అలయక యెహోవా కొరకు సాక్ష్యమియ్యుడి
“మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.”—హెబ్రీయులు 12:3.
1, 2. తాను పునరుత్థానుడయ్యెననుటకు యేసు తన శిష్యులకు ఎలాంటి అంగీకారమగు రుజువునిచ్చెను?
“నేను ప్రభువును చూచితిని!” బహు ఆశ్చర్యకరమగు ఆ మాటలతో మగ్దలేనే మరియ యేసు పునరుత్ధానమును గూర్చిన వార్తను వెల్లడి చేసినది. (యోహాను 20:18) ఇది క్రితము ఆయన మరణముతో చింతాక్రాంతులై యున్న క్రీస్తు శిష్యులకు పూర్తిగా ఆశ్చర్యకర సంఘటనలతో నిండియుండు 40 దినముల ప్రారంభమును గుర్తింపజేసినది.
2 తాను నిజముగా సజీవుడనైయున్నానను విషయములలో తన శిష్యుల మనస్సులలో ఏ సందేహము లేకుండా చేయవలెనని యేసు ఇచ్ఛయించెను. అలా లూకా వివరించినట్లు: “ఆయన శ్రమపడిన తర్వాత నలుబది దినముల వరకు వారికగపడుచు, దేవుని రాజ్య విషయములును గూర్చి బోధించుచు, (యేసు) అనేక రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను.” (అపొ. కార్యములు 1:3) వాస్తవానికి, ఒకానొక సందర్భరమందు ఆయన “ఐదువందల మందికంటే ఎక్కువైన సహోదరులకు కనబడెను.” (1 కొరిం. 15:6) నిశ్చయముగా, అప్పుడు ఇక ఏ సందేహమునకు తావు లేకుండెను. యేసు సజీవుడైయుండెను!
3. రాజ్యమును గూర్చిన ఏ ప్రశ్నను శిష్యులు ఆయనను అడిగిరి, మరియు ఆయన జవాబు వారినెందుకు ఆశ్చర్యపరచెను?
3 యేసు శిష్యులు అప్పట్లో ఇశ్రాయేలీయులకొరకు భూసంబంధ “దేవుని రాజ్యమును” స్థాపించబడుటను గూర్చి మాత్రమే తలంచిరి. (లూకా 19:11; 24:21) కాగా వారు యేసును ఇలా ప్రశ్నించిరి: “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా?” దానికి ఆయనిచ్చిన జవాబు వారినాశ్చర్య పరచినదనుటలో సందేహములేదు. ఏలయనగా ఆయనిట్లనెను. “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచు కొనియున్నాడు; వాటిని తెలుసుకొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొ. కార్యములు 1:6-8) ఇప్పుడు శిష్యుల ఎదుట ఎంతటి సవాలుంచబడినది! ఎంత బాధ్యత! అంతటి ఘనకార్యమును వారెట్లు నెరవేర్చగలరు? దానికి జవాబు త్వరలోనే బహు ఆశ్చర్యకరమైన రీతిలో వచ్చెను.
సవాలును అంగీకరించుట
4. పెంతెకోస్తు దినమున జరిగిన దానిని వివరింపుము.
4 లూకా ఇలా వివరించుచున్నాడు: “పెంతెకోస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడి యుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశమునుండి ఆకస్మాత్తుగా, వారు కూర్చుండి యున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలలో మాట్లాడసాగిరి.” ఆ శబ్దము ఎంత గొప్పగా యుండెనంటే, పండుగకు యెరూషలేమునకు వచ్చియున్న అనేకమంది యూదులు ఆ శబ్దము వినికూడి వచ్చిరి. “తమ స్వంత భాషయందు దేవుని గొప్పకార్యములు” వినుటకు విభ్రాంతినొందిన వారైరి.—అపొ. కార్యములు 2:2-11.
5. త్వరలోనే ఎంతవరకు అపొ. కార్యములు 1:8 నందలి యేసు వాక్కు నెరవేరినది?
