కొందరు తమ మతాన్నెందుకు మార్చుకుంటున్నారంటే
చాలామందికి మతం కేవలమొక లేబులు లాంటిదే. అప్పుడప్పుడు ఆదివారాల్లో ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు, ఎక్కడ సమాధి జరుగుతుంది అనే విషయాలను మాత్రమే ఆ లేబులు తెలుపుతుంది. అయితే ఆయన ఎలాంటివాడు లేక ఆయనకేమి తెలుసు, ఏమి నమ్ముతాడు అనే వాటి గురించి మాత్రం అది ఏమీ చెప్పదు. ఉదాహరణకు, నామకార్థ క్రైస్తవుల్లో 50 శాతం మంది ప్రజలకు కొండమీది ప్రసంగం ఎవరిచ్చారో తెలియదనే విషయం ఒక సర్వే ద్వారా వెల్లడైంది. కానీ ఇది తెలుసా, ప్రఖ్యాత భారతీయ నాయకుడైన మోహన్‌దాస్ గాంధీకి అంటే ఒక హిందువుకు మాత్రం ఆ ప్రశ్నకు జవాబు తెలుసు!
అంత మంది ప్రజలకు తమ మతాన్ని గురించి అంత తక్కువ తెలుసు, మరలాంటప్పుడు తమ మతంపైనుండి వారి విశ్వాసం వైదొలగిపోవడం ఆశ్చర్యకరమైన విషయమా? కాదే. అయితే, అలా కానవసరంలేదు. బైబిలును గురించి తెలుసుకునేందుకు సహాయాన్ని పొందిన వారు, అది తమకు ఎంత ప్రయోజనాన్ని కలిగించిందో చూసి ఆశ్చర్యపోయారు. బైబిలే ఇలా చెబుతోంది: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.
ఆధ్యాత్మిక ఆకలి తీరని వారు ఏమి చేయాలి? వాళ్లు దేవుణ్ని సేవించాలన్న కోరికను వదులుకోకూడదు! దానికి బదులుగా, వాళ్లు బైబిలును తెరిచి దేవుడు తానే వాళ్ల కోసం ఏమి ఏర్పాటు చేశాడో తెలుసుకోవాలి.
కఠినమైన ప్రశ్నలకు జవాబులు
బెర్నట్కు ఏడేళ్లున్నప్పుడు, తన తల్లి మరణాన్ని కళ్లారా చూశాడు.a ఆయన తన చిన్నతనమంతా, ‘మా అమ్మ ఎక్కడుంది? అమ్మ లేకుండా నేనెందుకు జీవించాల్సి వస్తుంది?’ అని మదనపడుతూనే గడిపాడు. తన యౌవనంలో, బెర్నట్ ఎంతో చురుకైన చర్చి సభ్యుడిగా ఉన్నాడు. లోకంలో ఇన్ని కష్టాలను చూసి, తాను పెద్దవాడినైన తరువాత అభివృద్ధిచెందుతున్న దేశాల్లో సేవ చేయాలని తీర్మానించుకున్నాడు. అయినా, ఆయన్ని అనేక ప్రశ్నలు వేధించాయి, కానీ వాటికి చర్చి సంతృప్తికరమైన సమాధానాలను ఇవ్వలేకపోయింది.
తర్వాత బెర్నట్ తన పాఠశాలలోని ఒక విద్యార్థితో మాట్లాడాడు, ఆయన ఒక యెహోవాసాక్షి. ఆ విద్యార్థి, బెర్నట్ తల్లి స్పృహ లేని స్థితిలో ఉందనీ అంటే మరణమందు నిద్రిస్తూ ఉందని ఆయనకు బైబిలునుండి చూపించాడు. ఈ విషయాన్ని వివరించే అనేక బైబిలు వచనాలను గురించి బెర్నట్ తెలుసుకున్నాడు, వాటిలో ఒకటి ప్రసంగి 9:5, “చచ్చినవారు ఏమియు ఎరుగరు.” కాబట్టి తన తల్లి ఏదో పర్గేటరీలోనో లేక అంతకంటే ఘోరమైన స్థలంలో ఎక్కడో ఉందని బెర్నట్ చింతించవలసిన అవసరమేమీ లేదు. అమర్త్యమైన ఆత్మను గురించిన సిద్ధాంతం అనేక మతాల్లో బోధించబడుతున్నప్పటికీ, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ మరణాన్ని తప్పించుకుని బయటికి వచ్చే అమర్త్యమైన భాగమేదీ ఉండదని బెర్నట్ బైబిలునుండి తెలుసుకున్నాడు.
మృతులకుగల అద్భుతమైన ఉత్తరాపేక్షను గురించి కూడా బెర్నట్ తెలుసుకున్నాడు. బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములలో ఆయన ఇలా చదివాడు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].” (అపొస్తలుల కార్యములు 24:14) ఈ పునరుత్థానం, దేవుడు పరదైసుగా పునరుద్ధరించబోయే ఈ భూమిపైనే జరుగుతుందని తెలుసుకుని ఆయనెంతగానో పులకరించిపోయాడు!—కీర్తన 37:29; ప్రకటన 21:3, 4.
త్వరలోనే బెర్నట్కున్న ఆధ్యాత్మిక అవసరతలు యథార్థమైన బైబిలు జ్ఞానం ద్వారా తీరిపోయాయి. బెర్నట్ మతాన్ని విడనాడలేదు. బదులుగా, ఆయన తన ఆకలిని తీర్చలేని చర్చీని వదిలేసి, బైబిలుపై దృఢంగా ఆధారపడిన ఆరాధనా విధానాన్ని స్వీకరించాడు. ఆయనిలా చెబుతున్నాడు: “అది 14 సంవత్సరాల క్రితంనాటి మాట, మరి నేను ఎన్నడూ ఆ చర్య తీసుకున్నందుకు బాధపడలేదు. సృష్టికర్త కష్టాలను కలిగించడని ఇప్పుడు నాకు తెలుసు. ఈ వ్యవస్థకు దేవుడు సాతాను, మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులకు నిందించాల్సింది సాతానునే. అయితే సాతాను లోకం చేసిన సమస్త హానినీ దేవుడు త్వరలో సరి చేస్తాడు. అప్పుడు మా అమ్మ కూడా పునరుత్థానం అవుతుంది. అదెంతటి ఆనందకరమైన సందర్భం!”
ఇతరులకు సహాయం చేసేందుకు విదేశాల్లో పని చేయాలన్న తన లక్ష్యాన్ని కూడా బెర్నట్ చివరకు చేరుకోగలిగాడు. తమ బాధలన్నింటికీ అసలైన పరిష్కారమైన దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకునేందుకు ఇతరులకు సహాయం చేయడంలో ఆయన ఇప్పుడు వేరే దేశంలో పని చేస్తున్నాడు. మానవుల కష్టాలకు దేవుడు త్వరలోనే అంతం తీసుకువస్తాడని, బెర్నట్వలెనే లక్షలాదిమంది ఇతరులు తెలుసుకున్నారు. తమ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చే మతం ఒకటుందని తెలుసుకుని వాళ్లు అత్యానందభరితులౌతున్నారు.—మత్తయి 5:3.
జీవిత సంకల్పం ఏమిటి?
పాశ్చాత్య ప్రపంచం రాను రానూ మరీ లౌకికంగా తయారౌతుండగా, ‘జీవిత సంకల్పం ఏమిటి?’ అని అనేకులు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం బైబిలులో ఉంది, దాన్ని మైఖల్ కనుగొన్నాడు. 1970ల మధ్య కాలంలో మైఖల్ ఉగ్రవాద గుంపులో చేరాలని అనుకున్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ మూలంగా కలిగిన అన్యాయాలకు కారణమని ఆయన భావించిన వారినందరినీ అంతమొందించాలన్నదే ఆయన జీవితంలో ఏకైక లక్ష్యం. “నేను తుపాకీ తీసుకోకుండా ఎన్నడూ ఇంటి బయట కాలు పెట్టలేదు. వీలైనంత ఎక్కువమంది పెద్ద రాజకీయవేత్తలనూ పెట్టుబడి దారులనూ చంపాలన్నదే నా పథకం. అప్పట్లో ఆ సంకల్పం కొరకు నేను నా ప్రాణాన్నైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను” అని ఆయన చెబుతున్నాడు.
మైఖల్ చర్చీకి వెళ్లే వాడు, అయితే జీవితానికున్న వాస్తవమైన సంకల్పాన్ని గురించి ఆయన చర్చి వాళ్ళెవరూ ఆయనకు వివరించలేకపోయారు. కాబట్టి యెహోవాసాక్షులు ఆయన ఇంటికి వచ్చి, ఆయన ప్రశ్నలకు బైబిలులోగల జవాబులను చూపినప్పుడు మైఖల్ జాగ్రత్తగా విన్నాడు. యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరంలో జరిగే ఆరాధనా కూటాలకు ఆయన హాజరవ్వడం ప్రారంభించాడు.
బైబిలులో మైఖల్‌కు క్రొత్తగా కలిగిన ఆసక్తి విషయమై ఆయన స్నేహితులు కుతూహలాన్ని చూపారు. “ఈ ఆదివారం కూటాలకు రండి. కొంత సేపు ఉండి చూడండి. మీరు విన్న విషయాలు మీకు నచ్చకపోతే అప్పుడు ఇంటికి పోదురుగానీ” అంటూ మైఖల్ వాళ్లను పురికొల్పాడు. ఖచ్చితంగా అలాగే జరిగింది. 45 నిమిషాల బైబిలు ఆధారిత ప్రసంగాన్ని విన్న తర్వాత, ఆయన స్నేహితుల్లో చాలామంది హాలులో నుండి వెళ్లిపోయారు. అయితే సూజన్ మాత్రం ఉండి పోయింది. ఈ యౌవన స్త్రీ తాను విన్న విషయాలను బట్టి ఎంతో ఆకర్షితురాలయ్యింది. మైఖల్, సూజన్లు తర్వాత వివాహం చేసుకున్నారు, వారు యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నారు. “మనం భూమిపై ఎందుకున్నామో నాకు ఇప్పుడు తెలుసు” అని మైఖల్ చెబుతున్నాడు. “మనల్ని యెహోవా సృష్టించాడు. ఆయనను గురించి తెలుసుకుని ఆయన చిత్తం చేయాలన్నదే మన జీవితంలోని వాస్తవమైన సంకల్పం. అదే నిజమైన సంతృప్తిని తీసుకువస్తుంది!”
లక్షలాదిమంది మైఖల్ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. వాళ్లు, “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి” అని చెబుతున్న బైబిలునందలి మాటలను మదిలో ఉంచుకుంటారు.—ప్రసంగి 12:13.
జీవిత సమస్యలతో వ్యవహరించడం
మనందరమూ, “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని” చెబుతున్న 2 తిమోతి 3:1 యొక్క నెరవేర్పును అనుభవిస్తున్నాము. ఎవరూ ఈ “అపాయకరమైన కాలముల” వలన కలిగే సమస్యలనుండి తప్పించుకోలేరు. అయితే వాటితో వ్యవహరించేందుకు బైబిలు మనకు సహాయం చేస్తుంది.
స్టీవెన్, ఆలివ్ అనే ఒక వివాహిత జంటను పరిశీలించండి. వాళ్లు యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించినప్పుడు, అనేకమంది ఇతర జంటల వలెనే వాళ్లకు కూడా వైవాహిక సమస్యలు ఉన్నాయి. “మేమిద్దరమూ తూర్పు పడమరల్లా అయ్యే పరిస్థితి ఏర్పడింది. మా లక్ష్యాలూ, ఆసక్తులూ వేర్వేరుగా ఉండేవని” స్టీవ్ వివరిస్తున్నాడు. వాళ్లిద్దరూ కలిసి జీవించడానికి ఏది సహాయం చేసింది? “మేము మా జీవితాల్లో బైబిలు సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో యెహోవాసాక్షులు మాకు చూపించారు. నిస్వార్థంగా ఉండటం, అనురాగం కలిగి ఉండటం అంటే ఏమిటో మేము మొదటిసారి తెలుసుకున్నాము. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం మమ్మల్ని సిమెంటులా దృఢపర్చింది. మేము ఇప్పుడు ఆనందకరమైన, పటిష్ఠమైన వైవాహిక బంధాన్ని కలిగి ఉన్నాము” అని స్టీవెన్ చెబుతున్నాడు.
దేవునితో సన్నిహిత సంబంధం
ఇటీవలి గాలప్ పోల్ ప్రకారం, 96 శాతం మంది అమెరికా వారు దేవునియందు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, మరి వీరిలో అనేకులు ఆయనకు ప్రార్థన చేస్తారు. అయితే, చర్చిలోనూ సినగోగ్లోనూ హాజరు గత యాభై సంవత్సరాల్లో అతి తక్కువగా ఉందని వేరే గాలప్ పోల్ చూపించింది. దాదాపు 58 శాతం మంది అమెరికా వాసులు తాము నెలకు ఒకసారో లేక మూణ్నెల్లకు ఒకసారో చర్చికి వెళ్తామని చెప్పారు. మతం అనేది వాళ్లను దేవునికి దగ్గరగా తీసుకుపోలేదనే విషయం స్పష్టమౌతుంది. ఈ సమస్య అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు.
లిండా బవేరియాలో పెరిగింది. ఆమె మతనిష్టగల క్యాథోలిక్, ఆమె క్రమంగా ప్రార్థన చేసేది. కానీ ఆమెకు భవిష్యత్తు అంటే భయం. మానవుని కొరకు దేవుడు కలిగివున్న సంకల్పాన్ని గురించి ఆమెకు ఏమీ తెలియదు. లిండాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆమె యెహోవాసాక్షులను కలిసింది, ఆమె ఇలా చెబుతుంది: “వాళ్లు చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి, కాబట్టి నేను రెండు బైబిలు పఠన సహాయకాలు తీసుకుని వాటిని వెంటనే చదివేశాను.” రెండు సంవత్సరాల తర్వాత, లిండా యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించింది. “దేవుణ్ని గురించి బైబిలు నుండి నేను తెలుసుకున్న విషయాలన్నీ నాకు అర్థవంతంగా అనిపించాయని” ఆమె చెబుతోంది. లిండా తన చర్చి సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి తనకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సాక్షిగా బాప్తిస్మం తీసుకుంది.
లిండా తన మతాన్ని మార్చుకునేందుకు ఆమెను ఏది కదిలించింది? ఆమె ఇలా వివరిస్తుంది: “ఒక దేవుడు ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు నా చర్చి నాకు సహాయం చేసింది, మరి నేను ఆయనలో విశ్వసించడాన్ని నేర్చుకున్నాను. అయితే ఆయన నాకు ఎంతో దూరంగానూ ఎంతో అపరిచయస్థుడిగానూ ఉన్నాడు. అయితే నేను బైబిలు చదవడం దేవునిలో నా విశ్వాసాన్ని ధృడపర్చడమే కాకుండా, నేను ఆయనను తెలుసుకుని ఆయనను ప్రేమించేందుకు నాకు సహాయం చేసింది. నాకు ఇప్పుడు దేవునితో ఎంతో ప్రశస్తమైన వ్యక్తిగత సంబంధం ఉంది, అది మిగతా దేనికన్నా నాకు అమూల్యమైనది.”
నిజమైన మతం శ్రేష్ఠమైనది
మీ మతం మీకు ఆధ్యాత్మిక నడిపింపునిచ్చి, మీ జీవిత సమస్యలను పరిష్కరించుకునేందుకు బైబిలు మీకు ఎలా సహాయం చేయగలదో చూపిస్తుందా? భవిష్యత్తు విషయమై బైబిలిస్తున్న నిరీక్షణను అది మీకు బోధిస్తుందా? ఖచ్చితమైన బైబిలు జ్ఞానం ఆధారంగా సృష్టికర్తతో ఒక వ్యక్తిగత, సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేందుకు అది మీకు తోడ్పడుతుందా? ఒకవేళ అది అలా చేయకపోతే, మీరు నిరాశ చెందకండి. పూర్తిగా మతాన్నే వదిలేసే బదులు, బైబిలుపై పూర్తిగా ఆధారపడిన ఆరాధనావిధానం కొరకు వెదకండి. అప్పుడు మీరు బైబిలు పుస్తకమైన యెషయాలో ప్రవచించబడిన ప్రజలవలె ఉంటారు: “ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు . . . నా సేవకులు పానము చేసెదరు . . . నా సేవకులు సంతోషించెదరు . . . నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు.”—యెషయా 65:13, 14.
[అధస్సూచి]
a ఈ శీర్షికలోని కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[4, 5వ పేజీలోని చిత్రం]
దేవుణ్ని తెలుసుకుని ఆయనను ప్రేమించేందుకు బైబిలు మనకు సహాయం చేస్తుంది