వాళ్లు మతాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు?
గడచిన 19వ శతాబ్దం మధ్యభాగంలో, ప్రష్యా (ఇప్పుడు జర్మనీలోని ఉత్తరభాగం) వాస్తవ్యుడు తాను ఏ మతానికీ చెందనని చెప్పడం ఎన్నడూ కనీ వినీ ఎరుగని విషయం. వాస్తవానికి, సాంప్రదాయిక మతాన్ని వదిలేసి సాంప్రదాయబద్ధంకాని చర్చికి మారడం అతడు పోలీసు నిఘాక్రిందకు వచ్చేలా చేసేది. కానీ కాలం ఎంతగా మారిపోయింది!
నేడు, జర్మనీ వారు రికార్డు సంఖ్యల్లో చర్చీల్లో తమ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి వెళ్లిపోతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తాము ఏ మతానికీ చెందమని చెప్పుకుంటున్నట్లు దాఖలాలు ఉన్నాయి. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లలో కూడా అదే విధమైన పోకడ కనిపిస్తోంది. సభ్యత్వం అనేది ఒక మతానికి శరీరంలో ప్రవహించే రక్తం లాంటిదైతే, “యూరప్‌లోని చర్చీలు తీవ్రమైన రక్తస్రావానికి గురౌతున్నాయి” అని జర్మన్ రచయిత రైమర్ గ్రోనెమైర్ అన్నాడు.
వాళ్లెందుకు మతాన్ని నిరాకరిస్తున్నారంటే
అనేకులు సంస్థీకృత మతాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు? తరచూ దానికున్న కారణం డబ్బే, ప్రాముఖ్యంగా సభ్యులు చర్చి పన్ను కట్టవలసి వచ్చే దేశాల్లో పరిస్థితి అలా ఉంది. ‘నేనంత కష్టపడి సంపాదించిన డబ్బును చర్చికి ఎందుకివ్వాలి?’ అని అనేకులు అడుగుతున్నారు. చర్చికి ఇప్పటికే ఉన్న విస్తారమైన ధనాన్నీ, శక్తినీ చూసి కొందరు వికర్షితులౌతున్నారు. చర్చికి ఉన్న ధనం, వస్తుపరమైన విషయాలకు మరీ ఎక్కువ అవధానాన్ని ఇచ్చి, “క్రీస్తులో విశ్వాసం ఉంచడానికి తక్కువ అవధానాన్ని ఇచ్చేలా” చేసి ఉండవచ్చని చెప్పిన జర్మనీలోని కలోన్కు కార్డినల్ అయిన యోయాకిమ్ మైస్నర్తో బహుశా వాళ్లు ఏకీభవించవచ్చు.
కొంతమందికి తమ చర్చి బోరు కొడుతుంటుంది, విసుగు పుట్టిస్తుంటుంది, తమ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చలేనిదిగా అనిపిస్తుంటుంది గనుక వాళ్లు దాన్ని వదిలేస్తున్నారు. వాళ్లు ప్రవక్త ఆమోసు ప్రవచించిన, “అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామము”ను అనుభవిస్తున్నారు. (ఆమోసు 8:11) వాళ్లు తమ మతం నుండి ఎలాంటి పోషణనూ అందుకోవడం లేదు గనుక వాళ్లు దాన్ని వదిలేస్తున్నారు.
వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవమైనవే అయినప్పటికీ, మతాలన్నింటినీ వదిలేయడం సరైన పనేనా? ఒక వ్యక్తికి చాలా ఆకలేస్తోంది, మామిడి పండు కనిపించిందనుకుందాము. ఆయన దాన్ని తినబోతే, అది మైనంతో చేసినదని అర్థమౌతుంది. ఆయన తన ఆకలి తీర్చుకోవాలన్న తలంపునే మనస్సులోనుంచి తీసేస్తాడా? లేదు, ఆయన నిజమైన ఆహారం కోసం వెదుకుతాడు. అదే విధంగా, ఒక మతం తన సభ్యుల ఆధ్యాత్మిక ఆకలిని తీర్చకపోతే, వాళ్లు పూర్తిగా మతాన్నే వదిలేయాలా? లేక వాళ్లు తమ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకునే మార్గాలను వెదికేంత జ్ఞానవంతులై ఉండాలా? ఈ తదుపరి శీర్షిక చూపిస్తున్న విధంగా, అనేకులు అదే చేశారు.