వైద్యులు, న్యాయాధిపతులు మరియు యెహోవాసాక్షులు
గత 1995 మార్చిలో, యెహోవాసాక్షులు బ్రెజిల్లో రెండు సెమినార్లను నిర్వహించారు. వాటి సంకల్పం? ఆసుపత్రి పాలైన ఒక రోగి యెహోవాసాక్షి అయివుండి, అతడు రక్తం ఎక్కించుకోవడానికి అంగీకరించనప్పుడు వైద్య మరియు న్యాయ సిబ్బంది యొక్క మద్దతును కోరడమే.—అపొస్తలుల కార్యములు 15:29.
విచారకరంగా, కొన్ని సందర్భాల్లో వైద్యులు సాక్షులైన రోగుల ఇష్టాయిష్టాలను పూర్తిగా అలక్ష్యం చేసి, బలవంతంగా రక్తాన్ని ఎక్కించేందుకు కోర్టు అనుమతిని పొందాలని ప్రయత్నించారు. అలాంటి పరిస్థితుల్లో సాక్షులు తమను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న న్యాయ వ్యవస్థకు చెందిన మాధ్యమాలను ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ, వారు ప్రతిఘటించడం కన్నా సహకరించేందుకే ఇష్టపడతారు. అలా, అదే గ్రూపుకు చెందిన రక్తాన్ని ఎక్కించే చికిత్సకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయనీ, యెహోవాసాక్షులు వాటిని ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారనీ సెమినార్లు నొక్కి చెప్పాయి.a
సావోపౌలో ప్రాంతీయ వైద్య కౌన్సిల్ నిర్వహించిన ఒక మీటింగ్ ఇప్పటికే యెహోవాసాక్షులు తీసుకున్న స్థానానికి మద్దతునిచ్చింది. 1995 జనవరిలో, వైద్యుడు సిఫారసు చేసిన చికిత్స విషయంలో ఏదైనా అభ్యంతరం ఉన్నట్లైతే, దాన్ని నిరాకరించే హక్కూ, అలాగే చికిత్స చేయించుకోవడానికి మరొక వైద్యుణ్ణి ఎన్నుకునే హక్కూ రోగికి ఉందని అది నిర్ణయించింది.
రక్త రహిత చికిత్సను కోరుకునే రోగులకు ఆ చికిత్సనిచ్చేందుకు సుముఖంగా ఉన్న వందలాది మంది వైద్యులు ఇప్పుడు బ్రెజిల్ వైద్య సమాజంలో ఉన్నారు. 1995 మార్చిలో సెమినార్ జరిగినప్పటినుండీ, వైద్యులూ, న్యాయాధిపతులూ యెహోవాసాక్షులకూ మధ్య సహకారం ఎంతో మెరుగుపడింది. 1997లో అంబీటూ ఆస్పీటలర్ అనే బ్రెజిల్ వైద్య పత్రిక, రక్తం విషయంలో యెహోవాసాక్షులు తీసుకున్న స్థానాన్ని గౌరవించాలనే వారి ఇష్టాన్ని గురించి నొక్కి చెప్పిన ఒక శీర్షికను ప్రచురించింది. “రోగి జీవితాన్ని కాపాడవలసిన ఒక వైద్యుని కర్తవ్యం, తనకు నచ్చిన చికిత్సను ఎంపిక చేసుకోగల రోగి హక్కును పరిరక్షించవలసిన వైద్యుని కర్తవ్యాన్ని అధిగమించకూడదు” అని రియో డె జనైరో మరియు సావోపౌలో రాష్ట్రాల కొరకైన ప్రాంతీయ వైద్య కౌన్సిల్ చెప్పిన దాన్ని నేడు అందరూ గుర్తిస్తున్నారు.
[అధస్సూచి]
a మరింత సమాచారం కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన రక్తము నీ జీవితమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రొషూర్ను చూడండి.