కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 3/1 పేజీలు 26-29
  • “మనవంటి స్వభావముగల” మనుష్యులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మనవంటి స్వభావముగల” మనుష్యులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మోషే అతినమ్మకాన్ని విడిచి సాత్వికాన్ని అలవర్చుకోవడం
  • క్రమశిక్షణనిస్తున్న సమయంలో ఏలీయా మనవంటి స్వభావాన్ని కలిగివున్నాడు
  • నిరుత్సాహం ఎదురైనప్పటికీ యిర్మియా ధైర్యంగా ఉన్నాడు
  • యేసు మన వంటి స్వభావాన్నే కలిగి ఉన్నాడు
  • యెహోవా నమ్మకం
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన గమనించాడు, ఎదురుచూశాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 3/1 పేజీలు 26-29

“మనవంటి స్వభావముగల” మనుష్యులు

ఆయన ఒక రాజు. ఒక ప్రవక్త. ప్రేమగల తండ్రి. ఆయన కుమారుల్లో ఒకరు నిష్ప్రయోజకునిగానూ, అహంకారిగానూ తయారయ్యాడు. సింహాసనాన్ని చేజిక్కించుకోవాలనే తీర్మానంతో, ఈ కుమారుడు తన తండ్రి మరణించాలనే సంకల్పంతో అంతర్యుద్ధాన్ని ప్రారంభించాడు. అయితే దాని తర్వాత జరిగిన పోరాటంలో, అతడే చంపబడ్డాడు. తన కుమారుని మరణాన్ని గురించి ఆ తండ్రి విన్నప్పుడు, ఆయన గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కి పోయి “నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా . . . అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా” అని ఏడ్చాడు. (2 సమూయేలు 18:33) ఆ తండ్రే రాజైన దావీదు. యెహోవా ఇతర ప్రవక్తల వలే, ఆయన “మనవంటి స్వభావముగల మనుష్యుడే.”—యాకోబు 5:17.

యెహోవా నుండి వచ్చిన మాటలను ప్రకటించిన బైబిలు కాలాల్లోని స్త్రీ పురుషులు అన్ని తరహాల జీవన నేపథ్యాలనుండి వచ్చిన వ్యక్తులే. వాళ్లు సాధారణ మనుష్యులే. మనవలెనే, వాళ్లకూ సమస్యలున్నాయి, అపరిపూర్ణత మూలంగా బాధలను అనుభవించారు. ఈ ప్రవక్తల్లో కొందరు ఎవరు, వాళ్ల స్వభావం మనవంటి స్వభావంవలే ఎలావుంది?

మోషే అతినమ్మకాన్ని విడిచి సాత్వికాన్ని అలవర్చుకోవడం

క్రైస్తవ పూర్వ కాలాల్లోని ఒక ప్రముఖ ప్రవక్త మోషే. అయితే 40 ఏళ్ల వయస్సులో కూడా, యెహోవా వాగ్ధూతగా సేవ చేసేందుకు ఆయన సంసిద్ధుడు కాలేదు. ఎందుకు? ఆయన సహోదరులు ఐగుప్తు రాజైన ఫరో చేత అణచివేయబడుతుండగా, మోషే ఫరో ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు, ఆయన “మాటలయందును కార్యములయందును ప్రవీణుడైయుండెను.” ఆ వృత్తాంతం మనకిలా చెబుతుంది: “తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను.” అతి నమ్మకంగల వాడై ఆయన, ఒక హెబ్రీ దాసుని తరపున దౌర్జన్యపూరితంగా ప్రవర్తించి ఒక ఐగుప్తీయుని చంపాడు.—అపొస్తలుల కార్యములు 7:22-25; నిర్గమకాండము 2:11-14.

ఇప్పుడు మోషే పారిపోవలసి వచ్చింది, మరి తర్వాతి నాలుగు దశాబ్దాలు ఆయన సుదూర ప్రాంతమైన మిద్యానులో గొర్రెల కాపరిగా గడిపాడు. (నిర్గమకాండము 2:15) ఆ సమయం ముగుస్తుండగా, మోషేకు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఆయన యెహోవా ప్రవక్తగా నియమితుడయ్యాడు. అయితే మోషే ఇక ఎంతమాత్రం అతి నమ్మకాన్ని కలిగి లేడు. ఆయన తానెంత అయోగ్యుణ్ణని భావించాడంటే, “నేను ఫరో యొద్దకు వెళ్లుటకు . . . ఎంతటివాడ[ను],” “నేనేమి చెప్పవలె[ను]” అంటూ, యెహోవా తనను ప్రవక్తగా నియమించడాన్ని ఆయన ప్రశ్నించాడు. (నిర్గమకాండము 3:11, 13) యెహోవా దేవుని ప్రేమపూర్వక అభయంతో, మద్దతుతో, మోషే తన నియామకాన్ని నెరవేర్చడంలో ఎంతగానో కృతకృత్యుడయ్యాడు.

మోషే వలె, అజ్ఞానయుక్తమైనవిగా నిరూపించబడే వాటిని చెప్పడానికో లేక చేయడానికో నడిపించేలా అతి నమ్మకాన్ని మీరు అనుమతించారా? అలాగైతే, సాత్వికంతో రాబోయే తర్ఫీదును అంగీకరించండి. లేక కొన్ని క్రైస్తవ బాధ్యతలను నిర్వహించే విషయంలో మీరు అయోగ్యులని ఎన్నడైనా భావించారా? దాన్ని నిరాకరించే బదులు, యెహోవా, ఆయన సంస్థా అందించే సహాయాన్ని అంగీకరించండి. మోషేకు సహాయం చేసిన వాడే మీకూ సహాయం చేయగలడు.

క్రమశిక్షణనిస్తున్న సమయంలో ఏలీయా మనవంటి స్వభావాన్ని కలిగివున్నాడు

“ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థనచేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు.” (యాకోబు 5:17) తన నుండి వైదొలగిన ఒక జనాంగానికి క్రమశిక్షణ ఇవ్వాలన్న యెహోవా చిత్తానికి అనుగుణంగానే ఉంది ఏలీయా చేసిన ప్రార్థన. అయినప్పటికీ, ఏ క్షామం రావాలని తాను ప్రార్థిస్తున్నాడో అది మనుష్యులకు కష్టాలను కలిగిస్తుందని ఆయనకు తెలుసు. ఇశ్రాయేలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన దేశం; మంచూ వర్షమూ ప్రజలకు జీవనాధారంగా ఉండేవి. ఎడతెగని క్షామం తీవ్ర దారిద్ర్యాన్ని తీసుకొచ్చింది. పచ్చని చెట్లు ఎండి పోతాయి; పంటలు పండవు. పని కొరకు ఉపయోగించబడే అలాగే ఆహారంగా ఉపయోగపడే జంతువులు చనిపోతాయి, కొన్ని కుటుంబాలు ఆకలి చావునెదుర్కొన వలసి రావచ్చు. ఎక్కువ కష్టాలనెదుర్కొనేది ఎవరు? సామాన్య ప్రజలే. తన వద్ద పట్టెడు పిండీ కాస్త నూనె మాత్రమే మిగిలాయని ఒక విధవరాలు తర్వాత ఏలీయాకు చెప్పింది. తనూ తన కుమారుడు ఆకలితో అలమటించి చనిపోతామని ఆమెకు కచ్చితంగా తెల్సు. (1 రాజులు 17:12) ఏలీయా అలా ప్రార్థించాలంటే, సత్యారాధనను విడనాడని తన సేవకుల పట్ల—గొప్ప వారైనా లేక బీదవారైనా—యెహోవా శ్రద్ధ వహిస్తాడనే దృఢ నమ్మకం ఆయనకు అవసరమైంది. ఆ వృత్తాంతం చూపుతున్నట్లుగా, ఏలీయా నిరాశకు గురికాలేదు.—1 రాజులు 17:13-16; 18:3-5.

మూడు సంవత్సరాల తర్వాత, తాను వర్షాన్ని కురిపిస్తానని యెహోవా సూచించినప్పుడు, క్షామం అంతమవ్వడాన్ని చూడాలన్న ఏలీయా యొక్క తీవ్రమైన కోరిక, ఆయన “నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య” ఉంచుకుని పదే పదే తీవ్రంగా ప్రార్థించడాన్ని బట్టి తెలుస్తుంది. (1 రాజులు 18:42) యెహోవా తన ప్రార్థనలను విన్నాడనేందుకు ఏదైనా సూచన లభిస్తుందేమోనని, “నీవు పైకిపోయి సముద్రమువైపు చూడు”మని ఏలీయా తన దాసుణ్ణి పదే పదే అడిగాడు. (1 రాజులు 18:43) తుదకు ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందనగా ‘ఆకాశము వర్షించి, భూమి తన ఫలము ఇచ్చినప్పుడు’ ఆయనకెంత ఆనందం కలిగి ఉంటుందో కదా!—యాకోబు 5:18.

మీరు ఒక తండ్రి లేక క్రైస్తవ సంఘంలో పెద్ద అయివుంటే, సరిదిద్దేటప్పుడు మీ భావాల మధ్య సంఘర్షణ జరుగవచ్చు. అయితే, అలాంటి మానవ భావోద్రేకాలను, క్రమశిక్షణ కొన్నిసార్లు అవసరమనే, మరి దాన్ని ప్రేమపూర్వకంగా అందించినప్పుడు అది “నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అనే దృఢ నమ్మకంతో సమతూకపర్చవలసిన అవసరం ఉంటుంది. (హెబ్రీయులు 12:11) యెహోవా న్యాయవిధులకు విధేయత చూపడం వల్ల వచ్చే ఫలితాలు ఎల్లవేళలా కోరదగినవిగానే ఉంటాయి. ఏలీయా వలె, అవి నెరవేర్చబడాలని మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తాము.

నిరుత్సాహం ఎదురైనప్పటికీ యిర్మియా ధైర్యంగా ఉన్నాడు

బైబిలు రచయితలందరిలోకెల్లా, తన వ్యక్తిగత భావాలను గురించి ఎక్కువగా వ్రాసింది యిర్మియానే అని చెప్పవచ్చు. ఒక యౌవనస్థునిగా ఆయన తన నియామకాన్ని అందుకునే విషయంలో అటూ ఇటూ ఊగిసలాడాడు. (యిర్మీయా 1:6) అయినప్పటికీ ఆయన గొప్ప ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించేందుకు ముందుకు సాగాడు, కానీ రాజు మొదలుకొని సామాన్య మానవుని వరకూ అందరూ అంటే ఆయన తోటి ఇశ్రాయేలీయులందరూ ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత కొన్నిసార్లు ఆయనకు కోపాన్నీ కన్నీళ్లనూ కూడా తెప్పించింది. (యిర్మీయా 9:3; 18:20-23; 20:7-18) వేర్వేరు సందర్భాల్లో ఆయనపై మూకుమ్మడిగా దాడి జరిగింది, ఆయన్ను కొట్టారు, బొండలో వేశారు, చెరసాలలో వేశారు, చంపుతామని బెదిరించారు మరి చివరకు ఒక ఊబిలో పడేసి బురదలో కూరుకుపోయి చనిపోయేందుకు ఆయన్ను వదిలేశారు. కొన్నిసార్లు యెహోవా సందేశాలు కూడా ఆయనకు బాధ కలిగించేవి, దాన్ని ఆయన తన మాటల్లో ఇలా వ్యక్తం చేశాడు: “నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది.”—యిర్మీయా 4:19.

అయినప్పటికీ ఆయన యెహోవా వాక్యాన్ని ప్రేమించాడు, ఆయనిలా అన్నాడు: “నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” (యిర్మీయా 15:16) అదే సమయంలో, ఆశాభంగం మూలంగా యెహోవాకు ఆయనిలా మొరపెట్టుకున్నాడు: “నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా?” సులభంగా ఎండిపోయే వాగు యొక్క “నిలువని జలములవవుదువా?” (యిర్మీయా 15:18) అయినప్పటికీ ఆయనలో ఉన్న పరస్పర విరుద్ధ భావాలను యెహోవా అర్థం చేసుకుని ఆయన తన నియామకాన్ని తుదముట్టించేందుకుగాను ఆయనకు మద్దతునివ్వడంలో కొనసాగాడు.—యిర్మీయా 15:20; 20:7-9 కూడా చూడండి.

మీరూ యిర్మియా వలే మీ పరిచర్యలో ఆశాభంగాన్ని లేక వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారా? యెహోవా వైపు చూడండి. ఆయన నడిపింపును అనుసరించడంలో కొనసాగండి, యెహోవా మీ ప్రయత్నాలకు కూడా తప్పక ప్రతిఫలమిస్తాడు.

యేసు మన వంటి స్వభావాన్నే కలిగి ఉన్నాడు

ప్రవక్తలందరిలోకెల్లా గొప్పవాడు దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తే. ఆయన పరిపూర్ణ మానవుడైనప్పటికీ, ఆయన తన భావోద్రేకాలను అణచుకోలేదు. ఏ అంతరంగ భావాలైతే ఆయన ముఖంలోనూ లేక ఇతరుల చర్యలకు ఆయన చూపిన ప్రతిస్పందనల్లోనూ స్పష్టంగా కనిపించేవో ఆ అంతరంగ భావాలను గురించి మనం తరచూ చదువుతాం. యేసు తరచూ “కనికర”పడ్డాడు, తన ఉపమానాల్లోని పాత్రలను వర్ణించేందుకు ఆయన అటువంటి వ్యక్తీకరణనే ఉపయోగించాడు.—మార్కు 1:41; 6:34; లూకా 10:33.

“వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి” అని అంటూ వర్తకులనూ జంతువులనూ ఆలయంలోనుండి తరుముతున్నప్పుడు ఆయన పెద్దగా కేకలు వేసి ఉంటాడు. (యోహాను 2:14-16) “ప్రభువా, అది నీకు దూరమగుగాక” అని పేతురు అన్నప్పుడు, “సాతానా, నా వెనుకకు పొమ్ము” అని అంటూ ఆయన నిష్కర్షగా ప్రతిస్పందించాడు.—మత్తయి 16:22, 23.

యేసుకు ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ల ఎడల ఆయనకు ప్రత్యేకమైన అనురాగం ఉంది. అపొస్తలుడైన యోహాను “యేసు ప్రేమించిన శిష్యుడు” అని వర్ణించబడ్డాడు. (యోహాను 21:7, 20) మనమిలా చదువుతాము: “యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.”—యోహాను 11:5.

యేసు బాధాకరమైన భావాలను అనుభవించాడు. లాజరు మరణం ఓ విషాద సంఘటనయై ఉంది, యేసు భావాలు ఆయన “కన్నీళ్లు” పెట్టుకునేలా చేశాయి. (యోహాను 11:32-36) యూదా ఇస్కరియోతు తనను అప్పగించడాన్ని బట్టి తనకు కలిగిన మనోవేదనను బయల్పర్చుతూ, కీర్తనల నుండి యేసు ఒక తీవ్రమైన వ్యక్తీకరణను ఉల్లేఖించాడు: “నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను.”—యోహాను 13:18; కీర్తన 41:9.

మ్రానుపై తీవ్రమైన బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా, యేసు తన భావాల తీవ్రతను వ్యక్తం చేశాడు. ఆయన “తాను ప్రేమించిన శిష్యు[నికి]” తన తల్లిని వాత్సల్యపూరితంగా అప్పగించాడు. (యోహాను 19:26, 27) తన ప్రక్కన వ్రేలాడదీయబడిన ఒక దొంగలో ఆయన పశ్చాత్తాప లక్షణాన్ని చూసినప్పుడు, “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” యేసు దయాపూర్వకంగా చెప్పాడు. (లూకా 23:43) “నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని” ఆయన కేకవేసినప్పుడు ఆయన భావోద్రేకాలు పెల్లుబికాయని మనం గుర్తించగలం. (మత్తయి 27:46) ఆయన మరణించేటప్పుడు, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన”ని పలికిన మాటలు హృదయపూర్వక ప్రేమనూ, నమ్మకాన్నీ వ్యక్తం చేశాయి.—లూకా 23:46.

ఇదంతా కూడా మనకెంత అభయాన్నిస్తుందో కదా! “మన ప్రధానయాజకుడు [యేసు] మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.”—హెబ్రీయులు 4:15.

యెహోవా నమ్మకం

యెహోవా తాను ఎంపిక చేసుకున్న వాగ్దూతల విషయంలో ఎన్నడూ పశ్చాత్తాప పడలేదు. ఆయన ఎడల వారికున్న యథార్థత గురించి ఆయనకు తెలుసు, అపరిపూర్ణులైన వారి బలహీనతలను ఆయన దయాపూర్వకంగా ఉపేక్షించాడు. అయినప్పటికీ వారు తమ నియామకాలను పూర్తి చేయాలని ఆయన అపేక్షించాడు. ఆయన సహాయంతో వారలా చేయగలిగారు.

యథార్థపరులైన మన సహోదర సహోదరీలయందు మనం సహనంతో నమ్మకాన్ని చూపుదాము. మనవలే వాళ్లు కూడా ఈ వ్యవస్థలో ఎల్లప్పుడూ అపరిపూర్ణులుగానే ఉంటారు. అయినప్పటికీ, మన సహోదరులు మన ప్రేమ అవధానాలను పొందేందుకు అనర్హులని మనం ఎన్నడూ తీర్పుతీర్చ కూడదు. పౌలు ఇలా వ్రాశాడు: “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.”—రోమీయులు 15:1; కొలొస్సయులు 3:13, 14.

మనం అనుభవిస్తున్న భావోద్రేకాలన్నింటినీ యెహోవా ప్రవక్తలు అనుభవించారు. అయినప్పటికీ, వాళ్లు యెహోవా యందు నమ్మకముంచారు, యెహోవా వాళ్లను కాపాడాడు. అంతకంటే ఎక్కువగా, వాళ్లు ఆనందించేందుకు కారణాలను యెహోవా ఇచ్చాడు. వాటిలో మంచి మనస్సాక్షీ, ఆయన అనుగ్రహాన్ని తాము కలిగి ఉన్నామనే గుర్తింపూ, వాళ్లకు తోడ్పడిన యథార్థపరులైన సహవాసులూ, ఒక సంతోషకరమైన భవిష్యత్తును గూర్చిన అభయమూ చేరి ఉన్నాయి. (హెబ్రీయులు 12:1-3) “మనవంటి స్వభావముగల” మనుష్యులైన ప్రాచీన కాలంనాటి ప్రవక్తల విశ్వాసాన్ని అనుకరిస్తూ మనం పూర్తి నమ్మకంతో యెహోవాను హత్తుకుందాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి