కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 1/15 పేజీలు 10-15
  • దైవపరిపాలన ద్వారా—యెహోవా పరిపాలిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలన ద్వారా—యెహోవా పరిపాలిస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలన ఉద్భవించింది
  • దైవపరిపాలన ఆధ్వర్యంలో అధికారం
  • దైవపరిపాలనకు విరుద్ధమైన ప్రవర్తన, దృక్పథాలు
  • దైవపరిపాలన ముగింపు
  • ఒక క్రొత్త దైవపరిపాలన
  • దైవపరిపాలనకు పూర్తి అనుగుణ్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దైవపరిపాలనలో కాపరులూ గొర్రెలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • భాగం 10 తుదకు పరిపూర్ణ ప్రభుత్వం!
    తేజరిల్లు!—1992
  • మన మహోన్నత సృష్టికర్తతో కలిసి మందను కాయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 1/15 పేజీలు 10-15

దైవపరిపాలన ద్వారా—యెహోవా పరిపాలిస్తాడు

“యెహోవా నిరంతరము ఏలును.”—కీర్తన 146:10.

1, 2. (ఎ) పరిపాలనకు సంబంధించిన మానవుని ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి? (బి) విజయవంతమైన ఏకైక ప్రభుత్వ విధానం ఏది?

నిమ్రోదు కాలమునుండి కూడా మానవ సమాజాన్ని ఏలడానికి మనుష్యులు ఎన్నో విధాల ప్రభుత్వాలతో ప్రయత్నించి చూశారు. నియంతృత్వపాలన, రాజరికం, సముదాయపాలన, ఎన్నో రకాల ప్రజా ప్రభుత్వాలుండేవి. యెహోవా వీటన్నింటినీ అనుమతించాడు. వాస్తవానికి, దేవుడే అన్ని అధికారాలకు తుది మూలం గనుక, ఒక భావంలో వేర్వేరు రాజులను వారి వారి స్థానాల్లో ఆయనే ఉంచాడు. (రోమీయులు 13:1) అయినప్పటికి, ప్రభుత్వపరమైన మానవ ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. ఏ మానవ పరిపాలకుడూ నిరంతరం నిలిచే, నిలకడైన, న్యాయమైన సమాజాన్ని తయారు చేయలేకపోయాడు. తరచూ, “ఒకడు మరియొకనిపై అధికారియై తనకు హాని తెచ్చుకో”వడమే జరుగుతోంది.—ప్రసంగి 8:9.

2 ఇది మనలను ఆశ్చర్యపరుస్తుందా? లేనేలేదు! అపరిపూర్ణ మానవుడు తన్ను తాను పరిపాలించుకోడానికి సృజించబడలేదు. ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారివశములో లేదు.’ (యిర్మీయా 10:23) అందుకనే, మానవ చరిత్రంతటిలో ఒకేఒక రకమైన ప్రభుత్వం నిజంగా విజయవంతమైంది. అది ఏది? యెహోవా దేవుని ఆధ్వర్యంలోని దైవపరిపాలన. బైబిలు నందలి గ్రీక్‌ భాషలో, “థియోక్రసి” అంటే, దేవుడు [థియోస్‌] చేసే పరిపాలన [క్రాటిస్‌]అని భావం. యెహోవా దేవుని పరిపాలన కన్నా మరో యితర మంచి ప్రభుత్వం ఉంటుందా?—కీర్తన 146:10.

3. భూమిపై సాగిన దైవపరిపాలనకు కొన్ని తొలి ఉదాహరణలు ఏవి?

3 ఆదాము హవ్వలు యెహోవాకు ఎదురు తిరగనంతవరకు ఏదెనులో దైవపరిపాలన కొంత కాలం ఉంది. (ఆదికాండము 3:1-6, 23) అబ్రాహాము కాలంలో, మెల్కీసెదెకు రాజుగా, యాజకునిగా ఉన్న షాలేము పట్టణమందు దైవపరిపాలన ఉన్నట్లు కన్పిస్తుంది. (ఆదికాండము 14:18-20; హెబ్రీయులు 7:1-3) అయినా, సా.శ.పూ 16వ శతాబ్దంలో సీనాయి అరణ్యమందు యెహోవా దేవుని ఆధ్వర్యాన మొట్టమొదటి సారిగా ఒక జనాంగం దైవపరిపాలన క్రిందికి వచ్చింది. అది ఏలా జరిగింది? ఆ దైవపరిపాలన ఎలా పనిచేసింది?

