కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/15 పేజీలు 21-23
  • ఒప్పించడమనే కళతో హృదయాలను చేరడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒప్పించడమనే కళతో హృదయాలను చేరడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిచర్యలో ఒప్పించడమనే కళను ఉపయోగించడం
  • భావోద్వేగాలతో వ్యవహరించడం
  • సువార్తనందించుట—ఒప్పించుటతో
    మన రాజ్య పరిచర్య—1989
  • ఇతరులను ఎలా ఒప్పింపచేయాలి?
    మన రాజ్య పరిచర్య—2001
  • మీ ‘బోధనాకళకు’ అవధానమివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/15 పేజీలు 21-23

ఒప్పించడమనే కళతో హృదయాలను చేరడం

చాలామంది “ఒప్పించడం” అనే పదాన్ని అనుమానంతో చూస్తారు. అది, ఒత్తిడిచేసే సేల్స్‌మాన్‌నో లేక వినియోగదారుడ్ని మోసగించడానికో లోబరచుకోవడానికో రూపొందించబడిన వ్యాపార ప్రకటననో ఒకరి మనస్సులో మెదిలేలా చేయవచ్చు. బైబిల్లో కూడా, ఒప్పించడమనే తలంపు కొన్నిసార్లు ప్రతికూల సూచనలతో, కలుషితం చేయడమనే లేక తప్పుదారి పట్టించడమనే భావాన్ని కల్గివుంది. ఉదాహరణకు, క్రైస్తవ అపొస్తలుడైన పౌలు గలతీయులకిలా వ్రాశాడు: “మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ [“ఒప్పుదల,” NW] మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.” (గలతీయులు 5:7, 8) ఎవరైనా ‘వారిని ఒప్పించే మాటలచేత మోసపరచడానికి’ అనుమతించడం గురించి కూడా పౌలు కొలొస్సయులను హెచ్చరించాడు. (కొలొస్సయులు 2:4) అలా ఒప్పింపజేయడం అబద్ధ పునాదులపై నిర్మించబడిన కుయుక్తితోకూడిన వాదనలపై ఆధారపడి ఉంటుంది.

అయితే, అపొస్తలుడైన పౌలు తాను తిమోతికి వ్రాసిన తన రెండవ పత్రికలో ఒప్పించడమనే తలంపును మరో భావంలో ఉపయోగించాడు. ఆయనిలా వ్రాశాడు: “నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి [“నమ్మేలా ఒప్పించబడినవి,” NW] యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమోతి 3:14) ‘నమ్మేలా ఒప్పించబడడంలో’ తిమోతి, తాను ఎవరినుండైతే లేఖన సత్యాలను నేర్చుకున్నాడో ఆ అమ్మచేత, అవ్వచేత మోసగించబడలేదు.—2 తిమోతి 1:5.a

రోమ్‌లో బందీ గృహములో ఉన్నప్పుడు, పౌలు “ఉదయమునుండి సాయంకాలమువరకు . . . మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.” (అపొస్తలుల కార్యములు 28:23) పౌలు తన ప్రేక్షకులను మోసగిస్తున్నాడా? ఎంతమాత్రం కాదు! కాబట్టి, ఒప్పించడమన్నది ప్రతీసారి తప్పు కాదని స్పష్టమౌతుంది.

అనుకూల భావంలో ఉపయోగించినప్పుడు, “ఒప్పించడం” అని అనువదించబడిన గ్రీకు మూల పదానికి నమ్మించడమనీ, చక్కని సహేతుకమైన తర్కంతో మనస్సులో మార్పును తీసుకురావడమనీ భావం. అలా ఒక బోధకుడు ఇతరులలో బైబిలు సత్యంపట్ల దృఢవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఒప్పించడమనే కళను ఉపయోగిస్తూ, లేఖనాల్ని పునాదిగా చేసుకోగల్గుతాడు. (2 తిమోతి 2:15) వాస్తవానికి, ఇది పౌలు పరిచర్యకు ఒక గుర్తింపు చిహ్నంగా ఉండింది. క్రైస్తవ బోధలు తప్పని పరిగణించిన దేమేత్రి అనే కంసాలి కూడా, “చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పి”యున్నాడని పేర్కొన్నాడు.—అపొస్తలుల కార్యములు 19:26.

పరిచర్యలో ఒప్పించడమనే కళను ఉపయోగించడం

యేసుక్రీస్తు తన అనుచరులకు ఇలా ఉపదేశించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నా[ను].” (మత్తయి 28:19, 20) యెహోవాసాక్షులు 230 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నారు. వారు తమ 1997 సేవా సంవత్సరంలో, ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా సగటున 45,52,589 గృహ బైబిలు పఠనాలు నిర్వహించారు.

గృహబైబిలు పఠనం నిర్వహించే ఆధిక్యత మీకుంటే, ఒప్పించడమనే కళను ఉపయోగించవలసి వచ్చే సవాళ్లను మీరు ఎదురు చూడగలుగుతారు. ఉదాహరణకు, మీ తరువాతి పఠన కార్యక్రమంలో, త్రిత్వం గురించి ఒక ప్రశ్న తలెత్తిందనుకోండి. మీ విద్యార్థి ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాడని మీకు తెలిస్తే, అప్పుడేమిటి? ఆ అంశం గురించి చర్చించే ప్రచురణను మీరు ఆయనకు ఇవ్వవచ్చు. ఆయన దాన్ని చదివిన తర్వాత, దేవుడు మరియు యేసు ఒకరే కాదని ఆయన ఒప్పించబడ్డాడని మీరు గమనించవచ్చు. కాని కొన్ని ప్రశ్నలు మిగిలివుంటే, మీరెలా కొనసాగుతారు?

జాగ్రత్తగా వినండి. ఇవ్వబడిన అంశం గురించి మీ విద్యార్థి ఇప్పటికే ఏమి నమ్ముతున్నాడనేది నిశ్చయించుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, “నేను త్రిత్వాన్ని నమ్ముతున్నాను” అని మీ విద్యార్థి చెబితే, మీరు వెంటనే ఈ సిద్ధాంతం తప్పని నిరూపించడానికి లేఖనాధార చర్చను చేపట్టవచ్చు. అయితే త్రిత్వం గురించి వివిధ నమ్మకాలు ఉన్నాయి. మీరు త్రిత్వ సిద్ధాంతమని నిర్వచించే దాని నుండి పూర్తిగా వేరైనదాన్ని మీ విద్యార్థి నమ్ముతుండవచ్చు. పునర్జన్మ, ఆత్మ అమర్త్యత, రక్షణ వంటి ఇతర నమ్మకాల విషయంలో కూడా ఇది నిజం కావచ్చు. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా వినండి. విద్యార్థి ఏమి నమ్ముతున్నాడనేదాని గురించి ఊహాగానాలు చేయకండి.—సామెతలు 18:13.

ప్రశ్నలు వేయండి. ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు, ‘మీరు ఎప్పుడూ త్రిత్వాన్ని నమ్మేవారా? ఈ అంశం గురించి బైబిలు ఏమి చెబుతుందనే దాని గురించి మీరు ఎప్పుడైనా సమగ్రమైన పఠనం చేశారా? దేవుడు త్రిత్వంలో భాగమైతే, ఆయన వాక్యమైన బైబిలు మనకా విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పదా?’ విద్యార్థికి బోధించడంలో, ఇలాంటి ప్రశ్నలు అడిగేందుకు అప్పుడప్పుడూ ఆగండి: ‘మనమింత వరకూ పరిశీలించినది సహేతుకంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా?’ ‘ఈ వివరణతో మీరు ఏకీభవిస్తారా?’ మీరు ప్రశ్నలను నైపుణ్యవంతంగా ఉపయోగించడం ద్వారా విద్యార్థి నేర్చుకునే ప్రక్రియలో పాల్గొనేలా చేస్తారు. మీరు వివరిస్తున్న అంశాన్ని ఆయన కేవలం వింటూ ఉండిపోకూడదు.

చక్కని తర్కాన్ని ఉపయోగించండి. ఉదాహరణకు, త్రిత్వ సిద్ధాంతాన్ని చర్చించడంలో, మీరు మీ విద్యార్థికిలా చెప్పవచ్చు: ‘యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, “నీవు నా ప్రియకుమారుడవు” అని పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. నిజంగా దేవుడే భూమిపై ఉండి బాప్తిస్మం తీసుకుంటుంటే, ఆయన తన స్వరాన్ని పరలోకానికి పంపించి, భూమిపైనున్న వాళ్లు వినగలిగేలా మళ్లీ దాన్ని వెనక్కి రప్పించి ఉంటాడా? అది తప్పుదోవ పట్టించడం కాదూ? “అబద్ధమాడనేరని” దేవుడు అలాంటి మోసకరమైన పని చేస్తాడా?’—లూకా 3:21, 22; తీతు 1:1, 2.

యుక్తమైన రీతిలో అందజేయబడిన చక్కని తర్కం తరచూ ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఒక స్త్రీ ఉదాహరణను పరిశీలించండి, మనం ఆమెను బార్‌బ్ర అని పిలుద్దాము. యేసు దేవుడనీ, పరిశుద్ధాత్మ కూడా ఇమిడివున్న త్రిత్వంలో ఆయన ఒక భాగమనీ ఆమె తన జీవితమంతా విశ్వసిస్తూనే వచ్చింది. కానీ దేవుడు మరియు యేసు ఇద్దరు వేర్వేరు వ్యక్తులని ఒక యెహోవాసాక్షి ఆమెకు చెప్పి, తన వ్యాఖ్యానాన్ని సమర్థించే లేఖనాలను ఆమెకు చూపించాడు.b బార్‌బ్ర బైబిలును వ్యతిరేకించలేక పోయింది. అదే సమయంలో ఆమె వ్యాకులపడింది. ఆమె త్రిత్వ సిద్ధాంతాన్ని ఎంతో ప్రియంగా ఎంచుతూ వచ్చింది మరి.

సాక్షి బార్‌బ్రతో సహనంతో తర్కించాడు. “ఒకవేళ మీరు నాకు ఇద్దరు వ్యక్తులు సమానమని బోధించాలని ప్రయత్నిస్తున్నట్లయితే, దాన్ని ఉదాహరించడానికి మీరు ఏ కుటుంబ సంబంధాన్ని ఉపయోగిస్తారు?” అని ఆయన అడిగాడు. ఆమె కొద్దిసేపు ఆలోచించి, “ఇద్దరు సహోదరులను ఉపయోగిస్తాను” అని సమాధానమిచ్చింది. సాక్షి ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు, “సరిగ్గా చెప్పారు. బహుశ ఒకేలా ఉండే కవలలను కూడా ఉపయోగించవచ్చు. కాని దేవుడ్ని తండ్రిగా తనను కుమారునిగా దృష్టించమని బోధించడంలో యేసు ఏ సందేశాన్ని అందజేస్తున్నాడు?” బార్‌బ్ర తన కళ్లు వెడల్పు చేసి ఇలా అంది, “నా కర్థమైంది. ఒకరు వయస్సులో పెద్దవాడనీ ఎక్కువ అధికారం గలవాడనీ ఆయన వివరిస్తున్నాడు.”

“అవును, ప్రాముఖ్యంగా ప్రాచీన కాలంలోని సమాజంలో జీవిస్తుండిన యేసు ప్రేక్షకులైన యూదులు అదే ముగింపుకు వచ్చివుంటారు” అని సాక్షి సమాధానమిచ్చాడు. తాను చెబుతున్నదానికి ఒక ముగింపునిస్తూ, సాక్షి ఇలా అన్నాడు: “మనం సమానత్వాన్ని బోధించడానికి అలాంటి తగిన ఉదాహరణను—సహోదరులు లేక ఒకేలా ఉండే కవలలు—వంటి ఉదాహరణను వాడినట్లైతే, గొప్ప బోధకుడైన యేసు కూడా తప్పకుండా అలాగే చేసివుండేవాడు. బదులుగా, ఆయన తనకు దేవునికి మధ్యనున్న సంబంధాన్ని వివరించడానికి, ‘తండ్రి,’ ‘కుమారుడు’ అనే పదాలను ఉపయోగించాడు.”

బార్‌బ్ర చివరికి విషయాన్ని అర్థం చేసుకుని, దాన్ని అంగీకరించింది. అలా ఒప్పించడమనే కళ ద్వారా ఆమె హృదయాన్ని చేరడం జరిగింది.

భావోద్వేగాలతో వ్యవహరించడం

బలంగా పాతుకుపోయిన మత నమ్మకాల్లో తరచూ భావోద్వేగ సంబంధమైన దృక్పథం ఇమిడి ఉంటుంది. భక్తిగల క్యాథలిక్‌ అయిన ఎడ్న విషయాన్ని పరిశీలించండి. దేవుడు మరియు యేసు ఒకే వ్యక్తి కాదనే స్పష్టమైన లేఖనాధార రుజువును యౌవనులైన ఆమె మనుమలు ఆమెకు అందజేశారు. ఎడ్న తాను విన్నది అర్థం చేసుకుంది. ఆయినా, ఆమె దయగానే అయినా స్థిరంగా ఇలా చెప్పింది: “నేను పరిశుద్ధ త్రిత్వాన్ని నమ్ముతాను.”

బహుశ మీకు కూడా అలాంటి అనుభవమే ఎదురై ఉండవచ్చు. అనేకులు తమ మతంలోని సిద్ధాంతాలను అవి తమ ఉనికిలో ఒక భాగమన్నట్లు దృష్టిస్తారు. అలాంటి బైబిలు విద్యార్థులను ఒప్పించడానికి, ఉద్రేకరహితమైన తర్కం లేక ఆ వ్యక్తి యొక్క దృక్కోణం తప్పని నిరూపించే లేఖనాల పరంపర కంటే మరెక్కునే అవసరమౌతుంది. ఒప్పించడమనే కళను వాత్సల్యంతో సమతూకం చేయడం ద్వారా అలాంటి పరిస్థితులతో చక్కగా వ్యవహరించవచ్చు. (పోల్చండి రోమీయులు 12:15, 16; కొలొస్సయులు 3:12.) ప్రభావవంతమైన బోధకుడికి దృఢమైన నమ్మకాలు ఉండాలన్నది నిజమే. ఉదాహరణకు పౌలు, “రూఢిగా నమ్ముచున్నాను,” “ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను, [“ఒప్పించబడ్డాను,” NW]” వంటి పదబంధాలను ఉపయోగించాడు. (రోమీయులు 8:38; 14:14) అయితే, మన దృఢనమ్మకాలను వ్యక్తపర్చడంలో, పిడివాద వైఖరినీ, స్వనీతిగా ధ్వనించే విధానాన్నీ చేపట్టకూడదు, లేక బైబిలు సత్యాలను అందజేయడంలో మనం వ్యంగ్యంగా లేక అవమానపరిచే వారిగా ఉండకూడదు. మనం విద్యార్థిని అభ్యంతరపర్చాలనీ లేక అవమానించాలనీ ఎంతమాత్రం కోరుకోము.—సామెతలు 12:18.

విద్యార్థి నమ్మకాలను గౌరవించడం, వాటిని కల్గివుండడానికి ఆయనకున్న హక్కును గుర్తించడం ఎంతో ప్రభావవంతమైనది. నమ్రతే కీలకం. వినమ్రమనస్సు గల బోధకుడు తాను తన విద్యార్థికంటే స్వతహాగా ఉన్నతుడినని భావించడు. (లూకా 18:9-14; ఫిలిప్పీయులు 2:3, 4) దైవికంగా ఒప్పించడంలో ఇమిడివుండే నమ్రత ఇలా చెప్పేలా చేస్తుంది: ‘ఇది తెలుసుకోవడానికి యెహోవా నాకు దయతో సహాయం చేశాడు. దాన్ని మీతో పంచుకోనివ్వండి.’

పౌలు కొరింథులోని తన తోటి క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి”యున్నాము. (2 కొరింథీయులు 10:4, 5) ఆయనకు అప్రీతికరమైన, బలంగా పాతుకుపోయిన అబద్ధ బోధలను అలాగే లోతుగా నాటుకుపోయిన ఆచారాలను లక్షణాలను పడద్రోయడానికి యెహోవా సాక్షులు నేడు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తున్నారు. (1 కొరింథీయులు 6:9-11) ఇలా చేస్తూ ఉండగా, యెహోవా తమ ఎడల ప్రేమపూర్వక సహనాన్ని చూపించాడని సాక్షులు గుర్తుంచుకుంటారు. ఆయన వాక్యమైన బైబిలును కల్గివుండడానికీ, అబద్ధ బోధలను పెరికివేసేందుకు ఆ శక్తివంతమైన ఉపకరణాన్ని ఉపయోగించడానికీ, ఒప్పించడమనే కళతో హృదయాలను చేరడానికీ వాళ్లెంత సంతోషిస్తున్నారోగదా!

[అధస్సూచీలు]

a “యునీకే మరియు లోయి—మాదిరికరమైన శిక్షకులు,” అనే శీర్షికను ఈ కావలికోట సంచికలోని 7-9 పేజీలలో చూడండి.

b యోహాను 14:28; ఫిలిప్పీయులు 2:5, 6; కొలొస్సయులు 1:13-15 చూడండి. మరింత సమాచారం కొరకు, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? బ్రోషూరును చూడండి.

[23వ పేజీలోని బాక్సు]

మీ విద్యార్థి హృదయాన్ని చేరడం

◻ బైబిలు విద్యార్థి హృదయాన్ని చేరడానికి యెహోవా నడిపింపు కొరకు ప్రార్థించండి.—నెహెమ్యా 2:4, 5; యెషయా 50:4.

◻ విద్యార్థి ఏమి నమ్ముతాడో, ఒక అబద్ధ బోధ ఆయనకు ఎందుకు నచ్చుతుందో గ్రహించండి.—అపొస్తలుల కార్యములు 17:22, 23.

◻ వివాదాన్ని నివారిస్తూ, దయాసహనాలతో యుక్తమైన లేఖనాధార తర్కాన్ని వృద్ధిచేయండి.—అపొస్తలుల కార్యములు 17:24-34.

◻ సాధ్యమైతే, బైబిలు సత్యాలకు ప్రభావవంతమైన ఉదాహరణలతో మరింత బలం చేకూర్చండి.—మార్కు 4:33, 34.

◻ బైబిలు నుండి కచ్చితమైన జ్ఞానాన్ని స్వీకరించడం వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థికి చూపించండి.—1 తిమోతి 2:3, 4; 2 తిమోతి 3:14, 15.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి