మీ విశ్వాస నాణ్యత—ఇప్పుడు పరీక్షించబడుతోంది
“నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.”—యాకోబు 1:2, 3.
1. తమ విశ్వాసానికి పరీక్షలు వస్తాయని క్రైస్తవులు ఎందుకు ఎదురు చూడాలి?
నిజ క్రైస్తవులకు హింసను అనుభవించాలనే కోరికేం లేదు, వారు బాధను లేక అవమానాన్ని అనుభవించడం ద్వారా ఎలాంటి ఆనందాన్నీ పొందరు. అయినప్పటికీ, యేసు సహోదరుడైన యాకోబు వ్రాసిన పైనున్న మాటలను వారు మనస్సులో ఉంచుకుంటారు. తన శిష్యులు దేవుని ప్రమాణాలకు హత్తుకుని ఉన్నందున వారికి హింస మరియు ఇతర కష్టాలు వస్తాయని వారు అపేక్షించవచ్చని క్రీస్తు వారికి స్పష్టం చేశాడు. (మత్తయి 10:34; 24:9-13; యోహాను 16:33) అయినప్పటికీ, అలాంటి పరీక్షల ఫలితంగా ఆనందం కలుగవచ్చు. అదెలా?
2. (ఎ) మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలు మనకు ఆనందానికి ఎలా కారణం కాగలవు? (బి) మన విషయంలో ఓర్పు తన పని ఎలా పూర్తి చేయగలదు?
2 మనం శోధనలను లేక పరీక్షలను అనుభవిస్తున్నప్పుడు ఆనందాన్ని కనుగొంటామనేందుకుగల ముఖ్య కారణం, ఇవి మంచి ఫలాలను ఉత్పన్నం చేయగలవన్నదే. యాకోబు చెబుతున్న విధంగా, పరీక్షలనూ లేక కష్టాలను తట్టుకోవడం ‘ఓర్పును పుట్టించును.’ ఆ విలువైన క్రైస్తవ లక్షణాన్ని వృద్ధిపర్చుకోవడం ద్వారా మనం ప్రయోజనం పొందగలం. యాకోబు ఇలా వ్రాశాడు: “మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకోబు 1:4) ఓర్పు చేయవలసిన ఒక పని ఉంది, ఒక “క్రియ.” మనలను సమస్త విషయాల్లో సంపూర్ణులనుగా చేయడమే, మనలను సమతూకమూ పరిపక్వతా గల క్రైస్తవులనుగా చేయడమే దాని నియామకం. కావున, మన శోధనలను త్వరగా అంతం చేసుకునేందుకు లేఖనవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించేందుకు ప్రయత్నించకుండా ఆ శోధనలు పూర్తిగా కొనసాగేందుకు అనుమతించడం ద్వారా మన విశ్వాసం పరీక్షించబడి శుద్ధీకరించబడుతుంది. కొన్ని పరిస్థితులతో లేక తోటి మానవులతో వ్యవహరించే విధానంలో మనలో సహనం, కరుణా, దయా లేక ప్రేమ లోపించి ఉంటే ఓర్పు మనలను మరింత సంపూర్ణులను చేయగలదు. అవును, ఆ వరుస క్రమం ఇదే: పరీక్షలు ఓర్పును ఉత్పన్నం చేస్తాయి; ఓర్పు క్రైస్తవ లక్షణాలను వృద్ధి చేస్తుంది; ఇవి ఆనందానికి కారణాలు.—1 పేతురు 4:14; 2 పేతురు 1:5-8.
3. మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలకూ ఒత్తిడులకూ భయపడి మనం ఎందుకు వెనక్కు తగ్గకూడదు?
3 మన విశ్వాసానికి కలిగే పరీక్షలనుబట్టి మనం ఎందుకు భయపడకూడదూ లేక వెనక్కి తగ్గకూడదనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు కూడా ఉన్నతపర్చాడు. ఆయనిలా వ్రాశాడు: “ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.” (1 పేతురు 1:6, 7) ఈ మాటలు ప్రాముఖ్యంగా ఇప్పుడు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఎందుకంటే, “మహా శ్రమ” కలిగే సమయం అంటే స్తుతి, ఘనత, మహిమ మరియు రక్షణల సమయం కొందరు అనుకునే దానికంటే సమీపంలోనూ మరి మనం విశ్వాసులం అయినప్పటికంటే మరింత సమీపంలోనూ ఉంది.—మత్తయి 24:20, 21; రోమీయులు 13:11, 12.
4. తానూ, ఇతర అభిషిక్త క్రైస్తవులూ అనుభవించిన పరీక్షలను గురించి ఒక సహోదరుడు ఎలా భావించాడు?
4 దీనికి ముందున్న శీర్షికలో, 1914 నుండి అభిషిక్త శేషం అనుభవించిన పరీక్షలను గురించి మనం పరిశీలించాం. అవి ఆనందానికి కారణమయ్యాయా? ఎ. హెచ్. మాక్‌మిలన్ సింహావలోకనం చేసుకుంటూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు: “సంస్థపై ఎంతో తీవ్రమైన శోధనలు అనేకం రావటమూ, అందులోని సభ్యుల విశ్వాసం పరీక్షించబడటమూ నేను చూశాను. దేవుని ఆత్మ సహాయంతో అది నిలిచింది, అది వర్థిల్లడంలో కొనసాగింది. ఒక క్రొత్త ఆలోచన విషయమై చింతించే బదులు లేఖనాలను గురించిన మన అవగాహనను స్పష్టపర్చేందుకు యెహోవాపై ఓర్పుతో వేచివుండటంలోని జ్ఞానయుక్తతను నేను చూశాను. . . . మన ఆలోచనలలో అప్పుడప్పుడు మనం ఎలాంటి మార్పులు చేసుకోవలసి వచ్చినప్పటికీ, అది విమోచన యొక్క దయాపూర్వక ఏర్పాటునూ, నిత్య జీవాన్ని గురించిన దేవుని వాగ్దానాన్నీ మార్చదు. కాబట్టి నెరవేరని నిరీక్షణల లేక మారిన అభిప్రాయాల విషయమై మా విశ్వాసం బలహీనమవ్వడానికి అనుమతించేందుకు ఎలాంటి కారణమూ లేకపోయింది.”—ఆగస్టు 15, 1966 కావలికోట, 504వ పేజీ.
5. (ఎ) శేషం పరీక్షలను ఎదుర్కొనడం మూలంగా ఏ ప్రయోజనాలు కలిగాయి? (బి) పరీక్షించబడటమనే విషయం మనకు ఇప్పుడు ఎందుకు ఆసక్తికరంగా ఉండాలి?
5 1914-19 వరకూ ఉన్న పరీక్షా సమయాన్ని తట్టుకుని నిలబడిన అభిషిక్త క్రైస్తవులు, ఈ లోకపు అణగద్రొక్కే ప్రభావం నుండీ, అనేక బబులోను సంబంధ మతాచారాల నుండీ స్వతంత్రులుగా చేయబడ్డారు. శేషం దేవునికి ఇష్టపూర్వకంగా స్తుతియర్పణలు అర్పిస్తూ, తాము ఒక ప్రజగా ఆయనకు అంగీకారయోగ్యమైన వారిమన్న నిశ్చయతను కలిగిన వారై పరిశుభ్రపర్చబడిన, శుద్ధీకరించబడిన ప్రజలుగా ముందుకుసాగారు. (యెషయా 52:11; 2 కొరింథీయులు 6:14-18) తీర్పు దేవుని గృహంతో ప్రారంభమైంది, అయితే అది ఒక నిర్ధారిత కాల వ్యవధిలో ముగియదు. దేవుని ప్రజలు పరీక్షించబడి, జల్లించబడటం కొనసాగుతుంది. “గొప్పసమూహము”లో భాగంగా రాబోయే “మహాశ్రమలనుండి” తప్పించుకుంటామనే ఉత్తరాపేక్షను కలిగివున్నవారి విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. (ప్రకటన 7:9, 14) అభిషిక్త శేషం ఎదుర్కున్న విధాల్లో అలాగే మరితర విధాల్లో ఇది జరుగుతోంది.
మీరు ఎలా పరీక్షించబడవచ్చు?
6. అనేకులు అనుభవించిన ఒక విధమైన తీవ్ర పరీక్ష ఏమిటి?
6 సూటిగా ఎదురయ్యే దాడుల రూపంలో వచ్చే పరీక్షలకు తట్టుకుని నిలబడటమనే సవాలును గురించి అనేకమంది క్రైస్తవులు ఆలోచించారు. వారు ఈ నివేదికను జ్ఞాపకం చేసుకున్నారు: “[యూదా మత నాయకులు] అపొస్తలులను పిలిపించి కొట్టించి—యేసు నామమునుబట్టి బోధింప కూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయి[రి].” (అపొస్తలుల కార్యములు 5:40, 41) దేవుని ప్రజల ఆధునిక చరిత్ర, ప్రాముఖ్యంగా ప్రపంచ యుద్ధాల సమయంలో వారు ఎదుర్కున్న సంగతులను గురించిన చరిత్ర, వాస్తవానికి యెహోవాసాక్షుల్లో అనేకులు హింసకుల చేతుల్లో దెబ్బలనూ మరి అంతకంటే ఘోరమైన వాటినీ అనుభవించారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
7. విశ్వాసాన్ని ప్రదర్శించడంలో కొందరు ఆధునిక దిన క్రైస్తవులు ఎంత వరకూ పోయారు?
7 క్రైస్తవులు హింసకు గురికావడానికి సంబంధించి, అభిషిక్త శేషానికీ “వేరే గొఱ్ఱెల” గొప్ప సమూహానికీ మధ్య ఈ లోకం ఎలాంటి తేడానూ చూపటం లేదు. (యోహాను 10:16) ఈ సంవత్సరాలన్నింటిలోనూ, దేవుని ఎడల వారికున్న ప్రేమా ఆయనలో వారికున్న విశ్వాసమూ మూలంగా చెరసాలలో వేయబడటం, చివరకు హతసాక్షులవ్వడం కూడా జరిగింది, ఈ రెండు గుంపులకు చెందిన వారూ చాలా తీవ్రంగా పరీక్షించబడ్డారు. ఈ రెండు గుంపులకూ ఎలాంటి నిరీక్షణ ఉన్నప్పటికీ, వీరిరువురికీ దేవుని ఆత్మ అవసరమయ్యింది. (1996 జూన్ 15 కావలికోట 31 పేజీని పోల్చండి.) నాజీ జర్మనీలో 1930లలో 1940లలో, యెహోవాసాక్షుల్లోని పిల్లలతో సహా అనేకులు విశేషమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు, వారిలో అనేకులు తీవ్రంగా పరీక్షించబడ్డారు. ఇటీవలి సమయాల్లో, ఇతియోపియా, ఎరిట్రియా, జైరీ, బురుండీ, మలావీ, మొజాంబిక్, రువాండా, మరియు సింగపూర్ వంటి దేశాల్లో యెహోవా ప్రజలు హింసల మూలంగా పరీక్షలను ఎదుర్కున్నారు. ఈ విధమైన పరీక్షలు కొనసాగుతాయి.
8. మన విశ్వాసం పరీక్షించబడటంలో, దెబ్బల రూపంలో వచ్చే హింసను సహించడం కంటే మరింత ఎక్కువ ఇమిడివుందని ఒక ఆఫ్రికా సహోదరుని వ్యాఖ్యానాలు ఎలా చూపుతున్నాయి?
8 అయితే, ఇది వరకే గమనించిన విధంగా, మన విశ్వాసం మరింత సూక్ష్మమైన విధాల్లో కూడా పరీక్షించబడుతుంది. ఆ పరీక్షల్లో కొన్ని అంత సూటిగానూ సులభంగానూ గుర్తించగలిగే విధంగా ఉండవు. ఈ క్రింది వాటిలో కొన్నింటి ఎడల మీరెలా ప్రతిస్పందిస్తారో పరిశీలించండి. అంగోలాలోని, పది మంది పిల్లలుగల ఒక సహోదరుడు ఏ సంఘంలోనైతే ఉన్నాడో ఆ సంఘానికి కొంత కాలం వరకూ, బాధ్యతగల సహోదరులతో ఎలాంటి సమాచార వినిమయమూ జరగలేదు. తర్వాత ఇతరులు ఆ సంఘాన్ని దర్శించేందుకు వీలు కలిగింది. తన కుటుంబాన్ని ఆయన ఎలా పోషించగలిగాడని ఆయనను అడిగారు. ఆయన దానికి సమాధానం చెప్పడం సులభంగా లేకపోయింది, అయితే తమ పరిస్థితి కష్టంగా ఉందని మాత్రం ఆయన చెప్పగలిగాడు. ఆయన తన పిల్లలకు కనీసం ఒక పూట భోజనమైన ఇవ్వగలిగాడా? ఆయనిలా సమాధానమిస్తున్నాడు: “అది ప్రతిసారీ సాధ్యం కాలేదు. అయితే మాకు ఉన్న వాటితో సర్దుకునేందుకు నేర్చుకున్నాము.” తర్వాత పూర్తి నిశ్చయతతో కూడిన స్వరంతో, ఆయనిలా అన్నాడు: “ఈ అంత్య దినాల్లో మనం అపేక్షించేది అది కాదా?” అటువంటి విశ్వాసం ఈ లోకంలో విశేషంగా ఉంటుంది, అయితే రాజ్య వాగ్దానాలు నెరవేరతాయనే పూర్తి నమ్మకాన్ని కలిగివున్న యథార్థవంతులైన క్రైస్తవులకు మాత్రం అది అసాధారణమైన విషయమేమీ కాదు.
9. మొదటి కొరింథీయులు 11:3 విషయంలో మనం ఎలా పరీక్షించబడుతున్నాం?
9 దైవపరిపాలనా పద్ధతుల విషయంలో కూడా గొప్ప సమూహం పరీక్షించబడుతోంది. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘం దైవిక సూత్రాల, దైవపరిపాలనా ప్రమాణాల ద్వారా నిర్దేశించబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా యేసును నాయకునిగా, సంఘం యొక్క శిరస్సుగా, నియమించబడిన వానిగా గుర్తించడమని దీని అర్థం. (1 కొరింథీయులు 11:3) మనం యెహోవా చిత్తాన్ని ఐక్యంగా చేయడానికి సంబంధించిన దైవపరిపాలనా నియామకాలూ నిర్ణయాల విషయంలో మనం చూపే విశ్వాసం ద్వారా, యేసు ఎడలా ఆయన తండ్రి ఎడలా ఇష్టపూర్వకంగా విధేయత చూపాలని ఉందని మనం ప్రదర్శిస్తాము. అంతే కాకుండా, ప్రతి స్థానిక సంఘంలోనూ, నాయకత్వం వహించేందుకు నియమించబడిన పురుషులు ఉన్నారు. వారు అపరిపూర్ణ మానవులు, మనం వారి తప్పిదాలను స్పష్టంగా గుర్తించగలగవచ్చు; అయినప్పటికీ మనం అటువంటి పైవిచారణకర్తలను గౌరవించి వారికి విధేయులమై ఉండాలని పురికొల్పబడుతున్నాం. (హెబ్రీయులు 13:7, 17) అది కొన్నిసార్లు సవాలుదాయకంగా ఉందని మీరు కనుగొన్నారా? ఇది మీకు వాస్తవంగానే ఒక పరీక్షా? ఒకవేళ నిజమైతే, మీ విశ్వాసం ఈ విధంగా పరీక్షించబడటం నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా?
10. క్షేత్ర సేవ విషయంలో మనం ఏ పరీక్షను ఎదుర్కుంటాము?
10 క్షేత్ర సేవలో క్రమంగా పాల్గొనడమనే ఆధిక్యతా మరియు అవసరత విషయంలో కూడా మనం పరీక్షించబడుతున్నాం. మనం ఈ పరీక్షలో సఫలీకృతులం కావాలంటే, పరిచర్యలో పూర్తిగా భాగం వహించడమంటే కనిష్ఠ లేక నామమాత్రంగా ప్రకటనాపని చేయడం కంటే ఎంతో ఎక్కువే ఇమిడివుందని మనం గుర్తించాలి. తనకున్న దానినంతటినీ ఇచ్చేసిన నిరుపేద విధవరాలిని గురించి యేసు చేసిన అంగీకారపూర్వక వ్యాఖ్యానాలను జ్ఞాపకం చేసుకోండి. (మార్కు 12:41-44) మనలను మనం ఇలా అడుగవచ్చు, ‘నా క్షేత్ర సేవ విషయంలో నేను నన్ను నేను అదే విధంగా సమర్పించుకుంటున్నానా?’ మనందరం కూడా దినమెల్లా యెహోవాసాక్షులమే, మనం మన వెలుగు ప్రకాశింపజేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.—మత్తయి 5:16.
11. అవగాహనలో మార్పులు లేక ప్రవర్తన విషయమై సలహాలు మనకు ఎలా పరీక్షలు కాగలవు?
11 బైబిలు సత్యాలపై ప్రసరింపజేయబడుతున్న అదనపు వెలుగు ఎడలా, నమ్మకమైన దాసుని తరగతి ఇచ్చే సలహా ఎడలా మనకు ఎంత ఎక్కువ మెప్పుదల ఉందనే విషయానికి సంబంధించి మనం మరొక పరీక్షను ఎదుర్కొనవచ్చు. (మత్తయి 24:45) కొన్నిసార్లు ఇందుకు, వ్యక్తిగత ప్రవర్తనలో సవరణలు అవసరం కావచ్చు, ఉదాహరణకు, పొగాకు ఉపయోగించే వారు సంఘంలోనే ఉండాలంటే వారా అలవాటును మానుకోవాలనే విషయం స్పష్టం అయినప్పుడు అలాంటి సవరణలు అవసరమయ్యాయి.a (2 కొరింథీయులు 7:1) లేక సంగీతం లేక కొన్ని విధాలైన వినోదం విషయంలో మన అభిరుచిని సవరించుకోవడం అవసరమన్న విషయాన్ని అంగీకరించడంలో మనం పరీక్షను ఎదుర్కొనవచ్చు.b ఇవ్వబడిన సలహా యొక్క జ్ఞానయుక్తతను మనం ప్రశ్నిస్తామా? లేక దేవుని ఆత్మ మన ఆలోచనావిధానాన్ని మలుస్తూ క్రైస్తవ వ్యక్తిత్వాన్ని ధరించేందుకు మనకు సహాయం చేసేందుకు మనం అనుమతిస్తామా?—ఎఫెసీయులు 4:20-24; 5:3-5.
12. ఒకరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారి విశ్వాసాన్ని దృఢపర్చుకునేందుకు ఏమి అవసరం?
12 దశాబ్దాలుగా, గొప్పసమూహం వారి సంఖ్య పెరుగుతూ ఉంది, వారి బాప్తిస్మం తర్వాత యెహోవాతో తమకుగల సంబంధాన్ని వారు దృఢపర్చుకోవడంలో కొనసాగుతున్నారు. ఇందులో, క్రైస్తవ సమావేశాలకు హాజరవ్వడం, రాజ్య మందిరంలో కొన్ని కూటాలకు రావడం, లేక అప్పుడప్పుడూ క్షేత్ర సేవలో పాల్గొనడం కంటే ఎంతో ఎక్కువే ఇమిడివుంటుంది. ఉదాహరణకు: ఒక వ్యక్తి ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన మహాబబులోను నుండి భౌతికంగా బయట ఉండవచ్చు, అయితే అతడు దాన్ని నిజంగానే వదిలేసి వచ్చాడా? అతడు మహాబబులోను స్ఫూర్తిని అంటే దేవుని నీతియుక్త ప్రమాణాలను గేలిచేసే స్ఫూర్తిని ప్రతిబింబించే విషయాలకు ఇంకా హత్తుకుని ఉంటున్నాడా? అతడు నైతికతనూ, వైవాహిక నమ్మకత్వాన్నీ తక్కువ ప్రాముఖ్యమైన వాటిగా పరిగణిస్తున్నాడా? అతడు ఆధ్యాత్మిక ఆసక్తులకంటే వ్యక్తిగత మరియు వస్తుపర ఆసక్తులపై ఎక్కువ ప్రాధాన్యతను నిలుపుతున్నాడా? నిజంగా అతను ఈ లోకం నుండి ఎలాంటి కల్మషమూ లేకుండా ఉన్నాడా?—యాకోబు 1:27.
పరీక్షించబడిన విశ్వాసం నుండి ప్రయోజనం
13, 14. సత్యారాధనా మార్గంలో నడవడం ప్రారంభించిన తర్వాత కొందరు ఏమి చేశారు?
13 మనం మహాబబులోను నుండి నిజంగానే పారిపోయి, ఈ లోకంనుండి కూడా బయటకు వచ్చేసి ఉంటే, వెనుకనున్న సంగతులను ఇక చూడకుండా ఉందాం. లూకా 9:62 నందు కనుగొనబడే సూత్రానికి అనుగుణ్యంగా, మనలో ఎవరమైనా వెనక్కి తిరిగి చూడటం అంటే దేవుని రాజ్యంలో ఉండేవారిలో ఒకరం కాలేకపోవడమని అర్థం. యేసు ఇలా చెప్పాడు: “నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకా[డు].”
14 అయితే గతంలో క్రైస్తవులు అయిన కొందరు, ఈ ప్రపంచ విధానానికి అనుగుణంగా మారిపోయేందుకు తమను తాము అనుమతించుకున్నారు. వారు ఈ లోకాత్మను ఎదిరించలేదు. (2 పేతురు 2:20-22) ప్రపంచంలోని ధ్యానభంగాలు వారి ఆసక్తినీ సమయాన్నీ హరించివేశాయి, అలా అది వారి అభివృద్ధిని అణచివేసింది. జీవితంలో దేవుని రాజ్యానికీ ఆయన నీతికీ మొదటి స్థానాన్నిచ్చి, వాటిపై తమ మనస్సులనూ హృదయాలనూ కేంద్రీకరించి ఉంచుకునే బదులు, వారు వస్తు సంబంధ గమ్యాలను వెంటాడేందుకు మరలిపోయారు. వారు తమ బలహీనమైన విశ్వాసాన్నీ, తమ నులివెచ్చని స్థితినీ అంగీకరించేందుకు కదిలించబడకపోతే, మరియు దైవిక సలహాను వెదికి తమ మార్గాలను మార్చుకోకపోతే, వారు యెహోవాతోనూ ఆయన సంస్థతోనూ తమకుగల అమూల్యమైన సంబంధాన్ని పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నారు.—ప్రకటన 3:15-19.
15. దేవునికి అంగీకారయుక్తంగా ఉండేందుకు ఏమి అవసరం?
15 మనం అంగీకృతమైన వారిగా కనుగొనబడటం మరియు త్వరలో రాబోతున్న మహాశ్రమలను తప్పించుకుని సజీవంగా మిగిలివుండగలగటం కూడా, మనం శుభ్రంగా ఉండటంపై అంటే మన వస్త్రాలను ‘గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉదుకుకొని’ ఉన్న వారమై ఉండటంపై ఆధారపడివుంది. (ప్రకటన 7:9-14; 1 కొరింథీయులు 6:11) మనం దేవుని ఎదుట పరిశుభ్రమైన, నీతియుక్తమైన స్థానాన్ని కలిగి ఉండకపోతే, మన పవిత్ర ఆరాధన అంగీకారయోగ్యమైనదిగా ఉండదు. పరీక్షించబడిన మన విశ్వాస లక్షణం, మనం సహించేందుకూ, దేవుని అనంగీకారం మనపై రాకుండా నివారించేందుకూ మనకు సహాయం చేస్తుందనే విషయాన్ని మనలో ప్రతి ఒక్కరమూ తప్పకుండా గుర్తించాలి.
16. అబద్ధాలు ఏ విధాల్లో మన విశ్వాసానికి ఒక పరీక్షగా ఉండగలవు?
16 కొన్నిసార్లు, వార్తా మాధ్యమాలూ లౌకిక అధికారులూ మన క్రైస్తవ విశ్వాసాలనూ జీవన విధానాన్నీ తప్పుగా చూపించి, దేవుని ప్రజలపై అబద్ధపు నిందలు వేయడం జరిగింది. ‘మనం లోకసంబంధులం కాము గనుక లోకం మనలను ద్వేషిస్తుందని’ యేసు స్పష్టంగా చూపిస్తున్నాడు గనుక, ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగించకూడదు. (యోహాను 17:14) సాతానుచేత గ్రుడ్డి వారిగా చేయబడిన వారు మనలను భయపెట్టి, మనకు నిరుత్సాహం కలుగజేసి, సువార్త విషయమై మనం సిగ్గుపడేలా చేసేందుకు అనుమతిస్తామా? సత్యాన్ని గురించిన అబద్ధాలు, మనం క్రమంగా కూటాలకు హాజరవ్వడాన్నీ, మన ప్రకటనాపనినీ ప్రభావితం చేసేందుకు మనం అనుమతిస్తామా? లేక మనం దృఢంగా నిలబడి ధైర్యంగా ఉండి, యెహోవాను గురించీ ఆయన రాజ్యాన్ని గురించీ ప్రకటించడంలో కొనసాగేందుకు ఎన్నటికంటే ఇప్పుడు దృఢ తీర్మానాన్ని కలిగి ఉంటామా?
17. విశ్వాసాన్ని కనబరుస్తూ ఉండేందుకు ఏ అభయం మనలను పురికొల్పగలదు?
17 నెరవేరిన బైబిలు ప్రవచనాల ప్రకారం, మనం అంత్య సమయంలో చాలాదూరం వచ్చేశాము. నీతియుక్త నూతన ప్రపంచం కొరకైన మన బైబిలు ఆధారిత అపేక్షలు ఆనందకరమైన వాస్తవాలుగా తప్పకుండా అవుతాయి. ఆ దినం వచ్చేంతవరకూ, మనలో అందరమూ దేవుని వాక్యంలో దృఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడంలో మానక కొనసాగడం ద్వారా మన విశ్వాసాన్ని నిరూపించుకుందాం. ప్రతి వారం బాప్తిస్మం తీసుకుంటున్న వేలాదిమంది క్రొత్త శిష్యులను గురించి ఆలోచించండి. తన తీర్పులను అమలు చేసే విషయంలో యెహోవా చూపుతున్న సహనం ఇంకా అనేకమంది ప్రజల రక్షణకు దారితీయగలదనే విషయాన్ని గుణగ్రహించేందుకు ఇది తగినంత కారణం కాదంటారా? జీవితాలను కాపాడే రాజ్య ప్రకటనాపని కొనసాగేందుకు దేవుడు అనుమతించినందుకు మనం ఆనందభరితంగా లేమా? లక్షలాదిమంది సత్యాన్ని అంగీకరించి, తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారనే విషయాన్నిబట్టి మనం సంతోషించడం లేదా?
18. యెహోవాకు సేవ చేసే విషయంలో మీ తీర్మానం ఏమిటి?
18 మన విశ్వాసం ఇలా ఎంత కాలం పరీక్షించబడుతుందో మనం చెప్పలేం. అయితే ఒక విషయం మాత్రం కచ్చితం: ప్రస్తుత దుష్ట ఆకాశములు, దుష్ట భూమి కొరకు యెహోవా ఒక తీర్పు దినాన్ని కచ్చితంగా నిర్ణయించి ఉంచాడు. ఈ లోగా, మన విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రదర్శించిన పరీక్షించబడిన విశ్వాసమనే మహోన్నత లక్షణాన్ని అనుకరించేందుకు మనం తీర్మానించుకుందాం. మరియు వృద్ధులౌతున్న అభిషిక్త శేషం యొక్క, మన మధ్య ధైర్యంగా సేవ చేస్తున్న వారి యొక్క మాదిరులను మనం అనుకరిద్దాం.
19. ఈ లోకంపై ఏది తప్పకుండా విజయాన్ని సాధించగలదని మీరు నిశ్చయతను కలిగి ఉండగలరు?
19 మనం మధ్యాకాశంలో ఎగురుతున్న దూతతో సహకరిస్తూ, నిత్య సువార్తను ప్రతి జనానికీ, ప్రతి వంశానికీ, ఆయా భాషలు మాట్లాడే వారికీ మరియు ప్రతి ప్రజకు మానక ప్రకటిద్దామని నిశ్చయపర్చుకుందాము. వారు దూత యొక్క ఈ ప్రకటనను వినాలి: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను.” (ప్రకటన 14:6, 7) ఆ దైవిక తీర్పు విధించబడినప్పుడు, పరీక్షించబడిన మన విశ్వాస లక్షణానికి ఏ ఫలితం లభిస్తుంది? అది ప్రస్తుత విధానం నుండి దేవుని నీతియుక్త నూతన ప్రపంచంలోనికి ప్రవేశించడమై—ఒక మహిమకరమైన విజయమై ఉండదంటారా? మన విశ్వాసానికి కలిగే పరీక్షలను సహించడం ద్వారా, అపొస్తలుడైన యోహాను వలె “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే” అని మనం కూడా చెప్పగలుగుతాం.—1 యోహాను 5:4.
[అధస్సూచీలు]
a జూన్ 1, 1973 కావలికోట (ఆంగ్లం) 336-43 పేజీలనూ మరియు జూలై 1, 1973 కావలికోట 409-11 పేజీలనూ చూడండి.
b జూలై 15, 1983 కావలికోట (ఆంగ్లం) 27-31 పేజీలను చూడండి.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
◻ మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలు మనకు ఆనందానికి కారణం కాగలవు, ఎలా?
◻ మన విశ్వాసానికి ఎదురయ్యే ఏ కొన్ని పరీక్షలను మనం సులభంగా గుర్తించలేము?
◻ మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలను విజయవంతంగా అధిగమించడం ద్వారా మనం ఎలా ప్రయోజనాన్ని పొందగలం?
[17వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ సొసైటీ యొక్క అధికారులనూ ఆయననూ అన్యాయంగా జైలులో వేసినప్పటి సమయంలో (ఎడమవైపున ముందర) ఎ. హెచ్. మాక్‌మిలన్
ఆయన, మిచిగాన్‌నందలి డెట్రాయిట్‌లో 1928లో జరిగిన సమావేశానికి హాజరయ్యాడు
తన చివరి సంవత్సరాల్లో కూడా, బ్రదర్ మాక్‌మిలన్ ఇంకా విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు
[18వ పేజీలోని చిత్రం]
ఈ కుటుంబం వలే, ఆఫ్రికా నందలి అనేకమంది క్రైస్తవులు పరీక్షించబడిన విశ్వాస లక్షణాన్ని ప్రదర్శించారు