విశ్వాసము గలవారమై ఉందాము
“ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.”—హెబ్రీయులు 10:39.
1. యెహోవా యొక్క ప్రతి యథార్థ సేవకుని విశ్వాసమూ అమూల్యమైనదే అని ఎందుకు చెప్పవచ్చు?
ఈసారి మీరు యెహోవా ఆరాధకులతో నిండివున్న రాజ్యమందిరానికి వెళ్లినప్పుడు, మీ చుట్టూ ఉన్న వారివైపు ఒకసారి దృష్టిని సారించండి. వాళ్లు విశ్వాసాన్ని చూపించే అనేక మార్గాల గురించి ఆలోచించండి. దశాబ్దాలుగా దేవుని సేవ చేస్తున్న వృద్ధులను, ప్రతిరోజూ తమ తోటివారినుంచి వచ్చే ఒత్తిళ్లను ఎదిరించి నిలబడుతున్న యౌవనస్థులను, తమ పిల్లల్ని దైవభయంగలవారిగా పెంచటానికి ప్రయాస పడుతున్న తల్లిదండ్రులను మీరు చూడవచ్చు. అనేక బాధ్యతలను నిర్వర్తించే సంఘపెద్దలూ, పరిచర్య సేవకులూ ఉన్నారు. అవును, యెహోవా సేవ చేయడానికి అన్ని రకాలైన అవాంతరాలనూ అధిగమిస్తున్న అన్ని వయసులకు చెందిన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలను మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కరి విశ్వాసం ఎంత అమూల్యమైనదో కదా!—1 పేతురు 1:7.
2. హెబ్రీయులు 10, 11 అధ్యాయాలలోని పౌలు ఉపదేశం ఈనాడు మనకెందుకు ప్రయోజనకరమైనది?
2 విశ్వాస ప్రాముఖ్యతను గురించి అపరిపూర్ణ మానవుల్లో అపొస్తలుడైన పౌలుకన్నా మిన్నగా ఎవరూ అర్థం చేసుకోలేదు. వాస్తవానికి, నిజమైన విశ్వాసం ‘ఆత్మను రక్షించటానికి’ నడిపిస్తుందని ఆయన పేర్కొన్నాడు. (హెబ్రీయులు 10:39) అయితే, ఈ అవిశ్వాస లోకంలో విశ్వాసం దాడికి గురౌతుందనీ, హరించి వేయబడుతుందనీ పౌలుకు తెలుసు. తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రయాస పడుతున్న యూదా యెరూషలేములలో ఉన్న హెబ్రీ క్రైస్తవులను గురించి ఆయన ఎంతో చింతించాడు. మనం హెబ్రీయులు 10, 11 అధ్యాయాలలోని భాగాలను చూస్తుండగా, వారి విశ్వాసాన్ని పెంపొందింప జేయటానికి పౌలు ఉపయోగించిన పద్ధతులను మనం గమనిద్దాము. అలా చేసేటప్పుడు, మనలో మనమూ అలాగే మన చుట్టూ ఉన్నవారిలోనూ మనం విశ్వాసాన్ని ఎలా పెంపొందింపజేయవచ్చో చూద్దాము.
పరస్పరం నమ్మకాన్ని వ్యక్తం చేసుకోండి
3. విశ్వాసంలో ఉన్న తన సహోదర సహోదరీలపై పౌలుకు నమ్మకం ఉందని హెబ్రీయులు 10:39లోని ఆయన మాటలు ఎలా చూపిస్తున్నాయి?
3 మనం గమనించగల మొదటి విషయం ఏమిటంటే, తన పాఠకులపట్ల పౌలుకున్న అనుకూల దృక్పథం. ఆయనిలా వ్రాశాడు: “అయతే మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.” (హెబ్రీయులు 10:39) పౌలు నమ్మకమైన తన తోటి క్రైస్తవుల విషయంలో మంచినే తలంచాడు గానీ వారి గురించి చెడుగా తలంచలేదు. ఆయన “మనము” అనే మాటను ఉపయోగించాడని కూడా గమనించండి. పౌలు నీతిమంతుడు. అయినప్పటికీ, ఆయన, తాను వారికంటే ఎంతో పైగా, చాలా నీతి గలవాడిగా ఉన్నట్లు తన పాఠకులను తక్కువ చేసి మాట్లాడలేదు. (పోల్చండి ప్రసంగి 7:16.) బదులుగా, ఆయన వారిలో తననూ చేర్చుకున్నాడు. తానూ తన నమ్మకమైన క్రైస్తవ పాఠకులూ తమ ఎదుట కొండలా నిలుచుని ఉన్న నిరుత్సాహపరచే అవాంతరాలను ఎదుర్కుంటామనీ, నశించిపోయేలా వెనుక తీయడానికి ధైర్యంగా నిరాకరిస్తామనీ, విశ్వాసముగలవారమని నిరూపించుకుంటామనీ ఆయన హృదయపూర్వక నమ్మకాన్ని వ్యక్తపర్చాడు.
4. ఏ కారణాలను బట్టి పౌలుకు తన తోటి విశ్వాసులలో నమ్మకం ఉంది?
4 పౌలుకు అలాంటి నమ్మకం ఎలా కలిగింది? హెబ్రీ క్రైస్తవుల తప్పిదాలను ఆయన చూడలేకపోయాడా? అదేమీ కాదు, అందుకు పూర్తి భిన్నంగా వారు తమ ఆధ్యాత్మిక లోపాలను సరిచేసుకునేందుకు సహాయం చేయగల నిర్దిష్టమైన సలహాలను ఆయన వారికిచ్చాడు. (హెబ్రీయులు 3:12; 5:12-14; 6:4-6; 10:26, 27; 12:5) అయినా, తన సహోదరులపై నమ్మకం ఉంచటానికి పౌలుకు కనీసం రెండు మంచి కారణాలున్నాయి. (1) యెహోవాను అనుకరించేవాడిగా పౌలు, దేవుని ప్రజల్ని యెహోవా ఎలా దృష్టిస్తాడో అలాగే దృష్టించడానికి ప్రయత్నించాడు. అది కేవలం వారి తప్పులకు సంబంధించి మాత్రమే కాదుగానీ వాళ్ల మంచి లక్షణాలకు సంబంధించి, భవిష్యత్తులో మంచి చేయడానికి ఎంచుకునేందుకు వారికున్న సామర్థ్యానికి సంబంధించి కూడా. (కీర్తన 130:3; ఎఫెసీయులు 5:1) (2) పౌలుకు పరిశుద్ధాత్మ శక్తిపై గట్టి నమ్మకం ఉంది. నమ్మకంగా తన సేవచేయాలని కృషి చేస్తున్న ఏ క్రైస్తవుడికైనా “బలాధిక్యము” ఇవ్వకుండా యెహోవాను ఏ అవాంతరాలూ, ఏ మానవ బలహీనతలూ ఆపలేవని ఆయనకు తెలుసు. (2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:13) కాబట్టి తన సహోదర సహోదరీలపై పౌలు ఉంచిన నమ్మకం ఏదో అనుచితమైనదీ, అవాస్తవికమైనదీ, లేక గుడ్డి ఆశావాదంతో కూడినదీ కాదు. అది దృఢమైన పునాది గలది, లేఖనాధారితమైనది.
5. పౌలుకున్న నమ్మకాన్ని మనం ఎలా అనుకరించవచ్చు, ఫలితం ఏమై ఉండవచ్చు?
5 నిశ్చయంగా, పౌలు ప్రదర్శించిన నమ్మకం ఇతరులకు సోకే గుణం గలది. పౌలు తమతో అంత ప్రోత్సాహకరంగా మాట్లాడటం యూదా యెరూషలేములలోని సంఘాలకు ఎంతో పురికొల్పుగా ఉండివుండవచ్చు. యూదా వ్యతిరేకుల చిన్నబుచ్చే తిరస్కారాన్ని, అహంకారపూరితమైన ఉదాసీనతను ఎదుర్కుంటున్న సమయంలో, విశ్వాసం గలవారమై ఉండాలని తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోవడానికి అలాంటి వ్యక్తీకరణలు హెబ్రీ క్రైస్తవులకు సహాయం చేశాయి. మరి నేడు మనం ఒకరికొకరం అలాగే చేయగలమా? ఇతరుల్లో ఎన్నో లోపాలు, వ్యక్తిత్వ దుర్లక్షణాలు ఉన్నట్లు చూడటం ఎంతో సులభమే. (మత్తయి 7:1-5) అయితే, మనందరికీ ఉన్న అసమానమైన విశ్వాసపు విలువను గమనించి, దాన్ని అమూల్యంగా ఎంచితే మనమందరం పరస్పరం సహాయం చేసుకోగలం. అలాంటి ప్రోత్సాహంతో విశ్వాసం మరింతగా వర్ధిల్లగలదు.—రోమీయులు 1:11, 12.
దేవుని వాక్యాన్ని సరిగా ఉపయోగించటం
6. హెబ్రీయులు 10:38లోని మాటలను పౌలు ఏ మూలం నుండి ఉల్లేఖించాడు?
6 లేఖనాలను నైపుణ్యంగా ఉపయోగించడం ద్వారా కూడా పౌలు తన తోటి విశ్వాసుల విశ్వాసాన్ని నిర్మించాడు. ఉదాహరణకు ఆయనిలా వ్రాశాడు: “నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.” (హెబ్రీయులు 10:38) పౌలు ఇక్కడ ప్రవక్తయైన హబక్కూకు వ్రాసినదాన్ని ఉల్లేఖిస్తున్నాడు.a బహుశా ఈ మాటలు పౌలు పాఠకులకు బాగా తెలిసే ఉండవచ్చు, ఎందుకంటే హెబ్రీ క్రైస్తవులైన వీరికి ప్రవక్తల గ్రంథాలు సుపరిచితాలే. సా.శ. 61 దరిదాపుల్లో యెరూషలేములోను దాని సమీపంలోను ఉన్న క్రైస్తవుల విశ్వాసాన్ని బలపర్చాలన్న పౌలు లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటే, హబక్కూకు మాదిరిని ఆయన ఎంచుకోవటం తగినదే. ఎందుకని?
7. హబక్కూకు తన ప్రవచనాన్ని ఎప్పుడు నమోదు చేశాడు, అప్పుడు యూదాలో పరిస్థితులెలా ఉన్నాయి?
7 హబక్కూకు తన పుస్తకాన్ని సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం కావటానికి రెండు దశాబ్దాలముందు వ్రాశాడని స్పష్టమౌతుంది. దర్శనంలో, ‘ఉద్రేకముగల క్రూరులగు’ కల్దీయులు (లేక బబులోనీయులు) యూదామీద హఠాత్తుగా పడి యెరూషలేమును నాశనంచేసి అందులోని ప్రజలను, జనములను మ్రింగివేయటాన్ని ఆ ప్రవక్త చూశాడు. (హబక్కూకు 1:5-11) కానీ అలాంటి విపత్తు గురించి శతాబ్దంకంటే ముందే, యెషయా కాలం నుండే ప్రవచించబడింది. హబక్కూకు కాలంలో మంచిరాజైన యోషీయా తర్వాత వచ్చిన యెహోయాకీము కాలంలో యూదాలో దుష్టత్వం మళ్లీ విస్తరించిపోయింది. యెహోవా పేరిట మాట్లాడేవారిని యెహోయాకీము హింసించాడు, కొందరిని చంపించాడు కూడా. (2 దినవృత్తాంతములు 36:5; యిర్మీయా 22:17; 26:20-24) వ్యథచెందిన ప్రవక్తయైన హబక్కూకు ఇలా ఆక్రోశించాడంటే అందులో ఆశ్చర్యంలేదు, “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు?”—హబక్కూకు 1:2.
8. హబక్కూకు మాదిరి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకూ, నేటి క్రైస్తవులకూ ఎందుకు ప్రయోజనకరమైనదిగా నిరూపించబడుతుంది?
8 యెరూషలేము నాశనం ఎంత సమీపంలో ఉన్నది హబక్కూకునకు తెలియదు. అలాగే, యూదా విధానం ఎప్పుడు అంతమౌతుందో మొదటి శతాబ్దపు క్రైస్తవులకూ తెలియదు. ఈ దుష్టవిధానంపైకి యెహోవా తీర్పు వచ్చే ‘ఆ దినము, గడియ’ ఎప్పుడు వస్తుందో మనకూ ఈనాడు తెలీదు. (మత్తయి 24:36) అయితే హబక్కూకునకు యెహోవా ఇచ్చిన రెండువిధాలైన సమాధానాన్ని మనం గమనిద్దాము. మొదటిగా, అంతం సరైన సమయానికే వస్తుందని ప్రవక్తకు అభయాన్నిచ్చాడు. మానవ దృష్టికి ఆలస్యమని అనిపించినప్పటికీ అది “జాగుచేయక వచ్చును” అని దేవుడు చెప్పాడు. (హబక్కూకు 2:3) రెండవదిగా, “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును” అని యెహోవా హబక్కూకునకు జ్ఞాపకం చేశాడు. (హబక్కూకు 2:4) ఎంత చక్కని సరళమైన సత్యాలు! అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అంతం ఎప్పుడు వస్తుందన్నది కాదు గానీ మనం విశ్వాససహితమైన జీవితాన్ని గడుపుతూ కొనసాగుతామా లేదా అన్నదే.
9. విధేయులైన యెహోవా సేవకులు తమ విశ్వాసం మూలంగా (ఎ) సా.శ.పూ. 607లోనూ, (బి) సా.శ. 66 తర్వాతనూ, ఎలా బ్రదికారు? (సి) మనం మన విశ్వాసాన్ని బలపరచుకోవటం ఎందుకు ప్రాముఖ్యమైనది?
9 సా.శ.పూ. 607లో యెరూషలేము దోచుకోబడినప్పుడు, యిర్మీయా, ఆయన కార్యదర్శి బారూకు, ఎబెద్మెలెకు, యథార్థవర్తనులైన రేకాబీయులు యెహోవా హబక్కూకునకు చేసిన వాగ్దానంలోని సత్యాన్ని చూశారు. భయంకరమైన యెరూషలేము నాశనంనుంచి వారు తప్పించుకోవడం ద్వారా ‘బ్రదికి ఉన్నారు.’ ఎందుకు? యెహోవా వారి విశ్వాసానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. (యిర్మీయా 35:1-19; 39:15-18; 43:4-7; 45:1-5) అలాగే, మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులు కూడా పౌలు ఇచ్చిన సలహాకు చక్కగానే ప్రతిస్పందించి ఉంటారు, ఇలా ఎందుకు చెప్పగలమంటే, సా.శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేమును ముట్టడించి, వివరించశక్యంకాని కారణంతో వెనక్కి వెళ్లిపోయినప్పుడు, పారిపొమ్మని యేసు ఇచ్చిన హెచ్చరికను విశ్వాసులైన ఆ క్రైస్తవులు లక్ష్యపెట్టారు. (లూకా 21:20, 21) వారు తమ విశ్వాస్యత మూలంగా బ్రదికారు. అదే విధంగా, అంతం వచ్చినప్పుడు మనం విశ్వాసం గలవారిగా నిరూపించబడితే మనమూ బ్రదుకుతాము. ఇప్పుడు మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి అది ఎంత ప్రాముఖ్యమైన కారణమో కదా!
విశ్వాస మాదిరులను కళ్లకు కట్టినట్లు వర్ణించడం
10. మోషే విశ్వాసాన్ని పౌలు ఎలా వర్ణించాడు, ఈ విషయంలో మోషేను మనం ఎలా అనుకరించవచ్చు?
10 పౌలు శక్తివంతమైన మాదిరులను ఉపయోగించడం ద్వారా కూడా విశ్వాసాన్ని నిర్మించాడు. మీరు హెబ్రీయులు 11వ అధ్యాయాన్ని చదువుతుండగా పౌలు బైబిలు పాత్రల ఉదాహరణలను ఎలా కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నాడో గమనించండి. ఉదాహరణకు మోషే “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 11:27) మరోమాటలో, మోషేకు యెహోవా ఎంత వాస్తవమైనవాడిగా ఉన్నాడంటే, ఆయన అదృశ్యమైన దేవుణ్ని చూడగల్గుతున్నట్లు భావించాడు. మన గురించి కూడా అలాగే చెప్పవచ్చా? యెహోవాతో సంబంధాన్ని గురించి మాట్లాడటం తేలికే, కానీ దాన్ని ఏర్పరచుకుని బలపర్చుకోవటానికి ఎంతో కృషి అవసరం. అది మనం చేయవలసిన కృషి! అల్పమైనవిగా అనిపించే వాటితో సహా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం యెహోవాను పరిగణలోకి తీసుకునేటంతగా ఆయన మనకు వాస్తవమై ఉన్నాడా? అలాంటి విశ్వాసం అత్యంత క్లిష్టమైన వ్యతిరేకతను కూడా మనం సహించుకునేలా సహాయం చేస్తుంది.
11, 12. (ఎ) ఎలాంటి పరిస్థితుల క్రింద హనోకు విశ్వాసం పరీక్షించబడి ఉండవచ్చు? (బి) ఎలాంటి ప్రోత్సాహకరమైన ప్రతిఫలాన్ని హనోకు పొందాడు?
11 హనోకు విశ్వాసాన్ని కూడా చూడండి. ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకతను ఊహించటం మనకు కష్టమే. హనోకు అప్పట్లో జీవిస్తున్న దుష్ట ప్రజలకు గుచ్చుకున్నట్లుండే తీర్పు సందేశాన్ని ప్రకటించవలసి ఉంది. (యూదా 14, 15) ఈ విశ్వాసంగల వ్యక్తి పైకి వచ్చిన హింస ఎంత హానికరమైనదీ, ఎంత దౌర్జన్యపూరితమైనదీ అంటే, ఆయన శత్రువులు ఆయనను పట్టుకునే లోపలే యెహోవా ఆయనను సజీవ స్థితి నుండి మరణ నిద్రావస్థలోకి ‘కొనిపోయాడు.’ కాబట్టి హనోకు తాను ప్రకటించిన ప్రవచన నెరవేర్పును చూడలేక పోయాడు. అయితే, కొన్ని విధాలుగా చూస్తే ఆయన మరి శ్రేష్ఠమైన ఒక బహుమానాన్ని అందుకున్నాడు.—హెబ్రీయులు 11:5; ఆదికాండము 5:22-24.
12 పౌలు ఇలా వివరిస్తున్నాడు: “[హనోకు] కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను.” (హెబ్రీయులు 11:5) ఏమిటి దీని భావం? హనోకు తాను మరణమనే నిద్రకు వెళ్లక ముందు, త్వరలో ఒకరోజు తాను తిరిగి లేవబోయే భూ పరదైసును గురించిన ఒక దర్శనాన్ని బహుశ చూసి ఉంటాడు. ఏదేమైనా, తాను హనోకు విశ్వాసాన్ని బట్టి ఎంతో సంతృప్తి చెందానని యెహోవా ఆయనకు తెలియజేశాడు. హనోకు యెహోవా హృదయాన్ని ఆనందపర్చాడు. (పోల్చండి సామెతలు 27:11.) హనోకు జీవితాన్ని గూర్చి ఆలోచించటం స్పందింపజేసేదిగా లేదూ? అలాంటి విశ్వాససహితమైన జీవితాన్ని జీవించటానికి మీరు ఇష్టపడతారా? అయితే అలాంటి మాదిరులను తలపోయండి; వాళ్లు నిజమైన వ్యక్తులన్నట్లు దృష్టించండి. ప్రతిదినమూ విశ్వాసంతో జీవించేందుకు నిశ్చయించుకోండి. జ్ఞాపకముంచుకోండి, విశ్వాసం ఉన్నవారు, దేవుడు తన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చే ఒక తారీఖునో లేక ఒక పరిమిత కాలాన్నో మనస్సులో పెట్టుకుని యెహోవా సేవచేయరు. బదులుగా, మనం నిరంతరం యెహోవా సేవచేయటానికి తీర్మానించుకున్నాము! అలా చేయటమే ఈ విధానంలోనూ, తరువాతి విధానంలోనూ ఎంతో ఉత్తమమైన జీవితమార్గము.
విశ్వాసంలో బలంగా ఎదగటం ఎలా?
13, 14. (ఎ) హెబ్రీయులు 10:24, 25లో నమోదు చేయబడిన పౌలు మాటలు మన కూటాలను ఆనందకరమైన సందర్భాలుగా చేసుకోవడానికి మనకెలా సహాయం చేస్తాయి? (బి) క్రైస్తవ కూటాల ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటి?
13 హెబ్రీ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బలపరచుకోగల అనేక ఆచరణాత్మక మార్గాలను పౌలు వారికి చూపించాడు. మనం అందులో రెండు మాత్రం చూద్దాము. మన క్రైస్తవ కూటాల్లో క్రమంగా కలుసుకోమని ప్రబోధిస్తూ ఆయన ఇచ్చిన హెబ్రీయులు 10:24, 25లోని ఉద్బోధ మనకు బాగా పరిచయం ఉన్నదే. అయితే, అక్కడ పౌలు చెప్పిన ప్రేరేపిత మాటల భావం, అలాంటి కూటాల్లో మనం కేవలం ప్రేక్షకులుగా ఉండటమని కాదని జ్ఞాపకముంచుకోండి. బదులుగా, కూటాలు ఒకరినొకరు తెలుసుకోవటానికి, దేవుని సేవ మరింతగా చేసేలా ఒకరినొకరు పురికొల్పుకోవటానికి, పరస్పరం ప్రోత్సహించుకోవటానికి అవకాశాలని పౌలు వర్ణిస్తున్నాడు. మనం అక్కడ ఉండేది అందివ్వటానికి; కేవలం అందుకోవటానికి మాత్రమే కాదు. అది, మన కూటాలు మనకు మరింత ఆనందకరమైన సందర్భాలుగా మిగిలేలా చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:35.
14 అయితే, ప్రాథమికంగా మనం క్రైస్తవ కూటాలకు హాజరయ్యేది యెహోవా దేవుణ్ని ఆరాధించటానికే. ప్రార్థనలో పాటలో పాల్గొనటం ద్వారా, శ్రద్ధగా వినటం ద్వారా, “జిహ్వాఫలము” అర్పించటం ద్వారా, అంటే కూటాల సమయంలో మన వ్యాఖ్యానాల్లో, కార్యక్రమ భాగాల్లో యెహోవాను స్తుతించటం ద్వారా మనం ఆయనను ఆరాధిస్తాము. (హెబ్రీయులు 13:15) ఆ లక్ష్యాలను మనం మనస్సునందుంచుకుని ప్రతి కూటంలోనూ వాటి ప్రకారం చేస్తే, ప్రతిసారీ మన విశ్వాసం నిశ్చయంగా బలపర్చబడుతుంది.
15. తమ పరిచర్యను గట్టిగా పట్టుకోమని పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎందుకు ఉద్బోధించాడు, నేడు కూడా అదే ఉపదేశం ఎందుకు సముచితమైనది?
15 విశ్వాసం బలపరచుకునే మరో మార్గం సువార్త ప్రకటనా పని. పౌలు ఇలా వ్రాశాడు: “వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.” (హెబ్రీయులు 10:23) ఇతరులు ఏదైనా వదులుకునే ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే దానిని గట్టిగా పట్టుకోమని మీరు వారికి ఉద్బోధిస్తారు. పరిచర్యను విడిచిపెట్టేలా సాతాను ఆ హెబ్రీ క్రైస్తవుల్ని తప్పకుండా ఒత్తిడి చేసే ఉంటాడు, అలాగే ఈనాడూ దేవుని ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అలాంటి ఒత్తిడి ఎదుర్కుంటున్నప్పుడు మనం ఏమి చేయాలి? పౌలు ఏమి చేశాడో చూడండి.
16, 17. (ఎ) పరిచర్య కోసం పౌలు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు? (బి) మన క్రైస్తవ పరిచర్యలోని ఏదైనా అంశంలో మనం భయపడుతున్నట్లు అనిపిస్తే మనం ఏ చర్యలు తీసుకోవాలి?
