కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ia అధ్యా. 11 పేజీలు 106-113
  • ఆయన గమనించాడు, ఎదురుచూశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆయన గమనించాడు, ఎదురుచూశాడు
  • వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు
  • దృఢనమ్మకంతో కనిపెట్టుకొనివున్నాడు
  • యెహోవా ఉపశమనం కలిగించాడు, ఆశీర్వాదాలు కుమ్మరించాడు
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
మరిన్ని
వాళ్లలా విశ్వాసం చూపించండి
ia అధ్యా. 11 పేజీలు 106-113
ఏలీయా ప్రవక్త

11వ అధ్యాయం

ఆయన గమనించాడు, ఎదురుచూశాడు

1, 2. తనకు ఇష్టంలేని ఏ పని ఏలీయా చేయాలి? అహాబుకు, ఏలీయాకు మధ్య ఎలాంటి తేడా ఉంది?

ఏలీయా తన దేవునికి ఏకాంతంగా ప్రార్థించాలని ఎంతో కోరుకున్నాడు. అయితే, ఆ నిజమైన ప్రవక్త అప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి రావాలని ప్రార్థించడం చూసిన చాలామంది ఆయన దృష్టిలో పడాలని, ఆయన అనుగ్రహం పొందాలని ఎంతో తాపత్రయపడివుంటారు. కానీ ఆయన కర్మెలు పర్వతం మీదకు వెళ్లి యెహోవాకు ప్రార్థించే ముందు, తనకు ఇష్టంలేని పని ఒకటి చేయాలి. అదే, అహాబు రాజుతో మాట్లాడడం.

2 అహాబుకు, ఏలీయాకు మధ్య ఎంతో తేడా ఉంది. రాచవస్త్రాలు ధరించు కొనివున్న అహాబు ఒక లోభి, చెప్పుడుమాటలకు ఇట్టే లొంగిపోయే మతభ్రష్టుడు. ఏలీయా మాత్రం ప్రవక్తలు వేసుకునే వస్త్రాలు వేసుకొనివున్నాడు. అది బహుశా జంతువుల తోలుతోనో ఒంటె వెంట్రుకలతోనో మేక వెంట్రుకలతోనో నేసిన సాదాసీదా పొడవాటి అంగీ అయ్యుంటుంది. ఆయన ఎంతో ధైర్యశాలి, యథార్థపరుడు, విశ్వాసమున్నవాడు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఆ రోజున, వాళ్లిద్దరి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.

3, 4. (ఎ) అహాబుకు, బయలు ఆరాధకులకు ఆ రోజు ఎలాంటి ఘోరమైన అవమానం ఎదురైంది? (బి) మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

3 అహాబుకు, బయలు ఆరాధకులకు ఆ రోజు ఘోరమైన అవమానం ఎదురైంది. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో అహాబు, ఆయన భార్య యెజెబెలు రాణి ప్రోత్సహిస్తూ వచ్చిన అబద్ధ ఆరాధనకు చావుదెబ్బ తగిలింది. బయలు మోసగాడని బట్టబయలైంది. తన ప్రవక్తలు ఉద్రేకంతో ప్రార్థిస్తూ, గెంతుతూ, రక్తం వచ్చేలా తమ శరీరాలను కోసుకుంటున్నా జీవంలేని ఆ దేవుడు కనీసం నిప్పు కూడా రప్పించలేకపోయాడు. మరణానికి అర్హులైన ఆ 450 మంది ప్రవక్తలను చావు నుండి కాపాడలేకపోయాడు. అయితే ఆ అబద్ధ దేవుడు ఇంకో విషయంలో కూడా ఓడిపోయాడు, ఆ ఓటమి కాసేపట్లో సంపూర్ణమౌతుంది. మూడు సంవత్సరాలకు పైగా బయలు ప్రవక్తలు తమ దేశాన్ని పట్టిపీడిస్తున్న కరువును తీసివేయమని వేడుకుంటూనే ఉన్నా బయలు మాత్రం ఏమీ చేయలేకపోయాడు. ఇంకాసేపట్లో యెహోవా ఆ కరువును తీసివేసి తానే సత్యదేవుణ్ణని నిరూపించుకుంటాడు.—1 రాజు. 16:30–17:1; 18:1-40.

4 ఇంతకీ యెహోవా అది ఎప్పుడు చేస్తాడు? అప్పటివరకు ఏలీయా ఎలా నడుచుకుంటాడు? గొప్ప విశ్వాసంగల ఆ ప్రవక్త నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఆ వృత్తాంతాన్ని పరిశీలిస్తూ వాటి గురించి తెలుసుకుందాం.—1 రాజులు 18:41-46 చదవండి.

ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు

5. ఏలీయా అహాబుతో ఏమి చేయమని చెప్పాడు? ఆ రోజు జరిగిన సంఘటనల నుండి అహాబు ఏమైనా నేర్చుకున్నాడని అనిపిస్తోందా?

5 ఏలీయా అహాబు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: “విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుము.” ఆ రోజు జరిగిన సంఘటనల నుండి ఆ దుష్టరాజు ఏమైనా నేర్చుకున్నాడా? దాని గురించి బైబిలు ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. కానీ ఆయన పశ్చాత్తాపపడలేదని, యెహోవా క్షమాపణ కోసం ప్రార్థించడానికి సహాయం చేయమని ఆ ప్రవక్తను కనీసం అడగను కూడా అడగలేదని ఆ వృత్తాంతాన్ని బట్టి తెలుస్తోంది. అహాబు నిశ్చింతగా “భోజనము చేయబోయెను” అని మాత్రమే బైబిలు చెబుతోంది. (1 రాజు. 18:41, 42) మరి ఏలీయా ఏమి చేశాడు?

6, 7. ఏలీయా దేనికోసం ప్రార్థించాడు? ఎందుకు?

6 “ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.” అహాబు తన కడుపు నింపుకోవడానికి వెళ్లిపోయాడు. అప్పుడు తన పరలోక తండ్రికి ప్రార్థించే అవకాశం ఏలీయాకు దొరికింది. ఏలీయా భంగిమలో ఎంత వినయం ఉట్టిపడుతుందో గమనించండి. ఆయన నేల మీద మోకాళ్లూని, తలను మోకాళ్ల దాకా వంచాడు. ఇంతకీ ఏలీయా ఏమి చేస్తున్నట్లు? మనం ఊహించనవసరం లేదు. కరువు పోవాలని ఏలీయా ప్రార్థించాడని యాకోబు 5:18 చెబుతోంది. కర్మెలు పర్వతం మీద ఆయన బహుశా అలాంటి ప్రార్థనే చేసివుంటాడు.

ప్రార్థనలో ఏలియా నేల మీద సాగిలపడ్డాడు

దేవుని చిత్తం నెరవేరాలని ఏలీయా ఎంతో కోరుకున్నాడని ఆయన ప్రార్థనలను బట్టి తెలుస్తోంది

7 అంతకుముందు యెహోవా ఇలా అన్నాడు: “నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను.” (1 రాజు. 18:1) అంటే, ఏలీయా యెహోవా చిత్తం నెరవేరాలని ప్రార్థించాడన్నమాట. దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత, యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థన కూడా అలాగే ఉంది.—మత్త. 6:9, 10.

8. ప్రార్థన గురించి ఏలీయా నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

8 ప్రార్థన గురించి ఏలీయా నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. దేవుని చిత్తం నెరవేరడం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా, “[దేవుని] చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును” అని గుర్తుంచుకోవడం మంచిది. (1 యోహా. 5:14) దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఆయన చిత్తమేమిటో తెలుసుకొని ప్రార్థించాలని స్పష్టంగా అర్థమౌతోంది. మనం ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ప్రతీరోజు బైబిలును అధ్యయనం చేయాలి. తన దేశ ప్రజలు పడుతున్న బాధలు చూసినప్పుడు, ఆ కరువు పోవాలని ఏలీయా కూడా తప్పక కోరుకొనివుంటాడు. ఆ రోజు యెహోవా చేసిన అద్భుతాన్ని చూశాక, ఏలీయా హృదయం ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోయివుంటుంది. అలాగే, మన ప్రార్థనల్లో కూడా యెహోవా పట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞత, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ కనబడాలి.—2 కొరింథీయులు 1:10, 11; ఫిలిప్పీయులు 4:6 చదవండి.

దృఢనమ్మకంతో కనిపెట్టుకొనివున్నాడు

9. ఏలీయా తన సేవకుణ్ణి ఏమి చేయమన్నాడు? మనం ఏ రెండు లక్షణాల గురించి పరిశీలిస్తాం?

9 యెహోవా కరువు తీసివేస్తాడని ఏలీయా బలంగా నమ్మాడు, కానీ ఆయన ఎప్పుడు అలా చేస్తాడో మాత్రం ఏలీయాకు తెలియదు. మరి ఈలోగా ఆ ప్రవక్త ఏమి చేశాడు? దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అతడు తన దాసుని పిలిచి—నీవు పైకిపోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడు—ఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.” (1 రాజు. 18:43) ఏలీయా ఉదాహరణ నుండి మనం కనీసం రెండు విషయాలు నేర్చుకోవచ్చు. ముందు, ఆ ప్రవక్త దృఢనమ్మకాన్ని గమనించండి. తర్వాత, ఆయన కనిపెట్టుకొనివున్న తీరును పరిశీలించండి.

యెహోవా చర్య తీసుకోబోతున్నాడని తెలిపే ఆధారం కోసం ఏలీయా ఎంతో ఆత్రంగా గమనించాడు

10, 11. (ఎ) యెహోవా వాగ్దానాల మీద తనకున్న నమ్మకాన్ని ఏలీయా ఎలా చూపించాడు? (బి) మనం కూడా అలాంటి నమ్మకాన్నే ఎందుకు చూపించవచ్చు?

10 యెహోవా వాగ్దానం మీద ఏలీయాకు ఎంతో నమ్మకముంది కాబట్టి, యెహోవా చర్య తీసుకోబోతున్నాడని తెలిపే ఆధారం కోసం ఎంతో ఆత్రంగా గమనించాడు. వర్షం పడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయేమో చూసిరమ్మని తన సేవకుణ్ణి ఒక ఎత్తైన స్థలానికి పంపాడు. కానీ ఆ సేవకుడు తిరిగి వచ్చి, “ఏమియు కనబడలేదు” అంటూ ఉత్సాహాన్ని నీరుగార్చే మాట చెప్పాడు. ఆకాశం నిర్మలంగా ఉంది, ఒక్క మేఘపు ఛాయ కూడా కనిపించలేదు. మీకేమైనా తేడాగా అనిపిస్తోందా? అంతకుముందే ఏలీయా అహాబుతో, “విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది” అని చెప్పాడని గుర్తుచేసుకోండి. అసలు వర్షం ఛాయలే లేనప్పుడు, ఆ ప్రవక్త ఎందుకలా చెప్పివుంటాడు?

11 యెహోవా వాగ్దానం గురించి ఏలీయాకు తెలుసు. తాను యెహోవాకు ప్రవక్త, ప్రతినిధి కాబట్టి తన దేవుడు, ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాడని ఏలీయాకు పూర్తి నమ్మకం ఉంది. అది ఎంతంటే, విస్తారమైన వర్షం వస్తున్న శబ్దాన్ని ఆయన ముందుగానే వినగలిగాడు. మోషే గురించి మాట్లాడుతూ, ఆయన “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” జీవించాడని బైబిలు చెప్పిన విషయాన్ని ఇది మనకు గుర్తుచేయవచ్చు. దేవుని మీద మీకు కూడా అంత నమ్మకం ఉందా? తన మీద, తన వాగ్దానాల మీద అంత నమ్మకం ఉంచడానికి ఆయన మనకు ఎన్నో ఆధారాలు ఇస్తున్నాడు.—హెబ్రీ. 11:1, 27.

12. తాను కనిపెట్టుకొని ఉన్నానని ఏలీయా ఎలా చూపించాడు? ఒక చిన్న మేఘం కనిపిస్తోందని విన్నప్పుడు ఆయన ఎలా స్పందించాడు?

12 ఏలీయా ఎంతగా కనిపెట్టుకొనివున్నాడో కూడా గమనించండి. ఆయన తన సేవకుణ్ణి వెళ్లి చూడమని ఒక్కసారో రెండుసార్లో కాదు, ఏకంగా ఏడుసార్లు పంపించాడు! ఆ సేవకుడు అన్నిసార్లు వెళ్లి ఎంత అలసిపోయివుంటాడో మనం అర్థంచేసుకోవచ్చు, కానీ ఏలీయా మాత్రం పట్టువిడవకుండా సూచన కోసం ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు. చివరకు, ఏడవసారి చూసి వచ్చాక ఆ సేవకుడు ఇలా అన్నాడు: “అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నది.” మహాసముద్రం మీద నుండి వస్తున్న చిన్న మేఘాన్ని ఆ సేవకుడు చేతితో కొలుస్తున్నట్లు ఊహించుకోండి. అతను, ఆ చిన్న మేఘాన్ని అంతగా పట్టించుకొని ఉండడు. కానీ ఏలీయా దాన్ని చిన్న విషయంగా తీసుకోలేదు. ఆయన తన సేవకునికి వెంటనే ఇలా చేయమని చెప్పాడు: “నీవు అహాబు దగ్గరకు పోయి—నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుము.”—1 రాజు. 18:44.

13, 14. (ఎ) కనిపెట్టుకొని ఉండే విషయంలో మనం ఏలీయాను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (బి) యెహోవా సేవను ఉత్సాహంగా చేయడానికి మనకు ఎలాంటి కారణాలు ఉన్నాయి?

13 ఏలీయా ఉదాహరణ నుండి మనం మరో విషయం నేర్చుకోవచ్చు. మనం కూడా యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చే కాలంలో జీవిస్తున్నాం, త్వరలోనే ఆయన చర్య తీసుకోబోతున్నాడు. కరువు పోయే కాలం కోసం ఏలీయా ఎదురుచూశాడు, అవినీతి రాజ్యమేలుతున్న ఈ వ్యవస్థ అంతమయ్యే రోజు కోసం నేటి దేవుని సేవకులు ఎదురుచూస్తున్నారు. (1 యోహా. 2:17) యెహోవా చర్య తీసుకునే వరకు ఏలీయాలాగే మనం కూడా ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. స్వయంగా దేవుని కుమారుడైన యేసు తన అనుచరులకు ఈ సలహా ఇచ్చాడు: “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.” (మత్త. 24:42) అంటే, తాము అంతానికి దగ్గర్లో జీవిస్తున్నామనే సంగతి కూడా తన అనుచరులకు తెలియదని యేసు చెప్పాడా? లేదు. ఎందుకంటే, అంతం దగ్గరపడినప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన వివరించాడు. “ఈ యుగసమాప్తి” గురించిన ఆ సవివరమైన సూచన నెరవేరడం మనమందరం గమనించవచ్చు.—మత్తయి 24:3-7 చదవండి.

యెహోవా చర్య తీసుకోబోతున్నాడని ఏలీయాకు నమ్మకం కుదరడానికి ఒక్క చిన్న మేఘం సరిపోయింది. అంత్యదినాలకు సంబంధించిన సూచన, యెహోవా సేవను ఉత్సాహంగా చేయడానికి మనకు చక్కని కారణాలు ఇస్తుంది

14 ఆ సూచనలోని ప్రతీ అంశం, మనల్ని ఒప్పింపజేసే శక్తిమంతమైన రుజువునిస్తుంది. యెహోవా సేవను ఉత్సాహంగా చేయడానికి ఆ రుజువు మనకు సరిపోతుందా? యెహోవా చర్య తీసుకోబోతున్నాడని ఏలీయాకు నమ్మకం కుదరడానికి ఒక్క చిన్న మేఘం సరిపోయింది. ఇంతకీ నమ్మకస్థుడైన ఆ ప్రవక్తకు నిరాశ ఎదురైందా?

యెహోవా ఉపశమనం కలిగించాడు, ఆశీర్వాదాలు కుమ్మరించాడు

15, 16. ఏ సంఘటనలు వెంటవెంటనే జరిగిపోయాయి? అహాబు గురించి ఏలీయా ఏమి ఆలోచించివుంటాడు?

15 బైబిలు ఇలా చెబుతోంది: “అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను.” (1 రాజు. 18:45) అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఏలీయా ప్రవక్త పంపిన సందేశాన్ని ఆయన సేవకుడు అహాబుకు చెబుతుండగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది, అంతా చీకటి కమ్ముకుంది. హోరున గాలి వీచింది. ఎట్టకేలకు, మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ ఇశ్రాయేలు నేల వర్షంతో తడిసింది. ఎండిపోయి బీటలువారిన నేల, పడిన చినుకులను పడినట్లే తాగేసింది. వర్షం కుండపోతగా కురవడంతో కీషోను నది పొంగిపొర్లింది. చనిపోయిన బయలు ప్రవక్తల రక్తాన్ని అది కడిగేసివుంటుంది. దారితప్పిన ఇశ్రాయేలీయులకు కూడా, ఆ దేశంలోని కలుషితమైన బయలు ఆరాధన తాలూకు అసహ్యమైన మరకలను తుడిచివేసేందుకు ఒక అవకాశం దొరికింది.

ఏలియా, ఇతర ఇశ్రాయేలీయులు వర్షం పడడంతో సంతోషిస్తున్నారు

“మోపైన వాన కురిసెను”

16 వాళ్లు అలాగే చేస్తారని ఏలీయా ప్రవక్త ఆశించివుంటాడు. ఆ రోజు జరుగుతున్న నాటకీయ సంఘటనలకు అహాబు ఎలా స్పందిస్తాడా అని కూడా ఆయన ఆలోచించివుంటాడు. అహాబు పశ్చాత్తాపపడి, అపవిత్రమైన బయలు ఆరాధనను విడిచిపెడతాడా? ఆ రోజు జరిగిన సంఘటనలను బట్టి చూస్తే, అలాంటి మార్పులు చేసుకోవడానికి ఆయనకు బలమైన కారణాలే ఉన్నాయి. ఆ సమయంలో, అహాబు మనసులో ఎలాంటి ఆలోచనలు మెదిలాయో తెలుసుకోవడం కష్టమే. ఆయన “రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను” అని మాత్రం బైబిలు చెబుతోంది. ఆయన ఏదైనా పాఠం నేర్చుకున్నాడా? మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడా? లేదని తర్వాత జరిగిన సంఘటనలను చూస్తే తెలుస్తుంది. అయితే అహాబు, ఏలీయాల జీవితాల్లో ఆ రోజు ఇంకా కొన్ని విషయాలు జరిగాయి.

17, 18. (ఎ) యెజ్రెయేలుకు వెళ్తున్న దారిలో ఏలీయాకు ఏమి జరిగింది? (బి) ఏలీయా కర్మెలు నుండి యెజ్రెయేలుకు పరుగెత్తడం ఎందుకు మామూలు విషయం కాదు? (అధస్సూచి కూడా చూడండి.)

17 అహాబు వెళ్లిన దారిలోనే యెహోవా ప్రవక్త కూడా బయల్దేరాడు. ఆయన ఇంకా చాలా దూరం వెళ్లాలి, అంతా చీకటిగా ఉంది, పైగా వర్షం కూడా పడుతోంది. అయితే, అప్పుడు ఒక అసాధారణ విషయం జరిగింది.

18 “యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబుకంటె ముందుగా పరుగెత్తికొనిపోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను.” (1 రాజు. 18:46) అంటే, “యెహోవా హస్తము” ఏలీయాను అద్భుతరీతిలో బలపర్చింది. యెజ్రెయేలు ఇంకా 30 కి.మీ. దూరంలో ఉంది. పైగా ఏలీయా కుర్రవాడు కూడా కాదు.a దీన్ని ఊహించుకోండి. ఆ ప్రవక్త తన పొడవాటి అంగీలు కాళ్లకు అడ్డం పడకుండా వాటిని నడుముకు కట్టుకుని, బురదబురదగా ఉన్న ఆ దారిలో పరుగెత్తుతున్నాడు. ఎంత వేగంగా అంటే, అహాబు రాజు రథాన్ని చేరుకున్నాడు, దాన్ని దాటేశాడు, దానికన్నా వేగంగా పరుగెత్తాడు!

19. (ఎ) యెహోవా ఏలీయాకు ఇచ్చిన బలం, సత్తువ మనకు ఏ ప్రవచనాలను గుర్తుచేస్తాయి? (బి) యెజ్రెయేలుకు వెళ్తున్న ఏలీయాకు ఏ విషయం బాగా తెలుసు?

19 ఏలీయాకు ఎంత గొప్ప వరం దొరికిందో కదా! బహుశా తన యౌవనప్రాయంలో కూడా లేనంత శక్తి, బలం, సత్తువ పొందడం ఆయనకు మరపురాని అనుభూతిని మిగిల్చివుంటుంది. రానున్న భూపరదైసులో నమ్మకమైన సేవకులకు సంపూర్ణ ఆరోగ్యం, బలం ఉంటాయని వాగ్దానం చేసే ప్రవచనాలు మనకు గుర్తుకురావచ్చు. (యెషయా 35:6 చదవండి; లూకా 23:43) బురదబురదగా ఉన్న దారిలో పరుగెత్తుతున్న ఏలీయాకు, ఏకైక సత్యదేవుడైన యెహోవా తండ్రి మద్దతు తనకుందని బాగా తెలుసు.

20. యెహోవా ఆశీర్వాదాలు పొందడానికి మనం ఏమి చేయాలి?

20 మనల్ని ఆశీర్వదించాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఎంతో విలువైనవి, వాటిని పొందడానికి శాయశక్తులా కృషిచేద్దాం. అంతం దగ్గరపడుతున్న ఈ ప్రమాదకరమైన కాలాల్లో యెహోవా చర్య తీసుకోబోతున్నాడని సూచించే స్పష్టమైన రుజువులను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏలీయాలాగే మనం కూడా కనిపెట్టుకొని ఉందాం. ఆయనలాగే మనం కూడా ‘సత్యదేవుడైన’ యెహోవా చేసిన వాగ్దానాల మీద పూర్తిగా నమ్మకం ఉంచడానికి ఎన్నో కారణాలున్నాయి.—కీర్త. 31:5.

a ఇది జరిగిన కొన్ని రోజులకే, ఎలీషాకు శిక్షణనివ్వమని యెహోవా ఏలీయాకు చెప్పాడు. ఆ తర్వాత, “ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన” వాడనే పేరు ఎలీషాకు వచ్చింది. (2 రాజు. 3:11) ఎలీషా ఏలీయాకు సేవకునిగా పనిచేశాడు, ఆ వృద్ధ ప్రవక్తకు అవసరమైన సహాయం చేస్తూవచ్చాడు.

వీటి గురించి ఆలోచించండి . . .

  • యెహోవా కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఏలీయా ప్రార్థిస్తూ ఉన్నాడని మనకు ఎలా తెలుసు?

  • యెహోవా వాగ్దానం మీద తనకు నమ్మకముందని ఏలీయా ఎలా చూపించాడు?

  • కనిపెట్టుకొని ఉండే విషయంలో ఏలీయా నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

  • మీరు ఏయే విషయాల్లో ఏలీయాలా విశ్వాసం చూపించాలని అనుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి