మన భూగ్రహానికి ఉన్న భవిష్యత్తు ఏమిటి?
“అంతర్గతంగా జరిగే అనాగరిక హింసల విషయంలో, జరిగిన పోరాటాల సంఖ్య విషయంలో, శరణార్థులవ్వవలసి వచ్చిన గుంపుల విషయంలో, యుద్ధాల్లో చంపబడిన కోట్లాదిమంది ప్రజల విషయంలో, రక్షణ కోసం పెట్టే విస్తారమైన ఖర్చుల విషయంలో ఈ 20వ శతాబ్దానికి సాటి రాగల శతాబ్దం మరొకటేదీ లేదు” అని వరల్డ్ మిలటరీ అండ్ సోష్యల్ ఎక్స్పెండీచర్స్ 1996 తెలియజేస్తోంది. ఈ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందా?
అనేక శతాబ్దాల క్రిందట దేవుడు చేసిన ఓ వాగ్దానాన్ని గురించి అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఇలా జ్ఞాపకం చేశాడు: “మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) అలాంటి మాటలు, ప్రాథమికంగా యెషయా ప్రవచనంలో భాగమై ఉన్నాయి. (యెషయా 65:17; 66:22) ప్రాచీనకాల ఇశ్రాయేలు 70 ఏండ్లపాటు బబులోనులో చెరగా ఉన్న తర్వాత తమ వాగ్దాన దేశంలో పునరుద్ధరించబడినప్పుడు వాళ్లు తొలి నెరవేర్పును చూశారు. ‘క్రొత్త ఆకాశములనూ క్రొత్త భూమినీ’ ఇస్తానన్న ఆ వాగ్దానాన్ని మరలా నొక్కి చెప్పడం ద్వారా, పేతురు ఆ ప్రవచనం మరింత విస్తృతమైన పరిధిలో అంటే ప్రపంచవ్యాప్తంగా నెరవేరనైవుందని చూపిస్తున్నాడు!
యావద్భూమిపై నీతియుక్తమైన పరిస్థితుల్ని నెలకొల్పడమనేది దేవుని చిత్తం. క్రీస్తును రాజుగా కల్గివున్న దేవుని పరలోక రాజ్యం ద్వారా ఆ చిత్తం నెరవేరనై ఉంది. “జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:4) పరలోక ప్రార్థన లేక ప్రభువు ప్రార్థన అని సాధారణంగా పిలువబడిన మాదిరి ప్రార్థనలో యేసు “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని చెబుతూ, భూమిపై అలాంటి సంపూర్ణమైన శాంతిభద్రతల్ని గురించి ఎదురుచూడమనీ, ప్రార్థించమనీ తన అనుచరులకు బోధించాడు.—మత్తయి 6:9, 10.
పరలోకమెంత నీతియుక్తంగా ఉంటుందో అంతే నీతియుక్తంగా ఉండే లోకమందు జీవించడంలో మీరు ఆనందిస్తారా? దేవుడ్ని తెలుసుకోవడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించి, ఆయన నీతియుక్తమైన మార్గాల ప్రకారంగా జీవించే ప్రతీ ఒక్కరికీ బైబిలు అందించే నిరీక్షణ అదే.