దైవపరిపాలన ఉద్భవించింది

4. దైవపరిపాలనా ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా ఎలా ఏర్పాటుచేసాడు?

4 సా.శ.పూ 1513లో యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి, వారిని తరుముతున్న ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నాశనంచేశాడు. తర్వాత ఆయన ఇశ్రాయేలీయులను సీనాయి పర్వతానికి నడిపించాడు. ఆ పర్వతం వద్ద వారు బసచేసినప్పుడు, మోషే ద్వారా దేవుడు యిలా చెప్పాడు: “నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్దరెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నామాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.” అందుకు ఇశ్రాయేలీయులు, “యెహోవా చెప్పినదంతయు చేసెదమని” ప్రత్యుత్తరమిచ్చారు. (నిర్గమకాండము 19:4, 5, 8) ఒక నిబంధన చేయబడింది, తద్వారా, దైవపరిపాలన క్రింద ఇశ్రాయేలీయుల జనాంగం ఉద్భవించింది.—ద్వితీయోపదేశకాండము 26:18, 19.

5. యెహోవా ఇశ్రాయేలును పరిపాలించాడని ఎలా చెప్పవచ్చు?

5 అయితే, మానవ కన్నులకు కనిపించని యెహోవా ఇశ్రాయేలీయులను ఏ విధంగా పరిపాలించాడు? (నిర్గమకాండము 33:20) యెహోవా ఆ జనాంగానికి నియమాలనూ యాజకత్వాన్ని యిచ్చాడు. న్యాయవిధులకు తలయొగ్గి, దైవిక ఆదేశాలనుబట్టి చేసిన ఏర్పాట్లను అనుసరించి ఆరాధించేవారు, గొప్ప దైవపరిపాలకుడైన యెహోవాను సేవించే వారు. దానికితోడు, అత్యవసర సమాయాల్లో యెహోవా దేవుడు నడిపింపును అందించిన ఊరీము తుమ్మీములు ప్రధాన యాజకుని వద్ద ఉండేవి. (నిర్గమకాండము 28:29, 30) అంతేకాకుండా, దైవపరిపాలనలో అర్హతగల పెద్దలు యెహోవా ప్రతినిధులుగా ఉండి, దేవుని శాసనము అమలు పర్చబడేటట్లు చూసేవారు. ఈ మనుష్యుల్లోని కొందరి చరిత్రను మనం పరిశీలించినట్లైతే, దేవుని పరిపాలనకు మానవులు ఎలా లోబడి ఉండాలన్న వాటిని అర్థం చేసుకోవచ్చు.

దైవపరిపాలన ఆధ్వర్యంలో అధికారం

6. దైవపరిపాలనలోని అధికారాన్ని ఆదరించడం మానవులకు ఎందుకు ఒక సవాలు, మరి ఈ బాధ్యతకు ఏ రకమైన వ్యక్తులు అవసరమై యుండెను?

6 ఇశ్రాయేలు నందు అధికార స్థానంలో ఉన్నవారికి గొప్ప ఆధిక్యత ఉండేది, అయితే సమతూకాన్ని కల్గియుండడం వారికి సవాలుగా ఉండేది. యెహోవా నామ మహిమకంటే కూడా తమ అహంకారం ఎన్నడూ ప్రాముఖ్యం కాకుండా వారు జాగ్రత్తపడాలి. “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు,” అన్న ప్రేరేపిత వాక్యం మిగతా మానవజాతికెంత వాస్తవమో ఇశ్రాయేలీయులకు కూడా అంతే. ఇశ్రాయేలు దైవపరిపాలనకు చెందిందని, మరి వారు తమ చిత్తంగాక యెహోవా చిత్తమే చేయాలని పెద్దలు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే ఇశ్రాయేలు వర్ధిల్లింది. ఇశ్రాయేలు స్థాపించబడిన వెంటనే, మోషే మామగారైన యిత్రో, వారు ఏరకమైన మనుష్యులై ఉండాలో అనగా వారు, “సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులు” అయ్యుండాలని చక్కగా వివరించాడు.—నిర్గమకాండము 18:21.

7. యెహోవా దేవుని క్రింద అధికారంగల వారిలో ఒకనిగా మోషే ఏ యే విధాల్లో మంచి మాదిరిగా ఉన్నాడు?

7 మోషేనే ఇశ్రాయేలు నందు ఉన్నతాధికారంగల వారిలో ప్రథముడు. దైవపరిపాలన ఏర్పాట్లలో అధికారంగల వ్యక్తిగా ఆయన ఒక మంచి మాదిరినుంచాడు. నిజమే, ఒక సందర్భంలో మానవ అసంపూర్ణత బయల్పడింది. అయితే, మోషే ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడ్డాడు. అంతవరకు పరిష్కరించబడని సమస్యలు తలెత్తినప్పుడు, ఆయన యెహోవా నడిపింపును కోరాడు. (సంఖ్యాకాండము 15:32-36 పోల్చండి.) తన స్వంత మహిమార్థమై తన ఉన్నత స్థానాన్ని ఉపయోగించుకునే శోధనను మోషే ఎలా వ్యతిరేకించాడు? లక్షలాది మంది ఉన్న జనాంగాన్ని ఆయన నడిపించినప్పటికి, అతను “భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యాకాండము 12:3) ఆయనకు ఏ స్వంత కోరికలూ లేవు, దేవుని మహిమకొరకే పాటుపడేవాడు. (నిర్గమకాండము 32:7-14) అంతేకాదు మోషేకు బలమైన విశ్వాసం ఉంది. ఆయన జనాంగానికి నాయకుడు కాకముందు ఆయనను గూర్చి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు యిలా అన్నాడు: “విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” యుండెను. (హెబ్రీయులు 11:27) స్పష్టంగా, జనాంగానికి యెహోవాయే పరిపాలకుడని మోషే ఎన్నడూ మర్చిపోలేదు. (కీర్తన 90:1, 2) ఈనాడు మనకది ఎంత మంచి ఉదాహరణ!

8. యెహోషువకు యెహోవా ఏ ఆజ్ఞను యిచ్చాడు, మరి యిది ఎందుకు గమనార్హం?

8 మోషే ఒక్కడే ఇశ్రాయేలును పర్యవేక్షించడం కష్టమైనప్పుడు, జనాంగానికి తీర్పుతీర్చడంలో ఆయనకు సహాయపడే, 70 మంది పెద్దలపై యెహోవా తన ఆత్మను ఉంచాడు. (సంఖ్యాకాండము 11:16-25) తర్వాతి సంవత్సరాల్లో ప్రతి పట్టణానికి దాని స్వంత పెద్దలు ఉండేవారు. (ద్వితీయోపదేశకాండము 19:12; 22:15-18; 25:7-9 పోల్చండి.) మోషే చనిపోయిన తర్వాత, ఆ జనాంగానికి నాయకునిగా యెహోషువను యెహోవా నియమించాడు. ఈ ఆధిక్యతతో యెహోషువ చాలా చేయవల్సివుందని మనం ఊహించవచ్చు. అయితే, ఆయన ఎన్నడూ విడనాడకూడని ఒక విషయాన్ని యెహోవా ఆయనకు చెప్పాడు: “దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ 1:8) యెహోషువ 40 ఏళ్ల కంటే ఎక్కువగా సేవ చేసినప్పటికి, ఆయన ధర్మశాస్త్రమును తప్పక చదువుతూ ఉండాలన్న సంగతిని గమనించండి. మనం ఎంతకాలంగా సేవ చేస్తున్నప్పటికి లేక మనకు ఎన్ని ఆధిక్యతలున్నప్పటికి, మనం కూడా బైబిలును చదివి, యెహోవా న్యాయవిధులూ, సూత్రాలకనుగుణంగా మన మనస్సులను మనం పునర్వికసింపజేయాలి.—కీర్తన 119:111, 112.

9. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలులో ఏమి జరిగింది?

9 యెహోషువ తర్వాత వరుసగా కొంతమంది న్యాయాధిపతులు నియమించబడ్డారు. విషాదకరమైందేమంటే, వారి కాలంలో ఇశ్రాయేలీయులు తరచూ “యెహోవా కన్నులయెదుట కీడు” చేశారు. (న్యాయాధిపతులు 2:11) న్యాయాధిపతుల కాలాన్ని గూర్చి చరిత్ర యిలా చెబుతోంది: “ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.” (న్యాయాధిపతులు 21:25) తమ ప్రవర్తన, ఆరాధనలను గూర్చిన నిర్ణయాలను ఎవరికి వారే తీసుకున్నారు, అంతేకాక అనేకమంది ఇశ్రాయేలీయులు చెడు నిర్ణయాలు తీసుకున్నట్లు చరిత్ర చూపుతోంది. వారు విగ్రహారాధనలో దిగజారిపోయి, కొన్నిసార్లు ఘోరమైన నేరాలు చేశారు. (న్యాయాధిపతులు 19:25-30) అయినప్పటికి, కొందరు మాదిరికరమైన విశ్వాసాన్ని కనపర్చారు.—హెబ్రీయులు 11:32-38.

10. సమూయేలు కాలంలో ఇశ్రాయేలు ప్రభుత్వం త్వరితగతిని ఎలా మారిపోయింది, దీనికి నడిపిందేమిటి?

10 చిట్టచివరి న్యాయాధిపతియైన సమూయేలు కాలంలో, ఇశ్రాయేలీయులు ప్రభుత్వాన్ని గూర్చిన ఒక సంకట పరిస్థితిని ఎదుర్కొన్నారు. తమ చుట్టూవున్న శత్రురాజ్యాలన్నిటిని రాజులు పరిపాలించడం చూచి, ఇశ్రాయేలీయులు తమకుకూడా ఒక రాజు కావాలని వాదించారు. తమకు అప్పటికే ఒక రాజు ఉన్నాడని, వారి ప్రభుత్వం దైవపరిపాలనకు సంబంధించినదని వారు మర్చిపోయారు. యెహోవా సమూయేలుతో యిలా అన్నాడు: “వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.” (1 సమూయేలు 8:7) మన ఆత్మీయ దృష్టిని మనం ఎంత సులభంగా కోల్పోయి, మనచుట్టూ ఉన్న లోకంవల్ల ప్రభావితం కాగలమో వారి ఉదాహరణ మనకు జ్ఞాపకం చేస్తోంది.—1 కొరింథీయులు 2:14-16 పోల్చండి.

11. (ఎ) ప్రభుత్వం మారినప్పటికీ, రాజుల క్రిందనున్న ఇశ్రాయేలు యింకా దైవపరిపాలనలో ఉందని ఎలా చెప్పగలం? (బి) యెహోవా ఏ ఆజ్ఞను ఇశ్రాయేలు రాజులకు యిచ్చాడు, అది ఏ సంకల్పంతో?

11 అయినప్పటికి, ఇశ్రాయేలీయుల విన్నపాన్ని యెహోవా విని, వారి కొరకు మొదటి యిద్దరు రాజులైన, సౌలును దావీదును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు యెహోవా పాలనలో, దైవపరిపాలనగా కొనసాగింది. దాని రాజులు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేలాగున, ప్రతి ఒక్కరూ స్వయంగా ధర్మశాస్త్రాన్ని ఎత్తివ్రాసుకుని, “తాను తన సహోదరుల మీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు” దాన్ని ప్రతిదినం తప్పనిసరిగా చదవవలసివున్నారు. (ద్వితీయోపదేశకాండము 17:19, 20) అవును, యెహోవా దైవపరిపాలనలో అధికారంనందున్నవారు తమ్మును తాము హెచ్చించుకోకూడదని, వారి ప్రవర్తన తన న్యాయవిధులను ప్రతిబింబించేదై ఉండాలని ఆయన కోరాడు.

12. రాజైన దావీదు యథార్థతకు సంబంధించిన ఏ చరిత్రను కలిగి ఉన్నాడు?

12 రాజైన దావీదుకు యెహోవాపై గొప్ప విశ్వాసం ఉండెను, నిరంతరం నిలిచే రాజుల వంశానికి ఆయన తండ్రిగా ఉంటాడని దేవుడు ఆయనతో నిబంధనను చేశాడు. (2 సమూయేలు 7:16; 1 రాజులు 9:5; కీర్తన 89:29) దావీదు, యెహోవా యెడల కనపర్చిన సాత్వికంతో కూడిన విధేయత ఆచరణయోగ్యం. ఆయన యిలా అన్నాడు: “యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు!” (కీర్తన 21:1) శరీర బలహీనతవల్ల దావీదు కొన్నిసార్లు విఫలుడైనప్పటికి, ఒక నియమంగా తన స్వశక్తిపైనే కాక ఆయన యెహోవా శక్తిపై ఆధారపడ్డాడు.

దైవపరిపాలనకు విరుద్ధమైన ప్రవర్తన, దృక్పథాలు

13, 14. దావీదు తర్వాతి వారు దైవపరిపాలనకు విరుద్ధంగా చేపట్టిన కొన్ని చర్యలేమిటి?

13 ఇశ్రాయేలీయుల నాయకులందరూ మోషే దావీదులవలె ఉండలేదు. ఇశ్రాయేలునందు అబద్ధ ఆరాధనను అనుమతించడం ద్వారా, అనేకులు దైవపరిపాలన ఏర్పాట్ల యెడల ఎంతో అగౌరవాన్ని కనపర్చారు. కొన్ని సందర్భాల్లో కొందరు నమ్మకమైన పాలకులు సహితం దైవపరిపాలనకు విరుద్ధంగా ప్రవర్తించారు. అటువంటి వారిలో ఒకడైన, గొప్ప జ్ఞానమూ ఐశ్వర్యం అనుగ్రహింపబడిన సొలొమోను పరిస్థితి అతి విషాదకరం. (1 రాజులు 4:2, 5 29) ఆయన అనేకమంది భార్యలను చేసుకుని ఇశ్రాయేలు నందు విగ్రహారాధనను అనుమతించి, యెహోవా ధర్మశాస్త్రాన్ని అగౌరవ పర్చాడు. తత్ఫలితంగా సొలొమోను పాలన అతని చివరి సంవత్సరాల్లో బాధాకరంగా మారిపోయింది.—ద్వితీయోపదేశకాండము 17:14-17; 1 రాజులు 11:1-8; 12:4.

14 సొలొమోను కుమారుడైన రెహబాము, తన ప్రజల భారాన్ని తగ్గించాలనే సవాలునెదుర్కొన్నాడు. ఆ విషయాన్ని సున్నితంగా పరిష్కరించే బదులు అతను తన అధికారాన్ని కఠినంగా ఉపయోగించి, 12 గోత్రాల్లో పదింటిని పోగొట్టుకున్నాడు. (2 దినవృత్తాంతములు 10:4-17) విడిపోయిన పది గోత్రాల రాజ్యానికి మొదటి రాజు యరొబాము. ఆయన తన రాజ్యం, విడిపోయిన రాజ్యంతో మరలా కలవకుండా ఉండేందుకు దూడ ఆరాధనను నెలకొల్పాడు. రాజకీయంగా యిది తెలివిగల ఎత్తులా కనిపించినప్పటికీ, దైవపరిపాలనకు అది ఘోరమైన అగౌరవాన్ని చూపుతోంది. (1 రాజులు 12:26-30) ఆ తర్వాత, దీర్ఘకాలం నమ్మకంగా సేవచేసిన రాజైన ఆసా, చివరి రోజుల్లో గర్వం తన చరిత్రపై మచ్చతెచ్చేలా చేసుకున్నాడు. యెహోవా యిచ్చిన సలహాలతో వచ్చిన ప్రవక్తయెడల అతను అగౌరవంగా ప్రవర్తించాడు. (2 దినవృత్తాంతములు 16:7-11) అవును, దీర్ఘకాలం నుండి ఉన్నవారికి కూడా కొన్నిసార్లు సలహా అవసరమే.