16 థెస్సలొనీకలోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.” (1 థెస్సలొనీకయులు 2:2) ఫిలిప్పీలో పౌలు ఆయన సహచరులు ఎలా ‘అవమానము పొందారు’? కొందరు పండితులు చెబుతున్నట్లుగా, పౌలు ఉపయోగించిన గ్రీకు పదం అవమానకరంగా, సిగ్గుకరమైన విధంగా, లేక దౌర్జన్యపూరితంగా వ్యవహరించటాన్ని సూచిస్తుంది. ఫిలిప్పీలోని అధికారులు వారిని బెత్తములతో కొట్టి, చెరసాలలో వేసి, బొండలతో బంధించారు. (అపొస్తలుల కార్యములు 16:16-24) ఆ బాధాకరమైన అనుభవం పౌలుపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఆయన మిషనరీ యాత్రలోని తర్వాతి పట్టణమైన థెస్సలొనీకలోని నివాసులు ఆయన భయపడి వెనుక తీసినట్లు చూశారా? లేదు, ఆయన ‘ధైర్యాన్ని తెచ్చుకున్నాడు.’ ఆయన భయాన్ని జయించి ధైర్యంగా ప్రకటించడంలో కొనసాగాడు.
17 పౌలుకు అంత ధైర్యం ఎక్కణ్నుంచి వచ్చింది? తనలో నుండేనా? లేదు, ఆయన “మన దేవునియందు ధైర్యము” తెచ్చుకొంటినని చెప్పాడు. బైబిలు అనువాదకుల కోసమైన ఒక పుస్తకం ఈ వ్యాఖ్యానాన్ని, “దేవుడు మా హృదయాల్లోనుంచి భయాన్ని తీసివేశాడు” అని అనువదించవచ్చునని చెబుతుంది. ప్రత్యేకించి మీ పరిచర్యను గురించి మీరు ధైర్యంగా భావించలేకపోతే, లేక అందులోని ఏదైనా ఒక అంశం మిమ్మల్ని వెనక్కి పట్టివుంచుతుంటే మీకూ అలాగే ధైర్యాన్నివ్వమని యెహోవాను ఎందుకు అడుగకూడదు? మీ హృదయంలోంచి భయాన్ని తీసివేయమని ఆయన్ని అడగండి. ఆ పనిని చేసేలా ధైర్యాన్ని తెచ్చుకోవటానికి సహాయం చేయమని ఆయన్ని అడగండి. అంతేగాక, ఆచరణాత్మకమైన ఇతర చర్యల్ని తీసుకోండి. ఉదాహరణకు, సాక్ష్యమివ్వటంలోని మీకు కష్టంగావున్న అంశంలో సిద్ధహస్తులైన ఒకరితో పనిచేయటానికి ఏర్పాటు చేసుకోండి. అందులో వ్యాపార ప్రాంతాలు, వీధి సాక్ష్యం, అనియత సాక్ష్యం, లేక టెలిఫోన్ సాక్ష్యం ఉండవచ్చు. బహుశ మొదట్లో, మీ ప్రక్కన ఉండేవారు ముందు మాట్లాడటానికి ఇష్టపడవచ్చు. అలా మీరు గమనించి నేర్చుకోండి. అయితే అలాగే మీరూ ప్రయత్నించి చూసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి.
18. మనం మన పరిచర్యలో ధైర్యం తెచ్చుకున్నట్లైతే ఎలాంటి ఆశీర్వాదాలను పొందవచ్చు?
18 మీరు ధైర్యాన్ని కూడగట్టుకుంటే ఫలితం ఏమై ఉంటుందో ఆలోచించండి. మీరు నిరుత్సాహపడకుండా పట్టుదలగా ఉంటే, సత్యాన్ని పంచుకోవటంలో బహుశ మీరు మంచి అనుభవాల్ని, వేరే విధంగా అయితే మీరు కోల్పోయి ఉండే అనుభవాల్ని మీరు పొందవచ్చు. (25వ పేజీ చూడండి.) మీకు కష్టమైనది చేయడం ద్వారా మీరు యెహోవాను ప్రీతిపర్చారన్న సంతృప్తి మీకు ఉంటుంది. మీరు మీ భయాలను పోగొట్టుకోవడంలో ఆయన ఆశీర్వాదాన్నీ, సహాయాన్నీ అనుభవిస్తారు. మీ విశ్వాసం బలపడుతుంది. నిజంగా, మీరు మీ సొంత విశ్వాసాన్ని నిర్మించుకోవడం మానేసి, ఇతరుల విశ్వాసాన్ని నిర్మించలేరు.—యూదా 20, 21.
19. ‘విశ్వాసము కలిగినవారికి’ ఏ అమూల్యమైన ప్రతిఫలం వేచివుంది?
19 మీరు మీ విశ్వాసాన్ని, మీ చుట్టూ ఉన్న వారి విశ్వాసాన్ని బలపరచుకుంటూ ఉందురు గాక. దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించటం ద్వారా, బైబిలులోని విశ్వాసపు మాదిరులను అధ్యయనం చేసి వాటిని సజీవమైనవిగా దృష్టించడం ద్వారా, క్రైస్తవ కూటాలకు సిద్ధమై వాటిలో భాగం వహించటం ద్వారా, అమూల్యమైన ఆధిక్యతయైన బహిరంగ పరిచర్యలో ఆసక్తితో పాల్గొనటం ద్వారా మిమ్మల్ని మీరూ, అలాగే మీ తోటివారినీ నిర్మించటం ద్వారా మీరలా చేయగలరు. మీరు వీటిని చేస్తుండగా, నిజంగా మీరు కూడా అలాంటి ‘విశ్వాసము కలిగిన వారిలో’ ఒకరనే నిశ్చయత కల్గివుండండి. జ్ఞాపకముంచుకోండి, ఇలాంటి వారు అమూల్యమైన ప్రతిఫలాన్ని పొందుతారు. వారు ‘ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారు.’b మీ విశ్వాసం అంతకంతకూ ఎదుగుతుండాలి, యెహోవా దేవుడు మిమ్మల్ని నిరంతరమూ సజీవంగా రక్షించుగాక!
[అధస్సూచీలు]
a పౌలు ఉల్లేఖిస్తున్న సెప్టాజింట్‌లోని హబక్కూకు 2:4 ఇలా చెబుతుంది, “ఎవరైనా వెనుకతీసిన యెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు.” ఈ వ్యాఖ్యానం ఇప్పుడు ఉనికిలో ఉన్న ఏ ఇతర హెబ్రీ వ్రాతప్రతిలోనూ కనిపించదు. ప్రస్తుతం ఉనికిలో లేని తొలి హెబ్రీ వ్రాతప్రతుల ఆధారంగా సెప్టాజింట్ అనువాదం జరిగిందని కొందరు సూచించారు. ఏదేమైనప్పటికీ, పౌలు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే దాన్ని ఇక్కడ పొందుపర్చాడు. కాబట్టి దానికి దైవిక ఆమోదం ఉంది.
b “మనం . . . వెనుకతీయువారము కాముగాని . . . విశ్వాసము కలిగినవారమైయున్నాము” అనేది యెహోవాసాక్షుల 2000వ సంవత్సరపు వార్షిక వచనమై ఉంటుంది.—హెబ్రీ. 10:39.
మీరెలా సమాధానమిస్తారు?
◻ హెబ్రీ క్రైస్తవులపై తనకున్న నమ్మకాన్ని పౌలు ఎలా వ్యక్తం చేశాడు, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు?
◻ పౌలు హబక్కూకు ప్రవక్తను ప్రస్తావించటం ఎందుకని తగినది?
◻ ఏ లేఖనాధార విశ్వాసపు మాదిరులను పౌలు కళ్లకు కట్టినట్లు వర్ణించాడు?
◻ విశ్వాసాన్ని బలపర్చే ఏ ఆచరణాత్మక మార్గాలను పౌలు సిఫారసు చేస్తున్నాడు?
[23వ పేజీలోని చిత్రం]
ఫిలిప్పీలో బాధాకరమైన అనుభవం తర్వాత ప్రకటనా పనిలో కొనసాగేందుకు పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు
[24వ పేజీలోని చిత్రాలు]
వేర్వేరు విధాల్లో సాక్ష్యం ఇవ్వటానికి ప్రయత్నించేందుకు మీరు ధైర్యం తెచ్చుకోగలరా?