5 పేతురు ఇక తడవు చేయక, “నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా యుంచువరకు, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని” దావీదు ముందుగనే చెప్పిన “ప్రభువు” వారు వ్రేలాడదీసిన “నజరేయుడగు యేసు” అనుటలో సందేహమేమి లేదని నిరూపించు ఒక శక్తివంతమైన ప్రసంగమునిచ్చెను. హృదయమందు నొచ్చుకొనిన పేతురు శ్రోతలు: “సహోదరులారా, మేమేమి చేతుమని?” ప్రశ్నించిరి. దానికి పేతురు: “మీరు మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని” వారిని బలవంత పెట్టెను. ఫలితంగా, మూడువేల మంది బాప్తిస్మము పొందిరి! (అపొ. కార్యములు 2:14-41) అప్పటికే యెరూషలేము నందు సాక్ష్యమివ్వబడుచుండెను. ఆ పిమ్మట యూదయ సమరయలకు చివరకు “భూదిగంతములకు” అది విస్తరించెను. రాజ్య ప్రచార పని విస్తరణ ఎంత వేగముగా యుండెనంటే సా.శ. 60 నాటికి సువార్త “ఆకాశము క్రిందవున్న సమస్త సృష్టికి ప్రకటింపబడెనని” అపొస్తలుడైన పౌలు చెప్పగలిగెను.—కొలస్సీ. 1:23.
రాజ్యవిస్తరణ మరియు హింస
6, 7. (ఎ) మొదటి శతాబ్దములో రాజ్యవిస్తరణ మరియు క్రైస్తవుల హింస ఎట్లు చేయి చేయిగా వెళ్లెను? (బి) యెరూషలేము నందలి క్రైస్తవుల మధ్య ఏ అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైయినది, ఎట్లు ఈ అవసరత తీర్చబడినది?
6 సా.శ. 33 పెంతెకోస్తు తర్వాత ఎక్కువ కాలము కాకముందే యేసు మాటలను ఆయన శిష్యులు గుర్తు తెచ్చుకొను కారణమును కలిగియుండిరి: “దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. (యోహాను 15:20) “దేవుని వాక్యము ప్రభలమై శిష్యుల సంఖ్య యోరూషలేములో బహుగా విస్తరించినప్పుడు” యూదామతనాయకులు ఉగ్రులైరి. అబద్ధ ఆరోపణల మీద శిష్యుడైన స్తెఫను రాళ్లతో కొట్టబడి చంపబడెను. అనేకమంది ఎదురు చూచునట్లు అది ఒక చిహ్నముగా యుండెను. ఏలయనగా “ఆ దినమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశాముల యందు చెదిరిపోయిరి.”—అపొ. కార్యములు 6:7; 7:58-60; 8:1.
7 హింస తాత్కాలికముగా సద్దుమణిగినది. అయితే ఆ పిదప కొద్దికాలమునకే, హేరోదు అగ్రిప్ప I అపొస్తలుడైన యాకోబును చంపెను. పేతురు ఖైదు చేయబడెను గాని దూత ఈయనను విడిపించెను. ఆ పిమ్మట యోరూషలేము నందలి సహోదరుల ఆస్తుల దోచుకోనబడగా వేరే ప్రాంత విశ్వాసులు వారిని ఆదుకొనిరి. (అపొ. కార్యములు 9:31; 12:1-11; 1 కొరిం. 16:1-3) పౌలు యెరూషలేమును దర్శించ వచ్చినప్పుడు మత చాంధసత్యము ఎంతగా వుండేనంటే అనేకులు బిగ్గరగా: “ఇటువంటి వాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి.” (అపొ. కార్యములు 22:22) నిశ్చయముగా, యెరూషలేము యూదయలలో నివసించు క్రైస్తవులు ఎడతెగక నమ్మకముగా రాజ్యసాక్ష్యము నిచ్చుటకు వారికి ఎంతో ప్రోత్సాహము అవసరముండెను. “తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ” “ఆదరణ కర్తగా” పనిచేయునని యేసు తన శిష్యులకు వాగ్దనము చేసియుండెను. (యోహాను 14:26) అయితే అవసరమైన సహాయము లేక ఆదరణ తండ్రి ఇప్పుడు ఎలా దయచేయును? జవాబు! పాక్షికముగా సహాయము అపొ. పౌలు ద్వారా కలిగెను.
హెబ్రీయులకు పౌలు వ్రాసిన పత్రిక
8. (ఎ) హెబ్రీయులకు లేఖ వ్రాసేందుకు పౌలును ప్రేరేపించినదేమిటి? (బి) ఆయన పత్రిక యందలి ఏ ప్రత్యేక అంశముమీద మన శ్రద్ధను కేంద్రీకరించబోవుచున్నాము, ఎందుకు?
8 సా.శ. 61 నాటికి పౌలు రోమునందు ఖైదు చేయబడెను, అయితే యెరూషలేము నందు తన సహోదరులకు కలుగుచున్న విషయములను ఆయన ఎరిగి యుండెను అందువలన యెహోవా ఆత్మ ప్రేరణతో హెబ్రీయులకు ఆయన సమయానుసారమైన లేఖను వ్రాసెను. అది పూర్తిగా తన హెబ్రీ సహోదర సహోదరీల యెడల తనకు గల ప్రేమ, శ్రద్ధతో నిండియుండెను. అప్పుడే వారు ‘వారు యెదుట యుంచబడిన పరుగుపందెమందు ఓపికతో పరుగెత్తి నమ్మకముగా “యెహోవా నా సహాయకుడు నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు?” అని చెప్పగలరు. (హెబ్రీ. 12:1;13:6, NW) ఇప్పుడు, హెబ్రీయులకు పౌలు వ్రాసిన ఉత్తరమందలి (11-13 అధ్యాయముల) ఈ ప్రత్యేక అంశము మీద మన శ్రద్ధను కేంద్రీకరించ ఇష్టపడుచున్నాము. ఎందుకనగా! నాడు తొలి క్రైస్తవులు ఎదుర్కొనిన పరిస్థితినే నేడు యెహోవా సాక్షులును ఎదుర్కొనుచున్నారు.
9. మొదటి శతాబ్ద క్రైస్తవులు ఎదుర్కొనిన ఏ వివాదాంశమును నేటి క్రైస్తవులు ఎదుర్కొనుచున్నారు, మరియు ఎట్లు మాత్రమే దానిని ఎదుర్కొనవచ్చును?
9 మన తరములోనే అనేకులు యెహోవాకు తమను సమర్పించుకొని ఆయన సాక్షులుగా బాప్తిస్మము పొందుట ద్వారా రాజ్యవర్తమానమునకు అనుకూలముగా ప్రత్యుత్తరమిచ్చిరి. అయితే సత్యారాధన విస్తరణతోపాటు బహు కౄరమైన హింసయు వచ్చినది. కాగా అనేకమంది క్రైస్తవులు స్తెఫను, యాకోబు ఇంకా అనేకులైన మొదటి శతాబ్దసాక్షులవలెనే ప్రాణత్యాగము చేసిరి. కాబట్టి అటువంటి వివాదంశమే ఇప్పుడునూ కలదు. రాజ్యవర్తమానమునకు పెరుగుచున్న వ్యతిరేకత ఎదుట యథార్ధతా పరీక్షయందు ఎవరు నిలిచియుందురు? అంతేకాకుండా, త్వరలోనే ప్రస్తుత తరము మీదికి దిగి వచ్చుచున్న అసమానమైన “మహాశ్రమల” సమయమున ఆ భయంకర సంఘటనలను ఎవరు ఎదుర్కొన శక్తిమంతులై యున్నారు? (మత్త. 24:21) “మంచి పోరాటమును పోరాడుటకు” సిద్ధమైన వారు, “విశ్వాసమందు స్థిరులైయున్న” వారు అనేది ఆ ప్రశ్నలకు జవాబైయున్నది. వీరే చివరకు ఇలా చెప్పగలవారై యుందురు: “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.”—1 తిమోతి 6:12; 1 పేతురు 5:9; 1 యోహాను 5:4.
నమ్మకమైన మాదిరుల నుండి ప్రయోజనము పొందుట
10. (ఎ) విశ్వాసమనగా ఏమి? (బి) ప్రాచీనకాల విశ్వాస స్త్రీపురుషులను గూర్చి దేవుడెట్లు భావించెను?
10 విశ్వాసమనగా ఏమిటి? దానికి పౌలు ఇలా జవాబిచ్చుచున్నాడు: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. (హెబ్రీ. 11:1,2) విశ్వాసము దాని క్రియను చేయునని చూపించుట ద్వారా పౌలు తన విశ్వాస నిర్వచనమును బలపరచుచున్నాడు. కొంతమంది “ప్రాచీనకాల పురుషులు” అలాగే శారా, రాహాబు వంటి స్త్రీల జీవితములలోని ముఖ్యఘట్టములను ఆయన ప్రస్తావించెను. “వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడని” కనుగొనుట ఎంత ప్రోత్సాహకరము. (హెబ్రీ. 11:16) మన విశ్వాసమును బట్టి దేవుడట్లు చెప్పగలడా? ప్రతిదినము ముగియుచుండగా మననుబట్టి సిగ్గుపడు కారణమును ఆయనకు కలిగించకుందము గాక.
11. “మనలను ఆవరించుకొనియున్న సాక్షిసమూహమేఘము” నుండి మనమీనాడు ఎట్లు ప్రయోజనము పొందగలము?
11 ఈ విశ్వాస స్త్రీ, పురుషుల వృత్తాంతము తర్వాత పౌలు ఇలా చెప్పుచున్నాడు. “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలే మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతిభారమును సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి” . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీ. 12:1) సమాధులలో ఇప్పుడు నిద్రించుచున్నను ఈ మాదిరికర సాక్షులు మన మదిలో సజీవముగా యున్నారా? అవును అని మీరు సమాధానము చెప్పగలనంతగ వారిని వారి అనుభవములను మీరెరిగియున్నారా? ఈ “సాక్షిసమూహమేఘము” యొక్క ఉత్తేజభరిత అనుభవములతో మరలా నింపడుటకు మన జ్ఞానేంద్రియములన్నింటిని ఉపయోగించుచు చేయు క్రమ బైబిలు పఠనము ద్వారా కలుగు అనేక ప్రతి ఫలములలో ఇది ఒకటైయున్నది. నిజముగా వారి నమ్మకమైన మాదిరిని హృదయమునకు తీసుకొనుట ఎలాంటి విశ్వాసలేమినైనను అధికమించుటకు మనకు గొప్పగా సహాయము చేయును. అలా అది మనము ఎలాంటి పరిస్థితులయందైనను సత్యమునకు నిర్భయముగా సాక్ష్యమిచ్చేందుకు మనకు సహాయము చేయును.—రోమా. 15:4.
అలయక యుండుట
12. (ఎ) ‘అలయకుండుటకు ప్రాణములు విసుకక యుండుటకు యేసు మాదిరి మనకెట్లు సహాయము చేయును? (బి) అలయని వారిగాయున్న ఆధునిక-దిన ఉదాహరణలు కొన్ని ఏమైయున్నవి?
12 విశ్వాసమునకు మనకు మహాగొప్ప మాదిరి యేసుయైయున్నాడు. పౌలు ఇలా బలవంతపెట్టుచున్నాడు: “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. . . . మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయుండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.” (హెబ్రీ. 12:1-3) ఎంత “చేరువుగా” యేసు మాదిరిని మీరు తలంచియుంటిరి? ఎంత “మిక్కుటముగా” ఆయనవైపు మీరు చూచుచున్నారు? (1 పేతురు 2:21) మనము అలసి మన ప్రాణములు విసుకవలెనని సాతాను కోరుచున్నాడు. సాక్ష్యపు పనిని మనము ఆపుజేయవలెనని అతడు కోరుచున్నాడు. అతడు దానిని ఎట్లు చేయును? కొన్నిసార్లు మొదటి శతాబ్దములో వలెనే మత మరియు రాజకీయ అధికారములు నుండి ప్రత్యక్ష వ్యతిరేకతను తెచ్చుటద్వారా పోయిన సంవత్సరము దాదాపు 40 దేశములలో రాజ్య ప్రచారపని నిషేధింపబడినది. అయితే అది మన సహోదరులను అలసిపోవునట్లు జేసినదా? వారు నమ్మకముగా చేసిన పని ఫలితముగా ఆ దేశములలో 1988లో 17,000 మంది బాప్తిస్మము తీసుకొనిరి. అంతకంటే ఎక్కువ స్వేచ్ఛగల దేశములలో జీవించు వారందరికి ఇది ఎంత పురికొల్పునదిగా యుండవలెను! రాజ్యసువార్తను ప్రకటించుటలో మనమెన్నటికిని అలయకయుందముగాక!
13. (ఎ) మన ప్రకటించు పనియందు మనము కృంగుటకు కారణమగు కొన్ని మోసకరసంగతులు ఏమైయున్నవి? (బి) ఏ ఆనందము యేసు ఎదుట ఉంచబడెను, మరియు అలాంటి ఆనందదాయక దృక్పధమును మనమెట్లు సంపాదించుకొనగలము?
13 ఏమైనప్పటికిని, మనము కృంగిపోవుటకు కారణమగు ఇతర మోసములు ఎన్నో కలవు. వీటిలో విభాగిత గృహమందలి వ్యతిరేకత, మానసిక కృంగుదల, ఆరోగ్య సమస్యలు, పరిచయస్తుల వత్తిడి, మన ప్రచారపనిలో అనుకూల ఫలితములు లేనందున నిరుత్సాహము, లేక ఈ విధానాంతము ఇంకా రాలేదని బహుశా అసహాన భావన ఇమిడి యున్నవి. సరే! మానసిక, భౌతిక బాధలలో ఓర్చుకొనుటకు యేసుకు సహాయపడినదేమి? అది “తన యెదుట ఉంచబడిన ఆనందమై” యుండెను. (హెబ్రీ. 12:2) తండ్రిని మహిమ పరచుట మూలముగా ఆయన హృదయమును సంతోషపెట్టుట ద్వారా మరియు ఆ తర్వాత మెస్సీయా రాజ్యము యొక్క అద్భుతకరమైన ఆశీర్వాదములను ప్రవేశపెట్టు ధన్యత కొరకు ఎదురు చూచుట ద్వారా యేసు బలపరచబడెను. (కీర్తన 2:6-8; 40:9,10; సామె. 27:11) యేసు యొక్క ఈ ఆనందదాయక దృక్పధమును మరింత మిక్కుటముగా మనమనుసరించగలమా? 1 పేతురు 5:9 నందు గల పేతురు అభయమును గుర్తుంచుకొనుము: “లోకమందున్న మన సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని” తెలుసుకొనుడి. యెహోవా మనలను అర్థము చేసుకొని, అంతర్జాతీయ సహోదరత్వము యెడల అప్యాయతను భావించుచు, రాజ్యపాలన క్రింద మనముందున్న ఆనందములమీద మన దృష్టియుంచుటవలన—ఇదంతయు యెహోవాను విశ్వాసమందు సేవించుటలో అంతయు సమీపముగా యుండగా, ప్రకటించుట యందు మనము అలసిపోకుండుటకు మనకు సహాయము చేయును.
ఎందుకు యెహోవా శిక్షణనిచ్చును
14. మనము ఓర్చుకొనవలసిన పరీక్షలు మరియు బాధల ఫలితంగా ఏ ప్రయోజనములు రావచ్చును?
14 మనమెందుకు పరీక్షలను బాధలను ఓర్చుకొనవలెనను కారణముమీద పౌలు ఇప్పుడు వెలుగును ప్రకాశింపజేయుచున్నాడు. వాటిని మనము ఒకరకమైన శిక్షణగా చూడవలెనని ఆయన సలహానిచ్చుచున్నాడు. పౌలు ఇలా తర్కించెను: “నా కుమారుడా, యెహోవా చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుకకుము. యెహోవా తాను ప్రేమించు వానిని శిక్షించును.” (హెబ్రీ. 12:5, 6. NW) యేసు సహితము తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. (హెబ్రీ. 5:8) నిశ్చయముగా మనము కూడా విధేయతను నేర్చుకొనవలెను. శిక్షణ మనను మార్చుటకు అనుమతించుట వలన కలుగు ప్రయోజనకర ప్రభావములను గమనించుము. పౌలు ఇలా చెప్పెను: “దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకర ఫలమిచ్చును.” అది ఎంత ప్రోత్సాహాకరము!—హెబ్రీ. 12:1.
15. మన పాదమును మార్గములను సరాళము చేసుకొనవలెనను పౌలు సలహాను మనమెట్లు అన్వయించుకొనగలము?
15 ఈ విషయ వెలుగునందు మనము “యెహోవాశిక్షను” అంగీకరించినట్లయిన, పౌలు అనుకూల సలహాలను మనము హృదయమునకు తీసుకొందము: “కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. . . . మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.” (హెబ్రీ. 12:12, 13) కొన్నిసార్లు ‘జీవమునకు నడుపు ఇరుకు మార్గము నుండి’ వైదొలగుట చాలా సులభము. (మత్తయి 7:14) అంతియొకలోనున్న అపొస్తలుడైన పేతురు, ఇతరులును ఈ దోషమును ఒకసారి చేసిన వారైరి. ఎందుకు? ఎందుకనగా “వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనలేదు.” (గలతీ. 2:14) ఈనాడు మనము మన మహాగొప్ప ఉపదేశకుడైన యెహోవాదేవుని మాటను ఎడతెగక వినుచుండవలెను.” నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని ద్వారా అందింపబడిన సహాయకములను మనము పూర్తిగా ఉపయోగించవలసిన అవసరత కలదు. ఇది మన పాదములకు ‘మార్గములను సరాళము చేసుకొన నిశ్చయతను’ కలుగజేయును.—మత్తయి 24:45-47; యెషయా 30:20,21.
16. (ఎ) ఒక సంఘములో “విషపూరిత వేరు” ఎట్లు ప్రభలము కావచ్చును? (బి) లైంగిక దుర్నీతిని పవిత్ర సంగతుల యెడల ప్రశంసా కొరతను పౌలు ఎందుకు ముడిపెట్టుచున్నాడు, అలాంటి ప్రమాదములనుండి మనలను మనమెట్లు కాపాడుకొనగలము?
16 తర్వాత పౌలు “మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, విషపూరితమైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమోనని . . . జాగ్రత్తగా చూచుకొనుడని” హెచ్చరించెను. (హెబ్రీ. 12:15) సంఘమందు జరిగింపబడు సంగతులయందు అసంతుష్టతగా, అసంతృప్తిగా, తప్పుపట్టువారిగా తయారగుటను త్వరగా విస్తరించి సంఘమందలి ఇతరుల ఆరోగ్యకర తలంపులను విషపూరితము చేయు “విషపూరిత వేరునకు” పోల్చవచ్చును. సత్యము మన జీవితములోనికి తెచ్చిన అసంఖ్యాకమైన ఆశీర్వాదములను తలంచుట ద్వారా అలాంటి ప్రతికూల తలంపులకు వ్యతిరేకముగా మనము ప్రతిఘటించవచ్చును. (కీర్తన 40:5) లైంగిక దుర్నీతి ఉద్దేశ్యములు లేక ఏశావు వలె పవిత్ర సంగతులయెడల ప్రశంస లేకపోవుట మరియొక అపాయమై యున్నది. (హెబ్రీ. 12:16) ఒకటి మరొకదానిలోనికి సులభముగా నడుపును గనుక పౌలు ఈ రెండు అపాయములను ముడిపెట్టుచున్నాడు. “విశ్వాసమందు స్థిరులై (అపవాదిని) ఎదిరించుడి” అను పేతురు మాటలను అన్వయించినట్లయిన క్రైస్తవుని కూడా అలాంటి స్వార్థకోరికలు జయించలేవు.—1 పేతురు 5:9.
“అదృశ్యమైనవి ఉన్నవి”
17. ఈనాడు క్రైస్తవులు ఎదుర్కోను నాటికి సీనాయి పర్వతము యెదుట జరిగిన భయంకర సంఘటనలకు పోల్చుము.
17 “అదృశ్యమైనవి ఉన్నవనుట”మీద మన విశ్వాసము ఎక్కువగా ఆధారపడియున్నది. (హెబ్రీ 11:1) ఉన్న వీటిలో కొన్నంటిని గూర్చి పౌలు హెబ్రీ. 12:18-27లో మాట్లాడెను. సీనాయి పర్వతము నొద్ద దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడు మోషే: “నేను మిక్కిలి భయపడి వణకుచున్నానని” అన్నప్పుడు జరిగిన భయంకర సంఘటనలను ఆయన వివరించుచున్నాడు. పౌలు ఇంకను ఇట్లనెను: “ఇప్పుడైతే మీర సీయోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును . . . వారి మహోత్సవమునకు . . . మీరు వచ్చియున్నారు. నేను ఇంకోకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును.” ఈ మాటలు ప్రాధమికముగా అభిషక్త క్రైస్తవులకు సంభోదించి మాట్లాడినను, ఇతర గొఱ్రెల వంటి వారగు “గొప్పసమూహాము కూడా ఈ మాటలను హృదయమునకు తీసుకొనవచ్చును. (ప్రక. 7:9) పౌలు ఏమి చెప్పుచున్నాడో దానిని నీవు పూర్తిగా గుణగ్రహించితివా? వేవేల దూతల సభయెదుట మనము నిలిచియున్నాము. యెహోవా ఎదుట కూడా నిలుచునియున్నామనుకోండి. ఆయన కుడివైపున యేసుక్రీస్తున్నాడు. సీనాయి కొండ దగ్గర యుండిన ప్రాచీన హెబ్రీయులకంటే మనము నిజముగా మరింత భయంకరమైన స్థానమందు మరింత గొప్ప బాధ్యత క్రింద యున్నాము. రానైయున్న హర్‌మెగెద్దోను యుద్ధకంపన ప్రస్తుత దుష్ట ఆకాశము భూమి కొట్టుకొనిపోవుటకు కారణమగునని గుర్తుంచుకొనుము. నిశ్చయముగా ఈనాడు దేవుని వాక్యమును వినకుండా దానికి లోబడకుండా “సాకు” చెప్పు సమయము లేదు.
18. హెబ్రీ. 13:5 నందలి సలహా మనకు ఏ పాఠమును దయచేయుచున్నది?
18 నిజముగా మనము మానవ చరిత్రలోకెల్ల అతిభయంకరకాలమందు జీవించుచున్నాము. యెహోవాసాక్షులుగా మనము స్థాపిత దేవుని రాజ్య సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించ పంపబడియున్నాము. దానిని చేయుటకు మనము కదిలింపబడని విశ్వాసము, యెహోవా శిక్షను అంగీకరించుటకు శక్తిమంతులను చేయు విశ్వాసమును, అలసిపోని విశ్వాసమును, కలిగియుండవలయును. అట్టి విశ్వాసము మనకున్నట్లయిన మనము “కృప కలిగి వినయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయు” వారిమధ్య మనముందుము. (హెబ్రీ. 12:28) అవును, మనము అలయక, ఎడతెగక యెహోవా కొరకు సాక్ష్యమిచ్చెదము.
మీరు ఎట్లు ప్రత్యుత్తరమిత్తురు?
◻ హెబ్రీయులకు పౌలు వ్రాసిన పత్రిక మనకెందుకు ప్రయోజనకరమై యున్నది?
◻ ఈనాడు క్రైస్తవులు ఏ వివాదాంశమును ఎదుర్కోనవలెను?
◻ ప్రాచీనకాల నమ్మకమైన సాక్షులనుండి మనమెట్లు ప్రయోజనము పొందగలము?
◻ తాను ప్రేమించు వారిని యెహోవా ఎందుకు శిక్షించును?
◻ అలసిపోకుండా సాక్ష్యమిచ్చేందుకు కీలకమైన విషయమేమైయున్నది?