కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 7/15 పేజీలు 9-14
  • విశ్వాసలేమి విషయమై జాగ్రత్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసలేమి విషయమై జాగ్రత్త
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకంత శక్తివంతమైన ఉపదేశం?
  • మోషేకంటే గొప్పవాడు
  • “మీ హృదయములను కఠినపరచుకొనకుడి”
  • మనకు ఒక పాఠం
  • జీవం కొరకైన పరుగు పందేన్ని విడిచిపెట్టకండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • చివరివరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే ఉత్తరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • విశ్వాసము గలవారమై ఉందాము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • అలయక యెహోవా కొరకు సాక్ష్యమియ్యుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 7/15 పేజీలు 9-14

విశ్వాసలేమి విషయమై జాగ్రత్త

“సహోదరులారా, జీవముగల దేవుడి నుండి వైదొలగిపోవడం ద్వారా అవిశ్వాస దుష్ట హృదయము మీలో ఎవరిలోనైనా ఏర్పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.”—హెబ్రీయులు 3:12, NW.

1. పౌలు హెబ్రీ క్రైస్తవులకు వ్రాసిన మాటలు భయంగొల్పే ఏ వాస్తవంవైపుకు మన అవధానాన్ని మళ్లిస్తున్నాయి?

ఒకప్పుడు యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని కల్గివున్న ప్రజలు ‘దుష్టహృదయాన్ని ఏర్పరచుకుని, జీవముగల దేవుడి నుండి వైదొలగిపోయే’ సాధ్యత ఉందన్న తలంపు ఎంత భయాన్ని కల్గిస్తుందోకదా! ఇది మనకు ఎంత హెచ్చరిక! అపొస్తలుడైన పౌలు ఈ మాటలను వ్రాసింది అవిశ్వాసులను ఉద్దేశించి కాదుగాని, యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఆధారంగా యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకున్న వారిని ఉద్దేశించి ఆయన వ్రాశాడు.

2. మనం ఏ ప్రశ్నలను పరిశీలించవలసిన అవసరం ఉంది?

2 అంతటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న ఎవరైనా ‘అవిశ్వాస దుష్ట హృదయాన్ని’ ఎలా ఏర్పరచుకోగలరు? అసలు దేవుని ప్రేమనూ, కృపాబాహుళ్యాన్నీ రుచి చూసిన ఎవరైనా ఆయననుండి ఉద్దేశపూర్వకంగా ఎలా వైదొలగిపోగలరు? మనలో ఎవరికైనా ఇది సంభవించగలదా? ఇవి గంభీరమైన తలంపులు, ఈ హెచ్చరిక వెనుకనున్న కారణాన్ని పరిశీలించడం మనకే ప్రయోజనకరం.—1 కొరింథీయులు 10:11.

ఎందుకంత శక్తివంతమైన ఉపదేశం?

3. యెరూషలేములోనూ, దాని చుట్టుప్రక్కలా ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవులను ప్రభావితం చేసిన పరిస్థితులను వివరించండి.

3 యూదయలో ఉన్న హెబ్రీ క్రైస్తవులకు పౌలు తన పత్రికను సా.శ. 61లో వ్రాసినట్లు కనిపిస్తుంది. అది, “యెరూషలేము నగరంలోనైనా లేక మొత్తం ఆ ప్రాంతమంతటిలో ఎక్కడా కూడా గంభీరమైన, యథార్థవంతులైన వ్యక్తులకు శాంతి భద్రతలు లేని” సమయమని ఒక చరిత్రకారుడు పేర్కొన్నాడు. అది, అణగద్రొక్కుతున్న రోమా సైనిక ఉనికీ, రోమా వ్యతిరేకులైన యూదా జీలట్ల ధైర్యప్రదర్శనా, ఆ కల్లోలిత సమయాలనుండి ప్రయోజనం పొందిన దొంగల నేర కార్యాలూ అన్నీ కలిసి అక్రమాన్నీ, దౌర్జన్యాన్నీ రేకెత్తించిన సమయం. ఇవన్నీ కూడా, అలాంటి విషయాల్లో చిక్కుకోకూడదని తీవ్రంగా కృషి చేస్తున్న క్రైస్తవులకు ఎంతో కష్టతరమైన పరిస్థితులను ముందుంచాయి. (1 తిమోతి 2:1, 2) వాస్తవానికి, వారు తమ తటస్థ స్థానాన్ని బట్టి ఇతరులచే సామాజిక అయోగ్యులుగా, చివరికి తిరుగుబాటుదారులుగా దృష్టించబడ్డారు. క్రైస్తవులు తరచూ దుర్వ్యవహారానికి గురై, వ్యక్తిగత మరియు ఆస్తి నష్టాలను అనుభవించారు.—హెబ్రీయులు 10:32-34.

4. హెబ్రీ క్రైస్తవులు మతపరంగా ఏవిధమైన ఒత్తిడికి గురయ్యారు?

4 హెబ్రీ క్రైస్తవులు మతపరంగా కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్నారు. యేసు నమ్మకమైన శిష్యుల ఆసక్తీ, దాని ఫలితంగా క్రైస్తవ సంఘంలో శీఘ్రగతిన విస్తరణ సంభవించడమూ యూదుల్లో—ప్రాముఖ్యంగా మతనాయకుల్లో అసూయా ద్వేషాలను రగిలించాయి. యేసుక్రీస్తు అనుచరులను వేధించడానికీ, హింసించడానికీ వాళ్లు దేనికీ వెనుకాడేవారు కాదు.a (అపొస్తలుల కార్యములు 6:8-14; 21:27-30; 23:12, 13; 24:1-9) కొంతమంది క్రైస్తవులు సూటియైన హింసను తప్పించుకోగలిగినప్పటికీ, వాళ్లు యూదులచే తృణీకరింపబడి, అపహాస్యం చేయబడేవారు. క్రైస్తవత్వానికి ఆలయమూ, యాజకత్వమూ, పండుగలూ, నియమిత బలులూ వగైరాలేవీ లేవు గనుక అది యూదా మతానికున్న వైభవం కొరవడిన, అప్పుడే ప్రారంభమైన మతంగా నిరసించబడింది. పైగా వారి నాయకుడైన యేసు నేరస్థునిగా దూషించబడి చంపబడ్డాడు. క్రైస్తవులు తమ మతాన్ని అవలంబించడానికి వారికి విశ్వాసం, ధైర్యం, సహనం అవసరమయ్యాయి.

5. యూదయలోని క్రైస్తవులకు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడం ఎందుకు కష్టమయ్యింది?

5 అన్నిటికంటే ముఖ్యంగా, యూదయలోని హెబ్రీ క్రైస్తవులు ఆ దేశ చరిత్రలోని కీలకమైన సమయంలో జీవిస్తున్నారు. యూదా విధానాంతాన్ని సూచిస్తాయని వారి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన అనేక విషయాలు అప్పటికే సంభవించాయి. అంతం ఎంతో దూరంలో ఉండివుండదు. తప్పించుకుని జీవించాలంటే క్రైస్తవులు ఆధ్యాత్మికంగా మెలకువ కల్గివుండి, ‘కొండలకు పారిపోడానికి’ సిద్ధంగా ఉండాలి. (మత్తయి 24:6, 15, 16) యేసు నిర్దేశించినట్లుగా, సత్వర చర్య తీసుకోవడానికి కావలసిన విశ్వాసమూ, ఆధ్యాత్మిక బలమూ వారికుంటాయా? కొంత సందేహం ఉన్నట్లు అనిపిస్తుంది.

6. యూదయలోని క్రైస్తవులకు అత్యవసరంగా ఏమి కావల్సివచ్చింది?

6 మొత్తం యూదా విధానమంతా నాశనం కావడానికి ముందు, చివరి దశాబ్దంలో, హెబ్రీ క్రైస్తవులు సంఘం లోపలి నుండీ, వెలుపలి నుండీ కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్నారని స్పష్టమౌతుంది. వారికి ప్రోత్సాహం అవసరమయ్యింది. అంతేగాక, తాము తీసుకున్న చర్య సరైనదేననీ, తమ బాధలూ, సహనమూ వ్యర్థం కాలేదనీ వారు గ్రహించడానికి వారికి ఉపదేశం మరియు నిర్దేశం కూడా అవసరమయ్యాయి. సంతోషకరంగా, పౌలు వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు.

7. పౌలు హెబ్రీ క్రైస్తవులకు వ్రాసినదానిపట్ల మనం ఎందుకు ఆసక్తి కల్గివుండాలి?

7 పౌలు హెబ్రీ క్రైస్తవులకు వ్రాసింది మనకు కూడా ఎంతో ఆసక్తికరమైనదై ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మనం వారి సమయానికి సమాంతరమైన సమయంలో జీవిస్తున్నాము. సాతాను ఆధీనంలోవున్న లోకం నుండి మనం అనుదినం ఒత్తిళ్ల నెదుర్కుంటాము. (1 యోహాను 5:19) అంత్యదినాలను గురించీ, “యుగాంతము” గురించీ, యేసూ మరియు అపొస్తలులూ చేసిన ప్రవచనాలు మన కళ్లయెదుటే నెరవేరుతున్నాయి. (మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:3, 4; ప్రకటన 6:1-8) అన్నిటికంటే ముఖ్యంగా, “జరుగబోవు వీటినెల్లను తప్పించు”కొనగల్గేలా మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండవలసిన అవసరం ఉంది.—లూకా 21:36.

మోషేకంటే గొప్పవాడు

8. హెబ్రీయులు 3:1 నందు వ్రాయబడివున్న మాటల ద్వారా, పౌలు తన తోటి క్రైస్తవులను ఏమి చేయమని కోరుతున్నాడు?

8 ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతూ, పౌలు ఇలా వ్రాశాడు: “అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.” (హెబ్రీయులు 3:1) ‘లక్ష్యముంచడం’ అంటే “స్పష్టంగా గ్రహించడం . . . , పూర్తిగా అర్థం చేసుకోవడం, సన్నిహితంగా పరిశీలించడం” అని భావం. (వైన్స్‌ ఎక్స్‌పోసిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌) అలా, తమ విశ్వాసం విషయంలోనూ, రక్షణ విషయంలోనూ యేసు నిర్వహించిన పాత్రపట్ల నిజమైన మెప్పును పెంపొందింపజేసుకోవడానికి తీవ్రమైన కృషి చేయమని పౌలు తన తోటి విశ్వాసులను కోరుతున్నాడు. అలా చేయడం, విశ్వాసంలో స్థిరంగా నిలిచివుండాలనే వారి దృఢచిత్తాన్ని బలపరుస్తుంది. మరైతే యేసు పాత్ర ఏమిటి, మనం ఆయనమీద ఎందుకు ‘లక్ష్యముంచాలి’?

9. పౌలు యేసును “అపొస్తలుడు” మరియు “ప్రధాన యాజకుడు” అని ఎందుకు పేర్కొన్నాడు?

9 పౌలు “అపొస్తలుడు” మరియు “ప్రధానయాజకుడు” అనే పదాలను యేసుకు అన్వయించాడు. “అపొస్తలుడు” అంటే పంపబడినవాడు. ఇక్కడ, దేవుడు మానవజాతితో సంభాషించే మాధ్యమాన్ని అది సూచిస్తుంది. మానవులు దేవుడ్ని ఎవరి ద్వారా సమీపించగలరో ఆయనే “ప్రధాన యాజకుడు.” సత్యారాధనకు ఈ రెండు ఏర్పాట్లూ ఆవశ్యకం, యేసు ఈ రెండింటి యొక్క సజీవరూపమై ఉన్నాడు. దేవుని గురించిన సత్యాన్ని మానవజాతికి బోధించడానికి ఆయన పరలోకం నుండి పంపబడ్డాడు. (యోహాను 1:18; 3:16; 14:6) యేసు, పాపక్షమాపణ కొరకు యెహోవా యొక్క ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటులో సాదృశ్యమైన ప్రధాన యాజకునిగా కూడా నియమించబడ్డాడు. (హెబ్రీయులు 4:14, 15; 1 యోహాను 2:1, 2) యేసు ద్వారా మనం పొందగల ఆశీర్వాదాలను మనం నిజంగా గుణగ్రహిస్తే, విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉండడానికి కావలసిన ధైర్యమూ, దృఢనిశ్చయతా మనకుంటాయి.

10. (ఎ) యూదామతం కన్నా క్రైస్తవత్వం ఉన్నతమైనదన్న విషయాన్ని గుణగ్రహించడానికి పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎలా సహాయం చేశాడు? (బి) తాను చెబుతున్న విషయాన్ని ధృవీకరించడానికి పౌలు ఏ సార్వత్రిక సత్యాన్ని ఎత్తి చెప్పాడు?

10 క్రైస్తవ విశ్వాస విలువను నొక్కి చెప్పడానికి, పౌలు యేసును మోషేతో పోల్చాడు. మోషేను యూదులు తమ పూర్వీకులలోకెల్లా అత్యంత గొప్ప ప్రవక్తగా దృష్టించారు. యేసు మోషే కంటే గొప్పవాడనే వాస్తవాన్ని హెబ్రీ క్రైస్తవులు హృదయపూర్వకంగా గనుక గ్రహించగల్గినట్లైతే, యూదా మతం కన్నా క్రైస్తవత్వం గొప్పదన్న విషయాన్ని సందేహించడానికి వారికి ఏ కారణమూ ఉండేది కాదు. దేవుని ‘ఇల్లు’—ఇశ్రాయేలు జనాంగం, లేక సంఘం—అప్పగింపబడడానికి మోషే తగినవానిగా పరిగణింపబడినప్పటికీ, ఆయన కేవలం నమ్మకమైన పరిచారకుడు లేక సేవకుడు మాత్రమేనని పౌలు ఎత్తిచూపించాడు. (సంఖ్యాకాండము 12:7) మరోవైపున, యేసైతే కుమారుడు, ఆ ఇంటికి యజమాని కూడాను. (1 కొరింథీయులు 11:3; హెబ్రీయులు 3:2, 3, 5) తాను చెబుతున్న విషయానికి బలాన్ని చేకూర్చడానికి, పౌలు ఈ సహజ వాస్తవాన్ని ఎత్తిచెప్పాడు: “ప్రతి యల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:3) దేవుడు సమస్తానికీ నిర్మాణకుడు లేక సృష్టికర్త గనుక ఆయన అందరి కంటే గొప్పవాడనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి కారణసహితంగానే యేసు, దేవుని తోటిపనివాడు గనుక ఆయన మోషేతోసహా ఇతర సృష్టి అంతటికంటే గొప్పవాడై ఉండవలెను.—సామెతలు 8:30; కొలొస్సయులు 1:15-17.

11, 12. దేన్ని ‘తుదమట్టుకు స్థిరముగా చేపట్టమని’ పౌలు హెబ్రీ క్రైస్తవులను కోరాడు, ఆయన ఉపదేశాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు?

11 నిజంగా, హెబ్రీ క్రైస్తవులు ఎంతో అనుగ్రహ స్థానంలో ఉన్నారు. వారు యూదా విధానం అందించే దేనికంటే కూడా విలువైనదైన ‘పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందే’ ఆధిక్యత గలవారని పౌలు వారికి జ్ఞాపకం చేశాడు. (హెబ్రీయులు 3:1) పౌలు మాటలు, అభిషిక్త క్రైస్తవులు తమ యూదా వారసత్వానికి సంబంధించిన విషయాలను తాము వదులుకున్నందుకు బాధపడే బదులు క్రొత్త వారసత్వాన్ని పొందే అవకాశాన్ని బట్టి కృతజ్ఞత కల్గివుండేలా చేసివుండవచ్చు. (ఫిలిప్పీయులు 3:8) తమ ఆధిక్యతను హత్తుకుని ఉండమనీ, దాన్ని అల్పమైనదిగా ఎంచవద్దనీ కోరుతూ పౌలు వారికిలా చెప్పాడు: “అయతే క్రీస్తు కుమారుడైయుండి [దేవుని] యంటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యల్లు.”—హెబ్రీయులు 3:6.

12 అవును, హెబ్రీ క్రైస్తవులు ముంచుకొస్తున్న యూదా విధానాంతాన్ని తప్పించుకోవాలంటే, వారు దేవుడిచ్చిన తమ నిరీక్షణను “తుదమట్టుకు స్థిరముగా” చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ విధానాంతాన్ని తప్పించుకోవాలంటే మనం కూడా నేడు అదే చేయాలి. (మత్తయి 24:13) జీవిత చింతలూ, ప్రజల ఉదాసీనతా, లేక మన స్వంత అపరిపూర్ణ దృక్పథాలూ దేవుని వాగ్దానాల యందలి మన విశ్వాసాన్ని బలహీనపర్చడానికి మనం అనుమతించకూడదు. (లూకా 21:16-19) మనల్ని మనం ఎలా బలపర్చుకోవచ్చుననేది తెలుసుకోవడానికి, మనం పౌలు తర్వాతి మాటలకు అవధానాన్నిద్దాము.

“మీ హృదయములను కఠినపరచుకొనకుడి”

13. పౌలు ఏ హెచ్చరికనిచ్చాడు, ఆయన కీర్తన 95ను ఎలా అన్వయించాడు?

13 హెబ్రీ క్రైస్తవుల అనుగ్రహ స్థానాన్ని పరిశీలించిన తర్వాత, పౌలు ఈ హెచ్చరికనిచ్చాడు: “పరిశుద్ధాత్మ యట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును [“స్వరమును,” NW] వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.” (హెబ్రీయులు 3:7, 8) పౌలు 95వ కీర్తననుండి ఎత్తివ్రాస్తున్నాడు గనుక ఆయన “పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు” అని చెప్పగలిగాడు.b (కీర్తన 95:7, 8; నిర్గమకాండము 17:1-7) లేఖనాలు దేవునిచే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాయి.—2 తిమోతి 3:16, 17.

14. యెహోవా తమ కొరకు చేసినదానిపట్ల ఇశ్రాయేలీయులు ఎలా ప్రతిస్పందించారు, ఎందుకు?

14 ఐగుప్తులోని దాసత్వం నుండి విడిపించబడిన తర్వాత, యెహోవాతో నిబంధన సంబంధంలోకి ప్రవేశించే గొప్ప ఆధిక్యత ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. (నిర్గమకాండము 19:4, 5; 24:7, 8) అయితే, దేవుడు తమ కొరకు చేసినదానిపట్ల మెప్పును చూపించే బదులు, వాళ్లు త్వరలోనే తిరుగుబాటుగా ప్రవర్తించారు. (సంఖ్యాకాండము 13:25–14:10) అదెలా సంభవించి ఉండవచ్చు? వారి హృదయాలు కఠినమవ్వడమే దానికి కారణమని పౌలు ఎత్తి చూపించాడు. కానీ దేవుని వాక్యాన్ని స్వీకరించి దానికి అనుగుణ్యంగా ప్రవర్తించే హృదయాలు ఎలా కఠినమవ్వగలవు? దీన్ని నివారించడానికి మనమేం చేయాలి?

15. (ఎ) గతంలో ‘దేవుని స్వరం’ ఎలా వినిపించింది, ప్రస్తుతం ఎలా వినిపిస్తోంది? (బి) ‘దేవుని స్వరానికి’ సంబంధించి మనల్ని మనం ఏ ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది?

15 “మీరాయన శబ్దమును [“స్వరమును,” NW] వినినయెడల” అనే షరతును జతచేస్తూ పౌలు తన హెచ్చరికను మొదలుపెట్టాడు. దేవుడు మోషే ద్వారా మరియు ఇతర ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు. తర్వాత, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా వారితో మాట్లాడాడు. (హెబ్రీయులు 1:1, 2) నేడు మనకు దేవుని పూర్తి ప్రేరేపిత వాక్యమైన పరిశుద్ధ బైబిలు ఉంది. “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము పెట్టుటకు” యేసు నియమించిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ కూడా మనకున్నాడు. (మత్తయి 24:45-47) గనుక, దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. కాని మనం వింటున్నామా? ఉదాహరణకు, వస్త్రాలంకరణ మరియు కేశాలంకరణల గురించీ లేక వినోదం మరియు సంగీతం ఎంపిక చేసుకోవడం గురించీ ఇవ్వబడే ఉపదేశానికి మనమెలా ప్రతిస్పందిస్తాము? మనం ‘వింటామా’—అంటే వినిపిస్తున్నదానికి అవధానాన్నిచ్చి, విధేయత చూపిస్తామా? మన ప్రవర్తనకు సాకులు చెప్పే లేక ఉపదేశాన్ని నిరాకరించే అలవాటు మనకుంటే, మనం మన హృదయాలను కఠినపర్చే మోసకరమైన ప్రమాదానికి మనల్ని మనం గురిచేసుకుంటున్నట్లే.

16. మన హృదయాలు కఠినమైపోగల ఒక విధం ఏది?

16 మనం చేయగలిగిన, చేయవలసిన పనుల నుండి స్వాతంత్ర్యాన్ని కోరుతుంటే కూడా మన హృదయాలు కఠినమవ్వగలవు. (యాకోబు 4:17) యెహోవా ఇశ్రాయేలీయులకు ఎంతో చేసినప్పటికీ కూడా, వాళ్లు విశ్వాసం చూపించడానికి విఫలమై, మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కనాను గురించి ప్రతికూలమైన నివేదిక నమ్మడానికే ఎంపిక చేసుకుని, వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. (సంఖ్యాకాండము 14:1-4) గనుక వాళ్లు 40 సంవత్సరాలు అంటే ఆ తరంలోని విశ్వాసంలేని సభ్యులు మరణించడానికి తగినంత సమయం అరణ్యంలో గడుపుతారని యెహోవా తీర్పు తీర్చాడు. దేవుడు వారిని ఏవగించుకుని, “వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలిసికొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని” చెప్పాడు. (హెబ్రీయులు 3:9-11) ఇందులో మనకేమైనా పాఠం కనిపిస్తోందా?

మనకు ఒక పాఠం

17. ఇశ్రాయేలీయులు యెహోవా యొక్క శక్తివంతమైన కార్యాలను చూసినప్పటికీ, ఆయన ప్రకటనలను విన్నప్పటికీ వారికి విశ్వాసం ఎందుకు కొరవడింది?

17 ఐగుప్తులోనుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయుల తరంవారు యెహోవా యొక్క శక్తివంతమైన కార్యాలను తమ స్వంత కళ్లతో చూసి, ఆయన ప్రకటనలను తమ స్వంత చెవులతో విన్నారు. అయినప్పటికీ, దేవుడు తమను వాగ్దాన దేశంలోకి సురక్షితంగా నడిపించగలడన్న విశ్వాసం వారికి లేదు. ఎందుకు? వారు “నా మార్గములను తెలిసికొనలేదు” అని యెహోవా చెప్పాడు. యెహోవా ఏమి చెప్పాడో, ఏమి చేశాడో వారికి తెలుసు, కానీ, తమపట్ల శ్రద్ధ వహించడానికి ఆయనకున్న సామర్థ్యంలో వారు నమ్మకాన్నీ దృఢవిశ్వాసాన్నీ పెంపొందింపజేసుకోలేదు. వాళ్లు తమ వ్యక్తిగత అవసరాలు మరియు కోరికల్లో ఎంతగా మునిగిపోయి ఉన్నారంటే, దేవుని మార్గాలకూ సంకల్పానికీ శ్రద్ధ నివ్వలేకపోయారు. అవును, ఆయన వాగ్దానంలో వారికి విశ్వాసం కొరవడింది.

18. పౌలు చెప్పినదాని ప్రకారం, ఏ చర్య “అవిశ్వాస దుష్ట హృదయం” ఏర్పడడానికి కారణమౌతుంది?

18 హెబ్రీయులకు వ్రాసిన ఈ తర్వాతి మాటలు మనకూ అంతే శక్తివంతంగా వర్తిస్తాయి: “సహోదరులారా, జీవముగల దేవుని నుండి వైదొలగిపోవడం ద్వారా అవిశ్వాస దుష్ట హృదయము మీలో ఎవరిలోనైనా ఏర్పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.” (హెబ్రీయులు 3:12, NW) “జీవముగల దేవుని నుండి వైదొలగిపో”వడానికి కారణం “అవిశ్వాస దుష్ట హృదయము” అని ఎత్తిచూపించడం ద్వారా పౌలు అసలు విషయానికి వస్తున్నాడు. మునుపు ఈ పత్రికలో, జాగ్రత్తగా ఉండకపోవడం మూలంగా ‘కొట్టుకొనిపోవడం’ గురించి ఆయన మాట్లాడాడు. (హెబ్రీయులు 2:1) అయితే, ‘వైదొలగిపోవడం’ అని అనువదించబడిన గ్రీకు పదాన్ని ‘ధర్మ భ్రష్టత్వం’ అని కూడా అనువదించవచ్చు. అది, కొంత తృణీకారంతో కావాలని ఉద్దేశపూర్వకంగా చేసే నిరాకరణను, వైదొలగడాన్నీ, విడిచిపెట్టడాన్నీ సూచిస్తుంది.

19. ఉపదేశాన్ని వినడంలో విఫలమవ్వడం గంభీరమైన పరిణామాలకు ఎలా దారితీయవచ్చు? ఉదాహరించండి.

19 కాబట్టి పాఠం ఏమిటంటే, యెహోవా తన వాక్యం ద్వారా మరియు నమ్మకమైన దాసుని తరగతి ద్వారా ఇస్తున్న ఉపదేశాన్ని అలక్ష్యం చేస్తూ, ‘ఆయన స్వరమును వినడంలో’ విఫలమవ్వడాన్ని మనం అలవాటు చేసుకుంటే, మన హృదయాలు మొద్దుబారిపోయి, కఠినమైపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఉదాహరణకు, ఒక అవివాహిత జంట మరీ సన్నిహితమయ్యారనుకోండి. వాళ్లు ఆ విషయాన్ని కేవలం అలక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది? వాళ్లు తాము చేసింది మళ్లీ చేయకుండా ఉండేలా అది వారిని కాపాడుతుందా, లేక అదే పనిని వారు మళ్లీ చేయడాన్ని సులభమయ్యేలా చేస్తుందా? అలాగే, సంగీతాన్నీ వినోదాన్నీ ఎంపిక చేసుకునే విషయంలో మరితర విషయాల్లో జాగ్రత్తగా ఉండమని దాసుని తరగతి మనకు ఉపదేశమిచ్చినప్పుడు, మనం దాన్ని కృతజ్ఞతగా స్వీకరించి, అవసరమైన మార్పులు చేసుకుంటామా? ‘సమాజముగా కూడుట మానవద్దని’ పౌలు మనల్ని పురికొల్పాడు. (హెబ్రీయులు 10:24, 25) అలా ఉపదేశం ఇవ్వబడినప్పటికీ, కొంతమంది క్రైస్తవ కూటాలపట్ల ఉదాసీన వైఖరి కల్గివుంటారు. కొన్ని కూటాలకు హాజరు కాలేకపోవడం లేక మొత్తంగా కొన్నింటికి హాజరు కాకుండానే ఉండడం అంత గంభీరమైనదేమీ కాదని వాళ్లు భావించవచ్చు.

20. మనం లేఖనాధార ఉపదేశానికి అనుకూలంగా ప్రతిస్పందించడం ఎందుకు ఆవశ్యకం?

20 లేఖనాల్లోనూ, బైబిలు ఆధారిత ప్రచురణల్లోనూ స్పష్టంగా వ్యక్తపర్చబడిన యెహోవా ‘స్వరానికి’ మనం అనుకూలంగా ప్రతిస్పందించకపోతే, మనం త్వరలోనే ‘జీవముగల దేవుని నుండి వైదొలగిపోతున్నట్లు’ కనుగొంటాము. ఉపదేశాన్ని మనం మనస్సులో అలక్ష్యం చేస్తే, మనం దాన్ని సులభంగా మన క్రియల్లో చూపిస్తూ, ఆ ఉపదేశాన్ని చిన్న చూపుచూడడం, విమర్శించడం, ఎదిరించడం వంటివి చేయనారంభిస్తాము. దాన్ని సరిచేసుకోకపోతే, ఫలితం ‘అవిశ్వాస దుష్ట హృదయమే,’ అలాంటి స్థితిలో నుండి బయటికి రావడం సాధారణంగా చాలా కష్టం. (ఎఫెసీయులు 4:19 పోల్చండి.) తగిన రీతిగానే యిర్మీయా ఇలా వ్రాశాడు: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:9) ఈ కారణాన్ని బట్టే, పౌలు తన తోటి హెబ్రీ విశ్వాసులను ఇలా కోరాడు: “పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు—నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.”—హెబ్రీయులు 3:13-15.

21. ఏమి చేయడానికి మనమందరం పురికొల్పబడ్డాము, మనకు ఏ ఉత్తరాపేక్షలు ఉన్నాయి?

21 యెహోవా ఇప్పటికీ తన వాక్యం ద్వారా, తన సంస్థ ద్వారా నేడు మనతో మాట్లాడుతున్నందుకు మనమెంత సంతోషిస్తున్నామో కదా! ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ మనం ‘మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతముమట్టుకు గట్టిగా చేపట్టగలిగేలా’ మనకు సహాయం చేయడంలో కొనసాగుతున్నందుకు మనం ఎంతో కృతజ్ఞత కల్గివున్నాము. (హెబ్రీయులు 3:13-15) దేవుని ప్రేమా నడిపింపులకు ప్రతిస్పందించడానికి సమయమిదే. మనమలా చేస్తుండగా, మనం యెహోవా యొక్క మరో అద్భుతమైన వాగ్దానాన్ని అంటే ఆయన విశ్రాంతిలోకి ‘ప్రవేశించడాన్ని’ ఆనందించవచ్చు. (హెబ్రీయులు 4:3, 10) పౌలు హెబ్రీ క్రైస్తవులతో చర్చించిన తర్వాతి అంశం అదే, మనం తర్వాతి శీర్షికలో పరిశీలించే అంశం కూడా అదే.

[అధస్సూచీలు]

a ఫేస్తు మరణించిన కొద్ది కాలానికి, సద్దూకయుడైన అననస్‌ (అననీయ) ప్రధాన యాజకుడయ్యాడని జోసీఫస్‌ నివేదిస్తున్నాడు. ఆయన యేసు సహోదరుడైన యాకోబునూ ఇతర శిష్యులనూ సమాజమందిరం ఎదుటకు తెప్పించి మరణ శిక్ష విధింపబడేలా రాళ్లతో కొట్టిచంపబడేలా చేశాడు.

b పౌలు గ్రీకు సెప్టాజింట్‌ నుండి ఎత్తివ్రాసినట్లు స్పష్టమౌతుంది, అందులో “మెరీబా” మరియు “మస్సా” అనే హెబ్రీ పదాలు, “వాదము” మరియు “శోధించుట” అని అనువదించబడ్డాయి. వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి యొక్క రెండవ సంపుటిలోని 350, 379 పేజీలను చూడండి.

మీరు వివరించగలరా?

◻ పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎందుకు అంత శక్తివంతమైన ఉపదేశాన్ని వ్రాశాడు?

◻ యూదామతం క్రింది జీవితం కంటే శ్రేష్ఠమైనది తమకుందని హెబ్రీ క్రైస్తవులు గుణగ్రహించడానికి పౌలు వారికెలా సహాయం చేశాడు?

◻ ఒకరి హృదయం ఎలా కఠినమౌతుంది?

◻ “అవిశ్వాస దుష్ట హృదయము” ఏర్పడకుండా మనం ఏమి చేయాలి?

[10వ పేజీలోని చిత్రం]

గొప్ప మోషే అయిన యేసును మీరు విశ్వసిస్తున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి