కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/1 పేజీలు 19-21
  • ప్రాముఖ్యమైన వాటికి ప్రథమస్థానం ఇవ్వండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాముఖ్యమైన వాటికి ప్రథమస్థానం ఇవ్వండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు దేనికి ప్రథమ స్థానమివ్వాలి?
  • రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి
  • నేడు కొందరు ప్రాముఖ్యమైన వాటికి మొదటిస్థానం ఎలా ఇస్తారంటే
  • ముందుగా పథకం వేసుకోండి !
  • హోమ్‌వర్క్‌ చేసుకోవడానికి సమయం ఎక్కడినుండి వస్తుంది?
    తేజరిల్లు!—2004
  • నా హోమ్‌వర్క్‌ పూర్తి చేయడం ఎలా?
    యువత అడిగే ప్రశ్నలు
  • మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • కూటములకు హాజరగుట—ఒక గంభీరమైన బాధ్యత
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/1 పేజీలు 19-21

ప్రాముఖ్యమైన వాటికి ప్రథమస్థానం ఇవ్వండి!

ఈ రోజు మీటింగ్స్‌ ఉన్నాయి, మీరు చేయాల్సిన పని ఇంకా ఉంది. దేనికి మీరు ప్రథమ స్థానాన్నిస్తారు?

మీరు ఒక భర్త, తండ్రి. మీరు రోజంతా కష్టపడి పని చేశారు, సాయంత్రం కావస్తోంది, అప్పుడు మీరు ఆ సాయంత్రం జరగనైయున్న మీటింగ్స్‌ గురించి ఆలోచిస్తారు. మీరు వెంటనే బయల్దేరితే, మీరు ఇంటికి వెళ్లి స్నానంచేసి, తయారై, టీ తాగి మీటింగ్‌కు బయల్దేరేందుకు సరిపోయేంత సమయమే ఉంది. హఠాత్తుగా, మీ బాస్‌ మీదగ్గరకొచ్చి ఓవర్‌టైమ్‌ చేయమని అడుగుతాడు. తాను దానికి డబ్బు చెల్లిస్తానని ఆయన వాగ్దానం చేస్తాడు. మీకు డబ్బు అవసరం.

లేక మీరొక భార్య, తల్లి. మీరు సాయంత్రం వంట చేస్తుండగా, ఇస్త్రీ చేయాల్సిన బట్టల మీదికి మీ దృష్టి మరలుతుంది. ఆ బట్టల్లో కొన్ని రేపటి కోసం కావాలి. ‘నేను మీటింగ్‌కు వెళ్తే బట్టలు ఇస్త్రీ చేయడం కుదరదే’ అని మీరనుకుంటారు. ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన మీకు, ఇంటి పనులూ ఉద్యోగమూ రెండూ చూసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

లేక మీరొక విద్యార్థి. మీ గదిలో బల్లమీద హోమ్‌వర్క్‌ పుస్తకాలు గుట్టలుగా ఉన్నాయి. ఆ హోమ్‌వర్క్‌లో చాలాభాగం కొన్ని రోజుల క్రితం ఇవ్వబడినదే, కానీ మీరు దాన్ని పూర్తిచేయకుండా వాయిదా వేస్తూ వచ్చారు, ఇప్పుడు అదంతా ఒక్కసారే పూర్తిచేయాలి. ఆ హోమ్‌వర్క్‌ చేయడానికి నేను ఈరోజు మీటింగ్‌ మానుకుంటానని మీ తలిదండ్రులకు చెప్పాలని మీరనుకుంటారు.

మీరు దేనికి మొదటి స్థానాన్నిస్తారు: ఓవర్‌ టైమ్‌కా, బట్టలు ఇస్త్రీ చేయడానికా, హోమ్‌వర్క్‌కా లేక మీటింగ్స్‌కా? ఆధ్యాత్మిక భావంలో చెప్పాలంటే, ప్రాముఖ్యమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వడమంటే ఏమిటి? ఈ విషయంలో యెహోవా దృక్పథం ఏమిటి?

మీరు దేనికి ప్రథమ స్థానమివ్వాలి?

ఇశ్రాయేలీయులకు పది ఆజ్ఞలు ఇవ్వబడిన కొంత కాలానికే, ఒక వ్యక్తి విశ్రాంతి దినాన కట్టెలు ఏరుతూ కనిపించాడు. అలా చేయకూడదని ధర్మశాస్త్రంలో ఖండితంగా చెప్పబడింది. (సంఖ్యాకాండము 15:32-34; ద్వితీయోపదేశకాండము 5:12-15) దీనికి మీరెలా తీర్పు తీరుస్తారు? ఎంతైనా ఆయన ఒక విలాసవంతమైన జీవిత విధానం కొరకు పని చేయడం లేదు గానీ తన కుటుంబానికి కావలసిన కనీసావసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తర్కిస్తూ మీరు ఆ వ్యక్తిని క్షమించి ఉండేవారా? మరి సంవత్సరం మొత్తంలో విశ్రాంతి దినాన్ని ఆచరించేందుకు ఎన్నో సందర్భాలు ఉంటాయనీ, ఆ వ్యక్తి కాస్త ముందే పథకం వేసుకోక పోవడం మూలంగా బహుశ అతడు ఈ ఒక్కసారి తప్పిపోవడాన్ని సులభంగా క్షమించవచ్చనీ అంటూ మీరు తర్కించేవారా?

అయితే యెహోవా ఆ విషయాన్ని ఎంతో గంభీరంగా దృష్టించాడు. ‘తరువాత యెహోవా—ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెనని మోషేతో చెప్పెను’ అని బైబిలు పేర్కొంటోంది. (సంఖ్యాకాండము 15:35, 36) ఆ వ్యక్తి చేసిన దాన్ని యెహోవా అంత గంభీరంగా ఎందుకు తీసుకున్నాడు?

ప్రజలు కట్టెలు ఏరుకునేందుకూ అలాగే తమ కనీసావసరాలైన ఆహారం, బట్టలూ, నివాసం వంటివాటి గురించి శ్రద్ధ తీసుకోవడానికి వారికి ఆరు రోజులు ఉన్నాయి. ఏడవ దినాన్ని మాత్రం తమ ఆధ్యాత్మిక అవసరతల కొరకు కేటాయించాలి. కట్టెలు ఏరుకోవడం తప్పు కాదుగానీ, యెహోవాను ఆరాధించేందుకు కేటాయించాల్సిన సమయంలో కట్టెలేరుకోవడం తప్పు. క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, నేడు మనం ప్రాముఖ్యమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వడం విషయంలో ఇది మనకు ఒక గుణపాఠాన్ని నేర్పడం లేదా?—ఫిలిప్పీయులు 1:9.

ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు గడిపిన తర్వాత, వాగ్దాన దేశంలో ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు. అరణ్యంలో దేవుడిచ్చిన మన్నాను తినీ తినీ కొందరికి అదంటే మొహం మొత్తింది, నిస్సందేహంగా వాళ్లు వేరే ఆహార పదార్థాల కొరకు ఎదురు చూస్తుండి ఉండవచ్చు. కాబట్టి వాళ్లు “పాలు తేనెలు ప్రవహించు దేశము”లోకి ప్రవేశించబోతుండగా వాళ్లు సరైన దృక్కోణాన్ని కలిగి ఉండేందుకు వాళ్లకు సహాయం చేయడానికి, యెహోవా వాళ్లకీ విషయం జ్ఞాపకం చేశాడు: “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదు[రు].”—నిర్గమకాండము 3:8; ద్వితీయోపదేశకాండము 8:3.

ఇశ్రాయేలీయులు “పాలు తేనెల” కోసం కష్టించి పని చేయవలసి ఉంది. వాళ్లు సైన్యాలను జయించాలి, ఇళ్లు కట్టుకోవాలి, పంటలు పండించుకోవాలి. అయినప్పటికీ, ఆధ్యాత్మిక విషయాలను ధ్యానించేందుకు ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించాలని యెహోవా ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్లు తమ పిల్లలకు దేవుని మార్గాలను బోధించడానికి కూడా సమయాన్ని వెచ్చించాలి. యెహోవా ఇలా చెప్పాడు: “నీవు నీ యంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు [నా ఆజ్ఞలను] గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పిం[చవలెను].”—ద్వితీయోపదేశకాండము 11:19.

ఇశ్రాయేలీయుల్లోని ప్రతి పురుషుడూ, యూదా మత ప్రవిష్టులైన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో మూడుసార్లు యెహోవా సన్నిధికి వెళ్లాలి. అలాంటి సందర్భాల్లో కుటుంబమంతటికీ ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని గుర్తించి, అనేకమంది కుటుంబ శిరస్సులు తమ భార్యా పిల్లలను కూడా తమవెంట తీసుకెళ్లేవారు. అయితే కుటుంబమంతా అలా వెళ్లినప్పుడు శత్రు దాడి నుండి వారి ఇళ్లనూ పొలాలనూ ఎవరు కాపాడతారు? యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.” (నిర్గమకాండము 34:24) తాము ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానమిస్తే తమకు వస్తుసంబంధంగా ఎటువంటి నష్టమూ కలగదని నమ్మడానికి ఇశ్రాయేలీయులకు విశ్వాసం అవసరమైంది. యెహోవా తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడా? అవును, ఆయన కచ్చితంగా నిలుపుకున్నాడు!

రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి

మిగతా విషయాలన్నిటికన్నా ఆధ్యాత్మిక విలువలకు ప్రథమ స్థానం ఇవ్వాలని యేసు తన అనుచరులకు బోధించాడు. కొండమీది ప్రసంగంలో, ఆయన తన శ్రోతలకు ఇలా సలహా ఇచ్చాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; . . . మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [అవసరమైనవన్నీ] మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:31, 33) యేసు మరణించిన కొంతకాలానికే, క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు ఆ సలహాను పాటించారు. వారిలో అనేకులు సా.శ. 33 పెంతెకొస్తు పండుగను జరుపుకునేందుకు యెరూషలేముకు వచ్చిన యూదులూ లేక యూదా మత ప్రవిష్టులూ. అక్కడ ఉన్నప్పుడు, ఎంతో అనూహ్యమైనదొకటి జరిగింది. వాళ్లు యేసుక్రీస్తును గురించిన సువార్తను విని, దానికి హత్తుకున్నారు. క్రొత్తగా ఏర్పడిన తమ విశ్వాసాన్ని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆతురతతో, వాళ్లు యెరూషలేములోనే ఉండిపోయారు. వాళ్లు తెచ్చుకున్న వస్తువులు నిండుకోనారంభించాయి, అయినప్పటికీ వస్తుసంబంధ అవసరతలకు వాళ్లు ప్రాధాన్యతనివ్వలేదు. వాళ్లు మెస్సీయను కనుగొన్నారు! అందరూ “అపొస్తలుల బోధయందును . . . ప్రార్థన చేయుటయందును ఎడతెగక” కొనసాగ గలిగేలా వాళ్ల క్రైస్తవ సహోదరులు తమకున్న వాటిని వాళ్లతో పంచుకున్నారు.—అపొస్తలుల కార్యములు 2:42.

కొంతకాలానికి, క్రమంగా కూటాల్లో సహవసించవలసిన అవసరతను కొంతమంది క్రైస్తవులు అలక్ష్యం చేశారు. (హెబ్రీయులు 10:23-25) బహుశ వాళ్లు తమకూ తమ కుటుంబాలకూ ఆర్థిక భద్రతను చేకూర్చుకునేందుకు ప్రయత్నిస్తూ వాళ్లు వస్తుసంబంధ విషయాలకు ప్రాముఖ్యత నిచ్చేవారిగా మారివుండవచ్చు. కూటాలను అలక్ష్యం చేయవద్దని తన సహోదరులను పురికొల్పిన తర్వాత, పౌలు ఇలా వ్రాశాడు: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.—నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.”—హెబ్రీయులు 13:5.

పౌలు ఇచ్చిన సలహా ఎంతో సమయోచితమైనదిగా నిరూపించబడింది. హెబ్రీయులకు పౌలు తన లేఖను వ్రాసిన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, సెస్టియస్‌ గాలస్‌ నేతృత్వంలో రోమా సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది. నమ్మకస్థులైన క్రైస్తవులు, “మీరు [దాన్ని] చూచునప్పుడు . . . మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు” అన్న యేసు హెచ్చరికను జ్ఞాపకం చేసుకున్నారు. (మార్కు 13:14-16) తాము తప్పించుకోవడమనేది తమ ఉద్యోగాల స్థిరత్వం మీదా లేక తాము కలిగివున్న వస్తుసంపద మీదా ఆధారపడిలేదు గానీ తాము యేసు ఉపదేశానికి చూపే విధేయత మీద ఆధారపడి ఉందని వారికి తెలుసు. తమ ఇళ్లనూ, ఉద్యోగాన్నీ, బట్టలనూ మరియు తాము ఎంతో విలువైనవిగా ఎంచిన వస్తువులనూ వదిలేసి కొండలకు పారిపోవడమన్నది, ధనాశను ఇంకా విడనాడని వాళ్లకన్నా, పౌలు సలహాకు ప్రతిస్పందించి ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇచ్చిన వాళ్లకు నిస్సందేహంగా ఎక్కువ సులభమయ్యింది.

నేడు కొందరు ప్రాముఖ్యమైన వాటికి మొదటిస్థానం ఎలా ఇస్తారంటే

నమ్మకస్థులైన క్రైస్తవులు నేడు తమ సహోదరులతో క్రమంగా సహవసించడాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు, కూటాలకు హాజరయ్యేందుకు అనేకులు త్యాగాలు కూడా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో, కేవలం షిఫ్ట్‌ పనే అందుబాటులో ఉంది. ఒక సహోదరుడు, తన తోటి ఉద్యోగి కొరకు శనివారం సాయంకాలాలు పని చేస్తే ఆ ఉద్యోగి, సహోదరునికి కూటాలు ఉన్న రోజుల్లో సహోదరుని కొరకు పని చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. సాధారణంగా చాలామంది ప్రజలు శనివారం సాయంకాలాలను సరదాగా గడపాలని అలా షిఫ్టు మార్పుకు ఒప్పుకుంటారు. షిఫ్ట్‌ పని చేసే ఇతర సహోదరులు తమ షిఫ్టు మార్పుల మూలంగా తమ స్వంత సంఘానికి హాజరు కాలేకపోతున్నట్లైతే తమ పని స్థలానికి సమీపంలో ఉన్న సంఘ కూటాలకు హాజరౌతారు. ఈ విధంగా, వాళ్లు దాదాపు ఎప్పుడూ కూటాలు మానుకోరు. క్రొత్తగా ఆసక్తి ఏర్పడిన, కెనడాకు చెందిన ఒక స్త్రీ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ప్రాముఖ్యతనూ, సేవా కూటమి ప్రాముఖ్యతనూ చాలా త్వరగా గుర్తించింది, అయితే ఆమె తన పని మూలంగా వాటికి హాజరు కాలేకపోయేది. కాబట్టి, తన షిఫ్ట్‌ సమయంలో తన కోసం పని చేయడానికి ఆమె తన తోటి వర్కర్‌కు డబ్బు చెల్లించేది, దానితో ఆమె ఈ ప్రాముఖ్యమైన కూటాలకు హాజరవ్వగలిగేది.

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అనేకులు కూడా చాలా అరుదుగా కూటాలు మానుకుంటారు. వాళ్లు రాజ్యమందిరానికి వెళ్లలేనప్పుడు ఇంటివద్ద టెలిఫోన్‌ హుకప్‌ ద్వారా లేక టేప్‌ రికార్డింగుల ద్వారా కార్యక్రమాన్ని వింటారు. యెహోవా తన ‘నమ్మకమైన వాడునూ బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా’ అందజేస్తున్న ఆధ్యాత్మిక సహాయాల పట్ల వాళ్లు ఎంతో గొప్ప మెప్పును ప్రదర్శిస్తారు! (మత్తయి 24:45) అస్వస్థులైన, పెద్ద వయస్కులైన తమ తలిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకుంటున్న క్రైస్తవులు తాము ఏదైనా ఒక కూటానికి హాజరు కాగలిగేలా తమ తల్లిదండ్రుల గురించి కొంతసేపు శ్రద్ధ వహించడానికి ఒక సహోదరుడుగానీ సహోదరిగానీ ముందుకు వస్తే ఆ క్రైస్తవులు దాన్నెంతో మెచ్చుకుంటారు.

ముందుగా పథకం వేసుకోండి !

తమ స్వంత ఆధ్యాత్మిక అవసరతల గురించి శ్రద్ధకల్గివున్న తలిదండ్రులు, తమ పిల్లలు క్రైస్తవ కూటాలను గుణగ్రహించేందుకు సహాయం చేస్తారు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వబడిన హోమ్‌వర్క్‌ను వాళ్లు వాయిదా వేస్తూ ఉండకుండా దాన్ని వెంటనే ముగించుకోవాలని వాళ్లకు బోధిస్తారు. కూటాలున్న రోజుల్లో పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తమ హోమ్‌వర్క్‌ను చేసుకుంటారు. హాబీలూ ఇతర కార్యకలాపాలు సంఘ కూటాలకు అడ్డువచ్చేందుకు అనుమతించబడవు.

ఒక భర్తగా, తండ్రిగా మీరు కూటాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా? ఒక భార్యగా, తల్లిగా మీరు కూటాలకు హాజరవ్వగలిగేలా మీరు మీ బాధ్యతలను నిర్వర్తించేందుకు పథకం వేసుకుంటారా? ఒక యౌవనస్థునిగా, మీరు కూటాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా లేక హోమ్‌వర్క్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా?

సంఘ కూటం యెహోవా యొక్క ప్రేమపూర్వక ఏర్పాటు. ఆ ఏర్పాటులో భాగం వహించేందుకు ప్రతి ప్రయత్నమూ చేయాలి. మీరు ప్రాముఖ్యమైన విషయాలకు ప్రథమ స్థానం ఇస్తే యెహోవా మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి