తుకికు—నమ్మకస్థుడైన తోటి దాసుడు
తుకికు అనేక సందర్భాల్లో, అపొస్తలుడైన పౌలుతో ప్రయాణం చేశాడు, ఆయన సందేశకుడుగా కూడా పని చేశాడు. డబ్బును, పైవిచారణా బాధ్యతలనూ అప్పగించగల్గేంత నమ్మకస్థుడైన దూత ఆయన. లేఖనాలు ఆయన సత్యసంధతను—అది క్రైస్తవులందరికీ అత్యవసరమైన గుణము—ఉన్నతపరుస్తున్నాయి గనుక, బహుశా మీరు ఆయన గురించి మరెక్కువగా తెలుసుకోవాలనుకోవచ్చు.
తుకికుని తన “ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన” వ్యక్తి అని పౌలు వర్ణిస్తున్నాడు. (కొలొస్సయులు 4:7) అపొస్తలుడైన పౌలు ఆయనను ఎందుకలా దృష్టించాడు?
యెరూషలేముకు సహాయ కార్యక్రమం
దాదాపు సా. శ. 55లో యూదయలోని క్రైస్తవులకు భౌతిక వస్తువుల కొరత ఏర్పడింది. వాళ్ళకు సహాయపడేందుకు యూరప్ మరియు ఆసియా మైనర్‌లోని సంఘాల తోడ్పాటుతో పౌలు విరాళాల సేకరణను సంస్థీకరించాడు. ఆసియాలోని ఒక ప్రాంతానికి చెందిన తుకికు ఈ సహాయ కార్యక్రమంలో ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించాడు.
ఈ విరాళాలను ఎలా ఉపయోగించాలనే విషయంలో నిర్దేశాలను ఇచ్చిన తర్వాత, నమ్మగల పురుషులను యెరూషలేముకు పంపాలనీ, లేదా సమకూడిన విరాళాలను తీసుకుని తనతోపాటు రావాలని పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 16:1-4) ఆయన గ్రీసు నుండి యెరూషలేముకు సుదూర ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ఆయనతోపాటు చాలా మంది వెళ్ళారు. అలా వెళ్ళినవారిలో తుకికు ఒకరన్నది స్పష్టం. (అపొస్తలుల కార్యములు 20:4) అనేక సంఘాలవారు ముట్టజెప్పిన డబ్బును వాళ్ళు తీసుకువెళ్తున్నారు గనుక అలాంటి పెద్ద గుంపు అవసరమై ఉండవచ్చు. మార్గమధ్యంలో దుండగుల ప్రమాదం ఉండేది గనుక అలాంటి భద్రతా ఏర్పాటు ప్రాముఖ్యమైన విషయమై ఉండవచ్చు.—2 కొరింథీయులు 11:26.
యెరూషలేముకు పౌలు వెంట అరిస్తార్కు, త్రోఫిమును వెళ్ళారు గనుక, తుకికు, మరితరులు కూడా వెళ్ళివుండవచ్చని కొందరు భావిస్తున్నారు. (అపొస్తలుల కార్యములు 21:29; 24:17; 27:1, 2) తుకికు ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సేకరణా ఏర్పాట్లను చేసేందుకు గ్రీసులో తీతుతో పనిచేసిన ‘సహోదరుడు’ అని అనేకుల చేత సూచించబడినవారిలో ఆయన ఒకరు. “ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారు” “ఏర్పరచు”కొన్న వ్యక్తి ఆయన. (2 కొరింథీయులు 8:18, 19; 12:18) తుకికు పూర్తిచేసిన మొదటి దౌత్యం ఎంత బాధ్యతాయుతమైనదో, రెండవ దౌత్యం కూడా అంతే బాధ్యతాయుతమైనది.
రోమ్ నుండి కొలస్సయి వరకు
అయిదు ఆరు సంవత్సరాల తర్వాత (సా.శ. 60-61), పౌలు రోమ్‌లో తన మొదటి ఖైదు నుండి విడుదల చేయబడతాననే నిరీక్షణతో ఉన్నాడు. తుకికు తన ఇంటి నుండి వందల కిలోమీటర్ల దూరాన, పౌలుతో ఉన్నాడు. ఇప్పుడు తుకికు ఆసియాకు తిరిగి వెళ్తున్నాడు. అలా, ఆ ప్రాంతాల్లోని క్రైస్తవ సంఘాలకు ఉత్తరాలను పంపేందుకు, ఫిలేమోను యొక్క పారిపోయిన సేవకుడైన ఒనేసిమును కొలస్సయికి పంపేందుకూ పౌలుకు సాధ్యమైంది. తుకికు, ఒనేసిము ఇప్పుడు బైబిలులో పుస్తకాల్లో చేరి ఉన్న కనీసం మూడు లేఖలను—ఒకటి ఎఫెసీయులకు, ఒకటి కొలస్సయులకు, మరొకటి ఫిలేమోనుకు—తీసుకువెళ్ళారు. కొలస్సయి నుండి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న లవొదికయ నగరంలోని సంఘానికి కూడా ఒక ఉత్తరం అందజేయబడి ఉండవచ్చు.—ఎఫెసీయులు 6:21; కొలొస్సయులు 4:7-9, 16; ఫిలేమోను 10-12.
తుకికు కేవలం బట్వాడాచేసే వ్యక్తి మాత్రమే కాదు. ఆయన నమ్మిన వ్యక్తిగత సందేశకుడు కూడా. అందుకే పౌలు ఇలా వ్రాశాడు: “ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును, అతనిని . . . పంపుచున్నాను.”—కొలొస్సయులు 4:7, 8.
ఉత్తరాలను తీసుకువెళ్ళే వ్యక్తి “తరచూ, లేఖికునికి దానిని అందుకునేవారికీ లేఖల సంబంధ మధ్యవర్తిగా మాత్రమే కాక, వ్యక్తిగత మధ్యవర్తిగా కూడా ఉండేవాడు. ఉత్తరాలను తీసుకువెళ్ళే వ్యక్తి నమ్మకస్థుడై ఉండవలసినదానికి . . . [ఒక కారణం], ఆ వ్యక్తి తరచూ అదనపు సమాచారాన్ని తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నదే. ఒక ఉత్తరం అక్కడి పరిస్థితినీ, తరచూ లేఖికుని తలంపులను క్లుప్తంగా తెలియజేయవచ్చు, కానీ ఉత్తరాలను తీసుకువెళ్ళే ఆ వ్యక్తి ఆ లేఖలను అందుకునేవారికి అన్ని వివరాలను విపులంగా చెబుతాడని ఆశించబడేది” అని పండితుడైన ఇ. రాన్‌డాల్ఫ్ రిచార్డ్స్ తెలియజేస్తున్నాడు. ఒక ఉత్తరం ఉపదేశాలను ఇస్తున్నప్పటికీ, అత్యవసర విషయాలనూ చర్చిస్తున్నప్పటికీ, మిగతా వివరాలను నమ్మకస్థుడైన సందేశకుడు మౌఖికంగా తెలియజేస్తాడు.
ఎఫెసీయులకూ, కొలొస్సయులకూ, ఫిలేమోనుకూ వ్రాసిన లేఖలు పౌలు తన అవసరాలను ఎలా తీర్చుకొనేవాడనే విషయం గురించి చెప్పడం లేదు. అందుకే తుకికు రోమ్‌లో పౌలు పరిస్థితిని గురించి అలా వ్యక్తిగతంగా వివరించవలసి ఉండింది. సంఘాలకు కావలసిన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు అక్కడి పరిస్థితులను గురించి సరైన అవగాహనను ఏర్పరచుకోవలసి ఉండింది. పంపిస్తున్న వ్యక్తికి నమ్మకంగా ప్రాతినిధ్యం వహించగలడని నమ్మకంగల వ్యక్తులకు మాత్రమే ఈ తరహా సందేశాలూ, బాధ్యతలూ అప్పగించబడేవి. తుకికు అలాంటి వ్యక్తే.
సుదూర నియామకాల్లో పైవిచారణ
పౌలు రోమ్‌లో తను బంధించబడిన గృహం నుండి విముక్తుడైన తర్వాత, క్రేతు ద్వీపంలో ఉన్న తీతు దగ్గరకు తుకికును గానీ, లేదా అర్తెమాను గానీ పంపాలనే తలంపుతో ఉన్నాడు. (తీతు 1:5; 3:12) పౌలు రెండవసారి రోమా ఖైదులో ఉన్నప్పుడు, (బహుశా దాదాపు సా.శ. 65) తుకికును మళ్ళీ ఎఫెసుకు పంపించింది, బహుశా పౌలుతోపాటు ప్రయాణం చేయనున్న తిమోతి స్థానాన్ని తీసుకునేందుకే అయ్యుండవచ్చు.—2 తిమోతి 4:9, 12.
ఆ సమయంలో తుకికు క్రేతుకు, ఎఫెసుకు రెండుచోట్లకూ వెళ్ళాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ, అపొస్తలుడైన పౌలు పరిచర్య యొక్క చివరి సంవత్సరాల వరకూ కూడా ఆయన సన్నిహిత సహవాసిగానే ఉండిపోయాడని ఇలాంటి రెఫరెన్సులు చెబుతున్నాయి. తుకికును బాధ్యతగల, బహుశా క్లిష్టంగా ఉండే నియామకాల మీద తిమోతి మరియు తీతుల స్థానాన పంపాలని పౌలు తలంచాడంటే, తుకికు పరిపక్వతగల క్రైస్తవ పైవిచారణకర్తగా ఎదిగాడని స్పష్టం. (పోల్చండి 1 తిమోతి 1:3; తీతు 1:10-13.) ప్రయాణించేందుకూ, సుదూర నియామకాల్లో ఉపయోగించబడేందుకు ఆయన చూపిన సంసిద్ధత, పౌలుకు, క్రైస్తవ సంఘమంతటికీ ఆయనను ఉపకారిగా చేసింది.
నేడు, స్వయంత్యాగ స్ఫూర్తిగల క్రైస్తవులు యెహోవాసాక్షుల స్థానిక సంఘాల్లో ఇష్టపూర్వకంగా సేవ చేస్తున్నారు లేదా మరెక్కడైనా సరే రాజ్యాసక్తులను పెంపొందించేందుకు తమను తాము అందుబాటులో ఉంచుకుంటారు. వేలాది మంది మిషనరీలుగాను, ప్రయాణ పైవిచారణకర్తలుగాను, వాచ్ టవర్ సొసైటీ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో లేదా దాని శాఖల్లోని ఒకదానిలో నిర్మాణ ప్రాజెక్ట్‌లలో అంతర్జాతీయ సేవకులుగానూ తమ నియామకాలను సంతోషంగా స్వీకరించారు. తుకికులాగే, వాళ్ళు బహిరంగంగా కనబడే వ్యక్తులుకారు. కాని వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు దేవునికి ప్రియమైనవారునూ, ‘ప్రభువులో’ విశ్వసనీయులైన ‘తోటి దాసులుగా’ మిగతా క్రైస్తవులు ప్రేమించేవారునూ అయిన ‘నమ్మకమైన పరిచారకులు.’