిస్తుంది?
8 దేవుని సంస్థ ఎలా సురక్షితమైనది? మొదటిగా, యెహోవా ఆత్మసంబంధ సేవకుల నిరంతర మద్దతు మనకుంటుంది. యేసు తీవ్రమైన ఒత్తిడి నెదుర్కుంటున్నప్పుడు, దేవదూతలు ఆయనకు పరిచారము చేశారు. (లూకా 22:43) పేతురు మరణ విపత్తును ఎదుర్కోబోతుండగా, దేవదూత ఆయనను అద్భుతరీతిగా రక్షించాడు. (అపొస్తలుల కార్యములు 12:6-11) నేడు అటువంటి అద్భుతాలు జరుగకపోయినప్పటికీ, యెహోవా ప్రజలకు వారి ప్రకటనాపనిలో దేవదూతలు మద్దతునిస్తారని వాగ్దానం చేయబడింది. (ప్రకటన 14:6, 7) తరచూ కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నప్పుడు వారు బలాధిక్యమును పొందుతారు. (2 కొరింథీయులు 4:7) అంతేగాక, “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును” అని వారికి తెలుసు.—కీర్తన 34:7.
9, 10. “యెహోవా నామము బలమైన దుర్గము” అని ఎలా చెప్పవచ్చు, మొత్తంగా దేవుని సంస్థకు ఈ సూత్రం ఎలా వర్తిస్తుంది?
9 యెహోవా దృశ్య సంస్థ కూడా సురక్షితమైనది. ఎలా? సామెతలు 18:10 నందు మనమిలా చదువుతాము: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.” కేవలం దేవుని నామాన్ని పునరుచ్చరించడం ద్వారా మనం సురక్షితంగా ఉండగలమని దీని భావం కాదు. బదులుగా, దేవుని నామమును ఆశ్రయించడం యెహోవాయందు మనకు నమ్మకం ఉందని సూచిస్తుంది. (కీర్తన 20:1; 122:4) అంటే ఆయన సర్వోన్నతాధిపత్యానికి మద్దతునివ్వడం, ఆయన కట్టడలనూ సూత్రాలనూ ఉన్నతంగా ఎంచడం, ఆయన వాగ్దానాలందు విశ్వాసం ఉంచడం అని భావం. (కీర్తన 8:1-9; యెషయా 50:10; హెబ్రీయులు 11:6) యెహోవాకు సంపూర్ణ భక్తిని చెల్లించడం అందులో ఇమిడివుంది. యెహోవాను ఈ విధంగా ఆరాధించేవారు మాత్రమే కీర్తనల గ్రంథకర్తతోపాటు ఇలా చెప్పగల్గుతారు: “మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.”—కీర్తన 33:21; 124:8.
10 ఇప్పుడు దేవుని దృశ్య సంస్థలోని వారందరూ మీకాతోపాటు ఇలా చెబుతారు: “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:5) “[దేవుని] నామముకొరకు ఒక జనము” అని బైబిలులో పిలువబడిన “దేవుని ఇశ్రాయేలు” చుట్టూ ఆధునిక-దిన సంస్థ సమకూర్చబడి ఉంది. (గలతీయులు 6:16; అపొస్తలుల కార్యములు 15:14; యెషయా 43:6, 7; 1 పేతురు 2:17) కాబట్టి, యెహోవా సంస్థలో భాగమై ఉండడమంటే, దేవుని నామములో సురక్షితంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న, అందులో సురక్షితంగావున్న ప్రజలలో భాగమై ఉండడమని భావం.
11. యెహోవా సంస్థ, దానిలో భాగమైయున్న వారు ఏ ప్రత్యేకమైన విధాల్లో సురక్షితంగా ఉండేలా చేస్తుంది?
11 అంతేగాక, దేవుని దృశ్య సంస్థ అంటే విశ్వాసుల సమూహం, ఒకరినొకరు బలపర్చుకుని ప్రోత్సహించుకునే తోటి విశ్వాసుల సహవాసం. (సామెతలు 13:20; రోమీయులు 1:12) అది క్రైస్తవ కాపరులు తమ గొఱ్ఱెల విషయంలో శ్రద్ధ తీసుకునే స్థలం, రోగులనూ నిరుత్సాహంతో ఉన్నవారినీ ప్రోత్సహించే స్థలం, పడిపోయినవారిని పునరుద్ధరించే స్థలం. (యెషయా 32:1, 2; 1 పేతురు 5:2-4) ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,’ ఆ సంస్థ ద్వారా ‘తగినవేళ అన్నము’ పెడతాడు. (మత్తయి 24:45) అభిషిక్త క్రైస్తవులతో రూపొందిన ఈ ‘దాసుడు’ ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేష్ఠమైనదాన్ని అంటే నిత్యజీవానికి నడిపించే కచ్చితమైన, బైబిలు ఆధారిత జ్ఞానాన్ని అందజేస్తున్నాడు. (యోహాను 17:3) ‘దాసుడు’ ఇస్తున్న నడిపింపు మూలంగా, క్రైస్తవులు ఉన్నతమైన నైతిక ప్రమాణాలను కల్గివుండేందుకూ, తమ చుట్టూ ఉన్న ప్రమాదకరమైన వాతావరణంలో “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై” ఉండేందుకూ సహాయాన్ని పొందుతున్నారు. (మత్తయి 10:16) వారు ఎల్లప్పుడూ “ప్రభువు కార్యాభివృద్ధి”యందు పనిరద్దీ కల్గివుండేందుకు సహాయాన్ని పొందుతున్నారు, అలా ఉండడం దానంతటదే మనల్ని సురక్షితంగా ఉంచుతుంది.—1 కొరింథీయులు 15:58.
దేవుని సంస్థలో ఎవరు భాగమైవున్నారు?
12. దేవుని పరలోక సంస్థలో ఎవరు ఒక భాగంగా గుర్తించబడ్డారు?
12 దేవుని సంస్థలో భాగమై ఉన్నవారు ఇలా సురక్షితంగా ఉండగలరు గనుక, దానిలో ఎవరెవరు భాగమైవున్నారు? పరలోక సంస్థకు సంబంధించి, ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటన్నదానిలో ఏ విధమైన సందేహమూ లేదు. సాతానూ అతడి దూతలూ ఇక ఎంతమాత్రం పరలోకంలో లేరు. మరో వైపున, నమ్మకమైన దేవదూతలు ఇంకా అక్కడే “మహోత్సవము”లో ఉన్నారు. అంత్యదినములలో “గొఱ్ఱెపిల్ల,” కెరూబులు (“నాలుగు జీవులు”), ‘కోట్లకొలదిమంది దూతలు’ దేవుని సింహాసనానికి సమీపంలో ఉంటారని అపొస్తలుడైన యోహాను చూశాడు. తమ మహిమకరమైన పరలోక వారసత్వంలోకి ఇప్పటికే ప్రవేశించిన అభిషిక్త క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 24 మంది పెద్దలూ వారితోపాటు ఉంటారు. (హెబ్రీయులు 12:22, 23; ప్రకటన 5:6, 11; 12:7-12) అందరూ స్పష్టంగా దేవుని సంస్థలో భాగమైవున్నారు. అయితే మానవులకు సంబంధించి, విషయం అంత స్పష్టంగా లేదు.
13. దేవుని సంస్థలో భాగమైనవారినీ, కానివారినీ యేసు ఎలా గుర్తించాడు?
13 తనను అనుసరిస్తున్నామని చెప్పుకునే కొందరి గురించి యేసు ఇలా చెప్పాడు: “ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.” (మత్తయి 7:22, 23) ఒక వ్యక్తి తన గురించి తాను ఏమని చెప్పుకున్నప్పటికీ, ఆరాధన కోసం ఆయన ఎక్కడికి వెళ్తున్నప్పటికీ ఆయన అక్రమం చేస్తున్నట్లయితే, దేవుని సంస్థలో ఎంతమాత్రం ఒక భాగమై ఉండడు. దేవుని సంస్థలో భాగమై ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలో కూడా యేసు చూపించాడు. ఆయనిలా చెప్పాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.”—మత్తయి 7:21.
14. దేవుని సంస్థలో భాగమైనవారికి దేవుని చిత్తంలోని ఏ అంశాలు తప్పనిసరి అని గుర్తించబడ్డాయి?
14 కాబట్టి, దేవుని సంస్థలో భాగమై ఉండాలంటే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని చేసేవాడై ఉండాలి, దేవుని సంస్థకు “పరలోకరాజ్యము” కేంద్రమైయుంది. అయితే దేవుని చిత్తమేమిటి? పౌలు ఇలా చెప్పినప్పుడు దానిలో ప్రాముఖ్యమైన అంశాన్ని గుర్తించాడు: “[దేవుడు] మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యచ్ఛయంచుచున్నాడు.” (1 తిమోతి 2:4) బైబిలు నుండి కచ్చితమైన జ్ఞానమును పొందాలనీ, దాన్ని తన జీవితంలో అన్వయించుకోవాలనీ, “మనుష్యు”లందరికీ దాన్ని వ్యాప్తి చేయాలనీ ఒక వ్యక్తి నిజంగా ప్రయత్నిస్తున్నట్లయితే అతడు దేవుని చిత్తాన్ని చేస్తున్నట్లే. (మత్తయి 28:19, 20; రోమీయులు 10:13-15) యెహోవా గొఱ్ఱెలకు ఆహారం పెట్టాలన్నదీ, వారి విషయమై శ్రద్ధ తీసుకోవాలన్నదీ కూడా దేవుని చిత్తమైయుంది. (యోహాను 21:15-17) ఈ విషయంలో క్రైస్తవకూటాలు ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తాయి. అలాంటి కూటాలకు హాజరయ్యే అవకాశంవుండీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తి, దేవుని సంస్థలో తన స్థానానికి ముప్పు తెచ్చుకుంటాడు.—హెబ్రీయులు 10:23-25.
లోకంతో స్నేహం
15. యాకోబు తన కాలంనాటి సంఘాలకు ఏ హెచ్చరికనిచ్చాడు?
15 యేసు మరణించిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, ఆయన సహోదరుడైన యాకోబు, దేవుని సంస్థలో ఒకరి స్థానానికి ముప్పు తీసుకురాగల కొన్ని అంశాలను గుర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “వ్యభిచారిణులారా, యూ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) దేవుని శత్రువుకు ఆయన సంస్థలో స్థానంలేదు. అయితే మరి, లోకంతో స్నేహం అంటే ఏమిటి? అది, చెడు సహవాసాలు చేయడం లేక చెడు సహవాసాల్లో నిమగ్నమవ్వడం వంటి వివిధ రూపాల్లో ఉంటుందని వర్ణించబడింది. అంతేగాక యాకోబు మరింత నిర్దిష్టమైన దాన్ని గురించి అంటే తప్పుడు ప్రవర్తనకు నడిపే చెడ్డ మానసిక దృక్పథాల గురించి మాట్లాడుతున్నాడు.
16. లోకంతో స్నేహం దేవునితో శత్రుత్వం అని యాకోబు ఏ సందర్భంలో హెచ్చరించాడు?
16 యాకోబు 4:1-3 నందు మనమిలా చదువుతాము: “మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరుకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.” ఈ మాటలు వ్రాసిన తర్వాతే యాకోబు లోకంతో స్నేహం చేయడం గురించి హెచ్చరించాడు.
17. మొదటి-శతాబ్దపు క్రైస్తవ సంఘంలో, ఏ విధంగా “యుద్ధాలు” మరియు “కలహములు” ఉండేవి?
17 యాకోబు మరణించిన శతాబ్దాల తర్వాత, అబద్ధ క్రైస్తవులు అక్షరార్థంగా యుద్ధాలు చేసి, ఒకరినొకరు హత్య చేసుకున్నారు. అయితే, యాకోబు “దేవుని ఇశ్రాయేలు”లోని మొదటి శతాబ్దపు సభ్యులకు, భవిష్యత్ పరలోక ‘యాజకులకు, రాజులకు’ వ్రాస్తున్నాడు. (ప్రకటన 20:6) వారు అక్షరార్థ యుద్ధాల్లో ఒకరినొకరు హత్య చేసుకోలేదు, ఒకరినొకరు చంపుకోలేదు. మరి క్రైస్తవుల మధ్య అలాంటివి ఉన్నట్లు యాకోబు ఎందుకు మాట్లాడాడు? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని అపొస్తలుడైన యోహాను అన్నాడు. సంఘాల్లోవుండే వ్యక్తిత్వ వైరుధ్యాలనూ, ప్రతీకారాలనూ పౌలు “కలహములు” మరియు “వివాదములు” అని అన్నాడు. (తీతు 3:9; 2 తిమోతి 2:14; 1 యోహాను 3:15-17) అదే విధంగా, యాకోబు మనస్సులో, తోటి క్రైస్తవులను ప్రేమించలేకపోవడం అన్న విషయం ఉందని స్పష్టమౌతుంది. సాతాను లోకంలో ప్రజలు తరచూ ఒకరితో ఒకరు వ్యవహరించే విధంగా క్రైస్తవులు ఒకరితో ఒకరు వ్యవహరించేవారు.
18. క్రైస్తవుల్లో ఏది ప్రేమరహితమైన చర్యలకూ భావాలకూ నడిపించగలదు?
18 క్రైస్తవ సంఘాల్లో అలాంటివి ఎందుకు జరిగాయి? దురాశ మరియు ‘భోగేచ్ఛలు’ వంటి చెడు దృక్పథాల మూలంగానే. గర్వం, అసూయ, ప్రసిద్ధి కావాలనే ప్రగాఢమైన కోరికా వంటివి కూడా సంఘంలోని ప్రేమపూర్వకమైన క్రైస్తవ సహవాసాన్ని పాడుచేయవచ్చు. (యాకోబు 3:6, 14) అలాంటి దృక్పథాలు ఒకరిని లోక స్నేహితునిగా, తద్వారా దేవుని శత్రువుగా చేస్తాయి. అలాంటి దృక్పథాలను కలిగున్న వారెవరూ కూడా దేవుని సంస్థలో భాగమై ఉండగలమని ఎదురుచూడలేరు.
19. (ఎ) తప్పుడు ఆలోచనా విధానం తన హృదయంలో వేళ్లూనుతుందని ఒక క్రైస్తవుడు కనుగొంటే ప్రాథమికంగా దానికి బాధ్యులెవరు? (బి) ఒక క్రైస్తవుడు తప్పుడు ఆలోచనా విధానాన్ని ఎలా అధిగమించగలడు?
19 తప్పుడు ఆలోచనా విధానం మన హృదయంలో వేళ్లూనుతున్నట్లయితే దానికి మనం ఎవరిని నిందించవచ్చు? సాతానునా? కొంతమేరకు సాతానునే. అతడు, అలాంటి దృక్పథాలు విస్తృతంగా వ్యాపించివున్న ఈ లోక “వాయుమండల సంబంధమైన అధిపతి.” (ఎఫెసీయులు 2:1, 2; తీతు 2:12) అయితే సాధారణంగా, తప్పుడు ఆలోచనా విధానపు వేర్లు మన స్వంత అపరిపూర్ణ శరీరంలోనే ఉంటాయి. ఈ లోకంతో స్నేహం గురించి హెచ్చరించిన తర్వాత యాకోబు ఇలా వ్రాశాడు: “ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?” (యాకోబు 4:5) మనందరిలో తప్పు చేయాలనే సహజ సిద్ధమైన దృక్పథం ఉంటుంది. (ఆదికాండము 8:21; రోమీయులు 7:18-20) అయితే, మనం మన బలహీనతలను అంగీకరించి, వాటిని అధిగమించడానికి యెహోవా సహాయంపై ఆధారపడితే, మనం ఆ దృక్పథాన్ని ఎదిరించవచ్చు. “[మనలో సహజసిద్ధంగా ఉండే అసూయకన్నా] ఆయన చూపించే కృప గొప్పది” అని యాకోబు చెబుతున్నాడు. (యాకోబు 4:6, NW) దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో, నమ్మకమైన క్రైస్తవ సహోదరుల మద్దతుతో, యేసు విమోచనా క్రయధన బలి మూల్యంతో, నమ్మకమైన క్రైస్తవులు తమ శరీర సంబంధ బలహీనతలను జయిస్తారు. (రోమీయులు 7:24, 25) వారు ఈ లోక స్నేహితులుగా కాదుగానీ, దేవుని స్నేహితులుగా దేవుని సంస్థలో సురక్షితంగా ఉన్నారు.
20. దేవుని సంస్థలో భాగమైనవారు ఏ గొప్ప ఆశీర్వాదాలను పొందుతారు?
20 “యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును” అని బైబిలు వాగ్దానం చేస్తోంది. (కీర్తన 29:11) మనం నిజంగా యెహోవా ఆధునిక-దిన “దేశము” అయిన ఆయన దృశ్య సంస్థలో భాగమైతే, మనం ఆయనిచ్చే బలాన్ని పొంది, ఆయన తన ప్రజలకు అనుగ్రహించే శాంతిని అనుభవిస్తాము. నిజమే, సాతాను లోకం యెహోవా దృశ్య సంస్థకన్నా ఎంతో పెద్దదే, సాతాను మనకన్నా ఎంతో శక్తిమంతుడే. కాని యెహోవా సర్వశక్తిమంతుడు. ఆయన చురుకైన శక్తి అజేయమైనది. దేవుని సేవచేయడంలో బలవంతులైన ఆయన దూతలు కూడా మనతోపాటు ఉన్నారు. అందుకే, మనం ఎంత ద్వేషాన్ని ఎదుర్కొన్నప్పటికీ, మనం స్థిరంగా నిలబడగలం. యేసు వలె మనం లోకాన్ని జయించగలం.—యోహాను 16:33; 1 యోహాను 4:4.
మీరు వివరించగలరా?
◻ దేవుని దృశ్య సంస్థ అంటే ఏమిటి?
◻ దేవుని సంస్థ ఏ యే విధాల్లో మనల్ని సురక్షితంగా కాపాడుతుంది?
◻ దేవుని సంస్థలో ఎవరు భాగమైయున్నారు?
◻ లోకంతో స్నేహం చేయడాన్ని మనమెలా నివారించవచ్చు?
[9వ పేజీలోని బాక్సు]
దేవుని సంస్థ అంటే ఏమిటి?
యెహోవాసాక్షుల ప్రచురణల్లో, “దేవుని సంస్థ” అనే పదం మూడు విధాలుగా ఉపయోగించబడుతుంది.
1. యెహోవా పరలోక, అదృశ్య సంస్థ నమ్మకమైన ఆత్మసంబంధ ప్రాణులతో రూపొందించబడింది. ఇది బైబిల్లో “పైనున్న యెరూషలేము” అని పిలువబడుతుంది.—గలతీయులు 4:26.
2. యెహోవా మానవ, దృశ్య సంస్థ. నేడు దానిలో అభిషిక్త శేషమూ, గొప్పసమూహమూ ఉన్నారు.
3. యెహోవా విశ్వ సంస్థ. నేడు దానిలో యెహోవా పరలోక సంస్థతో పాటు ఆధ్యాత్మిక నిరీక్షణగల, భూమిపైనున్న ఆయన అభిషిక్త దత్తపుత్రులు చేరివున్నారు. కొంతకాలానికి, భూమిపైవుండే పరిపూర్ణ మానవులు కూడా దానిలో చేరుతారు.
[10వ పేజీలోని చిత్రం]
యెహోవా సంస్థ ద్వారా చక్కని ఆధ్యాత్మిక ఆహారం అందజేయబడుతోంది