దైవపరిపాలన ముగింపు

15. యేసు భూమిపై ఉన్నప్పుడు, దైవపరిపాలనలో ఉండవలసిన అధికారాన్ని నిర్వహించడంలో యూదా మతనాయకులు ఎలా విఫలులయ్యారు?

15 యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, ఇశ్రాయేలు యింకా దైవపరిపాలనగా ఉండేది. అయితే, విషాదకరంగా దానిలోని అనేకమంది బాధ్యతగల పెద్దలకు ఆత్మీయ మనస్సు లేదు. మోషే కనపర్చిన సాత్వికాన్ని అలవర్చుకోవడంలో వారు నిశ్చయంగా విఫలులయ్యారు. “శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక—వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు” అని యేసు అన్నప్పుడు వారి ఆత్మీయ భ్రష్టత్వాన్ని ఆయన సూచించాడు.—మత్తయి 23:2, 3.

16. మొదటి శతాబ్దంలోని యూదా నాయకులు దైవపరిపాలన యెడల తమకు గౌరవం లేదని ఎలా చూపుకున్నారు?

16 యేసును పొంతి పిలాతుకు అప్పగించిన తర్వాత యూదా మతనాయకులు దైవపరిపాలనా విధేయతను కనపర్చడంలో వారు ఎంతగా దిగజారిపోయారో చూపారు. పిలాతు యేసును పరిశీలించి, ఆయన నిర్దోషి అనే తీర్మానానికొచ్చాడు. యూదుల ముందుకు యేసును తీసుకువస్తూ పిలాతు యిలా అన్నాడు: “ఇదిగో మీ రాజు!” యేసు మరణించాలని యూదులు గగ్గోలుపెట్టినప్పుడు, పిలాతు యిలా అన్నాడు: “మీ రాజును సిలువవేయుదునా?” ప్రధానయాజకులు యిలా సమాధానమిచ్చారు: “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు.” (యోహాను 19:14, 15) ‘యెహోవా పేరట వచ్చిన’ యేసును గాక, వారు కైసరును తమ రాజుగా అంగీకరించారు!—మత్తయి 21:9.

17. శారీరక ఇశ్రాయేలు దైవపరిపాలన జనాంగంగా ఎందుకు ఉండలేకపోయింది?

17 యూదులు యేసును తృణీకరించడంతో దైవపరిపాలనను తృణీకరించారు, ఎందుకంటే, భవిష్యత్‌లోని దైవపరిపాలన ఏర్పాట్లలో ఆయనే ప్రధానుడు. యేసు నిరంతరం పరిపాలించే, దావీదు వంశ కుమారుడు. (యెషయా 9:6, 7; లూకా 1:33; 3:23, 31) ఆ విధంగా, శారీరక ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న జనాంగంగా ఉండకుండాపోయింది.—రోమీయులు 9:31-33.

ఒక క్రొత్త దైవపరిపాలన

18. మొదటి శతాబ్దంలో ఏ క్రొత్త దైవపరిపాలన ఉద్భవించింది? వివరించండి.

18 అయితే, శారీరక ఇశ్రాయేలును దేవుడు తృణీకరించడం, భూమిపై దైవపరిపాలనకు అంతం కాదు. యేసుక్రీస్తు ద్వారా యెహోవా క్రొత్త దైవపరిపాలనను స్థాపించాడు. ఇది, అసలైన క్రొత్త జనాంగమైన, అభిషక్త క్రైస్తవ సంఘం. (1 పేతురు 2:9) అపొస్తలుడైన పౌలు దాన్ని “దేవుని ఇశ్రాయేలు” అని పేర్కొన్నాడు, చివరికి దాని సభ్యులు “ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములో” నుండి వచ్చారు. (గలతీయులు 6:16; ప్రకటన 5:9, 10) ఈ క్రొత్త దైవపరిపాలన సభ్యులు ఏ మానవ ప్రభుత్వాల క్రిందైతే వారు జీవిస్తున్నారో వాటికి విధేయులౌతూనే, వాస్తవానికి దేవుని పాలనక్రింద ఉన్నారు. (1 పేతురు 2:13, 14, 17) క్రొత్త దైవపరిపాలన ఉద్భవించిన వెంటనే, యేసు తమకిచ్చిన ఆజ్ఞకు అవిధేయులు కావడానికి శిష్యుల్లో కొందరిని శారీరక ఇశ్రాయేలు పాలకులు బలవంతపెట్టారు. దాని ప్రతిస్పందన ఏమిటి? “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” (అపొస్తలుల కార్యములు 5:29) నిజంగా, అది దైవపరిపాలనా దృక్పథమే!

19. మొదటి శతాబ్ద క్రైస్తవ సంఘం దైవపరిపాలన అని ఏ భావంలో పిలవవచ్చు?

19 మరి, క్రొత్త దైవపరిపాలన ఎలా పనిచేస్తుంది? గొప్ప దైవపరిపాలకుడైన యెహోవాకు ప్రాతినిధ్యం వహించే రాజైన యేసుక్రీస్తు ఉండేవాడు. (కొలొస్సయులు 1:13) రాజు పరలోకమందు అదృశ్యంగా ఉన్నప్పటికి, తన ప్రజలకు ఆయన పరిపాలన వాస్తవమై యుండి, ఆయన మాటలు వారి జీవితాన్ని నడిపించాయి. దృశ్యమైన పర్యవేక్షణ కొరకు ఆత్మీయ అర్హతగల పెద్దలు నియమించబడ్డారు. యెరూషలేమునందు అటువంటి పురుషులతో కూడిన ఒక గుంపు పరిపాలక సభగా పనిచేశారు. పౌలు, తిమోతి, తీతు మొదలగు ప్రయాణ పెద్దలు ఆ సభకు ప్రాతినిధ్యం వహించేవారు. ప్రతి సంఘానికి పెద్దలు లేక పెద్దల సభ శ్రద్ధవహిస్తుండేది. (తీతు 1:5) క్లిష్టమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు, పెద్దలు పరిపాలక సభనుగాని లేక అ సభకుచెందిన పౌలు వంటి ప్రతినిధులలో ఒకరిని గాని సంప్రదించేవారు. (అపొస్తలుల కార్యములు 15:2; 1 కొరింథీయులు 7:1; 8:1; 12:1 పోల్చండి.) అంతేకాకుండా, దైవపరిపాలనను ఉన్నతపర్చడంలో సంఘంలోని ప్రతివ్యక్తి భాగం వహించాడు. ప్రతివారు తమ జీవితమందు లేఖనాధార సూత్రాలను అన్వయించడంలో యెహోవా యెదుట జవాబుదారులై యుండిరి.—రోమీయులు 14:4, 12.

20. అపొస్తలుల తర్వాత కాలంలోని దైవపరిపాలనను గూర్చి ఏమి చెప్పవచ్చు?

20 అపొస్తలుల మరణానంతరం, మతభ్రష్టత్వం పెరుగుతుందని పౌలు హెచ్చరించాడు, సరిగ్గా అదే జరిగింది. (2 థెస్సలొనీకయులు 2:3) సమయం గడిచేకొలది, క్రైస్తవులమని చెప్పుకునే వారి సంఖ్య మొదట లక్షలకు ఆ తర్వాత కోట్లకు పెరిగింది. ఆచారాధిపత్యం, ప్రెస్బిటేరియన్‌, కాంగ్రిగేషనల్‌ వంటి పలు రకాల చర్చీ ప్రభుత్వాలు తయారయ్యాయి. అయితే, ఈ చర్చీల ప్రవర్తనగాని లేక నమ్మకాలుగాని యెహోవా పరిపాలనను ప్రతిబింబించలేదు. అవి దైవపరిపాలనలు కావు!

21, 22. (ఎ) అంత్యకాలంలో యెహోవా దైవపరిపాలనను ఎలా పునరుద్ధరించాడు? (బి) తర్వాతి శీర్షికలో దైవపరిపాలనకు సంబంధించి ఏ ప్రశ్నలకు జవాబివ్వబడుతుంది?

21 ఈ ప్రస్తుత విధానపు అంత్యకాలంలో, అబద్ధ క్రైస్తవులనుండి నిజక్రైస్తవులను వేరుచేసే పని జరగాల్సివుంది. (మత్తయి 13:37-43) దైవపరిపాలన చరిత్రలో ఒక ప్రధాన సంవత్సరమైన 1919లో ఇది జరిగింది. ఆ సమయంలో యెషయా 66:8 నందున్న మహోన్నతమైన ప్రవచనం నెరవేరింది: “అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక దేశమును (NW) కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?” ఈ ప్రశ్నలకు జవాబు అవును అని బిగ్గరగా చెప్పవచ్చును! క్రైస్తవ సంఘం 1919లో మరోసారి ఒక ప్రత్యేకమైన “జనాంగంగా” ఉద్భవించింది. వాస్తవానికి దైవపరిపాలనా “దేశము” ఒక్క రోజులో అన్నట్లుగా ఉద్భవించింది! అంత్యకాలం అంతకంతకు ముగింపుకొస్తుండగా, ఈ క్రొత్త జనాంగపు సంస్థ మరలా మొదటి శతాబ్దంలోవున్న దానికి వీలైనంత దగ్గరగా తేబడడానికి సర్దుబాటు చేయబడింది. (యెషయా 60:17) అయితే అది ఎల్లప్పుడూ దైవపరిపాలనలో ఉండెను. దాని ప్రవర్తనలో, విశ్వాసంలో అది ఎల్లప్పుడూ దైవ ప్రేరేపిత లేఖనాల్లోని న్యాయవిధులను, సూత్రాలను ప్రతిబింబించింది. అంతేకాకుండా, అది అన్నివేళలా రాజైన యేసుక్రీస్తుకు విధేయత చూపుతోంది.—కీర్తన 45:17; 72:1, 2.

22 మీరు ఈ దైవపరిపాలనతో సహవసిస్తున్నారా? మీకు దీనిలో అధికార స్థానం ఉందా? ఉంటే, దైవపరిపాలనకు అనుగుణంగా ప్రవర్తించడం అంటే ఏమిటో మీకు తెలుసా? ఏ ఉరులను తప్పించుకోవాలో మీకు తెలుసా? చివరి రెండు ప్రశ్నలు తదుపరి శీర్షికలో చర్చించబడతాయి.

మీరు వివరించగలరా?

◻ దైవపరిపాలన అంటే ఏమిటి?

◻ ఇశ్రాయేలు ఏవిధంగా దైవపరిపాలనగా ఉంది?

◻ ఇశ్రాయేలు దైవపరిపాలన అని రాజులకు జ్ఞాపకం చేయడానికి యెహోవా ఏయే ఏర్పాట్లను చేశాడు?

◻ క్రైస్తవ సంఘం ఏ విధంగా దైవపరిపాలనయై ఉంది, మరి అది ఎలా వ్యవస్థీకరించబడింది?

◻ మన కాలంలో ఏ దైవపరిపాలనా సంస్థ స్థాపించబడింది?

[12వ పేజీలోని చిత్రం]

పొంతి పిలాతు ఎదుట, యూదా పాలకులు యెహోవా యొక్క దైవపరిపాలన ద్వారా నియమించబడిన రాజును గాక కైసరును రాజుగా అంగీకరించారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి